భారతం లో కధలు***


శకుని .!
.
By..Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu.

కౌరవ సార్వభౌముని మేనమామ. దుష్టచతుష్టయంలో ప్రముఖపాత్ర శకునిది. శకునిని కౌరవులకు ఆత్మీయుని జేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి.
ఘోషయాత్ర పరాభవానంతరం దేహత్యాగానికి సిద్ధపడిన అల్లునితో శకుని - ఓ దుర్యోధన సార్వభౌమ! పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరు, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సౌఖ్యం, గొప్పదనం చేకూరుతాయి అంటాడు.
ఈ బోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్న మహాభారత సంగ్రామం జరిగెడిది కాదు గదా?

శకుని వంటి కుటిలస్వభావుని చరిత్ర గురించి తెలియని ఆంధ్రుడు లేడంటే ఆశ్చర్యపోనక్కరలేదు. శకునిలాంటి వ్యక్తులను మనం నిత్యం జూస్తూనే ఉంటాం. అసూయాద్వేషాలు, కలహాలు, కుటిలబుద్ధులకు వీరు ఉనికిపట్టులు. ధర్మపక్షమున వీరెన్నటికీ చేరరు. హితము చెప్పుట వీరి చేతగాని పని. కుల్లిన హృదయమున్న చోటనే కుటిలస్వభావులు చేరుదురు. చెడు మార్గమున నడిపేందుకు, వెనుదిరుగుటకు వీలులేకుండా చేయుదురు. కుటిలస్వభావుల సాంగత్యం తాత్కాలికలాభము గూర్చినను శాశ్వత నష్టమును కల్గించును. మానవస్వభావమున అసూయా ద్వేషములున్నంతకాలం, మానవునికి మానవునికి మధ్య కలహం కొనసాగుతున్నంత కాలం సమాజమున శకునులు చిరంజీవులు!

శకుని సుయోధనునికి మేనమామ. బాంధవ్యమును బట్టి కౌరవపక్షమున నుండవలసినవాడే. కాని శకునిని, కౌరవుల కంత ఆత్మీయుని చేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి. ఆ కుటిలబుద్ధి నుండి పుట్టిన ప్రియవాక్కు మాయాద్యూతము.

రాజసూయమున పాండవుల వైభవమును చూచి అసూయపడి ఒకరితో చెప్పుకొనలేక తానోర్చుకొనలేక కుమిలి క్రుశించిపోవు దుర్యోధనునితో శకుని,

"భానుప్రభులగు పాండుమహీనాథాత్మజుల లక్ష్మి యెల్లను నీకున్
నేనపహరించి, యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్"- అన్న మాట నిల్పుకొన్నాడు. ఈ మాయాద్యూతము తోడనే శకుని మహాభారతమున వెలుగులోనికి వచ్చినాడు. దుష్టచతుష్టయంలో సుయోధనుని హృదయమున సుస్థిరస్థానమేర్పరచుకున్నాడు.

ఘోషయాత్ర:
పాండవులు ద్వైతవనసరోవరతీరంలో ఉన్నారని, వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను, విశేషించి పాండవపట్టమహిషి అయిన ద్రౌపదిని, తమ అనంత సంపదల విలాసాల ప్రదర్శనంలో వెక్కిరించి, వారు మనసులో కుమిలిపోయేటట్లు చేసి తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది చతుష్టయం. ఈ వ్యూహముల కర్త కర్ణుడు.
ద్వైతవనంలో ఉన్న గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలని నాటకమాడి మహావైభవంగా అట్టహాసంగా సకుటుంబ ససైన్యపరివారంగా, వంధిమాగధులతో మందీమార్బలంతో దుష్టచతుష్టయం ద్వైతవనం బయలుదేరారు. దీనికి ధృతరాషు్ట్రననుమతి సాధించినవాడు శకుని.

ద్వైతవనం చేరిన దుర్యోధనాదులు, కొంతకాలం మృగయావినోదం సాగించారు. పిమ్మట చిత్రసేనుడనే గంధర్వరాజు క్రీడార్థం కల్పించుకొన్న కొలను వద్దకు చేరి అందులో విహరించాలని తలచారు. కావలివారు హెచ్చరించినా లెక్కచేయక గంధర్వసేనతో యుద్ధానికి దిగారు. చిత్రసేనుడు మాయా యుద్ధనిపుణుడు. వేల గంధర్వసేన చుట్టుముట్టగా భీకర యుద్ధం జరిగింది. కర్ణుడు శక్తి కొలది ఒంటరిగా పోరాడవలసివచ్చినా, శత్రుసహస్రసంఖ్య గల గంధర్వసేన తాకిడికి నిలువలేక, రణరంగం నుండి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది. తుదకు దుర్యోధనుడు కూడా యుద్ధరంగంలో ప్రవేశించక తప్పలేదు. చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరుగగొట్టి జుట్టు పట్టి లాగి పెడకేల బంధించి సింహనాదం చేశాడు. అతని ఆజ్ఞతో దుశ్శాసనాది భ్రాతృవర్గాన్ని, కౌరవుల భార్యలను, మంత్రులను బట్టి బంధించారు. కౌరవసేన చెల్లాచెదరై పారిపోయింది. యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు వద్దకు దుర్యోధనుని మంత్రులు వెళ్లి జరిగిన కథంతా చెప్పారు. దుర్యోధనుని సకుటుంబంగా చిత్రసేనుని చెరనుండి విముక్తి కలిగించవలసినదిగా ధర్మరాజును ప్రార్థించారు.

భీమసేనుడు మిక్కిలి సంతోషించి కాగల కార్యము గంధర్వులే తీర్చారని, వనక్లేశాలనుభవిస్తున్న మనలను పరిహసించటానికి పన్నాగం పన్ని వచ్చిన ఆ పాపి తన పాపఫలం అనుభవిస్తున్నాడని దయార్హుడు కాడన్నాడు.

భయంకరశత్రువైనా శరణని వస్తే సంతోషంతో రక్షించాలి, ఇది దయామయుల తీరు, దీనికి ఏ ధర్మాలూ సరిగావని, అతడిని రక్షిస్తే పుణ్యం, కీర్తి కలుగుతాయని భీమార్జునులను ఒప్పించి, ధర్మరాజు గంధర్వులను ఎదుర్కొనమంటాడు.

ఇరువురూ గంధర్వులతో భీకరయుద్ధం సాగించి విజయులై సామరస్యంగా పెడరెక్కలు కట్టిన దుర్యోధనుని, ధర్మరాజు ఎదుట నిలుపగా, అతని దుష్టస్వభావాన్ని గంధర్వుడు, ధర్మరాజుకు వివరిస్తాడు. భీమునితో కట్లు విప్పజేసి, ఇటువంటి సాహసాలు ఇక ముందు చేయబోకుమని మందలించి దుర్యోధనుని నగరానికి సాగనంపుతాడు ధర్మరాజు.

