మంత్ర ద్రష్ట*


 



ఆనందలహరి ( ఆదిశంకరాచార్య )

       అమ్మ సౌందర్యం - పరమేశ్వరునకే గోచరము

2.శ్లో!!ఘృత క్షీర ద్రాక్షా మధు మధురిమా కైరపి పదైః

      విశిష్యిన్ అఖ్యేయా భవతి రసనామాత్రా విషయః

      తథా తే సౌకర్యం పరమశివ దృజ్ఞ్మాత్ర విషయః

      కథం కారం బ్రూమ సకలనిగమాగోచరవదే !!

                    అమ్మా ! నీ  సౌందర్యం వర్ణించడానికి 

మనస్సునకు , విక్కులకు అందదు. ఎలాగంటే -

   " నేయి, పాలు, ద్రాక్ష, తేనె " ల మాధుర్యం నాలుకకే

తెలుసు. మాటలతో చెప్పలేం. ఆ నీ సౌందర్యం వేదాలకే అందనిది. అట్టి నీ సౌదర్యం పరమేశ్వరుని

కంటికి మాత్రమే ఎరుక. నీ సౌందర్యము వర్ణించుట సామాన్యులమైన మావల్ల నేమౌతుంది తల్లీ !

       పై విషయము ఆదిశంకరులవారు 12 వ శ్లోకములో విశదీకరించారు. 

        సృష్టికర్తయైన బ్రహ్మ వేదపారంగతుడు‌ ఆయన శిల్ప చాతుర్యంతో దేవతలు సృష్టింప బడ్డారు. దేవతలను మించిన సౌందర్యము బ్రహ్మకల్పనలో లేదు. అట్టి బ్రహ్మకే నీ సౌందర్య వర్ణన వీలు కాలేదు. ఋషులు

రంభ, ఊర్వసులు, మేనకల సౌందర్యము నీ సౌందర్యమునకు సాటిలేక పోయారు. వారీకి నీ సౌదర్యం దర్శించాలంటే శక్తి చాలటం లేదు. పరమశివునకు మాత్రమే ఎరుక గదా ! అట్టి నీ సౌందర్య దర్శన భాగ్యము నాకు ప్రసాదించు తల్లీ !

    ( 1, 2  శ్లోకముల పారాయణం పరబ్రహ్మ చింతన కలిగిస్తుంది.ఇదిపరబ్రహ్మజ్ఞానానికి దారి చూపుతుంది



09. 'అష్టావక్రగీత' 18వ ప్రకరణ (596)_
🕉🌞🌎🌙🌟🚩

అజ్ఞానం అనేది మనోభ్రమలవల్ల, భ్రమణాలవల్ల కలిగేదే !!

అనురాగం, కోరిక, చింతలు ఏవీ లేని జ్ఞాని దేహధర్మం ప్రకారం చరిస్తాడు. అంతేగానీ భార్యాపిల్లల్ని, దేహాన్ని, దేహకర్మలని దేనిని ఇష్టపడడు. అలాగని వాటిని తిరస్కరించడు. తామరాకుపై నీటి బొట్టు స్వేచ్ఛగా విహరించడానికి కారణం రెంటికీ బంధంగానీ, విరోధంగానీ ఏవీ లేకపోవడమే. మనం కూడా అలాంటి జీవనం అలవర్చుకుంటే అంతరంగంలో జ్ఞానిలా ప్రకాశించవచ్చు. జ్ఞాని సూర్యునిలాంటి వాడు. లోకదృష్టికి సూర్యోదయ, సూర్యాస్తమయం, సూర్యుని కాంతిలో తేడాలు, పరిమాణంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. కానీ సూర్యుడు మాత్రం ఉషోదయం, అస్తమయం ఏదీ లేకుండానే స్థిరంగా ఉన్నాడు !


🕉🌞🌎🌙🌟🚩

10. శ్రీరమణీయం -(461)
🕉🌞🌎🌙🌟🚩

"ధ్యానం అంటే నిద్రలో మనం రోజూ పొందే శాంతి లాంటిదేనా ?"

ధ్యానం ఉద్దేశం మనసు రోజంతా ప్రశాంతంగా ఉండటం. అది కేవలం చెడు ఆలోచనలను తాత్కాలికంగా మర్చిపోతే వచ్చేది కాదు. చెడు ఆలోచనలు మనసులోనే లేకుండా చేసుకుంటే శాంతి కలుగుతుంది. లేదంటే కేవలం ప్రతిరోజు మనం నిద్రలో పొందే తాత్కాలిక ఉపశమనం మాత్రమే పొంది దాన్ని ధ్యానం అని మురిసిపోవాల్సి వస్తుంది. ధ్యానం అనేది తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇచ్చేది అయితే అది మనం కష్టపడకుండా రోజూ నిద్రలో పొందుతూనే ఉన్నాం కదా ! ధ్యానం అంటే కేవలం చెడు ఆలోచనలు గుర్తురాకుండా చేసుకోవటం కాదు. అసలు గుర్తే లేకుండా చూసుకోవాలి. అలా చేసుకోగలిగితే మనసు శుద్ధిగా ఉంటుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'పవిత్రతే మన ధర్మం-ఆచరిస్తే అదే ధ్యానం !'- 


మంత్ర ద్రష్ట

 ఒకటవ తరంగము
                                                   శ్రీః

ఆదిత్య భగవానుడు ఉషాదేవి చేతిని  అందుకుని  , జగముల లోని సమస్త జీవ రాశులకూ ,  చైతన్యమును కలిగించుతూ   తూర్పు సింహాసనమును ఎక్కి వస్తున్నాడు. . నక్షత్రాలు దూరంగా పడమట , దిక్కులు అంతమయ్యే చోట  , అక్కడొకటి , ఇక్కడొకటి నిలచి , కొత్త రాజు  అధికారము నకు వచ్చినపుడు   మిగిలిన గత వైభవపు గుర్తుల వలె , కాంతి తగ్గి పోతున్నాయి .  మహానుభావుల కీర్తి వలె ఆశ్రమములలో హోమపు పొగ , సూక్ష్మముగా ఉన్నా కూడా,  సుగంధముతో కూడి ఆకాశ దారులలోకి  ఎగసి తేలి పోతున్నది. సర్వాత్మకుడు అయిన సవితృ దేవుని కీర్తించే భట్రాజుల్లాగా , సామ గానము చేయు బ్రాహ్మణులను అనుకరించు తున్నాయా అన్నట్టు నానా విధాల పక్షులు పాడుతున్నాయి. ఆకాశము  ప్రాతః కాలపు మనోహరమైన చల్లటి గాలిలో  నిముష నిముషమునకూ మారిపోతున్న రంగు రంగులతో  ప్రకృతి సుందరి లాగా మనసుకు హాయిని కలిగిస్తూ కనిపిస్తున్నది. 

     వశిష్ఠ మహర్షి అప్పుడే ఉపాసన ముగించి , మూడు అగ్నులతో పాటూ మండుచున్న నాలుగవ అగ్ని వలె వెలిగి పోతూ  అగ్ని గృహము లో కూర్చొని యున్నారు. అరుంధతీ మాత తన దైవ కార్యమును ముగించుకుని , లేచి నిలబడి , తన పతిదేవుడు రోజూ లాగే  లేచి వస్తాడని కాచుకొని యున్నది. ఆయన పైకి లేవలేదు. మహర్షి కన్నులు , దిక్కులకు అవతల కనిపించుతున్న  దానిని పరిశీలిస్తున్నట్టు సూటిగా చూస్తున్నాయి. కనుబొమలు కొంచముగా వంగి , ఆ కనిపించుతున్న దాని తీవ్రతను తెలుపు తున్నాయి. ముఖము కూడా గంభీరముగా మారి , ఆ కనిపించు తున్నది సంతోషించు విషయము కాదని చెప్పకనే చెబుతున్నది. అలాగే కొంతసేపు వుండి , ఆయన ముఖము ప్రసన్నమైంది. అది చూచి అరుంధతీ దేవికి కూడా  మనసు నెమ్మదించింది. దూర దూరాలలో తిరిగిన  మనస్సు వెనుకకు వచ్చినదా అనిపిస్తూ , మహర్షుల ముఖము నుండి  ఒక నిట్టూర్పు వచ్చెను . దాని వెనకే , ’ ఇంతే కదా !! ’ అను తేలికైన భావముతో ఒక చిరునవ్వు కూడా , ప్రశాంత సరస్సులో సహజముగా వచ్చే అల లాగా కనిపించింది.  

     దేవి అక్కడే నిలబడి చూస్తున్నది. ఆమెకు , ’ ఇదేమిటి ? ’ అని అడగాలని కుతూహలము. కానీ , పతి దేవుని సన్నిధిలో తనంతట తానే మాట్లాడునది ఎప్పుడూ లేదు. అందుచేత మౌనముగానే ఉన్నది. బహుశః , ఆ మౌనమే ఆమె యొక్క కుతూహలమును తెలిపినదా అన్నట్టు , వశిష్ఠులు మాట్లాడినారు , ’ ఏమేమి అవుతుందో  కానిలే  ’ అన్నారు. ఆమెకు , ఆ సూత్ర వాక్యము మీద వ్యాఖ్యానము చేయాలనిపించలేదు , అయినా , ఆమె తనను తాను నిగ్రహించు కోవలెననుకొను లోపల, స్త్రీ సహజమైన కుతూహలమే , ’ అంటే ఏమిటి ? ’ అని ఆమె నోటి నుండీ బయటికి వచ్చెను. 

