గీతా మకరందము
09-12-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌏🌙🌟🚩
మోఘాశా మోఘకర్మాణో
మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ
ప్రకృతిం మోహినీం శ్రితాః ||
తా:- (అట్టివారు) వ్యర్థములైన ఆశలుగలవారును, వ్యర్థములైన కర్మలుగలవారును, వ్యర్థమైన జ్ఞానముగలవారును, బుద్ధిహీనులును (అగుచు) రాక్షససంబంధమైనదియు, అసురసంబంధమైనదియునగు స్వభావమునే ఆశ్రయించుచున్నారు.
వ్యాఖ్య:- జనుల ప్రకృతి (స్వభావము) సామాన్యముగ రెండువిధములుగ నుండుచుండును.
(1) దైవీప్రకృతి
(2) ఆసురీప్రకృతి - అని.
అందు ఆసురీప్రకృతిగలవారిని గూర్చి క్రిందటి శ్లోకమునందు, ఈ శ్లోకమునందును తెలియజేసిరి. దైవీప్రకృతి గలవారిని గూర్చి రాబోవు శ్లోకమున చెప్పుదురు. ఆసురీప్రకృతిగలవారు వ్యర్థములైన ఆశలు, కర్మలు గలిగియుందురు. వారికుండు ఒకింత జ్ఞానమున్ను నశ్వరములగు దృశ్యవస్తువులనుగూర్చినదియే యగుటబట్టి అదియు పరమార్థదృష్టియందు నిష్ఫలమైనదియే యగును.
వారి చిత్తమందు సత్యవస్తువు (ఆత్మ)ను గూర్చిన పరిజ్ఞానముగాని, వివేకముగాని ఒకింతైనను ఉండదు. కనుకనే వారు ‘విచేతసులు’గ (Brainless People), చిత్తముచెడినవారుగ, బుద్ధిహీనులుగ వర్ణింపబడిరి. మఱియు నట్టివారి రాక్షససంబంధమైనదియు, మోహపెట్టునదియు, అనగా అజ్ఞానమున బడద్రోయునదియునగు స్వభావమునే ఆశ్రయించుదురు. ఇచట ‘రాక్షసీం’, ‘ఆసురీం’ అని రెండుపదములను ఒకేచోట ప్రయోగించుటవలన వారి క్రూరస్వభావము, రాజస, తామస స్వభావము లెస్సగ వ్యక్తమొనర్పబడినట్లైనది.
అట్టివారు పరమార్థదృష్టియందు ఎందుకు పనికిరానివారే యగుదురు. కనుకనే వారిబ్రతుకు మోఘపుబ్రతుకని (వ్యర్థజీవితమని) భగవాను డిచట స్పష్టముగ చెప్పివైచిరి. అందులకే ‘మోఘ’ మనుపద మీశ్లోకమున వరుసగ మూడు పర్యాయములు ప్రయోగింపబడినది. మిథ్యారూపములైన దృశ్యవస్తవులచే పట్టివ్రేలాడుచు సత్యమగు పరమాత్మను విస్మరించువారి జీవితము నిజముగ వ్యర్థమేయగును.
కావున జనులు రాక్షసప్రకృతిని, అసురస్వభావమును, కామాదిదుర్గుణములను, రాజస తామస ప్రవృత్తులను పారద్రోలి దైవీసంపత్తిని ఆశ్రయించి సత్యవస్తువగు పరమాత్మను నమ్మి తమతమ జీవితములను సార్థకము చేసికొనవలయును. ఈ శ్లోకమందు అజ్ఞానులు వ్యర్థమగు ఆశ,వ్యర్థమగు కర్మ,వ్యర్థమగు జ్ఞానము గలిగియుందురని చెప్పబడెను, గావున విజ్ఞులగువారు తద్విరుద్ధమగు ఆచరణనే స్వీకరించుచు అనగా దైవమును గూర్చిన ఆశ, దైవమును గూర్చిన కర్మ, దైవమును గూర్చిన జ్ఞానమునే కలిగియుండి విగతచిత్తులుకాక ‘విశేషచిత్తులై’ దైవచిత్తులై మెలగవలయును.
ప్ర:- అసురప్రకృతి యెట్టిది?
ఉ:- జనులను మోహపెట్టునది, అజ్ఞానమున బడద్రోయునది.
ప్ర:- అసురప్రకృతి కల వారెట్టి గుణములు కలిగియుందురు?
ఉ:- (1) వ్యర్థములగు ఆశలు,
(2) వ్యర్థ చేష్టలు,
(3) వ్యర్థజ్ఞానము గలిగియుందురు.
ప్ర:- కావున జీవు లెట్లు ప్రవర్తింపవలెను?
ఉ:- ఆసురీప్రకృతిని వదలి దైవీప్రకృతినే ఆశ్రయించుచు, దైవమును గూర్చిన ఇచ్ఛ, దైవమును గూర్చిన చేష్ట , దైవమును గూర్చిన జ్ఞానము గలిగియుండవలెను.
🕉🌞🌏🌙🌟🚩
11-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| భగవానుని అట్టి మహిమను గుర్తెఱుంగని ఆసురీప్రకృతియుతులగు మూఢులయొక్క ప్రవర్తనను రెండు శ్లోకములద్వారా గర్హించుచున్నారు -
అవజానన్తి మాం మూఢా
మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానన్తో
మమ భూతమహేశ్వరమ్ ||
తా:- నాయొక్క పరమతత్త్వమును ఎఱుంగని అవివేకులు సర్వభూతమహేశ్వరుడను, (లోకసంరక్షణార్థము) మనుష్యదేహమును ఆశ్రయించినవాడనునగు నన్ను అవమానించుచున్నారు. (అలక్ష్యము చేయుచున్నారు.)
వ్యాఖ్య:- పరమాత్మ సమస్త భూతకోట్లకు నియామకుడు, ప్రభువు, ఈశ్వరుడు. ధర్మోద్ధరణముకొఱకు, లోకసంరక్షణముకొఱకు అపుడపుడు లోకమున అవతరించుచుండును.
అట్లు మానుష్యదేహమును గ్రహించి లోకమున అవతరించిన సాక్షాత్ భగవానుని మూఢులు తెలిసికొనజాలక, ఎవరో సామాన్యుడిని తలంచి ఆతనిని అవమానించుచున్నారు. నిర్లక్ష్యము చేయుచున్నారు. ఆతని పరమతత్త్వమును వారు గ్రహించుటలేదు.
అట్టివారిని ‘మూఢులు’ అని శ్రీకృష్ణమూర్తి సంబోధించిరి. ఏలయనగా, ఒకింతైనను వివేకముకలవారు అట్లు పరమాత్మను ద్వేషింపరు. కొందఱు జనులు అహంభావపూరితులై, తమ ధనజనసంపదాదులను, అధికారమును జూచుకొని గర్వులై కన్నుమిన్ను తెలియక మహాత్ములను, సాధుపుంగవులను దూషించుచుందురు. హేళనచేయుచుందురు. శిశుపాల, దుర్యోధనాదు లీ తెగలోనివారు. కనుకనే వారు దుష్ఫలితముల ననుభవించిరి.
ఆధ్యాత్మికసాధనలు చేయువారికి తమజీవితములో నిందాస్తుతులకు గురియగు సందర్భములు కొన్ని తటస్థింపవచ్చును. అట్టి సందర్భములలో ఎంతయో సహనము గల్గి తమయం దేవేని దోషములున్నచో తొలగించుకొని, ఏ దోషములు లేనపుడు గంభీరచిత్తులై ఆ యా నిందలకు జంకక నుండవలెను.
