17-5

 






ఎల్పట్టు సింభిగె -- ఎల్పట్టు సింభగయ్

........................................

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామంలోని ఈశ్వరాలయంలో  లభించిన ప్రాచీన శిలాశాసనం దక్షిణ భారత రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రాథమిక ఆధారంగా నిలుస్తోంది. తేదీ స్పష్టంగా పేర్కొనబడనప్పటికీఈ శాసనంలోని చారిత్రక అంశాలు, లిపి ఆధారంగా ఇది  7వ శతాబ్దానికి (సుమారు  635–642 ACE మధ్య కాలానికి) చెందినదిగా చరిత్రకారులు నిర్ధారించారు.

ఈ శాసనాన్ని 1890 - 1900 మధ్యకాలంలో శాసనపరిశోధకులు (ఎఫిగ్రఫిస్ట్స్) చదవడం జరిగింది.


బాదామిచాళుక్య చక్రవర్తి అయిన రెండో పులకేశి కాలంలో వేయబడిన ఈ శాసనం హళెగన్నడ (పాత కన్నడ) భాషలో ఉంది. బాదామి గుహలలోని ఐహోళే ప్రశస్తి శాసనాలతో పాటుగా కన్నడభాషా వికాసాన్ని అధ్యయనం చేయడానికి లభిస్తున్న తొలి శాసనాలలో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. దక్కన్ పీఠభూమిలో చాళుక్యుల సామ్రాజ్య విస్తరణ అంతర్యుద్ధాలు సరిహద్దు తగాదాలు రాయలసీమ ప్రాంతంపై బాదామి చాళుక్యుల పరిపాలనా ప్రభావం మొదలైనవి అర్థం చేసుకోవడానికి ఈ శాసనం ఎంతగానో దోహదపడుతోంది.


ఈ శాసనం ప్రధానంగా రెండో పులకేశి సాధించిన ఒక గొప్ప సైనిక విజయం తరువాత చేసిన భూదానాన్ని వివరిస్తుంది. "రణవిక్రమ" అనే బలమైన ప్రత్యర్థిపై సాధించిన విజయానికి గుర్తుగా, పులకేశి "ఎల్పట్టు సింభిగె" లేదా "ఎల్పట్టు-సింభగయ్" అని పిలవబడే గ్రామాన్ని దానమిచ్చినట్లు ఇందులో లిఖించబడింది. ప్రాచీన భారతదేశంలో యుద్ధాల్లో గెలిచిన తర్వాత రాజులు గ్రామాలను భూములను దానం చేయడం ఒక  సాంప్రదాయంగా ఉండేది. ఇది కేవలం పుణ్యం కోసమే కాకుండా కొత్తగా జయించిన సరిహద్దు ప్రాంతాలపై తమ సార్వభౌమాధికారాన్ని శాశ్వతంగా స్థిరపరుచుకోవడానికి ఉపయోగపడే రాజకీయ వ్యూహంగా ఇవి ఉపయోగపడేవి. ప్రస్తుత కాలంలో "ఎల్పట్టు సింభిగె" అనే గ్రామం భౌగోళికంగా ఏ ప్రాంతమనేది స్పష్టంగా గుర్తించబడనప్పటికీఅది నాటి అనంతపురం గుత్తి పరిసరాల్లోని బాణ రాజ్యసరిహద్దుల్లో ఉన్న ఒక ప్రముఖ సైనికస్థావరం లేదా యుద్ధక్షేత్రమై ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.ఆ కాలంలో అనంతపురం ప్రాంతం చాళుక్యులు, పల్లవులు, బాణుల వంటి బలమైన రాజవంశాల మధ్య నిరంతర పోరాటానికి కేంద్రంగా ఉండటం వల్ల ఈ దానానికి రాజకీయంగా ప్రాధాన్యతనంతరించుకొంది.


రాయలసీమలో ఈ కన్నడ శాసనం లభించడం చారిత్రకంగా అత్యంత ఆసక్తికరమైన అంశం.బాదామి చాళుక్యుల సామ్రాజ్యం బహుభాషలు, విభిన్న సంస్కృతులు గల సువిశాల ప్రాంతాలను కలిగి ఉన్నప్పటికీ వారు తమ రాజప్రకటనలు, భూదానాలు అధికారిక ఉత్తర్వుల కొరకు కన్నడభాషను ప్రధానపరిపాలనా భాషగా ఉపయోగించారని ఈ శాసనం నిరూపిస్తోంది.ఇది నాటి ఆంధ్ర ప్రాంతంలో చాళుక్యుల రాజకీయ విస్తరణతో పాటు వారి భాషా సాంస్కృతిక ప్రభావం ఎంత బలంగా ఇక్కడ వ్యాపించి ఉందో స్పష్టం చేస్తుంది.


