శ్రీమన్నారాయణీయం




శ్రీమన్నారాయణీయం / తృతీయ స్కంధము/ 11వ దశకము - హిరణ్యాక్ష- హిరణ్యకశిపుల ఉత్పత్తి  / 2-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

మనోజ్ఞ నైఃశ్రేయస కాననాద్యైరనేకవాపీమణిమందిరైశ్చ।
అనోపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యాః।

భావము:-

అట్లు వచ్చిన సనకాదులు, అచ్చట 'నైశ్రేయసము' అనబడు మనోహరమైన వనమును, అనేకములైన తటాకములను మరియు మణిఖచిత మందిరములతో విలసిల్లు ప్రాకారములను దాటి, నిరుపమానముగా వెలుగొందుచున్న నీ నివాసస్థానమును చేరిరి.

వ్యాఖ్య:-

మానవజన్మ పరమార్ధం భగవదఱదర్శనం అనుకుంటే వైకుంఠ దర్శనం ప్రతీ ఒక్కరి ఆకాంక్ష. అటువంటి వైకుంఠం ఎలా వుంటుందో మనకి పోతన భాగవతం త్రృతీయ స్కంధం 504 - 513 శ్లోకాలలో కనిపిస్తుంది.


జ్ఞానులలో శ్రేష్ఠులైన సనక సనందనాదులు చూసిన వైకుంఠం దివ్యమైన శోభతో నిత్యమూ దేదీప్యమానంగా మనోహరంగా ఉంటుంది. శరణుకోరే భక్తులు దాని పేరును స్తుతిస్తారు. అది జన్మబంధాలను ఛేదిస్తుంది; సజ్జనులచేత పొగడ బడుతుంది; భక్త జనులను పాలించే గుణాలకు ఆలవాలమైనట్టిది.


ఆ వైకుంఠ మహానగరంలో నివసించేవారు నిష్కామ ఫలమే తమకు సత్ఫలంగా భావిస్తూ, కైవల్యధర్మం కలవారై, విష్ణు పాదపద్మాలను పూజిస్తూ, అపురూపాలైన విష్ణు స్వరూపాలను ధరించి ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు.


రజస్తమోగుణాలకు అతీతుడూ, చక్కని కీర్తి కలవాడూ, స్వచ్ఛమైన సత్త్వగుణం కలవాడూ, జన్మరహితుడూ, ఆద్యంతాలు లేని భగవంతుడూ, అనంతశక్తిశాలీ, వేదాంత వేద్యుడూ, నిశ్చలం నిర్మలం అయిన ధర్మం మూర్తీభవించిన వాడూ అయిన విష్ణుమూర్తి పేరుతో ఆ నగరంలోని ఉద్యానవనం పెంపొందుతున్నది.


మోక్షమే మూర్తీభవించిందా అన్నట్లున్న ఆ ఉద్యానవనం ‘నైశ్శ్రేయసం’ అనే పేరుతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ వనంనిండా ఎన్నెన్నో కల్పవృక్షాలు స్వేచ్ఛగా పెరిగి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. అవి అన్ని వేళలా అన్ని ఋతువుల వైభవంతో శోభిస్తూ, అర్థిజనుల మనస్సులలో మొలకెత్తిన కోరికలను కొరత లేకుండా తీరుస్తుంటాయి.


కోకొల్లలుగా విరబూచిన మొల్లపూవుల సుగంధంతో కూడిన మకరంద బిందువులను మంద మారుతాలు అక్కడ నలుమూలలా వెదజల్లుతూ ఉంటాయి. తమ సుందరీ మణులతో విమానాలలో విహరించే గంధర్వులు ఆ కమ్మని పూలతేనెల సోనలను ఆస్వాదిస్తూ మైమరచి మహానుభావుడైన విష్ణుదేవుని కథలు చెప్పుకొనడం మరిచిపోతూ ఉంటారు.


అంతలోనే వారు ఆ అజ్ఞానంనుండి తేరుకొని విచ్చలవిడిగా విషయ వాసనలను రెచ్చగొట్టే ఆ సువాసనలు నారాయణుని పాదపద్మాల సేవకు ఆటంకాలని భావించి ఆ సువాసనలను తృణీకరించి విష్ణుసేవాపరాయణులై సంచరిస్తూ ఉంటారు.


పావురాలూ, హంసలూ, బెగ్గురు పక్షులూ, చిలుకలూ, కోకిలలూ, వానకోయిలలూ, తీతువుపిట్టలూ, నెమళ్ళూ, చక్రవాకాలూ మొదలైన పక్షులు వారి మనస్సులలో ఆనందం పొంగిపొరలేటట్లు చేస్తూ ఉంటాయి. ఆ కోలాహలాన్ని మించి విష్ణుకథలను నిరంతరం గానం చేస్తున్నట్లు ఝంకారం చేస్తున్న గండుతుమ్మెదలతో కూడిన మేలుజాతి పూలతీగలు కనువిందు చేస్తుంటాయి.


వందనీయ చరిత్రుడైన వైకుంఠనిలయుని కంఠంలో వనమాలికలుగా వెలసి విలసిల్లడానికి ఈ తులసి ఎంతటి తపస్సు చేసిందో అని ఆనందంతో అభినందిస్తున్నట్లు మంచి గంధపుచెట్లు, మందారాలు, మల్లెలు, కమలాలు, సురపొన్నలు, పొన్నలు, పొగడలు, అశోకాలు, గోరంటలు, కలువలు, పారిజాతాలు గుత్తులు గుత్తులుగా పూచి తులసీ వనాలపై సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి.


అక్కడ ఒత్తుగా పూచిన పూలగుత్తులతో గుబాళించే పొదరిండ్లున్నాయి. ఆ పొదరిండ్లలో ఎత్తైన స్తనకుంభాల బరువుకు నకనకలాడే సన్నని నడుములు కల కొందరు సుందరీమణులు విహరిస్తుంటారు.


ఆ లతాంగులు నీలిరంగు పట్టుచీరలు కట్టుకొని, బంగారు గజ్జెల ఒడ్డాణాలు సింగారించు కొని ఉంటారు. వారి వయ్యార నడకల సొగసులు హంసలనూ, నెమళ్ళనూ ఎగతాళి చేస్తున్నట్లుంటాయి. వారి వాలుకన్నులు మన్మథుని పూలబాణాలను పరిహసిస్తుంటాయి.


వారి సౌందర్యానికి లొంగక, వారితో శృంగారక్రీడలను కోరుకోకుండా, అక్కడి విష్ణుభక్తులు గోవిందుని చరణారవిందాలను సేవించడం వల్ల లభించిన నవరత్నాలు పొదిగిన బంగారు విమానాలను ఎక్కి అక్కడి పుణ్యప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు.


అందాలదేవి అయిన లక్ష్మీదేవి ముల్లోకాల సౌందర్యం మూర్తీభవించినట్లుగా మణులు చెక్కిన కాలి అందెలు ఘల్లుఘల్లున మ్రోగుతుండగా తన మనోనాథుడయిన వైకుంఠనాథుని మందిరంలో తన చంచలత్వాన్ని మాని సంచరిస్తూ ఉంటుంది. ఆమె తన చేతిలోని లీలాకమలాన్ని త్రిప్పుతూ ఉండగా ఆమె నీడ ఆ మేడలోని బంగారు పాలరాతి గోడలపై ప్రతిఫలిస్తుంది. అప్పుడది విష్ణుమందిర సమ్మార్జనమే పరమధర్మమని ప్రకటిస్తున్న ట్లుంటుంది.


