07-05-2026
.....................................
ఈ వ్యాసాన్ని చదవడానికి ముందు ఇచ్చిన చిత్రాన్ని తెరిపారా చూడండి.
150 సామాన్యశకం (ACE) సంవత్సరాలకు, అంటే 2 వ శతాబ్దానికి చెందినదిగా భావించే కౌశాంబి నుండి లభించిన ఈ మట్టిబొమ్మ నమూనా భారతదేశంతో పాటు ఆసియాలోనే మానవఉదర శస్త్రచికిత్సను చిత్రీకరించిన తొలి పురావస్తు ఆధారంగా పరిగణించబడుతోంది. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మ్యూజియంలో భద్రపరచబడింది. ఈ కళాఖండం ఒక పురుషుని పొట్టను శస్త్రచికిత్స కోసం కోసిన దృశ్యాన్ని చూపిస్తుంది.లోపలి అవయవాలు, ముఖ్యంగా పేగులు బయటకు కనిపిస్తున్నాయి.
వత్సరాజ్యానికి రాజధానిగా ఉన్న కౌశాంబిలో ఈ నమూనా లభించింది. ఇది ప్రాచీన మానవ శరీర నిర్మాణశాస్త్రం శస్త్రచికిత్సా జ్ఞానానికి చెందిన అరుదైన ఉదాహరణ. బహుశా సిజేరియన్ వంటి ఉదర శస్త్రచికిత్సలను లేదా ఇతర విధానాలను విద్యార్థులకు ప్రదర్శించడానికి వారి విద్యా ప్రయోజనాల కొరకు ఉపయోగించి ఉండవచ్చు. సాంస్కృతికంగా ఈ కళాఖండం కుషాణుల కాలానికి చెందినది. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇది చ్యవన వైద్య కళాశాలకు చెందినది.ఈ మట్టి బొమ్మతో పాటు ప్రాచీన భారత శస్త్రచికిత్సా విధానాలకు సంబంధించి సుశ్రుత సంహితలో అష్టవిధ శస్త్రకర్మలు అంటే ఛేదన, భేదన, లేఖన, వేదన, ఏషణ, ఆహరణ, విస్రావణ, సీవన అనే ఎనిమిది రకాల ప్రాథమిక శస్త్రచికిత్సా పద్ధతులు వివరించబడ్డాయి. సుశ్రుతుడు శస్త్రచికిత్సకు ముందు రోగిని మత్తులో ఉంచడానికి మద్యం, భంగ్ (గంజాయి) ధత్తూర(ఉమ్మెత్త) వంటి మూలికలను ఉపయోగించేవాడని,నొప్పి తెలియకుండా చేయడానికి సంమోహన చూర్ణాలు వాడేవాడని గ్రంథాలు చెబుతున్నాయి.
శస్త్రచికిత్సలో 101 పరికరాలు ఉండేవని అవి సింహం, పులి, జింక, కాకి, కొంగ ముక్కుల ఆకారంలో ఉండేవని, వాటిని యంత్రాలు, శస్త్రాలు అని విభజించారని సుశ్రుతుడు పేర్కొన్నాడు. గాయాలను కుట్టడానికి దారం, గుర్రపు వెంట్రుకలు, నార, అలాగే పెద్ద చీమల తలలను గాయంపై పట్టించి శరీరాన్ని వేరుచేసి కుట్లుగా వాడే విధానం ఉండేది. ఉదరాన్ని కోసిన తర్వాత పేగులను బయటకు తీసి శుభ్రం చేసి, తిరిగి అమర్చి కుట్టే శస్త్రకర్మను సుశ్రుతుడు వివరించాడు.
కౌశాంబి మట్టి బొమ్మ అటువంటి ప్రక్రియను చూపిస్తుండవచ్చును.
చరక సంహితలో అంతర్గత వైద్యంతో పాటు శస్త్రచికిత్స అవసరాన్ని, క్షార కర్మ, అగ్ని కర్మ వంటి పద్ధతులను కూడా వివరించారు. ప్రాచీన భారతంలో ప్లాస్టిక్ సర్జరీ, కంటిశుక్లం తొలగింపు, మూత్రపిండాల్లో రాళ్లు తీయడం, ఎముకలు విరిగినప్పుడు కట్టు కట్టడం, కృత్రిమ అవయవాలు అమర్చడం వంటివి జరిగేవి. శవాలను నీటిలో ఉంచి కుళ్లబెట్టి పొరలుగా విడదీసి అంతర్గత అవయవాల నిర్మాణాన్ని అధ్యయనం చేసే మృతశరీర విచ్ఛేదన పద్ధతిని సుశ్రుతుడు ప్రవేశపెట్టాడు. ఈ పనే ఇటువంటి విద్యా నమూనాల తయారీకి ఉపయోగపడి ఉండవచ్చును. కౌశాంబి మట్టి బొమ్మ కేవలం కళాఖండం మాత్రమే కాదు.ACE ప్రారంభ శతాబ్దాల్లోనే భారతదేశంలో శస్త్రచికిత్స ఎంత అభివృద్ధి చెందిందో వైద్య విద్యకు త్రీడైమెన్షనల్ నమూనాలు వాడేవారో తెలిపే ప్రత్యక్ష సాక్ష్యం.
