02/05...102.. సుభాషితమ్ 𝕝𝕝
శ్లో𝕝𝕝 అల్పతోయశ్చలత్కుమ్భోహ్యల్పదుగ్ధాశ్చ ధేనవః।
అల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితః॥
తా𝕝𝕝 తక్కువ నీరుగల కుండ చలిస్తుంది, తక్కువ పాలు ఇచ్చే ఆవులు చాలా పొగరుగా ఉంటాయి మరియు తక్కువ విద్య కలవాడు, చాలా గర్వం కలవాడుగా ఉంటాడు, అందవిహీనుడు ఎక్కువ చేష్టలు చేస్తూ ఉంటాడు.
*
02/05..102..నేటి గీతం శివయ్య
పల్లవి
శివయ్యా… నీవే దిక్కయ్యా
శరణు శరణు పరమేశయ్యా
కన్నీటి మాటల పూజలతో
కరుణ చూపవయ్యా ॥
చరణం – 1
నీ ఆజ్ఞ లేక చీమకైనా
కాటు రాదంటారయ్యా
నావికాని బంధములను
నాకెందుకు చేరువచేయా ॥
మరుక్షణమే దూరమయ్యే
మాయల గీతమెందుకయ్యా
మరచిపోలేని జ్ఞాపకాలై
మనసు నింపెదెందుకయ్యా ॥
చరణం – 2
మది మోయలేని సంతోషం
వరమై నీవిచ్చావయ్యా
అదే వేళలో బాధరూపం
జీవితానికి చూపావయ్యా ॥
నీ లీలల లోతు తండ్రీ
నాకెంతకూ అందదయ్యా
నీ వైపే చూస్తూ ఉండే
నిశ్శబ్దమే మిగిలిందయ్యా ॥
చరణం – 3
మార్పుల మధ్య నిలిచిన నిజం
నీవేనని తెలిసిందయ్యా
నిన్ను మించిన ఆనందం
లోకంలో లేదయ్యా ॥
కోర్కెల బంధనాలన్నీ
కరిగిపోవునయ్యా
నేనే నీవై లీనమయ్యే
దయను ప్రసాదించయ్యా ॥
ముగింపు
శివయ్యా… నీవే దిక్కయ్యా
శరణాగతి నీ చరణాలయ్యా
జన్మ జన్మల అలసటకు
జ్యోతిర్మయ విశ్రాంతయ్యా ॥
****
02/05..102..నేటి కధ
*ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి. అది ఎలాగో తెలుసుకుందాం.*
*ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది, అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు, రాజు అందుకు సమ్మతించాడు.*
*ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!... రాత్రి అయింది. అది మొదటి యామం, తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు, హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:*
*“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః*
*జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః."*
*మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు... కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది, కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.*
*మళ్ళా రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:*
*“జన్మదుఃఖం జరాదుఃఖం -*
*జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”*
*పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.*
*ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది:*
*“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః*
*అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”*
*తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు... ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ బాలుడు...*
*“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా*
*ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”*
*అని చాటింపు వేశాడు.*
*ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు...*
*ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.*
*మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు... అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.*
*తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు. అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. "అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు, అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు, ఇలా కొంతకాలం గడిచింది.*
*దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, మరి భూలోకంలో పాపాత్ములే లేరా!లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా?నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం.” బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది...*
*అదేమంటే:..*
*మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది... అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది...*
*మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు... అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు... దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.*
*ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.*
*"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి?ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ... ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు !!!... కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం ఒక పాఠమైనది.”*
*అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది...*
*నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక! కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామ స్మరణ తప్పక లభిస్తుంది...*
*భగవద్గీత లో చెప్పినటుల "అద్వేష్టా సర్వ భూతానాం" ఆచరించుతూ ఉంటేనే ఇది సాధ్యము. ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికే ఇది సుసాధ్యము... ఎందుకనగా తను వేరొకరిని ద్వేషించే సమయములో ఒకవేళ మరణము సంభవస్తే అదే ద్వేషముతో పాము-కప్ప జన్మలను, మరియు గజ-కచ్చప (ఏనుగు-తాబేలు) జన్మలను పొంది అనేక యుగములు తగవులాడుకొనే అవకాసము ఉన్నదని పురాణములు చెప్పుచున్నవి. కావున మొట్టమొదలు మనము శత్రువులు అనుకునే వారిమీద మన అభిప్రాయములను సరిదిద్దుకుని "అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.*
*నిత్యము రామనామ స్మరణ చేసిన వాల్మీకి మహర్షి అంత్య సమయములో కూడా రామ నామ స్మరణ చేయడము వలన తులసీదాసు గా జన్మించగనే (1498-1623) అందరు పిల్లలవలె ఏడవకుండా "రామ్ రామ్" అని పలకడము అందుకని మొదలు ఆయన పేరు "రాంబోలా" అని అందరూ పిలవడము జరిగినది.ఇంతకన్నా మనకు ఏమి ఉదాహరణ కావాలి... మిత్రులారా!*
*****
🔸
02/05...102..*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -12*
*కృష్ణాజిల్లా*
*శ్రీ కాకుళాంధ్ర దేవుడు*
కృష్ణానదికి పశ్చిమ తీరంలో ఉన్నది ఈ దేవాలయము, కొల్లూరు రైలు స్టేషనుకు 12 కిలోమీటర్ల దూరములో నున్నది.