    వశిష్ఠులు నవ్వి , అన్నారు , ’ న్యాయమే , నీవడగకముందే నేనే అంతా చెప్పవలసినది. ఆశ్రమపు అధి రాజ్ఞివి నీవు , ఆశ్రమపు విషయములు తెలిసియుండాలి కదా ? ఒక నూతన సృష్టి జరుగబోతున్నది. ఆ నాటకానికి ఆరంభము మన ఆశ్రమములోనే  జరుగబోతున్నది. ఓ దేవి , నీ ఆశ్రమములో రక్తపాతము జరుగబోతున్నది , అది కూడా , అంతా ఇంతా కాదు , ఆశ్రమపు భూమికి దాహము తీరునంత రక్తపాతము."  అంతటి బలి అవసరమా ? అని మరలా ఒక నిట్టూర్పు వచ్చెను . ’ బలి లేకున్న ఫలమెక్కడుంది ? ప్రకృతి చేసే రుద్ర భయంకర నాట్యపు ఫలముగా ,  జరగబోతున్న ఆ నూతన సృష్టి వలన మంచి ఫలమును కూడా చూశాను.  , తనంతట తానే కనిపించింది. అందుకే సంతోషమై నవ్వు వచ్చింది "  

     అరుంధతి నిర్ఘాంత పోయింది. పాలిపోయిన ముఖముతో  , " ఏమిటి ? రక్త పాతమే ?  ఆశ్రమములో ? అదీ , మన ఆశ్రమములో ? "  అన్నది. 

     ఆమె మనో భావమును తెలుసుకున్న  వశిష్ఠులకు ఇంకా నవ్వు వచ్చినది. ఆమె మనసుకు ఎలా నచ్చుతుందో అలా ఒకసారి నవ్వి , " ఏమంటారు దేవి గారు ? ప్రకృతి తన ముఖాన్ని గంటు పెట్టుకొని , ఉరుములు , మెరుపులతో ఆర్భాటము చేసి , గొప్ప వృష్టిని వర్షించినపుడు ,  మీ ఆశ్రమపు భూమిలో మట్టి బురదగా మారదా ? అలాగని  , ఉరుములు మెరుపులతో గొప్ప వృష్టి ని వద్దంటారా ?  ఇది కూడా అలాగే. . అవును , మీ ఆశ్రమములో రక్తపాతము అవుతుంది , అంతే కాదు , రక్తము యేరులై పారుతుంది . ఏం ,  ఎందుకు కాకూడదు ? సత్వము , రజస్సు , తమో గుణములతో కూడిన  ఈ పంచ భూతముల లోను , మరియు , ఆ పంచభూతముల నుండీ సృష్టించ బడిన ఈ జగత్తులోనూ , ఆ మూడు గుణములూ ఉండనే ఉన్నాయి. ఒక్కొక్క కారణము చేత ఒక్కొక్క గుణము మాత్రమే బలముగా కనిపించినా , ఇతర గుణములు కూడా అక్కడ ఉండనే ఉంటాయి కదా ? అయితే , అవి అణగి కూర్చొని ఉంటాయి. 

     దేవీ , ఇది జగత్తు.  ఘడియ ఘడియకూ మారుటే దీని గుణము. మానవుని మనస్సు ఆ మార్పును సహించలేక , ఒకే స్థితిలో ఉండాలని కోరును. కానీ , సృష్టి కర్త నియమము అలాగ కాదు. పాతది వెళ్ళిపోవలెను. కొత్తది వస్తూ ఉండవలెను. అందువల్లనే , అప్పుడప్పుడు , వున్న స్థితి హఠాత్తుగా మారిపోవుట కనిపిస్తుంది ! అణగి ఉన్న గుణములు రేగి పైపైకి వచ్చేది అందుకే !  నదిలో ఉధృతంగా  నీటి ప్రవాహము వచ్చి అంతటినీ పగులగొట్టి పోవునట్లు , తమో గుణము రేగి అంతటినీ నాశనము చేస్తుంది. దానిని చూచి మనము బాధ పడుట అవసరమా  ? తమోగుణము వచ్చి అంతటినీ ఊడ్చుకొని పోకుంటే , రజో గుణము వచ్చి కొత్త ఆటను ఎలాగ ఆడగలదు ? మృత్యువు యొక్క రుద్ర నర్తనమే కదా , నూతన సృష్టి కి ప్రారంభము ? ఈ తమస్సు , ఈ రజస్సు ఇట్టి సంభ్రమముతో విజృంభించక పోతే , సత్త్వ గుణము ఎక్కడి నుండి రావలెనూ ? రసము నిండిన పండు కావాలనువాడు , పీచుకాయల వగరు , పులుపు వద్దన్న యెలాగ ? అన్నిటినీ జరిపించునది కాలము. ఆ కాలపు ఒక కొన - కరాళమయితే  , ఇంకొక కొన , శాంతమవుతుంది . సుఖమవుతుంది. . అదే ప్రకృతి ధర్మము. నిజానికి  , రెండూ ఒకటే ! అయినా కూడా  , మొదలు , చివర లలో  ఒకే భావము ఉండడము చాలా  అరుదు. . అంతే కాక , సుఖ, దుఃఖములు రెండూ కూడా వికారములే. ఒకటి స్వర్ణ కంకణమయితే , ఇంకొకటి లోహ కంకణము. స్వర్ణము కావాలి  , లోహము వద్దు అని మన మనస్సుకు ఒకటి నచ్చింది , ఇంకొకటి నచ్చలేదు.

     " నచ్చింది , ఇంకొంత కాలము ఉండాలి  , నచ్చనిది వేగముగా ముగిసిపోవాలి " అని తలుస్తాము. అది ఎందుకు అలాగ కావాలి  ?  కావలసినదంతా వేగముగా ముగిసి , వద్దన్నది ఇంకొంత కాలము ఎందుకు ఉండరాదు ? మనకు కావలసిందంతా ఇస్తున్న గోమాత , మన నందిని , ఒక్కొక్కసారి కొమ్ములు ఎగురవేస్తుంది కదా ? దివ్య ధేనువు లోకూడా ఒక్కొక్కసారి నచ్చని చేష్టలు కనిపిస్తాయి కదా ? కాబట్టి  , రానిలే , ఏమేమి రావాలో , అదంతా రానిలే. కాలగర్భములో  అణగి యున్నదంతా ఇవతలికి రానీ !. అదికూడా దేవుడి లీల అంటే సరిపోతుంది కదా ? లీల అనుకున్నపుడు , దాని కరాళ రూపము కనిపించదు , దాని ఉల్లాస కరమైన రూపమే కనిపిస్తుంది . అంటే ,  కాలానికి మనము దాసులము , కాదా ? " 

     పతిదేవుని మాటవిని అరుంధతికి ఆశ్చర్యము కలిగినది. " ఒకటి రెండు మాటలలో  ముక్తసరిగా మాట్లాడి అంతా ముగించే వారు , ఈ రోజు , ఇంత దీర్ఘముగా మాట్లాడారు , ఎందుకని ? ఏదో భయంకరమైన విషయమై ఉండాలి. ఆశ్రమములో రక్తపాతమా , అదీ  , బ్రహ్మర్షుల ఆశ్రమములో..!!  ఎక్కడ చూసినా శాంతి నిండిన ఈ బ్రహ్మ భూమిలో రక్తపాతమా ? ఎగిరే పక్షులు , ఈదే చేపలు కూడా ఎన్నడూ పోట్లాడుకోని  ఈ భూమిపై రక్తపాతమా ? కానీలే  , నాకెందుకు ? ఈ దేవుడు అంత వివరముగా చెప్పింది , ’ నువ్వు సిద్ధముగా ఉండు.’ .. అని తెలుపడానికే !! వారి నోట వచ్చిందంటే  , అది నిజమే అవుతుంది. జరిగే తీరుతుంది. మనస్సులో గుర్తుపెట్టుకోవాలి.  మనో వికారపు ఒక ముఖము సుఖమైతే , ఇంకొక ముఖము దుఃఖము. కానిలే , ఇష్టము లేని ఒక ముఖము కనిపించి నప్పుడు , కొంచము కష్టపడి , ఈ  ముఖాన్ని ఇటువైపుకు తిప్పుకుంటే సరి! " అని తనకుతానే ధైర్యము చెప్పుకొంది. అయినా , రక్తపాతము... నేల , తాగి కక్కుకున్నట్టు రక్తపాతము....అనుకోగానే ఆమె గుండె బరువెక్కింది. అక్కడే కూర్చొని అంతా సవిస్తరముగా అడగాలి అనిపించినది. కానీ , ఎప్పటినుంచో అలవాటైన దానిని జవదాటేదెలా  ? పతి అనుమతి లేనిదే అగ్ని గృహములో కూర్చొనుటెలా ? కాబట్టి , ఏమి అడుగవలెనన్నా , ఇక్కడ కాదు , ఇప్పుడు కాదు. 