చరకుడు చరక సంహితలో శస్త్రచికిత్సకు సంబంధించి అష్టవిధ శస్త్రకర్మలు అని ప్రత్యేకంగా విభజించలేదు.ఆ విభజన ముఖ్యంగా సుశ్రుతసంహితలో కనిపిస్తుంది.చరక సంహితలో శస్త్రచికిత్స అవసరమైన సందర్భాలు, శస్త్రకర్మ సూత్రాలు, శల్యతంత్ర ప్రాధాన్యత విస్తృతంగా చర్చించబడ్డాయి. చరకుడు వైద్యాన్ని కాయచికిత్స (శరీరచికిత్స)కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా, శస్త్రచికిత్స అనివార్యమైన వ్యాధులలో శస్త్రప్రణిధానం చేయాలని స్పష్టం చేశాడు. సుశ్రుతుడు వివరించిన అష్టవిధ శస్త్రకర్మలు అంటే ఛేదన అనగా కోయడం, భేదన అనగా చీల్చడం, లేఖన అనగా గీరడం, వేదన అనగా కుట్టడం లేదా రంధ్రం చేయడం, ఏషణ అనగా శల్యాన్ని వెతికి తీయడం, ఆహరణ అనగా దోషాన్ని బయటకు తీయడం, విస్రావణ అనగా రక్తం లేదా చీము కార్పించడం, సీవన అనగా కుట్టివేయడం.
చరక సంహిత సూత్రస్థానం, చికిత్సాస్థానంలో ఈ కర్మలన్నీ వేర్వేరు వ్యాధుల చికిత్సలో ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకు గుల్మ రోగంలో భేదన, విద్రధిలో విస్రావణ, అర్శస్సులో క్షార కర్మ, అగ్ని కర్మ, ఛేదన, భగందరంలో ఛేదన, క్షారసూత్ర ప్రయోగం, అశ్మరిలో ఆహరణ, వ్రణ చికిత్సలో సీవన, వ్రణశోధనలో లేఖన వంటివి చరకుడు వివరించాడు. చరకుడు శస్త్రకర్మ చేయకముందు రోగి బలం, దోషస్థితి, దేశ, కాలం పరిశీలించాలని, పూర్వకర్మగా స్నేహన, స్వేదన, వమన, విరేచనాలతో శరీరాన్ని సిద్ధం చేయాలని చెప్పాడు. శస్త్రకర్మ తర్వాత వ్రణితోపచారం, పథ్యాపథ్యం, రక్షోఘ్న ధూపనం, గుగ్గులు, నింబ, హరిద్ర వంటి ద్రవ్యాలతో వ్రణ శుద్ధి చేయాలని సూచించాడు. శస్త్రాలు మంచి ఉక్కుతో, పదునుగా, నిర్దిష్ట ఆకారంలో ఉండాలని, వాటిని క్షారోదకం లేదా అగ్నిలో శుద్ధి చేయాలని చరకుడు పేర్కొన్నాడు. శస్త్రచికిత్సలో అయోగ్యత అంటే చేయకూడని స్థితులు, యోగ్యత అంటే చేయదగిన స్థితులు, ఉపద్రవాలు, వాటి నివారణ చరక సంహితలో వివరంగా ఉన్నాయి. చరకుడు శస్త్రతంత్రాన్ని అంగీకరించినా, కాయచికిత్సతో నయం కాని స్థితిలో మాత్రమే శస్త్రం ప్రయోగించాలని, వీలైనంత వరకు ఔషధ, క్షార, అగ్ని కర్మలతోనే వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డాడు. అందువల్ల అష్టవిధ శస్త్రకర్మల మూల సిద్ధాంతం సుశ్రుతునిదైనా, ఆ కర్మల అనువర్తన, చికిత్సా విధానం, రోగి నిర్వహణ చరక సంహితలో విస్తృతంగా కనిపిస్తుంది, ఈ రెండు గ్రంథాలు కలిసే ప్రాచీన భారత శస్త్రచికిత్సా విజ్ఞానానికి పునాది వేశాయి.
