01-05-
] Mallapragada Ramakrishna: 01/5..*ప్రతిఒక్కరికీ మేడే శుభాకాంక్షలు*
పల్లవి
వైవిధ్యమే నైవేద్యం
కలియుగమే విశ్వాస వైద్యం
ప్రకృతిలోని ప్రతి స్పందన
మనసుకిచ్చే జీవన సాధ్యం ॥
చరణం – 1
ఎంత వైవిధ్యం ఈ ప్రకృతి
మనిషి బ్రతుకులో అదే శృతి
ఒకరికొకరు కలిసినపుడే
ఏకత్వమనే అందమైన ఆకృతి ॥
భావ విన్యాసాల మధ్యన
స్వీకారమే మధుర గీతి
అరుణరంగుల ఆకాశమంత
ఆవేశాలకూ ఒక ప్రతీకృతి ॥
చరణం – 2
ఇంకోవైపు నీలి నింగి
తెలిమబ్బుల శాంతి రాగం
మనలోన కారుణ్యాలకు
ప్రేరణనిచ్చే దివ్య భాగం ॥
దట్టమైన పచ్చదనమది
ధరణి మాత హృదయ కాంతి
చూడగానే చిగురించే
చైతన్యాల మధుర శాంతి ॥
చరణం – 3
వేగంగానో మంద్రంగానో
పరుగెత్తే జీవన నీరు
ఎదగాలనే మనసులోని
ఆశలకది నిత్య తీరు ॥
ప్రకృతే మానవుడై వెలిగి
మానవుడే ప్రకృతై నిలిచి
రెండిటికీ అవినాభావం
అనుబంధమై యుగయుగాల నిలిచి ॥
ముగింపు
వైవిధ్యమే జీవన సత్యం
విశ్వాసమే మానవ మంత్రం
ప్రకృతి మనసు కలిసినపుడే
పరవశమగు జీవన గానం ॥
****
: 01/5....101.|సుభాషితమ్|
శ్లో𝕝𝕝*శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్*౹
*శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్*౹౹
*ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః*౹
*నిగ్రహానుగ్రహేశక్తో గురురిత్యభి ధీయతే*౹౹
తా𝕝𝕝 *అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.*
*****
: (101)..నేటి కధ
గంగాతీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కపిలుడు సదాచార సంపన్నుడు. దైవచింతనాపరుడు. హనుమంతుడికి పరమభక్తుడు. అయితే, అతడు నిరుపేద. భార్యా పుత్రులను పోషించుకోవడానికికూడా నానా ఇబ్బందులు పడుతుండేవాడు.
రోజూ ఉదయమే గంగానదిలో స్నానం చేసి, నదిఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే, సాయంత్రానికి ఏ కూరగాయలో, ఆకుకూరలో కొనుక్కుని ఇంటికి వెళ్లేవాడు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది.
ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్లి స్నానం చేసి, జపానికి కూర్చున్నాడు. తదేకదీక్షలో జపంలో నిమగ్నుడై, కాలాన్ని మరచిపో యాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్య క్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణకుండలాలతో, చతుర్భుజాకారుడై, గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు తదితర వానరయోధులందరూ ఉన్నారు.
కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేకజలం నుంచి వాలసాగరం అనేనది పుట్టిం ది. కపిలుడు ఆ నదికి పూజించి, హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి, హనుమంతుడిని స్తోత్రపాఠాలతో ప్రార్థించాడు. కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు. ‘వరం కోరుకో’ అన్నాడు హనుమంతుడు. భక్తిపారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు. హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికేచీకటిపడటంతో కపిలుడు ఇంటికిచేరుకున్నాడు.
ఉత్త చేతులతో ఇంటికివచ్చిన కపిలుడిని చూసి అతడిభార్య ‘అయ్యో! కనీసం ఆకుకూరైనా తేకపోయారు. ఈ పూట పిల్లలకు ఏం వండిపెట్టగలను. కూడు గుడ్డకు కటకటలాడుతున్నా, మీ జపతపాలు మీవేకదా!’ అని రుసరుసలాడుతూ పిల్లలకు మంచినీళ్లు తాగించి పడుకోపెట్టిం ది.
