భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 17 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 5 - మూడవ భాగము 🌻
దామోదర్ గారు శ్రీధరునికై భోజన ఏర్పాట్లు గావించారు. ఆయన ప్రతీరోజూ స్వయంగా వంటచేసి తినేవారు. ఆయన భోజనంలో అన్నము, ముద్దపప్పు, నెయ్యి, పాలు, పెరుగు, ఒకటి లేదా రెండు కూరలు ఉండేవి. కానీ ఆరోజు శ్రీధరుడు తపస్సుకు వెళ్లేరోజు కావడంచేత వీటితోపాటు పాయసం, కేసరి ఇత్యాది వంటలు కూడా చేశారు. దామోదర్ పళంటీకర్ ద్రుష్టిలో ఇదే చివరి పండుగ. ఆయన ఆ తరువాత 12 సంవత్సరాలు ఎట్టి మృష్టాన్న భోజనము చేయలేదు. శ్రీధరుడు తపస్సుకు వెళ్ళటం వలన అది అతని శరీరమునకు శిక్ష అగుటచేత ఆయన తనవంతు దీక్షగా అప్పట్నుంచి రాబోయే, ఏ పండుగదినాన 12 సంవత్సరాలు మృష్టాన్నభోజనం చేయనని ప్రతిజ్ఞ పూనారు. శ్రీధరుని తపస్సు ఫలించి యశస్సు కలుగుటకుగానూ ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. మంచి పనులకుగాను సహృదయుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది అనేదానికి ఇది ఒక తార్కాణం.
భోజనాలు జరుగు తున్నాయి. కానీ శ్రీధరుని మనస్సు అందు లగ్నం కాలేదు. ఆయన మనసెప్పుడో సజ్జనగడ చేరుకుంది. దామోదర్ గారింట్లో జరుగుతున్న విందుకు మరికొందరు కూడా వచ్చారు. వారిలో ఒకరు శ్రీధరుని తపస్సు విషయం తెలిసి దామోదర్ గారితో ఇలా అన్నారు. గురువు లేకుండా మంత్రోపదేశం కాదు. మంత్రోపదేశం కాకుండా దీక్ష సఫలం కాదు. కావున శ్రీధరునికి గురువెవరు? గురువులేని పారమార్ధిక ప్రయత్నం ఫలశూన్యమవుతుంది. శ్రీధరుడు గురువు విషయంలో ఏమి చేస్తాడు?.
దీనికి దామోదర్ గారు ఈ విధంగా జవాబిచ్చారు. గురువు తనముందు సాక్షాత్ శరీరంతో లేకపోయినా కూడా మంత్రదీక్ష తీసుకొనవచ్చు. ఆ పద్ధతి ఇలా ఉంటుంది అని వివరించసాగారు. ఈ సమర్ధరామదాస స్వామి ఫోటో ముందు త్రయోదశాక్షరీ మహామంత్రమైన "శ్రీరామ జయరామ జయ జయరామ" అనే మంత్రాన్ని ఒక కాగితముపై వ్రాసి ఆ ఫోటో ముందు ఉంచవలెను. మరల తను చెవినుంచి మూడుమార్లు ఆ మంత్రాన్ని అనిన శ్రీసమర్థుల వారి అనుగ్రహంతో ఆయన గురువుగా మంత్రోపదేశం చేసినట్లవుతుంది. ఈ విధంగా మంత్రదీక్షను తీసుకొని తపస్సు చేయవచ్చును.
శ్రీధరుడు ఏకాగ్రచిత్తముతో దామోదర్ గురువుగారి ముఖాన్ని తదేకంగా, ఇంకా ఏమైనా ఉపదేశిస్తారేమోనని జిజ్ఞాసతో చూస్తున్నాడు. భోజనం కార్యక్రమం పూర్తయిన తరువాత దామోదర్ గారు ఇలా అన్నారు. "రేపు దశమి తిథి ఉన్నది, కనుక రేపు ఉదయం బన్నేశ్వర దేవాలయములో స్నాన సంధ్య పూర్తి చేసుకొని శ్రీసమర్థుల వారి నుండి ఉపదేశము పొందాలి" అని అన్నారు.
అంతలో మధ్యాహ్నము అయింది. శ్రీధరుడు బయలుదేరడానికి సర్వ సన్నాహాలు పూర్తయ్యాయి. దేవ దర్శనం అయింది. దామోదర్ గురువుగారికి నమస్కారం చేసినాడు శ్రీధరుడు. ఆయన హృదయం ఆనందంతో పెల్లుబికింది. ఆయన హృదయాంతరాళములలో నుండి ఈ పదాలు వెలువడ్డాయి.
"పూర్వం ఋషులు, మునులు, పయనించిన పథంలో మీ (శ్రీధరుడి) జీవనం సాగాలి. జ్ఞాన వైరాగ్య భాస్కరుని వలె ఈ సర్వజగత్తును ప్రకాశింపచేయండి, యశస్సు పొందండి!" అంటూండగానే ఆయన స్వరం గద్గదమైంది. మాటలు రావడం కష్టమయింది. ఆవేదనతో గొంతు మాట రాలేదు.
ఆయన కొన్ని రూపాయలను శ్రీధరుని చేతిలో ఉంచారు. దారి ఖర్చులకు ఉపయోగపడతాయి అని అన్నారు దామోదర్ గారు.