॥సేకరణ॥
............... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం
*-****
*పరుగో పరుగు -2*
🏃♂️🏃🏽
రచన : మల్లిక్
ఇలాంటి సంఘటనలే చిక్కడపల్లిలో మరికొన్ని జరిగాయి.... వీటన్నిటికీ మూలకారణం ఒకే ఒక ఫోటో స్టూడియో, అదే “ఇస్మైల్ ప్లీజ్” ఫోటో స్టూడియో.
అదే చిక్కడపల్లి ....
అయితే.... అయితే....
ఎక్కడ చూసినా జనం, రోడ్లమీద జనం.... సినిమా హాళ్ళలో జనం.... హోటళ్ళనిండా .... జనం....ఏ షాపులో చూసినా జనం.
ఎక్కడనుండి పుట్టుకొస్తున్నారో ఇంత జనం!....
కానీ ఇంత కిక్కిరిసిన జనం ఉన్నా .... చిక్కడపల్లి లో ఒకే ఒక్క చోట జనంలేరు.... అది 'ఇస్మైల్ ప్లీజ్ ఫోటో స్టూడియో',
టేబుల్ ముందు రాంబాబు తలకాయ్ ని రెండు చేతుల్లో పట్టుకుని కూర్చున్నాడు. అతని ఎదురుగా కిష్టయ్య మరో కుర్చీలో కూర్చున్నాడు.
వాడు టేబులుమీద వాలిన ఈగల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
రాంబాబు గాఢంగా నిట్టూర్చాడు.
"ఏంటండి గురూగారూ....కట్టేసి వెళ్ళిపోదామా?” అన్నాడు కిష్టయ్య రాంబాబు వంక చూస్తూ.
రాంబాబు రిస్ట్ వాచ్ వంక చూసాడు. ఆరు గంటలైంది.
“అప్పుడేనా?....” అన్నాడు.
"ఊరికే కూర్చుని ప్రయోజనం ఏముందండీ.... " అన్నాడు కిష్టయ్య.
"ఎవరైనా వస్తారేమో....” అన్నాడు రాంబాబు గుమ్మం వైపు చూస్తూ...
"మధ్యాహ్నం నుండీ చూస్తున్నాం.... ఒక్కరన్నా రాలేదు ఫోటో తీయించుకోడానికి. ఇంకెవరొస్తారు గురూగారూ. సంగంలో జేమ్స్ బాండ్ సినిమా అడ్తోందండీ.... స్టూడియో కట్టేసి వెళ్దాం గురూగారూ...."
"ఫస్ట్ షో టైమ్ అయిపోయిందిగా....”
"లేదండీ గురూగారూ.... ఇంగ్లీషు సినిమా కదండీ.... ఆరున్నరకి మొదలు...
"ఇంకాస్సేపు చూద్దాం....”
మరొక్కసారి రిస్టువాచి వంక చూసుకుని వెనక్కి జారబడి ఆలోచనలో మునిగిపోయాడు రాంబాబు. కిష్టయ్య మళ్ళీ ఈగలు పట్టే ప్రయత్నంలో మునిగిపోయాడు.
నిమిషాలు గడుస్తున్నాయ్....
రాంబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు.
"ఎంతపని చేశారండీ గురూగారు....” అన్నాడు కిష్టయ్య బాధగా.
"ఏమైందిరా...." రాంబాబు కుర్చీలోంచి ముందుకు వంగుతూ కంగారుగా అడిగాడు-
"కొద్దిలో తప్పిపోయిందండీ....ప్స్....” అన్నాడు కిష్టయ్య తల విదిలిస్తూ.
“ఏవిటి తప్పిపోయింది?"
"చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది గురూగారూ...."
“సరిగ్గా చెప్పేడు....”
“సరిగా నేను పట్టుకునే సమయంలో మీరు నిట్టూర్చారు కదండీ.... అందుకనే నాకు దొరక్కుండా ఎగిరిపోయిందండీ ఈగ...” అన్నాడు కిష్టయ్య తలని రౌండుగా అటూ ఇటూ తిప్పుతూ గదిలో ఎగురుతున్న ఈగవంక చూస్తూ.
"నువ్వొకడివి దొరికావ్ నా ప్రాణానికి....” విసుక్కుంటూ కుర్చీలో వెనక్కి వాలాడు రాంబాబు. కిష్టయ్య మళ్ళీ తన ప్రయత్నంలో తాను పడ్డాడు.
మరో అయిదు నిమిషాలు గడిచాయ్.
"ఎంతపని చేశారండీ గురూగారూ....” మళ్ళీ అన్నాడు కిష్టయ్య ఎంతో బాధపడుతూ.