మర్నాడు తెల్లవారింది. కపిలుడు యథాప్రకారం గంగాతీరానికి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు. అతడి భార్య సణుగుడు ప్రారంభించింది. ‘ఎంత చెప్పినా వినరు కదా! మీ జపతపాల గోల మీదేగాని, కుటుంబం గురించి ఏనాడైనా పట్టిం చుకున్నారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండితిప్పల గురించి ఏమైనా ఆలోచించారా?’ అంది.
‘ఊరుకో! అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం. అన్నట్లు చెప్పడం మరచాను. నిన్న నాకు హనుమంతుడు
ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రసప్రన్నంగా ఉన్నాడోస్వామి! హనుమతో పాటు జాంబవతాదివానర వీరులందరూ కనిపించారు. నా జన్మ ధన్యమైంది. ఇంక నాకేం కావాలి’ అన్నాడు కపిలుడు.
‘ఔను! హనుమంతు డూ గొప్పవాడే, మీరూ ధన్యులే! మీ కుటుంబానికిమాత్రం దారిద్య్రం తప్పదు’ కినుకగా అంది కపిలుడిభార్య. ఆమె ఇంకా తన సణుగుడు కొనసాగిస్తుం టే వినలేక కపిలుడు ఇల్లు వదిలి, గంగాతీరం వైపు బయలుదేరాడు.
కుటుంబ పరిస్థితిపై కపిలుడికీ బాధగా నేఉంది. అయినా హనుమంతుడి మీదనేభారం వేసి, గంగలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానానికికూర్చున్నాడు.
అతడు తదేక ధ్యానంలో ఉండగా, హనుమంతుడు ప్రత్య ప్ర క్షమయ్యాడు. ‘కపిలా! ను వ్వు నా భక్తుడవు. నీకు, నీ కుటుంబానికి క్షేమ సౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటిపెరట్లో ని రేగుచెట్టు కింద ధనరాశుల బిందె పాతరవేసి ఉంది. దానిని తవ్వితీసి, నీ కుటుంబమంతా ఆనందంగా జీవించండి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి, జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు.
‘ఇదిమరీవిడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకే భక్తుని మీద దయ ఉంటే, ఈ రాతినేలను తవ్వి, ధనపు బిందెను తీసిఇవ్వవచ్చు కదా! శ్రీరాముడు వారధికట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనేమోసుకువచ్చాడని మీరు పురాణం చెబుతుంటారు. ఈమాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లో ని రాతినేలను మీరు తవ్వగలరా? నేను తవ్వగలనా?’ అందినిష్ఠూరంగా.
కపిలుడికిభార్య మాటలు బాధ కలిగించా యి. ‘పరమ కరుణామూర్తిఅయిన భగవంతుడు వరమిచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వితీసే భారం కూడా పాపం ఆయనదేనా? ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను. నా బాధ నేనే అనుభవిస్తాను’ అనుకున్నాడు. హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోద్రయాడు.
మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్రలే ద్రవగానే, ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది. ఇల్లం తా బంగారుకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తను నిద్రలే ద్రపింది. హనుమంతుడి దయాభిక్షకు వివశుడైన కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయసా గాడు. ఇన్నాళ్లూ హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. ఆనాటినుంచి కపిలుడితో పాటు అతడిభార్య కూడా హనుమంతుడిని అర్చించడం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకుని, మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు. – సాంఖ్యాయన
*****
01/05..(101) ప్రాంజలి ప్రభ .. శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి ..శ్రీ మద్భగవద్గీత (అనువాదం) రచన మల్లా ప్రగడ రామకృష్ణ.
...అర్జున విషాద యోగము. మొదటి అధ్యాయము
*దృతరాష్ట్రుని ప్రశ్న*
ఉ. ధర్మజు తోడఁ దమ్ములు సుధర్మముఁ దత్త్వమునేల నుండగన్
కర్మలనేమి యెంచగల కాలము తోడుగ సాగి పోవుటన్
ధర్మము నాదుపుత్రుల విధానము సర్వము బోధజేయగా
నోర్మిగఁ తెల్పుసంజయ వినూత్నపు యుత్సవ యుద్ధ నీతులన్ (01)
*సంజయ వ్యాఖ్యానము*
ఉ..అప్పుడు సంజయుండు, నుడి వాసల వెల్లువ గెల్పుకోసమున్
తప్పిదమెన్న లేనిగతి ధార్మిక పాండవ సేనయేనటన్
గొప్పగ నెంచగా గురుని గోప్యము యుద్ధమునందుఁ జూపగన్,
ఒప్పిన ధైర్యపాటవసుయోధను డంతట వేడెనిట్లనన్ (02)...