     ఇలాగ తీర్మానించుకునే లోపలే , గడచిన రాత్రి తాను చూచిన స్వప్నము గుర్తుకొచ్చింది . అది  అప్రయత్నము గానే నోటినుండి బయటికొచ్చింది , ’ నిన్న రాత్రి ఏదో ఒక కల. అంత సంతోష కరమైనది కాదు , అది గుర్తు కొచ్చినపుడు ఏదో చేదు మింగినట్లుగా ఉంది..."  అంది. 
     వశిష్ఠులు దరహాసం చేసి , " అవునవును , నాలుక మీద  ఆధార పడినపుడు , చేదు చేదుగా , తీపి తీపిగా ఉంటాయి. అదే మన అధికారానికి చిక్కితే  , అప్పుడు చేదు చేదే , తీపి తీపే..." 
     అరుంధతికి దాని తర్వాత మాట్లాడుటకు నోరు పెగలలేదు. " నిజము , నిజము ...వారు చెప్పినట్టు , ఇష్టమైనది తీపి గాను , కష్టమైనది చేదు గాను ఉంటాయి .  అంతా మంగళ కరమైన వెలుగే ... అర్థము కానంతవరకూ అమంగళము... అయిన తర్వాత మంగళము " అనుకుని , ప్రసాద పుష్పము తీసుకొని , రక్ష ధరించి ,  పళ్ళెము దైవ సన్నిధిలో నుంచి , ఆమె వెళ్ళిపోయెను.  

     భవిష్యత్తు ఘోరముగా ఉంటుందని , ఒకరికి ప్రత్యక్షముగాను , ఇంకొకరికి పరోక్షముగాను తెలుసు. అయినా , ఎవరూ దానిని తప్పించేందుకు ప్రయత్నము చేయలేదు.

సశేషం

జనార్ధన శర్మ

🌻 Q 55:--సృష్టి ఎప్పటి వరకు కొనసాగుతుంది? 🌻

Ans :--

సృష్టి అనంతకాలం నుండి ప్రారంభమైంది. ఆనంతకాలం వరకు కొనసాగుతుంది. 

ఉదాహరణకు spring ని తీసుకుందాం. ఇది వ్యాకోచిస్తుంది, సంకోచిస్తుంది

కానీ spring అక్కడే ఉంటుంది. 

అలాగే మూలచైతన్యం కోటానుకోట్ల రూపాలను తీసుకుంటుంది. వాటిని నాశనం చేసి మరల పునర్జన్మ ద్వారా ఇతర రూపాలను తీసుకుని పరిణామం చెందుతుంటుంది.

2) ఆత్మశకలం ఏ రూపాన్నైనా ధరించవచ్చు. ఒక నక్షత్రం గా, ఒక గ్రహం గా, ఒక మనిషిగా, ఒక జంతువుగా, ఒక చెట్టుగా, ఒక చేప గా, ఒక క్రిమిగా, ఒక ఎలెక్ట్రాన్ గా, ఒక పరమాణువు గా ఇలా ఏ రూపాన్నైనా తీసుకుంటుంది. ఇది human ఇంటెలిజెన్స్ కి అందదు.

ఇతర dimensions లో తీసుకునే రూపాలు మనకు అర్థం కావు. మన అంతర్ ప్రపంచానికి మాత్రమే అర్థం అవుతాయి.

🌹 🌹 🌹 🌹 🌹

2. " మంత్ర ద్రష్ట " రెండవ తరంగము
రెండవ తరంగం

     కౌశిక మహారాజు ,  ఆశ్రమములో బ్రహ్మర్షి చేత సన్మానించబడి  , సంతోషము , ఆశ్చర్యమూ , సంభ్రమము నిండిపోగా ,  తన శిబిరము లో కూర్చున్నాడు. 

     తాను పొందిన సత్కారము , తన ఊహ కందనంత గొప్పగా ఉంది. అటువంటి సత్కారము చేయడం  తనవంటి మహా రాజుకైనా సాధ్యమా అన్నట్లుంది. రాజు మొదలుకొని , సేవకుని  వరకు , ఏనుగు మొదలు ఎలుక వరకూ , అందరికీ , అన్నిటికీ సత్కారము లభించినది. నిజముగా ఇది సత్కారము అనడం కన్నా , సమారాధన అనుట సరైంది.  

     కౌశికుడు ఈ విధమైన ఆలోచనలోపడెను , " ఇతడు కులపతి అనునది నిజము , అయినా , ధర్మ పరాయణుడైన ఇతని వద్ద ఒక సంవత్సర కాలానికి సరిపడినన్ని సంభారములు , దినుసులు , సరకులు ఉండ వచ్చును. ఈ ఒక్క దినపు సత్కారాలకు ఖర్చు  అయిన ద్రవ్య సంభారాలను చూడగా , అవి యీ ఆశ్రమానికి కనీసము అయిదు సంవత్సరాలకు సరిపోవు లాగున్నాయి. నేను సపరివార సమేతముగా వచ్చి ఇతనికి అదేమి అసౌకర్యము కలిగించానో  ?  నావల్ల ఇబ్బంది కలిగిందో ఏమో ? ఈ వస్తు సామగ్రి అంతా ఇప్పటికిప్పుడు ఎలా వచ్చెనో , ఘటికుడే . లేక , ఈ బ్రహ్మర్షి దేవలోకము నుండీ యేదయిననూ తెప్పించుకొన్నాడా ? .... ఉన్నారులే  , యీతనికి శిష్యులగు రాజులు చాలా మందే ఉన్నారు. , ఇతని కోసము తమ సర్వస్వమునూ అర్పించు వారు అనేకులున్నారు , అయినా , ఇంత వేగముగా ఇన్ని సంభారములను సంపాదించుట ఎలా  ?  " యని దీర్ఘముగా ఆలోచనలో పడెను. 
     ’ ఇదంతా ఏదయినా మాయా సృష్టి కావచ్చు , నేను చూచినదంతా ఒక స్వప్నము కావచ్చు.." అని కూడా అనిపిస్తున్నది. తాను నిలచిన ఈ పర్ణ కుటీరము నిజముగా రాజ యోగ్యమైనది. తాను సేవించిన అమృతాన్నము ఇంకా కడుపు లో  బరువుగా ఉన్నది. మరి ఇది కల ఎలా అవుతుంది ?  

    కౌశికుడు పంపిన  దూత సమాచారముతో వచ్చాడని పరిచారకుడు వచ్చి తెలిపాడు. దూతని రమ్మని సైగ చేసి , రాజు వినసాగెను , దూత ఇట్లు చెప్పెను , " మహా రాజా , ఆశ్రమములో ’ నందిని ’ ధేనువు  ఉంది. అది కామధేనువు ’ సురభి’  కూతురు.  ఆ ఆవుకు , తన తల్లికున్నట్టే  , గొప్ప మహిమలున్నాయి . గురుదేవుల హోమధేనువు అదే . ఈ రోజు అతిథిపూజ అంతా దాని మహిమవల్లనే నడచింది. ఇటువంటి సమారాధనలు అప్పుడప్పుడు యీ ఆశ్రమములో నడచుట మామూలే ! . కానీ ఈసారి జరిగినంత వైభవముగా ముందెప్పుడూ జరగలేదు..." 

     రాజు ఈ మాటలు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినెను. " ఒక్క గోవు. ఆ గోవు ప్రభావము ఇంత గొప్పదా... ఆ గోవు , కామధేనువు కూతురు... మహిమలున్న ఆమె వలన యింత అతిథిపూజ సాధ్యము...వశిష్ఠుని రహస్యము ఇదా ..! ఎవరెన్ని కానుకలు తెచ్చి ఇచ్చినా , వశిష్ఠుడు వాటిపై ఆశ పడక వద్దనుటకు ఇదా కారణము..? " 

     మంచిది  , సామ్రాట్టులకు కూడా సాధ్యము కాని కార్యము చేయగల సమర్థుడితడు. ఈ ధేనువును ఇక్కడ ఉంచుకొని ఈ మహర్షి చేయగలిగినదేముంది ? ఇటువంటి రత్నము సామ్రాజ్య అధిపతుల దగ్గర ఉండవలసినదే కానీ ,  దొరికిన దానితో పొట్ట పోసుకుని తృప్తిచెందు వారితో నిండిన ఈ ఆశ్రమములో ఉండుటేమిటి ? కానీ అలాగని చెప్పి దీనిని నేను తీసుకొనుట బాగుండదు కదా ...దీనిని తీసుకొనడము ఎలా ? 
     ధర్మ నిరతుడైన  తపస్వి యొక్క ఆశ్రమము లోనిదంతా దేవతల కోసము. . రాజుకు దేవతల సొమ్ము  పై అధికారము ఉందా ? మరి , రాజ్యమంతా రాజుదే కదా  , అప్పుడు  రాజ్యము లోనిదంతా రాజుదే అన్నప్పుడు , ఆ రాజ్యములోదే కొంత ఇవతలికి  తీసి , ఇది దేవతల సొమ్ము అంటే  ఏమైనా బాగుందా ? రాజు తనకు తానుగా దానిని వద్దనుకుంటేనే కదా , అది ఆశ్రమమునకు చెందునది ?  వద్దన్నవాడు , అవసరమైనపుడు కావాలనుకుంటే తప్పేమున్నది ?  "

     " ఈ ధేనువు ఎప్పటికీ రాజు వద్ద ఉండవలసినదే. . ఇది కానుకగా గానీ , ధనము ఇచ్చి గానీ , లేదా , బలవంతానైన గానీ రాజ భవనమునకు రావలసినదే. ...."