దుర్యోధనుడు పాండవుల చేత విడిపింపబడి అవమానాన్ని, అపకీర్తిని భరించలేక, నగరానికి తిరిగిపోతూ మార్గమధ్యంలో -
"ఒవ్వనివారల ఎదురన్, యివ్విధమున భంగపడితి నేనింక జనుల్ నవ్వగ నేటి బ్రతుకుగా నివ్వసుమతి యేలు వాడ? నెట్లు చరింతున్"- శత్రువుల సమక్షంలోనే ఈ విధంగా మిక్కిలి పరాభవం పొందాను గదా! ఇక ప్రజలు అందరూ నన్ను వెక్కిరించరా? ఇటువంటి బ్రతుకు ఇక ఎందుకు? ఈ భూమిని నేను ఇక ఎట్లా పరిపాలించగలను? ఇక మీద ఏ మొగం పెట్టుకొని తిరుగాడగలను?

అయ్యో! అయ్యో! నాకు ఎంతటి దురవస్థ కలిగింది? నా అంతటివాడిని శత్రువులు యుద్ధంలో ఓడించి చెరబట్టడమా? జాలితో ఒకడెవడో వచ్చి నన్ను బంధవిముక్తుణ్ణి చేయటమా? ఏ విధంగానైనా జరిపించటానికి దైవానికి శక్తి ఉన్నది. ఎంతటి బలవంతులైనా విధి చేతిలో కీలుబొమ్మలే కదా?

ఆత్మాభిమానం పాడైపోయి ఈ విధంగా ఈ శరీరంలో అసువులను నేను ఎట్లా భరించగలను? మానం కంటే ప్రాణం గొప్పది కాదు. ఇది నా దృఢమైన అభిప్రాయం. నేను ప్రాయోపవేశ దీక్ష పూని ప్రాణాలను విడనాడదలచాను. దీనికి తిరుగులేదు. ఎవరూ నా సాహసాన్ని మాన్పలేరు - అంటూ "అన్న దుశ్శాసన, నిన్ను రాజ్యమునకు బట్టము గట్టెద బతివిగమ్ము" అనగా..

"అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట కల్గినన్ మహార్ణవమది యింకినన్, దివసనాథుడు ఇంద్రుడు తేజమేగినం, గువలయనాథ! నీకు నొక కుత్సితభావము కల్గనేర్చునే? భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే!"

ఓ దుర్యోధన సార్వభౌమా! రాజ్యభారం వహించవలసినవాడవు నీవే! నీ కొరకే ఈ రాజ్యం ఏర్పడింది. ఈ పృథ్వి ముక్కచెక్కలగు గాక, సముద్రం ఇంకిపోవు గాక, సూర్యచంద్రులు తమ తేజాలు కోలుపోతారు గాక, హిమాలయపర్వతమే కదులుగాక, నీలో ఎట్టి నికృష్టభావాలు పొడసూపకుండును గాక, నేను నీవు వహింపదగిన రాజ్యభారాన్ని మోయజాలను సుమా! అంటూ తమ్ముడు దుశ్శాసనుడు అన్న పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాడు.

కర్ణుడు ప్రవేశించి, అసలు పాండవులు ఎవరు? వారు నీరాజ్యంలో సుఖంగా జీవిస్తున్న పౌరులు గదా? రాజుకు ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలొడ్డి అయినా వారు రాజుకు సేవ చేయాలి గదా? పాండవులు నీ సేవకులు, నీవు పాండవులకు ఏలిక అయిన సార్వభౌముడవు. పాండవులు నీ రాజ్యంలో శాంతి, భద్రతలను అనుభవిస్తూ నివసించటం సేవకుల ధర్మం. కాబట్టి వారు తమ ప్రభు ఋణం దీర్చుకొనటానికి నిన్ను విడిపించారు. ఇది వారికి అవశ్య కర్తవ్యం. జూదంలో ఓడిన నాడే వారు నీకు దాసులు, వారి పౌరుష ప్రాభవాలన్నీ నీ సొత్తు అంటూ ఓదార్చాడు.

దీనికి సమ్మతించని దుర్యోధనునితో శకుని,

త|| "కడగి బుద్ధిబలంబు నంద యకంటకంబుగ జేసి యే
పుడమి రాజ్యము సర్వముం దగ బుచ్చియిచ్చిన నిమ్ములం
గుడువనేరక దీని నిచ్చట గూల దన్ని శరీరమున్
విడుతుగా కని నిశ్చయించెదు వెర్రివైతె నరేశ్వరా!"

ఓ దుర్యోధనా, నీవు సాధారణ మానవుడవు కావు, సార్వభౌముడవు. నీ కర్తవ్యాన్ని గూర్చి జాగరూకతతో యోచించుము. నీకు ఈ భూమి, రాజ్యాన్ని సమస్తాన్ని కేవలం నా బుద్ధిబలం చేత (మయాద్యూత మహిమ చేత) నీకు సంపాదించి ఇచ్చాను. నీవు నీ బాహుబలం చేత సంపాదించింది కాదు గదా. ఈ రాజ్యం నీవు ఆర్జించినచో దానిని నీవు త్యజింపవచ్చును గాని నేను నీకు సంపాదించి ఇచ్చిన దానిని నీవు త్యజిస్తే నా మనస్సు ఖేదపడుతుంది కదా! నీవు కష్టపడి సంపాదించనక్కరలేకుండా సంక్రమించిన రాజ్యాన్ని హాయిగా అనుభవించకుండా, ప్రాయోపవేశదీక్షతో ఆత్మహత్యకు పూనటం అవివేకం. నీకు పిచ్చిపట్టిందా ఏమి? పాండునందనులు నీకు ఉపకారం చేసిన మాట నిజం. నీవు వారికి ప్రత్యుపకారం చేయటం పాడి. ఘోరమైన దుఃఖమనే అగ్నిలో పడి వెతచెందుట సరిగాదు.

శకుని హితబోధ దుర్యోధనుని మనస్సును ఏమాత్రం తాకలేదు. ఆ ఎత్తు మార్చి పాండవుల ప్రశంస మొదలెట్టినాడు. వారికి రాజ్యభాగమిమ్మని,
"కృతము దలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి సన్మతుల బృథాతనుజుల నమానుషతేజుల బిల్వబంచి తత్పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగ నిమ్ము! నీకు నీ క్షితీవలయంబునం బరమకీర్తియు పుణ్యము గల్గు భూవరా!"

పాండవులు నీకు చేసిన మేలును గుర్తించి నీ మనస్సులో ఉన్న పాపాన్ని అంతటిని తుడిచివేసి, వారిని ఆహ్వానించుము. కుంతీకుమారులు సజ్జనులు. లోకోత్తరపరాక్రమవంతులు. దివ్యతేజస్సు గలవారు. పాండవుల పైతృకమైన రాజ్యాన్ని యిచ్చి సంప్రీతితో సమ్మానించుము. అప్పుడు నీకు ఈ భూమండలంలో సాటిలేని కీర్తి, పుణ్యం లభించగలవు.

