కల్పన బతుకు బండి (రోజువారీ చిన్న కథ) (1)
🧘♂️క్రమ-విచారణ🧘♀️
1. కర్మ బంధము సంగత్వము ఉన్నవారికే,
2. సంగత్వము ఆశ, ఆసక్తి ఉన్నవారికే,
3. ఆశ , ఆసక్తి వలన సుఖ దుఃఖ రూప కర్మ ఫలము అనుభూతమగును.
4. మూడుగుణాల విషమత్వము వలననే ద్వంద్వానుభవము కలుగును.
5. మూడుగుణాలు సమత్వముననున్న కలిగేది ఆత్మ జ్ఞానము.
6. మూడుగుణాల విషమత్వముచే పంచ విషయములు సుఖస్వరూపమని భ్రాంతి జ్ఞానము కలుగుతుంది.
7. మూడుగుణాలు - పంచభూతాలు - పంచ ఇంద్రియాలు - పంచవిషయాలు - అజ్ఞానము - అవిద్య - కామము - మోహము - కర్మము - అహంకారము కలిపి 24 కర్మచక్రము అనుభవమునకు వచ్చినట్లగుపడి మాయయనబడును.
8. నేను బ్రహ్మముననెడు దివ్యాహమే మాయగా వ్యక్తీకరణై నామరూపాత్మకముగా అనుభూతమగుచున్న ఆభాస.
9. నిష్కామకర్మ - తీవ్ర వైరాగ్యము - తత్వజిజ్ఞాస - తీవ్రముముక్షత్వము కలవారికి మాత్రమే స్వరూపజ్ఞానము సాధన సాధ్యము.
10. సాధన చతుష్టయము - చతుర్విధ శుశ్రూషలు - మహావాక్య చతుష్టయము - ఆత్మ చతుష్టయ నిరూపణ - అత్యాశ్రమిగా జీవనము కలవారికి స్వరూప జ్ఞానము సిద్ధ వస్తువు.
11. సర్వత్ర ఉన్నది బ్రహ్మమనెడి నిర్ణయమే పైవాటికి పరిష్కారము.
12. పరము - బాహ్యము - పరాత్పరము - పరబాహ్యము ఉన్నదున్నట్లున్నది - పైన చేయబడిన ఏకాదశ నిర్ణయములనట్టిని భ్రమయని విడచిన వారికే.
---
తపస్సు
ఓంశ్రీమాత్రే నమః🔥
_నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే _
తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం.
మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణమూ ఉంది.
మనసును సామాన్యముగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సుగా చెబుతారు.
ఒక వస్తువుపై మనసును నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది. మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది.
మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
మనసును నియంత్రించడమన్నది చాలా పెద్ద సమస్య.
మహాభారతంలోని శాంతిపర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది.
మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి.
బాహ్య అంతఃకరణాలైన మనసు ఇంద్రియాలను సమాధాన పరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు.
మనిషిలోని మనోబలాన్ని, సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనఃశక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది.
లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది.
మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురులవలే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవి కీర్తికోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది.
తపస్సు, తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెబుతుంది తైత్తిరీయం.
దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు.
నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే.
చిత్తశుద్ధి కోసంచేసే జపం, చిత్తశుద్ధితోచేసే ప్రతీపని తపస్సే అవుతుంది.
సాధనా తపస్సే, సేవా తపస్సే.
తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్లు మూసుకుని చేసే మంత్ర జపాలు. ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే.
మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుచేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి.
మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి..!
---
🧘♂️సూత్రాలు🧘♀️
ప్ర: 'సూత్రాలు' అని శాస్త్రంలో అంటుంటారు.
ఉదాహరణకు - యోగ సూత్రాలు, భక్తి సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు... ఇలా....
అసలు 'సూత్రం' అంటే ఏమిటి? మంగళ సూత్రం - అంటే 'మంగళకరమైన దారం' అని అర్థం కదా. శాస్త్రంలో 'సూత్రాలు' ఏమిటి?