వనంలోని పరిమళాలను వెదజల్లే తులసీదళాలను దండలు కట్టి లక్ష్మీదేవి తన హృదయేశ్వరుని పద కమలాలపై అర్పిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమవల్ల కలిగిన స్వేద బిందువులవల్ల నుదుటనున్న కస్తూరీ తిలకం కరిగి అంటుకొని కదలుతున్న ముంగురులతో, నువ్వుపువ్వువంటి చక్కదనాల ముక్కుతో ముద్దులు మూటగట్టే ఆమె ముఖపద్మం అక్కడి కోనేటినీటిలో ప్రతిబింబిస్తుంది.


అప్పుడు ఆమె నీల మేఘశ్యాముడైన విష్ణువు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లు భ్రమించి సిగ్గుతో తల వంచుకొంటుంది. అటువంటి దిగుడు బావుల చుట్టూ గట్టులపైన పగడాలతీగలు అల్లుకొని ఉంటాయి. ఈ విధంగా ఎంతో హృద్యమైన ఆ ఉద్యానవనం పుణ్యానికి ఆస్థానమై, ధర్మానికి సంస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగొందుతూ ఉంటుంది.


విష్ణువుకు విముఖులైన వాళ్ళూ, ఇతర లౌకిక సుఖాలతో సతమతమయ్యే మనస్సు కలవాళ్ళూ, పాపపు నడవడి కలవాళ్ళూ, నరకానికి కారణాలై దూషింపదగిన చెడ్డ కథలందు ఆసక్తి కలిగి మెలిగేవాళ్ళూ భగవంతుని పాదపద్మాలను సేవించే భక్తులుండే ఆ పవిత్ర ప్రదేశాన్ని చేరుకోలేరు.


పాపాలను హరించేవాడూ, పరాత్పరుడూ, కేశవుడూ, అనంతుడూ అయిన విష్ణువును సేవించడానికి ప్రధానసాధనం భక్తి మాత్రమే. కేవలం ధర్మశాస్త్ర పరామర్శతో పండిన బుద్ధికౌశలం కలిగిన మానవులు ఆ నారాయణుని మాయచేత మరింత మోహితులై అతని పాదపద్మాలను సేవించే పద్ధతిని తెలుసుకోలేరు. అందుచేత వారు ఆ వైకుంఠ స్థానాన్ని అందుకోలేక పోతున్నారు.


పద్మనాభుడైన విష్ణువు యొక్క దివ్యమంగళ కథలను ఆలపించడం వల్ల పెల్లుబికిన ఆనందబాష్ప ధారలు చెక్కిళ్ళపై జారి కంఠం గద్గదమై మేను పులకించినవాళ్ళూ, వైరాగ్యభావం కల మనస్సు కలవాళ్ళూ, అహంకారాన్ని విడిచినవాళ్ళూ సజ్జనులుండే ఆ వైకుంఠ పుణ్యప్రదేశంలో ఉంటారు.


తెలుసుకోవాల్సింది ఏంటంటే వైకుంఠమే ఒక సరోవరం. దివ్యమైన బంగారు మంటపాలతో, గోపురాలతో, మేడలతో కూడిన ఆ మహామందిరమే పద్మం. ఆ మందిరం మధ్యభాగాన ప్రకాశించే ఆదిశేషుడే తామరదుద్దు. శేషతల్పంపై శయనించే మాధవుడే తుమ్మెద.

🕉🌞🌎🌙🌟🚩
09-16-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
🕉🌞🌎🌙🌟🚩

అ|| ఈ ప్రపంచమున సమస్తము పరమాత్మయే అని నాలుగు శ్లోకములద్వారా వచించుచున్నారు -

అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ |
మన్త్రోఽహమహమేవాజ్యం
అహమగ్నిరహం హుతమ్ ||

తా:- (అగ్నిష్టోమాదిరూప)  క్రతువు నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, హవిస్సు నేనే, అగ్ని నేనే, హోమకర్మమున్ను నేనే, అయియున్నాను.


వ్యాఖ్య:- పరమాత్మ సర్వవ్యాపకులై, విశ్వతోముఖులై సమస్తపదార్థము లందును వెలయుచున్నారను వాక్యమును ఋజువుచేయుటకై దృష్టాంతరూపముగ యజ్ఞమనుక్రియనుగైకొని, దానియందుపయోగింపబడు సమస్తమున్ను భగవత్స్వరూపమేయని వచించుచున్నారు. అదేవిధముగ ప్రపంచమందలి సమస్తపదార్థములున్ను భగవద్రూపములేయని దీనినిబట్టి తెలిసికొనవలయును. అట్లు తెలిసికొని భక్తిభావసంయుతులై, క్రమముగ అట్టి సర్వాత్మభావమును అనుభూత మొనర్చుకొనవలెను.

🕉🌞🌎🌙🌟🚩
శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-9-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

వేదాన్ పురాణనివహానపి సర్వవిద్యాః
కుర్వన్ నిజాననగణాచ్చతురాననో౾సౌ
పుత్రేషు తేషు వినిధాయ స సర్గవృద్దిమ్
అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితో౾భూత్||

భావము:-

బ్రహ్మదేవుడు, లోకసృష్టిచేయు కార్యమునుండి రుద్రుని విరమింపజేసి, తన మానస పుత్రులను లోకసృష్టికి నియమింపవలయునని తలచి, తన నాలుగు ముఖముల నుండి సకల వేదములను, సకల పురాణములను, సకల విద్యలను వెలువరించెను. అట్లు వెలువడిన వేదజ్ఞాన రాశిని తన మానస పుత్రులకు అందజేసెను. అయినా లోకంలో ప్రజాసృష్టి జరగలేదు. అంతట బ్రహ్మ నీ పాదపద్మాల్ని ఆశ్రయించెను.

వ్యాఖ్య:-

పరమాత్ముని నిశ్వాసమే బ్రహ్మసృష్టికి స్ఫూర్తి - ఆ నిశ్వాసం అంతరిక్షంలో ఇప్పుడూ ఉంది - ఎన్ని ప్రళయాలు సంభవించినా, ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్లినా దీనికి లయమూ, అంతమూ లేవు. ప్రతి ప్రళయం వెనుకా వచ్చే ప్రతి బ్రహ్మా ఆదిమ శబ్దతరంగాలైన వేదమంత్రాల సహాయంతోనే సృష్టి కార్యం కొనసాగిస్తాడు.


వాటికి మూలం ప్రకంపన. ఈ ప్రకంపననే బ్రహ్మవేదాలుగా గ్రహించి, ఉచ్ఛరిస్తే సృష్టి సంభవిస్తుంది.


వేదమంత్రాలను తన తపస్సుతో ధ్యానగరిమతో ఉపయోగించి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు.  బ్రహ్మ పరమాత్మ నుండే ఉద్భవించటం వల్ల వేదాలపైన ఆయన అధికారం సంపూర్ణం.


