నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము)

🌻. అభ్యాసము, ప్రభావము - 1 🌻

ఆ విద్యాధరి ఇట్లు పల్కెను. నేను మీ శిష్యురాలను, అబలను అయినప్పటికి, అభ్యాసముచే, నేను శిలాంతర్గతమగు జగత్తును గాంచుచున్నాను. 

తాము సర్వజ్ఞులగు గురువులైనప్పటికి, అభ్యాసలేమిచే, అద్దానిని గ్రహించుటలేదు. కావున అభ్యాసముయొక్క ప్రభావమును తిలకింపుడు. అభ్యాసముచే అజ్ఞానియు, జ్ఞానియగుచున్నాడు.

పర్వతమును మెల్లమెల్లగ పిండిచేయబడుచున్నవి. అచేతనమైన బాణము సూక్ష్మమై లక్ష్యమును ఛేదించుచున్నది. అభ్యాసమువలన కొందరికి కారపు వస్తువు ఇష్టముగుచున్నది,కొందరికి చేదు,కొందరికి తీపి రుచించుచున్నది. 

సమీపమున నివసించు అభ్యాసముచే, బంధువుకానివాడు బంధువగుచున్నాడు. అభ్యాసముచే స్థూలశరీరము, కారణ అభ్యాసముచే పక్షివలె ఆకాశమున ఎగురుచున్నది. గొప్ప పుణ్యము నిష్పలముగా వచ్చును గాని, అభ్యాసము నిష్పలముకాదు. 

దుస్సాధ్యకార్యములు అభ్యాసముచే సాధించబడుచున్నవి. శత్రువులు మిత్రులుగను, విషము, అమృతముగను అగుచున్నది. సంసారము అసారమైనదని వివేకము గల్గినవారు, ఆత్మవిచారమను అభ్యాసముచే మనుజులు మాయానదిని దాటుచున్నారు.

 పదునాల్గులోకుములందు ప్రాణసమూహ మధ్యమందే, దానియొక్క అభిమత వస్తువును సహజమగు అభ్యాసములేక సిద్ధింపదు. మరల మరల ఆత్మ విచారము గావించుటయే, అభ్యాసమనబడును. దానిని పురుషప్రయత్న మందురు. అది తప్ప ముక్తికి వేరు గతిలేదు. 

ఓ మునీంద్రా| అభ్యాసమను సూర్యుడు ప్రకాశింప, జితేంద్రియుడగు వీరునకు భూమిపైగాని, వనమందుగాని, జలమందుగాని, ఆకాశమందుగాని సిద్ధింపని అభిషిత పదార్ధమెయ్యుదియు నుండదు. 
స్థూలదేహమును గూర్చిన భ్రాంతిని నశింపజేయు సమాధిచే సత్యమగు, సూక్ష్మశరీరము యొక్క స్థితి ఇచట సమర్థింప బడుచున్నది. 

సత్యమగు పదార్థమందు సర్వజ్ఞత్వము కలుగజేయు, సమాధిరూప ధారణచేయుటచే, ఈ శిలయందలి జగత్తు ప్రకటితముకాగలదు. అపుడు వసిష్ఠుడు సమాధిస్థితుడయ్యెను. స్థూలదేహభావనలు వదలి, తత్‌ సంస్కార మలము వదలి, చిన్మాత్రనే భావించును. 

తదుపరి దివ్యదృష్టిని పొందితిని. నా ఆత్మయే ఆ శిలారూపమున భాసించుచున్నది. వాస్తవముగ అక్షయమగు బ్రహ్మతత్వము తప్ప, జగత్‌ స్వప్నములం దన్యమగునదిలేదు. 

కాన నేను శిలయందు నిర్మలమైన చిదాకాశమునే గాంచితిని. అనాదియై శాశ్వతమైనట్టి, బ్రహ్మరూపమే ఈ సమస్త ప్రాణలయొక్క, యదార్ధరూపమగుటచే అజ్ఞానులకు మనోరాజ్యమును సంకల్పమనియు జగత్తనియు చెప్పబడుచున్నది. 

ప్రధమమున చైతన్యమున స్ఫురించుటనుబట్టి సూక్ష్మశరీరమే ప్రత్యక్షమైనదగును, దానినే నీవు సత్యమని, సర్వవ్యాపకమని ఎఱుగుము. 
భౌతికమగు స్థూలశరీరము మిధ్యయైనది. తత్వవిచారముచే, ఈ స్థూలశరీరము లభించదు. 

సూక్ష్మశరీరము మోక్షపర్యంతము ఇహ పరలోకములందు అక్షయమగును. సూక్ష్మశరీరముతో కూడిన, స్థూలశరీరము ప్రకటితమైన, అది మృగతృష్ణయందలి జలమువలె మిధ్యయైయున్నది. 

సూక్ష్మశరీర రహితమైన చైతన్యమునందు, స్థూలశరీరమునుగూర్చిన దృఢసంస్కారముచే, స్థూలబుద్ధి దృఢత్వము పొందినది. అవివేకముచే, జీవుని మోహముయొక్క అసత్తును సత్తుగను, సత్తును అసత్తుగను గాంచును. క్షణకాలములో నశించు విషయ సుఖము దుఃఖమనియు, ఆత్మజ్ఞాన జనిత సుఖము వాస్తవమని జ్ఞానులునమ్ముదురు. 

ముల్లోకముల అనుభవమునొసంగునట్టి, సూక్ష్మశరీర ప్రత్యక్షమును వదలి, ఐహిక మాయాస్వరూపమైన, స్థూలశరీరాదులను, ప్రత్యక్షముగ గ్రహించువాడు మూఢుడు. 