జ: 'సూత్రం' అంటే లౌకికంగా 'దారం' అని అర్థం. ఒక కొనసాగింపును కలిగినది కనుక దారాన్ని సూత్రం అన్నారు.
శాస్త్రంలో 'సూత్రం' చాలా బలీయమైనది. ఒక్క వాక్యంలో ఎంతో జ్ఞానాన్ని పొదిగించి, అత్యంత క్లుప్తంగా చెబితే 'సూత్రం' అంటారు. ఇది జ్ఞాపకం ఉంచుకొనడం తేలిక.
సూత్రంలోని అంతరార్థాన్ని వివరిస్తే 'భాష్యం' అంటారు. ఇంగ్లీష్ భాష ప్రకారం సూత్రాన్ని 'ఫార్ములా' అనవచ్చు. తొలుత 'సూత్రం' వ్యాకరణ శాస్త్రంలో ఉద్భవించింది.
తదనంతరం ప్రతి శాస్త్రం సూత్ర పద్ధతిని అవలంబించింది. వేదాంతాన్ని 'బ్రహ్మసూత్రాలు'గా వ్యాసదేవులు అందించారు.
భక్తిసూత్రాలను నారదుడు, యోగసూత్రాలను పతంజలి రచించారు.
ఇలా దర్శన శాస్త్రాలన్నీ సూత్ర సాహిత్యాలను అభివృద్ధి చేశాయి. బౌద్ధ జైనాలు, శైవ శాక్తేయాది సంప్రదాయాలు కూడా సూత్ర రచనలను ఏర్పర్చుకున్నాయి.
---
సమరం, సాధన, ఆస్వాదన- ఈ త్రికోణ రూపమే జీవితం
ఓంశ్రీమాత్రే నమః
త్రికోణ జీవితం, భగవానుడు ప్రసాదించిన దివ్యమైన వరం నూరేళ్ల జీవితం. ఈ జీవితం మూడింటితో ముడివడి ఉంది. సమరం, సాధన, ఆస్వాదన- ఈ త్రికోణ రూపమే జీవితం.
పుట్టుక నుంచి పుడమి గర్భంలోకి వెళ్ళేవరకు జీవితం ఓ సమరాన్ని తలపిస్తుంది. బతుకు పోరాటం, బతికించడం కోసం ఉనికిని కాపాడుకోవడం, బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశల్లో ధర్మాచరణ, కుటుంబ సౌఖ్యం, సంతానం, ప్రయోజకత్వం, వృద్ధాప్యం, బాధలు, వ్యాధులు... అంతా ఓ సంగ్రామం.
గ్రహ రాశుల గమనస్థితి నుంచి సూక్ష్మ జీవరాశి వరకు క్రియాశీల వైఖరి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. చేతనత్వానికి సంకేతం.
సృష్టిలోని క్రియాధర్మం ఆగిపోతే జడత్వం ఆవహించి, రూప, నామ రహితంగా ఉండిపోతుంది. సృష్టి ధర్మం కొనసాగే క్రమంలో ఘర్షణ తప్పనిసరి. అలాగే మానవాళి జీవితంలో అనుభవాల రాపిళ్లు తప్పేవి కావు. శరీరాన్ని, మనసును, బుద్ధిని ఉపయోగించి మానవుడు జీవనసమరంలో విజేతగా నిలవాలి. సమయానుకూలంగా, సావధానంగా రాదు సమరం. అనునిత్యం, అనుక్షణం సమర వాతావరణమే.
వైవాహిక జీవితం, గృహస్థాశ్రమం... నల్లేరుమీద నడక కావు. సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలను కుంటాడు యజమాని. తన వృద్ధాప్య దశ హాయిగా సాగి పోవాలనుకుంటాడు. కానీ క్షణక్షణానికి మారే మనస్తత్వ వైఖరులు వాతావరణాన్ని అశాంతి పాలు చేయవచ్చు. పెను సమస్యలు తీరక పట్టి పీడించనూవచ్చును. వృద్ధాప్యమొక శాపంలా పరిణమించ వచ్చును. ఏ దశ కూడా వడ్డించిన విస్తరి కాదు. కడ దాకా పోరాటమే. ఎప్పటి కప్పుడు బలాన్ని సమకూర్చుకుంటూ సమర క్షేత్రంలో పోరు సల్పవలసిందే.