నిర్గుణుడు, చైతన్యమూర్తీ అయిన బ్రహ్మ నుండే విశ్వసృష్టి జరుగుతుంది. ప్రళయవేళల ఆ చైతన్యం నిశ్చలమవుతుంది. మల్లయోధుడు నిద్రించేప్పుడు అతని బలం మనకు తెలియదు. మల్లయుద్ధం చేసేప్పుడో, మరియే ఇతర పని చేసేప్పుడో అతని బలం మనకి కనబడుతుంది. ఆ విధంగానే సృష్టివేళ విశ్వంలోని శక్తి ఎన్నో కార్యాలని నిర్వహిస్తుంది. ఆ నిశ్చలమైన దాని నుండి ఈ శక్తి బయల్వెడలు తుంది. బ్రహ్మ అటువంటి శక్తినుండి వచ్చిన వాడే. తపస్సు రూపంలో జనించిన వాడవటం వల్ల, వేదాలనన్నిటినీ వాటి పటుత్వంతో ఆయన గ్రహించగలిగాడు. వేదాలు అనంతం - సృష్టికూడ బహుముఖమే, వైవిధ్యంతో కూడినదే.


బ్రహ్మం రూపందాల్చినప్పుడు ఆయన అంతరంగంలో వేద శబ్దాలన్నీ జనించాయి. సృష్టి ఎట్లా చేయాలో ఆయనకి చూపాయి. సహజస్ఫురణతో విదితమయాయి.


ఒక్కమాటలో చెప్పాలంటే ఆది లేని శాసనమే వేదం. ఈ స్రృష్టిలో ప్రతీ వస్తువూ తాత్కాలికంగా అంతమొంది, సృష్టితో కూడ మళ్లీ జనిస్తూంటుంది. కాని సార్వభౌముడైన పరమాత్మకు గాని, శాసనమైన వేదానికి గాని మొదలూ లేదు, తుదీ లేదు.

🕉🌞🌎🌙🌟🚩


శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-7-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిః
తత్రాంగిరాః క్రతుమునిః పులహః పులస్య్తః।
అంగాదజాయత భృగుశ్చ వశిష్ఠ దక్షౌ
శ్రీనారదశ్చ భగవన్ భవదంఘ్రిదాసః||

భావము:-

పిమ్మట, సృష్టి యందు ఆసక్తి చే బ్రహ్మ- మరీచి, ఆత్రి, అంగిరుడు, క్రతుముని, పులవుడు, పులస్త్యడు, భృగువు, వశిష్టుడు, దక్షుడు మరియు నారదులను తన నుండి సృష్టించెను. వారిలో నారదుడు నీ పాదపద్మములకు దాసుడు.

వ్యాఖ్య:-

ఈరోజు శ్లోకాలలో బ్రహ్మమానస పుత్రుల జననం చూశాము. ఈ సందర్భంగా దేవదానవ జనన వ్రృత్తాంతం భారతంలో ఉన్నది చూద్దాం.

జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు. ఆయన ఇలా చెప్పాడు. సృష్టికి మూలం బ్రహ్మ దేవుడు. ఆయన మానస పుత్రులు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి.


బ్రహ్మ దేవుని కుడి బొటనవ్రేలి నుండి దక్షుడు ఎడమ బొటన వ్రేలి నుండి ధరణి జన్మించారు. వారిరువురికి వెయ్యిమంది మహా పురుషులు జన్మించారు. దక్షునికి ఏభై మంది కుమార్తెలు జన్మించారు. వారిలో పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు.


వారిలో దితికి హిరణ్య కశిపుడు అతనికి ప్రహ్లాదుడు అతనికి విరోచనుడు అతని కొడుకు బలి చక్రవర్తి అతని కొడుకు బాణాసురుడు. దను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు.


 కద్రువకు నాగ కుమారులు జన్మించారు. బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగీరసునకు ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తనుడు అనే కుమారులు కలిగారు. బృహస్పతి ఇంద్రునికి గురువైయ్యాడు. మూడవ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహా మునులు జన్మించారు. నాల్గవ మానస పుత్రుడైన పులస్త్యునకు రాక్షసులు పుట్టారు.


 ఐదవ మానస పుత్రునికి కిన్నెరలు, కింపురుషులు పుట్టారు. క్రతువు అనే మానస పుత్రునికి పక్షి జాతి పుట్టింది. దేవ్బుడు అనే వసువు కొడుకు ప్రజాపతి అతనికి అష్ట వసువులు జన్మించారు. వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగువు కుమారుడు కవి అతని కుమారుడు శుకృడు. శుకృడు రాక్షస గురువైయ్యాడు. భృగువు కుమారుడు చ్యవనుడు అతని కుమారుడు ఔర్యుడు. ఔర్యుని కుమారుడు జమదగ్ని.


 జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇక భూమి పైన దేవ దానవాంశలతో రాజులు జన్మించారు. విష్ణు మూర్తి అంశతో కృష్ణుడు, ఆదిశేషుని అంశతో బలరాముడు, లక్ష్మీ దేవి అంశతో రుక్మిణీ, అప్సరసల అంశతో పదహారు వేల గోపికలు, ప్రభాసుని అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. ద్రోణునికి కామ క్రోధములు కలసి అశ్వత్థామగా జన్మించాడు. మరుత్తుల అంశతో విరాటుడు, సాత్యకి, దృపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశతో కుంతి మాద్రి జన్మించారు.


 ఏకాదశాంశతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు దృతరాష్ట్రునిగానూ మతి అనే దేవత గాంధారిగానూ జన్మించారు. కలి అంశతోదుర్యోధనుడు,హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, ప్రహ్లాదుడు శల్యునిగా, కాలనేమి అంశతో కంసుడు, విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు. అశ్వపతి కృతవర్మగా గుహ్యకుడు శిఖండిగా, మరుద్గణాంశతో పాండురాజు జన్మించారు.మాండవ్యముని శాపకారణంగా యమ ధర్మరాజు విదురుడిగా జన్మించాడు.


 యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా శ్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు జన్మించారు అని వైశంపాయనుడు చెప్పాడు.

🕉🌞🌎🌙🌟🚩


శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-8-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

ధర్మాదికానభిసృజన్నథ కర్దమం చ
వాణీం విధాయ విధిరంగజసంకులో౾భూత్।
త్వద్బోధితైస్సనకదక్షముఖైస్తనూజైః
ఉద్బోధితశ్చ విరరామ తమో విముంచన్||

భావము:-

అనంతరము ధర్మాధి దేవతలను, కర్ధముడుని సృష్టించెను. సరస్వతిని తానే సృష్టించినను ఆమెపై బ్రహ్మదేవునికి మోహము కలిగెను. అప్పుడు; నీచే ప్రేరేపింపబడిన సనకుడు, దక్షుడు మెుదలగు తన కుమారుల ఉద్భోదతో, బ్రహ్మ, అజ్ఞాన ప్రేరితమైన తమోగుణ ప్రవృత్తిని వదిలి వేసెను.

వ్యాఖ్య:-

ప్రథమ సృష్టి నిర్మాణంలో ఈ క్రింది వరసలో సృష్టి కార్య రచన జరిగింది.


1. సనత్కుమార సనక సనందన సనస్తుజాన లు పుడతారు వారిని తిరిగి సృష్టి రచన లో పాల్గొమనగా భగవంతుని అర్చన లో మాకు ప్రీతి అని నిరాకరిస్తారు.


2. నిరాకరించిన క్రోధం ఆపుకొనగా బ్రహ్మ భ్రుకుటి లోంచి రుద్రుడు, ఏకాదశ రుద్రులు పుడతారు. సృష్టి రచన బదులు తామూ తమ రోదన ఫలితపు క్రోధంతో లోకల లయం చేయగా తపస్సు చేయమని ప్రభోధిస్తే తపస్సు చేస్తూ రుద్రుడు శివుడు అవుతాడు.