     " అట్లని , దేవతల సొమ్మును లాక్కొన వచ్చునా ? అదీ , వశిష్ఠుల వంటి బ్రహ్మర్షి అధీనములో ఉన్నదానిని ?  ఇది ఎంతమాత్రమూ తగని పని. దేవతల సొమ్మును తీసుకుంటే , అగ్నిని తీసుకొని ఒడిలో కట్టుకున్నట్లే... జీర్ణమవడము  అసాధ్యము. ఇది పథ్యమైనది కూడా కాదు...ఎంతమాత్రమూ వద్దు. "

     " కానీ , అలా కాదు , దీనిలో లాక్కొనుట  యేముంది ? లోకమంతా దైవాధీనములో యున్నది. ఆ దేవతలదరూ రాజులోనే ఉన్నారు. రాజ దండనము వల్లనే కదా అంతా సరిగ్గా నడచునది. సమాజములో పెద్ద చేప , చిన్న చేపను  మింగకుండా కాపాడు రాజుకు అందరూ ఋణగ్రస్తులే . బ్రాహ్మణుడైనా , బ్రహ్మజ్ఞుడైనా తన తపస్సులో ఒక భాగమును రాజుకు కప్పము కట్టువాడే కదా ? మరి , ఆ శుల్కానికి  బదులుగా యీ ధేనువు వచ్చిన తప్పేమి ? అలా కాదన్న , తనకు ఇష్టము వచ్చిన మరి దేనినైననూ తీసుకొని , యీ ధేనువు ఇవ్వవలెను. అదీ కాదంటే , రాజు దైవాంశ సంభూతుడు కాబట్టి , యీ దేవ ధేనువు రాజుకు చెందాలి. ఏవిధముగా చూచినా ఇది లాగుకొనుట కాబోదు. " 

     " నిజము , రాజైనవాడు భౌతిక సుఖమునిచ్చు దేనినీ  వదల రాదు. రాజు యొక్క లక్ష్యము సమృద్ధి ,అంతే కానీ  త్యాగము కాదు. తనకున్న సర్వ సామర్థ్యమునూ ఉపయోగించి సమృద్ధిని గడించాలి . పారుతున్న నీటికి ఆనకట్ట కట్టి ఉపయోగించు కొన్నట్లే , పెరిగి నిలుచున్న అడవిని వంట చెరకు , సమిధలకై  ఉపయోగించుకొన్నట్లే , లోకములో ఉన్న పనికి వచ్చు అన్ని వస్తువులను సమృద్ధి కోసము ఉపయోగించుకొనుట రాజ ధర్మము. దొరికిన దానిని ఏవో కుంటి సాకులు చెప్పి వదలిన , అది దుర్బలత్వమే. " 

" అవును , ఇదే నిజము. సంగ్రహించ వలసిన వస్తువును సంగ్రహించ కుండా వదలితే , లోకమును పాలించుట ఎలాగ ? కాబట్టి , ఇది నా కర్తవ్యము. " 

     రాజర్షికి తన సిద్ధాంతము సరైనదేనా అని ఇంకా  అనుమానము. అయినా, రాజ సహజమైన పౌరుషముతో , సిద్దాంతము సరియైనదే అని తీర్మానించుకున్నాడు. మనస్సు  ఒక పని చేసి తీరాలన్నపుడు  , బుద్ధి ఎక్కడైనా మంచి చెడు విశ్లేషణ చేస్తుందా ?  వివేకముతో ఆలోచించే అవకాశము ఎక్కడుంది ? లేడికి లేచిందే పరుగు కదా ! 

రాజదూతకు ఆజ్ఞ అయినది , " భగవానుల కెపుడు అనుకూలమో , తెలుసుకొని రా ! "

     రాజదూత వాయువేగముతో పరుగెత్తి వెళ్ళి , సమాధానము తెచ్చాడు. " గురు దేవుల అనుజ్ఞ అయినది , ఇప్పుడు  సంధ్యాకాలము సమీపిస్తున్నది. తమోగుణ వేళ. సంధ్య ముగిసిన తర్వాత అయితే మంచిది. కానీ , ఈ క్షణమే రావలసినదిగా రాజు అభిప్రాయమైతే , వారి ఆజ్ఞ నేను ఎప్పుడూ గౌరవిస్తాను. . " 

     రాజు తల ఊపెను. " ఔను , పాలించు రాజు లేకుంటే , అందరూ పాలకులే.  అందరూ రాజుకు తల వంచవలసిన వారే.. అన్ని తేజస్సులూ రాజు తేజస్సు ముందు యొక ఘడియ యైనా కళ తప్పవలసినదే. తమోగుణ వేళ అన్నారు కదా , చూద్దాము ,  అది మమ్మల్ని  ఏమి చేయగలదు ?  ఆయనేమో  ,  బ్రహ్మర్షియై , తపస్వులలో శ్రేష్ఠుడై , బ్రహ్మ విద్య తెలిసిన వాడై గుణాతీతుడైన బ్రాహ్మణుడు. అంతటి వాడైననూ రాజును తిరస్కరించు వాడు కాదు. ఇంతటి ఆతిథ్యము ఇచ్చి మమ్మల్ని గౌరవించినవాడు . ఇక  మేమా ,  అన్ని విధాలా , అతనిలో ఉన్న ఆశ్రమోచితమైన వినయమును వదలక ఎప్పుడూ ఇలాగే నడచుకోవలెనన్న కోరిక గలవారము. ఒకరు సర్వతేజో మయుడైన రాజు , ఇంకొకరు సర్వ దేవతా మయుడైన బ్రాహ్మణుడు. ఈ ఇద్దరి మధ్య కాలమునకు పనియేమి ? అని నిర్ణయించుకుని ,

      " మేము ఇప్పుడే వచ్చెదమని బ్రహ్మర్షి సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయి " . అని దూతను పంపించి , తాను ఆతని వెనకే కొద్ది పరివారముతో పాద చారియై , వశిష్ఠుల పర్ణశాలవైపు బయలుదేరెను. 

     రాజు కొంత దూరము పోవునంతలోనే , సమారాధనము లోని విశేష భోజనానికై వచ్చిన గ్రద్ద ఒకటి , తన విశాలమైన రెక్కలు విప్పి ,  పైకి లేచి  ఎగిరి పోయి , ఫల భారముతో వంగిన ఒక చెట్టుకొమ్మ పై కూర్చుంది.. దాని బరువు తాళలేకో , మరి యెందుకో , ఆ కొమ్మ విరిగి పడిపోయింది. . ఇదేమిటి ? నేను బయలుదేరడము , అప్పుడే  గ్రద్ధ ఇలా వాలడము , కొమ్మ విరిగిపోవడము మంచిదేనా , శుభ సూచకమేనా అని ఒక్క క్షణము ఆలోచించెను. కానీ వెంటనే ,కార్య సాధకులగు క్షత్రియులు ఇటువంటి వాటిని లెక్క చేయరాదు అని ముందుకు సాగెను. 


సశేషము

విభాతమిత్ర

" మంత్ర ద్రష్ట " నాలుగవ తరంగము             --- 4 --- నాలుగవ తరంగం

     ఆశ్రమములో ఎక్కడ చూసినా కోలాహలము. ఇంతవరకూ అతిథి పూజ సంభ్రమములో కోలాహలము. ఇప్పుడు అతిథుల సంభ్రమపు కోలాహలం. రాజు వైపు వారంతా , నందినిని తమ రాజధానికి పిలుచుకొని పోవుచున్నారని సంభ్రమములో మునిగియున్నారు. నయానో , భయానో నందినిని రాజధానికి తీసుకొనే వెళ్ళవలెనని రాజ పరివారము అన్ని ప్రయత్నాలనూ  చేస్తున్నది. ఆ వార్త తెలిసి ఆశ్రమ వాసులందరూ కలవర పడుతున్నారు.

     ఆశ్రమ వాసులంతా యథావిధిగా సంధ్యా కార్యములను ముగించుకున్నారు. ఎవరూ రాత్రి భోజనము గురించి పట్టించుకొనుట లేదు , అందరికీ ఒకటే యోచన..." రాజుకా ఇంతటి దుర్బుద్ధి ? " అని కొందరు , " ఇది సాధ్యమేనా ?  " అని మరికొందరు , " క్షత్ర -బ్రహ్మ యోగపు కాలము గడచి , క్షాత్రము బ్రాహ్మము ఒకదానినొకటి వ్యతిరేకించు కాలము వచ్చినదా ? " అని ఇంకొందరు. ఒక్కొక్కరు తమకు తోచినట్లు మాట్లాడు కొంటున్నారు. 

     అరుంధతీ దేవి సంధ్యా హోమమును ముగించుకొని బయటకు వచ్చినది. ఆశ్రమపు కలవరము ఆమెనూ పట్టినది. ఆమెకు " మేమిచ్చిన  సత్కారమును పొంది తృప్తి పడిన యతిథి మా ఆశ్రమము లోనే ఇంతటి అత్యాచారమును చేస్తాడా ? ఆశ్రమపు ధేనువునే తనకిమ్మని అడుగుతాడా ? ఆశ్రమపు బ్రహ్మ భూమిపై రాజుకు అధికారము ఉందా ? " అని అనేక ప్రశ్నలు , సందేహాలు ,  శంకలు ఒకదానిపై నొకటి మనస్సును వేధిస్తున్నాయి. ఆదినము ఉదయము పతిదేవులు చెప్పిన మాట జ్ఞాపకము వచ్చెను. " ఆశ్రమములో రక్త పాతము కావలసి ఉన్నది , అగును " అన్న మాట చెవిలో మళ్ళీ మ్రోగెను. 