లోకులలో కొందఱి స్వభావము ఈ ప్రకారముగనే పరనిందాత్మకముగ నుండునని తలంచి మనఃస్థిమితము గల్గియుండవలెను. సాక్షాత్ శ్రీకృష్ణపరమాత్మయే అవివేకుల నిర్హేతుకనిందలకు గురి అయినపుడు ఇక సామాన్యులవిషయము వేఱుగ చెప్పవలెనా?అని ఇట్లు తలంచి ధైర్యము తెచ్చుకొని సహనశీలురై యుండవలెను మాయయొక్క స్వభావ మిట్లేయుండునని గ్రహించి నిశ్చలచిత్తులై యుండవలెను. ఎవరిని ద్వేషింపరాదు. ఎవరైన అవివేకులు భగవంతునిగూర్చి నిందాపూర్వకముగ పలికినచో ఆ వాక్యములను ముముక్షువులు లక్ష్యపెట్టక అట్టి నాస్తికుల వచనములను విశ్వసింపక భగవద్భక్తిని అభివృద్ధిపఱచుకొనుచు, తద్ద్వారా వారికి చక్కని బుద్ధి గఱపవలెను.
ప్ర:- పరమాత్మ యెట్టివాడు?
ఉ:- (1) సమస్తప్రాణికోట్లకు నియామకుడు.
(2) లోకోపకారార్థము అత డపుడపుడు మనుష్యాది దేహములను గ్రహించుచుండును.
ప్ర:- ఈశ్వరుని పరతత్త్వము నెఱుంగని అవివేకులెట్లు ప్రవర్తించుదురు?
ఉ:- లోకసంరక్షణార్థము మానవదేహమును ధరించిన పరమాత్మను అతడెవడో సామాన్యుడని తలంచి అవమానించుదురు.
ప్ర:- దీనినిబట్టి గ్రహించవలసిన యంశములేవి?
ఉ:- (1) మూఢత్వమును పోగొట్టుకొనవలెను.
(2) పరులను నిందించరాదు.
(3) భగవానుని నిజతత్త్వ మెఱింగి ఆతనియెడల భక్తిభావము గలిగియుండవలెను.
🕉🌞🌎🌙🌟🚩
08-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌏🌙🌟🚩
ప్రకృతిం స్వామవష్టభ్య
విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నం
అవశం ప్రకృతేర్వశాత్ ||
తా:- ప్రకృతికి (మాయకు లేక స్వకీయకర్మకు) అధీనమై యుండుటవలన అస్వతంత్రమైనట్టి ఈ సమస్త ప్రాణిసముదాయమును నేను స్వకీయప్రకృతిని అవలంబించి మఱలమఱల సృష్టించుచున్నాను.
వ్యాఖ్య:- ఈ శ్లోకమునందు జీవేశ్వరులయొక్క భేదము చక్కగ వివరింపబడినది. జీవుడు ప్రకృతికి వశుడు. ఈశ్వరుడు ప్రకృతిని స్వాధీనపఱచుకొనినవాడు. జీవులు వారివారి కర్మలకు లోబడి, వారివారి మనఃప్రకృతికి వశులై అస్వతంత్రులై యున్నారు.
‘కృత్స్నం’ అని చెప్పుటవలన ఒకరిద్దఱు కాదనియు, సమస్తప్రాణికోటియు (ప్రకృతిని జయించిన జీవన్ముక్తులు మినహా) ఆ ప్రకారము ప్రకృతికి అధీనమైయే యున్నదని స్పష్టపఱుపబడినది. ఎంతవఱకు కర్మయుండునో, వాసనలుండునో, అంతవఱకు జన్మ తప్పదు. కనుకనే అజ్ఞానులగు జీవులను మఱలమఱల సృష్టించుచున్నానని భగవానుడు పలికిరి.
కాబట్టి ఈ జననమరణ రూప సంసారబంధమును తొలగించుకొన దలంచువారు పరమాత్మను ఆశ్రయించి వారివారి ప్రకృతిని, మనస్సును జయించుకొనవలెను.
బంధవిముక్తి కిదియే యుపాయము. అజ్ఞానులగు జనులు తమకెంతటి భౌతికసంపత్తియున్నను ప్రకృతికి లోబడినవారే కనుకను, తమ ఇంద్రియములకు దాసులే కనుకను, అస్వతంత్రులే యగుదురు. వారు బలాత్కారముగ జన్మకర్మలను బొందుచునేయుందురు. కాబట్టి అధ్యాత్మజ్ఞానమును సముపార్జించి, పరమాత్మయొక్క అనుగ్రహమును సంపాదించి, ప్రకృతిని జయించుటద్వారా జనులు సంసారబంధవిముక్తిని పొందవలసియున్నారు.
రంగులరాట్నముపై ఎక్కిన మనుజులు అవశులై తిరుగులాగున, మాయాచక్రమధిష్ఠించిన జీవులు వారివారి ప్రకృతికి వశులై అస్వతంత్రులై సంసారమున తిరుగాడుచున్నారు. రంగులరాట్నమును ఆపవలెననిన, దానిని త్రిప్పువానిని ఎట్లాశ్రయించవలెనో, అట్లే మాయాచక్రమును త్రిప్పు పరమాత్మను ముక్తికొఱకై జీవు లాశ్రయించవలెను.
ప్ర:- జీవులు దేనికి వశులై యున్నారు?
ఉ:- వారివారి ప్రకృతికి (కర్మకు).
ప్ర:- కావున ఆత్మస్వాతంత్ర్యమునకై జీవు లేమి చేయవలెను?
ఉ:- మాయాధీశుడగు పరమాత్మయెడల అనన్యభక్తిగలిగి తమ ప్రకృతిని (మనస్సును, ఇంద్రియములను, కర్మను) జయించుకొనవలెను.
🕉🌞🌏🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
09-07-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| జగత్తుయొక్క సృష్టిస్థితి లయములకు తానే కారకుడని భగవానుడు సెలవిచ్చుచున్నారు.
సర్వభూతాని కౌన్తేయ
ప్రకృతిం యాన్తి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహమ్ ||
తా:- అర్జునా! సమస్తప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని (మాయను) జేరి అందు అణగియుండును. తిరిగి సృష్టికాలమున వానిని నేను సృజించుచుందును.
వ్యాఖ్య:- జీవులు ప్రకృతికి (మాయకు) లోబడియున్నారు. ప్రకృతి పరమాత్మకు లోబడియున్నది. కనుకనే ‘మామికామ్’ - నా సంబంధమైన ప్రకృతి, లేక నా స్వాధీనమందున్న ప్రకృతి అని శ్రీకృష్ణమూర్తిచే చెప్పబడెను.
మాయాం తు ప్రకృతిం విద్ధి మాయినం తు మహేశ్వరమ్- అను శ్రుతివాక్య మీ యర్థమునే బోధించుచున్నది. ప్రకృతియే మాయ. ఆ ప్రకృతిని మాయను స్వాధీనపఱచుకొనినవాడే మహేశ్వరుడు.
దీనినిబట్టి ప్రకృతిని జయించుటకు మాయను స్వాధీనపఱచుకొనుటకు సర్వేశ్వరునియొక్క సహాయము, అనుగ్రహము ఎంతేని ఆవశ్యకమైయున్నదని స్పష్టమగుచున్నది.
కావున పరమార్థరంగమున సాధకుడు పురోభివృద్ధినొందవలెననిన, మాయను జయించవలెననిన, సర్వేశ్వరునియొక్కయు, ఆ మాయను ఇదివఱకే జయించియున్నట్టి జీవన్ముక్తులగు మహాత్ములయొక్కయు అనుగ్రహమును సంపాదించుకొనవలయును. అపుడే ఆతడు సులభముగ గట్టెక్కగలడు. ప్రకృతికి లోబడినవారందఱు ఈ శ్లోకమున జెప్పబడినట్లు సృష్టికాలమున పుట్టుచు, ప్రళయకాలమున లయించుచు రాకడపోకడలు గలిగి యుందురు. ఆ సంసృతినుండి తప్పించుకొనవలెననిన, మాయాధీశుడగు పరమాత్మను జీవుడాశ్రయించియే తీరవలెను.
ప్ర:- ప్రకృతి (మాయ) ఎవరి స్వాధీనములో నున్నది?
