శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

207వ నామ మంత్రము 11.01.2021

ఓం మనోన్మన్యై నమః

ఉన్మని (మనస్సును హృదయమునందు నిలిపి ధ్యానించు) స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపం తానే అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మనోన్మనీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మనోన్మన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణచే ఆధ్యాత్మికజ్ఞాన సంపదలను సంప్రాప్తింపజేసుకొని, ఆ పరమేశ్వరి పాదసేవలో తరించును.

మనోన్మనీ ఇది స్త్రీలింగ శబ్దము. మనోన్మనః - పుంలింగ శబ్దము - ఈ రెండు శివశక్తుల నామములే. ఈ శబ్దములు ఉపాధిగా చూస్తున్నాము  తప్ప శక్తి మాత్రం అమ్మవారే. మనోన్మనీ అను ఈ నామము  పరమేశ్వరునియొక్క పదిశక్తులు అని తెలుసుకోవాలి. అది రుద్రసూక్తంలో ఈ ప్రసక్తి వస్తుంది. 

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః  శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః  కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయనమో  బలప్రమథ నాయ నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః|


వామదేవాయ, జ్యేష్ఠాయ, శ్రేష్ఠాయ, రుద్రాయ, కాలాయ, కలవికరణాయ, బలవికరణాయ, బలాయ, బలప్రమథనాయ, సర్వభుతదమనాయ, మనోన్మ అను ఈ శివునియొక్క పదిశక్తులు అమ్మవారే. గనుక ఈ పదింటినీ స్త్రీలింగ శబ్దములు చేస్తే...


వామా, జ్యేష్ఠా, శ్రేష్ఠా,రౌద్రీ, కాలా (కాళీ), కలవికరిణీ, బలవికరణీ, బలా, బలప్రమథనీ, సర్వభూతదమనీ, మనోన్మనీ.


ఈ పది శక్తులలోనే (పైన చెప్పిన మంత్రంలోనే) సృష్టి, స్థితి, లయకార్యములు ఇమిడి ఉన్నాయి. అవి ఎలాగో గమనిద్దాము.


1. సృష్టి

వామా - వమనత్వం - వెలిగ్రక్కుట అనగా తనలో ఉన్న సృష్టిని వెలికితీయుటచే వామా

2. స్థితి

జ్యేష్ఠా - తను సృష్టించిన ఈ సృష్టికే ప్రథమం గనుక జ్యేష్ఠా.

శ్రేష్ఠా - తను ప్రథమం మాత్రమేగాక శ్రేష్ఠము అగుటచే శ్రేష్ఠా

రౌద్రీ ఈ జగత్తునంతటినీ తన రౌద్రీ శక్తిచే నియంత్రించుటచే రౌద్రీ

కాలా జగత్తునంతటినీ కాలస్వరూపంగాగమనించుటచే కాలా

కలవికరణీ కాలాన్ని జగత్తులో ఒక్కొక్క జీవికి ఒక్కొక్కవిధంగా వెదజల్లడము లేదా పంచడము గనుక కలవికరణీ.

బలవికరణీ సృష్టిలో ఒక్కొక్క వస్తువుకు (ఉపాధికి) ఒక్కొక్క విధంగా ఇచ్చుటచే బలవికరణీ.

బలా ఇన్ని బలములు ఇచ్చిన శక్తిగనుక బలా

బలప్రమథనీ తను ఇచ్చిన బలాన్ని చూసుకొని, విర్రవీగుతూ, ఆ బలాన్నిదుర్వినియోగంచేస్తే ఆ బలాన్ని మథించుట (బలముచే వచ్చు విరగబాటును నిర్మూలించుట) చే బలప్రమథనీ

3. లయం

సర్వభూతదమనీ  కల్పాంతంలో సృష్టినంతటినీ తనలో లయంచేసికొనుటచే సర్వభూతదమనీ

ఈ విధంగా పైమంత్రంలోని పరమేశ్వరుని పదిశక్తులను నిర్వహించునదే మనోన్మనీ అను  నామము కలిగిన జగన్మాత.  గనుక మంత్రం చివరలో మనోన్మనః అని చెప్పబడినది.

ధ్యానధ్యాతృధ్యేయభావో యథా తశ్యతి నిర్భరం తదోన్మనత్త్వం భవతి జ్ఞానామృతనిషేవణా

ధ్యానము, ధ్యేయము (ధ్యానింపదగిన భగవత్స్వరూపము), ధ్యాత అనునది త్రిపుటి. అలాగే  జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయ (తెలుసుకొనేవాడు, తెలియబడేది, తెలసికొనుట) ఈ త్రిపుటి యనునది ప్రతీ ఉపాధిలోనూ ఉంటుంది. ఈ (మూడింటి) త్రిపుటిలో జ్ఞాత, జ్ఞేయ అనునవి జ్ఞానములో లీనమైతే (ఏకత్వమైతే) కలిగే ఆనందమే త్రిపురసుందరి. ఈ త్రిపుటి నశించుటయే త్రిపురాసుర సంహారము .ఈ త్రిపుటిలో వ్యాపించినది ఒక్కటే (జ్ఞానమే) అని  తెలిసికొనేదే త్రివిక్రమ ఏ స్థితికి చేరాక ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడూ ఒక్కటైపోతాయో దానినే ఏకత్వము దీనినే జీవబ్రహ్మైక్యము అందురు. ఈ స్థితిలో జ్ఞానామృతమును సేవించుట వలన ఉపాసకునికి ఉన్మనీత్వస్థితి కలుగును. దీనినే మనస్సును ఉత్కృష్టజ్ఞానముతో గూడిన వానినిగా చేయుచున్నది గనుక మనోన్మని యని అనబడినది. ఇటువంటి స్థితిలో ఉండే జగన్మాత మనోన్మనీ అనబడినది.

ఈ మనోన్మనీ స్థితిలో అమ్మవారు ఉంటుంది. అలాగే సాధకుడు ఈ స్థితికి చేరితే ఎలా ఉండడం జరుగుతుంది అంటే...

యోగాభ్యాసంలో ఉన్మన గురుంచి

నేత్రే య యోన్మేషనిమేషయుక్తే

వాయుర్యయా వర్జితరేచపూరః|

మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం

మనోన్మనీ సా మయి సన్నిధత్తాం॥

ఉన్మనస్థితిలో కంటికి ఉన్మేషనిమేషములు (రెప్పపాటీలేకుండా) కళ్ళు తెరచియుండే ఉండిపోతాయి. ప్రపంచం చూస్తున్నట్లు అనిపిస్తుంది. కాని ఆ స్థితి అంతర్లక్ష్యం బహిర్దృష్టి అన్నట్లుంటుంది. ప్రాణాయామమందు రేచకము, పూరకములేక కుంభకస్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ స్థితి సాధకునికి ఊహమాత్రమే.  కాని సిద్ధునికి అనుభవముగా ఉంటుంది.   మనస్సుకు సంకల్పవికల్పములు ఉండవు. అటువంటి స్థితిని సాధకుడు కోరుకుంటాడు అని భావము.

మన ఉన్మని స్థితి అనగా సాధకుడు పొందిన అత్యంత ఉత్కృష్టస్దితినే మనోన్మని అంటారు. 

 ఆజ్ఞాచక్రమునకు, సహస్రారమునకు నడుమ కొన్ని శక్తులు లేదా సూక్ష్మచక్రములు ఉన్నవి. ఆ శక్తులే పైన చెప్పిన వామదేవాయ నమో.....మనోన్మహః లో చెప్పిన శక్తులు.  ఆజ్ఞాచక్రం నుండి పైకివెళుతున్నకొలదీ సాధకుని ఆనందానుభూతి వర్ణనాతీతము.  అలా పైకి ఈ సూక్ష్మచక్రములను దాటి వెళ్ళగా సహస్రారంలో బిందువు క్రింద ఉన్న స్థానంలో ఉన్నదే మనోన్మనీ.  ఆ స్థితి దాటితే పరమాత్మసన్నిధియే సాధకునికి లభించునది. ఆ స్థితికి చేరితే సంకల్పవికల్ప శూన్యమై, శివశక్తి సమ్మిళితమై, అహోరాత్ర భేదరహితమై, చంద్రమండలమునకు చేరిన స్థితి, భ్రూమధ్యము నుండి ఎనిమిదవ స్థానమువద్ద ఉన్నదే ఉన్మని అదే మనోన్మని. ఆ పై స్థానమే బిందువు. మూలాధారంలో కుండలినీ శక్తిని జాగృతంచేసి, ఊర్ధ్వ ముఖంగా ప్రయాణింపజేస్తూ, గ్రంథిత్రయాన్ని భేదింపజేస్తూ, భ్రూమధ్యమునకు చేరినపిదప అక్కడ నుండి సూక్ష్మచక్రముల ద్వారా కుండలినీ శక్తి ప్రయాణిస్తుంది. ఎనిమిదవది అయిన సుమన దాటిన తరువాత ఉండునదే ఉన్మన. అచ్చట మనసు పనిచెయ్యదు. సంకల్పవికల్పా లుండవు.ఇంకేమియు ఉండని స్థితికి చేరడం జరుగుతుంది. ఆ స్థితి దాటిన తరువాత ఉండేది మహాబిందువు మాత్రమే. ఆ స్థితికి చేరిన తరువాత గోచరించేది పరమేశ్వరి మాత్రమే. మనసు కూడా ఆ స్థితిలో పనిచేయక అంత కన్నా అతీతమైన ఉన్మని స్థితికి చేరడం జరుగుతుంది గనుకనే పరమేశ్వరి  మనోన్మని యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మనోన్మన్యై నమః అని యనవలెను.