ఉ...హే, గురువా విధానముల హేతువు విద్దెలబుద్ధిశాలిగన్
బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతితో
సాగెడి సైన్య మెల్లరను సాధ్యపు చేతల నెంచ గల్గగన్
యోగపు వీరులై విజయ యోగ్యత నంతయు నీదు యుక్తులన్ (03)
(01) దృతరాష్ట్రుని ప్రశ్న —
ధర్మపరుడైన యుధిష్ఠిరుడు తన సహోదరులతో కలిసి ధర్మమార్గంలో ఉన్నాడు.
నా కుమారులు (కౌరవులు) మరియు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు.
ఈ పరిస్థితిలో వారు ఏమి చేస్తున్నారు?
ఓ సంజయా! ఆ యుద్ధభూమిలో జరిగిన విషయాలను నాకు వివరంగా చెప్పు.
(02) సంజయ వ్యాఖ్యానం —
సంజయుడు ఇలా చెప్పాడు—
ధార్మికమైన పాండవుల సైన్యం బలంగా, నిష్కళంకంగా ఉంది.
వారి యుద్ధసిద్ధత, శక్తి ఎంతో గొప్పది.
దీనిని గమనించిన దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్లి,
యుద్ధ విషయాలను ధైర్యంగా చెప్పడం ప్రారంభించాడు.
(03) సంజయ కొనసాగింపు —
దుర్యోధనుడు తన గురువుతో ఇలా అన్నాడు—
“ఓ గురువర్యా! పాండవుల సైన్యం చాలా బలంగా ఉంది.
వారు యుద్ధంలో నిపుణులు, మంచి వ్యూహాలతో ముందుకు వస్తున్నారు.
వారి యోధులు యుద్ధకళలో ప్రావీణ్యం కలవారు.
ఈ పరిస్థితిలో మనం కూడా జాగ్రత్తగా వ్యూహాలు రచించాలి.”
****
చిన్న ఉపన్యాసం:
ప్రియులారా, మన జీవితంలో ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. శ్రీ మద్భగవద్గీత మొదటి అధ్యాయం మనకు ఈ సత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న సాధారణమైనదిగా కనిపించినా, దాని వెనుక ఒక ఆందోళన ఉంది. ధర్మమార్గంలో నడిచే పాండవులు, తన పుత్రులు అయిన కౌరవులు—ఇద్దరూ యుద్ధభూమిలో నిలిచినప్పుడు, ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి. ఇది మనలో కూడా ఉండే సందేహమే—ధర్మం గెలుస్తుందా? లేక అధర్మం పైచేయి సాధిస్తుందా?
సంజయుడు ఇచ్చిన సమాధానం మనకు ఒక స్పష్టమైన దారిని చూపుతుంది. ధర్మబలంతో ఉన్న పాండవుల సైన్యం స్థిరంగా, నిబద్ధతతో ఉంది. నిజాయితీ, నీతి, ధైర్యం—ఇవి కలిసినప్పుడు ఒక శక్తి ఎలా ఏర్పడుతుందో మనం చూడవచ్చు.
ఇక దుర్యోధనుని మాటలు మనకు మరో పాఠాన్ని నేర్పుతాయి. ప్రత్యర్థి బలాన్ని అంచనా వేయడం, పరిస్థితిని గ్రహించడం అవసరం. కానీ, కేవలం వ్యూహాలు సరిపోవు—ధర్మబలం లేకపోతే విజయం స్థిరంగా ఉండదు.
కాబట్టి, ఈ మూడు పద్యాలు మనకు చెప్పే మూలసందేశం ఏమిటంటే—
జీవిత యుద్ధంలో ధర్మం, సహనం, వివేకం ఉంటేనే నిజమైన విజయం లభిస్తుంది.