ఉ:- పరమాత్మయొక్క స్వాధీనములో నున్నది.
ప్ర:- ప్రకృతికి లోబడియున్నవారి గతి ఎట్లుండును?
ఉ:- సృష్టికాలమున పుట్టుచు, ప్రళయకాలమున లయించుచు నుందురు.
🕉🌞🌎🌙🌟🚩
09-06-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌏🌙🌟🚩
అ|| ఇక ద్వైతదృష్టియందు జగత్తుయొక్క స్థానమును వివరించుచున్నారు -
యథాఽఽకాశస్థితో నిత్యం వాయుస్సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ ||
తా:- ఏ ప్రకారముగ అంతటను సంచరించునదియు, గొప్పదియునగు వాయువెల్లప్పుడును ఆకాశమునందున్నదో, ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లున్ను నాయందున్నవని తెలిసికొనుము.
వ్యాఖ్య:- సమస్త ప్రాణికోట్లు పరమాత్మయం దేప్రకారము స్థితిగల్గియుండుచున్నవో అను విషయము ఇచట ఒక ఉపమానముద్వారా చెప్పబడినది. వాయువు చాల విశాలమైనది, అంతట సంచరించునది,గొప్పది. అయినను అది సదా ఆకాశమందు ఒకమూల అణగియే యుండుచున్నది. అట్లే జగత్తు విశాలమైనది, అనేక ప్రాణికోట్లతో గూడినది. అయినను పరమాత్మయందది ఏమూలనో అణగియుండుచున్నది.
మఱియు ఆకాశము తనయందున్న వాయువుతో అతిసన్నిహితముగ నున్నను దానితో ఏమాత్రము నంటక నిర్లేపముగ నెట్లున్నదో, అట్లే పరమాత్మ జగత్తును తనయందు (కల్పితముగ) కలిగియున్నను, దానితో నేమియు అంటకనున్నాడు. వాయువుయొక్క గుణదోషములు, ఆకాశమునంటని విధమున ప్రాణులయొక్క గుణదోషములుగాని, కర్మాదులుగాని పరమాత్మనంటవు. ఆకాశము కంటికి కానరాదు. అట్లే పరమాత్మ అవ్యక్తరూపుడు. ఆకాశము సూక్ష్మమైనది. సర్వవ్యాపకమైనది. అట్లే పరమాత్మ అతిసూక్ష్మరూపుడు, సర్వవ్యాపకుడు.
ఈ ప్రకారముగ ఆకాశమునకు, పరమాత్మకు కొన్ని సామ్యములున్నందున, పరమాత్మను వర్ణించునపుడు స్థూలదృష్టిగలవారికి గ్రాహ్యమగుటకొఱకై ఆకాశదృష్టాంతము వాడుచుందురు. కాని వాస్తవముగ పరమాత్మ ఆకాశముకాదు. ఏలయనిన, ఆకాశము జడమైనది. పరమాత్మ చైతన్యస్వరూపుడు. ఆకాశము వలె పరమాత్మ సర్వత్రవ్యాపించియున్నారు అని చెప్పబడుటవలన, వారి అస్తిత్వమును సర్వత్ర అనుభూతమొనర్చుకొనవలెను. దేవుడు ఎక్కడున్నాడు?అను ప్రశ్నకు ఈ శ్లోకమునుబట్టి అంతట నున్నాడని చెప్పవలసివచ్చును. అణువణువునందును వారు వ్యాపించియున్నారు. ఈ సత్యమును తెలిసికొనినచో ఇక జనులు పాపకృత్యముల నెట్లు చేయగలరు? చేయలేరు. ఏలయనగా, సర్వత్ర పరమాత్మ వారి చేష్టలను గమనించుచునేయున్నారని తెలియగలదు. కావున అట్టివారు పాపభీతిగల్గి, సుగుణసంపత్తియుతులై మెలగుదురు.
మఱియు సమస్తజీవరాసులను పరమాత్మ తనయందు గలిగియున్నటుల చెప్పబడినందున, జీవుల కంటె ఈశ్వరు డెంతటి ఉన్నతస్థానమందు స్థితిగల్గియున్నాడో విశదమగుచున్నది. కాబట్టి జనులు తమ అల్పబల, సౌందర్య, ధన, అధికారాదులనుజూచి గర్వించక, తాను గొప్ప అను దర్పమును విడనాడి, సర్వేశ్వరునియెడల భక్తిప్రపత్తులుగలవారై వారిని సేవించవలెనని స్పష్టమగుచున్నది.
ప్ర:- సమస్త ప్రాణికోట్లు ఎచ్చోట స్థితిగలిగియున్నవి?
ఉ:- పరమాత్మయందు.
ప్ర:- ఏ ప్రకారముగ ?
ఉ:- ఆకాశమునందు వాయువువలె.
🕉🌞🌏🌙🌟🚩
09-05-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌏🌙🌟🚩
న చ మత్స్థాని భూతాని
పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో
మమాత్మా భూతభావనః ||
తా:- ప్రాణికోట్ల నాయందు ఉండునవియుకావు. ఈశ్వరసంబంధమగు నా యీ యోగమహిమను జూడుము. నాయాత్మ (స్వరూపము) ప్రాణికోట్ల నుత్పన్న మొనర్చునదియు, భరించునదియునైనను ఆ ప్రాణులయం దుండుటలేదు. (వాని నాధారముగ జేసికొని యుండునదికాదు.)
వ్యాఖ్య:- క్రిందటి శ్లోకములో ‘నాయందు సమస్తప్రాణులు కలవు’ అని చెప్పి ఈ శ్లోకమున ‘నాయందు ఏ ప్రాణులు లేవు’ అని చెప్పుట విపరీతము కాదాయని ప్రశ్నించవచ్చును. సామాన్యుల దృష్టియందు దృశ్యమనునది యొకటి యున్నది గనుక అది భగవంతునియందు స్థితిగల్గియున్నదని, దాని కాధార మా భగవంతుడేయనియు వచింపబడినది. పరమార్థదృష్టియందు ద్వైతమనునదియే యుండదు. కావున ఇక ప్రపంచముగాని, ప్రాణికోట్లుగాని అత్తఱియుండవు. ఒకే చిద్ఘనపరమాత్మ శేషించియుండును. కావున అట్టి అద్వైతదృష్టియందు ‘నాయందీభూతములు కలవు’ అను వాక్యమెట్లు పొసగును? కావున ‘నా యందు ఏ భూతములున్ను లేవు.
దృశ్యము నాయందు లేనే లేదు. నేను దృశ్యమందు లేను.’ అని సర్వోన్నత అద్వైతదృష్టితో భగవానుడీవాక్యములను బలికిరి. ఎట్లనిన, మేలుకొనిన తరువాత మనుజుడు ‘స్వప్నలోకము నాయందులేదు, నేను స్వప్నలోకమందు లేను’ అని ఎట్లుచెప్పునో, సర్పభ్రమ తొలగిన మీదట రజ్జువునందు సర్పముగాని, సర్పమునందు రజ్జువుగాని లేదని ఎట్లుచెప్పునో, అట్లే పై వాక్యములున్ను భగవానుడు దృశ్యరహిత పరిపూర్ణాద్వైత దృష్టియందు చెప్పిరి. అట్టి పూర్ణస్థితియందు ఒక్క బ్రహ్మము (ఆత్మ) తప్ప అన్యమగు ఏ వస్తువున్ను ఉండనేరదు. కావున ద్వైతదృష్టిలో తనయొక్క స్వరూపము ప్రాణులను భరించుచున్నను, రక్షించుచున్నను, పరమార్థదృష్టిలో ప్రాణులతోగాని, జగత్తుతోగాని ఏమాత్రము సంబంధములేక పరమాత్మ వెలయుచున్నారు. ఆ సత్యమునే గీతాచార్యు లీశ్లోకమున వెల్లడించి, జగత్తుతోటి తనయొక్క అసంగత్వమును, నిర్లేపత్వమును వ్యక్తపఱచినవారై ఆ తన యోగమహిమను గాంచవలసినదిగా అర్జునున కాదేశించిరి. ఇదియే ఈశ్వర సంబంధమగు గొప్ప యోగమహిమ.