     " అలాగైన , జరగవలసినది జరగవలసినదే . అయినా , యెందుకు దానిని తప్పించకూడదు ? నేను ప్రయత్నము చేయనా... ?? "  అనిపించెను. మనసు లో అదే ఆలోచన. 

     అంతలో  దూరము నుండి లీలగా వినిపించు గంటల మ్రోత , ఎక్కడో ఆలోచనలో మునిగిన మనసుని తట్టి లేపెను. అరుంధతి తిరిగి చూసింది. నందిని వస్తున్నది. శాంతి , సమృద్ధి మూర్తీభవించి నట్టు , సౌభాగ్య లక్ష్మి ప్రతిబింబమా అనునట్లు మెడలో గంటలు మోగుచుండగా నెమ్మదిగా , హుందాగా నడచి వస్తున్నది. తల అటు ఇటు ఊపుతూ , ఎవరికి యేమి కావలెను ? ఎవరికే వరము కావలెను ? అని వెదకుతున్నట్టు వున్నది. కేసరి వర్ణపు ఎర్రావు. జగములోని సౌభాగ్యము నంతటినీ రాశి పోసి , దానిపై ఒక తిలకము దిద్దినట్టు , ఆ గోవు ముఖముపై ఒక వెండి వర్ణపు తిలకము. సౌభాగ్య దేవి మందిరపు గోపురము పైన అమర్చిన శిఖరముల వంటి వెండి తొడుగులు తొడిగిన కొమ్ములు. కాలి గిట్టలకు ఘల్లు ఘల్లు మనే మువ్వలు .

     నందినిని చూడగానే అరుంధతీ దేవికి అపారమైన ఆనందమైంది.. చిత్తములోని ఆలోచనలన్నీ ఒక్క గడియ ఎక్కడికో మాయమయ్యాయి. అంతలోనే , ఆ గోమాత తమ  ఆశ్రమములోనే ఉండి , పరిసరముల నంతటినీ ఇదే విధమున పావనము చేయునో లేదో అన్న శంక కూడా కలిగింది.. ఆ శంక కలిగించిన విషాదమును సహించలేక దానిని తరిమి వేయుటకో అన్నట్టు దేవి పరుగెత్తి ఎదురు వెళ్ళి నందినిని హత్తుకొనెను. ఆ ధేనువు కూడా ఆ కౌగిలి ఉపచారమును సంతోషముగా స్వీకరించి , తాను కూడా అంతే ప్రీతిగా అరుంధతికి తన ముఖమును రాస్తూ ఉపచారము చేసెను. 

     " అమ్మా , నీవు వెళ్ళిపోతావా ?  మా దగ్గర ఉండవా ? " అని అరుంధతి అడిగింది. నందిని తల అటూ ఇటూ ఊపి , గంటల సవ్వడి మృదువుగా వినిపించు చుండగా మనోహరమైన మనుష్య వాక్కుతో ఇలా పలికింది , " దేవీ , గురుదేవులకూ , కౌశికునికీ మధ్య జరిగిన సంభాషణ అంతా నాకు తెలుసు. కౌశికుడు రాజు అన్న మాట నిజము. అతనిలో దైవాంశ కూడా ఉన్నది. కానీ , కామధేనువు కూతురును తన ఇంటిలో ఉంచుకోవాలంటే , ఎంతటి యోగ్యత ఉండాలో , అంతటి యోగ్యత ఇంకా అతనికి సిద్ధించ లేదు. ఈ దినము ఈ సంగతి అతనికి బోధ పడును. తల్లీ , ఈ రోజు ఈ పుణ్యాశ్రమపు పుణ్యభూమి , రక్తపానమును కోరి , ’ నందినీ , నాకు రక్త పానము చేయాలని ఉన్నది , ప్రసాదించు ’ అంటున్నది. అది జరగవలసినదే. తప్పక జరుగును. కానీ , తల్లీ , నాపైన బల ప్రయోగము జరుగు వరకూ నేనేమీ చేయను. ఈ ఆశ్రమపు పుణ్య భూమిలో నాపైన బల ప్రయోగము చేయుట కౌశికునికి ఎంతమాత్రమూ  తగని పని. అయిననూ అది కావలసినదే. అనివార్యము. అట్టి దుర్ముహూర్తము వస్తే , నేను ఆత్మ రక్షణ చేసుకోవచ్చును , కదా తల్లీ ? " అనెను.

     అరుంధతికి అంతా అర్థమైంది. . జ్ఞానమును పొందుటకు  సాధకమైన ఆశ్రమపు పుణ్యభూమిని  , ప్రశాంత సరస్వతి వలె కాపాడుతున్న భూదేవి ఈనాడు , ఒక  దుర్గగా , చండిగా , కాళిగా రక్తపానమును కోరుతున్నది గదా యని కొంత సేపు మనసులో విషాదము కలిగింది. వెంటనే , కావలసినది కాక మానదు , అను నిశ్చయముతో పలికింది  , " అమ్మా , నీవు పుట్టినదే మమ్ములను అనుగ్రహించుటకు. నీవు అలాగే మాపై అనుగ్రహముతో ఉంటే చాలా సంతోషము. నీకు ఆగ్రహము వచ్చు సన్నివేశము రాకుండా ఉంటే పరమ సంతోషము. కానీ , మీరు దేవతలు. లోకమును రక్షించుట , శిక్షించుట మీ చేతిలో ఉన్నది. మీరు ఏమి చేసినా సరే " అనెను. 

     నందిని కొంత నొచ్చుకుని , పలికెను , " తల్లీ , నీమాట నిజము , అనుగ్రహించుటకై పుట్టినవారు ఆగ్రహించుట కష్టము. అయితే  మేము కూడా అయినంతలో అనుగ్రహించుటకే ప్రయత్నిస్తాము. నీటి ప్రవాహము నిలుపుటకు కట్టిన ఆనకట్ట కూడా , మన ప్రయత్నము లేకుండానే ఒక్కోసారి తెగిపోవును , అలాగే మేము ఆగ్రహమును చూపవలసి వచ్చును. తల్లీ , నీవు శోకించవద్దు. అంతటి దుర్ముహూర్తము వస్తే , నన్ను నేను రక్షించుకోగలను. ఏదేమయినా , మీరు మాత్రము నన్ను దూరము చేయవద్దు. మీరు తల్లిదండ్రులు , నేను మీ కూతురును. " అనెను. 

     అరుంధతీ దేవికి కంట నీరు చిప్పిల్లెను. " నీ వలన మా ఆశ్రమము..."  ముందరి మాట చెప్పుటకు అరుంధతికి గొంతు పూడుకు పోయింది. మాట పెగల లేదు . తల్లిని నాకెడు లేగ దూడ వలె నందిని ,  అరుంధతి ముఖమును ప్రేమతో నాకెను. అరుంధతి చేసిన నమస్కారమును ఒప్పుకుని  , ముందుకు వెళ్ళి పోయెను. 

     గోమాత వెళ్ళిన కొంచము సేపటి వరకు ఈమె అలాగే స్థాణువై కూర్చొని ఉంది. వృద్ధ శిష్యుని ఒకరిని పిలచి , ’ అయ్యా , ఆశ్రమ వాసులందరికీ ఇది విన్నవించు . బయటి నుండీ వచ్చిన వారు ఎట్టి దుర్మార్గము చేసినా ,  మనమెవ్వరమూ భయ భ్రాంతులము కాకూడదు. అతిథి దేవో భవ అనుదానిని మరువరాదు. అతిథి సత్కారము పొందిన వాడు చేసిన దౌష్ట్యమును లెక్క చెయ్యరాదు. అది సాధ్యము కాకపోతే , ఇప్పుడే దూరముగా వెళ్ళి నిలవండి. ఎంతదూరము వెళ్ళితే సాధు స్వభావమును కాపాడుకోవచ్చునో , అంత దూరము వెళ్లండి. ఇది అందరికీ తెలియాలి. " అనెను. 

     శిష్యుడు , కన్నీరు నింపుతూ , " తల్లీ , అతిథి దుష్టుడాయెను. తపస్వులందరూ క్షోభించుతున్నారు " అని పలికెను. 

     అరుంధతీ దేవి , " అయిన దానికీ , కానిదానికీ క్షోభ పడునట్లయితే , ఆశ్రమమునకు ఎందుకు  రావాలి ? ఆశ్రమము లో ఉన్నంతవరకైనా ఆశ్రమ ధర్మమును పాటించాలి , అవునా ? " యని నవ్వెను. 
     వృద్ధ శిష్యుడు మారు పలుకలేదు. నమస్కారము చేసి , ఆజ్ఞ నెరవేర్చుటకు వెళ్ళిపోయెను. 