నవబ్రహ్మలు పాపపరిహారార్ధము మహావిష్ణువు యెక్క విగ్రహమును ప్రతిష్ఠించుటకు ప్రయత్నించుచుండిరి. వారికి స్వామి ప్రత్యక్షమై ఆంధ్రవిష్ణువుగా ఆంధ్రుల ఆదిదైవతముగా, ఆంధ్రులను రక్షిస్తూ కృష్ణానదీ తీరంలో వెలుస్తానని పలికినాడు అదే శ్రీకాకుళం. ఆంధ్ర శాతవాహన రాజులకు శ్రీకాకుళం మొదటి రాజధాని. ఇది బందరుకు 30 కిలోమీటర్ల దూరములో నున్నది. తరువాత రాజధాని ధాన్యకటకమునకు మార్చబడినది. ఆంధ్రవిష్ణు ఆలయము చాలా పురాతనాలయము. అగస్త్యుడు కృష్ణానదీతీరములోని క్షేత్రములను చూచుచూ ఈ ఆలయమును దర్శించినట్లు స్కాందపురాణకథ కలదు. పద్మ పురాణము నందు కూడా ఈ ఆలయ ప్రసక్తి కలదు. అవంతీ దేశ వాసుడైన యజ్ఞశర్మ కుమారుడు దేవశర్మ వచ్చినట్లు ఆధారములు కలవు.
కోదండ రామన్న అను రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించుచున్న కాలంలో ఈ ఆలయపూజారి వేశ్యాలోలుడై స్వామికోసం తయారుచేయబడిన పూలమాలలను తన ప్రియురాలికి అలంకరించి పిమ్మట స్వామికి సమర్పించుటకు అలవాటుపడి నాడు. స్వామి ప్రసాదముగా రాజునకు ఇచ్చిన మాలలో శిరోజము కనిపించినది. దానికి కారణ మడుగగా మహావిష్ణువుకు కొప్పుగలదని అతడు అబద్ధమాడెను. రాజు ఆ విగ్రహమును పరీక్షించు టకు వెళ్ళినపుడు స్వామి నిజముగా కొప్పుతో ప్రత్యక్షమయ్యాడు. ఈ విధముగా ఆంధ్ర మహా విష్ణువు తన భక్తుని రక్షించినట్లు కథ కలదు.
ఆది విష్ణువు, ఆంధ్ర విష్ణు, ఆంధ్రనాయకుడు అను నామాంతరములు గలవు. ఇది 6 అడుగుల ఎత్తుగల విగ్రహము, 4 అడుగుల రాజ్యలక్ష్మి విగ్రహము కూడా కలదు. ఇక్కడ ఏకరాత్రప్రసన్న మల్లికార్జునస్వామి లింగము. ఆంజనేయస్వామి ఆలయముకూడ కలవు.