వాస్తవమునకు, జీవులకు సూక్ష్మశరీరమే గలదు అందు స్థూలశరీరమును గూర్చిన వ్యాప్తి అసత్యము. శిలాభావనతోగూడిన వానికి శిలారూపము కన్పించినప్పటికి అది వాస్తవముగ చిద్రూపమైయున్నది. 

మద్యము త్రాగినవానికి, వృక్ష పర్వతాదుల నృత్యము సత్యముగనే నున్నట్లు, అజ్ఞానికి జగత్తు భ్రాంతి సత్యత్వము పొందినది. 
శిలయందలి బ్రహ్మాండమున ప్రవేశించి, అచట బ్రహ్మదేవుని దర్శించి సంభాషించుట.

సశేషం 

🌻. అభ్యాసము, ప్రభావము - 2 🌻

సమాధిద్వారా బ్రహ్మమును దర్శించి అందు పర్వత, నది, లోక, లోకాంతర రూపభ్రమలను గాంచును. విద్యాధరియు, వసిష్ఠుడు సంకల్పముతో ఆ శిలయందు ప్రవేశించెను. 

తదుపరి వారు శిలయందలి బ్రహ్మలోకమును చేరి అచట బ్రహ్మదేవుని యెదుట కూర్చుండి, నాతో విద్యాధరి ఇట్లు చెప్పెను. 

ఓ మునీంద్రా| యీతడే నాభర్త. వివాహనిమిత్తము నన్ను సృష్టించి, వృద్ధాప్యమును పొందెను. ఇంకను వివాహమాడలేదు. కావున నాకు వైరాగ్యము జనించినది. యీతడు కూడ విరాగియై ముక్తి కొరకు సాధన చేయుచుండెను. 

కావున మునీంద్రా నన్ను, నా పతిని తత్వోపదేశముచే ప్రబోధమొనర్చి, బ్రహ్మమార్గమున నియోగింపుము, అని పలికి తన పతిని సమాధినుండి లేపుటకై అతనితో నిట్లు చెప్పెను. 

నాధా| మునిశ్రేష్టులగు వసిష్ఠుడు నేడు మనగృహమునకు విచ్చేసిరి.యీతడు మరొక బ్రహ్మాండమునకు ప్రభువైన బ్రహ్మదేవుని కుమారుడు. వారిని పూజించవలసి యుండును. అని పల్కగ అతడు మెల్లగ కండ్లు తెరచి జాగ్రత్‌ స్థితికి వచ్చెను. అంతట నన్ను, ఆ విలాసినిని గాంచి మధురస్వరముతో నిట్లు పలికెను. 

ఓ మునీంద్రా| తాము ప్రయాణ బడలికచే అలసియున్నారు, ఇచట విశ్రమింపుడు అని పలికి, మణిమయ ఆసనమున కూర్చుండేసి తదుపరి నన్ను పూజింపగ నేనిట్లంటిని. 

ఓ మహాత్మ| ఈ విద్యాధరి తమ ఇరువురకు ప్రబోధమొనర్చుటకునన్నిచ్చటికి గొనితెచ్చినది. అది యుక్తమా| ఏలన తమరు సకల జ్ఞానపారంగతులు, సర్వభూతలములకు ప్రభువులు. ఈమె కామాంధయై యున్నది. 

కాబట్టి ఈమె యొక్క ఉపదేశప్రార్ధన ఉచితముకాదు. కావున ఈమె ఇట్లెందుకు వచించుచున్నదో కారణము తెలియజేయకోరెదను. మహాత్మా| భార్యకొరకీమెను జనింపజేసితిరి. 
అపుడు ఆ బ్రహ్మ ఇట్లనిరి. 

సజ్జనులకు వృత్తాంతమంతయు యధార్ధముగనే వచింపవలయును. నేను కేవలము చిద్రూపాకాశము నుండి ప్రకటితమైన స్వయంభువమను పేరుగలవాడను. యధార్ధముగ నేనుత్పన్నము కాలేదు. ఆవరణరహితుడను, చిదాకాశరూపుడను. 

నీవు నేను వారు, ఈ సంభాషణంతయు, సముద్రమందలి తరంగములవంటిది. నా అంతరంగమున నేను నాది యను వాసన, ఈ కుమారికి, మీకు, ఇతరులకు చైతన్యము కంటే భిన్నముగ భాసించుచున్నది. 

కాని నాదృష్టియందు భిన్నముగనే యున్నది. నేను కేవలము ఆత్మరూపుడనై ఆత్మయందే నెలకొనిఉన్నాను. ఈమె నాసంకల్పముచే దేహరూపిణియై వెలయుచున్నది. ఈమె నాగృహిణికాదు. 

కాని ఈమె బ్రహ్మదేవుని గృహిణియను భావము కల్గియున్నది. ఆమెయే అంతరంగమున సర్వజగత్తు వాసనయగుటచే వ్యర్ధముగ దుఃఖమును పొందుచున్నది. 

వాసనాదేవియొక్క వైరాగ్యకారణమున, జగత్తు ప్రళయము, మిద్యా భ్రమత్వము ఏర్పడుచున్నది. 

ఓ మునీంద్రా| నాయొక్క సంకల్పముచే నా ఆయువు పూర్తియగుచున్నది. నేను కైవల్యస్థితిని పొందదలచితిని. కాని నా వాసనాకల్పితమగు ఈ జగత్తునకు ప్రళయము సంభవించనున్నది. ఈ చిత్తకాశము వీడి బ్రహ్మకాశము పొందిన పిదప, మహా ప్రళయము, వాసనాక్షయము నగుచున్నది. 

