****
*రోజూ మీకోసంచేస్తున్న సాహితీ యజ్ఞం*
*చ* అడుగరే ఈ మాట అతని మీరందరును
యెడయని చోటును యిగరించు బ్రియము II
గరిమ నొరసితేను కలగు మతి
సరపులు లేనిచోట చలము వెగ్గలమౌను
నొరసి పెసగే చోట నుమ్మగిలు వలపు II
బలిమి చేసేచోట పంతము రాదు
అలుకచూపేచోట అమరదు వినయము
చలివాసి ఉండేచోట చెండిపడు పనులు II
అనుమానమైన చోట అంటదు రతి
యనసినాడు వేంకటేశుడు నన్నింతలోనే
తనివిలేనిచోట దైవారు కోర్కెలు ఇఇ❄
సంపుటము: 5-353
సుదతులు దంచెదరోలాల
వలపులు తగ నించో లాల
కనుసన్నలనెడు రోఁకండ్లను
కన్నెలు దంచెదరోలాల
కొంగులు దూలఁగనోలాల
అంగనలందరు నతివేడుకతో
సంగడి దంచెదరోలాల
పల్లవ పాణులకోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు-
లొల్లనె దంచెదరోలాల
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతిఁ దేలుచుఁ గోనే-
టప్పనిఁ బాడెదరోలాల.
రేకు: 0349-02
సంపుటము: 4-286
మోదముతోడుత మొక్కరొ జనులు
అరదముపై హరి యలవాఁడె
యిరుదెసల నున్నారు యిందిరయు భువియు
పరఁగ బగ్గములు పట్టరో జనులు
పాడేరు గంధర్వపతులెల్లా
వేడుకతో వీఁడె విష్వక్సేనుఁడు
కూడి యిందరునుఁ జూడరో జనులు
భావింప బహువైభవము లవే
గోవిందనామపుఘోషణ లిడుచును
దైవం బితఁడని తలఁచరో జనులు.
1. రచన: అన్నమాచార్య
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ||
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ||
సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ||
వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||
--((*))--
2. రచన: అన్నమాచార్య
రాగం: బేహాగ్
తాళం: ఆదితాళం
నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ||
మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ |
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో ||
జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ |
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ||
ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప |
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో ||
--((*))--
3. రచన: అన్నమాచార్య
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ||
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ||
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి |
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ||
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ |
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు |
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ||
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే |
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ||
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి |
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ||
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను |
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ||
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి |
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ||
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి |
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ||
హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||
4. రచన: అన్నమాచార్య
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు ||
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు |
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ||
అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు |
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ||
కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద గరు-
ణించి తన యెడకు రప్పించిన వాడు |
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ||
--((*))--
తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ||
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే ||
కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ||
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర – అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ||
అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే |
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ||
కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ||
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ||
--((*))--
శ్రింగారరాయఁడ నీకు శ్రీపతినిధానము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ హారాలు రత్నాలమేడలు
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవెంకటేశ నీభావమే భోగము.
సాధించెనే ఓ మనసా
ఆరభి రాగం-ఆది తాళం
ఘనరాగ పంచరత్న కీర్తన
పల్లవి:
సాధించెనే ఓ మనసా !!సా!!
భోదించిన సన్మార్గ వచనముల
అనుపల్లవి:
బొంకుచేసి తా పట్టిన పట్టు !!సా!!
1. సమయానికి తగుమాటలాడెనే
దేవకీ వసుదేవుల నేగించి నట్టు !!సమ!!
2. రంగేశుడు సద్గంగా జనకుడు
సంగీత సంప్రదాయకుడు !! సమ!!
3. గోపిజన మనోరధ మొసంగలేకనే
గేలియు జేసేవాడు !!సమ!!
4. వనితల సదా సొక్క జేయుచును
మ్రొక్కజేసే పరమాత్ముడదియు గాక,
యశోద తనయుడంచు ముదంబునను
ముద్దు పెట్ట నవ్వు చుండు హరి !!సమ!!
5. పరమ భక్త వత్సలుడు
సుగుణపారావారుండా జన్మమ
నఘుడి కలి భాదల డీర్చువాడనుచు
నే హృదంబుజమున జూచుచుండగా !!సమ!!
