ప్రాంజలి ప్రభ..20/04
◆◆◆◆◆◆◆◆◆
👇
మనకిప్పుడు స్ఫురణకు వచ్చే జ్ఞాపకాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి ?
💫 మన మనసులో నుండి వస్తున్నాయి.
⚜️ అవి స్ఫురణకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నాయి ?
💫 మన మనసుతోనే ఉంటున్నాయి.
⚜️ స్ఫురణకు వచ్చిన జ్ఞాపకం వలన ఏమి జరుగుతుంది ?
💫 మనసుకు సంతోషమో, దుఃఖమో కలుగుతుంది.
⚜️ అప్పుడు సంతోషం, దుఃఖం ఎక్కడ ఉంటున్నాయి ?
💫 అవి మన మనసుతోనే ఉంటున్నాయి.
⚜️ అంటే మనసు ఏమి అనుభవిస్తుంది ?
💫 సంతోష, దుఃఖాలను అనుభవిస్తుంది.
⚜️ మనసు ఎందుకు సంతోష, దుఃఖాలను అనుభవిస్తుంది ?
💫 జ్ఞాపకాలు గుర్తుకు రావడం వలన.
⚜️ మనలోనేవున్న జ్ఞాపకాలు గుర్తుకు రాకముందు ఎందుకు బాధించటంలేదు ?
💫 మనసుకు గానీ, జ్ఞాపకానికి గానీ మనను బాధించే శక్తి లేదు కనుక !
4వ అధ్యాయము [స్వాత్మ నిరూపణము]
చేరాల్సింది లేదని తెలిస్తే గమనం ఉండదు !
నేను దేహధారిని కాను అన్న అవగాహనే దేహవిముక్తి. నిర్గుణమైన మనసుకు ఇక విమోచనంతో పనేలేదు. ముక్తుడైన వ్యక్తికి ఇక మోక్షభావన ఉండదు. మనసులో ద్వంద్వం పోవడమే ముక్తి. శుద్ధమైన మనసు సత్యాసత్యాల ప్రస్తావన లేని సన్మాత్రంగా ఉంటుంది. తాను ఏదీ కాదని తెలిస్తే గర్భం ఉండదు. తానేదీ చేరాల్సింది లేదని తెలిస్తే గమనం ఉండదు. చైతన్యంలో నేను... నేను అని సదా స్మరిస్తూ భాసించే అస్మిత స్వానుభవంతో అనుభవంలోకి వస్తే అతను ఇక బ్రహ్మముతో సమానమే !
ప్రాంజలి ప్రభ వారు చారుపై ఇలా చర్చిం....చారు!!
వేడిగా ఉన్న చారుని ఏమంటాం?
వేడిచారు కదా! దాన్ని కాస్త సరదాగా ఏడిచారు అందామా?
అలానే ఇంకొన్ని....సరదాసరదాగా
చారుని పిలవాలంటే ఎలా పిలవాలి... సింపుల్ దా ..చారు
చారు చల్లగా ఉంటే...కూల్ +చారు...కూల్చారు
రెండు రకాల చారు ఉంటే...దో+ చారు...దోచారు
చారు లో ఒక టాబ్లెట్ వేస్తే... పిల్ +చారు...పిల్చారు
చారు కి ఫోన్ చెయ్యాలంటే ... కాల్ +చారు...కాల్చారు
చారులో కొంచం నూనె వేస్తే ... తేల్ + చారు...తేల్చారు
చారుని కేకలేస్తే... అరి+చారు...అరిచారు
చారులో పొడి వేస్తే... పొడి+చారు...పొడిచారు
చారుతో యుద్ధం చేస్తే వార్+చారు ...వార్చారు
మడి కట్టుకుని చారు పెడితే మడి+చారు...మడిచారు
ఇలా చాలా రకాల గూఢా చారులున్నాయన్న మాట
చారుల్లో ఇన్ని రకాలున్నాయని మాకోసం పొందుపరి"చారు". ధన్యవాదాలు.
***
*నాన్నలందరికీ_అంకితం*
బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.
“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.
“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.
దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.
“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా
“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.
మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.
అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.
బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.
“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.
“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.
“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.
ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.
ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.
ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.
మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.
కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.
నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.
నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.
“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.
నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.
ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.
“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.
“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.
“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.
“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.
ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.