ఈ శాసనంలో పేర్కొనబడిన “రణవిక్రమ” అనేవారు ఎవరనే విషయంపై చరిత్రకారుల మధ్య  భిన్నమైన వాదనలు, సుదీర్ఘమైన చర్చలు నడుస్తున్నాయి.ఒక ప్రముఖసిద్ధాంతం ప్రకారం, 'రణవిక్రమ' అనేవాడు రెండో పులకేశి పినతండ్రి లేదా మామ అయిన మంగళేశుని బిరుదు.ఐహోళే ప్రశస్తి శాసనాన్ని రచించిన రవికీర్తి ప్రకారం మంగళేశుడు తన సొంత కుమారుడిని బాదామి సింహాసనంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించినప్పుడు ఆ రాజ్యానికి వారసుడైన రెండో పులకేశి ఆ నిర్ణయాన్ని ధిక్కరించాడు. దీనివల్ల చాళుక్య రాజవంశంలో తీవ్రమైన వారసత్వ అంతర్యుద్ధం చెలరేగింది.ఈ వాదనను సమర్థించే చరిత్రకారులు పెద్దవడుగూరు శాసనాన్ని ఆ అంతర్యుద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా భావిస్తారు.వారి అభిప్రాయం ప్రకారం ఎల్పట్టు సింభిగె వద్ద జరిగిన తుది పోరాటంలో రెండో పులకేశి మంగళేశుడిని (రణవిక్రముడిని) హతమార్చి బాదామి సింహాసనాన్ని దక్కించుకున్నాడు.


 మరోవర్గం చరిత్రకారులు రణవిక్రముడు చాళుక్య వంశస్థుడు కాదనినాటి దక్షిణాంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను పాలించిన స్థానిక బాణరాజవంశానికి చెందిన పాలకుడని వాదిస్తున్నారు.ఈ సిద్ధాంతం ప్రకారం బాదామిలో అధికారాన్ని స్థిరపరుచుకున్న తర్వాత రెండో పులకేశి దక్షిణ దండయాత్రలు చేపట్టి చాళుక్య సార్వభౌమాధికారాన్ని నిరాకరించిన బాణులను అణచివేశాడు.ఆ విజయానికి అధికారిక ప్రకటనగా అనంతపురం ప్రాంతాన్ని చాళుక్య సామ్రాజ్యంలో విలీనం చేసుకుంటూ ఈ శాసనాన్ని వేయించాడని వారి నమ్మకం.


రెండో పులకేశి పరిపాలనా కాలం దక్షిణ భారత చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం మరియు మహత్తర మలుపు. ఆయన నాయకత్వంలో బాదామి చాళుక్యులు నర్మదా నది నుండి కావేరి నది వరకు విస్తరించి అజేయమైన సామ్రాజ్యంగా ఎదిగారు. ఉత్తర భారత చక్రవర్తి హర్షవర్ధనుడి దిగ్విజయ యాత్రలను నర్మదా నది తీరంలో అడ్డుకుని ఆయనను ఓడించిన ఏకైక దక్షిణ భారత పాలకుడిగా రెండో పులకేశి చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాకుండా కాంచీపుర పల్లవులతో ఆయన జరిపిన దీర్ఘకాలిక యుద్ధాలు చేశాడు. తూర్పుతీరంలోని వేంగి (రాజమహేంద్రవరం ) ప్రాంతాన్ని జయించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని అక్కడ ప్రతిష్టించడం ద్వారా తూర్పు చాళుక్య (వేంగి చాళుక్య) వంశ స్థాపనకు ఆయనే కారకుడయ్యాడు. ఈ సుదీర్ఘ చారిత్రక నేపథ్యంలో పెద్దవడుగూరులోని ఈశ్వరాలయ శిలాశాసనం కేవలం ఒక సాధారణ భూదాన పత్రం మాత్రమే కాదు.ఇది చాళుక్యుల సామ్రాజ్య నిర్మాణ క్రమాన్ని వారి అంతర్గత వారసత్వ పోరాటాలను భాషా పరిణామాన్ని రాయలసీమ ప్రాంతపు మధ్యయుగ చరిత్రను సమగ్రంగా పునర్నిర్మించడానికి లభించిన ఒక అమూల్యమైన చారిత్రక సంపద.