అందువలన ఈమె నన్ననుసరించుచు ఈ ప్రళయమున న శింపనున్నది. కమలమలు సరస్సునుండి విడిపోవ, వాటి వాసన లేనట్లే గదా| ఈమె ధారణాభ్యాస యోగముచే మా బ్రహ్మాండమును గాంచగల్గినది. 

ఏ పర్వత గృహమందు జగత్తు గలదో ఈ పర్వతములందు, బెక్కు జగత్తులు గలవు. యోగదృష్టిచే వాటిని గాంచగలము. స్వప్న నగరమువలె ఈ జగత్తు, మిద్యయై, భ్రాంతిరూపమైయున్నది. 

ఏవరీ జగత్తునెరుగుదురో వారికది చిదాకాశమే. తక్కినవారు భ్రమభాసులే. ఆధ్యంత రహితమైనను ఈ చైతన్యము శివాదుల రూపమున దోచుచున్నది. నిరాకారమైనను సాకారముగ కన్పట్టుచున్నది. స్వప్నమునందువలె, జాగ్రత్తునందు చిదాకాశమే తన స్వరూపమును పర్వతశిలలుగ గాంచుచున్నది. 

కావున ఓ వసిష్ఠ మునీద్రా, మీరిపుడు మీబ్రహ్మాండమునకు బొండు. అచట సమాధిద్వారా ఆత్మ సుఖమును పొందుడు. నా చే కల్పించబడిన ఈ జగత్తు ఇపుడు ప్రళయముచే అవ్యక్తమగును. మేము కైవల్యము పొందబోవుచున్నాము. 

ఓ రామచంద్రా| భగవంతుడగు బ్రహ్మదేవుడిట్లు వచించి సమాధియందు స్థితుడయ్యెను. విద్యాధరియు నట్లే ఆకాశరూపిణియైయుండెను. నేనును సమాధియందు స్థితుడనై, చిదాకాశరూపుడనై, యారహస్యమంతయు గాంచితిని. 

ఆక్షణమున అతని సంకల్పము క్షీణింప, దాని ప్రభావమైన పర్వత, సముద్రాది సహిత పృధివి మెల్లగ క్షీణింపసాగెను. బ్రహ్మదేవుడు సమాధియందు నిశ్చలుడైయుండ, పృధివి నీరసమయ్యెను. 

ఇట్లు బ్రహ్మదేవుని విరాట్‌రూపమందలి చైతన్య ముపసంహరింప బడుటచే, ప్రళయమేతెంచి, పృధివి రసహీనమయ్యెను.

 సర్వజంతుజాలము, చైతన్యము కోల్పోయి క్షయమొందెను. సముద్రములు ఉప్పొంగెను. అందు జీవజాలము నశించినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌻. అభ్యాసము, ప్రభావము - 3 🌻

ఓ రామచంద్రా| సమస్త జగత్తు, పరస్పర హితులగుచున్న ప్రాణుల కోలాహలముతోగూడి చిన్నాభిన్నమై శిధిలమయ్యెను. 

అంతట శ్రీరాముడిట్లు ప్రశ్నించెను. 

ఓ మహాత్మ| విరాట్టును, బ్రహ్మశరీరుడును, చైతన్యము యొక్క సంకల్ప, వికల్ప మాత్రమున సృష్టి, స్థితిలయములు జరుగునట్లు తెలియుచున్నది. అట్టి స్థితిలో, సమస్త లోకములు అతనియందు; మరియు అతనియందు బ్రహ్మాండము, సత్యలోకములెట్లు స్థితికల్గియున్నవి అని ప్రశ్నించెను. అపుడు వసిష్ఠుడిట్లు పల్కెను. 

ఓ రామచంద్రా| సృష్యాదియందు ఈ జగత్తు సత్మముకాదు. పిమ్మట,ఆ విశాలమగు సంకల్పరూపమైన మనస్సునందు, అభిమానరూపమగు భావనచే అహంకారము స్ఫురించుచున్నది. కాని వాస్తవముగ నది నిర్మలమై, నాశరహితమైనట్టి చిదాకాశమైయున్నది. తదుపరి చిదాకాశరూపుడై, చిదాభాసుడు ఎట్లు భావించిన అట్లే సృష్టి జరుగును. 

జ్ఞానము యొక్క నిర్మలత్వముచే, ఆ పరమాత్మ స్వసంకల్పిత జగత్తుననుభవించి, పిమ్మట తన ఇచ్ఛచేతనే, దానిని శమింపజేయుచున్నాడు. 

కాన ఓ రామచంద్రా| మనయందెవరికి బ్రహ్మతత్వముయొక్క వాస్తవపరిజ్ఞానము కల్గునో, అపుడతనికి జగత్తు దృశ్యశూన్యమై ఆత్మయే మిగులును. 

కావున ఈ జగత్తు మిధ్యగనే జనించినది, మిధ్యగనే కాన్పించుచున్నది. మిధ్యగనే ప్రియ,మప్రియమగుచు, చిదాకాశమున జగత్తుగా భాసించుచున్నది. 

ఓ రామచంద్రా| సత్యమగు పరమాత్మ అనుభూతము కాగ అనాదియై నిత్యానుభవరూపమై, ఏకమైనట్టి పరబ్రహ్మమేదికలదో, అదియే ఈ దృశ్యమనియు వేరుగ లేదనియు తెలియుచున్నది.

మహాపర్వతముకంటె బ్రహ్మము అతి సూక్ష్మము. స్థూలమైన బ్రహ్మము బ్రహ్మాండముకంటే అతి సూక్ష్మమైనది. 

