శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత*
🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత - 1 🌹
శ్లోకము - భావము
01. సర్వ భూతాన్తరస్థాయ
నిత్యముక్త చిదాత్మనే
ప్రత్యక్చైతన్య రూపాయ
మహ్యమేవ నమోనమః ll
భావము:
సర్వ భూతముల యందు వసించు వాడును, సదా ముక్తుడును, చిదాత్మ రూపుడును, ప్రత్యక్ చైతన్య రూపుడును, నాకు వేరు గాని వాడును అగు పరమాత్మకు నమస్కారము.
02. జీవన్ముక్తి శ్చయా ముక్తిః
సాముక్తిః పిండ పాతనే
యాముక్తిః పిండ పాతనే
సాముక్తిః శుని సూకరే ll
భావము:
జీవించి యుండగనే ముక్తిని బొందుటను ‘జీవన్ముక్తి’ యందురు. ముక్తి యననుది దేహ పతనముతో కలుగునన్నచో, మరి అట్టి ముక్తి దేహపతనము జరుగు కుక్కలకు, పందులకు కలుగుచున్నది గదా!
03. జీవః శివః సర్వమేవ
భూతేష్వేవం వ్యవస్థితః
ఏవమేవాభి పశ్యన్హి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
జీవుడే శివుడు. సమస్త భూతముల యందు శివుడే వ్యవస్థితుడై యున్నాడు.
ఈ విధముగా ఎవడు సత్యమును గాంచుచున్నాడో వాడే ‘జీవన్ముక్తుడు’ అని చెప్పబడు చున్నాడు.
04. ఏవం బ్రహ్మ జగత్సర్వమ్
అఖిలం భాసతే రవిః
సంస్థితం సర్వభూతానామ్
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
సూర్యుడు సమస్త విశ్వమును ప్రకాశింప జేయునట్లు, సర్వ భూతాంతరాత్ముడు అయిన బ్రహ్మము జగత్తునంతటిని ప్రభావిత మొనర్చుచున్నాడు. దీనిని గ్రహించిన దివ్యాత్ముడే ‘జీవన్ముక్తుడు’ అని చెప్పబడుచున్నాడు.
05. ఏకథా బహుథా చైవ
దృశ్యతే జలచంద్రవత్
ఆత్మజ్ఞానీ తథై వేకో
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
జలముల యందు చంద్రుడు అనేకములుగా కన్పించినను ఒక్కడే అయినట్లు, ‘ఆత్మజ్ఞానము నొందిన వాడు అద్వయుడే యగుచున్నాడు’ అనెడి సత్యమును గ్రహించిన వాడు ‘జీవన్ముక్తుడు’ అనబడుచున్నాడు.
06. సర్వభూతే స్థితం బ్రహ్మ
భేదా భేదో న విద్యతే
ఏకమేవాభి పశ్యంశ్చ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
సర్వ భూతముల యందు బ్రహ్మము స్థిరమై యున్నాడు. భేదాభేదములు తెలియక యున్నాడు. ఉన్నదొక్కటియేనని ఎరిగినవాడై సదా దానినే దర్శించు వాడెవ్వడో అతడే ‘జీవన్ముక్తుడు’.
07. తత్త్వం క్షేత్రం వ్యోమాతీతమ్
అహం క్షేత్రజ్ఞ ఉచ్యతే
అహం కర్తా చ భోక్తా చ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
ఆకాశమునకు మిన్నగా తెలియునది కూడా క్షేత్రమే. నేను క్షేత్రజ్ఞుడని పిలువ- బడుచున్నాను. “సర్వకర్మలకు కర్తయును, భోక్తయును అహంకారమే”. ఈ తత్త్వమును గ్రహించిన వాడు ‘జీవన్ముక్తుడు’.