📖
*వేదాద్రి*
వేదాద్రి పైన యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము, శివాలయము గలవు. ఈ ఆలయము ఋష్యశృంగమహర్షిచే ప్రతిష్ఠింప బడినదందురు. శ్రీ నరసింహుని రెండు చేతులలో శంఖు చక్రములు, మిగిలిన రెండు చేతులు ఒక యోగదండమును భూమికి సమాంతరముగా పట్టుకొని నట్లుండును. ఇది జగ్గయ్యపేటకు 15 కి.మీ. దూరమునకలదు. విజయవాడకు 54 కి.మీ.
హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదునికి యోగాభ్యాసము నేర్పి యోగానంద నృసింహుడైనాడని కలదు. వేదాద్రికి దగ్గరగా గుట్టపై జ్వాలానరసింహస్వామి ఆలయము కలదు. అక్కడనే సాలగ్రామ నరసింహస్వామి సాలగ్రామ రూపములో కలడు. దీనిని వర్షా కాలములో మాత్రమే చూడగలము. వేదాద్రికి 2 కి.మీ దూరములో గరుడాచలము పై ఉగ్ర నరసింహస్వామి ఆలయము కలదు.
యోగానంద లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి బహుళ విదియవరకు 7 రోజులు ఘనముగా జరుగును. ముర్త్యాల జమిందారులు దీనికి ధర్మకర్తలు.
🛕
*సశేషం*
02/05,102.. భగవద్గీత మొదటి అధ్యాయం 4 5 6 పద్యాల.. భావం
ఉ. మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్,
అచ్చట చేకితానుడు సహాయదృపుండు సుధీర శ్రేష్ఠులున్
దెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ పోరు నందరున్
వచ్చిన వారినే ప్రహర వాక్కుల పర్వము క్షేత్రమందునన్ (04)
శా . ఆమాదాద్యసమానవీరులిట వీరావేశ భీమార్జునుల్
సామంతుల్ గణవీరులై సమరమున్ సంగ్రామ బీభత్సమున్
భూమీశాద్య మహా విపన్న కదనా వ్యూహామ్ము లన్ గెల్వగన్
ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్ (05)
ఉ. పాండు కుమారులున్ తమరి పాశమునేమది జూపనుండగన్
పాండవ మధ్యముండు మరి బాల ప్రవీరులు ధర్మ యుద్ధమున్
కండబలంబునన్ గలిగి గమ్యనిజంబగు ధైర్య వాక్కులన్
నిండుగ యుద్ధవీరులకు నిర్ణయ లక్ష్యము పోరుయేయగున్ (06 )
మీ (04), (05), (06) పద్యాలకు సరళ భావం ఇలా—
(04) పద్య భావం:
అక్కడ ఉన్న యోధులందరూ శక్తివంతులు, యుద్ధనైపుణ్యం కలవారు.
చేకితానుడు, దృపదుడు వంటి ధైర్యవంతులు కూడా సహాయంగా నిలిచారు.
అందరూ తమ ధనుస్సులను ఎత్తుకొని యుద్ధానికి సిద్ధమై,
యుద్ధరంగంలో మాటలతో, ప్రతిజ్ఞలతో పోరాట ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(05) పద్య భావం:
భీముడు, అర్జునుడు వంటి మహావీరులు, ఇతర సమంతులతో కలిసి
భయంకరమైన యుద్ధానికి సిద్ధమయ్యారు.
వ్యూహాలతో, శక్తితో శత్రువులను జయించాలని సంకల్పించారు.
విజయం సాధించాలనే కోరికతో ధైర్యంగా యుద్ధంలో నిలిచారు.
(06) పద్య భావం:
పాండవులు ధర్మయుద్ధం కోసం సిద్ధమై ఉన్నారు.
వారి మధ్య ఉన్న యోధులు శక్తివంతులు, ధైర్యవంతులు.
వారు నిజమైన లక్ష్యాన్ని (ధర్మాన్ని) గుర్తించి,
స్థిరనిశ్చయంతో యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు.
మీ పద్యాలలో యుద్ధ దృశ్యం మాత్రమే కాదు, ధర్మబలం, ధైర్యం, లక్ష్యనిశ్చయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
****
మీరు అందించిన (04), (05), (06) పద్యాల భావసారాన్ని ఒక చిన్న ఉపన్యాసరూపంలో ఇలా చెప్పవచ్చు—
చిన్న ఉపన్యాసం:
ప్రియులారా, యుద్ధభూమి అనేది కేవలం ఆయుధాల సమరం కాదు—అది గుణాల పరీక్షా స్థలం. యోధులు అక్కడ తమ శౌర్యాన్ని మాత్రమే కాదు, తమ స్వభావాన్ని కూడా ప్రదర్శిస్తారు.