॥సేకరణ॥

................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

ఎర్రచందనం ప్రధాన కొనుగోలుదారు ఎవరు ? ఏం చేస్తారు ? దొంగరవాణాకు కారణమేమిటి ?

......................................

ఎర్రచందనం శాస్త్రీయ నామం Pterocarpus santalinus. ఇది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN)  జాబితాలో అంతరించే ప్రమాదంలో ఉన్న వృక్షజాతిగా గుర్తించబడింది.  కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం పర్వత శ్రేణుల్లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోనే పెరుగుతుంది. భౌగోళిక పరిమితి కారణంగా దీని లభ్యత చాలా అరుదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతోంది. ఎర్రచందనం వయసు & రకాన్ని బట్టి టన్ను ధర లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటుంది.అందుకేతక్కువ పెట్టుబడితో భారీ లాభాల కోసం  స్మగ్లర్లు దొంగరవాణా చేస్తారు.భారత ప్రభుత్వం ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించడం, CITES అంటే అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వ్యాపార సదస్సు అనుబంధం - 2  క్రింద ఈ వ్యాపారాన్ని నియంత్రించడం వల్ల చట్టబద్ధ మార్గంలో సరఫరా జరగక, డిమాండ్‌ను తీర్చడానికి దొంగరవాణా జరుగుతుంది.


 ప్రపంచవ్యాప్తంగా దీని ప్రధాన కొనుగోలు దేశం చైనా, అక్రమంగా తరలించే సరుకులో 90% పైగా చైనాకే చేరుతుందని అంచనా. చైనాలో ఎర్రచందనంతో చేసిన ఫర్నిచర్‌ను సంపద, హోదాకు చిహ్నంగా భావిస్తారు, ఈ కలపతో చేసిన మంచాలు, కుర్చీలు, టేబుళ్లు వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిలుస్తాయి. ఇంకా అణుశక్తి రంగంలో ఉపయోగిస్తారని కూడా వినికిడి. జపాన్‌లో షామిసేన్ వంటి సాంప్రదాయ సంగీత వాయిద్యాల తయారీలో వాడతారు. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో కూడా దీని డిమాండ్ ఉంది.అక్కడ అలంకరణ వస్తువులు నగల పెట్టెలు బుద్ధ విగ్రహాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదం వైద్యంలో ఎర్రచందనం చర్మ వ్యాధులు జ్వరం జీర్ణ సమస్యల చికిత్సకు రక్తశుద్ధికి వాడతారు. సౌందర్య సాధనాల్లో ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మం కాంతివంతమవుతుంది.మొటిమలు తగ్గుతాయి. దీని నుంచి తీసిన సహజ ఎరుపు రంగును ఆహార పదార్థాలను వస్త్ర పరిశ్రమలో వాడతారు. అణు రియాక్టర్లలో రేడియేషన్ నియంత్రణకు వాడతారనే ప్రచారం కూడా వుంది కాని శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎర్రచందనం ప్రధాన వినియోగం విలాస వస్తువుల తయారీకే పరిమితమని మనం నమ్మాలి.


 భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 (షెడ్యూల్ II) ప్రకారం ఎర్రచందనం అక్రమ రవాణా, నిల్వ, వ్యాపారం శిక్షార్హమైన నేరాలు. ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసి స్మగ్లింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ డిమాండ్, అధిక లాభాల ఆశ, కొందరి పోలీసుల అటవీ అధికారుల ఉదాశీనత, స్థానిక పేదరికం వంటి కారణాల వలన అక్రమ రవాణా పూర్తిగా తగ్గడం కష్టసాధ్యం. అందువల్ల ఎర్రచందనం సంరక్షణకు కేవలం ప్రభుత్వ చట్టాలు మాత్రమే కాకుండా స్థానిక కమ్యూనిటీలలో చైతన్యం, ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పన, వనాల పునరుద్ధరణ ద్వారా సహజ వనరుల స్థిరమైన వినియోగం అవసరం.

IIసేకరణII

...........జి బి విశ్వనాథ 9441245857 అనంతపురం

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026