"ఇప్పుడు డబ్బు అవసరమేముంది? కడవరకూ నడచి ప్రయాణం చేస్తాను" అని అన్నాడు శ్రీధరుడు.
దామోదర్ గారు శ్రీధరుడిని, "మంచి లౌకికమైన కీర్తి సంపాదించుకుని ధన్యులు కండి" అని మరొక్కమారు ఆసిర్వదించారు.
"వస్తాను!" అని శ్రీధరుడు బయలుదేరాడు.
అధ్యాయం - 5 సమాప్తం.
తరువాయి భాగము రేపు చదువుకుందాం....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 15 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 5 - మొదటి భాగము 🌻
శ్రీధరునికి 18 సంవత్సరాల వయస్సు వచ్చినది. తన మనసులో అవతార ప్రకటన చేయవలసిన సమయం ఆసన్నమయిందని తలచాడు.
తపస్సు చేయక తను అవతార ప్రకటన చేసిన అది ప్రజలకు మార్గదర్శనం కాదు అనుకుని తన మనస్సులో ఇంకా ఇలా అనుకున్నాడు. బ్రహ్మదేవుడు కూడా సృష్టికి ముందు తపస్సు చేసి శక్తి సంపాదించిన తదుపరి సృష్టి నిర్మాణం ప్రారంభించాడు.
ఆయన నారాయణునిని దర్శనం పొందిన తరువాతనే ఆ సృష్టి కార్యక్రమమునకు నాంది పలికాడు. నేను కూడా తపస్సు చేసి ప్రపంచమునకు చూపించవలెను. 'నేను ఎవరు?' అనే విషయం ఈ ప్రపంచమునకు అవగతమవుతుంది అని తన మనస్సులో దృఢంగా నిశ్చయించుకున్నాడు.
శ్రీధరుడు మధుకరమునకు వెళ్ళునపుడు శ్రీభగవద్గీత ప్రథమాధ్యాయము ప్రారంభించేవాడు. మధుకరి ముగించి ప్రదక్షిణ నమస్కారములు, నైవేద్యము, ఉపాసన పూర్తయ్యే సమయమునకు 18వ అధ్యాయముతో సహా పూర్తి చేసేవాడు. ఇది చూసే ప్రజలు ఆయనను పూజ్యభావంతో చూసేవారు.
హైదరాబాద్ లో ఉన్న సమయంలోనే శ్రీధరుడు కీర్తన, పురాణ ప్రవచనములకు వెళ్ళేవాడు. చదువు మీదా ఆసక్తి తగ్గుతూ వచ్చింది. బాపాటి శాస్త్రి గారి ఆచార గురుకులంలో జరుగు ఉపనిషత్ పాఠ్య అంశములను మాత్రం శ్రద్ధగా వినేవాడు. శ్రీధరుడిని చూసిన శాస్త్రి గారు గురుకులంలో చేరమని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించేవారు.
అయితే "నేర్చుకున్న విద్య ఎంత వచ్చింది? దాని ఉపయోగమేమి? దాని వలన తమ కార్య నిర్వహణ ఎంతవరకు సాధ్యపడుతుంది? శాస్త్రాధ్యయనం వలన శబ్ద పద ప్రయోగాదులయందు తనను తాను బంధించుకొనుట తప్ప మరేమీ లేదు.
ఆనంద ఘన పరబ్రహ్మ అనన్య విరచితమైనది. అది కార్యకారణ, నిశ్చల, నిర్వికల్పమైనదిగా ఉండేది. అట్టిదాని ప్రాప్తి కొరకు తను ముందుగా ఆత్మనిష్ఠుడుగా తయారవాలి అని శ్రీధరుడు తలచేవాడు.
వ్యాధిగ్రస్తుల్ని, వృద్ధుల్ని, పేదలను ఆదుకోవడం శ్రీధరునికి ఎంతో ఇష్టం. శ్రీధరుడు తన స్నేహితులతో, ఆత్మీయులతో తన జీవన లక్ష్యాన్ని ఈ క్రింది విధంగా చెప్పేవారు.
"నన్ను చూచిన వెంటనే సర్వధర్మాల వారు ఈయన మన గురువు అని అనుకోవాలి. నేను అందరి ఆత్మలలో ఉంటాను. నేను ఈ జగత్తును ఉద్ధరిస్తాను. నా దర్శనం అందరికీ దివ్యానుభవాలను కలిగిస్తుంది."
ఈ మాటలు విన్న మిత్రులు అయితే నీవు ఒక పెద్ద పరమహంసవి అవుతావు అనేవారు. అపుడు మా జ్ఞాపకం అన్నా వస్తుందా? నీకు అని అడిగారు. దానికి సమాధానముగా శ్రీధరుడు ఇలా అన్నాడు.
"వేలకు వేల నా ఛాయా చిత్రములు నా ముందుంచిన వాటిని నీచోచ్ఛభావన లేకుండా అన్నింటియందున్నది నా మూర్తి అనే భావనతో ఎట్లు చూస్తానో అదేవిధంగా చిన్నవారు, పెద్దవారు అనే భావన నాలో ఉండదు. వ్యతిరిక్త భావములు ఉండనే ఉండవు. శ్రేష్ఠులు, కనిష్ఠులు అనే భావన అసలుండదు. అట్టి ఆత్మభావ ప్రాప్తి తపస్సు వలన మాత్రమే కలుగుతుంది".