బాహ్య యుద్ధం కంటే, అంతరంగ యుద్ధమే ముఖ్యమైనది.
*****
[ 01/05--101*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -11*
*కృష్ణాజిల్లా*
*విజయవాడ కనకదుర్గ*
అన్ని విధాల ఆంధ్రదేశానికి నడిగడ్డలో వుంది విజయవాడ. మద్రాసు నుండి కలకత్తాకు. ఢిల్లీకి వెళ్ళే రైలుమార్గాలక్టి పెద్ద కూడలి. ఆంధ్రదేశము లో ప్రధానమైన పట్నము. ఇచ్చట ముఖ్యమైన గుడులు మూడు. కనకదుర్గ గుడి, మల్లేశ్వర స్వామి గుడి. విజయేశ్వరస్వామి గుడి.
పురాణాలలో ఇది విజయవాటిగా ప్రసిద్ధము. కొన్ని శాసనాలలో "రాజేంద్ర చోళపురము" అని కూడ పేర్కొనబడింది. కృష్ణ ఒడ్డున ప్రసిద్ధ యాత్రా స్థలమైన యీ ప్రదేశంలో శివునికి మల్లేశ్వరుడను పేర ఆలయం ఉంది. ఈ స్వామికి "జయసేను" డని కూడ ప్రసిద్ధి. అగస్త్య మహర్షి యీ స్వామి వివిధ లీలలకు సాక్షియైన గొప్ప భక్తుడు.
కనకదుర్గ యిచ్చట ఎపుడు వెలిసిందో తెలియదు. ఆమె తనకు తానే దక్షిణాపథ వాసులను పీడిస్తున్న దుర్గమాసురుడ్ని చండి స్వరూపంలో ఇచ్చట సంహరించింది.
మల్లికార్జునుడనీ, మల్లీశ్వరుడనీ పురాణాలలో వినబడే ఈ స్వామిని తమ దక్షిణాపథ విజయ చిహ్నంగా పాండవాగ్రజుడైన యుధిష్ఠిరుడు ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది.
చరిత్రను బట్టి క్రీ.శ. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య ప్రభువు త్రిభువన మల్లుడు ఈ గుడిని నిర్మించాడు.
విజయేశ్వర ప్రతిష్ఠ అర్జునుడు చేసిందంటారు. (కిరాత రూపంలో వచ్చిన శివునిపై తన విజయ చిహ్నంగా). ఈ ప్రదేశమంతా చిన్న చిన్న కొండలతో చుట్టబడి ఉంటుంది. అన్నింటిలోను పెద్దది సీతానగరం కొండ. చిన్నది కనకదుర్గ. దీనిని "కనక కొండ" అని కూడ అంటారు. దుర్గగుడికి దక్షిణం వైపున చిన్న గుట్ట వుంది. దాని నిండా శిల్పాలు, శాసనాలు వివిధ దేవతల వారి వారి పేర్లతో చెక్కి వున్నాయి. చాలా ప్రతిమలు దుర్గవే. అవన్నీ మంత్రశాస్త్రానికి సంబంధించినవి. పూర్వం యీ కొండలన్నీ వరసగా కలిసి వుండేవనీ పరమేశ్వరుని ఆజ్ఞచేత కృష్ణ ప్రవహించడానికి వీలుగా ప్రక్కప్రక్కలకు తప్పుకున్నాయనీ అంటారు.
ఈ కొండల్లో ఒకటి "ఇంద్రకీల" మనే పేరుతో మహాభారతంలో పేర్కొనబడింది. ఈ కొండమీదనే అర్జునుడికి శివుడు పాశుపతమనే పరమాస్త్రాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించడానికి ముందు శివుడు అర్జునుని యెదుట కిరాతరూపంలో నిలిచాడు. ఈ కథను "కిరాతార్జునీయం”గా
భారవి శాశ్వతం చేశాడు.
తన పాశుపతాస్త్ర సిద్ధికి స్మృతి చిహ్నంగా ఇచ్చట విజయేశ్వరుడిని అర్జునుడు ప్రతిష్ఠించా డంటారు. మిగిలిన మహాభారతం కథా సన్నివేశా లతో సహా కిరాతార్జునీయం యీ గుడిలో శిల్ప రూపంలో నెలకొని వున్నది ఆ గాధ ఇದಿ.