“అమ్మ దేవుడి అంశ అయితే,
నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
పంచమ స్కంధము - ఇరువది ఆరవ అధ్యాయము
పలువిధములగు నరకగతుల వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఈ లోకమున మానవుడు ఏ ప్రాణులను బాధించెనో, పరలోకమున ఆ జీవుడు రురువు అను భయంకర జీవులచే అదే విధమున హింసింపబడును. కనుక, దీనిని రౌరవము అనియందురు. రురువు అను ప్రాణి సర్పము కంటెను క్రూరస్వభావముగలది.
ఇతరులను మోసగించి, కేవలము తన పొట్టను మాత్రమే నింపుకొనిన వ్యక్తి, మరణానంతరము మహారౌరవము అను నరకమున పడును. అచట పచ్చిమాంసమునే భుజించెడి రురువులు అను ప్రాణులు ఈ జీవుని మాంసమును భక్షింతురు.
క్రూర స్వభావులైన కొందరు మనుష్యులు తమ దేహపోషణకై ప్రాణములతోనున్న పశువులను, పక్షులను నిర్దయతో కాల్చెదరు. అట్టివారిని రాక్షసులు గూడ ఏవగించుకొందురు. ఆ జీవులను యమదూతలు, కుంభీపాకము అను నరకమునకు కొనిపోయి, మసలుచున్న నూనెలో వేయించెదరు.
ఈ లోకమున మాతాపితరులను, బ్రాహ్మణులను, వేదములను ద్వేషించువానిని, యమదూతలు కలసూత్రమను నరకమునకు కొనిపోవుదురు. దాని చుట్టు కొలత పదివేల యోజనములు. దాని భూభాగము తామ్రమయము. ఆ జీవుడు పైన సూర్యతాపముచే, క్రింద అగ్ని కీలలచే దహింపబడుచుండును. అచటికి చేరిన పాపియగు జీవుడు ఆకలి దప్పులచే వ్యాకులుడగును. వాని శరీరము బయట, లోపల గూడ తపించి పోవుచుండును. అశాంతికి లోనై ఒకసారి కూర్చొనును, ఒక్కొక్కసారి పరుండును, ఒక్కొక్కసారి కదలు చుండును, ఒక్కొక్క సారి నిలబడును. ఒక్కొక్కసారి ఇటునటు పరుగెత్తును. ఆ నరపశువుయొక్క శరీరముస ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు దుర్గతుల పాలగును.
ఏవిధమైస సంకటస్థితి ఏర్పడకున్ననూ వేదవిహితమైన మార్గమును వీడి ఇతరపాషండ మతములను ఆశ్రయించిన జీవుని యమదూతలు అసిపత్రవనము అను నరకమునకు గొనిపోయి, కొరడాలతో కొట్టుదురు. ఆ దెబ్బలనుండి తప్పించుకొనుటకై అతడు ఇటునటు పరుగెత్తును. అప్పుడు అతని దేహమును ఆ తాళవనము నందలి కత్తులవలె నున్న ఆకులు చీల్చివేయును. ఆ ఆకులు రెండువైపులను పదునుగలిగి యుండును. అయ్యో! చచ్చితిని అని అరచుచు అతడు అడుగడుగున మూర్ఛితుడై పడిపోవును. స్వధర్మమును వీడి పాషండమార్గమును అనుసరించువాడు తన దుష్కర్మల ఫలమును ఇట్లు అనుభవింపవలసి వచ్చును.
ఈ లోకమున రాజు లేక రాజప్రతినిధి, నిరపరాధికిగాని, బ్రాహ్మణునికిగాని శరీర దండన విధించినచో అట్టి మహాపాపి మరణానంతరము సూకర ముఖము అను నరకములో పడును. అచట మహాబలశాలులైన యమదూతలు అతని అవయవములను చెఱకుగడను వలె పిండుదురు. అప్పుడతని ఈ లోకమున బాధింపబడిన నిరపరాధులవలెనే తానును ఆర్తనాదము చేయుచు మూర్ఛితుడగును.