స్వప్నమందొక జీవాత్మ తన స్వరూపముననే, తన్ను మృతునిగా గాంచునట్లు, తదుపరి ఆ మృతుడే మృతునియొక్క ధ్రష్టయై యాతనిని భిన్నముగ గాంచును. ఈ చిదాకాశమే తన అద్వైతరూపమును ద్వైతముగ గాంచుచున్నది. 

ఈ ప్రకారముగ చైతన్యాణువగు, జీవుని ప్రతిరూపమగు ఆకాశమే ఘనస్థితిని బొంది స్థూలదేహమగుచున్నది. అందు పంచేంద్రియములను నొందుచున్నది. అట్లే సంకల్ప వికల్పములచే మనస్సును, అభిమానముచే అహంకారమును జీవుడు పొందుచున్నాడు. 

ఇట్లు చైతన్యము స్వయముగ, మొదట సూక్ష్మశరీరముగ పిమ్మట దేశకాలవస్తు క్రియావిభాగమును, క్రమముగ జగత్‌ శరీరమగుచున్నది. తదుపరి ఆ చైతన్యాణువగు జీవుడు, హస్తపాదాది చిత్‌కల్పనతోగూడి, స్వయంకల్పితమగు ఆకృతిని వీక్షించుచున్నాడు. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులకును, క్రిమికీటకాదులకును గూడ సంకల్పవశముచేతనే దేహాదికల్పన సిద్దించుచున్నది. కాని యధార్ధముగ నేమియు యుత్పన్నము కాలేదు. మనుజుడు స్వప్నమున సముద్రములు, మేఘములు, యుద్ధములు, సింహగర్జనలతో కూడియున్నను, వాస్తవముగ మౌనముగనే యున్నాడు. 

ఒక పరమాణువు నందు అనేక లక్షలయోజనములు, విస్తీర్ణమైన ముల్లోకములు, మాయచే కన్పించును. చిన్న అద్దమందు పర్వతము కన్పించుచు కదా.

ఈ జగత్తునందు కల్పమువరకు వ్యవహరించునట్టి, సమస్త జీవులయొక్క వాసనలచే అట్టి ప్రధమ బీజము, ఈ బ్రహ్మదేవుడే. ఆ బ్రహ్మదేవుని, శ్లేష్మ, పిత్త వాయువులే చంద్ర, సూర్య వాయువులైయున్నవి. గ్రహ నక్షత్రాదులుగ ఒప్పుచున్నవి. 

ఓ రామ| ఈ జగత్తు సంకల్పరూపుడగు విరాట్‌పురుషుని కల్పనామయమగు శరీరమేయని యెఱుంగుము. మనస్సుచే గల్పింపబడిన పదార్ధము సత్యమైనప్పటికిని కానేరదు. 
బ్రహ్మదేవుడు నిజకల్పిత బ్రహ్మాండమును రెండుగ విభజించెను. 

అందు ఊర్ధ్వభాగము ఆకాశముగను అథోభాగము సృష్ట్యాది లోకములుగను నాతడు కల్పించెను. బ్రహ్మాండము ఊర్ధ్వభాగము శిరస్సు, అథోభాగము పాదములు, మధ్యభాగము పిరుదులుగను ఉన్నది. 

ఈతడు స్వయముగ సర్వేంద్రియ రూపుడైనను, కల్పనామాత్ర జగత్తునందలి సమస్త క్రియలు అతని క్రియలే. ఏలనగా, అతని సంకల్పములే సర్వజీవుల వ్యవహారములు. సమస్త జగత్తు వుత్పత్తి నాశనములే యా బ్రహ్మదేవుని జనన, మరణములని ఎఱుగుము. 

జగత్తు, విరాట్‌,బ్రహ్మము ఒకే అర్ధము కల్గియున్నవి. నీవు ఈ స్థూలదేహమందు, ఎట్లు స్థితిపొందియున్నావో, అట్లే సంకల్పరూపుడగు బ్రహ్మదేవుడు ఈశ్వరునియందు స్థితుడు కాలేడు. 

వృక్షాది స్థావరము నందును తన బీజము నెలకొనియున్నది కదా| ఆ బ్రహ్మదేవుడు బాహ్యమున బ్రహ్మాండుడుగను, అభ్యంతరమున అహం గను, ఆత్మయందు ఆత్మారామునిగను, స్వాత్మయందు విరాజిల్లుచున్నాడు. 

విరాట్‌పురుషుడే కాదు తత్వజ్ఞానులందరు, క్రోధరహితులై మౌనముగ నుందురు. 
బ్రహ్మదేవుడు ధ్యానపరుడు కాగ, ద్వాదశాదిత్యులుద్భవించి, జగత్తునంతయు దహించివైచుట, ప్రళయాగ్ని స్వరూపమును వర్ణింపబడినది. 

బ్రహ్మదేవుడు ధ్యానస్థితుడైనపుడు, పశ్చిమదిశయందు అరణ్యములోని దావాలనమువలె, రెండవసూర్యుడుదయించెను. 

తదుపరి సముద్రమునందలి పగబాగ్నిలె మరొకసూర్యుడు నైరుతిదిక్కుయందు, దక్షిణదిశయందు అగ్నివలెనున్న వేరొకసూర్యుడు, అట్లే ఉత్తరవాయువ్యములందు సూర్యుడుదయించుట గాంచితిని.

సశేషం....

🌻. అభ్యాసము, ప్రభావము - 4 🌻

ఇంతలో సముద్రమునుండి బగబాగ్నివలె వేరొకసూర్యుడు ప్రకటితమయ్యెను. మరియు దిక్కులమధ్య యాకాశమున పదునొకండవ సూర్యుడు, పిదప మరొకసూర్యుడు, ఇట్లు పన్నిద్ధరు సూర్యులుదయించిరి. 