జీవితం విసిరే సవాళ్లను సాధనా సంపత్తితో ఎదుర్కోవాలి. సాధన అద్వితీయమైన శక్తి. అది చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. సాధనా జగత్తులో జాడ్యానికి, సోమరితనానికి తావుండదు. సాధనలో తొందరపాటు, తొట్రుపాటు ఉండవు. ఏదో ఒక్క విజయంతో ఆగిపోయేది కాదు సాధన.
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు ప్రజాకవి వేమన. జీవితంలో అవకాశాలు అందినట్లే అంది జారిపోతాయి. ఫలితాలు తారుమారు కావచ్చు. భవిష్యత్తు చీకటిమయంగా తోచవచ్చు. ఆశించిన లక్ష్యం అందుకోలేక పోవచ్చును. సాధనే సర్వత్రా విజయవంతమని గ్రహించినవారు- జీవితం విసిరే ఏ సవాలునైనా నవ్వుతూ స్వీకరిస్తారు.
విరామంతో ‘ఇక విశ్రాంతి కాలం’ అంటూ కాలాన్ని వృథాగా వెళ్లబుచ్చడం అంటే- అది కొరివితో తలగోక్కోవడమేనని తెలుసుకోవాలి. కాళ్లు చేతులు, మనసు పనిచేస్తున్నంతవరకు సాధనామయ జగత్తులో శ్రమించవలసి ఉంటుంది మనిషి. భక్తి ప్రపంచంలో నవ విధ భక్తి మార్గాలు సాధనా జగత్తే. గృహస్తు, గృహిణి జీవితమంతా ఓ అద్భుత సాధనా ప్రపంచమే !
వైవాహిక జీవితం, ఇల్లు చక్కదిద్దుకునే నైపుణ్యం, వంట-వార్పు, పిల్లల పెంపకం, కుటుంబ సభ్యులందరికీ అనుకూలమైన మనఃస్థితిని కలిగి ఉండటం, సభ్యత, సంస్కారాలు నేర్పే గురువులా భాసిల్లడం, పుట్టింటికీ మెట్టినింటికీ వారధిలా ఉండటం- ఇవన్నీ అనేక కోణాల్లో సాగే గొప్ప సాధనలే !
ధ్యానంతో మమేకమయ్యే సాధకుడు ఆనందాన్ని పొందుతాడు. ఒకరి ద్వారా పొందేది కాదు ఆనందం. ఎవరికి వారే ఆ స్థితిని సాధించుకోవాలి. ఎవరైనా జీవితంలోని దశలను, అవి తెచ్చిపెట్టే ఫలితాలను ఆస్వాదించాలి.
కుంగుబాటును, సంతోషాతిశయాలను సమానంగా స్వీకరించగలగాలి. సాధనతో ఒడుదొడుకులను వివేకంతో అధిగమించాలి. నూరేళ్ల జీవనఫలాన్ని, దాని మాధుర్యాన్ని ఆస్వాదించాలి !
---
అహంకారం/ఆత్మజ్ఞానము
ఓంశ్రీమాత్రే నమః
"నేను" 'నాది' అనే అభిమానానికి కారణం అయినది! అహంకారం. ఇలాంటి అహంకారమును బట్టి, వ్యక్తి ఈ శరీరాన్ని నేను, నాది అని తలుస్తాడు. అహంకారం మూడు విధాలుగా ఉంటుంది.
సాత్విక అహంకారం :- సత్త్వగుణ ప్రదానమైనది.
రాజస అహంకారం :- రజోగుణ ప్రదానం.
తామస అహంకారం :- తమోగుణ ప్రదానం.