ఈ లోకమున మానవుడు నల్లులు మొదలగు ప్రాణులను హింసించుచుండును. అట్టి వాడు అంధకూపము అను నరకములో పడును. నల్లులు, దోమలు మున్నగు ప్రాణులకు రక్తమును పీల్చుట సహజ ప్రవృత్తిగా భగవంతుడు నిర్ణయించెను. పైగా ఇతరులను హింసించుచున్నాను అను జ్ఞానము వాటికి ఉండదు. ఆ నరకముస పక్షులు, మృగములు, సర్పములు మొదలగు ప్రాణులు అతనిని అన్నివిధముల పీడించును. ఫలితముగా అతడు అంధకూపము అను నరకమున పడును. అచ్చట అతనికి నిద్రగాని, మనశ్శాంతిగాని ఉండదు. రోగగ్రస్తుడైన జీవునివలె అతడు ఆ అంధకారకూపమున పడి దొర్లుచుండును.
ఈ లోకమునందు పంచమహాయజ్ఞములను చేయనివాడు, ఇతరులకు పెట్టకుండా తానే భుజించువాడు కాకితో సమానుడు. అతడు పరలోకమున కృమి భోజనము అను నికృష్టలోకమున పడును. అది లక్షలాదియోజనముల వైశాల్యముగల పురుగులకుండము. అది బ్రతికియున్నప్పుడు యజ్ఞయాగాది కర్మలను చేయుటగాని, ఇతరులకు దాస ధర్మములను చేయుటగాని ఎఱుగక, పైగా తన పాపములకు ఫ్రాయశ్చిత్తమును గూడ చేసికొని యెరుగని కారణమున కృమిభోజనము అను నరకమున బడి తాను పురుగై తన కంటె బలమైన పురుగులచే బాధింపబడుచుండును. తానును తనకంటె బలహీనమైన పురుగులను తినుచుండును.
రాజా! ఈ లోకమున బ్రాహ్మణుని లేదా ఇతరుల బంగారము, రత్నములు, ధనాదులను దొంగతనము చేయువానిని తనకు ఎట్టి అవసరము లేకున్నను ఇతరుల సంపదలను దోచుకొనువానిని, యమకింకరులు సందంశము అను నరకములో పడవేయుదురు. అచట బాగుగా కాలుచున్న ఇనుప గుండ్లతో బాధించెదరు. అంతేగాదు, అతని తోలు ఒలిచెదరు.
ఈ లోకమునందు ఏ పురుషుడైన చేరదగని స్త్రీతోను, ఏ స్త్రీయైనను చేరదగని పురుషునితోను సంగమించినచో మరణానంతరము ఆ జీవుని యమదూతలు తప్తసూర్మి అను నరకమున పడవేసి, కొరడాలతో కొట్టుదురు. పురుషుని కాలుచున్న ఇనుప స్త్రీమూర్తితోను, స్త్రీని కాలుచున్న పురుషమూర్తితోను ఆలింగనము చేయింతురు.
(పంచమ స్కంధంలోని ఇరువది ఆరవ అధ్యాయము ఇంకనూ కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
పంచమ స్కంధము - ఇరువది ఐదవ అధ్యాయము
సంకర్షణ దేవుని వర్ణన - స్తుతి
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ శుక ఉవాచ
25.1 (ప్రథమ శ్లోకము)
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! పాతాళమునకు క్రింద ముప్పదివేలయోజనముల దూరమున అనంతుడు అను పేరుతో ప్రసిద్ధిగాంచిన శ్రీహరియొక్క తమోగుణ ప్రధానమైన నిత్యకళ గలదు. అది అహంకారరూపము అగుటవలన ద్రష్ట-దృశ్యములను లాగి ఒకటిగా చేసెను. అనగా ద్రష్ట అనగా జీవుడు. దృశ్యమనగా చూడబడే పదార్థము. జీవుడు ప్రదార్థమునందు అహంకారము ద్వారా నాది అను సంబంధమును జోడించుకొనును. దీననే సంకర్షణము అందురు. అందువలన పాంచరాత్ర ఆగమమును అనుసరించు భక్తులు అతనిని సంకర్షణుడు అని పిలుతురు.
25.2 (రెండవ శ్లోకము)
భగవానుడైన అనంతునకు వేయితలలు గలవు. వాటిలో ఒక దానిపైన ఈ భూమండలము మోపబడియున్నది.అది ఆవగింజవలె కనబడును.