3. బ్రహ్మ గారు తిరిగి తపస్సు చేసి నవ ప్రజాపతులు, నారదుని సృష్టిస్తారు.
మరీచి అత్రి అంగీరస పులత్స్య క్రతువు భృగువు పులహుడు వశిష్ఠుడు అంగుష్టం నుండి దక్షుడు ఈ నవ ప్రజాపతులు.


4. వారితో బాటుగా మొదటగా సృష్టించబడినవి ఇవి
ధర్మము అధర్మము మృత్యువు కామము కోపము లోభము సముద్రాలు నిరృతి పాపములు నీడ నుంచి కర్ధముడు మొదలగునవారు.


5. హృదయంలోంచి సరస్వతి పుడుతుంది కానీ మోహ కారణంగా బ్రహ్మ మనో చాంచల్యం కలుగగా తన ఇతర పుత్రులైన ప్రజాపతులు హేళనగా నవ్వగా బ్రహ్మ తన శరీర త్యాగం గావిస్తారు. ఆ శరీరమే ఇప్పటికీ పొగమంచు రూపంలో ఈ భూమిపై తిరుగాడుతూ ఉంటుంది.


6. తిరిగి ద్వితీయ శరీర ధారణ చేసి తపస్సుతో తన సృష్టి కార్య రచన సాగిస్తారు. ఈ క్రింది సృష్టి రచన జరిగింది.
నాలుగు వేదాలు, యజ్ఞములు, ధర్మము యొక్క నాలుగు పాదాలు ఆయిన విద్య దానము తపస్సు సత్యములు, శస్త్రము ఆయుర్వేదం స్తుతి వడ్రంగి శిల్పాది కళలు, పంచమ వేదములు ఆయిన పురాణాలు ఇతిహాసాలు షోడసి యజ్ఞలు బ్రహ్మచర్య గృహస్త వానప్రస్తాది ఆశ్రమ ధర్మాలు మనుష్యులు - అన్విక్షకి త్రయీ దండనీతి వార్త చదువులు, హృదయం లోంచి ప్రణవం, భూ భువః వంటి సప్త వ్యాహృతులు, చందస్సులు సంగీతం సప్త స్వరాలు అచ్ఛులు హల్లులు ఉష్మలు అక్షరములు బలము ఇతరములు సృష్టి చేస్తారు.

🕉🌞🌎🌙🌟🚩


ఓం నమః శివాయ:
శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-6-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

రుద్రాభిసృష్టభయదాకృతిరుద్ర సంఘ
సంపూర్యమాణు భువనత్రయ భీతచేతాః|
“మా మా ప్రజాః సృజ తపశ్చర మంగళాయే”
త్యాచష్ట తం కమలభూర్భవదీరితాత్మా||

భావము:-

రుద్రుడు భయంకరాకృతి కలిగిన ప్రాణులను సృష్టించుట ప్రారంభించెను. త్రిలోకములు ఆ భయంకర ప్రాణులచే నిండిపోవుచుండగా బ్రహ్మదేవుడు భీతిచెందెను. నీ ప్రేరణచే బ్రహ్మ, రుద్రునితో “నీవు ప్రాణులను సృష్టించవలదు. లోకమునకు శుభము కలుగించు తపస్సు ఆచరించుము“ అని పలికెను.


వ్యాఖ్య:-

ఈదశకంలో మన స్రృష్టి ప్రకరణని చూస్తున్నాం. ఒకప్పుడు సృష్ఠికర్త అయిన బ్రహ్మదేవుడికే
జగత్తుకు మూలాధారమేది? ఎవరివల్ల ఈ సృష్టి అంతా జరుగుతుంది? ఎవరైనా రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? అనే సందేహాలు కలిగాయి.  ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాల సారం దేవీభాగవతం తృతీయ స్కంధంలో మనకు కనిపిస్తుంది.


జనమేజయుడు తన మనసులోని ఈ సందేహాలను వ్యాసుడి దగ్గర ప్రస్తావించాడు. వ్యాసుడికి కూడా ఇటువంటి సందేహాలు కలిగితే వాటిని నారద మహర్షి దగ్గర ప్రస్తావించాడు.


నారదుడు ఆ ప్రశ్నలన్నింటినీ విని తనకే ఆ సందేహాలు వచ్చాయని వాటిని గురించి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు ఆయన తనకు సందేహనివృత్తి చేసి త్రిమూర్తులకు కలిగిన దివ్యానుభూతులను వివరించాడని, కథాక్రమాన్నంతా చెప్పాడు. ఒకప్పుడు ప్రళయం సంభవించింది.


ఆ ప్రళయ కాలంలో చుట్టూ జలం, మధ్యలో ఒక మహాపద్మం, ఆ పద్మం దుద్దుమీద బ్రహ్మదేవుడు ఒంటరిగా కూర్చొని తానెవరు? తానిప్పుడు ఏంచేయాలి? అనే విషయాలను గురించి తీవ్రంగా ఆలోచించటమేగాక అసలు తానున్న పద్మం ఎక్కడ నుంచి ఉద్భవించింది? అని కూడా తెలుసుకోవాలనుకున్నాడు.


అలా అనుకొని పద్మానికున్న కాడను పట్టుకొని జలంలోకి బయలుదేరాడు. ఎంతకాలం వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకు ఆ కాడ అంతమూ, భూమి ఎక్కడా ఆనవాళ్ళే కనిపించలేదు. దాంతో వెంటనే ఆయన మళ్ళీ పద్మంలో ఉన్న దుద్దు మీదకు వచ్చి చేరాడు.


ఇంతలో మధు, కైటభులనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మను సంహరించటానికి బయలుదేరి వచ్చారు. వారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక బ్రహ్మ పద్మం కాడ లోపలికి ప్రవేశించాడు. అలా ఆ మార్గాన ఎంతోదూరం వెళ్ళగా ఒకచోట శేషతల్పం మీద యోగనిద్రలో శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు కనుపించాడు. కొద్ది సమయం ఆగి బ్రహ్మ నిద్రాదేవిని స్తుతించాడు.


వెంటనే ఆమె శ్రీ మహా విష్ణువును వీడి గగనంలో నిలిచింది. ఆ వెంటనే విష్ణువు మెల్లగా కళ్ళు తెరిచి బ్రహ్మను చూశాడు. విషయమంతా తెలుసుకొని మధు, కైటభులను తన విశాలమైన తొడమీద పెట్టుకొని సంహరించాడు. ఇంతలో అక్కడకు రుద్రుడు వచ్చాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు ముగ్గురూ కలిసి జగదాంబను స్తుతించారు.


జగదాంబ వారి స్తుతులకు ఆనందించి రాక్షస సంహారం అయింది కనుక ఇక ఎవరి విధులను వారు నిర్వర్తించమని బ్రహ్మకు ప్రత్యేకంగా సృష్టిని చెయ్యమని చెప్పింది. అయితే బ్రహ్మ చుట్టూ నీరు తప్ప మరెక్కడా భూమి కానీ, మరేమీ కానీ లేవని మరి సృష్టి ఎలా చేయటం? అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు.


అప్పుడు జగదాంబ తాను ఏ పలుకు పలికినా పూర్వాపరాలు లేకుండా, ఆధారాలు లేకుండా వృధాగా ఎప్పుడూ పలకనని నిరూపించటానికి, అలాగే తాను ఏదిచెప్పినా వెంటనే చేసితీరాలనికానీ సందేహ పడకూడదనే విషయాలను నిరూపించటానికి తన శక్తేమిటో, తానెవరో మరోమారు త్రిమూర్తులకు వివరించటానికి ఒక విషయాన్ని వారికి చూపించాలనుకుంది.