🌸💐💐💐

 శ్రీమద్భగవద్గీత - 606  / Bhagavad-Gita - 606 🌹


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 23 🌴


23. నియతం సఙ్గరహితమరాగద్వేషత: కృతమ్ |

అఫలప్రేప్సునా కరమ యత్తత్సాత్త్వికముచ్యతే ||


🌷. తాత్పర్యం : 

నియమబద్ధమైనదియు, సంగరహితముగను రాగద్వేషరహితముగను ఒనరింప బడునదియు, ఫలాపేక్ష లేనటువంటిదియు నైన కర్మము సత్త్వగుణము నందున్నట్టిదిగా చెప్పబడును.


🌷. భాష్యము  :

వర్ణాశ్రమధర్మముల దృష్ట్యా శాస్త్రమునందు నిర్దేశింపబడిన నియమబద్ధకర్మలను ఆసక్తిగాని, స్వామిత్వముగాని లేకుండా రాగద్వేష రహితముగా, భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని ప్రీత్యర్థమై స్వభోగవాంఛారహితముగా ఒనరించినపుడు అట్టి కర్మలు సత్త్వగుణ ప్రధానమనబడును.

🌹 🌹 🌹 🌹 🌹

శ్వాసరూపేణ భూతాని సమీరయతి కేశవః ।

చేష్టయత్యత ఏవాసౌ సమీరణ ఇతీర్యతే ॥


సమీరించును - లెస్సగా ప్రేరేపించును. శ్వాసరూపమున తానుండుచు సకలభూతములను తమ తమ వ్యాపరములందు ప్రవర్తిల్ల జేయును. శ్వాసరూపుడై సర్వ ప్రాణులలో చేష్టలను కలిగించు విష్ణువు సమీరణః అని చెప్పబడును.


:: శ్రీమద్భగవద్గీత - మోక్షసన్న్యాస యోగము ::

ఈశ్వరస్సర్వభూతానాం హృదేశేఽర్జున తిష్ఠతి ।

 భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ॥ 61 ॥ 


ఓ అర్జునా! జగన్నియామకుడు, పరమేశ్వరుడు, అంతర్యామి మాయచేత సమస్త ప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు. 


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 🌹 🌹 🌹 🌹

 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 176  / Sri Lalitha Chaitanya Vijnanam  - 176 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |

నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖


🌻 176. 'నిర్వికల్పా' 🌻


వికల్పము లేనిది శ్రీమాత అని అర్థము.


వికల్పమనగా అభిప్రాయము. అభిప్రాయము ఊహాజనితమే. ఉన్నదానిని గూర్చిన అవగాహన. అవగాహన సంస్కారమును బట్టి యుండును. ఉన్న విషయమును ఉన్నట్లుగా చూచుటయే గాని, దానిపై ఏర్పరచును అభిప్రాయము లన్నియూ అసత్యములే అగును. శ్రీరామ పట్టాభిషేక అసంతరము సన్మాన సభలో లక్ష్మణుడు నవ్వెసట. ఆ నవ్వును నలుగురు నాలుగు విధములుగా అర్థము చేసికొనిరి. 


అట్లే, ఒక మాటను, ఒక చేతను, ఒక సన్నివేశమును చూచినపుడు, చూచినవారు తమ తమ సంస్కారమను పొరలనుండి చూతురు గనుక, ఒక్కొక్కరొక్కొక్క విషయమును గమనింతురు. ఉన్న విషయమును మరతురు. రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవి యన్నియూ ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవుట వలన కలుగు భావములు. 


జీవితమంతయు యితరులను గూర్చిన అభిప్రాయములతోనే కడతేరును. తమకున్న అభిప్రాయముల ఆధారముగా ఇతరులతో ప్రవర్తింతురు. అభిప్రాయములు పొగమంచు వంటివి. పొగమంచు యుందు దృష్టి స్పష్టత యుండదు. సంసారజీవులు ఇట్టి వికల్పమను

పొగమంచుయందు జీవించుచుందురు. యథార్థము వారు గమనింప లేరు. యథార్థముల గూర్చిన అభిప్రాయములపై ఆధారపడుదురు. ద్రౌపదీదేవిపై దుర్యోధనునికి కలిగిన అభిప్రాయమే మహాభారత సంగ్రామమునకు దారితీసినది. దురభిమానమునుండి వదినగారి

నవ్వును చూచుటవలన సర్వనాశనమునకు ముఖద్వారము తెరచుకొనెను.


అర్జునుని చూచినప్పుడెల్ల కర్ణుడు అసూయాద్వారమున చూచుట వలన ద్వేషము పటిష్ఠమై నాశనమునకు తోడయ్యెను. అట్లే శకుని పగ, ధృతరాష్ట్రుని మమకారము. అట్లు సంస్కారవశులై సంసార జీవులు ఉన్నది ఉన్నట్లు చూడలేక సృష్టియందు ప్రతిసృష్టి గావించు కొందురు. ఇది మిథ్య. ప్రతి వ్యక్తియూ జగత్తును తన సంస్కారము నుండి చూచును కనుక, అతడు చూచు జగత్తు మిథ్య. జగత్తు మిథ్య యనుట సత్యము కాదు. తను చూచు జగత్తు మిథ్య అనునది సూక్తి

{సత్యము), సృష్టి సత్య స్వరూపమే. దానిని గూర్చిన అభిప్రాయములు అసత్యము. ఇట్టి అసత్యమను భావన లేనిది శ్రీమాత.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీకృష్ణ కర్ణామృతం.

     --  లీలాశుకుల రచన 

   ధనుర్మాసమును పురస్కరించుకుని.

ఆడియో నం.14


🌀👂🍯🎊💖🎊👂🍯🌀

: శ్రీ ఆదిశంకరాచార్య విరచితము శ్రీ శివ మానస పూజా స్తోత్రం!


1) రత్నైః కల్పిత మాసనం హిమజలైః స్నానం ఛ దివ్యామ్బరం నానా రత్న విభూషితం మృగమదా మోదాన్కితం| చందనం జాతీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ, ధూపం తథా  దీపం దేవ! దయానిధే! పశుపతే!హృత్కల్పితం గృహ్యాతాం ||


🌟  ఈశ్వరా ! రత్నములతో కూడిన  అమర్చిన సింహాసనం అమర్చాను, వచ్చి కూచో!  చక్కని, చల్లని నీటితో స్నానం సమర్పిస్తున్నాను,దాన్నీ స్వీకరించు. దివ్యమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను ,దాన్నీ  స్వీకరించు. మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు, కస్తూరి, చందనం ... వీటన్నిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను! జాజి, సంపెంగలతో పాటుగా  నీకు అమిత  ప్రీతిపాత్రమైన మారేడు దళాలను సమర్పిస్తున్నాను ! సువాసన గల అగరు ధూపాలను స్వీకరించు స్వామీ! దీపం కూడా వెలిగించాను. ఇదంతా హృత్కల్పితం, అంటే,  “మనసులో నేను కల్పించుకొన్నది. ” నేను మానస పూజను మాత్రమే  చేయగలను, ప్రత్యక్షంగా పైన చెప్పినవన్నీ సమకూర్చి నీకు పూజచేయలేను!స్వామీ! కరుణా సింధూ!! దయతో నా ఈ పూజని గ్రహింఛి నన్ను కనికరించు!  