పాండవుల వనవాసంలో వేదవ్యాస మహర్షి వచ్చి శత్రు విజయార్ధమై పాశుపతాస్త్ర సిద్ధికై శివుడిని గూర్చి తపస్సు చేయవలసిందిగా ఆదేశించాడు. ధర్మరాజు, అర్జునుని నియోగించాడు. అర్జునుడే ఇంద్రకీల శిఖరం మీద ఒంటికాలిపై నిలిచి ఊర్ధ్వ బాహుడై పంచాగ్ని మధ్య తపస్సు మొదలు పెట్టాడు. ఘోరమైన ఆ తపస్సుకు పరమేశ్వరుడు సంతోషించాడు. అర్జునుడిని పరీక్షించవలెనని పించింది. కిరాతవేషం ధరించాడు. పార్వతి కిరాతివేషం ధరించింది. ప్రమధులంతా రకరకాల వేషాలు ధరించారు. వేదాలు వేటకుక్కలైనాయి. ఇలా యింద్రకీలం మీద శివుడు వేటాడుతూ ఒక అడవి పందిని అర్జునుని ముందుకు తరుముకు వచ్చాడు. అడవిపంది అర్జునునికి దగ్గరగా వచ్చింది. ఆయన మహావీరుడు కదా! గాండీవం తీసుకొని ఒక్క బాణంతో దాన్ని కొట్టాడు. తరుముకు వస్తున్న కిరాతుడు అదే సమయంలో ఒక బాణంతో కొట్టాడు. రెండుప్రక్కల రెండు బాణాలు గ్రుచ్చుకొని గురగుర ధ్వనితో గిరగిరా తిరిగి ఆ అడవిపంది నేలకొరిగింది. నా బాణంతో చచ్చిందంటే నా బాణంతో చచ్చిందని తగాదా మొదలైంది. "నేను తరుముకు వచ్చే పందిని కొట్టడానికి నీవెవడవురా! నావేట తమకమంతా చెడకొట్టావు. ఈ కిరాతి ముందు నాకు తలవంపు లైంది. అసలు తపస్సు చేసుకునేవాడివి, నీవు పందిని కొట్టడం దేనికి? ఈవేషం నిన్ను కాపాడింది. లేకపోతే నేడు పందితో సహా నిన్నిక్కడే చంపియుండేవాడిని" అంటూ కిరాతుడు అర్జునుడిని రెచ్చగొట్టాడు.
మహావీరుడైన అర్జునుడు ఈ బోయవాడు చేసిన తిరస్కారానికి మండిపోయాడు. అయినా నిగ్రహించుకొని "పో! పోరా! కోయవాడివి నీతో నాకేమిటి? నా శివపూజకు అలస్యమవుతోంది" అన్నాడు. పట్టువిడువలేదు. నిలబడి అర్జునుని తిట్టడం మొదలుపెట్టాడు. పందిని కిరాతుడు కొట్టి వేట తమకం అంతా పాడుచేసినందుకు ప్రాయశ్చిత్తంగా తన కోయసాని ఎదుట కుస్తీకి రమ్మన్నాడు. ని శివపూజ ఎక్కడికి పోదులే! అన్నాడు. ఈ కోయసాని ఎదుట నీతో యుద్ధం చేయడానికి మనస్సు పొంగుతున్నది. పందిని కొట్టిన నేరానికి నీకిది తప్పదన్నాడు. చేసేదిలేక అర్జునుడు కిరాతునితో మల్లయుద్ధానికి సిద్ధమయ్యాడు.
ఎంత మహావీరుడైనా అర్జునుడు పరమేశ్వరుని ముందు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆయాసం వచ్చింది. డస్సి పోయాడు. ప్రాణానికి తెగించి పోరాడుతున్నా మనస్సులో శివునిమీద ఏకాగ్రత చెదరలేదు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ప్రాతఃకాలార్చనలో తాను శివలింగం మీద ఏ పూవులతో పూజించాడో ఆ పూవులు తాను పోరాడుతున్న కిరాతుని శరీరము మీద నుండి రాలటం కనబడింది.