ఆమె చిరునవ్వు నవ్వగానే ఒక దివ్యవిమానం వారిముందు వాలింది. ఆ విమానంలో బ్రహ్మ, విష్ణు, రుద్రులు, జగన్మాత అందరూ ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆ దివ్యవిమానం సర్వలోకాలను చుట్టిరావాలన్న దేవీ సంకల్పంతో బయలుదేరింది. లోకాలన్నీ సంచరిస్తూ స్వర్గలోకానికి, అలాగే వైకుంఠానికి, కైలాసానికి, సత్యలోకానికి బయలుదేరి వెళ్ళింది.


చాలా విచిత్రంగా త్రిమూర్తుల లోకాలు త్రిమూర్తులకు మళ్ళీ వారి రూపాలలో ఒక్కొక్కరు కనిపించసాగారు. ఆ మాయ ఏమిటో, అలా ఎందుకు జరుగుతుందో బ్రహ్మ, రుద్రులకు త్వరగా అవగతం కాలేదు.


అయితే విమానంలో ఉన్న శ్రీమహావిష్ణువు మాత్రం కొంత ముందుగా విషయాన్ని గ్రహించగలిగాడు.


తమ చెంత ఉన్న జగన్మాత ఈ సకల సృష్టికి మూలస్వరూపిణి అని, అంతకుముందు ప్రళయ కాలంలో వటపత్ర శాయిగా ఉన్న తనను తల్లిగా లాలించి, పోషించింది కూడా ఆ జగన్మాతే అని గ్రహించ గలిగాడు విష్ణుమూర్తి.


అలా ఆ దివ్యవిమానం మెల్లగా కదులుతూ పాలసముద్రంలో ఉన్న ఒక అద్భుత ద్వీపానికి చేరుకుంది. ఎన్నెన్నో అమూల్య సుందర సౌధాలు, వనాలు వారికక్కడ కనిపించాయి. ఆ ద్వీపంలో ఒకచోట శివాకారంలో ఒక ప్రదేశం కనిపించింది.


ఆ ప్రదేశంలో ఓ దివ్యమైన స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలమాలలు, ఎర్రచందనం, విశాలంగా ఉండి ఎర్రబారిన కళ్ళతోనూ, పెదవులతోనూ, మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశిస్తుంది. చిరునవ్వులు చిందిస్తున్న ఆ దివ్యసుందర మూర్తిని ఎందరెందరో దేవకన్యలు సేవిస్తూ ఉన్నారు.


అటువంటి దివ్యసుందరమూర్తి ఎవరై ఉంటుందా? అని త్రిమూర్తులంతా నివ్వెరపోతూ చూస్తూ ఉన్న సమయంలో మళ్ళీ విష్ణుమూర్తే ఆమె సాక్షాత్తూ తమకందరికీ కారణభూతురాలైన మహాదేవి అని గుర్తించాడు.


మహావిద్య, మహామాయ, పూర్ణప్రకృతి, అవ్యయ, యోగగమ్య, ఇచ్ఛారూపిణి, నిత్యానిత్య స్వరూపిణి, విశ్వేశ్వరి, వేదగర్భ అన్నీ ఆమేనని విష్ణుమూర్తి గ్రహించాడు.


సకల జీవకోటి చిహ్నాలు ఆమె శరీరంలో కనిపించసాగాయి. ఆ విషయాలను విష్ణువు తన పక్కన ఉన్న బ్రహ్మకు కూడా చెప్పాడు.


ఇంతలో ఓ విచిత్రం జరిగింది. విమానం దిగి ఆ మహాశక్తి ముంగిట నిలచిన ముగ్గురు దేవతలు ఆ మహాదేవిని చూసి స్తుతిస్తూ నమస్కరించారు.  ఆ మహాదేవి కూడా చిరునవ్వు నవ్వుతూ త్రిమూర్తులవంక చూసింది. క్షణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్త్రీమూర్తులుగా మారిపోయారు.


ఈ విచిత్రం ఆ ముగ్గురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. త్రిమూర్తులు నానారత్న శోభితమై ప్రకాశిస్తున్న ఆ దేవి పాదపీఠాన్ని అలా చూస్తు నిలుచుండిపోయారు.


దేవి చుట్టు ఉన్న సఖీజనం వింజామరులు వేస్తూ, మంగళఘోషతో అమ్మవారికి ఆనందం కలిగిస్తున్నారు. మరోక్షణంలో త్రిమూర్తుల చూపులు ఆమె పాదాలపైన ప్రత్యేకించి బొటనవేలి గోరుపైన పడ్డాయి.


తళతళలాడుతూ అద్దంలా ఉన్న ఆ బొటనవేలి అద్దంలాంటి గోరులో సకల జగత్తు, బ్రహ్మాండం, సూర్య చంద్రులు, గ్రహ తారకలు, సముద్రాలు, దేవతలు ఒకటేమిటి సృష్టిలో ఉన్నదంతా కనిపించంది. ఆ మహాత్వాన్ని చూసి బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఒక్కొక్కరు విడివిడిగా దేవిని స్తుతించి తమకు జ్ఞానోదయమైందని పలికారు. అనంతరం జగదాంబ కరుణారస దృక్కులతో త్రిమూర్తులకు వారివారి రూపాలు వచ్చాయి.


దేవిజగన్మాత పలుకు పలికినా అది శిరోధార్యమేనని అనుకున్నారు. తమవెంట విమానంలో ఉన్న జగన్మాత ఈ ఆదిపరాశక్తిగా ఇక్కడ భాసిల్లుతోందని గ్రహించారు.


శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-5-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

ఏకాదశాహ్వయతయా చ విభిన్నరూపం
రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్త్వా।
తావంత్యదత్త చ పదాని భవత్ర్ర్పణున్నః
ప్రాహ ప్రజావిరచనాయ చ సాదరం తమ్||

భావము:-

బ్రహ్మదేవుడు ఆ రుద్రునికి పదకొండు రూపములను, పదకొండు నామములను కల్పించెను. ఆ పదకొండు రూపములకు పదకొండుగురు స్త్రీలను (పత్నులను), పదకొండు స్థానములను ఇచ్చెను. పిమ్మట, ప్రజలను సృష్టించమని ఆదరముతో పలికి, వారిని లోకసృష్టి కార్యమున నియమించెను.

వ్యాఖ్య:-

భట్టతిరి వారు శ్లాఘించిన ఈ రుద్రావతార విషయంలో శివపురాణం/రుద్ర ఖండము/రుద్రావిర్భావం లో వివరించిన ఏకాదశ రుద్రాల గురించీ చూద్దాం.


దేవతలు రాక్షసుల బాధల కోర్వజాలక తమ తండ్రి అయిన కశ్యపుడిని ప్రార్ధించారు. శివునికై తపించిన కశ్యపుడికి శివానుగ్రహం కలిగింది. దేవతల దుఃఖాన్ని ఆయన శివునికి వివరించి, దారిచూపమన్నాడు.


సురభి యందు కశ్యపుడికి పదకొండుగురు కొడుకులుగా శివుడు ఉద్భవిస్తానని మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే కాలాంతరంలో...

