పాశురం
తిరుప్పావై ఏడవ పాశురము
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
తిరుప్పావై 7వ పాశురము
ॐॐॐॐॐॐॐॐॐ
కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!
కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై
వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్
ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్!!
భావం:-
~~~
భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుఝామున కలిసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా !ఓ పిచ్చిదానా ! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులుగల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు, వారిచేతుల కంకణ ధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి, విజ్రుంభించి, ఆకాశామంటుచున్నవి. ఆధ్వనిని వినలేదా ? ఓ నాయకులారా ! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువ వలయును.
అవతారిక:-
~~~~
భగవదనుభవము నిత్యనూతనమై మొహపరచుచుండును. పక్షులు తెల్లవారుఝామున మేల్కొంటున్నాయి. ఈనాటి పాశురంలో గోదాదేవి భరద్వాజ పక్షులద్వార, అవిచేసే మధురధ్వనులు ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్రవిషయాలు తెలుసుకోవలసిందేకదా ! వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవీ ఆటంకాలు కావు అని, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతము చేయుటకు రండి అని పిలుస్తోంది.
తాత్పర్యం
~~~
ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భాగవద్విషయానుభవము నెరిగినదానవు.
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.
అవతారిక
వ్రతాలూ, నియమాలూ అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుఝామున మేల్కొని మాటాడుకొంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానులవలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్ధాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు.
అంటే భగవంతుని ఆరాధించే సమయమాసన్నమైనదని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుఝామున మేల్కొంటున్నాయంటే మరి మానవమాత్రులం ఎప్పుడు మనం మేల్కాంచాలో తెలుసనుకోవలెననే సంకేతం ఇందులోని ధ్వని.
ఈనాటి పాశురంలో గోదాతల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనులద్వారా ప్రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందేగదా! వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావనీ, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది యీ పాశురంలో...
(చక్రవాక రాగము - ఆదితాళము)
ప. తేజోముఖీ! తలుపు తీయుమా!
ఈ జాము నిడురేల! ఇక మేలుకొనవేల?
అ..ప.. ఆ జంటలౌ పక్షి కలకలము వినలేద?
ఏ జంకు లేని నీవెటు నిదురవోతువో?
1 చ. పరిమళించు కుంతలాల పడుచులు - ఆ
భరణములు రవళింప చేతులని సాచి
పెరుగు కవ్వమున చిలికెడు ధ్వనులను వెర్రిదాన! నీవేమి వినలేద?
వినలేద?
2 చ. నాయిక! శ్రీమన్నారాయణుడే
ఈయిల కేశవుడై ప్రభవించగ
మాయిలవేల్పుగ స్తుతియించు చున్నాము
లే! యిక! వినుచు మొద్దునిద్దురపోదువె?
భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము
ఆండాళ్ తిరువడిగలే శరణం
"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో" పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు,
"ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి "ఆనైచ్చాత్తన్" భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.
ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు.
భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిస్సు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు.
మాళ్ళీ వేద అద్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయిస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ.
భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది.
గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.
"కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు" గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి, "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. "మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేడా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు.
"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.
కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.
అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది.
"తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.
తిరుప్పావై 7వ పాశురము/పద్య రూపక అనువాద
ॐॐॐॐॐॐॐॐॐ
సీసమాలిక:
పవళింపు వీడుము పక్షుల కిలకిల
మనుచు పలుకుచుండె తనివి తీర
ఘల్లుఘల్లు మనెడు కాసుల
పేర్లను
కంఠమాలను దాల్చి కాంచు మనుచు
గొల్లల యిల్లాండ్రు కోలలు చేదాల్చి
పెల్లు మనెడు పూ జల్లుచేత
నారాయణ యని కైవారముతో మేము
ఆలపించిన స్వామి పలుకలేడు
గోపబాలల మమ్మ గోవిందు సేవింప
తరలి నారము వచ్చి తలుపు తెరువు
ఆ.వె. అనుచు పిలిచి వారు మనవిని వినుమని
ఏక చిత్తులగుచు వేడుకొనిరి
స్వామి సేవయందు సర్వంబు నర్పించి
నోము నోతు మమ్మ సేమముగను
శ్రద్ద భక్తి నిచ్చి బుద్ధిని యొసగుచు
శ్రీధరుని మనమున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
: తిరుప్పావై 8వ పాశురం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
8 వ పాశురం
ॐॐॐॐॐॐॐॐॐ
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.