ఆ కిరాతుడు సాక్షాత్పరమేశ్వరుడని తెలిసింది. వెంటనే కిరాతుడు మాయమైపోయాడు. ఎదుట తమ సమస్త పరివారంతో శివుడు నిలిచాడు. పాశుపతం అతనికి ప్రసాదించబడినది. ఈ పరమ సన్నివేశానికి తార్కాణంగా యీ ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు 'విజయేశ్వర లింగాన్ని' ప్రతిష్ఠించాడు. ఈ ఇంద్రకీలం మీద కొండలలో నిలిచిన ప్రాచీన దేవాలయాలెన్నో వున్నాయి. అవన్నీ కాలక్రమంలో శిథిలములై పూడిపోయినాయి. ఇళ్ళరాళ్ళ కోసం బెజవాడ కొండలు పగులగొట్టటంలో అవి బయటపడ్డాయి. అవన్నీ భద్రపరుపబడ్డాయి. విజయేశ్వరాలయం లో అద్భుతమైన శిలాశిల్పం ఒకటి వుంది. దానిమీద నాలుగువైపులా కిరాతార్జునీయ కథ చెక్కబడి వుంది.
మల్లేశ్వరస్వామి ఆలయము గూర్చి కొన్ని గాథలున్నాయి. కలియుగానికి ముందే వుంది. అగస్త్య మహర్షి యీ స్వామికి 'జయసేను'డని పేరు పెట్టారు. మహాభారత వీరుడైన అర్జునుడు మల్లయుద్ధంలో గట్టివాడు. తన అనుభవాన్ని బట్టి అతడే స్వామికి మల్లేశ్వరుడని పేరుపెట్టాడు. స్వామి తన సాన్నిధ్యం చేత కృష్ణ ఒడ్డున వున్న విజయవాటిని అనుగ్రహిస్తున్నాడు.
ఇంకొక గాథలో యిలా వుంది. కలియుగంలో శాలివాహన శకం మొదట 117 వ సంవత్సరంలో మాధవవర్మ అనే ప్రసిద్ధుడైన రాజు వుండేవాడు. చింతకాయలమ్ముకొని బ్రతికే ఒక స్త్రీ కొడుకు ప్రమాదవశాత్తు రాజకుమారుని రధంక్రింద పడి మరణించాడు. న్యాయార్థినియై వచ్చిన ఆ స్త్రీ మొఱ అలకించి ధార్మికుడైన ఆ రాజు తన కొడుకికి మరణశిక్ష విధించాడు. అతని ధర్మ బుద్ధి కానందించి మల్లేశ్వరస్వామి అతనిమీద కనక వర్షం కురిపించాడు. ఆ కనకవర్షం వల్ల ఆ అవ్వ కొడుకూ, రాజకుమారుడూ పునరుజ్జీవితు లైనారు. ఆ రీతిగా పరమేశ్వరుడు ఆ మహారాజు పేరు భూమి మీద శాశ్వతంగా నిలిపాడు. తరువాతి కాలంలో పండితారాధ్యుడనే మహాభక్తుడు శివభక్తులు ఋషిశ్వరులకంటే గొప్పవారని లోకానికి చాటి దానికి నిదర్శనముగా జమ్మిచెట్టు కొమ్మకు 'కణకణ లాడే పండు బొగ్గులు వస్త్రంలో కట్టి వ్రేలాడదీశాడు. ఆ వస్త్రం కాని చెట్టుకాని కాలిపోలేదు. మల్లేశ్వరస్వామి ప్రసన్నుడై తన భక్తుని ఎదుట సాక్షాత్కరించాడు. జన సామాన్యంలో ప్రచురమైన గాధను బట్టి యీ స్వామి "మహాదేవ మల్లేశ్వరుడు" భక్త ప్రియుడు ఆయనను సేవించి పూర్వ రాజులు వర్ధిల్లారు.