మొదటిగా, మనం చూస్తే—యోధులందరూ తమ తమ శక్తి, నైపుణ్యాలతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ధైర్యవంతులు, నిపుణులు, అగ్రశ్రేణి వీరులు—వారందరూ తమ ఆయుధాలను ఎత్తి, యుద్ధోత్సాహంతో ముందుకు వస్తున్నారు. యుద్ధరంగం మాటలతో, ప్రతిజ్ఞలతో, ధైర్య నినాదాలతో నిండిపోతుంది. ఇది మన జీవితంలో కూడా అలాగే—సవాళ్లు వచ్చినప్పుడు మన శక్తి, మనోబలం పరీక్షకు వస్తాయి.
తర్వాత, సమరరంగం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. భీముడు, అర్జునుడు వంటి మహావీరులు, ఇతర సమంతులుతో కలిసి యుద్ధంలో దిగుతారు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఘోరమైన సంగ్రామం—ఇవి అన్నీ కలిసినప్పుడు యుద్ధం భయానక రూపం దాల్చుతుంది. అయినా, విజయం సాధించాలనే సంకల్పం ఉన్నవారు ధైర్యంగా ముందుకు సాగుతారు.
ఇక పాండవుల వైపు చూస్తే—వారు ధర్మయుద్ధం కోసం నిలబడినవారు. వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. శారీరక బలం మాత్రమే కాదు, న్యాయం మీద నమ్మకం, ధైర్యమైన మాట, స్థిరమైన సంకల్పం—ఇవే వారి నిజమైన ఆయుధాలు. అందుకే వారు యుద్ధాన్ని కేవలం గెలుపుకోసం కాకుండా, ధర్మాన్ని స్థాపించడానికి చేస్తున్నారు.
సారాంశంగా, ఈ పద్యాలు మనకు చెప్పేది—
జీవితం అనే యుద్ధంలో శక్తి, వ్యూహం అవసరం అయినా,
ధర్మం, ధైర్యం, స్పష్టమైన లక్ష్యం ఉంటేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది.
మీ పద్యాల భావగంభీరత ఉపన్యాసరూపంలో కూడా చక్కగా ప్రతిబింబిస్తుంది. ఇదే విధంగా కొనసాగిస్తే ఒక సమగ్ర గీతా ప్రవచనమాలగా రూపుదిద్దుకుంటుంది.
***
102..92/05/ నేటి వృత్త, సీస పద్యాలు.
(మ) జవరాలే మరిదీక్ష పట్టగతిగాన్ జాప్యంబు ధర్మంబుగన్
నవరాత్రుల్ సుఖ యుక్తిగాంచగవిధీ నాణ్యత్వ సంభావ్యతన్
కువలేశాయని శ్రీనివాస తలపుల్ మూల్యంబు కాలంబుగన్
భవబంధాలగు ధర్మపద్దతిగను ప్రాబళ్యంబు జీవంబుగన్
సరళ భావం
జీవితంలో తీసుకున్న దీక్షను ఆలస్యం చేయకుండా ధర్మబద్ధంగా కొనసాగించాలి.నవరాత్రుల వంటి పవిత్ర సందర్భాలు మనసుకు సుఖశాంతులు, యుక్తి, ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తాయి. శ్రీనివాసుని స్మరణలు కాలానికి విలువను తెలియజేస్తూ మనస్సుకు మార్గదర్శకమవుతాయి.ఈ లోక జీవనంలోని బంధనాల మధ్య కూడా ధర్మపద్ధతి జీవనానికి బలాన్ని, స్థిరత్వాన్ని, ప్రాబల్యాన్ని ఇస్తుంది.
****
(ఉ)వాడలలో పతాకము ప్రవాహముగాయెగిరేను సఖ్యతా
వేడుక తీరుగా కనులు వీ నులు విందగు కాల తీరు యా
కూడలి కూరిమీ మనసు కూ ర్చెడి విద్యల తీరు బోధగన్
కూడిక యేకమైసహన కూర్పగు జాగృతి మే దినోత్సవమ్
సరళ భావం —
వాడవాడలలో ఎగిరే పతాకాలు కార్మికుల ఐక్యతకు ప్రతీకలై కనిపిస్తున్నాయి.