6. హరే! రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష
శేషశెయన పరనారీ సోదరాజ విరాజ తురగరాజ
రాజనుత నిరామయాప ఘన సరసీరుహ దళాక్ష
యనుచు వేడుకున్నను తాబ్రోవకను !!సమ!!
7. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంభరధర లసన్మకుట కుండల విరాజిత
హరేయనుచునే పొగడగా త్యాగరాజగేయుడు
మానవేంద్రుడైన రామచంద్రుడు !! సమ !!
8. సద్భక్తుల నడతలిట్లనెనే
అమరికగా నా పూజ కొనెనే, అలుగ వద్దననే
విముఖులతో చేరబోకుమనెనే, వెతగల్గిన తాళుకొమ్మనెనే,
దమశమాది సుఖదాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంతరాకనే !!సమ!!
వెనుబలమిదివో విష్ణుకథ ||
వేదంబయినది విష్ణుకథ |
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ |
విదిత పావనము విష్ణుకథ |
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ||
వెల్లి విరియాయె విష్ణుకథ |
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ ||
శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||
విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలి చిటు నమ్మినవరములు |
నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
కుమతంబులు బహుకుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు |
విమలములే కాని వితథముగావు ||
దావతులు కపటధర్మములు |
శ్రీవేంకటపతి సేవించునేవలు |
పావనము లధికభాగ్యపుసిరులు ||
అన్నమయ్య సంకీర్తన
అయ్యో వారిభాగ్య మంతేకాక
నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు !!
॥పల్లవి॥
దేవుఁడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండఁగా
సోవల నాస్తికునకు శూన్యమై తోఁచు
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా
కావరపు జీవునకు గతుగతుకే!!
॥అయ్యో॥
హరి శరణంటేఁ గాచే అట్టియుపాయమే వుండఁగ
విరసానకుఁ గర్మమే వెగ్గళమాయ
పరగ నరులకెల్లాఁ బట్టపగలై యుండఁగా
అరయఁ గొన్ని జంతుల కంధకారమాయను!!
॥అయ్యో॥
యిక్కడ శ్రీవేంకటేశుఁ డెదుటనే వుండఁగాను
అక్కటా మూఢున కెందు ననుమానమే
మక్కువ నింతా నమృతమయమైనఁ గోడికి
తెక్కులఁ దవ్వఁ బొయ్యేది తిప్పపెంటలే!!
॥అయ్యో॥
((())))
అయ్యో వారిభాగ్యమెంతో అంటే వారి ప్రాప్తం. భాగ్యమునకు నోచుకోని వారు వెన్నచేతిలో వున్నా నెయ్యి యెక్కడున్నాదా అని వెదకుతూనే వుంటారు. పరమాత్మ ప్రస్ఫుటంగా దిక్కులన్నిటా నిండి వుండగా నాస్తికులకు శూన్యముగానే తోస్తుంది. వానలు బాగా కురిసే యేరు యెంత వ్యర్ధంగా పొర్లిపారినా గర్వంతో నీటిని పట్టి దాచుకోని అహంకారులైన జీవులకు చివరికి మిగిలేది నాకి నాకి నోరుతడుపు కోవడమే మిగులుతుంది. హరిని శరణని సుఖంగా వుండటం యెంత తేలికైన వుపాయము కాని హరిపట్ల విరక్తి కలవారికి గర్వమే అధికమౌతుంది.
బప్పుగా నరులకు పట్టపగలే ఉండగా తెలిసికొన్ని అంధకారమనే మాయలో గడుపుతారు. ఇక్కడ శ్రీవేంకటేశుడి ఎదుటనే వుండగాను అక్కడ మూర్ఖుడి అనుమానమే. మక్కువతో అమృతం త్రాగించబోయినా గర్విష్ఠి అయిన యువకుడికి అది పట్టక పెంటదిబ్బల్లో తిరుగుతుంటాడు అంటు అన్నమయ్య కీర్తించాడు.
((()))
6. రచన: అన్నమాచార్య
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ||
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||
కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||
పరమ యోగులకు పరి పరి విధములపరమొసగెడి నీ పాదము |తిరువేంకటగిరి తిరమని చూపినపరమ పదము నీ పాదము ||
(())
శ్రీ శ్రీనివాస గానామృతం
దైవానుగ్రహముతో :- సాహిత్యం, సంగీతం, గానం. డా కట్ల. శ్రీనివాసాచార్యులు
భక్తి లేదు నాకు ప్రభువిరక్తి లేదు నాకు
శక్తి హీనుడనన్నిట శరణంటి ఏలుకో హరీ!!