"వారలు నీ తోబుట్టువులీ రాజ్యము మీరు వారు ఏకంబై పెంపారగ, నేలుడు దీనం గౌరవకులనాథ ! సౌఖ్య గౌరవ మొందున్"
- కౌరవవంశానికి అధినేతవైన ఓ దుర్యోధనా, పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరూ, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సఖ్యం, గొప్పదనం చేకూరుతాయి.

ఈ హితబోధ చావుబోవు వ్యక్తికి చివరి చికిత్సగా గరళము బోయుట వంటిది. ఈ హితబోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్నను మహాభారతసంగ్రామము సంభవించెడిది గాదు. సర్వనాశనము జరిగెడిది కాదు.

శకుని వంటి కుటిలబుద్ధులకు బుద్ధిబలమున్నంతగా బాహుబలముండదు. బాహుబలము ప్రదర్శించవలసిన చోట వీరు పరిహాసముల పాలగుదురు. అంతేగాక ఇంతకు ముందపకారము పొందినవారు కుటిలబుద్ధుల పాటు చూచి - "ఆనాడు మోసము చేసినట్లు గాదు, ఇప్పుడు నీ పప్పులుడుక"వని ఎత్తి పొడుతురు. సమరభూమిలో శకుని కల్పించిన మాయలన్నింటిని వమ్ము చేసి చిరునవ్వుతో అర్జునుడు-

"మాయలు జూదము తోడన బోయెం గాకింక నిచట బొనగునె యవి! మ
త్సాయకము లడ్డసాళే్ల? నీ యా చవి లేదు పొమ్ము నిలువక మామా!"

శకుని మామా! నీ మాయలన్నీ జూదంతోనే పోయినవిలే! అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే పాచికలనుకొన్నావా? నీకా కపటజూదంలోని రుచి ఇచట దొరుకదు. ఆగక ఇటనుండి వెళ్లిపొమ్ము - అర్జునుడు ఆ విధంగా పలికి నిశితమైన బాణాలు దేహం నిండా నింపగా శకుని కలతపడి, ధైర్యాభిమానాలు విడిచి తోడివారు నవ్వగా యుద్ధభూమి నుండి పారిపోయాడు.

సహదేవుడు, శకునితో యుద్ధరంగంలో పారిపోకుండా నిలువుము మామా అంటూ భయంకరమైన కాంతితో చలిస్తున్న బల్లెం దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించగా, తల, మొండెం భూమిపై పడి దొర్లాయి.

కౌరవుల చెడు ప్రవర్తనకు కారణమైన శకుని, దుర్యోధనుడు చూస్తుండగానే సంహరింపబడ్డాడు. కుటిలబుద్ధుల కిట్టి గతులు తప్పవు. ప్రపంచమున కుటిలబుద్ధికి శకుని పర్యాయపదము.


--(())--


 ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -భీష్మాచార్యులు చెప్పిన సందేశం 
సర్వేజనాసుఖినోభవంతు

బిష్మాచార్యులు చెప్పిన సందేశం
"దశావతారాలలో ఏ అవతారానికి అన్వయించని కులం కేవలం, రామ, పరశురామ, కృష్ణ, బలరామ అవతారలకి మాత్రమే ఆపాదించారెందుకు? మొదటి నాలుగు అవతారాలను, రాబోయే 10 వ అవతారాన్ని మినహాయించి, మిగతా 5 అవతారాలను పరిశిలిస్తే ఏ అవతారంలోను భగవంతుడు బ్రాహ్మణుడుగా అవతరించలేదు...
ఈ విషయాన్ని కాస్త లోతుగా పరిశీలించి విశ్లేషించి పెద్దలు తెలియచేస్తారా!

మీరు శ్రమ అనుకోకపోతే మరింత లోతుగా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కదా భగవంతుని వాక్కు. ధర్మాచరణలో, కుల ప్రస్తావన, కులమనేకంటే వర్ణమందాం, అవతారాలలో క్షత్రియ, యాదవ, వర్ణ ప్రస్తావనెందుకొచ్చింది అన్న వివరణని ఇవ్వగలరని ఆశిస్తున్నాను."

సన్మిత్రులు శ్రీమాన్ కొండూరు వాసుదేవరావు గారు దాదాపు నెల రోజుల పైన ఈ ప్రశ్న(లు) అడిగారు.

సమాధానము వ్రాయడానికి జాప్యము అయ్యింది. కారణాలు అప్రస్తుతము అనుకోండి.

వారడిన ప్రశ్నకు నాకున్న పరిమితమైన జ్ఞానముతో సమాధానము.

ఫేస్భుక్లో కులప్రస్తావన వచ్చినప్పుడల్లా నేను ఒక విషయము ప్రస్తావిస్తూండటము మిత్రులు గమనించే ఉంటారు. అది భగవద్రామానుజుల విరచిత "భగద్విషయము" అనే గ్రంధములో ఉటంకించబడినది.

అది "భగవంతుడు మనలను కులాలవారిగా విభజించలేదు. భగవంతుని సృష్టి మొత్తం నాలుగు విధాలుగా ఉన్నది. అది దేవ,మనుష్య, తిర్యక్, స్థావరాలు గా విభజన చేయబడినది.
దేవ అంటే దేవతలు, మనుష్య అంటే మానవులు, తిర్యక్ అనగా అడ్డంగా, నిలువుగా తిరిగేవి, ఎగిరే పశు, పక్షి జాతులు, స్థావరాలు అనగా చెట్టు,పుట్ట,గుట్ట, కొండ మొదలైనవి. "

చాలా మంది భగద్గీతలోని నాలుగో అధ్యాయము పదమూడవ శ్లోకము " చాతుర్వర్ణం మయా" అనే శ్లోకము ఉటంకిస్తూ తమ విశ్లేషణ భగవంతునికి ఆపాదిస్తూన్నారు.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం’ అంటే “నాలుగు రంగులనీ నేనే సృష్టించేను” అని వాచ్యార్థం. అంటే ఏమిటి? నాలుగు అంటే ఉత్త ‘నాలుగు’ కాదు, ఎన్నో అని కాని, ‘రకరకాల’ అని భగవానుడు ఉద్దేశ్యము కదా. భగవానుడు ఎన్నో ‘రంగులు’ సృష్టించేడా? ‘రంగు’ అనే మాటకి స్వభావం అనే అర్థం తెలుగులో వాడుకలో ఉంది. “వాడి అసలు రంగు బయట పడిందిరా” అన్న ప్రయోగం చూడండి. కనుక “చాతుర్వర్ణ్యం మయా సృష్టం” అంటే “రకరకాల స్వభావాలు గల మనుష్యులని నేను సృష్టించేను” అన్న అర్థం వస్తోంది కదా. మనుష్యుల స్వభావాలు రకరకాలుగా ఉంటాయి, ఎవ్వరి స్వభావానికి అనుకూలంగా వారు ప్రవర్తించాలి” అని భగవానుడు చెబుతున్నాడన్నమాట.