“నేనేం నిట్టూర్చలేదుగా....” అన్నాడు రాంబాబు కిష్టయ్యవంక కొరకొరా చూస్తూ.
"అబ్బే దాని గురించి కాదండి.. అటు చూడండి..." అన్నాడు గుమ్మం వైపు చూపిస్తూ.
రాంబాబు చూశాడు. అతనికేమీ అర్ధంకాలేదు.
"ఏమిటి.... ఏముందక్కడ?” అని అడిగాడు.
"రోడ్డుకి అవతలవైపు చూడండి గురూగారూ...." అన్నాడు మరీ బాధగా కిష్టయ్య.
రాంబాబు రోడ్డుకి అటువైపు చూశాడు. కానీ ఏమీ అర్ధం కాలేదు. విసుగ్గా కిష్టయ్యవంక చూశాడు.
"నువ్వు పట్టుకోబోయిన ఈగ ఆ వైపుగా ఎగిరిపోయిందా?”
ఇంతేనా మీకు అర్థం అయ్యింది అనే భావం వచ్చేలా చూశాడు కిష్టయ్య.
“రోడ్డు కవతల మిరపకాయ బజ్జీల బండి లేదా మాస్టారూ!....”
ఉంది ....అయితే ?....
"అక్కడ జనం చూడండి....”
రాంబాబు చూశాడు. మిరపకాయబజ్జీల బండిచుట్టూ జనం....బెల్లం చుట్టూ ఈగల్లా.
కొందరు ఆబగా బజ్జీలు తింటున్నారు. మరికొందరు బండివాడు బజ్జీలు వేయిస్తుంటే నీళ్ళూరుతున్న నోళ్ళతో ఎదురు చూస్తున్నారు
బజ్జీలవాయి తియ్యగానే బండి చుట్టూ కాచుకుని ఉన్నవాళ్ళు ఎగబడి డబ్బులు బండివాడిచేతిలో పెట్టి వేడివేడి బజ్జీలు తీసుకొని ఆబగా తింటు న్నారు..ఎంతో కాలం నుండి తిండితినని వాళ్ళలా వేసిన బజ్జీలు వేసినట్లే అయిపోతున్నాయ్.
“చూశారు కదండీ గురూగారూ...." అన్నాడు కిష్టయ్య కంఠంలో జీవపలికిస్తూ.
రాంబాబు బజ్జీల బండి నుండి దృష్టి మరల్చి కిష్టయ్యవంక చూశాడు.
"అసలు మీరు ఫొటోస్టూడియో ఎందుకు పెట్టారండీ గురూగారూ...."
"నువ్వు కాస్త నోరుముయ్....”
“హాయిగా మిరపకాయ బజ్జీల....”
"నిన్ను నోరు మూసుకోమన్నానా....” రాంబాబు మళ్ళీ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు.
📖
రాంబాబు సొంత ఊరు తాడేపల్లిగూడెం. తండ్రి పరంధామయ్య వ్యవసాయం చేస్తాడు. చండశాసనుడు. తల్లి పార్వతమ్మ మాత్రం బహు నెమ్మది మనిషి. చెల్లెలు పేరు రాజ్యలక్ష్మి, పెద్దమనిషి కాగానే స్కూలు మాన్పించేశారు.
రాంబాబు డిగ్రీ పాసయ్యాక అప్లయ్ చెయ్యని ఉద్యోగం లేదు.... వెళ్ళని ఇంటర్ వ్యూ లేదు. కానీ ఫలితం ఏమీ కనిపించలేదు. తాడేపల్లి గూడెం అయితే లాభం లేదని హైదరాబాదుకు వెళ్ళి అక్కడొక స్నేహితుడి గదిలో ఎడ్జస్టయిపోయి ఉద్యోగాల వేట సాగించాడు రాంబాబు. ఐనా ప్రయోజనం ఏమీ కనిపించలేదు.
ఆ టైమ్లోనే రాంబాబుకి శ్యామల్రావ్ కనిపించాడు. శ్యామల్రావూ రాంబాబూ క్లాస్ మేట్స్, డిగ్రీ కాంగానే శ్యామల్రావ్ హైదరాబాదు వచ్చి ఒక ఫొటో స్టూడియో పెట్టాడు.
శ్యామల్రావ్ తోపాటు అతని స్టూడియోకి వెళ్ళి అక్కడి పరిస్థితుల్ని గమనించిన రాంబాబుకి జ్ఞానోదయమైంది. శ్యామల్రావు తన ఫొటో స్టూడియో ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. ఎప్పుడూ తెరిపి లేకుండా ఫొటోలు తీయించుకోడానికి అతని స్టూడియోకి జనం వస్తూనే వుంటారు.