మనిషి ముఖ్యంగా సాధకులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అహంకారానికి లోను అవకుండా! తమ బుద్దిని సాత్వికంగానే ఉంచుతూ , మనసును నిగ్రహించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మానవ జన్మకు సార్థకత. అహంకారం వినాశకరమైనది. అహంకారం తో ఉన్న మనసు , మంచిని, ధర్మాన్ని విడిచి, అధర్మ మార్గంలో చెడు ఆలోచనలతో నిండి సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం ఉండదు.
అజ్ఞానమే మాయ. ఈ శరీరమే నేను అనుకోవడం మాయాకార్యం. దీనివల్ల అహంకారం ఏర్పడి, తాను పరమాత్మ కన్న భిన్నుడనని జీవుడు భావిస్తాడు. ముందు సూక్ష్మరూపంలో ఉండే ఆహంకారం దేహమంతా వ్యాపించి శరీరమే తాననే భావన ఏర్పడి, జీవుడు బద్ధుడవుతున్నాడు.
విముక్తి యొక్క లక్ష్యం స్వస్వరూపావబోధం.అవబోధం అంటే మేల్కొనడం. అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానోదయం అవ్వడమే ఇక్కడ మేల్కొన్న స్థితి అని చెప్పబడింది. ఈ జ్ఞానం స్వస్వరూపం గురించి. అదే తన సహజానందస్థితి. ఆత్మయే జ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం అన్నమాట. అదే ఎరుక కలిగి ఉండటం అంటే. అట్టి ఎరుకయే ఆత్మ.
నిర్వాణ షట్కమ్
నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు. నేను పంచేంద్రియాలు కాదు, పంచభూతాలూ కాదు. చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను.
నేను ప్రాణాన్ని కాదు, పంచవాయువులు నేను కాదు. సప్త ధాతువులు నేను కాదు. పంచకోశాలు నేను కాదు. కర్మేంద్రియాలు నేను కాదు.చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను.
నాలో రాగద్వేషములు లేవు,లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధ కామ మోక్షాలు నేను కాదు. చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను.
నాకు పుణ్యపాపాలు లేవు, సుఖదుఃఖాలు లేవు.మంత్రాలు,తీర్థాలు,వేదాలు,యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాన్ని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను.
నాకు జననమరణాలు లేవు. జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, గురుశిష్యులు లేరు. చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను.
నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు. నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు. చిదానంద రూపుడైన శివుడను నేను, నేనే శివుడను.
ఒక్క మాటలో చెప్పబడే “మనసు”లో అనేక భాగాలున్నాయి: మనస్సు; బుద్ధి; చిత్తం; హృదయం; అహంకారం. వీటన్నిటి కలగలుపే “మనస్సు”. కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని పనిచేయించేదీ, అదుపులో పెట్టేదీ ఈ మనసే; కష్టాల్ని, బాధల్ని అనుభవించేదీ మనసే; సుఖాల్ని, ఆనందాన్ని అనుభవించేదీ మనసే; కృంగిపోయేదీ మనసే; పొంగిపోయేదీ మనసే. మనసుకి ఎందుకీ వైవిధ్యం? మనస్సు నిశ్చలంగా, స్థిరంగా వుండలేదా?
ఒక మిరపగింజను భూమిలోనాటి, దానికి నీరుపోస్తే, అది చిన్న మొలకై, భూమిపైకి వస్తుంది; రెమ్మలు వేసి, పూలు పూసి, కాయలు కాస్తుంది. ఆ మిరపకాయను కొరికితే, కారం, కళ్ళవెంబడి నీరును తెప్పిస్తుంది.
మనిషి, ఆ మిరప మొక్కను తానే సృష్టించాననుకుంటాడు; తన వలనే అది పెరిగి, కాయలు కాసింది అని అనుకుంటాడు; దానికిగల కారపు లక్షణం కూడా తన పోషణవల్లే వచ్చిందనుకుంటాడు. ఒక్క నిముషం నింపాదిగా, మనసుతో ఆలోచిస్తే, ఆ మిరపగింజను తాను సృష్టించలేదు; భూమిని తాను తయారుచేయలేదు; నీటిని తాను తయారుచేయలేదు; భూమిలోని సారాన్ని తను ఇవ్వలేదు; మిరపగింజలోని కారపు లక్షణాన్నీ తాను నింపలేదు; ఇంకా ముందుకుపోతే, అసలు, తనను తానే సృష్టించుకోలేదు. అయినప్పటికీ మనిషి అంతా తను చేస్తునట్టుగానే భావిస్తాడు. నా మనస్సు చెప్పినట్లు చేయగలిగాను; నా మనస్సులోని కోరిక ప్రకారం ఇదంతా చేసాను అని మనిషి అనుకుంటాడు.