ప్రళయకాల సమయము ఆసన్నమగునప్పుడు ఇతనికి ఈ విశ్వమును ఉపసంహరింపవలెనను సంకల్పము కలుగును. మనోహరమైన ఈతని భ్రూమధ్యభాగమున క్రోధవశమున తిరుగుచుండును. అందునుండి సంకర్షణుడు అను పేరు గల రుద్రుడు ప్రకటమగును. పదకొండు వ్యూహ సంఖ్యలు గల వీరికి అందరికి మూడు నేత్రములుండును. వీరు అందరును వాడియైన త్రిశూలములను ధరించి యుందురు.
25.4 (నాలుగవ శ్లోకము)
సంకర్షణ భగవానుని పాదపద్మముల యొక్క గుండ్రని చక్కని అరుణ వర్ణనఖములు మణి పంక్తులవలె దేదీప్యమానములై యుండును. అన్య భక్త ప్రవరులతో గూడి పెక్కుమందినాగరాజులు, అనన్య భక్తి భావముతో ప్రణమిల్లుదురు. అప్పుడు వారి కుండలముల కాంతి కపోలములపై వెల్లి విరియుచుండగ వారి ముఖారవిందముల ప్రతిబింబములు ఆ నఖమణులపై ప్రభవించును. ఆ సమయమున వారి మనస్సులు ఆనందముతో నిండి పోవును.
25.5 (ఐదవ శ్లోకము)
సంకర్షుణునియొక్క పొడవైన భుజములు వెండిస్తంభముల వలె శ్వేతవర్ణము గలిగి వలయాకారమున విలసిల్లుచుండును. పలువురు నాగరాజకన్యలు తమ కోరికలు నెరవేరుటకై అందమైన ఆ భుజములపై అగరు, చందనము, కుంకుమ పంకములతో పూయుచుందురు. అతని అంగస్పర్శచే వారి హృదయములయందు ప్రేమభావము ఉప్పొంగును. అప్పుడు వారు మదన విహ్వలలై ఎర్రని పద్మములవంటి నయనములుగల వారి ముఖారవిందములయందు సిగ్గుదొంతరలు వెల్లి విరియుచుండగా చిరునవ్వులను చిందించుచుందురు.
25.6 (ఆరవ శ్లోకము)
అనంతగుణ సముద్రుడు, ఆదిదేవుడు ఐన ఆ అనంత భగవానుడు తన అసహనమును, రోషావేశములను బయట పడనీయక లోకములకు శుభములను చేకూర్చు చుండును.
25.7 (ఏడవ శ్లోకము)
దేవతలు, అసురులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు ఆ అనంత భగవానుని ధ్యానించుచుందురు. ఆయన నేత్రములు ప్రేమవిహ్వలములై, చంచలములై మనోహరముగా ఉండును. ఆయన తన మధుర వచనామృతముచే పార్షదులను, దేవయూధపతులను సంతోషపరచుచుండును. ఆయన శరీరముపై నీలాంబరము, చెవులలో ఒకే కుండలము విరాజిల్లు చుండును. ఆ స్వామి యొక్క బలిష్ఠమై అందముగానున్న భుజము నాగలి పై భాగమున మోపబడియుండును. ఉదార లీలామయుడైన ఆ సంకర్షణుడు మెడలో ధరించిన వైజయంతిమాల ఇంద్రుని ఐరావతముయొక్క కంఠమున దాల్చిన బంగారు గొలుసు వలె విరాజిల్లుచుండును. ఆయన కంఠమున ధరించిన తులసీమాలల పరిమళముచే ఆకర్షితములైన తుమ్మెదలు తీయని ఝంకారములచే వాటి శోభలను ఇనుమడింప జేయుచుండెను.
25.8 (ఎనిమిదవ శ్లోకము)
పరీక్షిన్మహారాజా! అనంత భగవానుడు తన మహాత్మ్యమును విని, ధ్యానించునట్టి ముముక్షువుల హృదయములయందు సాక్షాత్కరించును. అనాదికాలము నుండి కర్మవాసనలచే ఏర్పడిన సత్త్వరజస్తమోగుణాత్మకమైన అజ్ఞానమను వారి హృదయ గ్రంధిని వెంటనే ఛేదించును. ఒక మారు బ్రహ్మకుమారుడైన నారదుడు తుంబురుడను గంధర్వునితో గలసి బ్రహ్మ సభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించెను.