 2) సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే, ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం, పయోదధియుతం, రంభాఫలం, పానకం| శాకానామయుతం, జలం, రుచికరం, కర్పూర ఖండోజ్జ్వలం తాంబూలం మనసా మయా విరచితం, భక్త్యా ప్రభో స్వీకురు ||


  🌟 గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అని ప్రత్యక్ష పూజలో అయిదు రకాల ఉపచారా లున్నాయి .అవి కూడా చేసినట్లే భావించు స్వామీ! తదుపరి ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను  ,అదీ స్వీకరించి నన్ను కరుణించు దేవా! మణులు పొదిగిన బంగారు గిన్నెలో  నెయ్యి, పాయసం, పంచభక్ష్యములూ (భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాలు) ఎన్నో కూరలూ , అమర్చాను. పాలు, పెరుగూ, అరటి పండూ, మధ్య మధ్య రుచికరమైన పానకమూ, అన్నిటినీ ఆరగించు స్వామీ! మంచి నీటిని  తాగు. కర్పూరముంచిన తాంబూలాన్ని మనసుతో చేసాను , స్వీకరించు దేవా! (ఇది కూడా హృత్కల్పితమే, మనసులో అనుకుంటున్న పూజే,ప్రత్యక్ష పూజ కాదు)  




3) ఛత్రం చామర యోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |  సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 


🌟 భుక్తాయాసంగా ఉందేమో, భోజనానంతరం కాసేపు విశ్రాంతిని తీసుకో స్వామీ! ఎండ తగలకుండా ఛత్రం(గొడుగు) పడతాను! మధ్య మధ్య చామరం(విసనకర్ర లాంటిది,చెమట పోయకుండా --గాలి వీయటానికి వాడుతారు)  వీస్తాను, లీలా విహారంలో అందం చెడకుండా అద్దం కూడా చూసుకోవటానికి అమర్చాను! నీ మనసును రంజింప చేయటానికి వీణావాదన వినిపిస్తున్నాను!దానికి ధీటుగా భేరీ నినాదాలూ, మృదంగ తాళాలు , గానమూ నాట్యమూ నీ కోసమే అమర్చాను! నిజానికి ఈ కళలన్నిటికీ నీవే అధిపతివి!నీవి నీకే సమర్పిస్తున్నాను!! అన్ని కళారూపాలు నీకు సర్వ సమర్పణం చేస్తూ నాకు తెలిసిన కళారూపాలతో చేసే ఈశ్వరార్చన ఇదే! సాష్టాంగదండప్రణామం చేస్తున్నాను మనసులో. (ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!) 




 4) ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోప భోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ||


  🌟నేను నీకు బాహ్యపూజలు చేయలేని అజ్ఞానిని,పేదవాడిని . నీవే నా ఆత్మ!  నా బుద్ధి పార్వతీ దేవి! నా విషయ వాంఛలు,  నా అనుభూతులూ నీకు ప్రేమతో చేసే పూజలనుకో!నేను ఆదమరచి నిదురించినప్పుడు కూడా, నీ ధ్యాన నిష్టలో సమాధి స్థితిలోనే ఉన్నాననుకో !నా వృధా పరుగులాటలు,  నీకు చేసే  ప్రదక్షిణలుగా, నా పిచ్చిప్రేలాపనలు నీ స్తోత్రరత్నాలుగా,  నా కర్మఫలితాలన్నీ నీ సేవగా  భావించి  నన్ను కృతార్ధుడిని చేయి స్వామీ!(ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!) 




 5) కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |విహితమవిహితం వా సర్వమేతత్- క్షమస్వజయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||   


🌟సముద్రంలో నీరు ఎలా అనంతమో అలాగే నీ కరుణ కూడా అంతే ! సముద్రం పదే పదే అలలతో ఎలా నన్ను తాకుతుంటుందో , అదే విధంగా నీ కరుణ కూడా నన్ను నిత్యం స్పర్శిస్తూనే ఉంటుంది. నా కరచరణాదికములతో, వాక్కుతో, దృక్ శ్రవణేంద్రియములతో, మనస్సులో, తెలిసీ తెలియక చేసిన మహాపరాధాలనన్నింటినీ, పెద్ద మనసుతో క్షమించమని కరుణాసముద్రుడవైన నిన్ను వేడుకుంటున్నాను.(ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!)


*బలమే జీవితం, దౌర్బల్యమే మరణం. బలమే ఆనందం, శాశ్వతం, అమృత జీవితం. దౌర్బల్యం నిరంతర యాతన, దుఃఖం. దౌర్బల్యమే మృత్యువు. ఇది తిరుగులేని నిజం.*

*‍😥నీ దు:ఖానికి కారణము ఎవరు?🧘‍♂️*


*ఈ లోకములో ప్రతి మానవుడు – అతడు తెలివి గలవాడైన – తెలివి తక్కువవాడైన , ఉన్న వాడైన – లేనివాడిన , చదువుకున్న వాడైన – అక్షర జ్ఞానము లేనివాడైన , చిన్న వాడైన –పెద్దవాడైన , స్త్రీ యైన – పురుషుడైన ఎవరైనా సరే హాయిగా , ఆనందంగా ఉండాలని , సుఖంగా జీవించాలని : ఏ కష్టాలు , బాధలు ,భయాలు ,దు:ఖాలు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ బ్రతుకాలని కోరుకుంటాడు – అలా కోరుకోవడమే కాదు అలా ఆనందంగా జీవించటానికి బుద్ధితో జాగ్రత్తగా ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు – అనేకమైన కర్మలు చేస్తుంటాడు , వ్యాపారము చేస్తాడు , ఉద్యోగము చేస్తాడు , ఎదో వృత్తిని చేపడుతాడు, లేదా రాజకీయాలలో దిగి ఉన్నత పదవులు సంపాదిస్తాడు – అందు కొరకు నిజాయితిగా కష్టపడి పనిచేస్తాడు , లేదా అక్రమ మార్గాలలో సంపాదిస్తాడు –అనేక వస్తువులను సంపాదిస్తాడు , ధనాన్ని సంపాదిస్తాడు ,ఇళ్ళు కడతాడు ,తోటలు పెంచుతాడు , స్విస్ బ్యాంకులలో ధనాన్ని నింపుతాడు – ఎలాగో ఒకలాగా ఆనందాన్ని పొందాలని ప్రయత్ని స్తుంటాడు*

   *అనేక సందర్బాలలో ఆనందము వచ్చినట్టే వస్తుంది – ఆ తర్వాత వస్తువు పోవటము వల్లనో , పదవులు పోవటము వల్లనో , శత్రువుల వల్లనో , లేదా తనలోని కోరికల స్వబావము మారటము వల్లనో ఈ వచ్చిన ఆనందము వచ్చినట్టే వచ్చి ఆవిరై పోతుంది – మళ్ళీ మనసులో అసంత్రుప్తి – దానిని పోగొట్టు కోవటానికి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభము – మళ్ళీ వాటివల్ల ఆనందము వస్తుంది – కాని అదీ తాత్కాలికమే – మళ్ళీ అసంతృప్తి కొందరికి ఎన్ని సంపదలున్నా ఎంత ధనమున్నా చాలదు – ఇంకా ఇంకా కావాలి – అసంతృప్తి – ఇక కొందరికి తమకు లేదని గాక , ఎదుటివాడికి ఉన్నదే అని భాద , అసూయ- కొందరికి ఉన్నవి చేజారి పోతాయేమోననే   భయము – ఏక్షణము ఎమౌతుందోననే భయము – ఈ శోకం , భయము ప్రతి మానవుడిని వెంటాడుతూనే ఉంటాయి.*

*– “ శోకస్తాన సహస్రాణి – భయస్తాన శతానిచ “ వేలకొద్ది శోకాలు , వందలకొద్దీ భయాలు , ఈ శోకాలు భయాలు మధ్య ఇంకా ఆనందము ఎక్కడ ? ఒక వేల వున్నా ఎంత కాలము ఉంటుంది ? ఒక వేళ అన్నీ బాగున్నా క్రమక్రమంగా ఈ దేహములో మార్పులు చోటు చేసుకుంటున్నాయి – ఇంద్రియాలు క్రమంగా పని చేయటము లేదు – వృద్ధాప్యము మీద పడుతున్నది – రోగాలు రాగాలు తీస్తూ వచ్చి కూర్చుంటున్నాయి – చివరికి ఏదో ఒక రోజు ఈ దేహము రాలిపోవాల్సిందే.*

 *మళ్ళీ మరోజన్మ – ఆ జన్మలో మళ్ళీ ఆనంధము కోసము పరుగులు – ఇంతకు ముందు ఎన్నో జన్మలలో పరుగులు తీశాము – ఈ జన్మలోను తీస్తున్నాము – అయినా సరే మనము కోరుకున్న శాశ్వత ఆనందము లభ్యము కావటము లేదు – మనకు కావలసింది దు:ఖము లేని ఆనందము – శాశ్వతంగా ఉండే ఆనందము – మార్పులు లేని ఆనందము – కానీ మనకు వస్తున్నది తాత్కాలిక ఆనందము –దు:ఖముతో – భయముతో కూడిఉన్న ఆనందము – ఏ మాత్రము పరస్థితులు మారినా జారిపోయే ఆనందము – ఇదికాదు మనము కోరుకుంటున్నది – మరి మనము కోరుకునే ఆనందము మనకు ఎందుకు రావటము లేదు ?*