కన్నడ మూలం : దేవుడు నరసింహ శాస్త్రి


తెలుగు అనువాదం : విభాత మిత్ర

6. " మంత్ర ద్రష్ట " ఆరవ తరంగము

ఆరవ తరంగం
     మధ్యాహ్నము మూడవ ఝాము. సూర్య భగవానుడు పశ్చిమ దిగంతము వైపుకు పరుగెత్తుట ఆరంభించెను. శ్రమజీవులందరూ విశ్రాంతి తీసుకొని , ఆ దినపు కార్యము ముగిసినదా యని పూర్తి చేసిన పనిని సరి చూసుకొను కాలము. వశిష్ఠులు తమ పర్ణ కుటీరములో ఒక కృష్ణాజినము పైన కూర్చుని , ఒక పీటను ఆనుకొని ఒరిగి యున్నారు. ఏదో ఒక ఆలోచన వచ్చి తీవ్రముగా మనసును తొలచి వేస్తుండగా , దానిని సులభముగా పక్కకు ఎత్తి పెట్టే ప్రయత్నములో ఉన్నట్టుంది. దేహభారమును ఒరిగియున్న పీటపై వేసి , మనసును ఎదుటనున్న కార్యము పై కేంద్రీకరించునట్లున్నది. అరుంధతీ దేవి ఎదురుగా కూర్చొని యున్నది. ఆమెకు ఏదో శీతలమైనట్లు శ్వాస ఎగబీల్చునట్లున్నది. ఆశ్రమములో రక్తపాతమైనప్పటి నుండీ ఆమెకు మనసు , శరీరము రెంటికీ నెమ్మది లేదు. ఏదో ప్రకోపము నకు లోనై , ముగుతాళ్ళను తెంచుకొని ,  బంధనమును విడిపించుకొనుటకు పెనగులాడే ఎద్దు వలె ఆమె మనస్సూ , శరీరమూ ఆశ్రమపు శాంత జీవనము కోసము హఠము చేస్తున్నట్లున్నవి. అయిననూ , మగనిపై కోపించి ననూ , అది చూపుటకు అవకాశము లేకుండా అతనికి వశమయిన భార్య వలె , ఆమె మనసూ , శరీరమూ ఆమె స్వాధీనములోనే యున్నవి. 

     వశిష్ఠులు ఆమె వైపు చూచిరి. పరుగెత్తి వచ్చి , రెండు చినుకులను కురిసి , మరలా పరుగెత్తి పోవు మేఘము వలే , పట్టు తప్పిన అతని మనసు కూడా  , ఒక చిరు దరహాసమును అతని ముఖముపై చముక్కు మని మెరపించి , అంతలోనే ఎక్కడికో పరుగెత్తి పోయినట్లాయెను. ప్రసన్నము గానున్నను , ఇటులే అన్యమనస్కము గానే ఆమెను చూచి పలికెను. ’ దేవీ , నీకు ఆశ్రమముపై యున్న మమత వలన ఈ నాటి విషయమే ప్రబలముగ ఆలోచిస్తున్నావు. ఆ కౌశికుని వైపు కూడా కొంచము ఆలోచించు , లోకములోని రాజాధిరాజులనందరినీ గెలిచి  వచ్చిన యట్టివాడు , ఇక్కడ , ఆశ్రమమున తన శౌర్యమునంతా పణముగా పెట్టి , ఓడిపోయి పారిపోవలసి వచ్చెను. అట్లయినపుడు , అతనికి మన పైన విద్వేషము రగులుట లో ఆశ్చర్యము లేదు. బ్రహ్మ ద్వేషము చేయవచ్చునా యనెడి లోకము , ఇంకొక అడుగు ముందుకు వేసి , ’ రాగ ద్వేషాలు రెండూ మనో వికారములు . కావలెననుకొన్నది రాగము , వద్దనుకొన్నది ద్వేషము . అభిముఖమైనపుడు రాగము , విముఖమైనపుడు ద్వేషము ’ యను దానిని ఎందుకు చూచుటలేదు ? 

     కౌశికునికి కామధేనువు కావలెనన్న కోరిక పుట్టినది. దానిని పొందుటకు మనము అడ్డు యని అతనికి అనిపించినది. అతని అర్థకామమునకు మనము అనుకూలమైనచో , అప్పుడు అతను మనకు భక్తుడగును. కానీ ఇప్పుడు అతడు మనలను ’ నా కార్యమునకు అడ్డముగా ఉన్నారు ’ అనుకొనిన, మనలను ద్వేషించుట సహజమే కదా ! కాబట్టి రాగ ద్వేషములు రెండును వికారములు అనుకొన్నవారు , ఆ రెంటికీ వశులు కారాదు. దేవీ , అది అటులుండనిమ్ము , ఇప్పుడు కౌశికునికి పుట్టిన ఆక్రోశము అకారణమైనది యనుకున్నావా ? కాదు . దానికి కారణము మనకిప్పుడు తెలియకున్ననూ , ఉండనే ఉంది.  ఆ ఆక్రోశము రాబోవు దానికి శుభ సూచన. అతని హృదయము నందు ఇంతటి తీవ్రమైన భావన రాకున్నచో , తన సమృద్ధి యయిన రాజ్యమును వదలి  , తపస్సుకై మరలుట ఎట్లు జరుగును ? ’ నీకు కావలసినదానిని తపస్సు వలన సాధింపు ’ మని నేను చెప్పినప్పుడు ఆ రాజు మనసు ఒప్పుకొనలేదు. దానిని కాల్చి , బూడిద చేసేటందుకే ఈ నాశనము , ఈ ఆక్రోశము , ఈ క్రోధము   కావలసివచ్చెను. నొచ్చుకొని వేడెక్కినట్లు ఇప్పుడు తపస్సుకు సిద్ధమయినది. కౌశికుడు రాజ్యమును కుమారునికి అప్పగించి , తాను తపస్సుకు పోవనున్నాడు. ఆ తపస్సులో నిష్ఠా గరిష్ఠుడై , సాత్త్వికుడు కావలెను , దానికన్నా  ముందే , తనలోపల నున్న రజోగుణమును కడిగివేసుకొనుటకు లోకమున ఒక విప్లవమును తెచ్చును. పెరిగి నిలుచున్న అడవిని కొట్టివేయవలెను , లేదా దహించవలెను ; లేకున్న , మరలా అడవిని పెంచుటకు వీలుకాదు. ప్రకృతి కూడా , కొట్టివేయుట కన్న కాల్చుట సులభమని కాల్చును. అది సహించలేని మానవుడు తన సొమ్మేదో పోయినట్లు బాధ పడును. సరే , ఆ విషయము వదలి , ముందరి కార్యము చూడు. వామ దేవుడు వచ్చెనా ? ఈ నాటకమున అతనికి ఒక పెద్ద పాత్ర యున్నది ’ యనెను. 

     వామ దేవుడు వచ్చెను. గురువుకు నమస్కారము చేసి , అనుజ్ఞ పొంది , కూర్చొనెను. వశిష్ఠులు , ముసిముసిగా నవ్వి , ’ వామ దేవులకు రాజ గురువువగు యోగము వచ్చినట్లున్నది ’ యనిరి. వామదేవుడు ఒక గడియ పర్యాలోచన చేసి , ’ అర్థము కాలేదు ’ యని అతి వినయముగా పలికెను. వశిష్ఠులు నవ్వుచూ , ’ కొండపైని సరోవరపు నీరు బయలుదేశమున నదిగా ప్రవహించవలసియున్నది. ఆయకట్టును చూచి , ఒక్క రాయిని సడలించిన , నీరు బయటికి వదలును. ఆ సమయము వచ్చినది . రాజా కౌశికుడు , ’ తపస్వి కౌశికుడు ’  కాగలడు. తన బాహుబలము చేత అసాధ్యమైనదానిని తపోబలముతో సాధించవలెనని రాజ్యమును వదలి , హిమాచలమును ఆశ్రయించును. అక్కడ అతనికి ఈశ్వరానుగ్రహము సంపాదించు దారిచూపువారు ఒకరు కావలెను. దెబ్బ తిని చెలరేగినమనసు తీవ్రమైన శ్రద్ధ వైపుకు తిరిగినది . ఆ శ్రద్ధను సరియైన దారిలోకి మళ్ళించుటకు ఒక విసనకర్ర కావలెను. ఆ విసన కర్ర నువ్వు . ’ అని పలికిరి.

వామదేవునికి ఇంకనూ ఏదో సందేహము ; అట్లయిన , ఈశ్వరానుగ్రహము పొంది కౌశికుడు మరల ఆశ్రమమునకు వచ్చి యుద్ధము చేయునా ? " యనెను

     వశిష్ఠులు , శాంతులై , నిశ్చలులై , నెమ్మదిగా పలికిరి , ’ ఔను. అది అట్లే కావలెను . రాయి కరిగి , అద్దము కావలెనన్న , అడవిలో ఒకమూల అంతా కాలి బూడిద కావలెను , ఇది ప్రకృతి నియమము. మన ఆశ్రమములో ఇంకొకసారి శస్త్రాస్త్రముల విజృంభణమయిన తర్వాత కొత్త సృష్టి ఆరంభమగును. అది మనకు కావలసిన రీతిలో జరుగలేదని మనము కోపిస్తే , మనమే పిచ్చివారమవుతాము. వామ దేవా , ప్రకృతి నియమములకు అడ్డుగా ఉన్న వాటిని తీసివేసి , కార్యములు కొనసాగునట్లు సహాయము చేయుట బ్రాహ్మణ ధర్మము. అందువలన , ప్రకృతి రౌద్రరూపమున వచ్చిననూ ఆహ్వానించవలెను. జగత్తుయొక్క హితము కోసము తపస్సు చేయు బ్రాహ్మణుడు తన ప్రియాప్రియములను పట్టించుకొనరాదు. అవ్యక్తము గానున్నదానిని వ్యక్తము చేయుటకు కావలసిన శక్తి ని కేంద్రీకరించుకొని , ఒక ముఖము నుండి స్వీకరించి , ఇంకొక ముఖము నుండి వికేంద్రీకరించి , లోకానికి ఇచ్చు యంత్రము తాను అని గుర్తెరిగిన బ్రాహ్మణుడు యంత్రము వలెనే , ప్రియ  , అప్రియములకు అతీతుడై యుండును. కౌశికుడు అంతటి యంత్రము కాగలడు, యంత్రమును జోడించు భారము మనది. ఇప్పుడు విడి భాగములు వేరే వేరే యయినట్లు ఉన్నందున , అది ( కౌశికుడు ) విముఖమై మమ్ములను ఆరాధిస్తున్నది. అది అటులనే విముఖముగనే పెద్దది కావలెను. అట్లు విముఖమై పెరిగి , చివరికి , తాను విముఖమై ద్వేషము చేత ఆరాధించినది ’ ఇది తానే , తనదే , వేరే కాదు ’ యని తెలుసుకొని దానితో తాదాత్మ్యము చెందును. కాబట్టి , ఆ నమ్మకము మనకు ఉన్నందున , మన కర్తవ్యము మనము చేయవలెను కదా ?  " యనిరి. 