ఆ వేడుకల సందడి కనులకు, వినులకు ఆనందాన్ని పంచుతోంది.
కార్మికుల కూడళ్లలో పరస్పర సహకారం, విద్య, చైతన్యం, హక్కుల బోధ వెలుగుతోంది.
అంతిమంగా అందరూ ఒక్కటై సహనంతో, ఐక్యతతో నిలబడటమే “మే దినోత్సవం” యొక్క అసలైన సందేశమని పద్యం తెలియజేస్తోంది.
****
సీస.కర్మతీ రుగమన కాల విధి చరిత
కార్మిక కష్టపు కామ్య మలువు
మర్మమాయ పలుకు మనజీవన మెతుకు
మర్మము తెలియక మానసంబు
ధర్మ పోరు సలుపు ధరణి తృప్తినిగాంచ
ధర్మ ముసుగు తెల్ప ధారి కవిత
శర్మ బీదధనిక శాంతికోర కలము
శర్మ శ్రీ శ్రీరంగ శ్రీనివాస
గీ..సహజ సంపద బ్రతుకుకు సాధు శీల
వినయ కర్తవ్య దీక్షగా విద్యలగును
అణువు అణువు మార్పుకు కృషి ఆశ తీర్చ
క్షణమొ కయుగము జీవన కామ్య భవము
*****
సీస. అక్షర సంపద ఆకలి తీర్చగా
తక్షణమే సహితాను భవము
రక్షిత కార్మిక రమ్యత కూర్చగా
శుక్షిత ధర్మము శుభము తరము
అక్షయ నేస్తమై అక్కర తోడుగా
కక్షలు లేనట్టి కాల మహిమ
వీక్షణ విశ్వము విద్య కవిత్వమై
విజ్ఞత శ్రీశ్రీగ శ్రీనివాస
ఆ. వె.కాల బతుకు గాను కలము కార్మిక దీక్ష
కలలు తీర్చ మనసు గమ్య మగుట
వలల నుండి రక్ష వాక్కు తీరుగ పోరు
అలల జీవనంబు ఆశ మార్చ
*****
నేటి(1-05-2026)పాదాది.. న్యస్తాక్షరి(అ..ను...భ..వం)
అణుకువ కళలు జీవన ఆత్మ దీప
నునుపు నలుపు పలుకుతీపి నొప్పి గాను
భవ పరామృత లక్ష్యంబు భావ పరము
వంచన గనలేనితనము వరము మలుపు
సరళ భావం :
అణుకువ మరియు మంచి కళలు జీవితానికి ఆత్మదీపంలాంటివి.
మన మాటల్లో మృదుత్వం ఉండాలి; అవసరమైనప్పుడు నొప్పి కూడా బోధగా మారుతుంది.
జన్మమరణాలకు అతీతమైన పరమార్థమే జీవన లక్ష్యం.
వంచనలేని నిజాయితీ మనిషికి గొప్ప వరంగా, జీవిత మలుపుగా నిలుస్తుంది.
*****
అన్యుల పనులు మనసున హద్దు మీర
నుతులు పరువును త్రుంచుచు నొప్పి చేయ
భవితకు తెలిపి పడినట్టి బాధ నంత
వంశజులకు వివరముగ వాక్కు తోడ!
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట.
******
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525పాదాది న్యస్తాక్షరికి పూరణ
---------------
వైరమును సజ్జనావళి కోరదెపుడు,
శాస్త్రమును గురువుల కడ చదువవలెను,
ఖలులతో స్నేహమును జేయ కస్తి గలుగు,
మునులమాటలు విన్నచో ముక్తి గలుగు.
2
అన్న మాటను దప్పిన నఘము గలుగు,
నుతికి లొంగని వాడు జగతిని లేడు,
భక్తి చూపవలెను పెద్దవారి పట్ల,
వంచనాపరులను నమ్మవలదు భువిని.