~~~~
భావం:-
~~~~
తూర్పుదిక్కు తెల్లవారుతున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరును కూడా వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి, వెళ్ళుటవలన వారికి ప్రయోజనమని వెడుతున్నారు. అలా వెళుతున్నవారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీవాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదనా - ఓపడతీ ! లేచిరమ్ము ! కృష్ణ గుణములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించి వ్రతసాధనమగు పరను పొంది, కేశి అను రాక్షసుని చీల్చి చంపినవానిని, మల్లురను మట్టుపెట్టిన వానిని, దేవతలకు ఆదిదేవుడైన వానిని మనము వెళ్ళి సేవించినచో అయ్యో ! మీరే నావద్దకు వచ్చితిరే ! అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.
~~~~~
అవతారిక:-
~~~~~
ఈనాటి గోపిక కృష్ణపరమాత్మకు కూడా కుతూహలము రేకెత్తించు విలాసవతి. పరిపూర్ణముగ స్త్రీత్వముగల ప్రౌఢ, కృష్ణుడే తనవద్దకు వచ్చునని ధైర్యముతో పడుకొన్నది. అట్టి ఆమె లేనిదే తాము కృష్ణుని వద్దకు వెళ్ళుట యోగ్యముకాదని భావించి, ఆమెను మేలుకొలుపు తున్నారు.
తాత్పర్యం
~~~~~
తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
అవతారిక
~~~~
క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.
(మలయమారుత రాగము - ఆదితాళము)
ప. తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
తీరుగ మహిషములు మేతకై! తరలె!
తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
అ..ప. పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు
తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ
తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
చ.. కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన
కేశవుడౌ సర్వేశుని జేరి
ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతింయింప-లో
కేశుడౌ తాను కాపాడడే మనల
తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
తీరుగ మహిషములు మేతకై తరలె!
నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు
ఆండాళ్ తిరువడిగలే శరణం
ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం.
నీటివాలుకు మనం తెర చాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగం వేగం గా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అదీ కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పోదాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. "అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే" మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని.
మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పోందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్న
ాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు.
మరి ఎం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు.
జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది భహుషా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట భయలుదేరింది.
మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చేయ్యాలో చెప్పు అని అడిగింది. "ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ" అంటూ ఉపదేషం చేసాడు. హే మైత్రేయీ "ఆత్మావారే ద్రష్టవ్యః " లోపల ఉండే ఆత్మా అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె.
కానీ ఎట్లా కనిపిస్తుంది ? ద్రష్టవ్యః - చూడాలి అనుకున్న దాన్ని మొదట "శ్రోతవ్యః" వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. అండాళ్ తల్లి చెప్పేది ఎదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు.
ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత.
మొదట పక్షులు అరిస్తున్నాయి అని చెప్పింది, ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది - ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక, ఆలయ పిలుపు శఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వని ని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే ముణులు స్మరించువాడు అని తెపిపింది, వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా ముణుల వద్ద ఉపదేషం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం "ద్రష్టవ్యః" అప్పుడు స్పష్టంగా చూడగలం.
"కీళ్" తూర్పు దిక్కున "వానమ్" ఆకాశం "వెళ్ళెన్ఱ్" తెల్లవారిందని అనుకుని "ఎరు మై" గేదెలన్ని కూడా "శిఱు వీడు మెయ్యాన్" చిన్న మేత మేయడానికి "పరందన కాణ్" పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. సాదారణంగా గేదెలను తామసిక గుణం తో పోలుస్తారు, తెలవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం భాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు- "రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే" మనలోపలుండే సర్వ రసుడు, సర్వ గంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు.
"మిక్కుళ్ళ పిళ్ళైగళుం" మిగతా పిల్లలందరూ "పోవాన్ పోగిన్ఱారై" త్వరత్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే "ప్పోగామల్ కాత్తు" వాళ్ళను ఆపి, "ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం" నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే, "కోదుగలం ఉడైయ పాపాయ్!" శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కల్గించే గోపికవి కదా నివ్వు.
భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా "ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియః" జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకూ జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మావెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. "ఎళుందిరాయ్" లేవమ్మా అందరం కలిసి వెళ్దాం. ఇక్కడకు వెళ్ళి "పాడి ప్పఱై కొండు" మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం.