     వామదేవుడు , ’ గురు దేవుల యనుజ్ఞ సకలమునూ నెరవేర్చగల శక్తి నాకు రానిమ్ము , ఈ యనుజ్ఞను , ఇట్లు ఎందుకు చేసిరి యని నేనెందుకు అడగవలెను ?  నేనొక ’ దర్వి ’ ని మాత్రమే ( యజ్ఞము నందు ఉపయోగించు చెక్క గరిట ) దర్వి ఉన్నది యజమానుని ఉపయోగమునకు. యజమానుడు , ఆ దర్వితో తీసుకున్న ఆహుతి ని ఎక్కడైననూ ఉపయోగించుకొననిమ్ము , అగ్ని లోనో , జలము లోనో , స్థలములోనో , ఎక్కడ ఉపయోగించిననూ దర్వికి దానివల్ల ఎట్టి హానియు లేదు. దానికి వలెనే , భగవానుల ఆజ్ఞ ను నెరవేర్చుటయే నా పని. కాబట్టి , ఇదిగో , బయలుదేరుతున్నాను " అని యనెను. 

     వశిష్ఠులు ఆశ్రమపు పర్ణశాల గోడల మధ్య కూర్చున్ననూ , విశాల జగత్తులో ముందు ముందు  విచిత్ర  కథనముతో  జరుగవలసిన కథ కు బీజమును వెదకి తీస్తున్న వారి వలె , అన్యమనస్కముగా , అనన్య దృష్టి తో పలికిరి , " నీవు హిమాలయము నందు నిలువుము . కౌశికుడు అచటికి వచ్చును. అతడికి ఏమి చేయవలెనన్నది తెలియదు. అతడు వచ్చినపుడు ,మాటలలో పెట్టి , అస్త్రములు సర్వమూ యున్నది రుద్రుని యందు , యని చెప్పి , రుద్రారాధన క్రమమును బోధింపుము . " యనిరి. 

     వామదేవునికి ఎంత నిగ్రహించుకున్నను సాధ్యము కాక , కంట నీరు రాగా , ’ ఆ అస్త్రములనన్నింటినీ సంగ్రహించుకొని వచ్చి , మన ఆశ్రమమును నిర్మూలించునో ఏమో ? ’ అనెను. మనస్సు నందు నిండిన భారమైన దుఃఖము పుట్ట వలె పెరిగినది యనుటను అతని గొంతు గాద్గదికమై సూచించెను. 

" వామదేవులు ఇప్పుడు విచారించవలసినది ఈ ఆశ్రమము యొక్క క్షోభ ను గురించి కాదు , రాబోవు మహాకాలమున జరగ వలసిన దేవ కార్యము గురించి మాత్రమే. ఇప్పటి భయము తో కూడిన ప్రణాళిక జరగబోవు మంగళ కార్యపు దారికి అడ్డు రాకూడదు. అంతగా కావలెనన్న , భవిష్యత్తు  తెరను తొలగించి చూడవలెనన్న , చూడు ’ అనిరి. 
వామ దేవుడు చూచెను. అతని మనస్సు , ఇంద్రియములు , కాలము లోగల అవలక్షణాలను అవతలికి నెట్టివేసి , భవిష్యత్తు ను కరతలామలకము వలె చూచెను. అతడి మనస్సులోని దుఃఖము సంపూర్ణముగా నాశనమై , దాని స్థానమున అంతే గొప్పగా ఆనందము  నిండెను. లేచి , గురువుకు వందనము చేసి , అనుమతి కోరి నిలిచెను. అతని దుఃఖము నివారణ అయినట్లే అరుంధతి దుఃఖము కూడా నివారణ ఆయెను. ఆమె మనసు ప్రసన్నమాయెను. 

     గురుదేవులు , ’ కృతకృత్యుడివి కమ్ము ’ అని ఆశీర్వదించిరి. శిష్యుడు గురు దేవుని కీ , గురు పత్నికీ సాష్టాంగ నమస్కారము చేసి హిమాలయమునకు బయలువెడలెను. (సశేషము)


కన్నడ మూలం : దేవుడు నరసింహ శాస్త్రి

7. " మంత్ర ద్రష్ట " ఏడవ తరంగము

ఏడవ తరంగం

     అది హిమాలయ ప్రాంతము. దేవదారు వృక్షములు సభ చేసి నిలచినట్లు పెరిగియున్నవి. అక్కడక్కడ బండలు , బండల పైన పూసిన రాతి పూలు , ఆ చలిలో ,ఆ బండలు కప్పుకొన్న చిత్ర కంబళుల వలెనున్నవి. ప్రక్కనే ఒక చిన్న నది , బండల నడుమ జలజలా ప్రవహించుచున్నది. అక్కడే  , బండల మధ్య దైవ నిర్మితమైన ఒక సరోవరము. పైనుంచీ నీరు వస్తున్నది , ఇంకొక మూల నుండి నీరు బయటికి పారుతున్నది. నది ఈ కొన నుండి ఆ కొన వరకూ దేవదారులు ఉండి , నది , వాటి పాదాలు కడుగుతూ పోవునటుల ఉన్నది. నదీ జలముయొక్క చలువ తోపాటు , దేవదారు యొక్క లేత పరిమళము కలసి నిండి , గాలి సర్వవిధముల శ్రమనూ పరిహరించు సఖుడి వలె వీస్తున్నది. 

     నది నుండి కొంచము దూరములో కొంచము ఎత్తైన చోట ఒక విశాలమైన మైదానము. అక్కడ రెండు తులసి మొక్కలు. రెండు పూల మొక్కలు , వాటి వెనుక ఒక పర్ణశాల. ఆ మొక్కల పక్కనే విశాలమైన ఒక బండ. మొరటుగా పైకి లేపిన పందిరి వలె , ఎత్తు పల్లములు , హెచ్చుతగ్గులుగా నున్న ఆ బండ పైన ఒకవైపు వామదేవుడు కూర్చొని యున్నాడు. ఇంకొక వైపు , అతనికి ఎదురుగా కౌశికుడు కూర్చొని యున్నాడు. వామదేవుడు , బండ పక్కనే పెరిగియున్న చెట్టునానుకొని , దానిపై ఒరిగి  , నిర్విణ్ణుడై , మనసు పరిపరి విధాలు పోవ , కూర్చొని , కౌశికుడు చెప్పునది వినుచున్నాడు.. కౌశికుడు , ఏకాగ్రతతో స్పష్టం గా చెప్పుచున్నాడు. 

     " ఒక గోవును సంపాదించుటకు యోగ్యత లేనివానికి రాజ్యమెందులకు ? అని ఇక్కడికి వచ్చితిని . ఇప్పుడు నాకున్నదొకటే కోరిక . . ఆ వశిష్ఠుని పై ద్వేషము. వశిష్ఠులు గొప్ప మనసుతో ఆ గోవును నాకు ఇచ్చియుండవచ్చు.  కాని ఇష్టము లేక , ఆ గోవు నెపముతో , నన్ను నిరాకరించి , తన తపోబలము చేత నా సైన్యమునంతటినీ ధ్వంసము చేసి , అవమానించిరి. క్షత్రియుడనై ఆ అవమానమును తీర్చుకొనకుందునా ? " 

      " అయితే , ఏమి చేయవలెననియున్నావు ? " 
     " తపస్సు చేసెదను. దివ్యాస్త్రములనెల్లా సంపాదించెదను. వశిష్ఠులను బలి తీసుకొనెదను. "
     " లేకున్న బలి యయ్యెదను  అని చెప్పు "
     " దివ్యాస్త్రములున్నపుడు బలియగుట అనగా నేమి ? " 

     " ఇక్కడే నువ్వు పొరపడుతున్నావు . కౌశికా , నీవే అంటున్నావు గదా , ఆ వశిష్ఠులు తమ తపోబలముచేత నీ సైన్యమును ధ్వంసము చేసెనని ? ఇప్పుడు నువ్వు తపస్సు చేసి సంపాదించు అస్త్రములు ఆ మహా తపస్వికి తెలియనివనుకొనుచున్నావా ?  బహుశ , నువ్వు సంపాదించబోయే అస్త్రములతో పాటు , నీకు సంపాదించుటకు సాధ్యము కాని అస్త్రములు కూడా అతనికి తెలిసియుండ వచ్చును. " 