పరమార్థదృష్టియందు జగత్తు బ్రహ్మరూపముగనే శేషించియుండును. జగత్తను పదార్థ మొకటి వేఱుగనుండదు. ఆరోపితవస్తువు సత్యదృష్టియందు అధిష్ఠానరూపముగనే పరిణమించునుగదా ! అట్టి పరిపూర్ణదృష్టినే శ్రీకృష్ణపరమాత్మ ఈ శ్లోకమున వ్యక్తపఱచినవారైరి.
ప్ర:- ఈశ్వరీయ యోగమహిమ యెట్టిదో నిరూపింపుము?
ఉ:- పరమాత్మ ప్రాణులను భరించుచున్నను, రక్షించుచున్నను, అవియేవియు వాస్తవముగ అతనియందు లేవు. ఇదియే ఈశ్వరమహిమ.
ప్ర:- పూర్ణ అద్వైతదృష్టియందు జగత్తుయొక్క స్థానమెచట?
ఉ:- అట్టిస్థితియందు జగత్తు అనునదియే యుండదు. అంతయు ఒకే బ్రహ్మస్వరూపముగ నుండును.
🕉🌞🌏🌙🌟🚩
09-04-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| పరమాత్మయొక్క స్వరూపమును ఏడుశ్లోకములద్వారా వర్ణించుచున్నారు-
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్స్థాని సర్వభూతాని
న చాహం తేష్వవస్థితః ||
తా:- ఈ సమస్తప్రపంచము అవ్యక్తరూపుడనగు నాచే వ్యాపించబడియున్నది. సమస్తప్రాణికోట్లు నాయందున్నవి. నేను వానియందుండుటలేదు. (నాకవి ఆధారములు కావు).
వ్యాఖ్య:- ‘అవ్యక్తమూర్తినా’ - ఇంద్రియములకు గోచరముకాని అతిసూక్ష్మవస్తువే పరమాత్మ. సామాన్యమగు భూతాకాశమే నేత్రములకు కానరాకయుండ, ఇక సూక్ష్మాతిసూక్ష్మమైన చిదాకాశము (ఆత్మ) నేత్రాదుల కెట్లుగోచరించును? కనుకనే పరమాత్మ అవ్యక్తరూపుడని ఇట పేర్కొనబడెను. స్థూలాకాశముచే ఏ ప్రకారము జగత్తంతయు పరివ్యాప్తమైయున్నదో, అట్లే చిదాకాశము (పరమాత్మ)చే ఈ స్థూల, సూక్ష్మజగత్తంతయును, ప్రాణికోట్లన్నియును వ్యాప్తములై యున్నవి. కావున అవియన్నియు పరమాత్మయందే యున్నవగును.
‘న చాహం తేష్వవస్థితః’ - అవియన్నియు ‘నాయందున్నను నేను వానియందు లేను’ అని భగవాను డేల పలికిరి; వాస్తవదృష్టితో పరికించిన ఈ నామరూపాత్మకమగు దృశ్యజగత్తంతయు స్వప్నమువలె మిథ్యయైయున్నది. ఆత్మయొకటియే సత్యము. ఆ ఆత్మయందీ దృశ్యజాతమంతయు రజ్జువునందు సర్పమువలె ఆరోపింపబడియున్నది.
కనుక మిథ్యాభూతమగు దృశ్యవస్తువునందు సత్యవస్తువగు పరమాత్మ యెట్లుండ గలడు? కాబట్టియే భగవాను డిచట ‘నాయందీ భూతములన్నియు కలవు, నేను వానియందు లేను’ అని చెప్పుటకు కారణము.
స్థూలసూక్ష్మమగు చరాచరప్రపంచ మంతటను పరమాత్మ వ్యాపించియుండుటచేత, ఆతడు లేనిచోటు లేదు. కనుక సాధకుడు ఆతని ఉనికిని సర్వత్ర అనుభూత మొనర్చుకొనుచు పాపకృత్యములు చేయక, ప్రాణికోట్ల యెడల దయగలిగి, భక్తిభావ సమన్వితుడై యుండవలెను.
ప్ర:- పరమాత్మ యెట్టి రూపముగలవాడు?
ఉ:- ఇంద్రియములకు గోచరముకాని అతిసూక్ష్మరూపము కలవాడు.
ప్ర:- ఆత డెచట నున్నాడు?
ఉ:- స్థూల సూక్ష్మ సమస్త ప్రపంచమునందును వ్యాపించియున్నాడు.
ప్ర:- ప్రాణికోట్లన్నియు ఎచట నున్నవి?
ఉ:- పరమాత్మయందు స్థితిగల్గియున్నవి.
🕉🌞🌎🌙🌟🚩
03-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌏🌙🌟🚩
అ|| శ్రద్ధలేనివారు దైవమును బొందజాలరనియు, సంసారకూపముననే తిరుగాడుచుందురనియు వచించుచున్నారు -
అశ్రద్ధధానాః పురుషా
ధర్మస్యాస్య పరన్తప |
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని ||
తా:- ఓ అర్జునా! ఈ (ఆత్మజ్ఞానమను) ధర్మమునందు శ్రద్ధలేనట్టి మనుజులు నన్ను పొందనివారై మృత్యురూపమైన సంసారమార్గమునందే మఱలుచున్నారు (తిరుగుచున్నారు, లేక నిక్కముగ వర్తించుచున్నారు).
వ్యాఖ్య:- లౌకికరంగమునగాని, పరమార్థరంగమునగాని ప్రతికార్యమునందును శ్రద్ధ చాల అవసరము. ఒకనికి ఒక వస్తువునందుగాని, ఒక కార్యమునందుగాని ఎంతెంత శ్రద్ధయుండునో అంతంత చక్కగ ఆ వస్తువు ఫలించుచుండును. ఆ కార్యము నెరవేరుచుండును. కనుకనే భగవాను డీ శ్లోకమున తానుచెప్పబోవు బ్రహ్మజ్ఞానమందు ఎవనికి శ్రద్ధయుండునో, ఆతడు శ్రద్ధాపూర్వకముగ దాని ననుష్ఠించి తనను జేరగలడనియు, అట్లు శ్రద్ధలేనివారు తనను పొందజాలనివారై మృత్యురూపమగు సంసారముననే పడి తిరుగాడుచుందురనియు సెలవిచ్చిరి.
కాబట్టి విజ్ఞులగువారు చక్కగా యోచించుకొని, దుఃఖప్రదమగు సంసారమార్గమున బడకుండుటకును, ఆనందప్రదమగు దైవసాక్షాత్కారమును బడయుటకును, శ్రద్ధయను ఈ సుగుణమును జేపట్టి బ్రహ్మవిద్యను చక్కగ అనుష్ఠించి తరించవలయును. లోకమున సామాన్యకార్యములగు వంట, సేద్యము మున్నగునవి చక్కగ జరుగుటకే ఎంతయో శ్రద్ధ అవసరమైయుండ ఇక బ్రహ్మవిద్యాసాధనమున వెఱుగజెప్పవలెనా? కనుకనే గీతాచార్యులు తనబోధయందు అపుడపుడు ఈ శ్రద్ధయనుదానిని నొక్కి చెప్పుచుపోయిరి.
ఇక ఈ సంసారమార్గమెట్టిదో ఈ శ్లోకమున విశదీకరింపబడినది. సామాన్యముగ కొందఱుజనులు భోగవిలాసములకులోనై ఈ సంసారమును స్వర్గతుల్యముగ భావించుదురు.అమృతప్రాయముగ దానిని వర్ణించుదురు. కాని సర్వజ్ఞుడగు పరమాత్మ దానిని మృత్యురూపముగ వర్ణించిరి (మృత్యుసంసారవర్త్మని). అదియే దాని నిజరూపము. మాయాప్రభావముచే ఈ సంసారము పైకి ‘డాబు’గా కనిపించినను లోన మృత్యురూపమే కలిగియున్నది.