రాంబాబు తను కూడా ఒక ఫొటోస్టూడియో పెడితే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. ఒకరి కింద పనిచేసేకంటే అదే నయం అనిపించింది. రాబడి కూడా బావుంటుంది. రాంబాబు వెంటనే తాడేపల్లిగూడెం వెళ్ళి తను ఫొటో స్టూడియో పెట్టాలనుకుంటున్నట్లు తండ్రికి చెప్పాడు.
“ఠట్.... వీల్లేదు” అన్నాడు పరంధామయ్య.
ఫొటో స్టూడియోమీద ఎంత ఆదాయం వస్తుందీ.... శ్యామల్రావు ఏ విధంగా బాగుపడి పోతున్నాడో తండ్రికి వివరంగా చెప్పాడు రాంబాబు.
ఆదాయం గురించి చెప్పగానే పరంధామయ్య మెత్తబడ్డాడు. కాస్త పొలం అమ్మి ఆ డబ్బుతో
“ఇస్మైల్ ప్లీజ్" ఫొటోస్టూడియో" పెట్టించాడు పరంధామయ్య.
తన పాలేరుకోడుకు కిష్టయ్యని తనకి అసిస్టెంటు గా తన కూడా హైదరాబాదు తెచ్చుకున్నాడు రాంబాబు.
📖
కిష్టయ్య తన చేతిమీద కొట్టడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకుని చూశాడు రాంబాబు.
"అబ్బే....ఏం లేదు గురూగారూ.... మీ చేతిమీద ఈగ వాలితే....” అన్నాడు కిష్టయ్య నసుగుతూ.
రాంబాబు ఒకసారి నిట్టూర్చి వాచ్ వంక చూశాడు. ఆరున్నరైంది.
“మీరు చాలా పొరబాటు పని చేశారండీ గురూగారూ....” అన్నాడు బాధగా బయటికి చూస్తూ కిష్టయ్య.
"మళ్ళీ ఏమైంది ?”
"అలా చూశారా జనం!.... మిరపకాయల బజ్జీల కోసం ఎలా పరుగులు పెడుతూ వస్తున్నారో!!....”
రాంబాబు ఈర్ష్యగా బజ్జీలబండి వాడివైపు చూశాడు. కానీ కొన్ని క్షణాలు మాత్రమే....
రాంబాబు ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయ్. అతని ముఖంలో ఆనందం విలయతాండవం చేసింది. సంతోషంతో పెదాలు ఈ చెవి నుండి ఆ చెవి దాకా సాగిపోయాయ్.
కళ్ళల్లో ఆశ్చర్యం ప్లస్ ఆనందం!!
“ఒరేయ్ కిష్టిగా.... చూశావా.... ఆ జనం మొత్తం రోడ్డుదాటి ఇటు వైపు వస్తున్నారు..." సంతోషంతో అరచినట్టుగా అన్నాడు రాంబాబు.
"అవును గురూగారూ.... మన ఫోటో స్టూడియో వంకే చూస్తూ వస్తున్నారు.... వాళ్ళందరూ మన దగ్గర ఫొటో తీయించుకోడానికే వస్తున్నారు.
"క్విక్ .... లైట్లన్నీ రెడీగా పెట్టు....ఏదీ నా కెమేరా ఇలాతే...." అన్నాడు రాంబాబు హడావిడి పడిపోతూ.
"వీళ్ళందరూ ఫొటో తీయించుకుంటే నాకు జేమ్స్ బాండ్ సినిమా చూపించాలి గురూగారూ....”
“అలాగేరా.... ముందు అన్నీ రెడీచెయ్యి....”
“ప్రామిస్.... నిజంగా తీసుకెళతారా గురూగారూ?”
"ఆ ..."
జనం మొత్తం స్టూడియో గుమ్మం ముందు పోగయ్యారు. రాంబాబు, కిష్టయ్య వాళ్ళవంక చూశారు. వాళ్ళ ముఖంలో ఫిలింగ్స్ చూస్తే వాళ్ళు ఫొటో తీయించుకోడానికి వచ్చినట్లు కనిపించలేదు రాంబాబుకి.
అయినా గొంతు పెగుల్చుకొని "రండిసార్.... ఫోటో తీయించుకోడానికేనా.... లోపలికి రండి....” అన్నాడు భయం భయంగా నవ్వుతూ రాంబాబు.
ఆ జనంలోంచి వస్తాదుల్లాంటి యువకులు ఇద్దరు ముందుకువచ్చారు. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు. రాంబాబు వంక సూటిగా చూశారు రాంబాబు ఎడమకన్ను అదిరింది.
ఆ యువకులిద్దరూ చొక్కా చేతులు పైకి మడిచి రెండడుగులు ముందుకు వేశారు.
రాంబాబు, కిష్టయ్య నాలుగడుగులు వెనక్కి వేశారు.
🏃🏽
*సశేషం*
꧁
.*భైరవవాక - 2*
🔱
రచన: ఇందూ రమణ
ఆ ఆరుగురిలోనూ అదే ఆలోచన.... అదే ఆందోళన ...!
టీమ్ లీడర్ స్థిర చిత్తంతో లేచి నిలబడ్డాడు. అందరిలోకీ ముందుగా తేరుకున్న వ్యక్తి అతనే. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు.
వరండాలో నిలబడి ఎత్తైన పదంతస్థుల భవనం లో నుంచి నగరం అందచందాలు తిలకిస్తూ నిలబడిందామె.
దేదీప్యమైన కాంతులతో ముంబాయ్ మహానగరం కళకళలాడుతోంది. రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్న వాహనాల హెడ్ లైట్ వెలుగులు పోటీ పడి పరిగెడుతున్న ట్టున్నాయి. ఎత్తైన భవనాలు భీకర పోరాటానికి సిద్ధంగా ఉన్న ఆంబోతుల్లా ఉన్నాయి. నగరమంతా వెలిగిన వెలుగు మిలమిల మెరుస్తూ ఆరబోసిన నక్షత్రాల సముదాయంలా ఉంది.
అడుగుల సవ్వడి కాకుండా నెమ్మదిగా వెళ్ళి ఆమె వెనుకే నిలబడ్డాడతను. ఆమె భుజం మీద చెయ్యివేసాడు. ఉలిక్కిపడి వెనుదిరిగిందామె.
ఆమె కళ్ళల్లో బెదురు భయం స్పష్టంగా గోచరించాయతనికి. చిన్నగా ... పరిచయంగా నవ్వాడు.
ఆమె మనసు కొంచెం కుదుట పడ్డట్టయింది. రాని నవ్వు పెదవుల పైకి తెచ్చుకుంటూ కనీ కనిపించకుండా నవ్వింది.
అంతలోనే కర్తవ్యం అతన్ని రాక్షసుణ్ణి చేసింది.
పద్దెనిమిదేళ్ళు కూడా నిండా నిండని ఆమెని అమాంతం రెండు చేతులతో గండెలకు హత్తుకున్నట్టే ఎత్తుకొని ఎత్తైన భవనం పైనుంచి క్రిందకు పడేసాడు.
ఆ క్షణం అతను నరరూప రాక్షసుడే అయ్యాడు. క్షణంలో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఆమెని ఏం చేస్తాడో తెలీక ఉత్సుకతతో అతని వెంటే వరండా దగ్గరకు చేరుకొని కొంచెం దూరంగా నిలబడి గమనిస్తున్న మిగతా వారంతా ఆ సంఘటన చూసి అవాక్కయ్యారు. అంతులేని ఆందోళనతో అదిరిపడ్డారు.
ఇప్పుడా వ్యక్తి బైట నుంచి వస్తే ఏం చెప్పాలి? అందరి వదనాల్లోనూ అదే ఆలోచన. అదే ఆందోళన.
అంతలోనే కాలింగ్ బెల్ మ్రోగింది.
అందరూ ఒకరి మొహాలోకరు చూసుకున్నారు. అందరికీ ఆందోళనగానే ఉంది. అంతుచిక్కని ఆలోచన చిత్రవధ చేస్తూనే ఉంది.
ఏం జరగబోతోందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. నాయకుడే ముందుగా తేరుకొని తలుపులు తీసాడు.
అవతలి వ్యక్తి గదిలోకి అడుగుపెట్టాడు. అతని చేతిలో పీటర్ స్కాట్ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి.
అందరూ ఆందోళనగా వరండాలో నిలబడి ఉండడం గమనించాడతను. బాటిల్స్ హాల్లో టేబుల్ మీదుంచి ఆత్రుతగా వారి దగ్గరకు చేరుకున్నాడు.
"ఏమైంది?!" ప్రశ్నించాడతను. ఏదో జరగరానిది జరిగిందని గ్రహించాడు.
"నీ ఇంట్లో ఉంటున్నామె పై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకుంది. వెనుక నుంచి తలుపులు బిడాయించి వస్తూ ఆ గ్రూపు లీడర్ చెప్పాడు.
"అబద్ధం” అప్రయత్నంగా అన్నాడతను.
"నేనే ఆమెని పైనుంచి తోసేసాను. ఇది నమ్ముతావా?" నిష్కర్షగా చెప్పాడు లీడర్.
ఆఁ !"అతనికి నోటమాట రాలేదు. భయం నెమ్మది నెమ్మదిగా అతని శరీరాన్ని ఆవహిస్తోంది.
'అతనికి తెలుసు ఈ ఆరుగురూ ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని నరరూప రాక్షసులని. వీళ్ళందరికీ నాయకుడైన ఇతను తన కార్యం నెరవేరడం కోసం దేనికైనా తెగిస్తాడని తెలుసు. అయితే భుక్తి కరువై అతను కోరిన ప్రకారం తానీ అపార్ట్ మెంట్ లో కాపురం ఉండడానికి అంగీక రించాడు. దానికి ప్రతిఫలంగా పుష్కలంగా డబ్బు కూడా ఇచ్చాడు. అందుకే ఆనందంగా అంగీకరించాడు. అయితే, అన్నెం పున్నెం ఎరుగని అమాయకురాల్ని ఎందుకు చంపారు?!' ఆలోచనలతో అచేతనంగా నిలబడ్డాడతను. ఏం మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో నని అతనికీ భయంగానే ఉంది. 'తప్పుగా ప్రవర్తిస్తే తన తల తీసేసినా తీసేస్తారీ దుండగలు'.
"ఏం? మా మాటలు నమ్మటం లేదా?" వారితో ఉన్న ఆమె అంది.
"మా మాటలు ... మా పధకం విన్న ఎవరైనా బ్రతికుండరని నీకు తెలుసు అవునా?" లీడరే నిలదీసాడు.
"అవునవును... కానీ...?" అతనికి ఏం చెప్పాలో పాలు పోలేదు.
"ఏఁవిటీ? పోలీసు భయమా?! అదేం జరక్కుండా నేను చూస్తాను. ప్రమాద వశాత్తు పడిపోయినట్టు అందర్నీ నమ్మిద్దాం. నీ పైన ఎలాంటి అనుమానం రాకుండా నేను చూస్తాను. సరేనా.... ?!" సముదాయిస్తున్నట్టే అన్నా 'హుకుం జారీ చేస్తున్నట్టే ఉంది నాయకుడి గొంతు.
"ని..జ..మే..! మీరుండగా నాకలాంటి భయమెందుకు? ఎవరూ లేని అనాధ పిల్లని నాకు తోడుగా ఉంటూ వంట పని... ఇంటిపని చేస్తుందని ఉండమన్నాను. అయితే, ఆ పిల్లకి మన మాటలు సరిగ్గా వినపడవు. గట్టిగా కేకేసి చెప్తేగాని ఏం అర్ధంకాదు. సరికదా, ఏం మాట్లాడలేదు కూడా" అతను బాధగా అన్నాడు.
"అర్ధంకాలేదు.” నిశ్చలంగా ... నిర్వికారంగా అన్నాడు గ్యాంగ్ లీడర్.
"ఆ అమ్మాయి మూగపిల్ల. చెవులు కూడా సరిగ్గా పనిచెయ్యవు". ఒకింత నిష్ఠూరం గానే అన్నాడతను. మీరందరూ కలిసి ఆ అమాయకురాల్ని పొట్టనబెట్టుకున్నారనే అర్థం ధ్వనించేలా ఉందతని గొంతు.
అతను చెప్పింది వినేసరికి ఆ ఆరుగురూ ఒక్క క్షణం అచేతనంగా నిలబడి పోయారు.
📖
చీకటి తెరలు ఆకాశాన్ని ముసురుకుంటు న్నాయి. చంద్రుని కిరణాలు దట్టంగా అలముకుంటున్న మబ్బుల్ని చీల్చడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మంచు వెండి జరీలా అల్లుకుంటోంది. పిల్లగాలి నెమ్మదిగా
... హాయిగా శరీరాన్ని తాకుతోంది.
పాత్రో మనసుకు ఆనందంగా ఉంది.
ఎన్నాళ్ళయిందో కదా ఆంధ్రాలో అడుగు పెట్టి. ఎప్పటి మాట? ఎన్నేళ్ల జ్ఞాపకం! ఆంధ్రాలో ఆరు నెలలు కాపురం ఉన్నాడు. ఆ ఆర్నెల్లలో తేట తెలుగు తియ్యదనాన్ని.. కమ్మదనాన్ని ఆస్వాదించగలిగాడు. మధురమైన తెలుగు నుడికారాన్ని అంతో ఇంతో అర్థంచేసుకోగలిగాడేగాని నేర్చుకో లేకపోయాడు.