******
మాతృశ్రీ దత్తపది.. తాను,మాను,రాను, కాను
మ. కో. తాను జీవన సఖ్యతాభవ తత్వ శాంతి శుభంబుగన్
మాను తీరుగ యెల్లవేళల మంచి జేయగ మార్గమున్
రాను యన్నది చెప్పగూడని రాత్రి నైనను సేవగన్
కాను నేస్తము నన్నతీరుగ కాన రానిది కాలమున్
సరళ భావం :
తన జీవితం సఖ్యత, తత్వం, శాంతి మరియు శుభములతో నిండియుండాలి.
ఎల్లప్పుడూ మంచిని చేయడమే మన జీవన మార్గంగా ఉండాలి.
“రాను” అని చెప్పకుండా, రాత్రివేళ అయినా సేవ చేయగల మనసు ఉండాలి.
నిజమైన స్నేహం కాలంతో కొలవలేనిది; అది ఎప్పటికీ కనుమరుగుకాని అనుబంధం.
******
(కం) రాను పలుకు లేల మనసు
కాను తరము లోన కాల గమ్యం తోడున్
తాను వినయ ధర్మముగాఁ
మాను విధాన సుఖ దుఃఖ మానము తీరున్
సరళ భావం :
“రాను” అనే నిరాకరణ మాటలు మనసులో ఎక్కువగా ఉండకూడదు.
కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించాలి.
తన జీవితం వినయం మరియు ధర్మంతో నడవాలి.
సుఖదుఃఖాలను సమంగా స్వీకరించే విధానమే నిజమైన మానవతా మార్గం.
*****
పాదాది.. గంభీరము
గంగ ఉరవడి పరుగులు గలగలలగు
భీతి చెందక సాగర ప్రేమ కోర
రక్ష గాఁ దాహ తృప్తియు లయలు తీరు
ముప్పు లెన్ని యున్నను కర్మ మునిగి తేలు
జీవితమనే గంగ ఉరవడిగా, గలగలలాడుతూ ముందుకు పరుగులు తీస్తుంది.
ఎన్ని భయాలు, అడ్డంకులు వచ్చినా భీతి చెందకుండా సాగరసమానమైన పరమగమ్యాన్ని చేరాలని కోరుతుంది.
దారిలో దాహాన్ని తీర్చుతూ, రక్షణనిస్తూ, ఎన్నో లయలతో ప్రయాణం సాగుతుంది.
ముప్పులు ఎన్నున్నా, కర్మలో మునిగి తేలినవారే గమ్యాన్ని చేరగలరనే గంభీరమైన జీవనసత్యం ఇందులో దాగి ఉంది.
******
ఆ.వె.
*గం* ధమలదెదనయ గరుడవాహన! పాప
*భీ* తినిడుమ దేవ! తాతతాత!
*ర* క్ష నీవె మాకు లక్ష్మీపతి! యనంత!
*ము* ప్పు లెల్ల బాపుము హరి! చక్రి!
[ తాతతాత = బ్రహ్మ తండ్రి, విష్ణు మూర్తి ]
భావము:
ఓ గరుడవాహన! నీకు గంధమును పూసి సేవచేయుదును. మాకు పాపభయాన్ని కలిగించి, పాపం చేయకుండునట్లు వివేకభక్తిని ప్రసాదింపుము. ఓ దేవా! తాతతాతా - విష్ణుమూర్తీ! శ్రీలక్ష్మీపతి! అనంత! నీవే మా ఆశ్రయము, నీవే మా రక్షకుడవు. దయతో మా బాధలన్నిటిని తొలగింపుము. ఓ హరీ! సుదర్శన చక్రధారీ! మాకు కలిగే సమస్త ముప్పులను నివారించి, ఎల్లప్పుడు కాపాడుము.
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
*****
*_𝕝𝕝ॐ𝕝𝕝 02/05/2026 -
వైశాఖ బహుళ పాడ్యమి - దేవర్షి శ్రీ నారద ముని వారి జయన్తీ 𝕝𝕝卐𝕝𝕝_*
*≈
*_దేవర్షి శ్రీ నారద ముని_*
నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు. నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది.
*ముల్లోక సంచారి*
నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంత మంది మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను *“కలహా భోజనుడు” గా “కలహా ప్రియుడు” గా* అభివర్ణించారు.
ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు *‘యదార్ధవాది లోక విరోధి’*. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్న చూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించే వాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, మానవ, దానవులకు సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.