తరువాయి భాగము రేపు చదువుకుందాం...
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 13 🌹
✍️. సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 4 - రెండవ భాగము 🌻
పూనాలో 'విద్యార్థి ప్రసాద' నిలయము యొక్క నియమములు బహు కఠినమైనవి. వాటిని శ్రీధరుడు మంచి సంతోషంతో ఆచరించేవాడు. కొద్ది కాలంలోనే ఆ నిలయము వాళ్ళు శ్రీధరుడి ప్రవర్తనను చూసి మెచ్చుకుని, నిలయము యొక్క కొన్ని బాధ్యతలను అప్పగించారు.
సాయంత్రం మరియు వ్యాయామ సమయాలలో శిస్తు వసూలు చేయు పని శ్రీధరునికిచ్చారు. ఇదీ కాక అనారోగ్యముపాలైన తన తోటి విద్యార్థులకు సేవచేయు పని చాలా ప్రేమతో చేసేవాడు. అందువలన శ్రీధరుడు అచ్చట గల అందరికీ ప్రేమపాత్రుడయ్యాడు.
శ్రీధరుని పరోపకార తత్త్వాన్ని, నిస్వార్ధనైజాన్ని చూసి అందరూ 'స్వామి' అని పిలిచేవారు. అనాధ విద్యార్థి గృహ కార్యక్రమములు మరియు అనారోగ్య విద్యార్థి శుశ్రూషలలో శ్రీధరుని చదువు మందగించింది. దీని ఫలితంగా అతను పరీక్ష తప్పాడు.
ఈ వసతి గృహ నియమానుసారం పరీక్షలో తప్పిన విద్యార్థికి అందులో నివశించే హక్కు ఉండదు. కానీ శ్రీధరుని సత్ప్రవర్తన వలనను, అందరికీ సేవ చేయుట, మరియు అదనపు కార్యభారం వలనను పరీక్ష తప్పటం జరిగింది.
అందువలన అతని విషయంలో కార్యవర్గం తమ నియమాన్ని మార్చి అక్కడే అదే నిలయంలో ఉండడానికి శ్రీధరునికి అనుమతి ఇచ్చారు. కానీ ఆత్మ గౌరవం గల శ్రీధరుడు తన కొరకు విద్యార్థి గృహ నియమాలను మార్చుటకు ఇష్టపడలేదు.
అందువలన అతను పూనాలోని సదాశివపేట యందున్న నరసోబాన దేవాలయంలో ఒక గదిని అద్దెకు తీసుకొని అచ్చట ఉండసాగాడు.
ఇప్పుడు శ్రీధరుడు పరిపూర్ణ స్వతంత్రుడైనాడు. అతనివద్ద జీవనానికి, భోజనమునకు, బట్టకు, చదువుకు సరిపోయేంత ధనము ఉంది. అతను తెల్లవారుజామున నిద్రలేచి గోమయముతో తన గదిని శుభ్రం చేసుకొని, స్నానము ముగించి తదుపరి సూర్య నమస్కారములు, జపం నిర్వహించేవాడు.
వీటి వలన అతని మనస్సు ఎంతో సంతోషంతో ఉండి, అతని శరీరము దృఢంగా తయారయింది. శ్రీధరుని తండ్రి జీవించి ఉండగానే కొంత సొమ్మును వడ్డీకి ఇచ్చారు. ఈ వడ్డీ శ్రీధరుని నిత్యావసరములకు, చదువుకి అయ్యే ఖర్చులకు సరిపోతుంది.
శ్రీధరుడు ప్రతీరోజూ 'ఖానావళి' అనే హోటల్ కి భోజనానికి వెళ్ళేవాడు. అచ్చట అతను భోజనానికి మడిగా కూర్చునేవాడు. కానీ ఆ ఖానావళికి వచ్చే ఒక వ్యక్తి శ్రీధరుడిని చూస్తూ హేళనగా వంట మడిగా చేసింది కాదు. నీవు మడిగా కూర్చుని భోజనం చేయడం వలన ఏమి ప్రయోజనం? అన్నాడు.
అందుకుగాను శ్రీధరుడు "వంట మైలగా చేసినా, నేను స్వచ్ఛంగా మడితో తినడం వలన నా నిష్ఠను, నా ధర్మాన్ని నేను పాలించిన వాడినవుతాను మహారాజా!" అని సున్నితంగా సమాధానమిచ్చాడు.
కొద్దిరోజులలో శ్రీధరుడు ఖానావళి హాటల్ కి వెళ్లి భోజనం చేయడం మానేశాడు. అతణ్ణి ప్రేమించే జనులు అతనికి వార భోజనం ఏర్పాటుచేశారు. కొన్నిరోజులు వారాన్న భోజనం చేశాడు. వారన్న భోజనమనగా వారములో ప్రతిరోజూ ఒక్కొక్కరింటికి వెళ్లి భోజనం చేయవలెనన్న మాట.
అదీకూడా అతనికి నచ్చలేదు. అందువలన అదీ కూడా శ్రీధరుడు మానివేశాడు. సదాశివుడు భిక్ష స్వీకరిస్తాడు. దత్తాత్రేయస్వామి భిక్ష తీసుకొంటాడు. ఆయన అంశ సమర్థుల వారు భిక్ష చేశారు.