1. అజపా ,
2. అహిర్భుద్నుడు,
3. చండుడు,
4. కపాలి,
5. భవుడు,
6. భీముడు,
7. పింగళుడు,
8. విలోహితుడు,
9. విరూపాక్షుడు,
10. శంభుడు,
11. శాంతుడు
అనే రూపాలతో జన్మించాడు.
ఇదే ఏకాదశ రుద్రావతరణం.


ఈశాన్య దిక్కున వాసం ఏర్పరచుకున్న ఈ 11 గురు శివరూపులే శిష్టుల్ని రక్షిస్తూ లీలావిలాసాలు ప్రదర్శిస్తున్నారు. "నమో రుద్రేభ్యః" అని ఆపాడు సూతమహర్షి.


మునులంతా కూడా ఇదే మంత్రాన్ని రుద్రాధ్యాయం నుండి ఉచ్చైస్వరంతో పఠించారు.

🕉🌞🌎🌙🌟🚩


శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-4-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతో౾స్య
భ్రూమధ్యతో౾జని మృడో భవదేకదేశః।
“నామాని మే కురు పదాని చ హా విరించే”
త్యాదౌ రురోద కిల తేన స రుద్ర నామా||

భావము:-

తన వాక్కులను నిరాదరించిన తన మానస పుత్రులపై కలిగిన ఆగ్రహమును అణచుకొనుటచే, అప్పుడు బ్రహ్మదేవుని కనుబొమల మధ్య నుండి నీ అంశముతో 'మృడుడు' జనించెను. ఆ 'మృడుడు’ ప్రభవించిన మరుక్షణమే తనకు నామములను, స్ధానములను కల్పించమని రోదించెను. ఆ విధముగా రోదించిన మృడునికి ‘రుద్రుడు՚ అను నామము కలిగెను.

వ్యాఖ్య:-

ఈరోజు శ్లోకంలో బ్రహ్మగారు రుద్రుడిని స్రృష్టించడం చూశాము. రుద్రులు ఎందరో. ఇలాగే కాలభైరవ స్రృష్టికి బ్రహ్మ గారికి సంబంధించిన కధ చూద్దాం.


ఒకానొక కల్పకాలంలో పరబ్రహ్మ ఎవరనే విషయమై బ్రహ్మ,విష్ణువుల మధ్య వాగ్వాదం చెలరేగి శివమాయాప్రభావాన అది అనంతంగా కొనసాగింది.


ఇంతలో వారి మధ్యనుంచి ఓ జ్యోతి బయల్దేరి, బ్రహ్మాండంగా ప్రజ్వరిల్లసాగింది. ఆ వెలుగులో రుద్రమూర్తి బయల్వెడలినాడు.


బ్రహ్మ ఆ దృశ్యం చూసి, "ఇప్పటికే ఇక్కడ పరబ్రహ్మమెవరో తేలిక కొట్టుకుంటూంటే, నువ్వూ పోటీకి తయారయ్యావా!" అంటూ ఎగతాళి చేశాడు.


బ్రహ్మ అహంకారానికి రుద్రుడు కోపించి ఓ మహాభీకర రూపాన్ని సృష్టించాడు. అతడే భైరవుడు. 'ఆమర్దకుడు' అనే పేర వెలసే భైరవాకృతికే కాలభుడని, కాలరాజు అనీ పేర్లున్నాయి. అంతేకాక భక్తుల పాపాలను భక్షించడం వల్ల పాపక్షకుడనే పేర కూడా వర్ధిల్లుతున్నాడు. (కాశీ క్షేత్రానికి అధిపతి)


కాలభైరవుడు రుద్రాజ్ఞప్రకారం బ్రహ్మ ఐదోముఖాన్ని త్రుంచాడు. సమయం చూసి, బ్రహ్మ స్త్రోత్రం చేసాడు. "తమరే పరబ్రహ్మ స్వరూపం" అని కీర్తించాడు. రుద్రుడు శాంతించాడు.


బ్రహ్మ ఒక కన్యను సృష్టించి, కాల భైరవుడి వెంట పంపాడు.

కాలం ఎంతటి వారినైనా కడగండ్లపాలు చేయడం సహజం కదా!


భైరవుడు బ్రహ్మ శిరస్సును త్రుంచి, విదిలించినా అది అతడి కొనగోటి నుంచి ఎంతకూ ఊడిపడలేదు. లోక సంచారంలో ఎవరి వల్లనైనా,ఈ కపాలానికి మోక్షమార్గం దొరుకుతుందేమో చుద్దామని అలాగే గోటికి అంటిన కపాలంతోనే ఊళ్ళు తిరగసాగాడు భైరవుడు.


కాశీలో అడుగిడగానే, అతడ్ని వెన్నంటిన బ్రహ్మహత్య పెద్దపెట్టున హాహాకారాలు చేస్తూ పాతాళానికి క్రుంగిపోయింది. భైరవుడి చేతినుండి ఆ కపాలం కూడా రాలిపోయింది. అక్కడ ఏర్పడినదే నేటి బ్రహ్మకపాల తీర్ధం!


తదాదిగా కాలభైరవుడు కాశీవాసుడయ్యాడు.
శివసంకల్పరీత్యా, భైరవ జననం మార్గశిర కృష్ణపక్ష అష్టమియందు జరగడంతో అది పుణ్యతిథిగా పరిగణించారు. శివరాత్రితో సమానమైన ఉపవాస, జాగరణ ఫలాలను అందించే పర్వదినంగానూ కాలభైరవ జయంతిని కొందరు పాటిస్తారు.

🕉🌞🌎🌙🌟🚩


శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-3-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

తావత్ ససర్జ మనసా సనకం సనందం
భూయస్సనాతనమునిం చ సనత్కుమారమ్।
తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాః
త్వత్పాదభక్తిరసికా జగృహుర్న వాణీమ్||

భావము:-

ఆ పిమ్మట, బ్రహ్మ, భగవద్ధ్యానపూరితమైన మనస్సుతో సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అను మునులను సృష్టించి - ప్రజలను సృజించ మని వారిని నియోగించెను. కాని, వారు భక్తిపారవశ్యముతో నీ పాదములను సేవించుట యందు నిమగ్నులై, ‘లోక సృష్టి చేయుడని’ పలికిన బ్రహ్మ వాక్కులకు స్పందించలేదు.

వ్యాఖ్య:-

విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయవిజయుల శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది.


కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడమూ...
వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలను దాల్చడం తెలిసిందే!


ఇంతకీ ఆ జయవిజయులకు శాపం ఇచ్చి,
పరోక్షంగా లోకకళ్యాణానికి కారణమైన వారు
మరెవ్వరో కాదు- సనకసనందనాదులు!
ఇంతకీ ఎవరీ సనకసనందనాదులు?


చాలామంది సనకసనందనాదులు ఇద్దరనుకుంటారు. నిజానికి వీరు నలుగురు అన్నదమ్ములు. వారి పేర్లు..
సనక,  సనందన,  సనత్కుమార, సనత్సుజాతులు.


కొన్ని చోట్ల సనత్సుజాతుని పేరు బదులుగా సనాతన అన్న పేరు కనిపిస్తుంది. ఈ నలుగురు అన్నదమ్ములూ బ్రహ్మమానస పుత్రులు. ప్రాణులను సృష్టించే పనిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు, తన పనిలో తోడుగా ఉంటారని తలంచి ఈ నలుగురికీ జన్మనిచ్చాడట.
అయితే బ్రహ్మదేవుని మానసం నుంచి పూర్తి సత్వ గుణంతో ఆవిర్భవించిన సనకసనందనాదులు...
తమ జీవితాలను వైరాగ్యంలోనే గడిపేందుకు సిద్ధపడ్డారు.