"మావాయ్ పిళందానై" గుఱ్ఱం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేసాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది.
యముడు నచికేతుడికి చెబుతాడు "ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లెంతో బుద్ది అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేసాడు.
"మల్లరై మాట్టియ" మథురా నగరిలో మల్ల యోదులైన చాణూరుడు ముష్టికుడులను ఖంసుడు శ్రీకృష్ణ బలరాములని సంహరించడానికి ఎర్పాటుచేసాడు. వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు, కృష్ణ బలరాములు వారి మద్యకి వెళ్ళి, ఇరువురు వారిని వారే సంహరించుకొనేట్లు చేసారు.
మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోదాలు ఈ మల్ల యోదులవంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరణైరేవ కన్యతే- దేనితోనైతె నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి.
అగ్నికి కావల్సింది ఇందనం, ఇందనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణ వద అనంతరం, హే రావణా ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు, నిన్నా వీరు అణిచివేసింది, నీలోని కామ క్రోదాలను పైకి లేపుకున్నావు వాటితోనే నిన్ను నేవే చంపుకున్నావు! అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడివైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించివేస్తాడు.
"దేవాది దేవనై" ఆయన దేవాది దేవుడు, మనల్ని ఆయన ఎప్పుడు వదలడు. ఇన్నాళ్ళూ మనం నీవాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్క సారి అను. ఏమని "చ్చెన్ఱు నాం శేవిత్తాల్" ఒక్క సారి మనం చేరి తండ్రీ మేము నీవారవని తెలిపితే చాలు.
"ఆవా ఎన్ఱ్ ఆరాయ్ అంద్ అరుళ్" మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణం లోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు, అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొర పెట్టుకున్నారు.
రాముడు నేను అయోద్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని, తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గు పడ్డాడు. ఇదీ పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మనకోసం తపిస్తాడు. తిరుమరిసై ఆళ్వార్,ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు, ఆయన కాంచీ పురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు.
ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయనదేవున్ని పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు అని అన్నాడు, దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారూ బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడం తో, రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చాడట.
ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. యదోక్తకారి- ఎలా చెపితే అలా వినే పెరుమాళ్ అని అర్థం ఇది కాంచి పురంలో ఒక ఆలయం.
అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.
తిరుప్పావై 8వ పాశురం అనువాద పద్యం
కీశువానమ్
సీ. గోపమ్మ పిలుపుతో కూడిరి చెలులంత
గోపాలుని సేవ కోరు కొనుచు
చాలు మీ నిద్రలు చాలంచు లేపును
పూను కొనుము నోము స్నానమాడి
తెల్లవారెను తూర్పు నల్లదే చూడుము
భానుని కిరణాలు పరుచు కునెను
పచ్చిక మేతకై పశువుల మందలు
మంచుతో కలిసిన తడిసిన మధువు గ్రోలి
గీ. అన్య రూపుడౌ రాక్షసునంతు చూసి
క్రూర చాణూర మల్లుల బీరమణచి
కూర్మితో దేవదేవుడు కోరినట్టు
వరము తీర్చును మా స్వామి కరుణ కలిగి
శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధినిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరముకమ్ము!!
******
: తిరుప్పావై 9వ పాశురం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
9వ పాశురం
ॐॐॐॐॐॐॐॐॐ
తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో
ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
"మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు
నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!
భావం
ॐॐॐॐॐॐ
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మింపబడిన మేడలో సుఖశయ్యపై చుట్టును దీపములు వెలుగుచుండగా అగరుధూపము ఘుమఘుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపు గడియతీయుము. ఓఅత్తా ! నీవైనను ఆమెను లేపుము. నీకుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక జాడ్యము కలదా ? లేక ఎవరైనా కదలిన ఒప్పమని కావలియున్నారా ? లేక గాఢనిద్రపట్టునట్లు మంత్రించినారా ? మహామాయావీ ! మాధవా ! వైకుంఠవాసా ! అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 'ఓ ఆశ్చర్య గుణ చేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమ పదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.
