అప్పట్లో తక్కువ ఇపుడైతే మరి తక్కువ.

....................................

19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశానికి వచ్చిన సైకిల్ తొలుత విదేశీకులకు విలాస వస్తువుగా మాత్రమే పరిగణించబడింది. 1890ల నుంచి 1910ల మధ్య బ్రిటిష్ అధికారులు, యూరోపియన్ మిషనరీలు, పార్సీ వ్యాపారవర్గాలు, ఉన్నత విద్యావంతులు మొదలైన వారికి మాత్రమే సైకిల్ అందుబాటులో ఉండేది. కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాల్లో యూరోపియన్ జీవనశైలికి చిహ్నంగా సైకిల్ భావించబడింది. 1890లలో కలకత్తాలో ఏర్పడిన తొలి సైక్లింగ్ క్లబ్ భారతీయ పట్టణ సంస్కృతిలో కొత్త జీవనరీతికి నాంది పలికింది. అప్పట్లో సైకిల్ నడపడం ఒక సామాజిక ప్రతిష్ఠగా, ఆధునికతకు చిహ్నంగా పరిగణించబడింది.  

20వ శతాబ్దం ప్రారంభానికి వచ్చేసరికి సైకిల్ భారతదేశ మధ్యతరగతి ప్రజల జీవితంలో స్థానం సంపాదించింది. 1920–30ల నాటికి అది విలాసవస్తువు కాకుండా ఉద్యోగులు, పోస్టుమెన్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రజలకు దైనందిన జీవితంలో అత్యవసర సాధనంగా మారింది.  

అప్పట్లో బ్రిటన్‌కు చెందిన ర్యాలి, బీఎస్ఏ, హంబర్ వంటి బ్రాండ్లు భారత మార్కెట్‌లో ప్రథమ స్థానంలో నిలిచాయి. బలమైన ఇనుప నిర్మాణం, దీర్ఘకాలిక ఉపయోగం, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా సైకిల్ త్వరగా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ల నుంచి పట్టణాల లోపలికి ప్రయాణించే ప్రజలకు ఇది అత్యంత చౌకైన స్వతంత్ర రవాణా మార్గమైంది. అదే సమయంలో సైకిల్ వ్యక్తిగత స్వేచ్ఛకు, శారీరక ఆరోగ్యానికి, స్వావలంబన జీవనశైలికి గుర్తుగా మారింది.  

స్వదేశీ ఉద్యమ ప్రభావంతో భారతీయ పరిశ్రమలపై ఆసక్తి పెరిగిన సమయంలో 1939లో బొంబాయిలో హిందూ సైకిల్స్ స్థాపన ఒక చారిత్రక మలుపు. ఇది భారతదేశంలో పూర్తి స్థాయిలో స్వదేశీ సైకిళ్ల తయారీకి పునాది వేసింది. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంతో సైకిల్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. 1949లో టీఐ సైకిల్స్ హెర్క్యులస్, బీఎస్ఏ బ్రాండ్లను భారత మార్కెట్‌లో బలంగా నిలబెట్టగా, 1951లో అట్లాస్, 1956లో హీరో సైకిల్స్ ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించాయి. కొద్ది కాలంలోనే భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద సైకిల్ తయారీ దేశాలలో ఒకటిగా ఎదిగింది. పంజాబ్‌లోని లూధియానా “భారత సైకిల్ రాజధాని”గా ప్రసిద్ధి చెందింది.  

గ్రామీణ విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, కార్మికులు ఉద్యోగాలకు చేరడానికి, వైద్యులు గ్రామాల మధ్య ప్రయాణించడానికి, పత్రికలు వార్తలను చేరవేయడానికి ఇది ప్రధాన ఆధారంగా ఉండేది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో కూడా సైకిళ్లు రహస్య సమాచార రవాణాలో ఉపయోగించబడ్డాయి. ప్రపంచ యాత్రికుడు బిమల్ ముఖర్జీ 1926 నుంచి 1937 మధ్య సైకిల్‌పై ప్రపంచ పర్యటన చేసి భారతీయుల సాహసస్ఫూర్తిని ప్రపంచానికి చాటారు.  

ఈ నేపథ్యంలో 1934 నాటి ఒక చారిత్రక క్యాష్ మెమో (సైకిల్ బిల్) ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలకత్తాలోని మాణిక్తలా స్పర్ ప్రాంతంలో ఉన్న “కుముద్ సైకిల్ వర్క్స్” జారీ చేసిన ఈ బిల్లు అప్పటి భారత పట్టణ జీవనశైలిని, సైకిల్ విలువను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఆ బిల్లులో “లైట్ మరియు బెల్‌తో కూడిన ఒక సైకిల్ అగ్గువ ధర Rs 18”గా నమోదు చేయబడింది. నేటి విలువలతో పోలిస్తే అది చిన్న మొత్తం అనిపించినా, 1934లో అది సాధారణ మధ్యతరగతి కుటుంబానికి గణనీయమైన వ్యయం. మధ్యతరగతి ప్రజలు ఒకసారిగా కొనలేని ధర. అదే కాలంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹29 ఉండటం ద్వారా ఆ సైకిల్ విలువ ఎంతగా ఉండేదో అంచనా వేయవచ్చు.  

బిల్లులో లైట్, బెల్ వంటి ఉపకరణాలను నమోదు చేయడం ఆసక్తికరం. అది అప్పటికే రహదారి భద్రత, రాత్రి ప్రయాణ సౌకర్యం, ట్రాఫిక్ నియమాలపై ఉన్న అవగాహనను సూచిస్తుంది. ఆ కాలంలో సైకిళ్లకు రిజిస్ట్రేషన్ నంబర్లు, మున్సిపల్ లైసెన్సులు విధించే పట్టణాలు కూడా ఉండేవి.  

నేటి మోటార్ వాహనాల యుగంలో సైకిల్ సామాన్య రవాణా సాధనంగా కనిపించినప్పటికీ, అది ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి గౌరవానికి, శ్రమజీవుల ఆర్థిక బలానికి, స్వదేశీ పారిశ్రామిక వికాసానికి నిలయంగా నిలిచిందన్న విషయాన్ని ఈ బిల్లు మరోసారి గుర్తుచేస్తోంది.  

॥సేకరణ॥  

..................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