సనకసనందనాదులు బాల్యంలోనే వేదాలను ఔపోసన పట్టేశారు. బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు.
బ్రహ్మచారులై లోకసంచారం చేస్తూ, తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట. నిష్మల్మషమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థని దాటి ఎరుగవు.


కానీ వృద్ధులైనవారికి సైతం ఆధ్మాత్మిక రహస్యాలను అందించగల జ్ఞానవృద్ధులు. నారదుడు, మార్కండేయుడు వంటి మహారుషులు సైతం వీరి నుంచి బోధను గ్రహించినవారే. ‘ అజ్ఞానానికి అహంకారమే మూలం’ అంటూ పృధు చక్రవర్తికి బోధించినా, ‘ఆత్మ ఒక్కటే సత్యం’ అంటూ దృతరాష్ట్రుని మనసుని తేటపరచినా... అది సనకసనందనాదులకే చెల్లింది.


భాగవత పురాణం ప్రకారం వీరు భగవంతుని లీలావతారాలలో భాగం. ఇక రామాయణంలోని ఉత్తరకాండలో సనకసనందనాదులు రాముని కలుసుకునే సన్నివేశం కనిపిస్తుంది. మహాభారతంలో అయితే జ్ఞానబోధకులుగా వీరు పలుమార్లు కనిపిస్తారు. ఇలా సనకసనందనాదులు గురించి పురాణాలలో
ఏవో ఒక ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి.


అటు విష్ణుసంబంధమైన సాహిత్యంలోనూ, ఇటు శైవ సాహిత్యంలోనూ వీరి గురించి ఏవో ఒక గాథలు వినిపిస్తూనే ఉంటాయి. శివుడు దక్షిణామూర్తిగా అవతరించినప్పుడు, ఆయన జ్ఞానాన్ని పరీక్షించదలచిన సనకసనందనాదులు అనేక క్లిష్టమైన ప్రశ్నలను వేశారట. కానీ పరమేశ్వరుడు వాటన్నింటినీ అలవోకగా జవాబులు ఇవ్వడంతో... సనకసనందాదులు వినమ్రతగా తమ ఓటమిని అంగీకరించారట.


మన దేశంలోని పుణ్యక్షేత్రాలకు సంబంధించిన స్థలపురాణాలలో కూడా సనకసనందనాదులతో ముడిపడిన కథలు కనిపిస్తాయి. ఉదాహరణకు మానససరోవరం గురించిన కథనే తీసుకోండి.


సనకసనందనాదులు పరమేశ్వరునికి పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా వారి తండ్రి బ్రహ్మదేవుడు మానససరోవరాన్ని సృష్టించాడని ఓ గాధ ప్రచారంలో ఉంది. హిమాలయాల దాకా ఎందుకు సనకసనందనాదులు కొన్నాళ్లు తిరుమలలో తపస్సు చేసుకున్నారని చెబుతూ... వారు తపస్సు ఆచరించిన చోటుని సనక సనంద తీర్థంగా పేర్కొంటున్నారు.


ఇలా సనకసనందనాదుల ప్రస్తావనలు హైందవ ధర్మంలో అడుగడుగునా కనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధా నికీ, భక్తితో కూడిన జ్ఞానానికీ, వైరాగ్య భావనలకీ, నిష్కల్మష జీవితానికీ ప్రతీకగా నిలుస్తారు.

🕉🌞🌎🌙🌟🚩



శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 128  / Sripada Srivallabha Charithamrutham - 128 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 16
🌴. శ్రీమన్నారాయణ వృత్తాంతము - 7  🌴

🌻. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము  - 3 🌻

ఇది అంతయునూ స్వయంకృతాపరాధమనియూ, ఆ అపరాధము యొక్క కర్మఫలమును యీ విధముగా అనుభవించుచున్నాననియూ అతడు తెలిసికొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతిచేసిన విషయములను అతడు గుర్తుచేసుకొనెను.

తన అజ్ఞానకాలమున మహాత్ములను, దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిదియని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మానస్ఫూర్తిగా శరణుజొచ్చెను.

అతని మనస్సులో యీ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుట కిచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను.

సూర్యోదయమగుసరికి గ్రామపెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవుపాలను పెద్దకుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహ లోనికి వచ్చెను.

మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచూ సాధువర్తనుడనై జీవించెదనని ఎటో పోయెను. గ్రామపెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందునట్లు తీర్పుచెప్పెను.

మూడు సర్పరాజములు నివసించిన పుట్టయందు మూడు ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి ఆయాచితముగా మా యింటికి అరుదెంచెను. అతడు యీ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు.

ఒకానొక శనివారము ప్రదోష సమయము నందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదులవారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా యిచ్చి భుజింప మనెను. అతడిట్లు వచించెను.

"శ్రీపాదులవారు పీఠికాపురమునందలి వారి మాతామహగృహమున ఒకానొక ఔదుంబర వ్రుక్షమూలమున కూర్చొనెడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండిగిన్నెలో హల్వాను నింపి ఆ వ్రుక్షమూలమున నున్న శ్రీపాదులవారికి తినిపించెడివారు.

శ్రీపాద శ్రీవల్లభ, నృశింహ సరస్వతి, స్వామి సమర్థ అను నామత్రయమునకు సంకేతమే యీ మూడు వృక్షములు.

 పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ మూడు వృక్షములు.

కాలాంతరమున పీఠికాపురము నందలి ఆ ఔదుంబర వృక్షబీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలము నందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును.

భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్ష మూలమున నున్న శ్రీపాదులవారికి శనిప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడువారికి శ్రీపాదులవారి అనుగ్రహము కొంగు బంగారమై యుండును." ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు ధృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 16 సమాప్తం)   

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమన్నారాయణీయ / తృతీయ స్కంధము/ 10వ దశకము - సృష్టి బేధ వర్ణనము/10-2-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

మిథ్యాగ్రహాస్మి మతిరాగవికోపభీతిః
అజ్ఞానవృత్తిమితి పంచవిధాం స సృష్ట్వా।
ఉద్దామతామసపదార్థవిధానదూనః
తేనే త్వదీయచరణస్మరణం విశుద్ధైః||

భావము:-

అంతట బ్రహ్మదేవుడు- అజ్ఞానం వల్ల కలుగే ఐదు అంశాలను సృష్టించాడు.

 అవి: 1. మిధ్యాగ్రహము (సత్యమును గ్రహించలేక అసత్యమును సత్యమని భ్రమించుట),

 2. అస్మిమతి (నేను అను భావన (అహంభావం),

 3. రాగము (ప్రీతి, ఇష్టం),

 4. వికోపము (కోపం),

 5. భీతి (భయః).

అట్టి తమోగుణ ప్రధానమైన అంశములను సృష్టించినందులకు తదువరి విచారించిన వాడై, ఆ పాప విముక్తి కొరకు బ్రహ్మ, నీ చరణములను ఆశ్రయించెను.

వ్యాఖ్య:-

సృష్టి ఒక యథార్థ ప్రక్రియ. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉన్న ముఖ్యమైన అంశాలు (కాలము, కర్మ, ద్రవ్యము, స్వభావముతో కూడుకున్న జీవులు) ఎల్లప్పుడూ పరబ్రహ్మంపై ఆధారపడి ఉంటాయి. పరమాత్మ శక్త , వ్యక్త స్థితుల్లో సందర్భానుసారంగా వ్యక్తమౌతూ ఈ సృష్టిని కొనసాగిస్తూ ఉంటాడు. సర్వజ్ఞత, సత్తా అనే సహజమైన విశేషాలతో పరమాత్మ ఒక కాలక్రమంలో సృష్టి, లయ అనే పరస్పర విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉంటాడు.