ఈ ఆలయంలో ఒక శాసనం తెలుగు లిపిలో వుంది. క్రీ.శ. 9వ శతాబ్దం నాటిది. ఈ శాసనం చిత్రంగా క్రిందనుండి పైకి చెక్కబడి వుంది. సారాంశం ఇది. -
పెచ్చవాడ కలియబోయ కుమారుడు త్రికోటిబోయ అనేవాడు తనపేర తన కుల ప్రసిద్ధికై యీ స్థంభాన్ని నెలకొల్పాడు. శాసనంలో "త్రికోటిబోయ' అర్జునునికి ఇంద్రకీల మార్గం చూపడానికి ఇంద్రునిచే నియోగింపబడిన గుహ్యాక యక్షుడుగా గుర్తింపబడినాడు.
అర్జునునికి మార్గం చూపిన సుకృతం వల్ల "త్రికోటిబోయి”కి పూర్వజ్ఞానం కలిగి అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశంలో ఈ స్థంభాన్ని నెలకొల్పాడు. ఈ గుహ్యాక వృత్తాంతం మహాభారతంలో లేదు. భారవిలో వుంది. కాబట్టి ఇది భారవికి పూర్వంది.
పౌరాణిక ప్రశస్తి అలావుండగా విజయవాడ ఆంధ్ర సంస్కృతికి ప్రధాన కేంద్రంగా గోచరిస్తుంది. ఒకప్పుడు కళ్యాణి చాళుక్యులు దీన్ని ఏలినారు. ప్రసిద్ధుడైన చైనా యాత్రికుడు "హ్యూన్ త్సాంగ్" ఈ ప్రదేశాన్ని క్రీ.శ. 639లో బౌద్ధమతం పరమోచ్చ దశలో వున్న దినాల్లో దర్శించాడు.
ఇన్ని విధాల ప్రసిద్ధమైన విజయవాడ పెక్కు ప్రాచీన దేవాలయాలకు నిలయమై వుంది. వానిలో ప్రధానంగా శ్రీ కనక దుర్గాలయం మహిమాన్వితమై వేలకొలదీ యాత్రికులను నేటికీ ఆకర్షిస్తోంది.
*సశేషం*
[ 01-05..101..
నేటి న్యస్తాక్షరి : వై శా ఖ ము
వైరము వలదు సహనపు వాక్య పిలుపు
శాశ్వతమనేది లేదుగా సాగు చుoడి
ఖరము పాలువేడిగను దుఃఖమును తుంచు
ముక్తి కొరకు కాలమిదేను ముఖ్య మాయ
సరళ భావం:
వైరము (ద్వేషం) వద్దు—సహనంతో మాట్లాడాలి.
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, కాలం నిరంతరం సాగుతుంది.
కఠినమైన దుఃఖాలు వచ్చినా అవి కూడా కాలంతో తగ్గిపోతాయి.
కాబట్టి ఇదే సమయం—ముక్తి (శాంతి, ఆత్మజ్ఞానం) కోసం ప్రయత్నించాల్సినది.
****
వైరములు మాని బుద్దుని వాంఛ తీర్చి
శాక్యముని బాట నెప్పుడు శాస్త్ర మనుచు
ఖరకరుని సాక్షిగ మదిలొ కలత మాని
ముదముతొ గడుపు బ్రతుకును ముత్య మల్లె!
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట.
***†***
పాదాది న్యస్తాక్షరి.
*వి, న, య, ము.*
కం.
*వి* నుతింతు నిన్ను శ్రీధర!
*న* ను బ్రోవుమ వేంకటేశ! నగధర! చక్రీ!
*య* నిశము శాంతినొసగుమా
*ము* నిజన సేవిత! మకుంద! పుష్కరనాభా!
[ శ్రీధర = శ్రీ (లక్ష్మీదేవి)ని ధరించినవాడు, విష్ణువు; నగధర = మందర పర్వతాన్ని మోసినవాడు (క్షీరసాగర మథన సమయం లో..), విష్ణువు; యనిశము = ఎల్లప్పుడు, పుష్కరనాభ = కమలనాభుడు. ]
భావము:
ఓ వేంకటేశ్వరా! శ్రీధరా! నగధరా! చక్రీ!
మునులచే సేవింపబడువాడా! ముక్తి ప్రదాత! కమలనాభా! నిన్ను నేను స్తుతించుచున్నాను; ఎల్లప్పుడు నాకు శాంతిని ప్రసాదింపుము.
కం.
*వి* నుతింతు నిన్ను శంకర!
*న* ను బ్రోవుమ శూలపాణి! నాగాభరణా!