ఈ రహస్యమును భగవాను డీ శ్లోకమున బహిర్గతమొనర్చిరి. బాగుగ అలంకరింపబడిన శవ మేప్రకారము పైకి అందముగ గనుపించినను లోన క్రుళ్లు, దుర్గంధము గలిగియుండునో, ఈ సంసారస్థితియు అంతియే. కాబట్టి విజ్ఞులు దానిచే మోసపోక అమృతరూపుడగు పరమాత్మనాశ్రయించి ధన్యులు కావలయును. నివర్తన్తే అను పదమునకు ‘నితరాం వర్తన్తే’ - మిక్కిలి (స్థిరముగ) వర్తించుచున్నారు -అనియు చెప్పవచ్చును.
ప్ర:- పరమాత్మను ఎవరు పొందగలరు?
ఉ:- బ్రహ్మజ్ఞానమందు శ్రద్ధగలవారు.
ప్ర:- అట్లు శ్రద్ధలేనివారిగతి యేమగును?
ఉ:- వారు పరమాత్మను బొందలేక మృత్యురూపమగు సంసారముననే తిరుగాడుచుందురు.
ప్ర:- ఈ సంసారముయొక్క స్వరూపమెట్టిది?
ఉ:- అది మృత్యురూపమై యున్నది. అనగా జననమరణరూపమై, దుఃఖభూయిష్టమైయున్నదని భావము.
🕉🌞🌏🌙🌟🚩
09-02-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌎🌙🌟🚩
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం
సుసుఖం కర్తుమవ్యయమ్ ||
తా:- ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్ల శ్రేష్ఠమైనదియు, రహస్యములలోకెల్ల అతి రహస్యమైనదియు, సర్వోత్కృష్టమైనదియు, పవిత్రమైనదియు, ప్రత్యక్షముగ తెలియదగినదియు, ధర్మయుక్తమైనదియు, అనుష్ఠించుటకు మిగుల సులభమైనదియు, నాశరహితమైనదియు అయియున్నది.
వ్యాఖ్య:- ఈ అధ్యాయమున చెప్పబోవు బ్రహ్మజ్ఞానము ఎట్టిదో, దాని మహిమ ఏమియో ఈ శ్లోకమున వివరింపబడుచున్నది. ప్రపంచములో అనేక విద్యలు కలవు. కాని అవి యేవియు జీవుని జననమరణముల నుండి తప్పించజాలవు. ఒక్క బ్రహ్మవిద్యయే అట్టి పనిని చేయజాలియున్నది.
మఱియు దృశ్యవస్తువులన్నియు నశ్వరములు. కావున వానిని గూర్చిన విద్యయేదియు మనుజునకు పూర్ణశాంతిని గలుగజేయజాలదు. శాశ్వతమగు బ్రహ్మము (ఆత్మ)ను గూర్చిన విద్యయే శాంతిని చేకూర్చగలదు. కనుకనే బ్రహ్మవిద్య విద్యలలోకెల్ల శ్రేష్ఠమని, రాజవిద్యయని యిచట పేర్కొనబడినది. మఱియు లోకములో పవిత్రతమమైనట్టి పరమాత్మవస్తువును ప్రతిపాదించునది యగుటబట్టి ఇదియు అతి పవిత్రమైనదియే యగును.
‘ప్రత్యక్షావగమమ్’ - ఈ బ్రహ్మవిద్యను ప్రత్యక్షముగ తెలిసికొనవచ్చును. అనుభూత మొనర్చుకొనవచ్చును. ఇది ప్రత్యక్షఫలమునే కలుగజేయునుగాని పరోక్షఫలమునుగాదు. ఏలయనిన, ఏ క్షణమున సాధకు డీ బ్రహ్మవిద్యను అనుభూతమొనర్చుకున్నాడో, ఆ క్షణముననే ఆతడు సాక్షాత్ బ్రహ్మమే యగుచుండుట కానబడుచున్నది. కావున ఇది ఫలితమును గలుగజేయునో, లేదో, యను సందేహమున కాస్కారములేదు.
‘సుసుఖమ్’ - ఈ బ్రహ్మవిద్యను ఆచరించుట చాలతేలికయని చెప్పబడినది. మనస్సునందలి దుస్సంస్కారములను, వాసనాజాలమును ప్రయత్నపూర్వకముగ తొలగించుకొనినచో, ఇక స్వస్వరూపసాక్షాత్కారమునం దేలాటి పరిశ్రమయులేదు. కనుకనే శాస్త్రములం దీ ఆత్మానుభూతి- పుష్పములను నలుపుటకంటెను, శ్వాసను పీల్చుటకంటెనుగూడ సులభమని వచింపబడినది. బ్రహ్మానుభవము అతిసులభమైనదని ఈ ప్రకారముగ భగవానుడు గీతయందు సాధకులకు ధైర్యమును గొలుపుచున్నారు. మఱియు ఈ విద్య ధర్మములకు మూలమున్ను, సనాతనమున్ను, అవ్యయమున్ను అయియున్నదనియు ఇచట చెప్పబడినది.
ఈ ప్రకారముగ శ్రీకృష్ణపరమాత్మ తానుబోధింపదలచిన బ్రహ్మజ్ఞానముయొక్క మహిమను ప్రారంభమునందే వెల్లడించిరి. దీనిచే ముముక్షువులకు దానియందెంతయో ప్రీతి, విశ్వాసము జనించుచున్నది.
ప్ర:- బ్రహ్మజ్ఞానమెట్టిది?
ఉ:- (1) విద్యలన్నిటిలో శ్రేష్ఠమైనది
(2) అతిరహస్యమైనది
(3) పవిత్రమైనది
(4) ఉత్తమమైనది
(5) ప్రత్యక్షముగ తెలిసికొనదగినది
(6) ధర్మయుక్తమైనది
(7) సులభముగ ఆచరింపదగినది
(8) నాశరహితమైది.
🕉🌞🌎🌙🌟🚩
08-27-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌎🌟🌙🚩
అ|| ఈ రెండుమార్గములను గూర్చి యెఱింగినవానిని సంస్తుతించుచు ‘యోగివికమ్మ’ని అర్జునునకు హితము చెప్పుచున్నారు -
నైతే సృతీ పార్థ జానన్
యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు
యోగయుక్తో భవార్జున ||
తా:- ఓ అర్జునా!ఈ రెండుమార్గములను ఎఱుంగునట్టి యోగి యెవడును ఇక మోహమును బొందడు. కాబట్టి నీవెల్లకాలమందును (దైవ) యోగయుక్తుడవుకమ్ము.
వ్యాఖ్య:- పైనదెల్పిన ప్రకాశరూపమగు ఊర్ధ్వమార్గమును, అంధకారరూపమగు అధోమార్గమును - రెండింటిని ఎఱింగిన యోగి యెవడును ఇక మోహమును జెందనేరడని వచింపబడినది. అనగా నట్టివాడు మరల నెన్నటికిని అంధకారరుపమగు అజ్ఞానమార్గమును జేబట్టడనియు , ప్రకాశరూపమగు జ్ఞానమార్గమునే చేబట్టుననియు, భ్రమయందెన్నటికి పడడనియు భావము.
‘ఇది మంచిది, ఇది చెడ్డది’ అని తెలిసిన విజ్ఞుడెన్నటికిని చెడ్డదానిని కోరడు. మంచిదానినే ఆశ్రయించును.