ఈ కాలక్రమంఎప్పుడు మొదలెైంది మొట్టమొదటగా అనేది సాధకులకు అందే జ్ఞానం కాదు. ఇదే సనాతన జ్ఞానం. ఇది తెలిస్తేనే నేను ద్వైతాన్ని నమ్ముతాను లేదా భగవంతునిఅస్తిత్వాన్ని ఒప్పుకుంటాను అనే వితండ వాదాలకు అతీతమైన జ్ఞానం అది.


సృష్టి ఆదిఎప్పుడు అనేది ముక్త జీవాలకి సైతం అర్థం కాని విషయం. అదే పరమాత్మ తత్త్వం. ఆయనను పూర్తిగా వివరించగల సత్తా వాక్కుకి లేదు కనుక సాధకుల గ్రాహ్యత కు అందని విషయం అందుకే “భూతకృద్భూత భ్రుధ్భావో భూతాత్మా, భూత భావనః, అప్రమేయో హృషీకేశ: పద్మనాభోమరప్రభు:” అని భీష్మునిచే కీర్తించబడ్డాడు శ్రీకృష్ణుడు.

🕉🌞🌎🌙🌟🚩
శ్రీమన్నారాయణీయం
9దశకం-10-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩

తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సః
ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ ।
తథావిధకృపాభరో గురుమరుత్పురాధీశ్వరా!
త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః||

భావము:-

నీ అనుగ్రహముచే, బ్రహ్మ, ఆ పద్మమునుండి భువనత్రయములను సృష్టించి; పిదప, జీవ సృష్టి యందు తన దృష్టిని నిలిపెను. దయానిధీ! గురవాయూరు పురాధీశా! నీ దయార్ధ్రదృష్టిని నాపై ప్రసరింపజేసి నన్ను రక్షింపుము.

వ్యాఖ్య:-

బ్రహ్మ తాను ఎవరో ఏం చేయాలో అన్న సందిగ్ధంలో కలియ జూసి తన ఉనికికై వెతికి జాడ తెలియక తనలో బయలుదేరిన ఓంకార నాదంపై శ్రద్ధ యోగం నిలపి తపస్సు చేయ ఉపక్రమిస్తారు. ఆ తపస్సు బ్రహ్మ కాలమానం ప్రకారం వెయ్యి సంవత్సరాలు ఉంటుంది. ఆ తరువాత విష్ణు పరమాత్మ దర్శనం జరిగి కర్తవ్య బోధ అడుగుతాడు. నీవు సృష్టి కార్య రచన చేయాలి అనగా ఎలా అని అడుగగా క్రితం సృష్టిలో ఏం చేసావో అదే తిరిగి చేయమని ముందుగా ఉన్న దాన్ని విభాగాలుగా చేసి సృష్టి రచన చేయమని ఆదేశిస్తారు పరమాత్మ.
ముందు తపస్సు చేయి లోకాన్ని సృష్టించే క్రమంలో నన్ను మరువకు నా గురించి తపస్సు చేసి క్రమంలో నీ సృష్టి రచన అనే కర్తవ్యం మరువకు అని బోధ చేస్తారు.


కాలం అనేది, మన జనన మరణ చక్రాలు, ఈ సృష్టి స్థితి లయ అన్నవి, మన అనాది సంస్కృతి ఇవన్నీ కూడా ఒక cycle లో తీరుగాడుతున్నాయి అన్న దానికి ఇది ఒక నిదర్శనం.
అందుకే మన సంస్కృతిని అనాది ధర్మం (ఆద్యంత రహిత సనాతన ధర్మం) అంటారు. అనాది అంటే మొదలు లేనిది.


ఆపై జరిగిన విసర్గము అనబడే సృష్టిలో ఈ క్రింది విధంగా సృష్టికార్య రచన సిధ్ధింపబడింది.

ప్రథమ సృష్టి నిర్మాణంలో ఈ క్రింది వరసలో సృష్టి కార్య రచన జరిగింది.


1. సనత్కుమార సనక సనందన సనస్తుజాన లు పుడతారు వారిని తిరిగి సృష్టి రచన లో పాల్గొమనగా భగవంతుని అర్చన లో మాకు ప్రీతి అని నిరాకరిస్తారు.


2. నిరాకరించిన క్రోధం ఆపుకొనగా బ్రహ్మ భ్రుకుటి లోంచి రుద్రుడు, ఏకాదశ రుద్రులు పుడతారు. సృష్టి రచన బదులు తామూ తమ రోదన ఫలితపు క్రోధంతో లోకల లయం చేయగా తపస్సు చేయమని ప్రభోధిస్తే తపస్సు చేస్తూ రుద్రుడు శివుడు అవుతాడు.


3. బ్రహ్మ గారు తిరిగి తపస్సు చేసి నవ ప్రజాపతులు, నారదుని సృష్టిస్తారు.
మరీచి అత్రి అంగీరస
పులత్స్య క్రతువు భృగువు పులహుడు వశిష్ఠుడు అంగుష్టం నుండి దక్షుడు ఈ నవ ప్రజాపతులు.


4. వారితో బాటుగా మొదటగా సృష్టించబడినవి ఇవి ధర్మము అధర్మము మృత్యువు కామము కోపము లోభము సముద్రాలు నిరృతి పాపములు నీడ నుంచి కర్ధముడు మొదలగునవారు.

తృతీయ స్కంధము
9వ దశకము సమాప్తము.

🕉🌞🌎🌙🌟🚩


*శ్రీమన్నారాయణీయం
9దశకం-9-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩

శతం కృతతపాస్తతః స ఖలు దివ్యసంవత్సరాన్
అవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికమ్।
ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా
భవద్బలవిజృంభితః పవనపాథసీ పీతవాన్||

భావము:-

నూరు దివ్యసంవత్సరములు తపస్సుచేసి; బ్రహ్మదేవుడు పూర్వముకన్నా అధికమైన జ్ఞానశక్తిని పొందెను. ‘బ్రహ్మ‘ తనకు ఆశ్రయమైన పద్మము వాయువువలన కంపించుట చూచి, తన తపోబలముతో విజృంభించి ఆ వాయువును, పద్మము చుట్టూ ఆవరించి యున్న జలమును పూర్తిగా త్రాగివేసెను.

వ్యాఖ్య:-

భట్టతిరి వారు చెప్పినట్లుగా అలా బ్రహ్మగారు చేసిన పనివల్ల ఏం జరిగిందో మనకు బ్రహ్మ నుండి పుట్టిన స్వయంభువు, శ తరూపలు దంపతులై మానవ సంతతిని వృద్ధి చేసేప్పుడు తెలుస్తుంది.


బ్రహ్మ మొదట ప్రళయ
 జలాన్నంతా తాగేయడంతో వారివురూ ఉండేందుకు స్థలం లేకపోయింది. ఆ తర్వాత ప్రజలను, దేవతలను, రాక్షసులను, పశుపక్ష్యాదుల్ని పర్వతాలను, ఇంకా అనేకానేకాల్ని సృష్టించడం ప్రారంభించాడు.

🕉🌞🌎🌟🌙🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