     " అది కూడా సాధ్యమే..అట్లయిన నేనేమి చేయవలెను ? "

     " అది నీ ప్రారబ్ధమును బట్టి యుండును. నువ్వు నా శిష్యుడివి కావు. ’ అన్య శిష్యం నబోధయేత్ ’ అని శాస్త్రము అంటున్నది . అయిననూ , నాకు దైవానుజ్ఞ అయినది .  నువ్వు అడిగిన ప్రశ్నలకు ఉత్తరము ఇవ్వగలను. నాకు ,  నీకు జరగబోయే శ్రేయస్సులో గానీ , హానిలో గాని భాగము లేదు. " 

     కౌశికుడు కొంత సేపు ఆలోచించెను. " ఏమయినా కానిమ్ము , వామదేవా , నాకు అస్త్రములను సంపాదించు మార్గము చెప్పు. మొదట అస్త్రములు దొరకనిమ్ము , ఆ తరువాతనే వాటిని ఉపయోగించు విషయము. "
" అటులనే కానిమ్ము , ధనుర్విద్యకు ఆచార్యుడు రుద్రుడు. అతనిని మెప్పించిన , సర్వ శస్త్రములూ , అస్త్రములూ నీ వశమగును. "

     " అతనిని మెప్పించుట యెట్లు ? "

     " వేదములయందున్న రుద్ర సూక్తములతో జపము , హోమము , తర్పణములను ఆచరించు. నీవు చేయు ఆ కర్మలయందు నీకు శ్రద్ధ పెరిగిన కొలదీ , జగత్తంతయూ రుద్రమయమగును. అగ్నియందు పడిన కాష్ఠము   తానుకూడా అగ్ని యగునట్లు నువ్వు కూడా ఒక దినము రుద్రుడివి యగుదువు. అప్పుడు అతని అస్త్రములు నీవి యగును. అయిననూ , కౌశికా , నువ్వు ద్వేషమును దిగమింగి , శాంతుడవై , గొప్ప లక్ష్యమును ఆశించి తపస్సు చేయుట మంచిది . " 

     " వామదేవా , నేను కూడా యోచించితిని , కాని, నాకు అటుల చేయుటకు ఇప్పటిలో సాధ్యము కాదు. ఇప్పుడు నా మనస్సుకు ధర్మాధర్మములు కనిపించుటయే లేదు. నాకు తెలియదా , బ్రహ్మ క్షత్రములు రెండూ కలసిన లోకానికి వృద్ధి. అట్లు కాక , భిన్న మార్గముల పోయిన  , లోకమునకే హాని. కానీ నేను ఓడిపోలేను. " 

     " నిజమే . ఈ లోకము నూతనమగుచున్నది . దానివలన  , కాల ప్రేరితులై జనులు బ్రహ్మ ద్వేషమునవలంబించి , తామూ చెడి , ఇతరులనూ చెరుపుదురు. చూడు , అప్పుడే నా దృష్టికి గోచరమగుచున్నది , హైహయులు భృగువుల  పైన దండెత్తినారు . రాజుల ధనమంతటినీ భార్గవులు అపహరించినారని వారిపై ఆరోపణ చేసి , వారిని చిత్రహింసకు గురి చేసి , వారి వంశమునే నిర్మూలము చేయవలెననియున్నారు . కానీ , పవిత్రమైన భృగు వంశమును నాశనము చేయుట సాధ్యమా ? అంతలోపలనే , అతి క్షత్రియుడైన వీరుడొక్కడు భార్గవులలో జన్మించినాడు. హైహయుల అపరాధమునకు కోపించి , భార్గవ శాపము వలన , ముందే హతమయి యున్న క్షత్రియ కులమునే నిర్మూలించును. 

     ఇక్కడ  చూడు , భృగువుల  పత్నులు ఈ దుష్ట క్షత్రియులకు బెదరి , ఆశ్రమములందు నిలువలేక , పారిపోయి హిమాలయములలోని అరణ్యములందు చేరినారు . వారిలో అనేకులకు గర్భపాతమయినది . గర్భస్థ శిశువులనూ వదలని ఆ హైహయుల మృత్యుదేవతను ఒక పుణ్యవతి తన ఒడిలో ఉంచులొని ఆడించుచున్నది . ఆ శిశువుది ఏమి తేజస్సు ? సాక్షాత్తూ అగ్నిదేవుని వలె ప్రకాశించుచున్నాడు. అదిగో , పుట్టిన వెంటనే సర్వ క్షత్రియుల వినాశనము కొరకు యజ్ఞము చేయుదు ననుచున్నాడు. .. అతనిపితృ దేవతలు వచ్చి , " వలదు , ఇది మరియొకని కార్యము " అనుచున్నారు. అంతలోపల అక్కడికి వచ్చిన క్షత్రియులు అతని తేజస్సు చూచి కంటి చూపు పోగొట్టుకొని , అంధులగుచున్నారు .  ఆ భృగు పితరులు ఆ బాలకుని సమాధాన పరచి , అతని కోపమును సముద్రములోకి పడవైచుచున్నారు . అక్కడ కూడా అది ప్రజ్వలిస్తూ , సముద్రమునే స్వాహా చేయుచున్నది . కౌశికా , నువ్వు కూడా ఇటులనే కాల ప్రచోదితుడవై విద్వేషమును సాధిస్తున్నావు . నాదొక మాట గుర్తుంచుకో . నీ ద్వేషము నిన్నే తినివేసి ,నువ్వు బలియైననూ , నువ్వు  బ్రతికియుండ గల ఆలోచన చెయ్యి . " 

’ అది యెట్లు వామదేవా ? " 

     " నువ్వు వశిష్ఠుని ద్వేషించు . కానీ తిరస్కరించకు. ద్వేషముతో పాటు వచ్చు తిరస్కారమును తరిమి వేసి , ద్వేషమును మాత్రము ఉంచుకో . బతక గలవు  " . ఇంకొంతసేపు ఇద్దరూ ఆ బండ పైననే కూర్చున్నారు . ఎవరూ మాట్లాడలేదు . వామదేవుడు ఆర్ధ నిమీలిత నేత్రుడై  ,  ముందరి భవిష్యత్తును చూచుటను కౌశికుడు తలస్తూ , "అతడు భవిష్యత్తునెట్లు చూచెను ? నా భవిష్యత్తును కూడా చూచెనా ?  యనుచూ ఏమేమో చింతించుచుండెను . వామదేవుడు కూడా , తాను చూచిన భవిష్యత్తు యొక్క అర్థమునెరిగి ,  ప్రకృతికి ఈ భయంకర రుద్రలీలయందు అదేమి సంతోషమో యని ఒకసారి , సంహారము లేని సృష్ఠి ఎక్కడుండును యని ఇంకొకసారి  .. ఇటులనే భావ తరంగముల యందు ఆడుతున్నాడు. 

     కౌశికుడు  కొంతసేపు అయిన తరువాత ," ఆర్యా , నా భవిష్యత్తు ఏమిటి ? " యనెను . 

     వామదేవునికి నవ్వు వచ్చెను . నవ్వి , " అది తెలిసినదే . నువ్వు అస్త్రాలను సంపాదించి , వశిష్ఠుని పై పడెదవు . నువ్వు బలవంతుడవైన , అతను భ్రంశము చెందును . అతని బలము హెచ్చయిన , నువ్వు మరల దెబ్బతిని వచ్చి  , ఏదో ఒక మూల ముక్కు పట్టుకుని కూర్చొనెదవు . " 

" ఇక వేరే తరుణోపాయము లేదా ? " 

     " లేదు . తపస్సు ఒకటే యున్నది . తపస్సు వలన ఏమి కావలెనన్ననూ సాధించవచ్చును అనునది మనసున ఒకసారి నాటుకున్న , మనిషి మనసు మిగిలిన వాటిని పారద్రోలును . అతనికి తృప్తియగునది ఆ ఒక్కదాని వల్లనే . ఆ తపస్సు నీ తపస్సు వలె రాజసమగునో , సాత్త్వికమగునో.... అదిమాత్రము  ,  ప్రారబ్ధము ననుసరించియుండును. " 

      కౌశికుడు ఇంకనూ అడగవలెనని అనుకొనునంతలో , వామ దేవుడు , " ముందరి మాటలు తరువాత , ఇది తామస వేళ . ఇప్పుడు తపస్వులు బహిర్ముఖులై యుండరాదు " అని లేచి వెళ్ళిపోయెను . 

     కౌశికుడు " ఆ దినము వశిష్ఠులూ అదే మాట పలికిరి . నేను దానిని లెక్క చేయలేదు . ఇప్పుడు ఇతడు కూడా , కాల వశము వలననే నేను ద్వేషము పెంచుకున్నాననెను . అట్లయిన , మానవుడు కాలము ఆడించునట్లు ఆడు కీలు బొమ్మ నా ? వానికి స్వాతంత్ర్యము లేదా ? నేను స్వతంత్రుడను అనుకొనునది , కేవలము ఔపచారికము మాత్రమేనా ? " అనుకొనుచూ , తన ఆశ్రమము వైపు బయలు దేరెను. (సశేషం)

కన్నడ మూలం : దేవుడు నరసింహ శాస్త్రి

తెలుగు సేత : విభాత మిత్రతెలుగు సేత : విభాత మిత్ర

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