ఈ పదకొండవ సూర్యునియందు, సమస్త సూర్యుల ప్రతిబింబము వలె మరి మువ్వురు సూర్యులుదయించిరి. 

ఆ మువ్వురు సూర్యులు, రుద్రుని శరీరము, అందు మూడునేత్రములు గలవు. అదియే ద్వాదశాదిత్య స్వరూపమై, దిక్కులన్నింటిని అరణ్యములను అగ్నివలె భస్మీభూతమొనర్చినది. తదుపరి గ్రీష్మముదయించి జగత్తును శోషింపజేసెను. 

నేనావేడికి అచటనుండి ఆకాశప్రదేశమున జేరితిని. అచటినుండి, ద్వాదశాదిత్య సమూహమును వీక్షించితిని. అపుడు ఆ వేడికి సర్వ జీవులు, పదార్ధములు కల్లోలితములై , అన్ని దిక్కులకు జనినవి. 

ప్రళయాగ్నియను నటుడు జగత్తును, శిధిల కుటీరమున నృత్యమొనర్చసాగెను. అందు అరణ్యములు, గ్రామములు, నగరములు దగ్ధముకాగ, సర్వ ప్రదేశములు, పదార్దములు, సాగరములు, పర్వతములు, వనములు దగ్ధములైనవి. 

ఆ ప్రళయాగ్నికి కైలాసపర్వతము దహింపకయుండ, రుద్రుడు కుపితుడై దానిని తన నేత్రాగ్నిచే భస్మీభూతమొనర్చెను. ఇట్లు సమస్త జగంబులు, అగ్నులు ప్రకాశింపజేయ, వాయువులు ప్రచండముగ వీచెను.

పశ్చిమదిక్కుయందు, ఊర్ధ్వభాగమున, పుష్కరావర్తములను ప్రళయమేఘములు, దక్షిణమున అగ్ని శమించుట వర్ణింపబడినది. 

ఓ రామచంద్రా| అటు పిమ్మట ప్రళయభయంకరములగు ప్రచండవాయువులు వీచగా పుష్కరావర్తములను మేఘములు ''గులుగులు'' శబ్ధమొనర్చెను. 

అవి బ్రహ్మదేవునిచే బగులగొట్టబడిన బ్రహ్మాండమున గొప్ప ధ్వనివలెనున్నది. ఈ ప్రళయాగ్నియందు మేఘములెట్లు స్థితి పొందినవని విస్మయుడనైతిని. 

పిదప పశ్చిమ దిశనుండి కల్పాంత వాయువు వీచగ, వింధ్య, మేరు, హిమాలయాది మహా పర్వతములును, దానియందు తృణమువలె ఎగిరిపోజొచ్చెను. అగ్ని జ్వాలలతోకూడి ఆ దుష్టవాయువు, రెక్కలతోగూడిన మేరు పర్వతమువలె ఆగ్నేయదిశకు జనుచుండెను. 

పిదప ఆకాశమను బ్రహ్మాండముయొక్క విస్పోటనము''చటచట'', ''గడగుడ'' జలపాతములచే, లోకములను బడగొట్టగల్గిన కుంభవృష్టి గురిసెను. ఆ వృష్టి పృధివిపైగల అగ్నిని కూడి, స్థితిపొందెను. 

ఓ రామచంద్రా, ఆకసమున మేఘముయొక్కయు అగ్నులయొక్కయు సమావేశము గొప్ప ''చటచట'' శబ్ధములచే దిక్కులను పూరించునదై, గొప్ప సంగ్రామమువలె భయంకరమై వెలసెను. 

పుష్కరావర్త మేఘములచే కురియబడిన వర్షదారలచే, శిధిలభూతమై సమస్త సముద్రముల క్షోభచే, వినాశన మొనర్చబడిన జగత్తు; పృధివి, అగ్ని, జలము, వాయువు, ఈ నాల్గు భూతములు మహాక్షోభము చెందగా, ముల్లోకములు అతలాకుతలములైనవి. క్రిందను పైనను తిరుగాడుచున్న, పదార్ధములతో కూడిన ''ఖణఖణ'' శబ్ధములతో మునుగుచున్న పర్వతములు గలదియునగు బ్రహ్మకోటమపుడు వినాశమొందినది. 

ఓ రామచంద్రా| వాయువు, వర్షము, హిమము, ఉత్పాతములు మున్నగు వానిచే భూతము  నశింప, కలియుగమున దుష్ట రాజులవలె, జలవేగము వృద్ధిపొందినది. 

ఆ సమయమున ఆకాశముగాని దిక్కులు గాని, ఊర్ద్వ అథో భేదములుగాని, భూతకాలముయొక్క సృష్టిలేక, కేవలము జలముమాత్రమే యుండియుండెను. 

ఈ జగత్తు వలన స్వప్నము బోధింపబడునట్లు, జగత్తు బాధితముకాగ, ఋషి దేవగణములు సహితము బ్రహ్మదేవుని యందు నిర్వాణము నొందెను. ఆ బ్రహ్మలోకములో సాలోక్యముక్తిని పొందినవారు, పరిజనులు, బ్రహ్మదేవుని గాంచితిని. 

వారితోపాటు శుక్రాచార్యులు భృహస్పతి, ఇంద్రుడు, కుబేరుడు తక్కిన దేవతలు అచట గలరు. ద్వాదశాదిత్యులు వారి వారి స్థితులలో నిమగ్నులైయుండగా, బ్రహ్మదేవుడు అంతిమ సాక్షాత్కారము పొంది,తదుపరి సర్వులు విదేహముక్తినొందిరి. 