ఎప్పుడైనా, ఒక్క క్షణం ఆగి, ఇదేంటి, నేను, “నా మనస్సు చెప్పినట్లు” అని అంటున్నాను; నా, అంటే, నేను వేరు, ఈ మనస్సు వేరా? నాకంటే భిన్నంగా మనస్సు వున్నదా? మనస్సు చెప్పినట్లు నేను వింటున్నానా? లేక నేను చెప్పినట్లు మనస్సు వింటున్నదా? అని ప్రశ్నించుకుంటే, మనస్సు చెప్పినట్లుగా నేను వింటుంటే, అక్కడ మనస్సే వుంటుంది కానీ, “నేను” ఎక్కడ వుంటాను?; నేను చెప్పినట్లుగా మనస్సు వింటున్నది కాబట్టి, “నేను” మనస్సుకంటే భిన్నంగా వున్నాను; నేను మనస్సుకంటే ఉఛ్చస్థితిలో వున్నాను; నేను మనస్సును నియంత్రించ గలుగుతున్నాను అని మనిషి తెలుసుకోగలుగుతాడు. భౌతిక శరీరం పనిచేయటానికి శక్తి కావాలి. అదేవిధంగా మనస్సు పనిచేయటానికి కూడా “శక్తి” కావాలి.
మనస్సుకు శక్తిని ఎవరిస్తున్నారు? నా మనస్సు అన్నప్పుడు ఆ మనస్సుకు శక్తిని ఇస్తున్నది నేనే కదా? అని తెలుసుకోగలిగితే, మనస్సు రెండో స్థాయిలో వున్నదని నాకు తెలుస్తుంది. ఇప్పుడు, ఇంతకీ నేనెవరిని? మనస్సుకు శక్తిని ఇస్తున్నది; మనస్సును నియంత్రిస్తున్నది నేనే అయినప్పుడు, ఆ నేను ఒక చైతన్యశక్తి అయివుండాలి కదా? ఈ చైతన్యశక్తి, స్వయం స్పృహ గలది; స్వయం జ్ఞానం గలది. ఇంతకీ, ఇదంతా తెలిపేదీ; తెలుస్తుండేదీకూడా మనస్సు ద్వారానే!!
అయితే, చంచలంగా వున్న మనస్సును, స్థిరంగా వుండేటట్లుగా సంకల్పంచేసుకొని, బాహ్య ఇంద్రియాల్ని, అంతర్ముఖం చేసి, ధ్యానం చేసినప్పుడు, మనస్సు సమాధి స్థితిని పొంది, మనస్సుకు ఆధారమైన అంతరాత్మ, లేదా చైతన్యశక్తి ప్రస్పుఠంగా ఆవిష్కరింపబడుతుంది. అప్పుడు, మనస్సు, అంతరాత్మకంటే భిన్నంగా కనబడదు. దీన్నే “ఆత్మశోధన” అని చెబుతారు.
అజ్ఞానం నుంచి మేల్కోగా, కలిగే జ్ఞానం యొక్క ఎరుకకై ఉండే తపనయే ముముక్షుత్వ మని చెప్పబడింది. అంటే అజ్ఞానమనే చీకటి తొలగగా తన సహజస్థితిలో ప్రకాశించి ఉండటాన్ని మేల్కొన్న స్థితిగా చెప్పవచ్చు. అలాంటి స్వయంప్రకాశమైన స్వస్వరూపము యొక్క ఎరుకయే ఆత్మ.