 *పుట్టిన దగ్గర నుండి చచ్చే దాకా ఎన్ని కర్మలు చేసినా ,ఎన్ని సంపదలు కూడబెట్టినా , ఎందరు వ్యక్తులను తనవారిగా చేసుకున్నా – ఎందుకు ఈ శాశ్వతానందము దక్కడములేదు ? ఈ ప్రపంచములో ఎంతదూరము పరుగెత్తినా పరుగులే తప్పా శాశ్వత ఆనందము లభించుటము లేదేమిటి ? పైగా అనందము కోసమని కర్మలు చేస్తున్న కొద్దీ కర్మ ఫలాలు వాసనలు కూడుకొని అవి మనము మరింత బoధిస్తున్నాయి – జననమరణ చక్రములో పడేస్తున్నాయి – జన్మ – కర్మ వలయములో –సుడిగుండములో త్రిప్పుతున్నాయి. ఎందువల్ల ? ఈ లోకములోని వస్తువులు గాని , విషయాలు గాని , భోగాలు గాని అనిత్యమైనవి – అనిత్యమైన విషయాలు అనిత్యమైన ఆనందాన్నిస్తాయి గాని శాశ్వతానందాన్నివ్వలేవు – మరి ఏమిటి దీనికి పరిష్కారము ? శాశ్వతమైన ఆనందము నీకు కావాలంటే అశాశ్వతమైన , అనిత్యమైన వస్తువుల వెంట , విషయాల వెంట పడరాదు.*

 *శాశ్వతమైన వస్తువేదో తెలుసుకొని అట్టి వస్తువును పొందటానికి ప్రయత్నము చేయాలి –శాశ్వత వస్తువు పరమాత్మ , కనుక ఆ పరమాత్మను తెలుసుకొని ఆయనను ఆశ్రయించాలి – ఆయనకు దగ్గర కావాలి – ఆయనతో ఐక్యము కావాలి , అప్పుడే ఆనందము శాశ్వతానందము – లభించి దానితో దు:ఖాలన్ని మటు మాయము- అయితే పరిమితమైన వస్తువులు పరిమితమైన ఆనందాన్నిస్తాయే గాని శాశ్వతానందాన్ని ఇవ్వలేవని ముందుగా గ్రహించాలి – తర్వాత తాను అనుభవిస్తున్న దు:ఖాల నుండి విడుదల పొందాలంటే తాను సమస్త కర్మ బంధనాల నుండి విడుదల పొంది శాశ్వత పరమాత్మను తెలుసుకొని ఆయనతో ఐక్యమై పోవడం , మోక్షాన్ని పొందటము ఒక్కటే శాశ్వత పరిష్కార మార్గమని గుర్తించాలి అట్టి మోక్ష సాధనకు తీవ్రమైన ప్రయత్నము చేయాలి.*

*>> మోక్షమంటే మరేమీ కాదు నీ సహజ స్థితియే మోక్షము –నీవు పరమాత్మ స్వరూపుడివే – నీవు మోక్ష స్వరూపుడివే –నీవు శాశ్వత ఆనంద స్వరూపుడివే – అయితే ఆ సంగతి నీవు మరిచావు – నీవెవరో నీవు మరచావు నిన్ను నీవు తెలుసు కోకపోవటమే నీ బాధలకు కారణము – కనుక ఇప్పటికైనా నీ కళ్ళు తెరచుకొని నీవెవరో తెలుసుకో – నీ సమస్యలన్నీ తీరిపోతాయి ->> అయితే ఎలా తెలుసు కోవాలి ? ఎవరు చెపుతారు ? బ్రహ్మవిద్యకు, ఆత్మవిద్యకు  సంబంధిoచిన అనుభవ పూర్వకమైన  గురువులు ఉన్నారు   – విద్య తెలుసుకొని ఆచరించి ఆనందాన్ని పొందండి – మీలోని అసంతృప్తిని తొలిగించుకొని శాశ్వత ఆనందమును పొందండి – ఆత్మజ్ఞానము లేకుండా ఎన్ని కర్మలు చేసినా మోక్షము లేదు – ఆత్మజ్ఞానాన్ని సందేశాల ద్వారా – ఆదేశాల ద్వారా తెలుసుకునే వీలులేదు – కేవలము ఉపదేశము ద్వారానే తెలుసు కోవాలి సాధనాకాoక్షులైన మీరు ఆ బ్రహ్మ విద్యను పొందగలరు.

 *భాగవతము*

*శ్రీగురుభ్యోనమః*

*ప్రతి రోజు నిద్ర నుంచి మేల్కొనే టప్పుడు మనము చైతన్యవంతులము అవుతాము. అది మనకు వ్యక్తిగత సూర్యోదయము. చైతన్యము పుట్టే స్థానము మనలోనే ఉన్నది. మనము నిద్రలేచినపుడు మనమున్నామని తెలుస్తుంది. ఆ తెలియపరచేదే అమ్మ. శ్రీసూక్తములో 'కాంసోస్మితాం' అంటే అర్ధము అదే. నిద్రలో ఉన్నప్పుడు ఉన్నాము, కాని ఉన్నామని తెలియదు.*

*ఉన్నానని తెలిసి, మనసేంద్రియ శరీరానికి మాత్రమే నిద్ర కల్పించి మనస్సులో చైతన్యముగా ఉన్నటు వంటి వాళ్ళని యోగులు అంటారు. నిద్రలోనుంచి మెలకువ వస్తున్నప్పుడు ధ్యానము లో ఉండగలిగితే అదృష్టము. పరమగురువులు ఆ స్థితిని 'Diamond consciousness' అన్నారు. దానిని వజ్రచైతన్యము అన్నారు. ఆ వజ్రచైతన్యములో ఉండేవారిని వజ్రాo గుడు అన్నారు. హనుమంతుడు అలాంటివాడని చెపుతారు.*

 *ఆచార్య సద్భోదన*

*ప్రతీ వ్యక్తీ జీవనపథంలో శాశ్వతుడైన భగవంతుడు తనని వెన్నంటి ఉంటాడనే సంగతిని గుర్తించగలగాలి.*

*జనసమూహంలో ఉన్నా నిశ్చిలంగా ప్రశాంతంగా ఉండగలగటం ఆధ్యాత్మిక జీవనం వలన సాధ్యపడుతుంది. ఏకాంతంగా ఉండగలగటం ఇందులోని ప్రత్యేకత.*

*దీనిని సాధారణ ఒంటరితనంతో, బాధపడటంతో పోల్చరాదు. ఎందుకంటే ఆధ్యాత్మికత ఒంటరితనాన్ని దరి చేరనివ్వదు. చైతన్యపు ఉనికి మనలో జాగృతమైనపుడు ఇక ఒంటరితనానికి తావు ఎక్కడ ఉంటుంది.*

*ఈ విధమైన జాగృతి ప్రపంచపు సమస్యల తాకిడి నుండి మనలను దూరంగా ఉంచుతుంది. ఒంటరితనం అనేది ఒక మానసిక భావన. చుట్టూరా ఎందరో ఉన్నా కొందరు ఒంటరితనంతో బాధపడతారు.*

*భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వారికి ఒంటరితనం అనేది ఉండనే ఉండదు.*

*శుభంభూయాత్*


శ్రీరమణీయం - (767)*_

_*"ప్రశ్న : అంతఃకరణాన్ని ఐదుగా విభజించారు కదా.. 1.ఉల్లం. 2.మనసు. 3.బుద్ధి. 4. చిత్తం. 5.అహంకారం. వీటి గురించి తెలుసుకోవాలని ఉంది !?"*_

_*భగవాన్ శ్రీరమణమహర్షి : సాధారణంగా నాలుగింటినే గుర్తిస్తారు. కానీ 'ఉల్లం' అని ఐదోదాన్ని చేర్చటం పంచతత్వాలను సరిపుచ్చటానికే !*_