అందువలన మధుకరమునందు తప్పులేదు అని నిర్ణయించుకొని మధుకర వృత్తిని స్వీకరించాడు శ్రీధరుడు. ఈ నిర్ణయాన్ని తెలిసిన జోగులేకర్ అనే గృహస్థుడు మేము నీకు భోజనం పెట్టుటకు సిద్ధంగా ఉన్నాము.
కనుక నీకు భిక్షావృత్తి ఎందుకు? అని ప్రశ్నించారు. "సుఖము లభించినా, అసౌకర్యాన్ని ఆపేక్షించడమే విరక్త లక్షణము" అని సమాధానమిచ్చాడు శ్రీధరుడు.
తరువాయి భాగము రేపు చదువు కుందాము....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 14 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 4 - మూడవ భాగము 🌻
సుమారు 60 సంవత్సరాల క్రితం మధుకర వృత్తిచేసిన అనేకమంది విద్యార్థులు పూనా నగరంలో కలరు. కానీ ఈ కాలంలో మధుకర వృత్తి చేసి చదువుకోవడం అంటే ఒక వింత.
అదీగాక హోటల్ కి వెళ్లి భోజనం చేయగల ఆర్ధికస్తోమత ఉండి కేవలం ధర్మ ఆచార రక్షణ కొరకు జోళి పట్టిన శ్రీధరుడుని చూసి అందరూ ఆశ్చర్యము చెందారు. భిక్ష కొరకు వెళ్లిన గృహాల ముందు ఆ గృహస్థుల పరుషవాక్యాలను సహించే ఓర్పు కూడా ఉండాలి.
శ్రీధరుడు భిక్షకు వెళ్ళగా ఒక గృహిణి అతనిని చూసి -
"ఒరేయ్! మూర్ఖుడా! నీకేం తక్కువ? మంచి బలంగా ఉన్నావు. ఏదైనా పనిచేసి సంపాదించుకోవచ్చు కదా! రోజూ వచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఓం భవతి... ఓం భవతి... అనే సుశబ్దాలను తలుపు దగ్గర నిల్చుని మాకు చెవులు చిల్లులు పడేలాగా అరుస్తావు?" అంది.
శ్రీధరుడు ఆమె మాటలను ఓర్పుతో విని, తన కార్యక్రమంలో భాగంగా తర్వాత గృహానికి వెళ్ళిపోయాడు. కానీ మరునాడు కూడా అదే ఇంటికి వెళ్ళి తన నిత్య కార్యక్రమంలో భాగంగా "ఓం భవతి - భిక్షం దేహి" అని శాంతస్వరంతో పలికాడు.
ఆ స్వరం విన్నంతనే ఆ గృహిణి భద్రకాళిలా హుంకరిస్తూ బయటకు వచ్చింది. నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టింది. శ్రీధరుడు ఏమీ మాట్లాడకుండా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ప్రతిరోజూ ఆమె ఇంటికి వెళ్లడం - భిక్ష అడగటం మాత్రం మానలేదు.
ఇలా కొన్నిరోజులు గడిచాయి. ఒకరోజు ఆ ఇంటి యజమాని "నాయనా నీ పేరేమి?" అని అడిగాడు. "నన్ను శ్రీధరుడు అంటారు. నా ఇంటి పేరు దేగులూరుకర" అని నమ్రతతో సమాధానమిచ్చాడు.
"ఏమి నాయనా ఈమె రోజూ నిన్ను కఠిన పదాలతో దూషిస్తోంది. అయినా నీవెందుకు రోజూ ఈ ఇంటికి వస్తావు?" అని అడిగాడు.
శ్రీధర్ : కారణం - నా కర్తవ్యపాలన
గృహస్థు : కర్తవ్యపాలన అనగా నీ ఉదరపోషణే కదా! దీనిలో కర్తవ్యపాలనేముంది?.
శ్రీధర్ : ఉదరపోషణకు కావలసిన వసతి ఉంది నాకు. కానీ బ్రాహ్మణ ధర్మం మధుకరం చేయుట. దానిని పాలించుటకు మాత్రమే నేను ఈ వృత్తి స్వీకరించాను.
బ్రాహ్మణాది ముఖ్యదీక్షా
మూగితలి పాహిజె భిక్షా
ఓం భవతి యా పక్షా రక్షితే పాహిజే
శ్రీధరుడు పై శ్లోకమునుచ్చరించాడు. అంతలో కఠినురాలైన ఆ గృహిణి వెలుపలికి వచ్చి భర్తను మరియు తేజోవంతుడైన ఆ బాలుడ్ని చూసి స్తంభించింది.
చూశావా? నీవు ఎంత కఠినమైన మాటలన్నా కూడా అతను విసుగు లేకుండా పైగా నిన్ను ఏమీ అనకుండా ఎంతో శాంతంగా వచ్చి తన కర్తవ్యాన్ని పూర్తిచేస్తున్నాడు. నీ పాలిట భగవంతుడు అతను. మామూలు భిక్షకుడు అనుకొని నీ దుష్ట పదాలను అతని జోళిలో వేసి పాపము మూటకట్టుకున్నావు కదా! అన్నాడు ఆమె భర్త.