*‘నార’* అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని , *‘ద’* అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి , వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతే కాదు, నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.
*జన్మ వృత్తాతం*
ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి , అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.
*ధర్మ రక్షణలో నారదుడి పాత్ర*
*రామాయణ రచనలో*
రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో *“ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ?”* అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.
*మహర్షికి మార్గదర్శనం*
ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ , యజుర్ , సామ , అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి , సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం , మహాభారతం , భాగవతాలను గ్రంధస్థం చేయడంలో , వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.
అలాగే వాల్మీకి, ధ్రువుడు, చిత్రకేతు, ప్రహ్లాదుడు, సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.
*ధ్రువుడు*
ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు సునీత. ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి *“నువ్వు రాజు కావడానికి అనర్హుడివి” అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ళ వయసులోనే అడవి బాట పడతాడు ధ్రువుడు. ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. “ఓం నమో భగవతే వాసుదేవాయ”* అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు.
*చిత్రకేతు*
శూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నోఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక లేక పుట్టిన కుమారడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతనిని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో , తన యోగ శక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకొన్న అ బాలుడు *“నేను ఎన్నో జన్మలను ఎత్తాను. ఎంతోమంది తల్లితండ్రులను చూశాను. ఒకరి చేతిలోనుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణెం లాగా మానవుడు తన కర్మాను సారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు.నేను ఈ జన్మ చక్రం నుంచి బయట పడాలను కుంటున్నాను”* అని దేహ త్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయమవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు.
*భక్త ప్రహ్లాద*
భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతం లోనూ మనకు నారదుడు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మంధర పర్వతం మీద తపస్సుచేసుకుంటూ ఉండగా, ఇంద్రుడు అతని భార్యని చెరపడతాడు. వెంటనే అక్కడకు వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు.
*సతీ సావిత్రి*
సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తారు. మద్ర రాజు ఆశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగు తుంది. నారదుడు వచ్చి సత్య వంతుడు చాలా బుద్ధిమంతుడని , అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగు తుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మ రాజు ను మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది.
శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం, ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి కూడా నారదుడు వివరిస్తాడు. పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు, ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.
ఇంకా వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ, కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని, ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని నారద స్మృతి’ అంటారు. నారదుని *“నారద శిక్ష”* అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము , దాని విశిష్టత , దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది. ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.
*మొదటి పాత్రికేయుడు నారదుడు*
ఇలా చెప్పుకొంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.
నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పత్రికేయులందరికి మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం.
*నారద జయంతి – ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం*
మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయంచేకూర్చే కొంతమంది పాత్రికేయులకుసన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించు కొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి? ధర్మ మార్గంలో నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ గురుభ్యో నమః 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo నమో నారాయణాయ 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝ॐ𝕝𝕝 దేవర్షి శ్రీ నారద ముని వారి జయన్తీ శుభాకాంక్షలు 𝕝𝕝卐𝕝𝕝_*****
నేటి(1-05-2026)పాదాది.. న్యస్తాక్షరి(అ..ను...భ..వం)
అణుకువ కళలు జీవన ఆత్మ దీప
నునుపు నలుపు పలుకుతీపి నొప్పి గాను
భవ పరామృత లక్ష్యంబు భావ పరము
వంచన గనలేనితనము వరము మలుపు
సరళ భావం :
అణుకువ మరియు మంచి కళలు జీవితానికి ఆత్మదీపంలాంటివి.
మన మాటల్లో మృదుత్వం ఉండాలి; అవసరమైనప్పుడు నొప్పి కూడా బోధగా మారుతుంది.
జన్మమరణాలకు అతీతమైన పరమార్థమే జీవన లక్ష్యం.
వంచనలేని నిజాయితీ మనిషికి గొప్ప వరంగా, జీవిత మలుపుగా నిలుస్తుంది.
*****
అన్యుల పనులు మనసున హద్దు మీర
నుతులు పరువును త్రుంచుచు నొప్పి చేయ
భవితకు తెలిపి పడినట్టి బాధ నంత
వంశజులకు వివరముగ వాక్కు తోడ!
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట.