_*1. ఉల్లం : జ్ఞానము. ఇది ఆకాశతత్వం. కపాలం నుండి భ్రువు వరకు.*_

_*2. మనసు : ఆలోచనాశక్తి. ఇది వాయుతత్వం. కనుబొమల నుండి గొంతువరకూ.*_

_*3. బుద్ధి : వివేకం. అగ్నితత్వం. గొంతుక నుండి గుండె వరకూ.*_

_*4. చిత్తం : జ్ఞప్తి. జలతత్వం. గుండె నుండి నాభి వరకూ.*_

_*5. అహంకారం : పృథ్వీతత్వం. నాభి నుండి మూలాధారం వరకూ.*_

_*ఉల్లమంటే శుద్ధ మనసు. అంటే తలంపుల్లేని మనసు. అది మానసాకాశం. అంటే తలంపులు కమ్ముకొనని మనోవిస్తరణం !*_

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"*_

_*ఘర్షణలేని మనసే శాంతి సామ్రాజ్యం !''*- *(అధ్యాయం -94)*_


*"ఋభుగీత "(234)*_

_*ఆత్మవైభవము"*_

_*17వ అధ్యాయము*_ 

_*ఏదీ మనని బాధించని స్థితే సంసారహీనత !*_

_*సంసారం అంటే అంతటా అనుకూలతను కోరుకోవడం. అది వదిలితే సంసారహీనతే అవుతుంది. అందుకే మహానుభావులు సంసారంలో మనం ఉండాలిగానీ, మనలో సంసారం ఉండకూడదని సెలవిస్తారు. ఇప్పుడు సంసారంలో ఉన్న ఇష్టం అంతకన్నా ఉన్నతమైన విషయంపై ఇష్టం ఏర్పడటం వల్ల పోతుంది. అప్పుడు సంసారం మనని బాధించకుండా ఉంటుంది. ఏదీ మనని బాధించని స్థితే సంసారహీనత. దేన్నైనా ఇష్టపడటం తప్పుకాదు. అది లేకపోతే మనసును కష్టపెట్టుకోవడం తప్పు. ఇష్టమే లేకుండా ఉండటం ఉత్తమ గుణం. ఇష్టపడినా, అది లేనప్పుడు బాధలేకుండా ఉండటం కనీస సద్గుణం. దేనితోనైనా బాధపడేంత బంధం పెట్టుకోనప్పుడే అది సాధ్యం అవుతుంది. అలాంటి మానసిక స్థితిని సాధించుకుంటే దైవదర్శనం సులభం అవుతుంది !🌷124-మంద్రగీత🌷*

 *క్షేత్రము-క్షేత్రజ్ఞుడు*

*35. సూర్యుడు ఒక్కడైనను సమస్త జీవులను వెలిగించును. అన్ని కోనేళ్ల యందును, బావుల యందును ప్రతిబింబించును. ఆత్మలుగా, ప్రాణముగా, భూమి మున్నగు గృహములలోని పదార్థముగా దిగివచ్చి అస్తిత్వముగా కూడా వెలిగించును. అట్లే క్షేత్రము సమస్తమును క్షేత్రజ్ఞుడు వెలిగించుచున్నాడు.*

*36. ఈ విధముగా జ్ఞానమను కంటితో క్షేత్ర క్షేత్రజ్ఞులు అను విభాగమును తెలియవలెను. దానితో వాని ఏకత్వము కూడా తెలియును. ఈ తెలివి వలన పంచభూతముల, జీవుల త్రిగుణాది ప్రకృతి తెలియును. ఈ తెలివితో ప్రకృతి నుండి విమోచనము సిద్ధించును..*

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

*గూఢం చైతన్యముత్ర్పేక్ష్య జడబోధ స్వరూపతామ్ ౹ ఆత్మనో బ్రువతే భాట్టాశ్చదుత్ర్పేక్షోత్థిత స్మృతేః౹౹95౹౹*

95. భాట్ట మీమాంసకులు ఆత్మయందు చైతన్యము గూఢమై ఉన్నదనీ స్వరూపమున అది చేతనము,అచేతనము కూడా అనీ అందురు. మేలుకొనిన పురుషుడు తన గాఢనిద్రను స్మరించుటను బట్టి వీరిట్లు నిశ్చయింతురు.

*జడో భూత్వా తదాఽ స్వాప్సమితి జాడ్యస్మృతిస్తదా ౹ వినా జాడ్యాను భూతిం న కథఞ్చిదుపద్యతే ౹౹96౹౹*

96. "జడుని వలె నిద్రించితిని"అనే స్మరణ అట్టి జడత్వపు అనుభవము ఉండుట చేతనే సంభవము.కాని ఒక చైతన్యాంశము లేనిదే ఇట్టి అచేతనా అనుభవపు స్మరణ సిద్ధింపదు.కనుక ఆత్మ చేతనము అచేతనము కూడా.

*ద్రష్టుర్దృ ష్టేరలోపశ్చ శ్రుతః సుప్తౌ తతస్త్వయమ్ ౹ అప్రకాశ ప్రకాశాభ్యామాత్మా ఖద్యోతవద్యుతః ౹౹97౹౹*

97. నిద్రయందు ద్రష్ట గాని దృష్టి గాని లోపింపవు.(బృహదారణ్యక ఉప.4.3.23)అనే శ్రుతివాక్యమును చూపుచు వారు మిణుగురు పురుగు వలె ఆత్మ ప్రకాశము అప్రకాశము కూడా అని చెప్పుదురు.


 *25-శ్రీ రామదాసు కీర్తన*

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

కాంభోజి - ఆది (- త్రిపుట).

పల్లవి:-


ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా! నన్ను

రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా!! ఇ !!


చరణము(లు):-

చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా!

ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా!! ఇ !!


గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా! నను

క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా!! ఇ !!


భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా!

ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా!! ఇ !!


శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా!

ఆ మొలత్రాటికి  బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా!! ఇ !!


లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా!

ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా!! ఇ !!


సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!

ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా!! ఇ !!


వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా! జగ

న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా! ఇ !!


కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా!

నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!! ఇ !!


మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా!

లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా!! ఇ !!


అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా!

ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా!! ఇ !!


సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా!

దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా!! ఇ !!


ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా!

నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా!! ఇ!!


కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా!

కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా!! ఇ !!


భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా!

నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా!! ఇ!!


శ్రీమన్నారాయణీయము||

సప్తమ స్కంధము/ 25వ దశకము - శ్రీనృసింహావిర్భావ వర్ణనము/25-5-శ్లోకం*


నూనం విష్ణురయం నిహన్మ్యముమితి భ్రామ్యద్గదాభీషణం-

దైత్యేంద్రం సముపాద్రవంతమధృథా దోర్భ్యాం పృథుభ్యామముమ్।

వీరో నిర్గలితో౾ థ ఖడ్గఫలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్

వ్యావృణ్వన్ పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో।।

భావము:-

తన ఎదుట ఉగ్రరూపమున ఉన్నది 'విష్ణువే’ నని నిశ్చయించుకొనిన ఆ హిరణ్యకశిపుడు, భయంకరముగా తన గదను అటునిటు త్రిప్పుచు, నిన్ను వధించవలెనని, వేగముగా నిన్ను సమీపించెను. ఆ రాక్షసరాజును అధైర్య పరచుచు, శ్రీ హరీ! నీవతనిని నీ రెండు చేతులతో గట్టిగా పట్టుకొంటివి. హిరణ్యకశిపు డపుడు నీ చేతులనుండి జారి, ఖడ్గమును డాలును ధరించి తిరిగి వచ్చెను. ప్రభూ! జగత్తునే కబళించగలిగిన - ఉగ్రరూపమున ఉన్న నీవు విజృంభించగా - ఖడ్గము డాలు చేతబట్టి ఆ రాక్షసవీరుడు నిన్ను వధించవలెనని విచిత్ర విన్యాసములు చేయసాగెను.

వ్యాఖ్య:-

దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీనరసింహావతారుడు నిన్న వర్ణించిన విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.

ఈ రూపము ఉత్తి మానవ రూపము కాదు, ఉత్తి సింహం రూపము కాదు. చూస్తే యథార్థంగా మానవాకారం, సింహాకారం రెండు కలిసి ఏర్పడిన శ్రీహరి మాయా మూర్తిలా ఉంది.

చిన్న పిల్లాడు సాహసంగా పలికిన మాటను నిలబెట్టడానికి, తాను సర్వాత్ముకుడ నని నిరూపించడానికి, విష్ణువు ఇలా నరసింహరూపం ధరించి నన్ను శిక్షించటానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు. అయినా ఇందరి ముందు నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను. శత్రుసంహారం చేస్తాను. విజయం సాధిస్తాను.”

అని భావించిన హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా దృఢ స్థైర్యంతో గద ఎత్తి పట్టుకొని, తొట్రుపాటుతో అరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. మృగరాజుకు ఎదురువెళ్ళే మదగజం లాగ ఆ రాక్షసేశ్వరుడు నరసింహమూర్తికి ఎదురు నడిచాడు. ఆ దేవాధిదేవుని దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానలం ముందు మిణుగురు పురుగులాగ ముందుకు పోతున్నాడు. కర్తాకర్తవ్యాలను మరచిపోయాడు. తన తేజస్సును కోల్పోయాడు.