‘విషం దృష్ట్వాఽమృతం దృష్ట్వా
విషం త్యజతి బుద్ధిమాన్’ విషమును, అమృతమును చూచి బుద్ధిమంతుడగువాడు విషమును త్యజించి అమృతమునే గ్రహించును. అట్లే ‘ఇది ఆత్మ, ఇది అనాత్మ ;
ఇది ప్రకాశము, ఇది అంధకారము; ఇది మోక్షము, ఇది బంధము;
ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము -అని తెలిసినవాడు బంధరూపములగు వస్తువుల నాశింపక ముక్తిప్రదమగు జ్ఞానమునే ఆశ్రయించును. కావున అట్టివాడు ఇతరులవలె భ్రమయందు పడడని ఇచట వచింపబడినది. ఈ ప్రకారముగ విచారణారూపజ్ఞానము జీవుని మరల నెన్నటికిని మోహమందు (అజ్ఞానమందు) పడకుండ సంరక్షించుచున్నది. కాబట్టియే ‘ఓ అర్జునా! నీవెల్లప్పుడును (దైవ) యోగనిష్ఠుడవై యుండుము. ప్రకాశరూప బ్రహ్మచైతన్యయుక్తుడవై యుండుము’ అని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుని హెచ్చరించుటకు కారణమైనది. ఇచట ‘సర్వేషు కాలేషు’ అని చెప్పబడినందున, ఏ ఒకానొకసమయముననో కాక ఎళ్లవేళలయందు దైవయోగయుక్తుడై యుండవలెనని స్పష్టపఱచినట్లైనది. ఏలయనిన, ఏ క్షణమందు మనుజుడు భగవంతుని మఱచునో, తన ఆత్మస్వరూపమును విస్మరించునో, ఆ క్షణముననే ‘మాయ’ వచ్చి ప్రవేశించి జీవునకు గొప్ప అపకారమును గలుగజేయగలదు. కావున అట్లు కావించుట మహాప్రమాదభూయిష్ఠమైనదని యెఱుంగవలెను.* ప్రకాశముయొక్క అభావమే అంధకారము. దైవవిస్మృతియే మాయకు పట్టు. కనుకనే ‘నీవెల్లకాలము దైవయోగపరుడవైయుండుమ’ని భగవానుడర్జునుని హెచ్చరించుటకు కారణమైనది. అత్తఱి యిక మాయ జొరబడుటకు, జీవుని ఆక్రమించుటకు అవకాశమే లేకుండును.
‘యోగయుక్తో భవ’ - ‘యోగ’ మనగా ఐక్యము. మనస్సును ఆత్మతోనైక్య పఱచుటయే యోగము. ధ్యానముద్వారా, లేక జ్ఞానముద్వారా, లేక భక్తిద్వారా, లేక ఏ యితరమార్గముద్వారా మనస్సును సాక్షియగు ఆత్మస్వరూపమందు లయమొనర్చుటయే యోగము. అట్టి యోగమే నిరంతరము గలిగియుండులాగున ఇచట బోధింపబడినది.
ప్ర:- ఎట్టివాడు ప్రపంచమున మాయాభ్రమయందు పడకుండును?
ఉ:- ‘ఇది ప్రకాశరూపమగు జ్ఞానమార్గము ,
ఇది అంధకారరూపమగు అజ్ఞానమార్గము’ అని యిట్లు రెండిటిని బాగుగ తెలిసికొనినవాడు మాయామోహమున బడనేరడు.
ప్ర:- కాబట్టి ముముక్షువు ఏ ప్రకారముగ వర్తించవలెను?
ఉ:- సర్వకాలములందును దైవచింతనాపరుడై, (దైవ) యోగయుక్తుడై యుండవలెను.
ప్ర:- కొద్దికాలము భగవన్నిష్ఠ గలిగియుండిన చాలదా?
ఉ:- చాలదు. ఎల్లకాలములందును (సర్వేషు కాలేషు) అట్టి దైవనిష్ఠ యుండవలెను. ఏలయనిన మాయ మహాప్రమాదకరమైనది.
----------------------------------------------
*యన్ముహూర్తం క్షణమపి వాసుదేవో న చిన్త్యతే |
సా హానిస్తన్మహచ్ఛిద్రం సా భ్రాన్తిస్సా చ విక్రియా ||
ఏ క్షణమందు వాసుదేవుని గూర్చిన, భగవంతుని గూర్చిన చింతన జరుగదో, ఆ క్షణమే గొప్ప హానియు, మహాదోషమున్ను, భ్రాంతియు, వికారమున్ను అగును.
🕉🌞🌎🌟🌙🚩
-28-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| యోగియొక్క సర్వోన్నతస్థితిని, యోగముయొక్క అపారఫలితమును తెలియజేయుచున్నారు -
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ||
తా:- యోగియైనవాడు దీనిని (ఈ అధ్యాయము చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము మున్నగువానిని) ఎఱింగి వేదములందును, యజ్ఞములందును, దానములందును, తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడియున్నదో, దానినంతను అతిక్రమించుచున్నాడు. (దానిని మించిన పుణ్యఫలమును బొందుచున్నాడు). మఱియు అనాదియగు సర్వోత్తమ (బ్రహ్మ) స్థానమును బొందుచున్నాడు.
వ్యాఖ్య:- ఈ అధ్యాయమందు చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము నెఱింగినవాడు ఎట్టి మహత్తరపుణ్యఫలమును నొందగలడో, ఎట్టి సర్వోన్నతస్థానము నలంకరించగలడో ఇచట వచింపబడినది.
(1) వేదాధ్యయనమువలన
(2) యజ్ఞాచరణమువలన
(3) తపఃక్రియలవలన
(4) దానములుచేయుటవలన
జీవునికెంతటి పుణ్యముకలుగునో దానికంటె నధికతరమగు పుణ్యమును పరబ్రహ్మతత్త్వము నెఱింగిన యోగి పొందుచున్నాడని యిచట స్పష్టముగ చెప్పివేయబడినది.
దీనిని బట్టి అన్ని పుణ్యములలోను అత్యధికమైనది యేదియో, దేనినాశ్రయించినచో పుణ్యము లన్నిటియొక్క పరాకాష్ఠను జీవుడు పొందగలడో యిచట నిరూపింపబడినట్లైనది. ప్రపంచమున పరబ్రహ్మవస్తువొకటియే సత్యమైనది. తదితరములన్నియు మిథ్యాభూతములు. కావున సత్యవస్తువు నాశ్రయించినవారికే పరిపూర్ణమగు పుణ్యఫలము లభించగలదు.
వేదములవలన, యజ్ఞములవలన, తపస్సులవలన, దానమువలన కొంతకొంత పుణ్యము జీవునకు లభించుచునేయున్నది. కాని పరమాత్మను ధ్యానించు యోగి, లేక ఆత్మ (బ్రహ్మ) జ్ఞానము కలిగియుండు యోగి వానినన్నింటిని దాటివేయుచున్నాడు. ఆత్మప్రాప్తిచే నతడు అనంతపుణ్యమును సంపాదించుచున్నాడు. సముద్రమునందు బిందువు అంతర్భూతమైయే యుండును. ‘శతే పంచాశత్’ అనునట్లు నూటియందు యాభై యిమిడియే యుండును.
అట్లే బ్రహ్మజ్ఞానజనిత మహాపుణ్యమందు తక్కిన పుణ్యములన్నియు అంతర్భూతములైయుండును. పైగా, ఆ చిన్న చిన్న పుణ్యములన్నియు పుణ్యఫలానుభవానంతరము కాలక్రమమున నశించిపోవును. కాని బ్రహ్మానుభూతి వలన కలుగు పుణ్యము అనంతమైనది. అది ఏ కాలమునను క్షయింపదు. అది నిరతిశయమైనది. తక్కిన పుణ్యములన్నియు శ్రేష్ఠములే అయినను ఇయ్యది శ్రేష్ఠతమమై వెలయుచున్నది. కాబట్టి విజ్ఞులద్దానికొఱకే యత్నించవలెను.
లోకములో కొందఱు చదువురానందువలన వేదములను అధ్యయనము చేయలేక పోవచ్చును. అర్థబలములేనందువలన యజ్ఞాదు లాచరింపలేకపోవచ్చును, శరీరదార్ఢ్యము లేనందుచే కఠినములైన తపస్సులు చేయలేకపోవచ్చును.