*య* నిశము శాంతినొసగుమా
*ము* నిజన సేవిత! త్రినయన! భూతేశ! శివా!
******
పాదాది న్యస్తాక్షరి.
*వి, న, య, ము.*
ఆ.వె.
*వి* మల చరిత! శ్రీశ! వేదవినుత! హరీ!
*న* న్ను బ్రోచెదవని నిన్ను గొలుతు
*య* శము నొసగుమా యనిశము వేంకటపతీ!
*ము* క్తి దాత! ముగ్ధమోహనాంగ!
భావము:
విమల చరిత్ర గల ఓ లక్ష్మీపతీ! వేదములచే స్తుతింపబడువాడా! హరీ!
నన్ను రక్షించెదవని నమ్మకంతో నిన్ను సేవించుచున్నాను. ఓ వేంకటపతీ! ముక్తిప్రదాత! ముగ్ధమోహన రూపుతో భక్తులను ఆకర్షించువాడా! నాకు ఎల్లప్పుడు యశస్సును ప్రసాదింపుము.
****
ప్రాంజలి ప్రభకు నమస్సులు
ఇచ్చా... చందస్సులో
పాదాది... న్యస్తాక్షరి..వి..న..య..ము.
తేటగీతి:
వినయ మొసగును విద్యను విశద పరచి
నయన ములతోడ పెరుగును నమ్మకంబు
యత్నమేకద మనసును హత్తు కొనును
ముదమును కలిగి యుండుట ముద్దు గొలుపు!
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట.
******
దత్తపది :*ఇంటి వంట కంటి మంట*
తే.గీ.*ఇంటి* యందున సంతును నెపుడు తనదు
*కంటి* పాపగ జక్కగ కాచు కొనుచు
*వంట* లను కడు శ్రద్ధగ వండిపెట్టి
*మంట* నొందక యిల్లాలు మమత పంచు
[ మంట = కోపము ]
భావము:
ఒక గృహిణి తన ఇంటియందు తన సంతానాన్ని, ఎల్లప్పుడు తన కంటి పాపలా, అత్యంత ప్రేమతో, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. అంతేకాదు, వంటలను ఎంతో శ్రద్ధతో, ఒక పవిత్ర కార్యంలా భావించి వండి అందరికీ పెడుతుంది. ఎన్ని పనులు, ఎంత ఒత్తిడి ఉన్నా, కోపము, విసుగు అస్సలు చెందకుండా, తన కుటుంబ సభ్యులకు నిర్మలమైన మమతను, వాత్సల్యాన్ని పంచి ఇస్తుంది.
తిరివీధి శ్రీమన్నారాయణ
******
దత్తపది....అరువు,పరువు,తరువు,బరువు.
డా బల్లూరి ఉమాదేవి
ఆ.వె:అరువు నడుగ బోకు ఆడితప్పకుమయ్య
పరువుపోవు నట్టి పనులు వలదు
తరులవోలెసతము పరుల కుపకరించు
పనులుచేయటెపుపుబరువుకాదు
*****
వి,న,య,ము, పాదాది న్యస్తాక్షరి నాయత్నం
: విలువే యెరుగని జీవము
నలుపే తెలియని తెలుపుగ నమ్మక భవమే
యలుపే నున్నను సహనము
ములుకుల బ్రతుకున సమయము ముఖ్యము కాదా
సరళ భావం:
విలువను తెలియని జీవితం వ్యర్థమవుతుంది.
చీకటి ఏమిటో తెలియనిదే వెలుగు గొప్పతనం అర్థం కాదు; అలాగే అనుభవం లేనిదే నమ్మకం పరిపక్వం కాదు.
అలసట ఉన్నా సహనంతో ఉండాలి.
కష్టాలు, గుచ్చులు ఉన్న జీవనంలో సమయాన్ని సరిగ్గా వినియోగించడం చాలా ముఖ్యము.
******
తే. గీ.వినుము పెద్దల మాటను వినయముగను
నమ్మి వారి మాటనువిన్న నరుడె ఘనుడు
యశము కలుగును సతతము నవని లోన
ముప్పు రాదని తెలుసుకో తప్పకుండ
సరస్వతి నాగరాజన్
******

Comments
Post a Comment