బ్రహ్మలోకము జనశూన్యమై అరణ్యమువలె గోచరించెను. వాసనలు నశించుటచే, వారందరు అదృశ్యులై బ్రహ్మమున కలిసిరి. 

స్థూల సూక్ష్మ దేహములు రెండును వాసనాక్షయముచే నశించినవి. వాసనలవలన సంసారమను పిచాచము ఉదయించుచున్నది. 

జ్ఞానముదయించిన పిమ్మట,సమస్త జగత్తును అవాసనయు, పరబ్రహ్మరూపమే అగును. బ్రహ్మజ్ఞానముచే, తత్వజ్ఞులు నిర్వాణమొందుదురు. ఆ జ్ఞానములేనిచో, బంధము ఏర్పడును. 

ఓ రామచంద్రా| నీవు విక్షేపరహిత సుఖముకొరకు వాసనారహితమైన బ్రహ్మస్వరూపములో స్థితి కల్గి బంధరహితుడవు కమ్ము. 

పిదప నేను ఆకాశమునుండి వెడలుచుండగ, ఇంతలో నటనొక భయంకరాకారము,పంచముఖములును, త్రినేత్రములును, దశభుజములు కల్గి ఉగ్రరూపమును, ఏక స్వరూపమును గల్గి భయంకర రూపమును దాల్చినాడు. అతడే రుద్రుడు. 

అతడు ప్రళయ మహాసముద్రమును బానమొనర్చి, మరల తిరిగి ఏ రూపమును ధరింపక, పరమశాంతిని పొందియుండెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌻. అభ్యాసము, ప్రభావము - 5 🌻

అపుడు అచట కేవలము ఆకాశమువలె నిర్మములై నిశ్చములైనట్టి, నీ నాల్గు పదార్ధములు మాత్రమే గన్పించుచుండెను. 

అందులో ఒకటి రుద్రుడు, రెండవది బ్రహ్మాండము యొక్క అధోభాగము పృధివి భాగముగ వ్యాప్తి చెందినది. మూడవది బ్రహ్మాండము యొక్క ఊర్ధ్వభాగము. నాల్గవది బ్రహ్మాండము యొక్క మధ్యనున్న అనంత సర్వ వ్యాపకమైన బ్రహ్మాకాశము. ఈ నాల్గు తప్ప మరేదియు నచట కన్పించుటలేదు. 

ఈ బ్రహ్మాండమున కావల పది రెట్లు విశాలమైన జలము కలదు. పిదప ఆ జలముకంటే పది రెట్లు అధికముగ జ్వాలామయమగు అగ్ని కలదు. తదుపరి అగ్నికంటే పదిరెట్లు అధికము గల శుద్ధ ఆకాశము గలదు. 

ఆ పిమ్మట పరమపవిత్రమైన నిర్మల బ్రహ్మాకాశము గలదు. అది అసత్యమైనను సత్యముగ దోచునట్లు భ్రాంతిచే చిదాకాశమున స్ఫురించునట్టి ఈ జగత్తుయొక్క ఆధారాదులగూర్చిన గణనమొనర్ప ఎవరి తరము. 

ప్రళయమున నృత్యమొనర్చుచున్న, భైరవరుద్రుని గూర్చి, అతని ఛాయయు, జగత్‌రూపిణియు నృత్యమొనర్చుచున్న కాలరాత్రిని గూర్చిన వర్ణన.

ఆ రుద్రుని నిత్యముననుకరించుచు ఛాయ, అతని శరీరమునుండి బయలువెటలుటను నేను గాంచితిని. ఆ ఛాయ నృత్యమొర్చుచు, రుద్ర భగవానుని సముఖమున నిలబడెను. ఆ ఛాయారూపిణి కృష్ణ వర్ణము కలిగి కృశించినదియు, అతిదీర్ఘమైన భయంకర ముఖము గలదియునగు ఆ కాలరాత్రియని గ్రహించితిని. 

విలాసముగ నృత్యమొనర్చుచు, పర్వతము లామెను గాంచి, ఒకప్పుడామె నృత్యము సల్పకున్నను ఆమెయందు వివిధ, వనపర్వతాది సహితమగు జగత్తు నశించి మరల పునర్జన్మ పొంది నృత్యము సల్పుచున్నట్లు వుండెను. ఆమె దేహమను సరోవరమున సమస్త ద్వీపములు తృణమువలె సముద్రములు వలయములవలె, దేవలోకములు కమలములవలె భాసించుచుండెను. 

మరియు ఆ భగవతియొక్క దేహమందు, సృష్టి, ప్రళయ సమూహములు, దినరాత్రులవలె అల్పముగ భాసించుచుండెను. కాని అవ్వన్నియు సత్యము కాదు. ఆ కాళీ, భైరవుల యాకృతులును వాస్తవముగ లేనివేయైయున్నవి. 

అనాదియైన, శాంతమైన బ్రహ్మమే వారిరువురు. ఏ చిన్మయమగు పరమాకాశమును గూర్చి, నీవు వచించితివో, అదియే సనాతనమగు శివుడని పేర్కొనబడినది. 

ఈ శివరూపుడగు పరమాత్మయే, బ్రహ్మ, విష్ణు, చంద్ర, సూర్య, ఇంద్ర, వరుణ మున్నగు రూపముల ధరించుచున్నాడు. అవిధ్యచే పరమాత్మయే, ఇట్లు స్ఫురించుచున్నాడు. 