ఆమె పశ్చాత్తాపంతో పరితపించి పళ్ళెమునిండా పదార్ధములతో వచ్చింది. అందుండి కొద్దిగా స్వీకరించి ముందుకు కదిలాడు. అంత ఆమె ఇకపై మా ఇంటికి ఎప్పటికీ భిక్షకు రావాలిసుమా! అనగా శ్రీధరుడు ఆ తరువాత ఇంటికి వెళ్ళాడు.
ఈ విధంగా శ్రీధరుడు తన కర్తవ్య ధర్మపాలన సాగిస్తూ విద్యాభ్యాసం కావించెను.
శ్రీధరుడు మధుకరము ద్వారా తన తోటి బీద విద్యార్థులను పోషించేవాడు. పరోపకారి అయిన శ్రీధరుడు తనతోటి విద్యార్థులకు భోజనం పెట్టుటకు 10-20 ఇళ్లల్లో భిక్ష చేయవలసి వచ్చేది.
అందువలన అతని కాలం అందులో గడచిపోవుట వలన విద్యలో అలక్ష్యం జరిగేది. బీద విద్యార్థుల ఫీజు కట్టడం, వారికి పుస్తకములు ఇవ్వడం అనే పనులు చేసేవాడు.
అధ్యాయం - 4 సమాప్తం
తరువాయి భాగము రేపు చదువుకుందాం..
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 11 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 3 - 2వ భాగము 🌻
శ్రీధరుడు చేసిన ఈ అమృతప్రాయమైన ఉపదేశమువలన తల్లి కమలాబాయిలో ఎంతో విచిత్రమైన మార్పు కలిగి ఊరడిల్లి, మనఃశాంతిని పొందింది. పుత్రుని వాక్యాలు ఆమె హృదయంలో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి. తన కుమారునిలో ఏదో అలౌకిక శక్తి ఉన్నదని ఆమెకు ఈ సంఘటన తరువాత అనిపించింది. అప్పటినుండి ఆమె శ్రీధరుడిని కేవలం కుమారుడిగానే కాకుండా ఒక మహాత్మునివలె చూసేది.
త్రయంబకుడు మరణించిన కొన్ని నెలల వ్యవధిలోనే శ్రీధరునికి అత్యంత ప్రియమైన సోదరి గోదావరిని కాలపాశం హరించింది. విధివశాత్తు అక్క గోదావరి కూడా శ్రీధరుడికి దూరమయ్యింది. త్రయంబకుని మరణానంతరం కమలాబాయి అంతఃకరణలో మార్పువచ్చి ఆమె ఆధ్యాత్మికముగా ఎంతో నిలదొక్కుకుంది. అందువలన తన కుమార్తె మరణం ఆమెను అంతగా కదిలించలేకపోయింది.
కానీ యమపాశం అంతటితో తృప్తి పడ్డట్టు లేదు. దానికి మరోక బలి కావలసి వచ్చింది. అది ముందు రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో తీసుకుంది. ఈ అఘాతము మరింత దారుణమైనది. ఎవరి ఛత్రఛాయలో శ్రీధరుడు 12 సంవత్సరాలు వరకు పెరిగాడో ఆ తల్లి కమలాబాయిని కూడా కాలుడు బలి తీసుకోవటానికి సిద్ధపడ్డాడు.
కమలాబాయి దుఃఖానికి దుర్ఘటనపై దుర్ఘటనలు కారణం కాసాగాయి. ఆమె కుమారుని కోల్పోయిన కొన్ని నెలల్లో కుమార్తె గోదావరిని కూడా కోల్పోవటం ఇది దెబ్బ మీద దెబ్బ. ఆమె అంతఃకరణం తునాతునకలై పోయింది.
శ్రీధరుని అమృతోపదేశముతో ఆమె తమాయించుకొని నిబ్బరంగా ఉంటోంది. కానీ ఆమె బెంగల్లా తన చిన్ని కుమారుడైన శ్రీధరుడు ఎలా ఉంటాడు? అనేది. అప్పటికీ శ్రీధరుడికి 12 సంవత్సరాల వయస్సు. ఈ విచారంతో కమలాబాయి తనలోతాను కృంగిపోతూ రోజురోజుకి బలహీన పడసాగింది.
మరణోన్ముఖురాలైన తల్లి సమీపాన శ్రీధరుడు కూర్చుని ఉన్నాడు. ఆమె శ్రీధరుని చేతులను తన చేతులలోనికి తీసుకొని "నాయనా! రాజా! ఇకపై నిన్ను ఆ దేవుడే కాపాడాలి. ఆయనే నీకు రక్ష!" అని అన్నది. అతను తల్లితో, "అమ్మా! నా నుంచి నీవు ఏ సేవ ఆశిస్తున్నావు? నిస్సంకోచంగా చెప్పు. ఏ పనైనా సరే! నేను చేయుటకు సిద్ధంగా ఉన్నాను!" అన్నాడు.
ఆమె, "బాబూ! రాజా! శ్రీధరా! నీవు మన కులాన్ని మరియు ఈ జగత్తును ఉద్ధరిస్తావని పరిపూర్ణముగా నమ్ముతున్నాను. త్రయంబకుడు పోయిన సందర్భంలో నీ నుంచి పొందిన జ్ఞానము ఆ విషయాలు నా మనస్సులో స్థిరంగా ఉన్నాయి. అది నేను మరిచిపోలేదు. అయితే ఈ చివరి ఘడియల్లో నీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను.