బీదవారగుటచే దానములు చేయలేకపోవచ్చును. ఇక నట్టివారికి పుణ్యప్రాప్తికి మార్గమేది? వారు దిగులుపడవలసినదేనా? కాదు, వానియన్నింటిని మించిన పుణ్యమును సంపాదింపగల్గు ఉపాయమును భగవాను డిచట కరుణతో నుపదేశించిరి. అదియే పరమాత్మధ్యానము ,బ్రహ్మవిజ్ఞానము. అద్దానికి చదువులతోగాని, తపస్సులతోగాని, యజ్ఞములతోగాని, దానములతోగాని పనిలేదు. మనశ్శుద్ధియే, హృదయపవిత్రతయే, నిర్మలభక్తియే దానికి కావలసినది. అదికలవారు ఆత్మ (బ్రహ్మ) జ్ఞానప్రాప్తిద్వారా తక్కిన పుణ్యఫలములన్నిటిని దాటివైచుదురు. దీని అర్థము పైన దెల్పిన దానాదులను, వేదపఠనాదులను ఉపేక్షింపవలెననికాదు. వానిని నిష్కామముగ ఆచరించుచు క్రమముగ చిత్తశుద్ధిని బడసి తద్ద్వారా ఆత్మానుభూతిచే మహాపుణ్యము నొందవలెననియే.
ఇంతియే కాదు. అట్టి బ్రహ్మతత్త్వము నెఱుంగుయోగి ఆద్యమై, సర్వోత్తమ స్థానమైనట్టి సాక్షాత్ బ్రహ్మమునే పొందుచున్నాడని యిట వచింపబడినది. బ్రహ్మవేత్త బ్రహ్మస్వరూపుడే యగునని శృతిభగవతియు పలుకుచున్నది.
‘పరంస్థానమ్’ అని చెప్పుటవలన ప్రపంచమునగల అన్ని పదవులకంటెను, స్థానములకంటెను బ్రహ్మపదవి సర్వోత్కృష్టమైనదని తేలుచున్నది. తక్కిన పదవులు, స్థానములు, సంపదలు క్షయిష్ణువులు, దేశకాలాధీనములు ,
దేహవియోగముచే వియోగమును బొందునవి. కాని బ్రహ్మపదవి, ఆత్మస్థానము అట్టిదికాదు. అది శాశ్వతమైనది. కనుకనే ‘పరంస్థానమ్’ అని భగవానుడు దానినిగూర్చి వర్ణించిరి. కాబట్టి ముముక్షువులగువారు చిన్న చిన్న పుణ్యములతో సంతృప్తినొందక పుణ్యనిధి (Fountain of Virtue)యై మహత్తరస్థానమై యలరారుచుండు ఏ పరబ్రహ్మపదవి కలదో, ఏ ఆత్మస్థానము కలదో అద్దానిని భగవానుడు గీతయందు తెలిపిన అభ్యాసములద్వారా పొంది మానవజీవితమును సార్థకము చేసికొనవలెను.
‘యోగీ’ - యోగమనగా జీవుని భగవంతునితో చేర్చుమార్గము. అది నిష్కామకర్మయైనను, భక్తియైనను, ధ్యానమైనను, జ్ఞానమైనను సరియే దేనిననుసరించినను అతడు యోగియే యగును.
ఈ శ్లోకముద్వారా వేదములు, యజ్ఞములు, తపస్సులు, దానములు - వీని యన్నిటికంటె బ్రహ్మజ్ఞానము, ఆత్మానుభవము శ్రేష్ఠమని సర్వోత్తమమని స్పష్టపడుచున్నది. కావున ప్రారంభస్థితిలో ఆ తపోదానాదులను ఆశ్రయించినను, వానితో సంతృప్తినొందక ఇంకను పైకిబోయి క్రమముగ చిత్తశుద్ధిద్వారా ఆత్మజ్ఞానమును, బ్రహ్మానుభూతిని బడయవలెను.
ప్ర:- (అక్షర) పరబ్రహ్మము తెలిసికొనువా డెట్టి పుణ్యమును బడయును?
ఉ:- (1) వేదశాస్త్రాదుల
నధ్యయనము చేయుటచేతను.
(2) యజ్ఞాదు లాచరించుటవలనను.
(3) తపస్సులను సలుపుటవలనను.
(4) దానములను గావించుటవలనను - ఏయే పుణ్యఫలములు జీవునకు లభించునో, బ్రహ్మవేత్తకు వాని యన్నింటిని మించిన పుణ్యఫలము కలుగును.
ప్ర:- పరబ్రహ్మమెట్టిది?
ఉ:- (1) ఆద్యస్వరూపము (సమస్తమునకు మూలకారణము) (2) సర్వోన్నతస్థానము (అన్నిస్థానముకంటెను శ్రేష్ఠమైనది).
ప్ర:- ప్రపంచములోగల స్థానములన్నిటిలోను, పదవులన్నిటిలోను గొప్పదియేది?
ఉ:- పరమాత్మస్థానము (పరబ్రహ్మపదవి).
ప్ర:- అన్నిటికంటెను గొప్ప పుణ్యము నాశించువా డేమిచేయవలెను?
ఉ:- చిత్తశుద్ధిగలిగి పుణ్యనిధియగు పరమాత్మ నాశ్రయించవలెను. దానిచే వృక్షముయొక్క మూలమును పోషించినచో శాఖాపత్రాదులన్నియు పుష్టినొందునట్లు సమస్తదేవతలను, సమస్తపుణ్యములను ఆశ్రయించినట్లే కాగలదు.
ఓమ్
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే అక్షరపరబ్రహ్మయోగోనామ
అష్టమోఽధ్యాయః
ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు
శ్రీ భగవద్గీతలందు అక్షరపరబ్రహ్మయోగమను
ఎనిమిదవ అధ్యాయము
ఓమ్ తత్ సత్!
🕉🌞🌎🌙🌟🚩
ఓం నమః శివాయ:
09-01-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ భగవద్గీత
అథ నవమోఽధ్యాయః
తొమ్మిదవ అధ్యాయము
రాజవిద్యారాజగుహ్యయోగః
రాజవిద్యారాజగుహ్యయోగము
శ్రీ భగవానువాచ:-
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం
యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ||
తా:- శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) దేనిని తెలిసికొనినచో అశుభరూపమగు ఈ సంసారబంధమునుండి నీవు విడివడుదువో అట్టి అతిరహస్యమైన, అనుభవజ్ఞానసహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయలేనివాడవగు నీకు లెస్సగా జెప్పుచున్నాను (వినుము).
వ్యాఖ్య:- ఇకనిపుడు విద్యలలోకెల్ల శ్రేష్ఠమైనదియు, అతిరహస్యమైనదియునగు బ్రహ్మవిద్యను అనుభవపూర్వకముగ భగవానుడు బోధించుచున్నారు. ‘గుహ్యతమమ్’ అని చెప్పుటవలన ఈ బోధ రహస్యముయొక్క పరాకాష్ఠను సూచించుచున్నది. బ్రహ్మోపదేశము సామాన్యముగ అధికారియగు మనుజునకే కావింపబడుచుండును. దానిని వినుటకుకూడ యోగ్యత అవసరము. ఆ యోగ్యత యేది? అసూయాది దుర్గుణములు లేకుండుటయే. చిత్తశుద్ధి గలిగియుండుటయే. సాధనచతుష్టయ సంపత్తిచే ఈ యోగ్యత చేకూరును. అయితే యిచట బ్రహ్మజ్ఞానము బోధింపబడుచున్న అర్జునున కట్టి యోగ్యతకలదా? అని యడగవచ్చును. కలదనియే చెప్పవలసియున్నది. ఏలయనిన, ఈ అధ్యాయప్రారంభముననే శ్రీకృష్ణమూర్తి అర్జునుని అసూయారహితునిగ (‘అనసూయవే’) వర్ణించిరి. అసూయాది దుర్గుణములు లేనివాడిని బాగుగ నెఱింగి యున్నందుననే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు గీతోపదేశమును గావించిరి. కావున సమీపించుటతోడనే బ్రహ్మజ్ఞానమును బోధించుడని గురువులను వేధించు శిష్యులు మున్ముందు తమకట్టి అసూయాది దుర్గుణములు తొలగినవాయని ప్రశ్నించుకొనవలెను. వస్త్రము నిర్మలముగా నున్నపుడే రంగు అంటున్నట్లు, శుద్ధచిత్తునియందే బ్రహ్మజ్ఞానము ప్రవేశించును , మలినచిత్తుని యందు గాదు.