జీవుడెంతవరకు, తన స్వరూపము నెఱుంగకుండునో అంతవరకు నాతడు సంసారమను మహాసముద్రమున, జనన మరణాది భ్రమణములుగ కల్పన గావించుచుండును. 

ఓ రామచంద్రా| జ్ఞానము కల్గుగా ఈ జీవుడు తరంగరహిత సముద్రమువలె శాంతినొందును. ఆ భైరకాకారుడు శివుడు, కాళీ భగవతియు చిన్మాత్ర స్వరూపులేయని, ఆయాకృతులు వాస్తవముగ సత్యములు కావలని బోధకొరకై కల్పనాదృష్టిచే వారట్లు భాసించుచున్నారు. 

వాస్తవముగ ఆ భైరవులు, ప్రళయములు గాని లేవు. అదియంతయు భ్రాంతియే. చైతన్యమెచ్చటగలదో, అచట స్వభావముగనే స్పందన ధర్మము కల్గియుండును. 

కావున ఓ రామచంద్రా| భయంకరాకృతి దాల్చి నృత్యము సల్పునట్టి శివరూపుడగు రుద్రుడు, చిద్ఘనముయొక్క స్పందనయే యగును. స్వప్నమందు, చిత్‌స్వరూపమే నగరాదుల రూనమును ధరించుచున్నది. అచట అవి లేవు. 

అది చిదాకాశమే అయి వున్నది. కావున వాస్తవముగ నిక ద్వైతముగాని, ఏకత్వముగాని, శూన్యత్వముగాని, చైతన్యముగాని, మౌనముగాని, లేవు. కేవలము చిన్మాత్రయే యగును. 

ఓ రామచంద్రా| సమస్త వాజ్మయ ప్రపంచమందును నిర్వికల్ప సమాధియే సిద్ధాంతమైయున్నది. ఆ భైరవుడు చిదాకాశమగు శివరూపుడని చెప్పబడుచున్నాడు. ఆ కాళికాదేవి అతనికంటే వేరుకానిదిగను, అతని స్పందనశక్తిగను, మనోమయ రూపిణిగను ఎఱుగుము. 

నిరాకారమైన శివుని ఇచ్ఛయే ఈ జగత్తును నిర్మించుచున్నది, మరియు సర్వజీవుల యొక్క జీవహేతువగుటచే,ఆ ఇచ్ఛారూపములగు బీజాకాశములను తనయందు ధరించి వాని యుత్పత్తి పాలనాది క్రియలు సల్పుచున్నది. అద్దములందలి ప్రతిబింబమువలె, బ్రహ్మ పదార్ధములు పూర్వ వాసనాది కారణములచే, చైతన్యమున సత్యరూపములుగనే ప్రతిబింబములై యున్నవి. 

భూత భవిష్యత్‌ వర్తమానములందలి పదార్ధ స్వరూపము, స్వప్న సంకల్ప నగరాదులును, సమస్తము ఆయా దశలందు సత్యమే అగును. అట్లు కానిచో ఆత్మ తత్వము సర్వరూపమెట్లగును. 

కావుననే యోగులు, ఇతర స్వప్నము లందు ప్రవేశించియు, పరకాయ ప్రవేశాదులద్వార, యా మనుజుల మనోభావము పొంది, అనుభవించు చున్నారు. స్వప్న పురము ఇపుడు సత్యము, ఎపుడు మిధ్య, ఎపుడు నశించినది, ఎపుడు స్థితిపొందినది. 

వాస్తవముగ చైతన్యమందు నేను, జగత్తు ఇత్యాది వ్యవస్థలేదు. ఇదంతయు భ్రాంతియే. చిత్‌ స్వరూపమును తెలుసుకొన్నచో ఈ భ్రాంతి శమించిపోవుచున్నది. 

అట్లు నృత్యము చేయుచున్న దేవి, శివుని గాంచి యాతనిని స్పృజించి ప్రేమచే నాతని శరీరమందు లయించి, ఏకీభావముపొందెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 41 🌴

🌻. అభ్యాసము, ప్రభావము - 7 🌻

సంకల్ప మనోరాజ్యము వలె జగత్తు అసత్తేయగుచు, హృదయమున వ్యాపించియున్నది. ఆకాశమువలె, పృధివియందు వివిధ సృష్టులు కలవని యోగదృష్టిచే నేనెరుగితిని. 

అట్లు జీవునియొక్క బుద్ధిలో తాదాత్మ్యముపొంది దీప పర్వత సమస్త పదార్ధములు నాయందు అద్దములోవలె ప్రతిబింభించినవి. 

భూతలమున, నచట నున్నవి, నాచే వీక్షింపబడిన విశేషములిచట వర్ణించబడినవి.

ఒకచోట, పతిపుత్రాదుల మరణముచే నేడ్చుచున్న స్త్రీల రోదనలు, ఒకచోట స్త్రీ నృత్యగానాదులు, ఒకచోట క్షామమున నేడ్చుచున్న జనులు, ఒకచోట ధాన్యాగారములు, ఇంకొకచోట అగ్నిదమనములు, పక్షుల, జంతువుల సమూహములు, చీమలు, దోమలు; ఇట్లు నా భూతల శరీరమును అనుభవించితిని. ఇవన్నియు నాయొక్క మనోవికారములగుటచే మానసికములే గాని రూపములు గావు. 

ఈ విధముగ భూమండలము నా యొక్క సంకల్పము మాత్రమై మనోమయమై ధారణాభ్యాసముచే పరిపూర్ణమైనది. ఇది చిదాకాశమైనను, తన స్థూలరూపముచే చిరకాలమున్నది. 

