ఉత్తమం సహజావస్థా ద్వితీయం ధ్యానధారణా
తృతీయాప్రతిమా పూజా హోమయాత్రాచతుర్థికా – శివపురాణం
అంటే, భగవంతుని తనలో ప్రత్యక్షం (ఆత్మదర్శనం)చేసుకోవడం ఉత్తమమయినది. భగవంతుని గురించిన జ్ఞానము, ధారణ దాని తరువాతవి. మూడవది భగవంతుని ప్రతిమలను పూజించడం. నాలుగవది పుణ్యక్షేత్రాలను దర్శించడం. చివరి రెండూ సామాన్య భక్తుల కోసం ఉద్దేశించినవి. పరామాత్మ అనుగ్రహం పొందడానికి విగ్రహారాధన ఒక మెట్టు వంటిది.
అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాః పరికల్పితాః – ధర్మనోపనిషత్
సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్థమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది.ఈ విధంగా ఏర్పడిన విగ్రహారాధన డవార్యదోర్వీర్యంబుఆ మోక్షాన్ని పొందవచ్చు. దీనికి భక్తి ప్రధానం.
భక్త్యా వీణా బ్రహ్మజ్ఞానం న కదా చిదపి జాయతే – మహానారాయణోపనిషత్
గోపికావస్త్రాపహరణం వెనుకగల అసలు కారణమేమిటి ?
.....................................
శ్రీమద్భాగవత దశమస్కంధంలోని గోపికావస్త్రాపహరణ ఘట్టం కేవలం ఒక అల్లరిచేష్టగా చూడదగినది కాదు, అది జీవాత్మ పరమాత్మల అనుసంధాన ప్రక్రియకు ఒక గొప్ప నిదర్శనం.
మార్గశిర మాసంలో నందగోకుల గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడిని తమ పతిగా పొందాలని సంకల్పించారు. హవిష్యాన్నాన్ని భుజిస్తూ యమునలో స్నానం చేసి పార్వతీ దేవిని పూజిస్తూ నెల రోజుల వ్రతాన్ని పూర్తి చేశారు. వ్రత సమాప్తి రోజున వారు యమునలో స్నానం చేస్తుండగా శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను అపహరించి కదంబ వృక్షంపై కూర్చున్నాడు.
ఇది వారి కోరికను నెరవేర్చే దిశగా శ్రీకృష్ణపరమాత్ముడు చేసిన లీల మాత్రమే.
ఈ ఘట్టంలో వస్త్రాలు అహంకారానికి మమకారానికి, దేహాభిమానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. భగవంతుని చేరుకోవాలంటే ఈ అడ్డంకులను తొలగించుకోవాలి. దేహసౌందర్యంపై మక్కువ సామాజికబంధం అధికారిక స్థాయి లోకనిందా భయం వంటివన్నీ భక్తికి ఆటంకాలు. కృష్ణుడు వారిని వస్త్రాలు లేకుండా తన ముందుకు రమ్మన్నది సంపూర్ణ శరణాగతిని కోరినట్లే.
వేదాంత పరంగా వస్త్రం మాయకు సంకేతం.మాయ తొలగినప్పుడే ఆత్మ దర్శనం కలుగుతుంది. కృష్ణుడు వస్త్రాలను హరించడం అంటే అజ్ఞానాన్ని తొలగించి భక్తులను తన వైపు తిప్పుకోవడమే. యమునలో దిగంబరంగా స్నానం చేయడం జలదేవతకు అపరాధమని ప్రకృతిని గౌరవించాలని కూడా ఆయన బోధించాడు.
గోపికలు ప్రకృతికి సంకేతం శ్రీకృష్ణుడు పురుషుడికి సంకేతం.ప్రకృతి పురుషుడిలో లీనం కావడమే ఈ లీలలోని పరమార్థం.
వ్యాస భగవానుడు ఈ ఘట్టాన్ని శారీరక దృష్టితో చూడవద్దని హెచ్చరించాడు కూడా.
ఇది కామ ప్రధానమైనది కాదు నిష్కామ భక్తికి సంబంధించినది. గోపికలు లోక మర్యాదలను ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి కృష్ణుడిని ఆశ్రయించారు. అంటే వారు తమ అస్తిత్వాన్ని పూర్తిగా పరమాత్మలో విలీనం చేశారు. వస్త్రాపహరణం తర్వాతే వారికి రాసలీలలో పాల్గొనే అర్హత లభించింది. భౌతికబంధాల నుండి విముక్తి పొందితేనే అలౌకికానందం కలుగుతుందని ఈ లీల మనకు చాటిచెబుతుంది.
IIసేకరణII
................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments
Post a Comment