25.9 (తొమ్మిదవ శ్లోకము)
8వ శ్లోకములో వివరించినట్లు నారదుడు తుంబురుడను గంధర్వునితో గలసి బ్రహ్మ సభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించసాగెను
ఆ సంకర్షణ భగవానుని దృష్టిపడినంతనే జగదుత్పత్తి స్థితిలయములకు కారణమైన సత్త్వాది ప్రాకృత గుణములు తమంతట తామే కార్యమునందు సమర్థములు అగును. అతని స్వరూపము ధ్రువము అనగా అనంతమైనది. అకృతము అనగా అనాదియైనది. అతడొక్కడే నానారూపములు గల జగత్తును తనలో ధరించి యుండును. అట్టి సంకర్షణుని తత్ప్వమును ఎవరు ఎరుంగగలరు? (ఎవరికిని బోధపడదు)
25.10 (పదియవ శ్లోకము)
8వ శ్లోకములో వివరించినట్లు నారదుడు తుంబురుడను గంధర్వునితో గలసి బ్రహ్మ సభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించసాగెను
కార్యకారణరూపమైన ఈ జగత్తంతయు ఆ పరమ పురుషునిలోనే భాసించుచున్నది. తన భక్తుల చిత్తములను ఆకర్షించుటకై ఆ స్వామి తన పరాక్రమమును ప్రకటించుచు లీలలను నెఱపెను. అట్టి పరాక్రమమునే సింహము తనకు ఆదర్శముగా గ్రహించెను. అట్టి పరాక్రమముగల సంకర్షణుడు మాపైగల కృపచే తన విశుద్ధతత్త్వమయరూపమును ధరించెను.
25.11 (పదకొండవ శ్లోకము)
8వ శ్లోకములో వివరించినట్లు నారదుడు తుంబురుడను గంధర్వునితో గలసి బ్రహ్మ సభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించసాగెను
ఆ సంకర్షణుని నామమును విని అకస్మాత్తుగనైనను, పరిహాసముగానైనను ఉచ్చరించిన ఆర్తుని లేక పతితుని పాపములన్నియును వెంటనే నశించును. ముముక్షువులు అట్టి ఆదిశేషునిగాక, మరి ఎవ్వరిని ఆశ్రయింతురు?
25.12 (పండ్రెండవ శ్లోకము)
8వ శ్లోకములో వివరించినట్లు నారదుడు తుంబురుడను గంధర్వునితో గలసి బ్రహ్మ సభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించసాగెను
పర్వతములు, నదులు, సముద్రములు గల ఈ భూమండలము వేయి తలలుగల సంకర్షుణునియొక్క ఒక మస్తకముపై ఒకధూళికణమువలె పడియున్నది. ఆ స్వామి పరాక్రమము అనంతము. అవధి లేనిది. వేయినాలుకలు గలవాడెవ్వడైనను సర్వవ్యాపకుడైన ఆ పురుషోత్తముని పరాక్రమలీలలను లెక్కింప జాలడు.
8వ శ్లోకములో వివరించినట్లు నారదుడు తుంబురుడను గంధర్వునితో గలసి బ్రహ్మ సభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించసాగెను
వాస్తవముగా ఆ అనంతుని వీర్యము, గుణములు, ప్రభావములు, అవధులు లేనివి. అట్టి స్వతంత్రుడు ప్రభావశాలియైన ఆ సంకర్షణుడు తన మహిమచే సమగ్రభూమండలముయొక్క మూలమునకు చేరి, సకలలోకముల ఉనికిని కాపాడుటకై ఈ భూమిని అవలీలగా మోయుచున్నాడు.
పరీక్షిన్మహారాజా! భోగములను, సుఖములను కోరుకొనునట్టి పురుషుల గతులను వారివారి కర్మలను అనుసరించి, భగవంతుడు నిర్ణయించును. నేను మా గురువుగారి వలన వినిన విషయములను యథాతథముగాా నీకు వినిపించితిని.
మనుష్యుడు తన ప్రవృత్తికి తగిన ధర్మకార్యములను ఆచరించుచుండును. వాటిని బట్టి అతనికి విలక్షణమైన ఉచ్చ-నీచగతులు ప్రాప్తించును. ఈ గతులు కూడా అనేకవిధములుగా ఉన్నవి. నీ ప్రశ్నకు సమాధానముగా నేను వాటిని అన్నింటిని నీకు వినిపించితిని. ఇంకను, నీవేమి కోరెదవో అడుగుము.
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు ఇరువది ఐదవ అధ్యాయము (25)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

Comments
Post a Comment