ఇక్కడ మన స్వామి మనుష్యుల స్వభావాలు విశ్లేషిస్తూన్నడన్నమాట. మనం భగవానుడు ‘మనోమయకోశం’ అనే స్థితి గురించి ప్రస్తావన చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చును.
ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి అయా స్థితులు మారుతూ వుంటాయి. అంటే వర్ణాలు మారుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆత్మకి ఏమీ అంటవు కదా అనే తర్కం చెయ్యకుండా విషయము అర్ధం చేసుకోవడానికి మనం ఇక్కడ మానసిక స్థితిని చెప్పుకుందాము.

మనస్సు ‘ క్రోధం ’ గా వున్నప్పుడు నల్లటి ఎర్ర రంగు భూయిష్టం అవుతుంది.
మనస్సు ‘ లేకి ’ గా వున్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి వుంటుంది.
ఈ రంగులను ‘ శూద్రవర్ణం ’ గా, ‘ తమోగుణం ’ గా అభివర్ణించారు.
గ్రుడ్డిగా ‘ నేనే ’ సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి ఆరంజి రంగు కలిగి
వుంటుంది. ఈ రంగును, నల్లటి ఆకుపచ్చ రంగును,
‘ వైశ్యవర్ణం ’ గా, ‘ రజోగుణం ’ గా అభివర్ణించారు.
మనస్సు ‘ నాకు తెలియదు ’ అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీలిరంగు కలిగి వుంటుంది.
‘ పునర్‌జన్మ’ మరి ‘ కర్మసిద్ధాంతం ’ల అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి వుంటుంది.
‘ ముముక్షువు ’ గా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు ఇండిగో రంగుని కలిగి ఉంటుంది.
ఈ రంగులను ‘ క్షత్రియ వర్ణం ’ గా, మారి ‘ సాత్విక వర్ణం ’ గా అభివర్ణించారు.
మనస్సు పూర్తిగా ‘ శుద్ధం ’ అయినప్పుడు ...
‘ అహం బ్రహ్మాస్మి ’ అని తెలుసుకున్నప్పుడు ...
పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి వుంటుంది.
ఈ రంగును ‘ బ్రాహ్మణ వర్ణం ’ గా, ‘ శుద్ధ సాత్వికం ’గా లేదా ‘ నిర్గుణం ’ గా అభివర్ణించారు.
‘ దివ్యచక్షువు ’ తోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు.
అంతర్ గుణాన్ని బట్టే కర్మ సదా వ్యక్తం అవుతూ వుంటుంది.
బయట కర్మను బట్టి అంతర్ గుణం బుద్ధికి గ్రాహ్యం అవుతుంది.
తమోగుణం లోని వారిని శూద్రులుగా
రజోగుణం లోని వారిని వైశ్యులుగా ...
సాత్విక గుణం లోని వారిని క్షత్రియులుగా ...
శుద్ధసాత్విక లేదా నిర్గుణం వారిని బ్రహ్మణులుగా ...
పూర్వపు ఋషులు సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు.
పైన వున్న ‘ మాస్టర్స్ ’, దేవుళ్ళు ఎప్పుడూ
‘ క్రింద వున్న మానవుల ’ గుణకర్మలను నిర్దేశించరు.
ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ వుంటారు.
మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మనం ...
మనం ఎవరమో నిర్ణయించుకుంటాం.
బ్రాహ్మణకులంలో పుడితే బ్రాహ్మణులం కాము.
మనం బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాం.
మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం ...
పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు ...
రాజుగారికి పుట్టినా క్షత్రియుడు కాలేడు.
ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోలేడు.
ఈ మూడు గుణాలూ లేని వాడే " శూద్రుడు " అనిపించుకుంటాడు.
కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం.
మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం.
మన వాస్తవాన్ని మనమే తయారుచేసుకుంటున్నాం.
‘ నేను ’ ఆత్మ అన్న పదార్థం ఒకప్రక్క నిరంతర,
మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా ...
మరొక ప్రక్క దేనినీ సృష్టించని ... దేనికీ కర్త గాని ... అవినాశి అయిన
అవ్యయమైన ‘ మూల పదార్థం ’ అని కూడా తెలుసుకోవాలి ... అదే జ్ఞానం.
అంటే ప్రతి ‘నేను’ కూడా ...
ప్రతి ‘ఆత్మ’ కూడా ...
ఒకప్రక్క సృష్టికర్త ... మరొక ప్రక్క సృష్టిసాక్షి.

ఈ వర్ణం యొక్క వివరణ తెలుసుకున్న తరువాత అసలు ప్రశ్నకు సమాధానము సులువు అవుతుంది.

అవతారాలు ముఖ్యంగా పది అవతారాలు అనుకుంటున్నాము. నిజానికి లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు.
మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.

శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.
నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.
వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.
వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు ( ఈ అవతారము గురించి భిన్నాభిప్రాయములున్నవి. బుద్దావతారము ఒక క్షణకాలము రాక్షసుని చంపి చాలించిన అవతారమనే అభిప్రయమున్నది. అది విషయాంతరము)

ఇప్పుడు ఏ ఏ అవతారమునకు మనము ఏ ఏ కులమును ఆపాదించాలో ఆలోచిస్తే, తన భక్తులను కాపాడటానికి ఎప్పటికి అవసరమైన "వర్ణం" తీసుకుని భగవానుడు అవతరించాడని బోధపడుతుంది.

మనము భగవానుని ఆయా అవతారాల యొక్క ప్రధాన లక్ష్యమును తీసుకుని ఆయా గుణములను ప్రస్తుతించి ధన్యులము అవడమే మానవ జన్మఎత్తినందుకు సాఫల్యమని తెలుసుకుంటే చాలును కదా !

అదే కదా మనకు శ్రీమాన్ భీష్మాచార్యులవారు శ్రీ విష్ణుసహస్రనామములు చెబుతూ ఇచ్చిన సందేశము. స్వస్తి.


--(())--

ధర్మరాజు - ‘యుధిష్ఠిరుడు’!

ధర్మరాజుకి యుధిష్టిరుడు అనే బిరుదం ఉంది.

అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పొరాడే వాడు అని అర్ధం.

కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం ఋజువు చేయడం కష్టం.

మరైతే ఈ బిరుదు ఆయన విషయంలో ఎలా సార్ధకమవుతుంది?

యుద్ధం అంటే కేవలం శత్రువులతో చేసేది మాత్రమే కాదు.

ఆ యుధాలతో చేసేది అంతకన్నా కాదు.

ఎవరు శత్రువో తెలియకపొయినా ఏ ఆయుధం దొరకపోయినా మనం మనల్ని జయించడం కోసం చేసే నిత్య జీవల సంగ్రామమే నిజమైన యుద్దం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే.

అందుకే ఆయన యుధిష్టిరుడయ్యాడు.

ఆయన జీవన యుధిష్టిరత్వానికి ప్రత్యక్ష నిదర్శనమే

‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం.

‘అనువుగాని చోట అధికులమనరాదు’ అని ప్రపంచంలో అన్ని ప్రదేశాలలోను, జీవితంలో అన్ని సందర్భాలలోను మనదేపైచేయి అనుకోకూడదు.

వనవాసమ్లో ఉన్న ధర్మరాజుకి, సోదరులకి దాహం అయితే నకులుణ్ణి పిలిచి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురమ్మన్నాడు.

అతను వెళ్ళి ఒక సరోవరం చూశాడు.

అందులొ దిగి నీరు త్రాగబోయాడు.

అంతలో ఒక యక్షుడు కొంగరూపంలో వచ్చి అడ్డుకుని తన ప్రశ్నలు సమాధానలు చెబితే గాని నీరు త్రాగడానికి వీలులేదన్నాడు

. కొంగను అల్ప జీవిగా భావించిన నకులుడు ఆ ఆదేశాన్ని ధిక్కరించి నీరు త్రాగబోయాడు.

యక్షుని క్రోధానికి గురై మరణించాడు.

సహదేవుడు, అర్జునుడు, భిముడు కూడా అదే దారిని త్రొక్కి, అదే అహంకారంతో అదే విధంగా మరణించారు.

చివరకు ధర్మరాజు వెళ్ళాడు.

సోదరుల శవాలు గమనించి దుఃఖించాడు.

చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించాడు.

‘ఇది అనువు గాని ప్రదేశం, ఇక్కడ అధికులమనరాదు’ అని నిశ్చయించుకొన్నాడు.

కొంగలోని దివ్యత్వాన్ని అవగాహన చేసుకొని ప్రశ్నలకు జవాబులివ్వడానికి సిద్ధపడ్డాడు.

జవాబులు చెప్తే ఒక్కరినైనా బ్రతికిస్తుందని కచ్చితంగా చెప్పలేం.

అయినా ఆపదలందు ధైర్యగుణము అన్నట్లుగా గుండెలు చిక్కబట్టుకుని తన ప్రయత్నం తాను చేశాడు.

మొత్తం వంద ప్రశ్నలకు పైగా ఉన్నా అన్నింటికీ ఓపికగా తన పరిజ్ఞానం మేరకు సమాధానం చెప్పాడు.

అవి ఏ పుస్తకంలోనూ సమాధానాలు దొరకని ప్రశ్నలు. వాటికి ఏ కేంద్రంలోను శిక్షణ ఇవ్వరు. అవగాహనే గ్రంథం.

అంతరంగమే శిక్షణా కేంద్రం.

భూమికంటే గొప్పది ఏది? - తల్లి

ఆకాశం కంటె ఉన్నతుడు ఎవరు? - తండ్రి

జీవితాంతం తోడుండేది ఎవరు? - గుండె ధైర్యం

ఇవీ ఆ సమాధానాలు.

ఆ సమాధానాలకు సంతోషించిన యక్షుడు చివరగా ఒక ప్రశ్న అడిగాదు. దానికి జవాబు చెబితే సోదరులలో ఒకరిని బ్రతికిస్తానన్నాడు.

అక్కడికదే అదృష్టం అని అంగీకరించాడు ధర్మరాజు.

చివరి ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైనది.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏది?

- ‘రోజు ఎంతో మంది మరణిస్తూ ఉంటె చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకొని సంపదలు కూడబెట్టుకొంటున్నామే’ ఇదీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు.

ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజును అతి క్లిష్టమైన పరిస్థితిలోకి నెట్టాడు.

ఇంతకీ నీ సోదరులు నలుగురిలో ఎవరిని బ్రతికించమంటావు అన్నాడు.

ఇంతవరకు సమాచాకానికి పరీక్ష.

ఇప్పుదు సంస్కారానికి పరీక్ష.

ధర్మరాజు ఒక్కక్షణం ఆలోచించలేదు.

‘నకుల జీవతు మేభ్రాతా’ నా తమ్ముడు నకులుణ్ణి బ్రతికించండి. అన్నాడు

ఇప్పుడాశ్చర్యపోవడం యక్షుని వంతయింది.

అదేమిటయ్యా, అమాయక చక్రవర్తి, భయంకరమైన యుద్ధాన్ని పెట్టుకొని పదివేల ఏనుగుల బలం కలిగిన పార్ధుణ్ణి వదిలి నకులుణ్ణి కోరుకుంటున్నావేమిటి? అన్నాడు

వెంటనే ధర్మరాజు గెలుపు గుర్రాల రాజకీయం తనకు తెలియదనీ, యక్షుడు నలుగురినీ బ్రతికిస్తే తనకు పరమానందమేననీ కానీ ఒక్కరినే కోరుకోమనడం వల్ల నకులుని కోరుకోవలసి వచ్చిందనీ స్థిరంగా చెప్పాడు.

మా నాన్న్గగారికి కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలు.

వారిలో మాద్రి చనిపోతూ తన కుమారులిద్దరినీ మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళీపోయింది.

కుంతి సంతానంలో పెద్దవాణ్ణి నేను బ్రతికే ఉన్నాను. మా పినతల్లి సంతానంలో పెద్దవాడు నకులుడు. కాబట్టి అతను బ్రతకాలి.

ఇంతకు మించి నాకు రాజకీయ సమీకరణాలు తెలియవు.

నకులిణ్ణి నేను బ్రతికించగల్గితే మా తల్లులిద్దరికీ సమానంగా న్యాయం చేసిన వాణ్ణవుతాను.

రేపు మా అమ్మ ఏ సందర్భంలో కూడా మా పినతల్లి ముందు తలవంచుకోవలసిన పరిస్థితి రాదు.

మా అమ్మ నావల్ల ఈ లోకంలోనైనా ఏలోకంలోనైనా తలయెత్తుకుని బ్రతకాలి గానీ తలదించుకుని బ్రతకకూడదు.

అని ధర్మరాజు నిశ్చయంగా చెప్పేసరికి ఆశ్చర్యపడి, ఆనందించి యక్షుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురినీ బ్రతికించాడు.

అంటే ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యం ఏదో మనం చేస్తే ఆపైన దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట.

ఇదీ ధర్మరాజుని యుధిష్టిరుని చేసిన యక్ష ప్రశ్నల ఘట్టం.

ఈవేళ పరీక్షలో నాలుగు జవాబులు ముందుండగా సరైన జవాబు గుర్తించడానికి ఒత్తిడికి లోనై ఆందోళనకు గురై, విజయం సాధించలేక ఆత్మహత్యలకు సహితం సిద్ధపడుతున్న మన యువతరం యక్ష ప్రశ్నలు చదివితీరాలి.