అవతారిక
ॐॐॐॐॐॐॐ
మొదటి రెండు పాశురములలొ శ్రవణము చెప్పబడింది. తర్వాతి పాశురములో మననము నిరూపింపబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలొ ధ్యానదశ వివరింపబడినది. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగినవారికే తాను లభించే హక్కు కలదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి మనకు స్వాతంత్ర్యం ఎందుకు ? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి, మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎక్కడికి వెళ్ళక ఉన్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే
ధ్యానములో పరాకాష్టపొంది
నిద్రిస్తున్న నాల్గవ గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.
'తూరుపుతెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటివరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది. ఇక (9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనేకద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.
(కాంభోజి రాగము - ఆదితాళము)
1. ప.. ఓ మామకూతుర! మరదలా!
అ..ప.. ఏమిది? మణిమయ ద్వారము తెరువవు?
ఓ మామ కూతుర! మరదలా!
చ.. పావన మణిమయ భావనమందున
దివ్వెల వెలుగులు ధూపములమరగ
దివ్యమౌ తల్పమున దిటవుగ శయనించి
అవ్యక్తమైన నిద్దురపోదువటవే!
2 చ. మూగద? చెవిటిద? మిగుల నలసినద?
ఆగడప కావలి నందుంచబడినద ?
ఆ గాఢ నిద్రకు మంత్రించబడినద?
వేగమె లేపవె! నీ కూతునత్తరో!
3 చ. లీలామానుష మాధువుడీతడు
కేళీలోలుడు వైకుంఠవాసుడు
చెలియలగూడి తిరునామ కీర్తనము
ఇలవెలియగ పలుమారు పాడితిమి
ఓ మామ కూతురా మరదలా!
భగవంతునికి మనకు ఉన్న సంబంధం
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. "తూ" పరిశుద్దమైన "మణి" మణులతో చేసిన "మాడత్తు" మేడ, "చ్చుత్తుం విళక్కెరియ" చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక, దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణాలు.
అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అణుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. "దూపం కమళ" దూపం పరిమళిస్తుంది. "త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్" నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా.
"మామాన్ మగళే!" ఓ మామగారి కూతురా! "మణి క్కదవం తాళ్ తిఱవాయ్" మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిద అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆధిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.
1. మనందరిని తండ్రి ఆయనే.
2. మనందరిని రక్షించేవాడు ఆయనే.
3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు.
4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు.
5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు.
6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే.
7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు.
8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు.
9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే లోకంలో మనం ఎదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! "పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా" అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది.
భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ దూప పరిమళాల వంటిది.
అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాల్ల స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు, దీన్ని పోశించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలేయ్యాలి అని ఇలా దేహ బ్రాంతి పెరిగిపోతుంది, ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్శనమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరువాల్సిందే.
"మామీర్!" ఓమెనత్తా, "అవళై ఎళుప్పీరో" మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు.
"ఉన్ మగళ్ తాన్ ఊమైయో" నీపిల్ల ఏమైనా మూగదా లేక "అన్ఱి చ్చెవిడో" చెవిటిదా లేక "అనందలో" అలసిపోయిందా "ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో" ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడిని నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగివాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.
ఆయితే లోపలగోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది.
"మామాయన్" చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్శించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు.
ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు అయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, "మాదవన్" మా-లక్ష్మీదేవి దవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన "వైకుందన్" వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా "ఎన్ఱెన్ఱు" ఎన్నెన్నో "నామం పలవుం నవిన్ఱ్" నామాలను పలుకుతున్నాం.
ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'
తిరుప్పావై 9వ రోజు
తూమణి మాడత్తు
తెలుగు పద్యానువాదము
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
సీ.మణి కవాటము తీసి మనవిని వినుమని
మామ సుతను పిల్చె మధురముగను
పరిమళ దివ్వెల పరచిన వెలుగులు
కనులందు మిరిమిట్ల కాంతి నిండె
మూగయా? చెవిటియా?ముద్దుల కూతురు
కావలిగా యుండి కదల నీద?
గాఢ నిద్రను పోవు గట్టి మంత్రము వేసి
బంధనమున నిన్ను బడయ వేసి
తే.గీ. మాధవా!మధుసూధనా! మగత నిద్ర
వీడు మని నీ కుమార్తెను వేడుచుంటి
వ్రతము చేసెడు మగువలు వచ్చినారు
ద్వారము తెరచి మాకింక దారి నిమ్ము
శ్రద్ధ భక్తుల నందించి బుద్ధి నిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
--(())--
Comments
Post a Comment