08. కర్మేంద్రియ పరిత్యాగీ
ధ్యాన వర్జిత చేతసః
ఆత్మజ్ఞానీ తథై వేకో
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
కర్మేంద్రియములను, ధ్యానపూరిత చిత్తమును పరిత్యజించిన వాడై ఏకమైన ఆత్మజ్ఞానము నందు సదా స్థిరుడై యుండు వాడెవడో అతడే ‘జీవన్ముక్తుడు’.
9. శారీరం కేవలం కర్మ
శోకమోహాది వర్జితం
శుభాశుభ పరిత్యాగీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
ఎవడు శోక మోహములు తెలియని కాయక కర్మను చేయుచున్నాడో, శుభాశుభములను పరిత్యజించి యున్నాడో అతడే ‘జీవన్ముక్తుడు’.
10. కర్మ సర్వత్ర ఆదిష్టం
న జానాతి చ కించన
కర్మబ్రహ్మ విజానాతి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
శాస్త్ర విధానోక్త కర్మలు కూడా తెలియనివాడు, కర్మ బ్రహ్మస్వరూపమేయని తెలిసినవాడు ‘జీవన్ముక్తుడు’
11. చిన్మయం వ్యాపితం సర్వం
ఆకాశం జగదీశ్వరం
సహితం సర్వభూతానాం
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
జగదీశ్వరుడైన పరమాత్మ చిద్రూప మనియు, ఆకాశము వలె సర్వవ్యాపకుడు అనియు, సర్వభూత సహితుడనియు ఎవ్వడు గ్రహించు చున్నాడో అతడే ‘జీవన్ముక్తుడు’.
12. అనాదివర్తి భూతానాం
జీవః శివో న హన్యతే
నిర్వైర స్సర్వ భూతేషు
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
సమస్త భూతముల యందలి అనాదియైన జీవుడు వాస్తవానికి శివుడే కనుక అతడు అవినాశి. సర్వభూతముల యందలి ఈ సత్యమును దర్శించువాడు వైరము లేనివాడై యుండును. అతడే ‘జీవన్ముక్తుడు’.
13. ఆత్మాగురుః త్వం విశ్వం చ
చిదాకాశో న లిప్యతే
గతాగతం ద్వయోః నాస్తి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
ఆత్మయే గురువు. నీవును ఆత్మయే. అది సర్వగత చైతన్యము. దేని చేతను అది అంటబడదు. రాకపోకలు లేనిది. అట్టి ఆత్మను తెలిసిన వాడు ‘జీవన్ముక్తుడు’.
14. గర్భ ధ్యానేన పశ్యన్తి
జ్ఞానినాం మన ఉచ్యతే
సోఽహం మనో విలీయన్తే
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
అంతర్‌ధ్యానమున జ్ఞానులు వారి మనస్సుచే వీక్షించుచున్నారని చెప్పబడినది. ‘సోఽహం’ భావనలో ఆ మనస్సును కూడా ఎవడు విలీనమొనర్చునో వాడే ‘జీవన్ముక్తుడు’.
15. ఊర్ధ్వధ్యానేన పశ్యన్తి
విజ్ఞానం మన ఉచ్యతే
శూన్యం లయం చ విలయం
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
ఊర్ధ్వధ్యానము చేత జ్ఞాని సమాధిలో దేనిని గాంచుచున్నాడో అదియే విజ్ఞానము. అది ఆత్మవిదుని మనస్సు. అదియే శూన్యము. అదియే లయము. అదియే విలయము. ఇది తెలిసినవాడే ‘జీవన్ముక్తుడు’.
16. అభ్యాసే రమతే నిత్యం
మనోధ్యాన లయం గతమ్
బంధ మోక్ష ద్వయం నాస్తి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
ఎవని మనస్సు అభ్యాసము నందు నిత్యము రమించుచుండునో, ధ్యానమగ్నమై యుండునో, లయించిపోవునో, బంధమోక్షములు రెండును తెలియక యుండునో వాడే ‘జీవన్ముక్తుడు’.