బాబూ! నీవు సాధారణ బాలుడివి కావు. జగదోద్ధారణ కొరకు నా నుంచి నీవు అవతరించావు. కారణం నీవు సంసార జంజాటంలో పడకుండా సర్వ స్త్రీ జాతిని మాతృభావంతో చూడవలసినది. ఇక ముందు స్త్రీ సమాజ ఉద్ధరణ, అఖండ సేవయని నేను నమ్ముచున్నాను.
స్త్రీ అనే భావనతో స్త్రీ లను చూడవద్దు. అక్కాచెల్లెళ్ళు అనే భావనతో వారిలో పారమార్ధిక చర్చ చేయడం సర్వశ్రేష్ఠమయినది. స్త్రీ విషయంలో ఎటువంటి చెడుభావన కలుగకుండ సమదృష్టితో ఉండుట హితకరమైనది. అని తల్లి శ్రీధరుడితో చెప్పింది.
శ్రీధరుడు ఏకాగ్రచిత్తంతో అన్ని విషయాలు నిదానంగా వింటున్నాడు. ఆమె చివరి శ్వాస దగ్గర పడుతుంది. ఆ క్షణంలో ఆమె ఇంకనూ ఇలా చెప్పింది - "రాజా! నిజముగా నాకు ఏ ఇచ్ఛలేదు. కులంలో నీవు ఒక్కడివే మిగిలావు. నేను చెప్పినట్లు నీవు నడుచుకుంటే ఈ వంశము ముందు ముందు నిర్వంశమవుతుంది అని జనం అనవచ్చు.
ఈ విషయము తెలిసే నేను చెబుతున్నాను. ఎందుచేతనంటే నాకు సంసార సంబంధమైన ఎటువంటి కోరికా లేదు. సకల జన ఉద్ధరణ కొరకు మాత్రమే నిన్ను ఇచ్చట వదిలి వెళ్లుచున్నాను.
శ్రీధరుడిని ఇంకా దగ్గరికి తీసుకొని అతని వీపు నిమురుతూ ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తోంది తల్లి, కానీ నోట మాట రావడం లేదు. ఆమె ఆయాసపడుతూ ఇంకా ఇలా చెప్పసాగింది. "తండ్రీ! శ్రీధరా! నీవు నా ఈ చివరి కోరిక తీరుస్తావు గదా! నా పుత్రుని ద్వారా నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం ఉంది".
మరలా ఒక క్షణం సేపు ఆగింది. తదుపరి గంభీరంగా ఒక మాట చెప్పింది. "ఇంక నాకు ఏ విధమైన దుఃఖము లేదు. నాకు తోచినది చెప్పాను. చిత్తం క్షణక్షణానికి స్వరూప ఆకారంలో కలిసిపోయే సమయం ఆసన్నమయింది. ఈ భౌతిక శరీరాన్ని విడిచి నేను అనంతానంత ఆనంద స్వరూపములో సమరసంగా లీనమవుతాను" అని ఆమె శాంతపడింది. అది 1920వ సంవత్సరము.
ఇప్పుడు శ్రీధరునకి ప్రేమించే అక్కగాని, తనను మెచ్చిన సోదరుడుగాని, తండ్రిగాని లేరు. స్నేహపూరిత వాత్సల్యభరితమైన తల్లి ప్రేమ కూడా లేకుండా పోయింది. తల్లి మరణం అతనిపట్ల వజ్రఘాతమైంది. కానీ అతను బెదరలేదు.
తల్లి అంత్యక్రియలను యథోచితంగా ముగించాడు శ్రీధరుడు. ఇంట్లో గల పాత్రలను, తదితర సామాగ్రిని పేదలకు, సాధువులకు పంచి తమ పెద్దమ్మ త్రివేణిబాయి ఇంట్లో ఉండసాగాడు.
అధ్యాయము - 3 సమాప్తం
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 10 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 3 - మొదటి భాగము 🌻
శ్రీధరుడికి 10 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి అన్నగారైన త్రయంబకుడు కాలం చేశాడు. ఈ ఆకస్మిక సంఘటన శ్రీధరునిపై చాలా ప్రభావం చూపింది. శ్రీధరుడు చిన్న వయస్సులోనే పెద్దరికాన్ని వహించవలసి వచ్చింది.
త్రయంబకుని మరణం తల్లికి తీవ్ర అఘాతమైంది. భర్తను కోల్పోయిన దుఃఖము తీరనేలేదు. అది జరిగిన 7 సంవత్సరాల కాలంలోనే ఈ దుర్ఘటన. త్రయంబకుడు మరణించేనాటికి అతని వయస్సు 22 సంవత్సరాలు.
త్రయంబకుడి మరణంతో తల్లడిల్లిపోతున్న కన్నతల్లి దుఃఖాన్ని ఏ విధంగా ఉపశమింపచేయాలా అని, మాటలతో ఆమెను ఏ విధంగా ఓదార్చాలా? అని తనలో తాను తర్జనభర్జన పడసాగాడు. చివరికి ఒకరోజున అతను తన తల్లికి ఏ విధంగా చెప్పాలనేది స్ఫురించింది.