బంధములలోన చిక్కి బడలికతో యున్నాను
బందీనై ఇంద్రియముల బానిసైనాను
మందమతినై నిను మరచి మనుచున్నాను
ఇందిరనాథ నన్నిక నీవే రక్షించవే!!
అరిశడ్వర్గములు నన్ను ఆవహించే యున్నవి
పరిపరివిధముల మనసును పాడుజేయుచున్నవి
కొరగాని కోర్కెలెన్నో కొనసాగుచునే యున్నవి
నరాధముడనైతీ హరీ నన్ను ఆదుకోవే!!
కల్ముశములెన్నో మదిలో కొనసాగుచు యున్నవి
పలు కోర్కెల వెంట మదిపరుగు బెడుచున్నది
నిలిచియుంటి నిష్ఠతోడ శ్రీనివాసా దాసుడనై
తెలిసిన దిక్కెళ్ళ నీవే తగురీతి బ్రోవవే!!
(()))
శ్రీ అన్నమాచార్య సంకీర్తన
రేకు: 257-2
సంపుటము: 3-327
రేకు రాగము: లలిత.
పుట్టినమొదలు నేను పుణ్యమేమీఁ గాననైతి
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా!!
॥పల్లవి॥
కామినులఁ జూచిచూచి కన్నులఁ గొంతపాపము
వేమరు నిందలు విని వీనులఁ గొంతపాపము
నామువారఁ గల్లలాడి నాలికఁ గొంతపాపము
గోమునఁ బాపము మేనఁ గుప్పలాయ నివిగో!!
॥పుట్టి॥
కానిచోట్లకు నేఁగి కాఁగిళ్ళఁ గొంతపాపము
సేన దానాలందుకొని చేతులఁ గొంతపాపము
మానని కోపమే పెంచి మతిఁ గొంతపాపము
పూని పాపములే నాలోఁ బోగులాయ నివిగో!!
॥పుట్టి॥
చేసినట్టివాఁడఁగాన చెప్ప నీకుఁ జోటులేదు
దాఁసుడ నే నైతిఁ గొన దయ దలఁచితివయ్య
యీసరవులెల్లఁ జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయఁబోయఁ బనులు!!
॥పుట్టి॥
భావం:-
పుట్టినది మొదలు ఏ పుణ్యమూ చేయలేదు. ఇందిరానాథా నన్నిక ఎట్లు రక్షిస్తావయ్యా. కామ భావనతో స్త్రీలను చూచి చూచీ నా కన్నులు కొంత పాపము మూటగట్టుకొన్నాయి.
నాలుక పిడుచకట్టు కొన్నా అబద్ధములాడి ఆడీ నా నాలుక కొంత పాపము చేసింది. ఇదిగో యీ విధంగానే నా పాపము కుప్పలా పేరుకుపోయింది.
వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి వెళ్ళి నా కాళ్లు కొంత పాపము పోగుచేసికొనినవి. పట్టకూడని దానములను పట్టిపట్టీ నా చేతులు కొంత పాపము అంట కట్టుకొన్నాయి.
మానుకోలేని కోపమును పెంచి పోషించి నా మనస్సు కొంత పాపము చేసింది. ఇదిగో ఈ విధంగా పూని పనిలేక చేసిన పాపాలు నాలో రాశివలె అయినవి. ఇదీ అదీ అని లేకుండా అనేక పాపాలను చేశాను కాబట్టి నీకు చెప్పే చోటు కూడా లేదు. అందుకే నిన్ను శరణు జొచ్చి నీ దాసుడనయ్యాను. నన్ను దయదలచవయ్యా నా యీ పద్దతులు తెలిసి కూడా నిన్నేమని ప్రార్థించగలను శ్రీవేంకటేశ్వరా అయిందేదో అయింది ఇక నీవే దిక్కు అంటు అన్నమయ్య కీర్తించాడు.
*శ్రీ అన్నమయ్య సంకీర్తన*
🕉️🌞🌏🌙🌟🚩
గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రేకు: 225-4
సంపుటము: 3-141
రేకురాగము: వసంతవరాళి.