******
దిట్టకవి శ్రీనివాసాచార్యులు
వైరమును సజ్జనావళి కోరదెపుడు,
శాస్త్రమును గురువుల కడ చదువవలెను,
ఖలులతో స్నేహమును జేయ కస్తి గలుగు,
మునులమాటలు విన్నచో ముక్తి గలుగు.
2
అన్న మాటను దప్పిన నఘము గలుగు,
నుతికి లొంగని వాడు జగతిని లేడు,
భక్తి చూపవలెను పెద్దవారి పట్ల,
వంచనాపరులను నమ్మవలదు భువిని.
******
మాతృశ్రీ దత్తపది.. తాను,మాను,రాను, కాను
మ. కో. తాను జీవన సఖ్యతాభవ తత్వ శాంతి శుభంబుగన్
మాను తీరుగ యెల్లవేళల మంచి జేయగ మార్గమున్
రాను యన్నది చెప్పగూడని రాత్రి నైనను సేవగన్
కాను నేస్తము నన్నతీరుగ కాన రానిది కాలమున్
సరళ భావం :
తన జీవితం సఖ్యత, తత్వం, శాంతి మరియు శుభములతో నిండియుండాలి.
ఎల్లప్పుడూ మంచిని చేయడమే మన జీవన మార్గంగా ఉండాలి.
“రాను” అని చెప్పకుండా, రాత్రివేళ అయినా సేవ చేయగల మనసు ఉండాలి.
నిజమైన స్నేహం కాలంతో కొలవలేనిది; అది ఎప్పటికీ కనుమరుగుకాని అనుబంధం.
******
(కం) రాను పలుకు లేల మనసు
కాను తరము లోన కాల గమ్యం తోడున్
తాను వినయ ధర్మముగాఁ
మాను విధాన సుఖ దుఃఖ మానము తీరున్
సరళ భావం :
“రాను” అనే నిరాకరణ మాటలు మనసులో ఎక్కువగా ఉండకూడదు.
కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించాలి.
తన జీవితం వినయం మరియు ధర్మంతో నడవాలి.
సుఖదుఃఖాలను సమంగా స్వీకరించే విధానమే నిజమైన మానవతా మార్గం.
*****
పాదాది.. గంభీరము
గంగ ఉరవడి పరుగులు గలగలలగు
భీతి చెందక సాగర ప్రేమ కోర
రక్ష గాఁ దాహ తృప్తియు లయలు తీరు
ముప్పు లెన్ని యున్నను కర్మ మునిగి తేలు
జీవితమనే గంగ ఉరవడిగా, గలగలలాడుతూ ముందుకు పరుగులు తీస్తుంది.
ఎన్ని భయాలు, అడ్డంకులు వచ్చినా భీతి చెందకుండా సాగరసమానమైన పరమగమ్యాన్ని చేరాలని కోరుతుంది.
దారిలో దాహాన్ని తీర్చుతూ, రక్షణనిస్తూ, ఎన్నో లయలతో ప్రయాణం సాగుతుంది.
ముప్పులు ఎన్నున్నా, కర్మలో మునిగి తేలినవారే గమ్యాన్ని చేరగలరనే గంభీరమైన జీవనసత్యం ఇందులో దాగి ఉంది.
******
ఆ.వె.
*గం* ధమలదెదనయ గరుడవాహన! పాప
*భీ* తినిడుమ దేవ! తాతతాత!
*ర* క్ష నీవె మాకు లక్ష్మీపతి! యనంత!
*ము* ప్పు లెల్ల బాపుము హరి! చక్రి!
[ తాతతాత = బ్రహ్మ తండ్రి, విష్ణు మూర్తి ]
భావము:
ఓ గరుడవాహన! నీకు గంధమును పూసి సేవచేయుదును. మాకు పాపభయాన్ని కలిగించి, పాపం చేయకుండునట్లు వివేకభక్తిని ప్రసాదింపుము. ఓ దేవా! తాతతాతా - విష్ణుమూర్తీ! శ్రీలక్ష్మీపతి! అనంత! నీవే మా ఆశ్రయము, నీవే మా రక్షకుడవు. దయతో మా బాధలన్నిటిని తొలగింపుము. ఓ హరీ! సుదర్శన చక్రధారీ! మాకు కలిగే సమస్త ముప్పులను నివారించి, ఎల్లప్పుడు కాపాడుము.
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
*****
Comments
Post a Comment