వెంటనే శ్రీధరుడు తన తల్లివద్దకు వచ్చి కూర్చున్నాడు. అతను ఆమెతో "అమ్మా! దుఃఖించే కారణమేమి? ఎవరి ప్రేమ కొరకు ఏడుస్తున్నావు? పొంగిపొరలే ఈ దుఃఖం ఎవరికోసం? అది ఆత్మరూపం. జనన మరణాలకు అతీతంగా ఉంటుంది.
బాలకుడుగా ఉన్న కపిల మహాముని తన తల్లియైన దేవహుతికి తత్త్వమును ఉపదేశించినట్టు. అదేవిధంగా తేజస్వియైన శ్రీధరుని మాటలు తల్లి కమలాబాయి దుఃఖాన్ని హరించాయి.
ఆమె స్థిమితంగా కూర్చుని, తన పుత్రుని చూస్తూ "రాజా! నీవు చెప్పేది నాకు అవసరమనిపిస్తున్నది. చెప్పదలుచుకున్న విషయం వివరంగా చెప్పు" అని అన్నది.
ఈ శరీరము పంచభూతాల నుండి తయారుచేయబడింది. పంచమహా భూతములు ఏకమయిన, ముడి విప్పి ఆయా భూతముల యందు లయమగుట ఈ శరీరమునకు మరణముగా సంభవిస్తుంది.
ఈ పరమాత్మ యొక్క విచిత్ర శక్తే పృథ్వి, ఆప, తేజ, వాయు, ఆకాశములనే పంచభూతములుగా నుండి, వాటి ఏకరూపముగా ఒక ఆకారము ఉద్భవించిన అది జన్మగా గుర్తించబడుతుంది అని తల్లిని చూస్తూ శ్రీధరుడు చెబుతున్నాడు.
అయితే అతని లక్ష్యం ఏదొఒక ముగింపుతో కూడి ఉంది అని కమలాబాయితో సహా గృహములోని అందరూ శ్రీధరుడిని తదేకంగా చూస్తూ అతను చెప్పదలుచుకున్న విషయాన్ని వినటానికి తయారయ్యారు. పట్టుమని పది సంవత్సరాల వయస్సు పిల్లవాని నోటి నుండి అనూహ్యమైన తత్త్వం, మాటల రూపంలో వెలికి వస్తోంది.
"ఈ దేహములన్నింటి యందున్న 'నేను' అనే 'సంజ్ఞ' యోగంచే గ్రహించబడినచో ఆ పరమాత్మ రూపము నిత్యమై ఉంటుంది. దేహములోనున్న 'నేను' ప్రాణ స్పందనలను నిలిపి మరల అదృశ్యమగును.
దానినే మరణమని అంటారు. మరల దేహ ప్రవేశమొనరించిన జన్మము అంటారు. ప్రవేశ, నిర్గమములకు అతీతంగా ఉండే 'సంజ్ఞ' ఆత్మ. ఇది దేహ ప్రవేశము చేసి కర్మలను అనుభవించి, తిరిగి దేహత్యాగము చేసి మరల మరోక దేహము ధరించును.
ఇచ్చట గమనించవలసిన విషయమేమనగా దేహధారణకు పూర్వము, దేహత్యాగము తరువాత కూడా ఆత్మ శాశ్వతంగా ఉన్న వస్తువే. దేహ ప్రవేశము చేసినపుడు ఆ దేహముపై ప్రేమ, దేహత్యాగము జరిగినప్పుడు అందుకై దుఃఖము పడుట అనేది అందరూ చేస్తారు.
నిజానికి దేహముతో ఉన్నవాడు పుట్టడం గాని, చావడం గాని చేయటం లేదు. శరీరమే 'నేను' అనే భావన గలవారికి ఈ దేహముపై ప్రేమ కలుగుతుంది. ఈ దేహానికి సంబంధం గల వారందరిపైనా ప్రేమ కలుగుతుంది.
ఈ విధమైన ప్రేమ దేహాన్ని వదిలిన జీవునికి ఉండదు. ఆ 'స్మృతి' నష్టమయిన వెంటనే ఆ దేహముపై ప్రేమపోయి దానిని తక్షణం దహనము చేయుటకు సిద్ధపడతారు. ఆ సమయంలో అందరూ దానిగూర్చి విచారించి దుఃఖించటం జరుగుతుంది.
శ్రీధరుని ఈ అనర్గళ ప్రసంగంతో తల్లి మనస్సు చాలావరకు ఊరడిల్లింది. శ్రీధరుడు తల్లిని చూస్తూ తన ప్రసంగాన్నిలా కొనసాగించాడు. "ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఎందుకు దుఃఖించాలి. మన ఈ దేహాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయేవే. ఆత్మకు నాశనం లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నవారు జన్మ మరణ చక్రం నుండి ముక్తిని పొందుతారు.
ఎవరి ఆత్మకు జననం గాని, మరణం గాని లేవు. ఈ విషయం అర్ధం చేసుకో!. ఆత్మజ్ఞానము వలన శోక నివృత్తి జరుగుతుంది. నీవు ఈ భ్రాంతి నుండి బయటపడు. శాంతి లభిస్తుంది" అని అన్నాడు.
తరువాయి భాగము రేపు చదువు కుందాం.....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 9 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 2 - నాల్గవ భాగము 🌻
శ్రీధరుడు ఎక్కువగా ఈ క్రింది పదాలను ఉచ్ఛరించేవాడు.