నారాయణుఁడీతఁడు నరులాల
మీరు శరణనరో మిమ్ముఁ గాచీని!!
తలఁచిన చోటను తానే వున్నాఁడు
వలెననువారి కైవసమెపుడు
కొలచెను మూఁడడుగుల జగమెల్లాను
కొలిచినవారిఁని చేకొనకుండునా!!
యెక్కడఁ పిలిచినా ఏమి అని పలికి
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణఁచి రక్షించు జగములు
దిక్కని నమ్మినఁ తిరముగా నేలఁడా!!
చూచిన యందెల్ల చూపును రూపము
వోచికఁ పొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుఁడే యితఁడట
చేచేతఁ పూజింప సేవలు గొనఁడా!!
*నారాయణుఁడీతఁడు నరులాల..*
భావము:-
- శ్రీ అమరవాది సుబ్రమణ్య దీక్షితులు గారు
శ్రీమన్నారాయణుని భక్తితో కీర్తిస్తూ అన్నమాచార్యులవారు శరణాగతితో ఈ కీర్తన వినిపిస్తున్నారు. భక్తులు ఆయనను ఎక్కడ స్మరిస్తే అక్కడే వున్నాడు. తనే కావాలన్న వారికి తాను లొంగివుంటాడట.
భక్తి అనే తాడుతో తప్ప యెన్ని తాళ్ళు తెచ్చినా ఆయన్ని కట్టలేమని యశోద తెలుసుకొన్నది. దుర్యోధనుడూ తెలుసుకొన్నాడు. దిక్కని నమ్మినవారు యెక్కడికి పిలిస్తే... అక్కడికి వస్తాడు. ఎక్కడ చూచిన అక్కడే తన రూపం చూపే ఆయనే... మన శ్రీవేంకటేశ్వరుడు "చేచేత పూజింప సేవలు గొనడా?” అంటున్నారు.
ఓ నరులారా! ఈ మహానుభావుడే నారాయణుడు. మీరు ఈయనే దిక్కని శరణు వేడండి. మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు.
1. ఈ దేవదేవుడు తలచిన చోటనే వున్నాడు. తానే వున్నాడు. స్వయంగా తానే వస్తాడు. తనను ఎవరు ప్రేమిస్తే వారికి కైవసమై (లొంగిపోయి) వుంటాడు. సమస్త భువనాలను మూడంటే మూడు అడుగులు (పాదాలు) పెట్టి కొలిచిన వాడు, కొలిచిన వారిని (పూజించినవారిని) చేకొనకుండునా?
2. ఈ సర్వేశ్వరుడు ఇక్కడా, అక్కడా అని చూడడు. ఎక్కడకు పిలిచినా వస్తాడు. రావటమే కాదు, ఏమి... యెందుకు పిలిచావు అని మరీ కనుక్కొంటాడు. "మొక్కిన మన్నించు మునుముగను"... (అంటే... అంత హడావుడిగా యెందుకు పిలిచావని విసుగుకొనకుండా వరుసగా మన్నిస్తాడట...). హిరణ్యకశిపుని వంటి రాక్షసులు బారినుండి కూడా తన భక్తులను కాపాడుటకు, వచ్చి రక్షిస్తాడని ఋజువయింది కదా! జగద్రక్షకుడు దిక్కని నమ్మినవారిని, తిరముగా నేలడా? (స్థిరముగా రక్షించడా?)
3. ఈ శ్రీహరి 'ఇందుగలడందులేడని సందేహము వలదు'... అన్నట్లు తన రూపము చూచిన యందెల్ల చూపును. ఓచిక పొగడిన (ఉచితమైన రీతిగా కీర్తించిన) ఆ కీర్తించిన వారి 'నోటి' యందే వుంటాడు. అంటే పలుకులోన పలుకు దైవము అన్నమాట. అటువంటి ఈ శ్రీమన్నారాయణుడు వేరెవరోకాదు, యేచిన శ్రీవేంకటేశ్వరుడే (అతిశయించిన తిరుమలాధీశుడే). మరి... చేచేత పూజింప (చేతులారా పూజిస్తే) మన సేవలు గొనడా? (తప్పక స్వీకరిస్తాడు).
Comments
Post a Comment