ఆ రోజుల్లో...
ఉద్యోగరీత్యా శ్రీకాకుళం ప్రాంతాల్లో గడిపినా అప్పుడప్పుడూ విహార యాత్రలా విశాఖపట్నంలో సుందర సముద్ర తీరం... అమోఘమైన పారిశ్రామిక వాడే కాకుండా అందమైన వైజాగ్ జిగిజాగ్ లని నలుమూలలా తిరిగి తిలకించాడు.
విజయనగరం భూపతుల కోటంతా మూల... మూల పరికించి ... పరిశీలించి చూడగలిగాడు. కైలాసగిరి, ఉడా పార్క్, తొట్ల కొండలోని బౌద్ధరామం ఇలా ఎన్నో చూసాడు.
విశాఖ ఉక్కు కర్మాగారం పనులు ఎలా సాగుతున్నాయో చూడ్డానికి పంపబడ్డ ప్రతినిధిలా రెండు రోజులు అటు అగనం పూడి నుంచి ఇటు భీమిలి ప్రాంతమంతా తిరిగి... తిరిగి...
అబ్బ ! ఆ అనుభవాలు... అనుభూతులు గుర్తొస్తేనే మధురంగా ఉన్నాయి. ఆ క్షణం గుర్తొచ్చేసరికి పాత్రో మనసు పులకించిపోయింది
రాయపూర్ ఎక్స్ ప్రెస్ గున్న ఏనుగులా ఆయాసంతో రొప్పుతూ... అరుస్తూ... పరుగులెడుతోంది. కొండచిలువలా భారంగా మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతోంది.
పాత్రో ఆలోచనలు ఆవిరిలా పైకెగసి పోయాయి.
ఏదో గుర్తొచ్చి కిందా మీదా జేబులన్నీ ఆత్రుతగా... ఆందోళనగా వెతుక్కున్నాడు.
వెనుక జేబులో భద్రంగా దాచుకున్న కాగితం బైటకు తీసాడు. అది అతని మిత్రుడు రాసిన ఉత్తరం. ఇప్పటి సెల్ ఫోన్ ల మూకుమ్మడి దాడిలో గుర్తుగా మిగిలిన తియ్యటి జ్ఞాపకం ఆ ఉత్తరం. ఆనందాన్ని పంచుకోవాలన్న... అనుభవాల్ని నెమరు వేసుకోవాలన్న... క్షణాలను అణాలతో గుణించే సెల్ ఫోన్ కి వీలవుతుందా? లేదుగాక లేదు!. ఉత్తరానికి ఉన్న ఉదాత్త గుణం దేనికీ లేదు.. రాదు. మనసు పులకించిన ప్రతిక్షణం ఎన్నిసార్లు చదివి చదివి చేతుల్లో నలిగి నలిగి, నీరసించినా ఉత్తరం నిత్యం సత్యమే. చదివిన ప్రతి క్షణం నవరస భరితంగా భావోద్విగ్నతలు పంచుతూనే ఉంటుంది. ఈ ఒక్క ఉత్తరం ఎన్ని ఏళ్ళయినా... ఎన్ని సార్లయినా... జ్ఞాపకం వచ్చిన ప్రతిక్షణం... చదివిన ప్రతి ఘడియ ... ఘడియకూ.... అందాన్ని... ఆనందాన్ని... అనుభూతుల్ని అందిస్తూనే ఉంటుంది. బ్రతుకు పుస్తకంలో చెరగని చిరునవ్వుల మిగిలివుంటుంది.
అందుకే అప్పటికి... ఇప్పటికి... ఎప్పటికి మా మధ్య ఉత్తరాలే ఊసుల్ని మోసుకొస్తుంటాయి.
మేమెళ్తున్న దివ్య క్షేత్రం హిల్ ప్రాంతం కావటం వలన సెల్ సిగ్నల్స్ నిల్. ఏదో ఒకటి రెండు సెల్ కంపెనీ వాళ్ళ సెల్స్ పనిచేస్తే చెయ్యొచ్చు అని ముందే చెప్పాడు విశ్వం.
'విశ్వం' పేరులాగే విశాల హృదయుడు విశ్వం.
విశ్వం ఎప్పుడు గుర్తొచ్చినా పాత్రో మనసు ఆనంద తాండవం చేస్తుంది. అప్పటికే నలిగి నీరసించి మంచాన పడి రోగిలా, ముడతలు పడి చిరగడానికి సిద్దంగా ఉన్న ఉత్తరాన్ని జాగ్రత్తగా విప్పాడు పాత్రో.
🔱
*సశేషం*

Comments
Post a Comment