 దానవ వీరుడైన హిరణ్యకశిపుడు తన భయంకరమైన గదాదండాన్ని గిరగిరా త్రిప్పి నరసింహుని మీదకి విసిరాడు. ఆయన వెంటనే, గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు. ఆ దానవుడు ఎగిరి పడి ఇటూనటూ గింజుకుని, రోషంతో, చాకచక్యంతో బలంపుంజుకుని, పట్టు తప్పించుకున్నాడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజు లాగా ఎగిరి ఎగిరి పడుతూ చిందులు త్రొక్కుతూ పోరాడసాగాడు. 

“తన భుజబలానికి ఈ నరసింహుడు లొంగిపోతాడులే” అనుకుంటూ, నదురు బెదురు లేకుండా రాక్షసేశ్వరుడు విజృంభిస్తున్నాడు. తన పరాక్రమాన్ని నైపుణ్యంగా ప్రదర్శిస్తున్నాడు. దేవతలు ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల చాటున నక్కి నక్కి చూస్తూ “మన జీవితాలకు ముప్పు తప్పేలా లేదు, వీడేమో లొంగేలా లేడు” అనే సందేహాలతో దిగులుపడసాగారు. అయినా రహస్యంగా ఆ రాక్షసుడినే చూస్తున్నారు. 

హిరణ్యకశిపుడు కవచధారి అయి యుద్ధ విద్య తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో ఖడ్గచాలనం చేస్తూ భూమ్యాకాశా లంతటా తానే పరిభ్రమిస్తున్నాడు. మల్ల యుద్ధ విద్యా విన్యాసాలైన ఉరుకుట, తిరుగుట మున్నగునవి లాఘవంగా చూపుతున్నాడు. రకరకాల పరిభ్రమణాలు చేస్తూ, భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరి పడుతున్న రాక్షసుడి అహంకారాన్ని సహించక నరసింహ ప్రభువు ఆగ్రహించాడు. 

 18-48-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగమ


అII స్వకీయకర్మము(స్వధర్మము) ఒకవేళ దోషముతో గూడియున్నదైనప్పటికిని దానిని వదలరాదని చెప్పుచున్నారు –

సహజం కర్మ కౌన్తేయ! 

సదోషమపి న త్యజేత్ | 

సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||  

తా:- ఓ అర్జునా! స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను (దృశ్యరూపమైనను, లేక త్రిగుణాత్మకమైనను) దానిని వదలరాదు. పొగచేత అగ్ని కప్పబడునట్లు  సమస్తకర్మములును (త్రిగుణములయొక్క) దోషముచేత కప్పబడియున్నవికదా!

వ్యాఖ్య:- కర్మ యనునది ఇంద్రియాదులచే చేయబడునదిగనుక దృశ్యమం దంతర్భూతమైనది. త్రిగుణాత్మకమైనది. ప్రకృతి (మాయ) యందు వర్తించునది. కనుకనే 

"దోషేణ" అని చెప్పబడినది. కాబట్టి ఆత్మకాని దోషము, దృశ్యరూపమగు దోషము, త్రిగుణాత్మకమైన దోషము ప్రతికర్మయందును గలదు. అందుచేతనే 'సర్వారమ్భా హి’ (సమస్తకర్మలును) అని తెలుపబడినది.

 కావున పొగచే అగ్ని కప్పబడి యుండునట్లు  సమస్తకర్మలు (దృశ్యరూపములు కనుక) ఈ దృశ్యరూప దోషముచే గప్పబడియున్నవి. అయినను స్వభావసిద్ధములగు కర్మలను వదలరాదు. ఏలయనగా వానిని నిష్కామ బుద్ధితో, భగవదర్పితబుద్ధితో నాచరించినచో అవి చిత్తశుద్ధిద్వారా జ్ఞానమును, మోక్షమును గలుగజేయగలవు. అయితే పాపకార్యములను మాత్రము చేయరాదు.

సమస్తకర్మములును 'మాయా' రూప దోషముచే నావరింపబడియున్నప్పటికిని, అందు శుద్ధకర్మచే అశుద్ధకర్మను, పుణ్యకర్మచే పాపకర్మను, నిష్కామకర్మచే సకామకర్మను తొలగించివేసి ఆ పిదప క్రమముగ సాధనాతిశయముచే ఇంకను పైకిపోయి నైష్కర్మ్యాత్మరూపమున చేరవలయును.

ఈ విషయమును మఱియొకదృష్టితో గూడ విచారించవచ్చును.

వారువారు చేయుకొన్ని కార్యములందు పంచసూనాది అనివార్యదోషము లేర్పడుచుండును. జీవితయాత్రకై  ఆ యా కార్యములను జనులు తప్పక చేయవలసియేయున్నారు. కావున ఆ యా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తము లేర్పడినవి.

దోషము (పంచసూనములు) - ప్రాయశ్చిత్తము (పంచమహాయజ్ఞములు)

1. ధాన్యమును ఉత్పత్తి చేయునపుడు సంభవించు ప్రాణిహింస - బ్రహ్మయజ్ఞము (వేదాధ్యయనాదులను జేయుట)

2. విసరునపుడు - పితృయజ్ఞము (పితృదేవతలను తర్పణాదులచే

తృప్తిపఱచుట)

3. కట్టెలు నరకునపుడు వానిచే వంటవండునపుడు -  దేవయజ్ఞము (హోమము మున్నగునవి చేయుట)

4. జలము తెచ్చునపుడు, కాచునపుడు - భూతయజ్ఞము (ప్రాణులకు అన్నాదుల నొసంగుట)

5. ఊడ్చునపుడు - మనుష్యయజ్ఞము (అతిథులను, బ్రహ్మనిష్ఠులను, దీనులను భోజనాదులచే తృప్తిపఱచుట)

ఈ ప్రకారముగ కర్మలవలన గలుగు ఆ యా అనివార్యదోషములు పుణ్యకార్యములచే, నిష్కామకార్యములచే తొలగిపోగలవు. ఇంతియేకాక బ్రహ్మవిచారణ, ఆత్మధ్యానము మున్నగు మహోన్నత పవిత్రకార్యములచే జీవులందలి ప్రకృతి దోషములు లెస్సగ తుడిచిపెట్టుకొని పోగలవు.

కావున వారి వారి స్వభావసిద్ధ కార్యమునందు ప్రకృతిజన్యములగు దోషములున్నప్పటికిని వానిని త్యజించక, నిష్కామబుద్ధితో వాని నాచరించుచుండినచో క్రమముగ హృదయము నిర్మలమై జీవునకు జ్ఞానప్రాప్తి ఉత్తమ బ్రహ్మపదప్రాప్తి సిద్ధించగలవు.

 *తిరుప్పావై 27వ పాశురం*

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

*27.పాశురం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


    *కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై*

        *ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్*        

        *నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక*

        *శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ*

        *యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్* 

        *అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు*

        *మూడ, నెయ్ పెయ్ తు* *మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్!!*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*భావం:-*   

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తరువాత మంచి వస్త్రములు దరించవలెను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా - హాయిగా భుజించవలెను. 

 నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __ 

ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*అవతారిక*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

గోపికలు తాము ఆచరింపబోవు మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాశురమున విన్నవించిరి. అందు వారు అడిగిన ద్రవ్యములు సులభములే ఐనను, వారు కోరిన గుణములుగల ద్రవ్యములు దుర్లభములు. అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను కోరుటకాదు, నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకొనెను. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు.       

స్వామిమొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్ధించారు గోపికలు . గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే! అంటే స్వామి తమతోనే వుండాలని ద్వానించేవిధంగా గోపికలు చాల చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి యిదంతా విని 'మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి' అన్నారు గోపికలు యీ పాశురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

 *హంసద్వనిరాగము _ అదితాళము*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


    ప ...     అనాశ్రిత విజయ! శుభ, గుణదామా!

        నిను సుత్తియించి ప్రాప్యము నొంది    


    అ..ప..    నిను సుత్తియించి ప్రాప్యము నొంది.

        సన్మానమంది సన్నుతి జేతుము

    

    చ..    కంకణమ్ములను భుజకీర్తులను

        కర్ణ భూషలును కర్ణ పుష్పములు

        మెరుగుటందియలు మేని తోడవులును 

        పరవశత నలంకరించుకొందుము

    

    చ..     మేలిమి పలువల మేము ధరించి 

        పాలు నేయి గలసిన పరమాన్నము        

        కేలోడ మనము కలసి భుజియించి

        ఇల నీ సంశ్లేషమున సుఖింతుము!!