ఏకాకీ రమతే నిత్యం
స్వభావ గుణ వర్జితమ్
బ్రహ్మజ్ఞాన రసాస్వాదీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 17
భావము:
గుణాతీతుడైన జ్ఞాని అద్వయుడైన ఆత్మయందే రమించు చుండును. బ్రహ్మ- జ్ఞాన రసానందమును పానము చేయుచుండును, అతడే ‘జీవన్ముక్తుడు’.
హృది జ్ఞానేన పశ్యన్తి
ప్రకాశం క్రియతే మనః
సోఽహం హంసేతి పశ్యన్తి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 18
భావము:
జ్ఞానవంతులై హృదయములో ఎట్టి ప్రకాశమును గాంచు చున్నారో అట్టిది జ్ఞాని మనస్సుగా భావింప బడినది. ఈ స్థితిలో ‘ఆతడే నేను’, ‘నేనే ఆతడు’ అని దర్శించు చున్నారు. ఇదియే ‘జీవన్ముక్త స్థితి’.
శివ శక్తి సమాత్మానం
పిండ బ్రహ్మాండ మేవచ
చిదాకాశం హృదం మోహం
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 19
భావము:
శివశక్తి సమన్వితమైన వైభవమును, పిండ బ్రహ్మాండ యుతమును, చిదాకాశమును, హృదయమునందలి మోహమును, సమస్తమును ఆత్మగనే దర్శింతురు. అట్టివాడే ‘జీవన్ముక్తుడు’.
జాగ్రత్స్వప్న సుషిప్తిం చ
తురీయావ స్థితం సదా
సోఽహం మనో విలీయేత
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 20
భావము:
అవస్థాత్రయమును చరించునపుడు సైతము తురీయావస్థలో వలె ‘సోఽహం’ భావనతో ఎవ్వడు విలీనమై యుండునో అతడే ‘జీవన్ముక్తుడు’.
21. సోఽహం స్థితం జ్ఞాన మిదం
సూత్రేషు మణివ త్పరమ్
సోఽహం బ్రహ్మ నిరాకారమ్
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
ఈ ‘సోఽహం’ అనెడి జ్ఞానము సూత్రము నందలి మణి వలె నిలిచియున్నది. ‘సోఽహం’ అనెడి బ్రహ్మ తత్త్వము ఆకారము లేనిదై యున్నది. ఈ విధముగా సత్యము నెరిగిన వాడే ‘జీవన్ముక్తుడు’.
22. మన ఏవ మనుష్యాణాం
భేదా భేదస్య కారణమ్
వికల్ప నైవ సంకల్పమ్
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
మనుష్యులలోని భేదాభేదములకు మనస్సే కారణముగా తెలియుచున్నది. అయితే ఎవరిలో సంకల్ప వికల్పాదులు అదృశ్య మగుచున్నవో అతడే ‘జీవన్ముక్తుడు’.
23. మన ఏవ విదుః ప్రాజ్ఞాః
సిద్ధ సిద్ధాన్త ఏవ చ
సదా దృఢం తదా మోక్ష
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
మనస్సు నిశ్చలముగా నుండుటయే మోక్షమని విజ్ఞులు, ప్రాజ్ఞులు సిద్ధాంతీకరించియున్నారు. ఈ సత్యమును తెలిసిన వాడే ‘జీవన్ముక్తుడు’.
24. యోగాభ్యాసీ మనశ్శ్రేష్ఠః
అంతస్త్యాగీ బహిర్జడః
అంతస్త్యాగీ బహిస్త్యాగీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll
భావము:
యోగాభ్యాసి యైనవాడు, శ్రేష్ఠమైన మనస్సు గలిగినవాడు అంతస్త్యాగి యనబడును. అతడు బాహ్యమునకు జడుని వలె యుండును. వాస్తవానికి అతడు బాహ్యాభ్యంతరముల యందు త్యాగియై యున్నాడు. అతడే ‘జీవన్ముక్తుడు’.
వేదాంత కేసరి యగు శ్రీ దత్తాత్రేయులు రచించిన “జీవన్ముక్తగీత” సమాప్తము
ఓం తత్ సత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment