శ్రీ వెంకటేశ్వర స్వామి కధలు****




శ్రీ  వెంకటేశ్వర స్వామి కధలు

01. తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం, 02. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం., 03. శ్రీ వేంకటేశ్వర లీలలు-, 04. తిరుమలలో అంగప్రదిక్షణ.,  05. తిరుమల శ్రీ వెంకటేశ్వర వైభవం.,

01. తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న  కథ మీకు తెలుసా...?
-
కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!డ్రైవర్ రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.
వందల కంఠాలు"గోవిందా! గోవిందా!"
అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి
గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ చేరుకుంది. డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి. చుట్టూ చూశాడు. వేలాది యువతులు
హారతులిచ్చి, గోవిందా, గోవిందా అంటూ తన్మయులైనారు.

అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డిగారికి, ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి నమస్కరించి" ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు, ఏడు ఎనిమిది క్లిష్ఠమైన మలుపులున్నాయి. ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ మీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు,అంచులు తగిలి బండరాళ్లు దొర్లిపడవచ్చు,మీరు హామీ ఇస్తే పైకి చేర్చి
తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో పైకి చేర్చే బాధ్యత నీది.మిగిలిన బాధ్యతలు మావి అని అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను, పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు బయలుదేరింది.వెనుకే వాహనాల్లో అందరూ బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే మానులు తగిలి, బండలు ఊడిపడ్డాయి. పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది. ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..
సూర్యాస్తమయం లోగా ట్రాలీ తిరుమల చేరిపోయింది.
వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో గోవిందా..గోవిందా..నామస్మరణతో తిరుమల కొండ ప్రతిధ్వనించింది! 

☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం
దండేలీ అడవుల్లోపుట్టి 300 ఏళ్ల వయసున్న ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు
క్షేమంగా చేరుకున్నాయి👌

🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?

నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు తాపడానికి పాలిష్ చేయడం. నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు.
ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు!
అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య!
ఇలా ధ్వజస్తంభం చుట్టూ వున్న నాలుగు వరుసల గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో అసలు విషయం బయటపడింది.
ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు?
మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచిఉంది?
కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది.
రేపో మాపో అది కూలిపోవచ్చు!
మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి?
వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో చేసేయ్యండి. 75 అడుగుల టేకుమానులు బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు!
కానీ ఇక్కడ ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే ప్రసాద్!
స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు. స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు.
అందుకే "ధ్వజస్తంభాన్ని పునర్మిద్దాం" అని ప్రకటించారు👌
ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!

🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.!

ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు, కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న ఒకే మాను కావాలి. వందేళ్లకు పైగా మన్నిక కల్గిన టేకు చెట్టు అయివుండాలి.

ఎక్కడ? ఎక్కడ?

ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి?
☘పాత మాను గురించి తెలుసుకుంటే దొరుకుతుంది అని 190 సంవత్సరాల
రికార్డులన్నీ పరిశీలిస్తే..ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు. మరో వేపు నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం.
ఈ కొద్ది రోజుల్లో మనం.....
ఇది చేయగలమా????ప్రశ్నలు???

🍀ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు
ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు రేడియోలో విన్నాను. అటువంటి మానులు
కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి. మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను!
వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను పరిశీలించి,అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా ఆరు చెట్లను ఎంపిక చేశారు.అదే వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావుగారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.
ధ్వజస్థంభానికి ఒక్కమాను సరిపోతుంది. అయినా ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ తీసుకున్నారు. సమస్య అక్కడితో అయిపోలేదు. దట్టమైన అడవిలో, కొండ వాలులో ఉన్న వీటిని మొదటికంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..
సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని..దుంగల్ని
క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ చేర్చారు. ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ
బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరుమల చేరుకుంది!
1982 జూన్ 10వ తేదీన ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!

🍁ఉత్సవం చివరన నాగిరెడ్డిగారు ట్రైలర్ యజమానికి 70 వేల రూపాయల చెక్కును
అందించారు! యజమాని.. "స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు
ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!" అని దానిని తిరస్కరించారు!
డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.
స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!
అది విప్పి చూసిన వెంకట్రామయ్య కళ్ళలో కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న తన
ప్రమోషన్ ఆర్డర్ అది! ఇలా..స్వామివారి సన్నిధిలో.. ఎందరికి ప్రాప్తం?..అనుకుంటూ..
ఆయన రెండు చేతులూ జోడించి ఆనందడోలికల్లో మునిగిపోయారు!

ఓం నమో వెంకటేశాయ 🙏🏻


--(())-- 02. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం.!💐శ్రీ💐
ఓం నమో వెంకటేశాయ నమః..!!🙏

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ  స్తోత్రం -
మార్కండేయ మహర్షి విరచితం.

ఈ స్తోత్రంలో నాలుగు శ్లోకాలు 'నన్ను రక్షించుగాక' అనే అర్థం వచ్చేవి,
చివరి శ్లోకం 'ఫలశ్రుతి' - మొత్తం ఐదు శ్లోకాలు.

నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || --- 1

భావం.!💐
శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు.
పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము
తానే అయినవాడు.
కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను.
శ్రీవేంకటేశ్వరుని పేరే (ఆస్వామి పేరును స్మరించుకుంటే) నాకు భద్రకవచమై రక్షించుగాక!

సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరో2(అ)వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః || --- 2

భావం.!💐
వేయి తలలు - అంటే అనంతమైన శిరస్సులు గల పరమాత్ముడైన వేంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువు, అందరి ప్రాణాలకు నిలయుడు అయిన ఆ శ్రీహరి
నా ప్రాణాన్ని రక్షించుగాక!

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదా(అ)వతు
దేవదేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః ||  3

భావం..!💐
ఆకాశరాజు కూతురు పద్మావతికి భర్త అయిన వేంకటేశ్వరుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక!
దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక!

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు!! 4

భావం.!💐
అలమేలు మంగమ్మ పాటి, అన్నింటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్నిచోట్లా,
అన్నికాలాలలో నా సత్కర్మల నన్నింటినీ రక్షించి, వాటిని సఫలం చేయుగాక!

ఫలశ్రుతి
య ఏతద్ వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || -- 5
.
ఫలశ్రుతి భావం.!💐
ఈ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినము భక్తితో పఠించేవాళ్ళు మృత్యు భయం లేకుండా
ఆనందంగా ఉంటారు.

లఘు వివరణ.💐
కవచము అంటే శరీరాన్ని రక్షించే సాధనము.
అది వజ్రంతో తయారయిందైతే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపా
డుతుంది.
ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం భక్తుల పాలిటికి వజ్రకవచమై కాపాడుతుంది.
శ్రీస్వామి వారిని శరణుపొంది,
ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తీ-ప్రపత్తులతో,
శ్రద్ధతో పఠించే వాళ్లు అన్ని ఆపదలనుండి శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు. మృత్యు భయం లేకుండా హాయిగా ఉంటారు. (మృత్యువుకంటే మృత్యు భయం గొప్పది)


🙏🙏🙏🌹🌹🌹
--(())--

03. శ్రీ వేంకటేశ్వర లీలలు-

శ్రీ వేంకటాచలమందు ‘వసుపు’ అను పేరు గల ఒక బోయవాడు ఉండేవాడు వాని భార్యపేరు చిత్రావతి. ఆ కిరాతకుడు మంచి భక్తుడు. ప్రతిదినము తాను తెచ్చిన వెదురుబియ్యమును, పుట్టతేనెను, భార్యకిచ్చి వండించేవాడు. దానిని తన యింటి ముందొకరాతి నుంచి వేంకటేశ్వరునిగా భావించి నైవేద్యము పెట్టేవాడు. ఆ తరువాతనే ఆ కిరాతక దంపతులు తిండి తినేవారు. ఆ ఆలుమగలకొక కొడుకు కలిగాడు. వానికిసువీరుడు అని పేరు పెట్టుకొని జాగ్రత్తగా పెంచుకొంటున్నారు. ఒకనాడు అడవికి వెళ్ళిన తండ్రి తేనె పట్టుకొని ఎంతకూరానందున ఆకలి గొన్న ‘సువీరుడు’ తల్లి వార్చిన అన్నాన్ని దేవునికి నైవేద్యము పెట్టి తాను తినేశాడు. తేనె తెచ్చిన వసువు, తేనె లేకుండా స్వామికి నైవేద్యము పెట్టేడనీ కోపించి కొడుకుతల నరకబోయాడుl. శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షమై ‘‘భక్తి ప్రధానంగానీ, నైవేద్యము ప్రధానము కాదు. నీ కొడుకు నిన్ను మించిన భక్తుడవుతాడు, శాంతించు’’ అని చెప్పి, వారిని అనుగ్రహించి మోక్షమిచ్చేడు...


04. తిరుమలలో అంగప్రదిక్షణ.............


వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .
1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .
2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట .
3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి .
4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు .
5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .
6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి .
7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .
8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .
9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం .

అంగ ప్రదక్షణకు వెళ్ళాలనుకునేవారు మధ్యాహ్నం పన్నెండింటికల్లా కొండమీదకు చేరాలి. వెంటనే భోజనానికి దేవస్థాన సత్రంలోనో మరోచోటో ముగించుకుని, టికెట్లు ఇచ్చే C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ వెతుక్కునే సరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారో అందరూ లైన్ లో నుంచోవాలి. దాదాపు నాలుగు గంటల సమయానికి టికెట్స్ ఇస్తారనుకుంటా. మధ్య మధ్యలో వేరేవాళ్లు అక్కడ కట్టిన ఇనుప కర్రల పైనుండి దూకేసి మరీ మనకంటే ముందుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఖండించక పోతే టికెట్స్ దొరకనట్టే. కనుక వందల మంది ఎదురుచూసే ఆటికెట్ కోసం ఖచ్చితంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తే మంచిది.


టికెట్స్ తీసుకున్నాకా సాయంత్రం పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకోండి. ( స్వామి దర్శనానికి ముందే వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. లేక పోతే దర్శన ఫలం ఉండదు ) చుట్టుప్రక్కల ఉన్న మిగతా దేవాలయాలు,ఆశ్రమాలు దర్శించుకోండి. ఆరోజు రాత్రికి భారీ ఆహారం తీసుకోకండి. అలా తీసుకుంటే ప్రదక్షిణలు మనం మూడు గంటల సమయంలో చేస్తాం కనుక ఆహారం సరిగా అరుగదు. మనం పొర్లడం వలన వాంతులు అవుతాయి కనుక అల్పాహారం తీసుకోవడం మరవద్దు. రూము దొరికితే ఫర్వాలేదు. దొరక్క పోయినా మరేమీ కంగారు పడనవసరం లేదు. రాత్రి పన్నెండైనా ఇంకా భజనలు, హరికథలు సాగుతుంటాయి దేవాలయం చుట్టుప్రక్కల. రాత్రి పన్నెండున్నరకు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒంటిగంట కల్లా అంగప్రదక్షిణకు వెళ్లే లైన్ వద్ద నుంచోవాలి. లైనులో మొగవారైతే దాదాపు రెండుగంటలు వేచి ఉండాలి. ఆడవారు గంటన్నర. ఆసమయం వృధా చేయకుండా స్వామి మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి.

అందుకని చేతిలో గోవిందనామాల కాగితం పెట్టుకుని బిగ్గరగా మీరు చెప్తూ మీస్నేహితుల చేత చెప్పించండి. అది విని మిగతావారు చెప్తారు. చక్కగా లైన్ లో ఉన్నంత సేపూ మొహమాటపడకుండా భగవన్నామాన్ని పలకండి. స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం ఆరవుతుంది. లడ్డు పదిరూపాయలు పెట్టి కొనుక్కుని బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. సంధ్యావందనాదికాలు ముగించుకుని అల్పాహారం సేవించి, ఆరోజు దర్శనం జరిగిన విధివిధానాన్ని నెమరు వేసుకుంటూ క్రిందకు రండి


 --((**))--
 05. తిరుమల శ్రీ వెంకటేశ్వర వైభవం

తిరుమలలో శ్రీ వారికి జరిగే నిత్య సేవలు పలురకాలు. ఆ విశేషాలు వర్ణింపశక్యం కానివి. తూర్పు తెల్లవారక ముందే స్వామి వారికి ఈ నిత్య సేవలు ఆరంభమవుతాయి.

సుప్రభాత సేవ

శ్రీవారికి చేసే మొట్టమొదటి సేవ, ప్రతిదినం తెల్లవారు జామున 3 గంటల సమయంలో మొదలవుతుంది. అర్చకుల రాకను తెలియబర్చటానికి పెద్ద పలక గంటను మోగిస్తారు. మహాద్వారం తెరుచుకుంటుంది. సన్నిధి గొల్ల ముందు నడుస్తుండగా మిగతావారు వెనుక నడుస్తారు. తాళం చెవులను క్షేత్రపాలక శిలకు తాకించి అయన అనుమతి తీసుకుని, ఆనందనిలయ విమానం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అర్చకులు "కౌసల్యా సుప్రజా రామా" అంటు ప్రారంభించి, తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి, శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం పఠిస్తారు. తాళ్ళపాక అన్నమయ్య వంశానికి చెందిన ఒకరు తుంబూరా మీటుతూ శ్రీ స్వామివారిని మేల్కొలుపుతారు. తర్వాత దీపోద్దీపనం, గర్భాలయ సంమార్జనం చేసి స్వామివారిముందు తెరను వేస్తారు. నివేదన, తాంబూలం సమర్పిస్తారు. నవనీతి హారతి, తీర్థం, శఠారి ఇస్తారు. స్స్వామివారి దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. ఈ సుప్రభాత గీతాన్ని "ప్రతివాది భయంకర అన్నన్" అనే భక్తుడు క్రీ. శ. 1430 నుంచి శ్రీవారి ఆలయంలో పాడటం ప్రారంభించి వుంటారని భావిస్తారు.

అర్చన

ప్రతీరోజూ ఉదయం 4 గంటలకు జరిగే ఆరాధన, జియ్యంగారు యమునత్తురైకి వచ్చి అక్కడి పుష్పమాలలు, వెదురుగంపను తలపై పెట్టుకుని బయలదేరుతారు. వీటిని శుద్ధిచేసి, జేగంటను మ్రోగిస్తూ ఆరాధన ప్రారంభిస్తారు. స్వామివారికి ఆకాశగంగ నుంచి తెచ్చిన తీర్థం అర్ఘ్యపాద్యాదులు, ఉదయం, సాయంత్రం పూజకి, బ్రహ్మారాధనకు ఉపయోగిస్తారు. అర్చన సమయంలో మంత్తాశనం, స్నానాశనం, పుష్పాన్యాసం, అలంకారాసనం నిర్వహించి, స్వామికి పురుషసూక్తం చదువుతూ అభిషేకిస్తారు. జియ్యంగార్లు నిరాట్టం చదువుతారు. అభిషేక సమయంలో విగ్రహానికి పలుచని గుడ్డ కట్టి నూనె రాసి, చింతపండు నీటిని కలిపి ఆ జిడ్డును తోలిగిస్తారు. ఆవుపాలు, గంధం, పసుపునీటితో అభిషేకించి, శుద్దోదక స్నానం చేయించి, చివరగా గంగోదక స్నానం చేయించి, మరలా శుద్దోదక స్నానం చేయిస్తారు. తరువాత పుస్పాంజలి సమర్పించి, మూలవిగ్రహానికి, భోగ శ్రీనివసమూర్తి విగ్రహనికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. మూల విగ్రహానికి పుష్పన్యాసం జరుపుతారు. గర్భగృహం వద్దనున్న మెట్టును కడిగి అర్చన చేస్తారు. అలంకారాసనంలో స్వామివారికి ఆసనం, వస్త్రం, భూషణం, ఉత్తరీయం సమర్పిస్తారు. కర్పూరంతో నుదుటిమీద ఊర్ధ్వపూండ్ర చిహ్నాన్ని దిద్ది యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నాన పీఠంలో పెట్టి, వీటితో పాటు గర్భగుడిలో ఉన్న విగ్రహాలకు అభషేకం చేస్తారు. అభిశేకించిన నీటిని ఒక పాత్రలోకి సేకరిస్తారు. జియ్యంగారు, భక్తులు తిరుప్పళ్లి ఎళుచ్చి అరవై పాశురాలను గానం చేస్తుంటారు.

తోమాల సేవ

తమిళంలో 'తోదుత్తమాబై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. ఆ పదమే కాలక్రమేణా "తోమాల"గా మార్పు చెంది, తోమాలసేవ అయి ఉంటుందని భావిస్తారు. తోమాలసేవనే "భగవతీ ఆరాధన" అని అంటారు. ప్రాతఃకాలంలో స్వామివారి ఆరధనలో భాగంగా మూల విగ్రహంపై ఉండే బంగారు కవచానికి, భోగ శ్రీనివాసుకి అభిషేకం జరుగుతుంది. తరువాత స్వామివారిని అనేక రకాల పూలమాలలతో అలంకరిస్తారు. తెల్లవారుజామున సుమారు 3.45నుండి 4.30 వరకు జరుగుతుంది.

అష్టదళ పద్మారాధన

శ్రీ స్వామివారికి అష్టదళ పద్మారాధన 108 సువర్ణ పుష్పాలతో జరుగుతుంది. వీటిని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అను భక్తుడు సమర్పించాడు.

సహస్రనామార్చన

ఈ అర్చన తెల్లవారుజాము 4.45 నుండి 5.30 వరకు జరుగుతుంది. అర్చకుడు శ్రీవారి పాదాల చెంత కూర్చుని సంకల్పం చెప్పుకుని జేగంట వాయిస్తూ పువ్వులు, తులసిపత్రాలు తీసుకుని "ఓం వేంకటేశ్వరాయ నమః" అని అంటూ స్వామివారి వేయి పేర్లను స్తుతిస్తూ చేసే సేవ ఇది. తర్వాత శ్రీవారి పాదాలు వద్ద ఉన్న పువ్వులు, తులసి పత్రాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు లక్ష్మీ సహస్రనామాలను పఠిశ్తారు. చివర్లో నక్షత్ర హారతి, కర్పూర హారతి జరుగుతాయి. (ఆర్జితసేవ)

గురువారంనాడు జరిగే సేవలు -- ఉదయం సేవ

ప్రతఃకాలారాధన తర్వాత తలుపులు మూసి, స్వామివారి ఆబరణాలన్నీ తీసివేస్తారు. నుదుటన గల పచ్చ కర్పూరపు నామాన్ని తగ్గిస్తారు. దీనివలన స్వామివారి నేత్ర సౌందర్యం భక్తులు కనులారా గాంచవచ్చు. తరువాత స్వామివారికి 24 మూరల పట్టంచు ధోవతిని, 12 మూరల ఉత్తరీయాన్ని కడతారు. శ్రీవారికి సువర్ణపాదాలు, సువర్ణహస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, సువర్ణ సాలగ్రామ హారాలు సమర్పించి, తలుపు తీస్తారు. దీనినే "సడలింపు" లేదా "సళ్ళింపు" అంటారు.

మధ్యాహ్న సేవ

మధ్యాహ్నం అస్థాన మండపంలో తిరుప్పావడ జరుగుతుంది. శ్రీవారి ముందు  తెరవేసి సుమారు 450 కిలోల అన్నప్రసాదం (పులిహోర) పెట్టి, దానిమీద శ్రీవారి ద్రుష్టి ప్రసరించేలాగా పెడతారు. ఈ రాశిని 8 భాగాలు చేసి దిక్కులలో పెడతారు. దీనికి తోడుగా లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబీ, వగైర కూడ పెడతారు. దీనినే "అన్నకూటోత్సవం" అనీ "తిరుప్పావడ" అని వ్యవహరిస్తారు. అనంతరం స్వామి వారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు ఇస్తారు.

రాత్రి సేవ

సాయంకాల పూజ తర్వాత పానకం, వడపప్పు నివేదన చేసి, బంగారు వాకిలి ముందు మజయల్ తెరను వేస్తారు. శ్రీవారికి మకుటం నుంచి పాదాల వరకు పువ్వుల మాలలతో వస్త్రరూపంలో ఉత్తరీయ రూపంలో, కిరీటం, శంఖు చక్రాల రూపంలో అలంకరిస్తారు. అంటే పూర్తిగా పువ్వల అలంకరణలోనే ఉంటారు స్వామివారు. ఈ సేవను "పూలంగి సేవ" అంటారు.

అంగ ప్రదక్షిణ

దీనినే పొర్లు దండాలు అని కూడా అంటారు. ఈ మొక్కు ఉన్నవారు తెల్లవారుజామునే రెండు గంటలకు స్నానం చేసి తడిబట్టలతో వైకుఠద్వారం ద్వారా అలయంలోకి ప్రవేశించి, బంగారు వాకిలి ఎదురుగా ఉన్న రంగనాథ సన్నిధి నుండి ప్రారంభించి, విమాన ప్రదక్షిణ మార్గం చుట్టి మళ్ళీ శ్రీరంగనాథ సన్నిధి దగ్గర తమ అంగప్రదక్షిణలు (మొక్కు) పూర్తి చేస్తారు. మొక్కుకున్న అంగప్రదక్షిణ పూర్తిచేస్తే, స్వామి సంతుష్టుడై, తమ కోర్కెలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం.

శుక్రవారం అభిషేకం

అభిషేకం కేవలం శుక్రవారంనాడు మాత్రమే జరుగుతుంది. పచ్చకర్పూరం, చందనం పొడి, కస్తూరి, జవ్వాది వంటివి వెండి గిన్నెల్లో తీసుకుని, విమాన ప్రదక్షిణం ద్వారా మంగళవాద్యాల మధ్య గర్భగుడిలోకి తీసుకువస్తారు. ముందు స్వామివారి పాదాల వద్ద కస్తూరితో కలిపిన కర్పూరపు ముద్దను పెట్టి, మూల విగ్రహానికి తిరుమాంజనం అభిషేకం చేస్తూ, పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, ప్రబంధాలు పఠిస్తారు. ముందు శుద్దోదక స్తానం, తరువాత క్షీరాభిషేకం చందనం కలిపిన పన్నీరుతో స్నానాలు జరుగుతాయి. దీనికై రెండు వెండి గంగాళాల బంగారుబావి నీటిని, 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమపువ్వు, 1 తులం కస్తూరీ, ఒకటిన్నర తులం పునుగు తైలం, 24 తులాల పసుపు వాడుతారు. ఈ పవిత్ర అభిషేక జలాన్ని వెండి గిన్నెలో సేకరిస్తారు. ఈ జలాన్ని పులికా తీర్తం అంటారు. తరువాత విగ్రహాన్ని తుడిచి, పునుగు నూనెను మకుటం నుంచి పాదాల వరకు రాస్తారు. తరువాత చందనపుపొడి, తెల్ల నామాలతో ఊర్ధ్వపుండ్రాన్ని , మధ్యలో కస్తూరితో తిలకాన్ని దిద్దుతారు. మూలవిగ్రహం మీద వేళ్ళాడే శ్రీలక్ష్మి విగ్రహానికి శ్రీసూక్తం పఠిస్తూ అభిషేకం చేసి, స్వామివారికి హారతి ఇస్తారు. తరువాత స్వామివారి తెల్లనామాన్ని వెడల్పు చేస్తారు. శ్రీస్వామివారి నామాన్ని "తిరుమణికాపు" అంటారు. 16 తులాల కర్పూరాన్ని, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు. స్వామివారికి పీతాంబరాన్ని కట్టి ఆభరణాలతో అలంకరిస్తారు.

కొలువు

దీనినే "దర్బారు" అని కూడా అంటారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 15 నిముషములపాటు జరుగుతుంది. తిరుయామణి మండపంలో స్వర్ణఛత్రం క్రింద స్వర్ణ సింహాసనం మీద ఆశీనులైన శ్రీనివాసునికి ఛత్రచామరాలతో రాజోచిత మర్యాదలు జరిపి, రోజూ పంచాంగ శ్రవణం చేసి, ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఉత్సవ విశేషాలను, ముందురోజు లభించిన ఆదాయ వివరాలను తెలియజేస్తారు. నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నివేదన చేసి, హారతి ఇచ్చి శ్రీనివాసుని యథా స్థానానికి చేరుస్తారు.

పాదరేణువు

చందనం ముద్దను పునుగునూనెతో కలిపితే వచ్చే దానిని "శ్రీ పాదరేణువు" అంటారు. ఈ ముద్దని, వంశపారం పర్యంగా పూజనిర్వహించేవారికి, గ్రుహస్థులకు ఇవ్వటం జరుగుతుంది. దీనిని "కైనిథి" అని అంటారు. "చేతిలో ఉన్న నిథి." అని దీని అర్థం.

తిరుమంజన తీర్థం

శ్రీ స్వామివారి విగ్రహం నుండి క్రిందకు ప్రవహించే అభిషేక తీర్థాన్ని "తిరుమంజన తీర్థం" అని అంటారు. ఈ తీర్థంలో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిసి ఉంటాయి. అర్చకులు, జీయర్ స్వాములు ఈ తీర్థాన్ని శ్రీ పాదరేణువుతో కలిపి తీసుకుని భక్తులకు, గ్రుహస్తులకు, పంచుతారు. ఈ తీర్థంతో పాటుగా "పోళీలు" అనే పిండివంటను కూడా పంచుతారు.

ఏకాంతసేవ:

ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో వేళ్లాడదీయబడే బంగారు ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని పవళింపచేస్తారు. ఆ కారణంగానే "శయనమంటపం" అని కూడా అంటారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జరిగే ఈ సేవను "ఏకంతసేవా" లేదా "పవళింపు సేవ" అని కూడా అంటారు. స్వామివారికి పళ్ళు, బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు. స్వామివారి రెండు పాదాల వద్ద 2 చందనపు బిళ్ళలు, భోగశ్రీనివసమూర్తి హ్రుదయం మీద సగం బిళ్ళ, మరొక పావు వంతు బిళ్ళను ధ్రువమూర్తి గుండెల మీద ఉండే అలివేలు మంగ వద్ద ఉంచుతారు. మరొక పావువంతు చందనపు బిళ్ళను అక్కడే ఉంచేస్తారు. అలాగే వెండిగిన్నెలో తగినంత నీటిని కూడా ఉంచుతారు. ఎందుకంటే స్వామివారిని పూజించవచ్చే బ్రహ్మదేవుని కోసమని.  స్వామివారి శయనానందం కొరకు తాల్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు, ఆలాపన చేస్తారు. ఈ సేవని "తాళ్ళపాక వారి లాలి" అని అంటారు. ఈ ఏకంత సేవ ఏడదిలో 11 నెలలు భోగశ్రీనివసునికి, ఒక్క మార్గశిర మాసంలో మాత్రం శ్రీ క్రుష్ణ విగ్రహానికి జరుగుతుంది. ఈ సేవ పూర్తి అయితే ఆ రోజుకి స్వామివారికి అన్ని పూజలు, సేవలు పూర్తి అయ్యినట్టు లెక్క.

నైవేద్య సమర్పణ:

ఉద్యం 6.30 గంటలకు పోటు (వంటశాల)లో సిద్ధమైన నైవేద్యాన్ని నివేదిస్తారు. ఆ సమయంలో బంగారు వాకిలి తలుపులు మూసివేసి తిరుయామణి మండపంలో గంటలు మ్రోగిస్తారు. దీనినే "మొదటి గంట" అని అంటారు. అన్నప్రసాదాలు, పిండివంటలు మొదలైనవి నివేదన చేస్తారు. ప్రధాన వంటదారుడు "ఓడు" (పగిలిన మట్టికుండ)లో మాత్రా అనే దధ్యోదనం (పెరుగన్నం) ఆలయంలో వైష్ణవులు మాత్రమే గర్భగుడిలో ఉండి ప్రబంధ పారాయణం చేస్తూ ప్రసాదాన్ని నివేదిస్తారు. తోమాల సేవలో పఠించిన 28 పాశురాలు (30 పాశురాలకు) కాకుండా మిగిలిన 2 పాశురాలు ఇప్పుడు పఠిస్తారు. తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచుతారు.

మధ్యాహ్న సేవ (నైవేద్యం)

మధ్యాహ్న సమయంలో మరలా అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. ఆ సమయంలో శ్రీవారి పాదపద్మాలను తులసీ దళాలతో, పువ్వులతో పూజిస్తారు. తర్వాత శ్రీదేవి, భూదేవిలకు లక్ష్మీ నామార్చన జరుగుతుంది. ఈ సేవకు భక్తులు ఆర్జిత సేవ ద్వారా హాజరు కావచ్చు. స్వామివారికి మధ్యాహ్న భోజన సమయంలో "రెండో గంట" మోగుతుంది. పోటునుంచి వచ్చిన నైవేద్యాలను స్వామివారికి నివేదించి, తాంబూలం, కర్పూర హారతి సమర్పిస్తారు."రెండో గంట" ముగియగానే స్వామివారి హుండిలోని మొత్తాన్ని పరకాయణికి తరలిస్తారు. నైవేద్యం ఆరగింపు పూర్తయ్యాక శ్రీడేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను కన్నుల పండగ చేసేందుకు విమాన ప్రదక్షిణంగా కల్యాణ మండపానికి వేంచేస్తారు. ఇక్కడే సుమారు 12 గంటల సమయంలో చిన్న కల్యాణం, పెద్ద కల్యాణం టిక్కెట్లు కొన్న భక్తులు స్వామివారి కల్యాణంలొ పాల్గొంటారు.

రాత్రి పూజ

ఈ సేవ కూడా తోమాల సేవ వంటిదే. జియ్యం గారు వెదురు గంపలో పువ్వులు, తులసీ దళాలు తేవటం, అర్చకుడు స్వామివారికి పూజ చేసి, పుష్పమాలలు అలంకరించటం, మంత్రపుష్పం, హారతులు సమర్పించటం జరుగుతుంది. తర్వాత స్వామికి అష్టోత్తర శతనామపూజ, శ్రీదేవి, భూదేవిలకు లక్ష్మీనామార్చన, ఆ తరువాత నైవేద్య సమర్పణ. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. ఈ సేవ సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో జరుగుతుంది.

ప్రత్యేక సేవల విశేషాలు:

స్వామివారికి ప్రతీ సోమవారం 7.00 నుండి 9.00 వరకు విశేష పూజ.
మంగళవారం ఉదయం 6.30 నుండి 7.30 వరకు అష్టదళ పద్మారాధన పూజ
బుధవారం ఉదయం 6.30 నుండి 9.00 వరకు సహస్ర కలశాభిషేకం
గురువారం ఉదయం 6.30 నుండి 8.00 వరకు తిరుప్పావడై
శుక్రవారం 4.30 నుండి 6.00 వరకు అభిషేకం జరుగుతుంది.
--(())--

06. పద్మావతీ శ్రీనివాసం💥🌹
🥀
అలిమేలుమంగమ్మకి అలసటగా అనిపించింది. 
మగతకళ్ళను నలుపుకోని, “ఇంకా రాడేం నా నామాలస్వామి” అంటూ పలవరించింది. ఆ రోజు శుక్రవారం కావటంతో, ఆమెకీ భక్తుల తాకిడి ఎక్కువగానేవుంది. నిద్ర ముంచుకొస్తోంది. అయినా మునుపు ఏండుకొండలవాడు వచ్చినప్పుడు శుక్రవారం తప్పక వస్తానని చేసిన ప్రమాణం గుర్తుంది.ఎందుకే ఈ ఎదురుచూపులు.

బద్దకంగా లేచి నాలుగు అడుగులు వేసి గుమ్మందాకా వచ్చింది ఆ తల్లి. కనుచూపు సాగినంతవరకు పరికించి ఏడుకొండలవైపు చూసింది. ఏముంది... ఆయన జాడ లేదు సరికదా, ఇసుకేస్తే రాలనట్లు జనం కనిపించారు. ఇంకా వస్తున్నారు.. బస్సుల్లో, కార్లలో, కాలినడకన.. జనం జనం జనం. ఒక పక్క ఒక గుంపు “గోవిందా.. గోవిందా” అని అరిస్తే, అటువైపు వున్నాడేమో అని చూసింది. 


ఇంతలో మరోవైపు “ఏడుకొండలవాడా వేంకటరమణా...” అని మరో భక్తసమూహం కేకపెడితే, పోనీ అటువైపు కానీ వెళ్ళాడా అని చూసింది. ఎక్కడా ఆయన జాడే లేదు.

అలిమేలుమంగమ్మ మరికాస్త పరికించి, తిరుమల కొండపైకి దృష్టి సారించింది.ఇంకా పవళింపు సేవకి టికెట్లు ఇస్తున్నారు. “నారాయణా... ఇంకా సేవలు వున్నాయా? భక్తపక్షపాతం కాకపోతే ఎప్పుడూ వాళ్ళ సేవలేకానీ, మిమ్మల్ని సేవించి తరించే అవకాశం నాకు ఇవ్వవు కదా..” అంటూ నిట్టూర్చింది.


చేసేదిలేక భారంగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చింది. ఆమె శ్రీవారు వస్తే అలంకరించాలనుకున్న వజ్రాలపతకం, పట్టుపీతాంబరం ఆపక్కనే తిరునామం తీర్చిదిద్దడానికి సర్దుకున్న సరంజామా అన్నింటినీ ఒక్కసారి చూసుకుంది.


“ఏం లాభం.. రావటమే ఆలస్యం... ఇంక వీటన్నింటికీ తీరికేది? అసలు ఆయన సక్రమంగా భోజనం చేసి ఎన్నాళ్ళైందో..” అనుకున్నది. ఆ ఆలోచన రాగానే, ఆయన కోసం ఏర్పాటు చేసిన భోజనాల సంగతి గుర్తొచ్చింది. “అయ్యో గోవిందా... అన్నీ చల్లంగా చల్లారిపోయి వుంటాయి...” అంటూ ఒక్కక్క పాత్రపైన మూత తీసి చూసింది. పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం, పాయసం ఇవికాక సాధకాలు, భక్ష్యాలు అన్నీ స్వహస్తాలుతో ప్రేమ రంగరించి మరీ చేసింది ఆ తల్లి. “అలిసిపోయి వస్తాడు... ఇక రుచిపచి కూడా తెలియదైపోయే... ఇంకా అందులో రంగరించిన ప్రేమని ఎక్కడ గుర్తిస్తాడు?” అనుకుంది పద్మావతి.


ఆ వంటకాల సువాసనలు ఆఘ్రాణించిన తరువాత అమ్మ కడుపులో ఆకలి రెండింతలైంది. “మధుసూధనా... త్వరగా రావయ్యా స్వామీ...” అంటూ చనువుగా అంది అక్కడే కూర్చుంటూ. “అంజనాద్రి వరకైనా వచ్చాడో లేక ఇంకా మాడవీధులైనా దాటలేదో...” అనుకుంటూ, ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకుంది ఆ అన్నులమిన్న.

*
స్వామి పరుగులమీద వున్నాడు. అప్పుడెప్పుడో గజేంద్రుడు పిలిచినప్పుడు ఇలా పరిగెత్తాడు. ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ ఇదే జరుగుతోంది.అప్పుడన్నా నయం, వచ్చిన దారి సులువైన గగనమార్గం... వద్దన్నా వెంటపరుగెత్తిన పరివారం. మరి ఇప్పుడో... కఠినమైన గుట్టలు, రాళ్ళు నిండిన కొండ దారి. ఇక పరివారమా? అంతా గుళ్ళోనే జోగుతున్నారు. పైగా స్వామీ వెళ్ళేది దేవేరి దగ్గరకేనని వాళ్ళకీ తెలుసు. అందుకే వెంట వస్తామని కూడా అనరు.

“పోనీ నేను రానా స్వామీ” అంది కౌముది అనే గద నిద్రకళ్ళతోనే.
“నువ్వొస్తే నాకు మోత బరువు తప్ప ఉపయోగం ఏముంది? ఆ గరుక్మంతుడు వస్తే ఉపయోగం కానీ” అన్నాడు ఒక మూల నిద్రపోతున్న గరుక్మంతుణ్ణి చూసి.
“పాపం అలసిపోయాడు స్వామీ” అంది కౌముది.

తప్పేదేముంది. దేవేరికి ఇచ్చిన మాట... ఆ మాట జవదాటి అలమేలుకి అలక తెస్తే ఆ అలక తీర్చేందుకు ఎన్ని పారిజాతాలు కావాలో, ఏమేమి సేవలు చెయ్యాలో.
“సరే నేను బయలుదేరుతున్నా... గుడి జాగ్రత్త...” అన్నాడు ద్వారపాలకులని చూస్తూ.
“అలాగే స్వామీ” అన్నారు జయవిజయులు ద్వారబంధం పక్కనే కూలబడుతూ.
స్వామి వడివడిగా నడవసాగాడు.
*
పద్మావతీవల్లభుడు తిరుచానూరులో గుడికి చేరేసరికి అంతా చీకట్లు కమ్ముకున్నాయి. దేదీప్యమానమైన వెలుగులతో, అంతకు రెండింతలు వెలిగే చంద్రబింబంలాంటి ముఖంతో అలుమేలుమంగ ఎదురొస్తుందని వూహించిన శ్రీనివాసుడు హతాసుడయ్యాడు.

“ఈ చీకట్లు కారణం దేవేరి అలక కాదుకదా?” అంటూ సందేహించాడు. అడుగులు వడివడిగా వేస్తూ, గుడి గడపలు దూకుతూ లోపలికి అడుగుపెట్టాడు. వెంకటేశ్వర పట్టపురాణి కఠినమైన రాతిపై వళ్ళు తెలియక నిద్రపోతోంది. ఆయన రాకతో పాటే లోపలికి ప్రవేశించిన సుగంధ వీచికలను ఆఘ్రాణించి చటుక్కున లేచి కూర్చున్నది అలుమేలుమంగమ్మ.

“వచ్చారా స్వామీ... ఏమిటింత ఆలస్యం? చూడండి మీకోసం వండినవన్నీ చల్లారిపోయాయి...” అంది ఆమె నిద్రతో చదిరిన సింధూరాన్ని సర్దుకుంటూ.
“వాటి సంగతి సరే... ముందు కాస్త స్థిమిత పడనీ..” అంటూ అక్కడే వున్న ఒక రాతి స్థంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు దేవదేవుడు.

“అయ్యో... అక్కడ కూర్చున్నారేమండీ... అవునులే పగలంతే నిలబడే వుంటారయ్యే... కాళ్ళు నొప్పులు పుట్టాయేమో...” అంటూ పాంకోళ్ళను తొలగించింది.
“పైగా నీ కోసం పరుగులుపెట్టి వచ్చాను కదా...” అన్నాడు ఆయన. ఆమె తన కోమల హస్తాలతో సుతారంగా ఆయన పాదాలను నొక్కజూసింది.

శ్రీనివాసుడు ఆమెను వారించి – “వద్దు దేవీ, కొత్త పట్టుబట్టలు కట్టారు, అవి కొంచెం గరుకుగా వున్నాయి, నీ చేతులు కందేనేమో..” అన్నాడు.
జలజాక్షి మనోహరంగా నవ్వి – “ఇదంతా ప్రేమే..” అంది సిగ్గుపడుతూ. శ్రీనివాసుడూ నవ్వాడు. ఆలయమంతా వెలుగు పరుచుకుంది.
ఇంతలో గుమ్మం దగ్గర అలికిడి.. “ఎవరదీ..” అన్నాడు గోవిందుడు. – “నేను చూస్తానుండండి... ఇంత రాత్రివేళ ఎవరో..” అంటూ గబగబా గర్భాలయం వెలుపలికి వచ్చింది ఆమె. ఎవరో నలుగురు సాధువులు.

“ఏమిటయ్యా ఇంత రాత్రివేళ?” అంది కోపంగా.
“నీకు తెలియనిదేముంది తల్లీ... పైన స్వామివారి దర్శనం దుర్లభమైపోతోంది... క్షణకాల దర్శనం.. చూసినా చూడనట్టే వుంటోంది... ఒక్కసారి తనివితీరా చూద్దామని సాయంత్రం నుంచీ ఇక్కడే వేచి వున్నాము..” అన్నాడొక సాధువు భక్తిగా.
“ఓరి అసాధ్యులారా... ఇక్కడికీ దాపురించారా? మాకిద్దరికీ ఏకాంతమనేది ఒకటి వుండనిస్తారా లేదా?” అంది నిష్టూరంగా.

“తప్పే అమ్మా... కానీ ఏం చెయ్యగలం, స్వామివారితో నిముషం గడపాలంటేనే ఎంతో డబ్బు కావాలి... సాధువులం.. సామాన్యులం.. మా దగ్గర అంతంత డబ్బు ఎక్కడ వుంటుంది..” అంటూ ప్రాధేయపడుతూ నమస్కరించారు.

“మరి... ఆయనేమన్నా సామాన్యుడా... కాసులులేనిది వడ్డీకాసులవాడు ఎలా కనిపిస్తాడు... “ అంటూ వాళ్లని పంపించే ప్రయత్నంలో వుండగా, వారి ముఖంలో కనిపించిన భక్తితాదాత్మత చూసి ఆగిపోయింది. వెనకకు తిరిగి చూస్తే వెనకే వెంకటేశ్వరుడు.
“దేవదేవా... ఆపద్భాందవా... మీ దర్శనం కోరిన ఈ అల్పులకు సతీసమేతంగా దర్శనమిచ్చావా స్వామీ... గోవిందా.. గోవిందా..” అంటూ నమస్కరించారు. స్వామి చిరునవ్వు నవ్వి, అభయహస్తం చూపించారు.

“సరే.. చూశారుగా.. ఇక అష్టోత్తరనామాలు చదవక కదలండి... లేదంటే తెల్లారిపోగలదు..” అంటూ స్వామి హస్తాన్ని అందుకోని లోపలికి నడిచింది పద్మావతి.
“ఏమిటి స్వామీ మీరు... నేను పంపిస్తున్నానా... అసలు మీరు ఇంట్లో లేరని చెప్పాలనుకుంటుంటే ఇంతలోనే మీరు వచ్చి నిలబడ్డారు...”
“పోనీలే దేవీ, పాపం సాధువులు..”

“బాగానే వుంది... నేను కాబట్టి సరిపోయింది... ఒకప్పుడు మీరిలాగే సాధువని, ఋషి అనీ ఒకాయన కాళ్ళుపడితే లక్ష్మీదేవి ఏం చేసిందో గుర్తులేదా?” అంది అటువైపు తిరుగుతూ.
“అది లక్ష్మి, ఇది పద్మావతి... అది తెలుసు కనుకే ఇంత ధైర్యం..” అన్నాడు స్వామి. ఆమె ఆ మాటకు ఆమె సంతోషపడి, ఆయన వైపు తిరుగుతూ –
“అయ్యో స్వామీ... మాటల్లో పడి మీ భోజనం సంగతే మర్చిపోయాను... రండి తిందురుగానీ..” అంది.

“నీకు చెప్పనేలేదు కదూ పద్మా... నా భొజనం తిరుమలలోనే అయ్యింది... ఇంత రాత్రివేళ తింటే కష్టమనీ అక్కడే కానిచ్చాను..” అంటూ పొట్ట నెమురుకున్నాడు గోవిందుడు.