న కళతా అగ్ని వరి పడె
న కరిదాహ ఆసనె ఘడె
అమిత నామ వదో భలత్యామిస
సకల పాతక భస్మ కరితస
కాళచోర గరబ్యా బహుఘాలి
మానవా తులా కశి నిజ ఆలి
జాగ జాగ స్వరూప లవలాహె
జాతస వయ అమోలిక పాహె
భావము: తెలియకుండా నిప్పును త్రొక్కినా కాలు మండుతుంది. అదేవిధంగా అఖండనామ స్మరణ వలన మహామహా పాపాలు కూడా భస్మమైపోతాయి. మృత్యువనే దోపిడి దొంగ వెనుకనే (దాపురించి) ఉంటాడు.
ఓ మానవా! నీకు నిద్ర ఎలా వస్తోంది? నీవు ఎవరో అనే విషయాన్ని తెలుసుకో! మేలుకో! జాగృతంకా! నీ ఆయువు వ్యర్ధమైపోతుంది.
పాఠశాల అయిన వెంటనే శ్రీధరుడు తోటి పిల్లలవలె ఇంటికి గాని లేదా ఆటలకు గాని వెళ్ళేవాడు కాదు. ఊర్లో ఏ దేవాలయంలో కీర్తన, హరికథాశ్రవణం, పురాణ కాలక్షేపం జరుగుతుందో అచ్చటికి హాజరయ్యేవాడు.
శ్రీధరుడు బడి వదలి ఎంతసేపైనా ఇంటికి రాలేదని తల్లి కమలాబాయి చాలా కంగారు పడేది. ఒక్కొక్కసారి త్రయంబకుడిని నాయనా "రాజా" ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏమో చూసిరా బాబూ అని శ్రీధరుడిని వెతుకుటకు పంపేది.
శ్రీధరుడి కుటుంబం పల్లెటూరిలో ఉండడం వలన ఆ ఊరి జనం మంచినీరు ఒక బావి నుండి తెచ్చుకునేవారు. అది అతి పెద్ద బావి. ఆ బావి చుట్టుప్రక్కల 'కుంబార పురుగు' అనే అతి పెద్ద దోమలవంటి పురుగులు వుండి నీటికొరకు వెళ్లేవారిని కుట్టి బాధించేవి.
అవి కుట్టిన తేలుకాటు కంటే ఎక్కువ మంట పుట్టి బాధపడేవారు. ఎవరికైతే ఆ పురుగు కుడుతుందో ఆరోజునుండి వారికి నీరు తేవటం చాలా కష్టమయ్యేది. ఇలా ఎన్నో రోజులుగా జరుగుతుంది.
ఒకరోజు ఒక ముసలావిడ "ఒరేయ్! శ్రీధరూ! నీవు ఎన్నో ఆటలాడి రామునిలా రావణవధ చేస్తుంటావు. ఈ చెడ్డ పురుగుల్ని నామరూపాలు లేకుండా చేసి ఈ ఊరి జనాన్ని కాపాడలేవా?" అని అడిగింది.
అది విన్న శ్రీధరుడు తనలో తాను ఆలోచించసాగాడు. ఇవి నిజంగా దుష్ట ప్రాణులే. వీటి వలన జనం చాలా ఇక్కట్లు పడుతున్నారు. భగవంతుడు సహితం సాధు సజ్జనుల రక్షణ కోసం అవతారములు ధరిస్తాడు కదా! అందువలన పర పీడనం చేసే ఈ ప్రాణులను చంపటం వలన నాకు ఏ పాపము రాదు. అదీకాకుండా నా చేతిలో మరణించడం వలన వీటికి మంచి జన్మ దొరుకుతుంది. చెడ్డవారిని శిక్షించి తీరాలి.
భగవంతుడు రాముడుగా రావణుడిని, కృష్ణుడిగా కంసుణ్ణి పరిమార్చి లోకకళ్యాణం చేశారు కదా! అని పరిపరి విధములుగా శ్రీధరుడు తనలో తాను చర్చించుకుని, గట్టిగా రామనామమును ఉచ్ఛరిస్తూ ఆ జీవులన్నింటిని చంపేశాడు.
వీటన్నింటికీ సద్గతి కలిగిందని సంతోషిస్తూ శ్రీధరుడు ఇల్లు చేరాడు. నీరు తెచ్చుకునే జనం అంతా చిన్ని శ్రీధరుడు చేసిన ఈ పనికి హర్షం వ్యక్తం చేశారు.
శ్రీధరునికి తన అక్క గోదావరి అంటే మహాప్రేమ. ఆమె అత్తవారింటి నుండి తమ ఇంటికి వచ్చు సమయంలో శ్రీధరుడు బడి ఎగ్గొట్టి అక్కతో గడపాలని అనుకుని, తల్లి కోప్పడుతుందని అప్పడాల పిండిని నోటిలో వుంచుకొని "అమ్మా! నాకు వాంతి వచ్చేలాగుంది అనేవాడు. తల్లి "పోనీలే! ఈరోజు బడికి వెళ్లకురా!" అనేది. శ్రీధరుని సోదర ప్రేమ గొప్పది.
తరువాయి భాగం రేపు చదువు కుందాం...
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment