శైవ – వైష్ణవ వేషధారణలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో  

.......................................

ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో భారతీయ ఆచారాలు, సంప్రదాయాలు, మతపరమైన విషయాలు చిత్రరూపంలో ప్రతిబింబించబడ్డాయి.  

భారతీయ మతపరమైన వర్గాలు, కులాలు, వృత్తులు, వేషధారణలు, ఆచారాలను నమోదు చేసి  భారతదేశంలో ఉన్న బ్రిటిష్ అధికారులకు “ భారతీయులు” ఎలా ఉంటారో వారి సంపన్నమైన నాగరికత ఏమిటో చూపించడానికి, అలాగే  ఐరోపా దేశాలకు మన సంప్రదాయాలను తెలియజేయడానికి ఇలాంటి చిత్రాలు రూపొందించబడ్డాయి. ఫోటోగ్రఫీ అప్పట్లో లేనందున, భారతీయ నాగరికతను చిత్రరూపంలో నమోదు చేసి తమ ప్రజలకు అందించారు. ఈ చిత్రం దక్షిణ భారత భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ఉదాహరణ.  

ఈ కళాఖండం 1830–1850 మధ్యకాలంలో రూపొందిన కంపెనీ పెయింటింగ్ శైలికి చెందినది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ మత సంప్రదాయాలను నమోదు చేస్తూ ఉన్న సమయంలో ఇది రూపొందించబడింది.  

ఈ చిత్రంలో ప్రధానంగా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతానికి చెందిన భక్తులను చూపించారు.  

చిత్రంలో ఎడమ నుండి కుడి వరకు మూడు వేర్వేరు భక్తి జంటలు కనిపిస్తాయి. మొదటి జంట వైష్ణవ సంప్రదాయానికి చెందినది. పురుషుడు తన నుదుటిపై ‘ తిరునామం అంటే ఊర్ద్రపుoడ్రం/తిరుమణి/ నిలువునామం’ ధరించి, హనుమంతుడి చిహ్నం ఉన్న జెండాను పట్టుకున్నాడు. అతని భార్య నుదుటిపై ఎరుపు తిలకాన్ని ధరించి, పూలమాలలు, సంప్రదాయ వైష్ణవ స్త్రీల వస్త్రధారణలో కనిపిస్తుంది. అతను తెల్ల అంగవస్త్రం, ధోతి, గుండ్రటి తెల్ల తలపాగా ధరించి, రుద్రాక్షమాల వేసుకుని, చేతిలో తెల్ల పాత్రను పట్టుకున్నాడు. ఆమె చేతిలో పెద్ద కమండలం ఉంది.  

మధ్యలో ఉన్న జంట శైవ సంప్రదాయానికి, ముఖ్యంగా ‘పండారం’ లేదా జంగమ వర్గానికి చెందినది. వీరి నుదుటిపై విభూతి గీతలు ఉన్నాయి. భిక్షా పాత్రలు భుజాలపై వేసుకుని, సంచార భక్తి జీవనాన్ని సూచిస్తున్నారు. మహిళ కూడా విభూతి ధరించి, సాధారణ వస్త్రధారణలో ఉంది. జంగముడు పొడవైన రంగురంగుల తలపాగా ధరించి, ఎడమ చేతి కింద త్రిశూలాన్ని పెట్టుకుని, కుడి చేతిలో జగిటాను పట్టుకున్నాడు.  

శైవ సంప్రదాయంలో పండారులుఅంటే శివాలయాలలో పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించే ఒక ప్రత్యేకమైన అర్చక లేదా పూజారి వర్గం. ప్రధానంగా తమిళనాడు, కేరళ వంటి దక్షిణ భారత ప్రాంతాలలో వీరు శైవ ఆగమ పద్ధతిలో శివారాధన చేస్తారు. ఆంధ్రదేశంలో వీరిని తంబళ్ళవారని అంటారు.చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి ఉంది కదా!

కుడివైపు ఉన్న జంట దాసరి వర్గానికి చెందినది. దాసరులు తెలుగు మరియు దక్షిణ భారత సమాజంలో సంచార భక్తులుగా, ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకులుగా ప్రసిద్ధి చెందారు. వీరు గ్రామ గ్రామాలకు తిరుగుతూ భజనలు పాడుతూ, మతప్రచారం చేస్తూ, శ్రీ వైష్ణవ సందేశాన్ని ప్రజలకు చేరవేసేవారు. వీరు మోసే నెమలి ఈకల కట్టలు కృష్ణుడి భక్తిని సూచిస్తాయి.శంఖం విష్ణువును సూచిస్తుంది.గంట నిత్యపూజా సాధనంగా ఉపయోగిస్తారు. దీపస్తంభం జ్ఞానప్రకాశాన్ని సూచిస్తుంది.  

దాసరులు కేవలం భక్తులు మాత్రమే కాదు. వారు మతప్రచారకులు, జానపద కళాకారులు, పురాణ కథల వాచకులుగా కూడా పనిచేసేవారు. వీరికి తిరుపతి వేంకటేశ్వర ఆలయంతో ప్రత్యేక సంబంధం ఉండేది. స్వామి ప్రసాదం, తీర్థం గ్రామాలకు తీసుకెళ్లడం, భక్తుల తరఫున వ్రతాలను నెరవేర్చడం వీరి ప్రధాన సేవలు. తులసీమాల, పీతాంబరం, ఒకచేతిలో దీపమున్న గరుడ స్తంభం, మరోచేతిలో వాయించడానికి పట్టుకొన్న జాగిట, నుదుటన నామం వీరి వైష్ణవ గుర్తింపును స్పష్టంగా తెలియజేస్తాయి.  

ఈ చిత్రంలో ఆ కాలపు సామాజిక మత వర్గీకరణ, వేషధారణ, శైవవైష్ణవ భేదాలు బాహ్య చిహ్నాల ద్వారా ఎంత స్పష్టంగా గుర్తించబడ్డాయో తెలుస్తుంది. వైష్ణవ గృహస్థులు, శైవ పండారాలు, దాసరి సంచార భక్తులు ఇలా ప్రతి వర్గం తమ ప్రత్యేక వేషధారణ, ఆచారాలతో సమాజంలో తమ సముచిత స్థానాన్ని నిర్వచించుకుంది. ఈ చిత్రం ఆ కాలపు జీవన మత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందనటం అతిశయోక్తి కాదు.  

కంపెనీ పాలకులు స్థానిక హిందూ ఆచారాలను చిత్రీకరించేటప్పుడు భక్తి భావనకు  వాస్తవికతకు ప్రాధాన్యం ఇచ్చి, వాస్తవ దృష్టితో ఈ చిత్రాలను రూపొందించారు. అందువల్ల ఈ చిత్రం కేవలం కళాఖండం మాత్రమే కాదు. ఇది 19వ శతాబ్దపు దక్షిణ భారత మత సామాజిక జీవితాన్ని ప్రతిబింబించే చారిత్రక పత్రం.  

IIసేకరణll

............జి.బి. విశ్వనాథ 9441245857 అనంతపురం

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