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*పంచసంస్కారం ఆపై మోక్ష అనుభవం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం* 

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవటానికి వాడుకుంటారు, దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు, మరి కోందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు.

 ఏఒక్కరో నూటికి *“కశ్చత్ మామ్వేహి తత్వతః”* రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా, ఆతత్వాన్ని వినియోగించుకొని ఆతత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవనకోసం వచ్చిన రూపం ఇదీ అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా. ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కనుక సాధనము, సాద్యము, జ్ఞానము, జ్ఞేయము, నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు.

 అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనా లొంగే ప్రవర్తించాడు, వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవుల్లలో ఎవరు తననే సర్వమూ అని భావించి, తన ఆజ్ఞని శిరోధార్యంగ స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే, మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం, పరమపదం మనకు ఊహకికూడా అందనటువంటిది, కనిపించేరూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం, విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్దాంతం. దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు, నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద అర్చామూర్తియై ఉన్నాడు. కావల్సింది మనలో ఉండే విశ్వాసం.

శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టు ఉండే గొల్ల పిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక  స్థితిలోకి తీసుకు పోయాడు. అయితే దాన్ని విశ్వసించటం  చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ  బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాటం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు. శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలనందరికి చెప్పాడు, రేపటి నాడు మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం, ఎవరెవరి ఇళ్ళలోంచి వారికి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు.

 అందరిని చుట్టూ కూర్చోబెట్టాడు, ఒక్కొక్కరివస్తువులని రుచిచూడటం ప్రారంభించాడు, అందంగా వారు తయారుచేసిన వైనాన్ని పొగడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి  అందిస్తూ, తాను ఆనందం పోందుతున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గరి నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవడంతో, కృష్ణుడికి ఎలా ఇవ్వడం, కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయ్యాలని గబ గబా త్రాగటం మొదలు పెట్టాడట. అయితే కృష్ణుడు తన పై ప్రేమ తో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కల్గిన పదార్థం తనకు దొరక కుండా పోతుందేమో నని దిగులు చెంది, గబ గబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగటం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ  బ్రహ్మకి  ఏం అర్థం కాలేదు. వేదాధ్యయణం చేసినవాడాయే నిప్పునుని కూడా కడిగి తీసుకొనే ఆచారవంతుడు, తనకు ఈ విషయం నచ్చలేదు. జగత్ కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ. అయితే, ఈ పిల్లవాడు ఏదో ఇంధ్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలెనని బ్రహ్మగారు అనుకున్నారు, గోవులను గోపబాలురను దాచాడం, తరువాత బ్రహ్మ లోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చెయ్యటం, ఆపై బ్రహ్మకు బుధ్ధి  రావడం జరిగాయి. ఆనాడు ఆ పిల్లలకందరికి సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు, మోక్షానందం ఏమిటో చూపించాడు.

*అయితే మోక్షం అనగా ఏమి ?* 

మోక్షం అనగా ఆనందించుట, దీనిపై రక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ, *“బ్రహ్మవిత్ ఆప్నోతి పరం”* అని చెప్పాయి. ఆంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును.

అయితే ఆ పరం ఎలా ఉండును ? అని త్తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా *“ఆప్నోతి ”* అంటే పోందటం, లేక తినటం లేక  అస్నుత అని చెప్పింది. 

 *“సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభిః"* . సహ- ఈ ముక్త జీవుడు అస్నుతే- ఆరగించును. దేనిని ? సర్వాన్ కామాన్ - దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏమి కోరుకుంటాడు ? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును.  దీన్నే వేదం ఇలా చెప్పింది. *"తస్మిన్ యదంతః తదుపాసితవ్యం"* అంటే తస్మిన్- ఆ పరమాత్మ యందు, అంతః-యత్ - లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో, తదుపాసితవ్యం- ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది. 

సర్వాన్ కామాన్- అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును ? బ్రహ్మణాభి- పరమాత్మతో,  సహ-కలిసి  పశ్చితేభిః- అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంలో *"తో కలసి"* అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియూ భోతృ సహచర్యం అని రెండు ఉంటాయి. రాజుగారితో మంత్రి కలిసి   వచ్చెను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది. భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి  ఎప్పటికీ ఉంటాడు, గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెబుతూ *"తమః పరేదేవే ఏకీ భవతి"* ఏకీ భావమే పర్యవసానం తప్ప, *"ఏకం భవతి"* అని చెప్పట్లేదు, ఇది గుర్తుంచుకోవాలి.  *"ఏకీ భవతి"* అంటే ఒకటివలె అగును అని వ్యాకరణం చెబుతుంది. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మను. చేరును. చేరి ఏమగును ? ఎక్కడో మూలన పడి ఉండునా, అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు. మరి ఏమగును ? అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును. మరి గుణములతో అనుభవించటం అంటే ఏంటి? ఇది అర్థం అవడం కష్టం. గుణములను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించటం అంతకన్నా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.  అందుకే వేదవ్యాస భగవానుడు *"శ్రీకృష్ణభగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు"* ఒకడు అనేకమందితో కలసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది.

వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెబుతుంది. మోక్షంకి వెళ్ళాక "అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో" అంటూ సాగుతుంది.

 అయితే ఉపనిషత్తులు అన్నం అంటే  *"అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి"* అద్యతే- క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అత్తిచ భూతాని- క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడై పోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినే దాన్నే అన్నం అంటాం. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే జీవుడు అహమన్నాదో- నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట, ఆపై భగవంతుడుకూడా అహమన్నాదో- నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట. అయితే అనుభవం పోందేదెవడు, అనుభవించేదెవడు ఇటా అటా, ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఏవరు అనేది గుర్తించ వీలు కానట్లు సామానత్వం ఏర్పడుతుంది.

అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మనా సముడగును ఆయన వంటి రూపం,గుణం,ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాసభగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు. అది శ్రీయ పతిత్వం, జగత్ కారణత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టీ  స్థితీ  లయాలు పెద్ద భాద్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మ సూత్రాల్లో *"భోగ్య మాత్ర సామ్య లింగాః"* అయితే అనుభవం మాత్రం సమానం, జీవుడికీ భగవంతుడికీ తేడా ఉండదు. ఇక ఈ అనందం ఒక్కో జీవికి ఒకలా ఉండదు, అందరికీ సమానం. ఆ అనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్ళకీ చూపించాడు.  గోదా దేవి సద్దులు ఆరగించడం ఏం ప్రారభ్దం కనుక ఎంచక్కా మనం పరమాన్నాన్నే ఆరగిద్దాం అని చెప్పింది.

అందుకే గోదాదేవి *"పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార కూడి ఇరుందు కుళిరుంద్"* కలిసి అందరం పరమాన్నాన్ని తినవలెనని చెబుతుంది. 

మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడుంటాడు దేవుడుంటాడు, ఇరువురిలో సమానత్వం ఉంటుంది. ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది, ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా, మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది? అంటే వాడి కళ్యాణ గుణాలవల్ల ఏర్పడింది. ప్రీతి పైన నిండి ఉంది, వారిరువురి మద్య కలిసి వీడనంత స్నేహం, అది ప్రీతిలో అంతటా కల్సి ఉంది. జీవుడూ పరమాత్మ కల్సి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం. ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు.ఆండాళ్ ఇదే పాయసాన్ని కోరుతుంది. *"పాల్ శోఱు"* పాలు కల్సిన అన్నం *"మూడనెయ్ పెయ్దు"* అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి, దాంట్లో తీపి పాలల్లో, నెయ్యిలో, భియ్యపు కణాల్లో కల్సి ఉండాలి. వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే.

ఏమిటీ పరమాన్నం ? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది.

 దాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. దాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోదాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి.

*"శ్రీషం ప్రపద్య ఆత్మవాన్ ప్రారభ్దం పరి బుజ్య*

*కర్మ శకలం ప్రక్షీణ కర్మాంతరః జ్ఞాసా దేవ*

*నిరంకుశేష్వర దయా నిర్లూణవ మాయాన్వయః హార్థా*

*అనుగ్రహ లబ్దం మధ్య దమని ద్వా రాత్ బహిర్ నిర్గతః ముక్తః"*

ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునోనని చెబుతూ, మనకు లభించిన కర్మ అనుభవంచేత తనయందు ఫల కర్తుత్వాన్ని 

త్యాగం చేస్తూ వాటి యందు పట్టు లేకుండా సాగించే జీవన యాత్రలో కర్మలు అన్నీ తొలగినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరంద్రం గుండా బయటికి ముక్తుడగును.