ఈ ప్రకారముగ ‘అనసూయవే’ అను పదముద్వారా భగవానుడు బ్రహ్మవిద్యకు యోగ్యతను నిరూపించినవారైరి. కాబట్టి సాధకులివ్విషయమున కడు జాగరూకులై బ్రహ్మజ్ఞానమును బడయుటకుముందు అట్టి అసూయారాహిత్యము తమకు గలిగినదాయని ప్రశ్నించుకొని, లేకున్న అద్దానిని బాగుగ సిద్ధింపజేసికొనవలెను. దంభదర్పాది దుర్గుణములన్నిటికిని ‘అసూయ’ రాజు అయియున్నది. కనుకనే అది యిచట పేర్కొనబడినది. అది ఒక వేరుపురుగువంటిది. వేరుపురుగు చెట్టునంతను క్రమముగ గుల్లచేసివైచునట్లు - అసూయ జీవునియందు ప్రవేశించినచో, ఆతడు అంతవఱకు చేసిన సాధననంతను ఒక తృటిలో అది భ్రష్టముచేసివేయగలదు.
కనుకనే పరమార్థరంగమున ఎంతయో సాధనచేసినవారుకూడ ఒక్కొక్కప్పుడు ఈ అసూయారాక్షసికి బలియై తమ సాధనసర్వస్వమును గోల్పోయి పతనమొందుచున్నారు. కాబట్టి భగవానుడు లోకులను ఈ ‘అనసూయవే’ అను పదము ద్వారా జాగరూకులుగా నుండుడని, హెచ్చరికచేసిరి. అసూయను పోగొట్టుకొని అర్జునునివలె బ్రహ్మవిద్యకు అధికారులు కండని బోధించిరి. అట్టి అర్హతను బొందినవారికి సద్గురువులు అతిరహస్యములైన, అంశములన్నిటిని బహిర్గతముచేసి వైతురు. ఇక్కారణముననే ‘వక్ష్యామి’ అని పలుకక, ‘ప్రవక్ష్యామి’ అని భగవానుడు పలికిరి.
అనగా ‘లెస్సగా జెప్పుచున్నాను వినుము’ అని భావము. అర్జునునిపై ఈ ప్రీతి గురువగు శ్రీకృష్ణున కేలకలిగెను? అర్జునునియందు అసూయలేదు. అందువలన; మఱియు సామాన్యముగ జనులు రహస్యములను అందఱికిని చెప్పరు. మిక్కిలి నమ్మకము గలిగియున్నవారికే చెప్పుదురు. ఇపుడు భగవానుడు చెప్పబోవునది ‘గుహ్యతమమగు’ విద్య. అనగా అతిరహస్యమైనవిద్య. దానిని చెప్పవలెననిన, బోధితుడు ఎంతయో విశ్వాసపాత్రుడై యుండవలెను. ఆ విశ్వాసమో శిష్యుని హృదయనైర్మల్యమును జూచి గురువునకు కలుగుచుండును.
మఱియు ‘విజ్ఞానసహితముగ నీకు జ్ఞానమును బోధించుచున్నాను’ అని శ్రీకృష్ణమూర్తి వచించుటలో ఒక విశేషముకలదు. శాస్త్రములో జ్ఞానమని, విజ్ఞానమని కలవు. జ్ఞానమనగా శాస్త్రజన్యజ్ఞానము, పరోక్షజ్ఞానము. విజ్ఞానమనగా అనుభవజ్ఞానము, అపరోక్షజ్ఞానము. బోధ అనుష్ఠానరూపముగ పరిణమించినపుడే పూర్ణఫలితమును గలుగజేయును. కనుకనే గీతయందు జ్ఞానబోధతో తృప్తినొందక శ్రీకృష్ణమూర్తి విజ్ఞానమునుగూడ లెస్సగ బోధించినవారైరి.
ఇక నట్టి విజ్ఞానసహిత జ్ఞానమును తెలిసికొనినందువలన గలుగు ప్రయోజనమేమి? ఆ ప్రయోజనమేదియో భగవానుడే సెలవిచ్చిరి.
దాని ప్రయోజనము జననమరణరూప అశుభమునుండి విడివడుటయే యగును. పుట్టుక, చావు, దుఃఖము, రోగము, ముసలితనము మొదలగు అశుభములతో గూడుకొనిన ఈ భయంకర సంసారమునుండి అది జనులను విముక్తులుగజేయును. కావున దుఃఖమును బోగొట్టుకొన దలంచువాడు ఈ బ్రహ్మవిజ్ఞానమును తప్పక సంపాదించవలెను. ఈ విషయమును భగవాను డిచట స్పష్టపఱచిరి. మఱియు ఈ సంసారమును జూచి జనులు ఏమో గొప్పగ తలంచుకొనుచున్నారు. కాని శ్రీకృష్ణమూర్తి దానినంతను ‘అశుభముగ’ వర్ణించిరి.
ఏలయనిన అదియంతయు అసత్యమై, దృశ్యరూపమై, ఆత్మేతరమై, క్షణికమై, నశ్వరమైయున్నది. అశుభము నాశ్రయించినవా డశుభమునే పొందును. శుభము నాశ్రయించినవాడు శుభమునేపొందును. ఈ ప్రపంచమున యొకటియే, దైవమొకటియే శుభము. కావున దానినే ఆశ్రయించవలెను. అత్తఱి అశుభమునుండి యాతడు విముక్తిని బడయగలడు. ఈ ప్రకారముగ జ్ఞానవిజ్ఞానముల నాశ్రయించువారికి కలుగు ప్రత్యక్షఫలితము సంసారదుఃఖరాహిత్యము, నిరతిశయ ఆత్మానందప్రాప్తి అయియున్నది. కాబట్టి విజ్ఞులెల్లరు భగవానుడు బోధింపబోవు ఈ అనుభవపూర్వక బ్రహ్మతత్త్వమునెఱింగి కృతార్థులు కావలయును.
ప్ర:- బ్రహ్మ విద్య యెట్టిది?
ఉ:- విద్యలలోకెల్ల శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది.
ప్ర:- అది యెవరికి బోధింపబడును?
ఉ:- అసూయాది దుర్గుణములులేనివారికి.
ప్ర:- బ్రహ్మవిద్యకు అర్హతయేమి?
ఉ:- హృదయశుద్ధి, అసూయాది దుర్గుణారాహిత్యము.
ప్ర:- మనుజుడు కడతేరవలెననిన దేనిని తెలిసికొనవలెను?
ఉ:- జ్ఞానమును, విజ్ఞానమును (అనుభవజ్ఞానమును).
ప్ర:- దానిని తెలిసికొనినందువలన గలుగు ప్రయోజనమేమి?
ఉ:- జీవుడు జననమరణాది అశుభములనుండి విముక్తుడుకాగలడు.
ప్ర:- ఈ సంసార మెట్టిది?
ఉ:- అశుభరూపమైనది.
ప్ర:- దానినుండి తప్పించుకొనుట ఎట్లు?
ఉ:- అనుభవపూర్వకమగు బ్రహ్మజ్ఞానము నొందుటయే.
🕉🌞🌎🌙🌟🚩
Comments
Post a Comment