ధర్మరాజు ముందు నాలుగు సమాధానాలు లేవు.

నలుగురు తమ్ముళ్ళ శవాలున్నాయి. అయినా తట్టుకుని నిలబడి అన్నింటికీ సమాధానాలు చెప్పి సమాచారంలోను, సదాచారంలోనూ కూడా తనకు సాటిలేరని నిరూపీంచుకున్న జీవన యుధిష్టిరుడు,

అదర్శ నాయకుడు ధర్మరాజు.

--(())--

10. అశ్వత్థామ కావించిన మారణహోమం .. సౌప్తికపర్వం (నిద్రాపర్వం)! 
ఏ మానవునకైనను మితిమీరిన ఆవేశము మంచిది కాదు. ఆవేశము వివేకమును చంపుటేగాక నీచతకు పాల్పడజేయును. అందునూ, క్రోధస్వభావుని ఆవేశము మహాక్రూరము 

శ్వత్థామ ద్రోణాచార్యుని ఏకైక ప్రియపుత్రుడు. తన తండ్రి విద్యాధనము అన్యుల కంటే తనకెక్కువ చెందవలెనని ఆశించుటే గాని, యోగ్యతవిషయ మాతని యోచనకు రాదు. గురు పుత్రుడనను అహంకారమే అతని ఆధిక్యభావనకు ప్రబలహేతువు. 


అయోగ్యుడని తెలిసియు పుత్రప్రేమకు వశుడై ఆచార్యుడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రప్రయోగము బోధించాడు. ఉపసంహారము బోధించలేదు. దాని ప్రయోగము ఎట్టి పరిస్థితులలోనూ మానవులపై జరగకూడదన్నాడు. 

అయోగ్యుని విద్య అహంకారము పెంచును. ఆవేశపూరితుడు, క్రోధస్వభావుడు, అసహనపరుడైన అశ్వత్థామ అహంకారమును బ్రహ్మాస్త్రము పెంచినది. అతడొకనాడు ద్వారక కేగి శ్రీకృష్ణుని చక్రాయుధ మిమ్మన్నాడు. చక్రాయుధ మెందుకని శ్రీకృష్ణుడు అడుగగా, నీతో యుద్ధము చేసి నిన్ను గెలిచితినన్న కీర్తి గడించుటకన్నాడు. ఆశ్చర్యచకితుడై చిరునవ్వుతో శ్రీకృష్ణుడు చక్రాయుధమును చూపి తీసికొమ్మన్నాడు. అశ్వత్థామ దాని నెత్తలేక- ఈ చక్రంబు నీక ధరియింపం దగియుండు గాన నా కిది లేకున్న నేమి యగు? నెట్లును నీ తోడ సంగరంబు సేయంగలవాడ- నని పొగరుగా పలికి వెళ్లినాడు.

అశ్వత్థా ఇంత దారుణానికి ఈయన ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం.. 

అశ్వత్థామకు పాంచాలురన్న గిట్టదు. కారణం, తండ్రి దారుణావమానానికి గురి కావటమే. దానికి తోడు ధృష్టద్యుమ్నుడు తండ్రి గొంతు కోసినాడు. అది చూచిన అశ్వత్థామ కడుపు తరుగుకొనిపోయి, దుర్యోధనునితో నా బాహుబలం, దివ్యాస్త్రాలు ఎందుకు? కాల్చటానికా? అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. మహానుభావుడైన మా తండ్రి ఏ దిక్కూ లేక యుద్ధంలో శత్రువు చేతిలో దీనంగా మృతి చెందాడు. తలచుకుంటే నన్ను గూర్చి నాకే ఏహ్యభావం గలుగుతున్నది. దీనికంతటికి కారణం ఆ ధర్మరాజే. కపటంతో సత్యభ్రాంతిని కలుగజేసి నా తండ్రిని హత్యగావించాడు. 

అస్త్రగురుడైన మా తండ్రి, ద్రోణాచార్యుడు నన్ను కన్నది శత్రువు చేతిలో తాను ఏ దిక్కూ లేక నరికివేయబడి మరణించటానికి అన్నట్లయింది. ఇక చెప్పటానికి ఏముంది? అని తండ్రి దుర్గతి దలచి వాపోయాడు. వెంటనే ఆగ్రహావేశపరవశుడై ఇలా ప్రతిజ్ఞ చేశాడు. 

నా ఈ బాహుబలపరాక్రమాలతో దివ్యాస్త్రప్రయోగంతో తల్లడిల్లి మిక్కిలి బాధతో ఆ శ్రీకృష్ణుడు, పాండవులు రణరంగంలో తట్టుకోలేక తొలగిపోయేటట్లు చేస్తాను. మా తండ్రి నారాయణుడిని ఉపాసించి పొందిన దివ్యాస్త్రం నాకిచ్చాడు. ఆ దివ్యాస్త్రం వీరు వధ్యులు, వీరు అవధ్యులు అనే భేదం లేక శత్రునిర్మూలనం క్షణంలో చేసి వేస్తుందని పాండవబలంపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుని నేర్పుచే అది వృథా కాగా, ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుని మీద వదిలినాడు. అది బ్రహ్మాస్త్రముచే అణచివేయబడగా అశ్వత్థామ అవమానంతో క్రుంగి విల్లు పారవైచి, రథము దిగి యుద్ధభూమి నుండి తొలగినాడు. 

తొడలు విరిగి నేలబడి నెత్తుటి బురదలో పొరలుచున్న సుయోధనుని దుఃస్థితి చూచినప్పుడు, అశ్వత్థామ ఆవేశము మిన్ను ముట్టినది. తండ్రి దుర్మరణము, పాంచాలుర మీది పగ, ద్రుష్టద్యుమ్నుని సంహరింపలేదన్న కసి, అన్నింటిని మించి సుయోధనుని దుఃస్థితి అశ్వత్థామ క్రోధమును లెస్సగ రెచ్చగొట్టినది. 

వెంటనే ఓ దుర్యోధన సార్వభౌమా, నేను నిజం చెప్తున్నాను వినుము. విజృంభించి పాంచాలురు మొదలుగా ఉన్నట్టి బంధుమిత్ర సమూహమును శ్రీకృష్ణుడు చూస్తుండగా ఇదిగో నేడు హతమారుస్తానన్నాడు. 

దీనికి సంతోషించిన సుయోధనుని ఆజ్ఞపై, కృపాచార్యుడు, గంగాజలంతో అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకం చేశాడు. 

అశ్వత్థామ చేసినది శక్తికి మించిన ప్రతిజ్ఞ. కార్యసాధనకు తనకు తోడున్న వీరులు ఇరువురే- కృతవర్మ, కృపాచార్యుడు. 

దానిని సాధించుటకు వ్యవధి కూడా లేదు. కౌరవేశ్వరుడా కొన ఊపిరితో ఉన్నాడు. ఆయన కన్ను మూయకముందే విజయవార్త ఆయన చెవిలో వేయవలెను. అప్పుడు గాని అతని ప్రతిజ్ఞకు, పరిశ్రమకు సార్థకత లభించదు. జీవితములో ఇట్టి పరిస్థితులే వ్యక్తి శీలమునకు అగ్నిపరీక్షలు. పెక్కుమంది ఇట్టి పరిష్టితిలో మోసము వైపు  మొగ్గుదురు. అడ్డత్రోవలు తొక్కుదురు. మానవస్వభావ మట్టిది. 

ఆ రాత్రి అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. అతనిది తీరని ఆవేదన, తరుగని ఆవేశము. దిక్కు తెలియని ఆందోళన. ఇంతలో గుడ్లగూబ నిద్రపోవు కాకముల గొంతు కొరికి సద్దు లేకుండ చంపి తిను దృశ్యమాతనికి కంటబడినది. ఆ గుడ్లగూబ తన కొక మహోపదేశమిచ్చినట్లు భావించినాడు. 

పాండవులను నేడు చంపక, తరువాత ఎప్పుడో చంపితే ఈ లోగా దుర్యోధనుడు కన్ను మూస్తే నేను చేసిన పనిని ఎవరు మెచ్చుకొంటారు? ధర్మయుద్ధంలో ఆ మహావీరులను చంపటం అశక్యం. శత్రువులను చంపేటప్పుడు అధర్మం అనకుండా లభించిన ఉపాయంతో ఉత్సహించాలనటం శాస్త్రసమ్మతమే కదా? 

దండెత్తినప్పుడూ, విడిది చేసినప్పుడూ, ఇరుకైన దారిలోను, గతి లేక తిరుగబడినప్పుడూ, నిద్రించేటప్పుడూ శత్రువులను క్రూరంగా మీదపడి చంపాలి. ఏ పద్ధతి అనుసరించి అయినా శత్రువులను చంపవచ్చును- అనే నీతివాక్యాలు విన్నాను. క్షత్రియధర్మం అవలంబించిన వాడికి ఇట్లాంటి పనులు చేయదగినవి. అదీ కాక పాండవులు తాత అయిన భీష్ముడిని (శిఖండిని ముందుగా పెట్టుకుని), గురువైన తన తండ్రిని (అస్త్రత్యాగం చేసినవాడిని) చంపేటప్పుడు, న్యాయమార్గంలో యుద్ధం చేయలేదు. కాబట్టి దుష్టమైన ఉపాయాలు గల పాండవులను నిద్రించేటప్పుడు ఆకస్మికంగా చంపటం నీతే గాని నిందించదగింది కాదని నిర్ణయించుకొన్నాడు. 

బలమూ, ఉపాయము తెలిసిన యోధానుయోధులు 18 రోజులు సుయోధనుని పక్షాన ధార్మికంగా పోరాడి కూడా అతనికి విజయం చేకూర్చలేకపోయారని వాపోయాడు. అశ్వత్థామ క్రూరపుపూనికను కృపాచార్యుని నీతివాక్యములు మరల్చలేకపోయినవి. చివరి యత్నంగా నిద్ర చావు వంటిదని, శవాల వలె పడి ఉన్నవాళ్లను చంపి, పాపం మూటకట్టుకుని నరకంలో పడటం మంచిది కాదని చాలాదూరం చెప్పిచూచాడు మామ కృపాచార్యుడు. 

నా తండ్రిని చంపి సంతోషించే ద్రుష్టద్యుమ్నుడూ మొదలైన ఆ దురాత్ములను అధర్మమార్గంలోనే (పాపాత్ములు కావున పాపంబు తెరవున) చంపుతాను. దానివలన నాకు పురుగు పుట్టువు కలిగినా మంచిదే అంటూ కృతవర్మ, కృపాచార్యులను బలవంతంగా వెంటకొని నిద్రావివశంబైన పాండవ శిబిరంబునకు వెళ్లాడు. 

అశ్వత్థామ స్థిరసంకల్పాన్ని పరీక్షించటానికి ఒక భయంకర భూతరూపంలో అతడి మార్గాన్ని ఈశ్వరుడు నిరోధించాడు. అశ్వత్థామ ఆ పెనుభూతంపై ప్రయోగించిన బాణాలన్నీ వ్యర్థమయ్యాయి. చివరకు తీవ్రస్వభావుడై ఆ అశ్వత్థామ ఆత్మోపహారానికి సంసిద్ధుడు కాగా, శివుడు ప్రత్యక్షమై అతడికొక మహనీయమైన ఖడ్గాన్ని ప్రసాదించాడు. అశ్వత్థామ సంతోషించి అప్రతిహతమైన ఆ ఖడ్గం సహాయంతో పాండవసంహారానికి ఉద్యమించాడు. ఆ స్కంధావారం గుట్టూ మట్టూ అంతకుముందే తెలిసికొన్న వాడవటం చేత, ముందుగా తన తండ్రిని చంపిన ద్రుష్టద్యుమ్నుడి శిబిరం ప్రవేశించి నిద్రిస్తున్నవాడిని తన్ని లేపి, మదగజాన్ని చంపేసింహాన్ని పోలుతూ విజృంభించి, కాలితోనూ, చేతితోనూ చితుకగొట్టి, వింటి అల్లెత్రాడు అతడి కంఠానికి బిగించి ఉరిపోసి చంపాడు. పిశాచోన్మత్తుడైన ఆ వీరుడు క్రమంగా పాంచాలురను అందరినీ, ద్రౌపదేయులనూ, అసంఖ్యాక యోధులను నిద్రపోతుండగా నిర్దయుడై వధించాడు. మేలుకొని పారిపోవటానికి ప్రయత్నించే అభాగ్యులను, శిబిరద్వారం దగ్గర ఉన్న కృపాచార్యకృతవర్మలు అడ్డగించి చంపివేశారు. అతడి రాక్షసావేశానికి, నీచపరాక్రమానికి విచారిస్తూ వారు తలలు వంచుకుని ఊరకున్నారు. పాండవులైదుగురూ, కృష్ణసాత్యకులు మాత్రం ఆ శిబిరంలో కనబడనందుకు అశ్వత్థామ విచారించాడు. 

తరువాత ఆ ముగ్గురు యోధులూ, తాము జరిపిన సంహారవృత్తాంతాన్ని వినిపించటానికి దుర్యోధనుడి వద్దకు పరుగెత్తారు. అతడు చనిపోవటానికి సిద్ధంగా ఉండి తీవ్రవేదన పొందుతూ క్షణాలు లెక్కిస్తున్నాడు. అతడి దీనస్థితి చూచి వాళ్లు చాలా బాధపడ్డారు. అశ్వత్థామ, దుర్యోధనుడికి ఎంతో కీర్తి సంపాదించి పెట్టిన అతడి గదాకౌశల్యాన్ని ప్రశంసించి, నీ కొరకు బాధ పడకుము. నీవు పుణ్యలోకానికి పోయినప్పుడు నా తండ్రి అయిన ద్రోణుడిని చూచి, ద్రోహి అయిన ద్రుష్టద్యుమ్నుడిని నీ కొడుకు అశ్వత్థామ చంపాడని చెప్పుము అని విన్నవించాడు. ఉపపాండవ, పాంచాలాదుల మరణం విని దుర్యోధనుడు సంతోషించి, భీష్మద్రోణులు కాని, కర్ణశల్యులు కాని, మీవలె మేలు చేయలేదు. సుఖంగా ఉండండి, మనకు పునర్దర్శనం స్వర్గలోకంలో అవుతుంది, వెళ్లండి అని పలికి ప్రాణం విడిచాడు. రథికులు ముగ్గురూ దుఃఖంతో అతడికి ప్రదక్షిణం చేసి, తిరిగి చూస్తూ, రథారూఢులై వెళ్లిపోయారు. 

మర్నాడు సూర్యోదయసమయంతో ధర్మరాజాదులకు విషయం తెలియగా విలపించి మూరి్ఛల్లారు. ధర్మరాజు నకులుడిని పాంచాలదేశానికి పంపి ద్రౌపదికి వార్త చేరవేశాడు. ఆత్మపుత్ర వినాశనానికి ద్రౌపది తీవ్రదుఃఖితురాలైంది. క్షత్రియ కాంత సంతానం యుద్ధంలో వీరమరణం పొందుట సముచితమే కదా అని ధర్మరాజు ఆమెను ఊరడించాడు. అశ్వత్థామకు సహజమైన శిరోరత్నాన్ని తెచ్చి చూపితే తప్ప జీవించనని ద్రౌపది చెప్పింది. వెంటనే భీముడు, నకులసహాయుడై అశ్వత్థామను అన్వేషింప బయలుదేరాడు. 

క్రూరుడైన అశ్వత్థామ వద్ద బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందని చెప్పగా, శ్రీకృష్ణార్జున సహితుడై ధర్మరాజు, అశ్వత్థామను వ్యాసుడి ఆశ్రమ సమీపాన తపస్సు చేస్తుండగా పట్టుకొన్నాడు. పాండవవీరులను చూచి అశ్వత్థామ భయక్రోధాదులతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒక గడ్డిపరక యందు ఆవహింపజేసి ప్రయోగించాడు. అది భయంకరజ్వాలలతో పాండవులను ఆక్రమింపబోయింది.

 అర్జునుడు కూడ శ్రీకృష్ణ ప్రేరితుడై ఆత్మరక్షణ కొరకు అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. నారదవేదవ్యాసులు ఆ మహాస్త్రాల చేత లోకసంక్షోభం కాకుండా, ఎవరి అస్త్రాన్ని వారు ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.

 సత్త్వస్వభావుడు, గురుభక్తి తత్పరుడైన అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. కాని, తామసప్రవృత్తి గల అశ్వత్థామ అట్లా చేయలేకపోయాడు. తన అస్త్రం పాండవేయగర్భాలకు హాని కలిగించి ఉపశమిస్తుందని చెప్పాడు. ఉత్తరాగర్భాన్ని మాత్రం శ్రీకృష్ణుడు రక్షించాడు. ఆమెకు పుట్టే కుమారునకు సుదీర్ఘమైన ఆయువు నిస్తానని మాటిచ్చాడు. శ్రీకృష్ణుడు, పిల్లలను చంపిన నీవు ఆహారం లేక, నిస్సహాయుడవై దుర్గంధ భూయిష్ఠమైన రక్తం చేత శరీరం దగ్ధమవుతూ ఉండగా 3000 సంవత్సరాలు తిరుగమని శపించాడు. దీనికి వ్యాసుడు ఆమోదం తెల్పాడు. 

వ్యాసునికి కూడా అశ్వత్థామ 'నీవు మనుష్యులలోనే ఉంటావని' ప్రతిశాపమిచ్చి తన శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి వెళ్లాడు.గురుపుత్రుడవటం చేత, అర్జునుడు అశ్వత్థామను చంపటానికి పూనుకోక, అవమానించి, ఆయుధాలతో పాటు సిగ్గును కూడా విడిచి పెట్టేటట్లు చేశాడు. ధర్మరాజు శిరోమణిని గ్రహించి ద్రౌపదికివ్వగా ఆమె తిరిగి ధర్మరాజునకే ఇచ్చింది. శిరోమణిని పోగొట్టుకొనటం చేత అశ్వత్థామ కీర్తి, శరీరం పతనం చెంది, కలుషితమైనవి. ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్న ఆ మణిని అందం అతిశయించగా శిరస్సుపై ధరించి, ఉదయకాలపు ఎరుపుతో అధికంగా ప్రకాశించే చంద్రబింబంతో ఒప్పే తూర్పు కొండవలె ప్రకాశించాడు. 

యుద్ధషట్కము లోని సౌప్తిక (నిద్రా) పర్వానికి సైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైన అశ్వత్థామ సాధించిన విజయం సుయోధనుని పట్ల కృతజ్ఞతాభావంగా గోచరిస్తుంది. 

"కుడువగ, గట్ట బంధులకు కోటివిధంబుల బెట్ట జన్నము 

ల్నడప, ననేక ధర్మ విధులం బొగ డొందగ జాలునట్టి యె 
క్కుడు సిరి యిచ్చి పేర్మినొక కొండగ మన్చిన నీవుసావగా 
నొడలిటు లోమితిం గురుకులోత్తమ యేనొక సేవకుండనే ?"


తినటానికీ, కట్టుకొనటానికీ, బంధువులకు అనేక విధాల పెట్టటానికీ, యజ్ఞాలు చేయటానికీ, పెక్కు ధర్మకార్యాలలో పేరు గాంచటానికీ సరిపడేటంత అధికమైన సంపదనిచ్చి ప్రేమతో ఒక కొండవలె నన్ను సాకిన నీవు చచ్చిపోతూ ఉంటే నేనెట్లా బ్రతికి ఉన్నాను? కురువంశ శ్రేషా్ఠ! నేనూ ఒక సేవకుడనేనా? అంటూ అశ్వత్థామ వాపోతాడు. 

పక్క ఇంటి పగవానిని ప్రత్యక్షముగ ఎదిరించలేక అతడింట లేనప్పుడు రాత్రివేళ అతని కొంపకో లేక పంటకుప్పకో నిప్పంటించి లేదా అతని పండ్ల పూలతోటలనో చాటుమాటుగా ధ్వంసం చేసి నీచపరాక్రమమును, రాక్షసావేశమును ప్రదర్శించిన అశ్వత్థామలను ఎందరినో లోకమున నేడు చూస్తున్నాము- అను అప్పజోడు వేంకటసుబ్బయ్య గారి వాక్కు అక్షరసత్యం!

--((*))--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