ఇలా పన్నెండు మార్గాలు అర్చి దిన పూర్వపక్ష శడు దర్మాస అబ్దవాత్ అంశుమత్ తో విద్యుత్ ఇంద్ర ధాత్రు ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరజాస్నాతుడవుతాడు. విరజలో జీవుడిని కడుగుతాడు. జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి, దాన్యం పై ఉండే పొరను తీసినట్లుగానే. 

రజస్ సంపర్కం పూర్తిగా తొలగేట్టు చేస్తాడు పరమాత్మ. అప్పుడు జీవుడు పరమపదం చేరగల్గుతాడు. పరమాత్మ రూపు పొందగల్గుతాడు. సారూప్యం  ఏర్పడుతుంది. అక్కడున్న ముక్త జీవులు వీణ్ణి పరమాత్మ వద్దకు తీసుకు పోతారు. సాన్నిప్యం  ఏర్పడుతుంది. అక్కడ పరమాత్మ-అమ్మ ఒడిలో వివిద రకాల సేవలు అందిస్తూ, అనందం పొందుతాడు. సాలోక్యం ఏర్పడుతుంది. ఇలా చివరి  స్థితి సాయిజ్యం ఏర్పడుతుంది.  యుక్ అంటే కల్సి ఉండేది. జీవుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణ గుణలు, వీటిలో ఇరువురూ కల్సి ఉండడమే సాయుజ్యం, దీన్నే మోక్షం అంటారు.

మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, మనం ఉపనిషత్తులని పశువులని అనుకోవచ్చు. ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడికుండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలని రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, తియ్యదనం వలె. ఇందులో జీవుడూ భగవంతుడూ కల్సి ఉన్నారా లేదా అన్నట్లుగా కల్సి ఉంటారు.  పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆండాళ్ దీన్నే కోరుతుంది.

పరమాత్మ కున్న పేరు నారాయణ, అది ఒక పెద్ద సాగరం లాంటిది, అందులోంచి తేలిన ఒక నామమే గోవింద నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం *“గోవింద”* నామం. అందుకే మన వాళ్ళు ఏదైన పని చేసే ముందు శ్రీ గోవింద గోవింద గోవింద అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉజ్యమిస్తారు. 

ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం. ఏడు రోజులు గోవర్దన పర్వతాన్ని ఎత్తి పట్టి గో గోప గోపీ జన సంరక్షణ చేసి, ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంచే ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం. అందుకె ఈరోజు నుండి వరుసగా మూడు రోజులు గోవిందనామం ఉచ్చరించి అనుగ్రహం పోందుతారు. 

*"గోవిందా"* గోగోపగోపీజన సంరక్షకా *"శీర్"* నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే, *"కూడారై"*   

 కూడని వారిని, నీ దరికి రాని వారిని *"వెల్లుమ్"*  జయించి నీ దరికి రప్పించుకుంటావు. కూడని వారంటే ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు. ద్వేషంతో కొందరు, ఏం పట్టక ఉదాసీనులు కొందరు, ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందోఅని కొందరు. కూడని వారిని తన 

భాణాలతో దరికి లాక్కుంటాడు.

ఇక ప్రేమించి దూరం అయ్యేవాళ్ళను తన అనునయంతో దరికి చేర్చుకుంటాడు. నమ్మాళ్వార్ అలానే, స్వామీ నే దరికి రానే రాను, నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే స్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరం పోతుంటే, స్వామి నమ్మాళ్వార్ ని నిలిపి *"వళవేళ్ ఒలగిన్"* అనే తిరువాయిముళి అనే దివ్యప్రబంధంలో ఇలా అంటాడు స్వామి. నమ్మాళ్వార్ అనగనగా ఒక గోకులం, నేనే శ్రమించి గోవులని కాచా, పాలు పెరుగు వెన్న భాగావచ్చాయి, కానీ నాకందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా. తప్పెవరిదయ్యా అంటే నమ్మాళ్వార్ వారిదేనయ్యా అని చెప్పాడు. 

మరి నేను కష్టపడి సంపాదించింది దాచటం తప్పా కాదా అంటే, తప్పేనయ్యా అని నమ్మాళ్వార్ చెప్పారు. నీవు ఒక కుండ, దానిలో జీవుడి జ్ఞానమే పాలు, పెరిగిన ప్రేమే పెరుగు, మరి ఇదంతా నేను పండించిది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిది అంటే పాపం నమ్మాళ్వార్ స్వామికి లోంగిపోవాల్సొచ్చింది. గొప్పవాడై ఏ యోగ్యతలేని వారి వద్ద అరమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని దరికి తీసుకుంటాడు. ఇక ఉదాసీనులని తన అందం, ప్రసాదం చూపి దరికి చేర్చుకుంటాడు. ఆలయాల్లో జరిగే తిరువీది ఉత్సవాలు ఉదాసీనులని కటాక్షించటానికే.

ఇంత వరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్ళకు నీ సన్నిధి చేరామయ్యా! నీమాట పలకటానికి ఇష్టపడని ఈ లోకం, *"ఉన్ఱనై ప్పాడి"* నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చు కున్నావు. *"పఱైకొండు"*  నీ పాట పాడి నీవిస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి *"యామ్ పెరుసమ్మానమ్"*  మేం గొప్ప సత్కారం పోందాలని అనుకుంటున్నాం. 

మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం, సత్కారం లభించటానికి కాదు, ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతుకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతుకు కాదు కదా! *"నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక"* లోకం అంతా కీర్థించేలా సత్కారం కావాలి.  విభీషనుడికి , సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం వల్ల లోకం రాముణ్ణే కదా కీర్థించింది. ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు.  వాటిని సూచిస్తోందా అన్నట్టు

గా గోదా పంచ సంస్కార పక్రియను చెబుతుంది.

 *"శూడగమే"* చేతికి ఒక కంకణం కావాలి, *"తోళ్ వళైయే"* భుజానికి ధరించే ఆభరణం, *"తోడే"*, చెవికి ధరించే ఒక ఆభరణం, *"శెవి పువ్వే"* చెవి పైకి పరిమలం కోసం ధరించే మరొక ఆభరణం, *"పాడగమే"* పాదాలకు ధరించే ఒక ఆభరణం. ఇవన్నీ కోరుతుంది గోదా.  ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికో కంకణం, భుజానికి శంఖ చక్రాలు, చెవికి అష్టాక్షరీ మహా మంత్రం, పరిమలాన్నిచ్చే ద్వయ మంత్రం, పాదాలా అన్నట్టుగ చరమ శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు.

 *"యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్"* మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు.  *"ఆడైయడుప్పోం"* నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుణ్ణి చేరాటానికి లభించిన వస్త్రం శరీరం, ఇది పాంచబౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది.

 *"అతన్ పిన్నే"* అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావల్సింది *"పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార"* పరమాన్నం, అదే పరమ పదం. *"కూడి ఇరుందు "* అందరు కల్సి గోష్టిగా తినడానికి, *"కుళిరుంద్"* ఈ కలయిక తో మన ఈ సంసార తాపం అంతా తొలగాలి.

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*తిరుప్పావై  27 వ పాశురము/తెలుగు పద్యానువాదము*  

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

సీసమాలిక


గోవిందుడా యని గుణములు పాడుచు 

          వేడుక కలుగగా పాడినాము

ఆడవారలనుచు కూడదు యనబోకు

       తగని కోరికలపై తలపు యనుచు

స్నానమాడిన మేము చయ్యన నీ చెంత

      ముదము గల్గిన కృష్ణ పదము లందు

వచ్చిరాని వ్రతము మెచ్చెద వీవని

       కోరిక వినిపించ కూడినాము 

ఆభరణము లేవి యడుగము మిమ్ముల 

       పలువిధములయిన వలువలిమ్ము

యింత కన్నను మిన్న వేళ లేదని నమ్మి

        పంక్తిగా మిముచేర వచ్చినాము 

ఆనందమందుచు హాయిగొల్పుచు నుండ 

        స్వామిని కీర్తించ సమయ మేది!!


 తే.గీ.వెన్న మీగడ నేతులు తిన్నవేళ 

తీయ తీయగా త్రాగెడు పాయసమ్ము 

చాల చిక్కని పాలెల్ల జాలువార

చేయు మనవిని శ్రద్ధగా చిత్తగింపు 

శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధినిమ్ము

శ్రీధరుని  మానసంబున స్థిరము కమ్ము!!


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