అదే జీవాత్మ పరమాత్మల అభేదతను గుర్తించడం. అదే ఆత్మసాక్షాత్కారం. అదే నిత్యమైన ఎరుక అన్నా, సస్వరూపాన్ని ఎరుగుట అన్నా రెండూ ఒక్కటే. బంధవిముక్తీ, ఆత్మ సాక్షాత్కారమూ ఒకేసారి జరుగుతాయి.
కాబట్టి ఆత్మ జ్యోతిని చూడటమే వేదాంతం యొక్క లక్ష్యం. అట్టి స్వీయానుభవం వల్ల మాయాబంధం తొలగినట్లు గ్రహిస్తారు. ఆత్మాన్వేషణలో మునిగినవారు , వారికి తటాలున ఆత్మదీప్తి కలిగినట్లు చెబుతారు.
అందుకే అద్వైత సాధకుడు చివరి దశలో జీవ బ్రహ్మముల ఐక్యతను వివరించే మహావాక్యాలపై దృష్టిని పెడతాడు. ఆ అనుభవం వల్ల మాయబంధం తొలగినట్లు భావిస్తాడు. అందుకే ముముక్షుదశలో సాధకుడు బంధం నుంచి విముక్తి కోరుతాడు. అది దాటి తత్వజ్ఞానం కల్గినప్పుడు తన అసలైన సస్వరూపం తెలుసుకోవడం వల్ల బంధవిముక్తి పొందినట్లే. అంటే పొందినట్లు భావిస్తాడు.
((()))
భావశుద్ధి
ఓంశ్రీమాత్రే నమః
పూజకు ఉపయోగించే ద్రవ్యాలు శుభ్రంగా ఉండాలనుకోవడం సహజమే. కస్తూరి, పునుగు వంటి సుగంధ ద్రవ్యాల్ని జంతువుల నుంచి సేకరిస్తారు. ఆవుపాలను లేగదూడ, తేనెను తేనెటీగలు ఎంగిలి చేస్తాయి. అటువంటి బాహ్యసామగ్రికి సంబంధించిన శుచికైనా, శుద్ధతకైనా ఒక కొలమానం లేదు. స్వామికి శుచిగా అర్పించదగినది మనసు ఒకటే!
మనసు, బుద్ధి, చిత్, అహంకారంతో కూడినది- అంతఃకరణ. దీన్ని శుద్ధి చేయాలంటే, సంస్కరించాలి. మానవ దేహం అన్నింటి సమాహారం.
ఇందులో పరమాత్మ ఉన్నాడని అతడు గ్రహించి వ్యవహరించాలి. పవిత్రత ఉండటం, లేకపోవడం అనేవి కేవలం మనోభావాలు. దోషపూరితమైనవాటినీ దోష రహితంగా చూసేది మనసే. దైవానికి అర్పించే పదార్థాల పరిధిని గుర్తించాల్సింది, వాటి యథార్థ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాల్సింది భక్తహృదయమే!
సకల చరాచర సృష్టి- పంచభూతాత్మక మయం. దీనికి చిహ్నంగా భగవంతుడికి చేసే అర్చన పంచోపచార పూజ. భక్తుడు పృథ్వీతత్వంతో గంధాన్ని, వాయుతత్వంతో ధూపాన్ని, అగ్నితత్వంతో దీపాన్ని సమర్పిస్తాడు. అలాగే జలతత్వంతో అర్ఘ్యం, ఆకాశతత్వంతో పుష్పం స్వామికి అర్పిస్తాడు.
దైవంలో లేనిది, దైవం కానిది ఏదీ లేదు. పరమాత్మ పరిపూర్ణుడు. ఆయన సర్వజ్ఞత్వం, స్వతంత్రత, అనంతశక్తి తత్వాలతో భాసిల్లుతుంటాడు. ఆ మహాపూర్ణ స్వరూపానికి సమర్పించడానికి మనిషి వద్ద ఏదీ లేదు. చేతులు జోడించి శరణాగతి వేడటమే ఏకైక మార్గం.