చిరకాలాభ్యాసముచే ఈ జగత్తంతయు స్థిరముగనున్నది. స్వప్నమందు చైతన్యము, నగరాదులరూపమున భాసించునట్లు, సృష్ట్యాదియందు చైతన్యమే జగత్తు రూపునొందినది. 

ఓ రామచంద్రా| జనన మరణ రహితమైన, చిన్మాత్రయైన పరమాత్మతత్వమే, అజ్ఞాన దశయందు తన ఆత్మరూపమును త్యజింపకయే, అనేక చరాచర ప్రపంచములను గాంచుచున్నది. 

పృధివియందనేక జగత్తులు గాంచుట, జలధారణచే సంపూర్ణజల లీల దర్శించబడుట. పర్వత శిలలందనేక రెట్లు బ్రహ్మాండము లేవిధముగ గాంచితినో అటఈ భూమియందు, సర్వత్ర అనేక జగత్‌ సమూహములుండి యుండును. 

సర్వత్ర జగంబులు, సర్వత్ర బ్రహ్మము కలదు. సృష్టికి పూర్వము అహంకారాది జగత్తు చిదాకాశమే. సృష్ట్యానంతరము చిదాకాశమున కల్పించినను, నయ్యది స్వప్నపురమువంటిదే అగును. 

పృధివి యందెట్లు అనేక జగంబులున్నవో, అట్లే జలమందును అనేక జగంబులు కలవు. నేను జలరూపము పొంది ''గులగుల'' శబ్ధము గాంచితిని. 

జలపానము చేసినపుడు, ఆ జలము నోటనుండి హృదయమున ప్రవేశించి అన్నిభాగములకు ప్రసరించితిని. పిపీలకాది అతిసూక్ష్మశరీరులందు, నాడులందు పరమ సూక్ష్మమైన జలరూపముతోటి, సర్వరూపుడగు బ్రహ్మదేవునివలెనుంటిని. 

మధు రసాదిరూపములు ధరించి, నేను జిహ్వాది యొక్క పరమాణువులతో కలసి, వాటి అనుభవమును పొందితిని. ఇదియంతయు మోహానుభవమగును. అట్టి దశయందు పరమాణువులందు సంపూర్ణమైన జగత్తును గాంచితిని. 

అరటి పట్ట వలె ఒకదానిలోనొకటి వర్తించుచున్న లక్షల కొలది బ్రహ్మాండములను, వాని అనేక నాశోత్పత్తులను నేనచట గాంచితిని. 

తేజముయొక్క ధారణచే, సూర్యచంద్రాగ్నులను గాంచితినని వసిస్ఠుడు పల్కెను. 


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 42 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 8 🌻

తేజోరూపుడనై, అనేక దశల విహరించుచు, జిహ్వాదులద్వారా, ప్రతి గృహమందు సమస్త జీవులందు సమస్త లోకములను ప్రకాశింపజేయుట యందు, సూర్యచంద్రాదుల కిరణములచే అంధకారమును తొలగించుట గాంచితిని.

ఆ ప్రకారము, సర్వపదార్ధములను ప్రకాశింపజేయునదియు మరియు ధాతువులందు సువర్ణము, మనుజులందు పరాక్రమము, మెరుపులు, దావాలనమువలె కనిపించినది.

ఎపుడీ దృశ్యమంతయు నాకు నిరామయమగు బ్రహ్మరూపమే అగునో, అపుడు బ్రహ్మరూపస్ధుడనగునేను నవ్విధముగ గాంచితిని.

ఈ విధముగ తేజోరూపములో నేను పరమాణువు యొక్క దేశమందును, అనేక జగత్తులను గాంచితిని.

అవియును, జగత్తు చిదాకాశముకంటే భిన్నములు కావు. అట వాయుధారణచే వాయురూపమొంద, అద్దాని కర్మయొక్క విస్తారము; పిదప ఆకాశధారణచే ఆకాశరూపముగ స్వయంలో స్థితినొందుట వర్తించబడినది.

వాయుధారణ ద్వారా వ్యాపించి విస్తరించిన వాడనై, లతలను, కమల, వుత్పల, కుందాది పుష్ప సమూహముయొక్క సుగంధముల నాస్వాదించితిని. శీఘ్రముగామియగుటచే, అవయవరహితమైనను సర్వావయవములందు యున్నది.

సంచలనముచే చందనవనమునకు ఆనందమును గొల్పునది, సమస్త శబ్ధములలో సోదరునివంటిదియగు వాయువునందు, ప్రతిసూక్ష్మాణువునందు అనేక జగత్తులను నేను వీక్షించితిని. ఆ జగత్తులందు, వివిధ రూపధారిణినై నేనే యుంటిని.

ప్రతి పరమాణువునందు సృష్టిసమూహములు చలించుచుండెను. తదుపరి ఆకాశరూపములో ప్రతి పదార్ధములోను,ప్రతి అణువు పరమాణువునందును ఆకాశమునందు నేను గాంచితిని.

ఇట్లు సమస్త ప్రదేశములందు, పంచభూతములందు సర్వరూపమైయున్నప్పటికిని, నేను చిన్మాత్రుడనై యుంటిని. ఈ విధముగ పంచభూతములందు చైతన్యమువలె నుంటిని.

ఆహా| మాయయొక్క ప్రభావము అమోఘము. ఆకాశమందలి ప్రతి పరమాణువునందు అసంఖ్యాకములగు జగములు గాంచితిని. ప్రతి పరమాణువునందు ఆకాశము గలదు.

అట్లే ప్రతి ఆకాశపరమాణువునందు అసంఖ్యాక జగములను గాంచితిని. యధార్ధముగ అనంతమైన, సద్రూపమగు బ్రహ్మమే గలదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