వస్తుదోషం, కర్మలోపం లేని కార్యం ఏదీ ఉండదు. విధి నిర్వహణలో లోపాలు దొర్లడమూ సహజం. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మయజ్ఞం చేసినా, ఏవో కొన్ని కర్మ లోపాలు తప్పవు. యజ్ఞయాగాదుల్లో చోటుచేసుకునే లోపాలకు ప్రాయశ్చిత్త హోమాలు ఉన్నాయి. వాటిలోనూ దొర్లే చిన్నపాటి తప్పిదాలకు క్షమాపణ అర్థిస్తారు భక్తులు.
ఈశ్వరారాధనలో వస్తువు పవిత్రత కన్నా పావనమైన భావనే మిన్న. శ్రద్ధగా కర్మల్ని ఆచరించాలి. బుద్ధిని వికసింపజేసి, సారాన్ని గ్రహించాలి. విగ్రహారాధన వల్ల నిగ్రహం కలుగుతుంది. భక్తి, శ్రద్ధ, ప్రపత్తులు దీని ఫలాలు. వీటితో భావశుద్ధికి బీజం పడుతుంది.
ఆరాధన మార్గంలో తాత్విక దృష్టి, తార్కి కత, శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉన్నాయి.‘నా ముఖాన్ని అవలోకించేందుకు అద్దం ఉపాధి (ఆధారం). నన్ను నేను తెలుసుకునేందుకు దైవం ఉపాధి’ అనే సత్యాన్ని భక్తుడు అవగతం చేసుకోవాలి. ‘నాలోని పరమాత్మను నేను గుర్తించాలంటే, అందరిలోనూ ఆయనను దర్శించడాన్ని ముందుగా అలవరచుకోవాలి’ అని గ్రహించి మసలాలి. ఎదుటివారి లోపాల్ని ఎంచకుండా వారిని సంస్కరించడానికే ప్రయత్నించాలి. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. భావ శుద్ధి ఉంటే, భావ సిద్ధి లభిస్తుంది. ఏ భావనతో అర్చిస్తే, పరమాత్మ ఆ భావననే సిద్ధింపజేస్తాడు. ఏ రూపంలో భావిస్తే, ఆ రూపంలోనే స్వామి దర్శనమిస్తాడు.
ఒక భక్తుడు ఆధ్యాత్మిక దృష్టితో విష్ణు సాన్నిధ్యం కోరాడు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. సంబారాలు సమకూర్చాడు. రుత్విజులకు ఆహ్వానం పలికాడు. అంతలోనే అకాల మరణం పొందాడు. యజ్ఞసంకల్పం నెరవేరలేదన్న బాధ అతడిది. అయినప్పటికీ, ఆ భక్తుడికి విష్ణుపదం ఆహ్వానం పలికిందని పురాణ కథనం. ‘నువ్వు తలపెట్టిన కార్యంతో పని లేదు, నీలో వెల్లివిరిసిన భావనే ప్రధానం’ అనేది అందులోని అంతరార్థం.
(()))
సూర్యుని --- ద్వాదశ రూపాలు
ఓంశ్రీమాత్రే నమః
1. ఇంద్రుడు :- స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.
2. ధాత :- ప్రజాపతియై భూతములను సృష్టించాడు.
3. పర్జన్యుడు:- తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.
4 త్వష్ట :- ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
5. పూష :- ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.
6. అర్యముడు :- దేవతారూపంలో వుంటాడు.
7. భగుడు :- ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.
8. వివస్వంతుడు :- ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు.
9.విష్ణువు :- శత్రువులను నాశనం చేస్తాడు.
10. అంశు మంతుడు :- గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
11. వరుణుడు :- జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.
12. మిత్రుడు :- లోకాలలో మేలు చేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.
***
ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత',
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం- వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం- వివస్వంతుడు,
7. ఆశ్వయుజం- త్వష్ణ,
8. కార్తీకం- విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం- భగుడు,
11. మాఘం- పూషుడు,
12. ఫాల్గుణం- పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం...
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు:- 1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు,3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి,
6. బృహతి, 7. ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రేపటినుంచి మరోకథ చదవండి
Comments
Post a Comment