“అంతేలెండి... ఇక్కడ ఇంతింత నెయ్యిపోసి మీకిష్టమని చక్కరపొంగలి, పాయసాలు చేస్తే ఇవి మీకెందుకు నచ్చుతాయి... ఆ పైన మిషన్లు చేసిన లడ్లు తిని వస్తారు..” అంది ఆమె కోపంగా. తిరుమలేశునికి తిరిగి సమాధానం చెప్పడనికి ఏ సాకు దొరకలేదు. ఇంతలోనే అలుమేలుమంగ దగ్గరగా వచ్చి –

“ఇదంతా ఎందుకు స్వామీ... మీరు సంపాదనలో పడ్డ తరువాత... క్షణం తీరిక దొరుకుతోందా... మనం ఏంకాంతంగా అలా వ్యాహ్యాళికి వెళ్ళి ఎన్నిరోజులైంది? కనీసం కడుపారా సమయానికి భోజనం చేసి ఎన్ని రోజులైంది? చెప్పండి” అంది కించిత్ బాధపడుతూ.

“నువ్వు చెప్పిన మాటా నిజమే మంగా... నాడు వకుళమ్మ ఇంటిలో పేదవాడిగా వున్నప్పుడు పొందిన సుఖం, సంతోషం, ఆనందం మళ్ళీ పొందలేదు.” అన్నాడాయన సాలోచనగా.

“మనం మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోదామండీ...” అంది ఆమె ఆశగా.
“ఆ రోజు మీ నాన్న ఆకాశరాజు డబ్బులేని నన్ను కాదంటాడనే కదా ఈ ఝంజాటంలో పడ్డాను... ఇప్పుడు మనం వద్దనుకున్నా వదులుకోలేను... వదులుకున్న మరుక్షణం కుబేరుడు తగులుకుంటాడు..”

“హూ.. ఇంకా తీరలేదా ఆ అప్పు...” అంది ఆమె కోపంగా.
“నేనేమైనా సొంతానికి వాడుకున్నానా... మన పెళ్ళికి చేసినదే కదా..” నచ్చచెప్పబోయాడు వడ్డికాసులవాడు.
“ఎన్ని యుగాలనాటి పెళ్ళి... ఎన్ని లక్షలకోట్లమంది నిలువుదోపిడీలు... ఇంకా తీరలేదే... ఈ సుడిగుండం నుంచి బయటపడి మనం సుఖంగా వుండే రోజే లేదా... కలియుగ దైవమై కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా స్వామీ....” అంది ఆమె.
“నువ్వే చెప్పావుగా కలియుగదైవాన్నని, ఈ కలియుగ ధర్మం పాటించక తప్పుతుందా... ఈ యుగంలో వుండేదంతా మానవులు... మానవుడే సర్వశక్తిమంతుడు... అందువల్ల్ ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టే బాధ్యతని కూడా మానవులకే వదిలేశాను.. ఆ కారణంగానే వారందరినీఇలాంటి చట్రంలోనే ఇరికించాను... రోజల్లా చాకిరీ చెయ్యాల్సిన కార్పొరేట్ వుద్యోగాలు ఇచ్చాను, ఎంత కట్టినా తీరని హోం లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ఇచ్చాను... ఎక్కడైనా ఏ ఒక్కరైనా ఈ అప్పుల సుడిగుండాలని దాటి బయటపడతాడేమోనని ఆశగా చూస్తున్నాను... అంతా చేసిన అప్పుల కిస్తు కట్టడానికి చాకిరీలు చేస్తున్నారే తప్ప దాన్ని దాటి ఒక్కడైనా రావటంలేదు... అంతా మనలాగే ఇబ్బంది పడుతున్నారే తప్ప పరిష్కారం కనుక్కోలేక పోయారు...” అని ఆయన చెప్తుండగా కొండపై నుంచి మేలుకొలుపుగా పాడే సుప్రభాతం వినపడింది.
ఇక తప్పదన్నట్లు శ్రీనివాసుడు అలిపిరి వైపు అడుగులేశాడు. అలుమేలుమంగ నిరాశగా చూసింది.
--((***)--
06. పద్మావతీ శ్రీనివాసం

07. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం విశేషాలు

స్వామివారి ఆలయంలో భక్తులు ఎంతో సేపు నిరీక్షణ తర్వాత స్వామి దర్శనం అసంతృప్తిగానే చేసుకొని నిర్వేదంగా బయటకొస్తుంటారు. శ్రీవేంకటేశ్వర స్వామి యెదుట నిలబడ్డ మధురక్షణాలలో మనస్పూర్తిగా స్వామిని వీక్షించండి. అలౌకికానందం కలుగుతుంది. మనకంతే సమయం దర్శనం ప్రసాదించారని సంతృప్తిగా బయటకు రండి. వచ్చే సమయం ఆలయంలోని లెక్కలేనన్ని విశేషాలు చూసుకుంటూ రండి. సాధారణంగా భక్తులు గమనించని కొన్ని విశేషాలు ముచ్చటించుకుందాం.!

ధ్వజస్థంభ మండపానికి 100 అడుగుల దూరంలో స్వామికి అభిముఖ దిశలో నమస్కరిన్స్తున్నట్లున్న ముగ్గరు భక్తుల నిలువెత్తు రాగి విగ్రహాలున్నాయి. అవి మూడు స్వామి వారి మహాభక్తులైన లాలాభీమ్ రామ్, అతని తల్లి మాతా మోహనదేవి, అతని భార్య పితా బీబీల విగ్రహాలు. లాలా భీమ్ రామ్ క్షత్రియుడు, ఆయననే రాజా తోడరమల్లు అని కూడా పిలిచేవారు.17వ శతాబ్దంలో స్వామివారి ఆలయాన్ని ముస్లింల దండ యాత్రలనుండి, ఆంగ్లేయుల దాడులనుండి కాపాడిన మహావీరుడు రాజా తోడరమల్లు.

ధ్వజస్థంభాన్ని ఆనుకుని ఉన్నదే బలిపీఠం. స్వామివారికి ప్రసాద నివేదన జరిపిన తర్వాత ఆ బలిపీఠం మీద మిగిలిన అన్న ప్రసాదాలను ఉంచుతారు. అన్నం భూత, ప్రేత, యక్ష పిశాచాలు ఆహారంగా స్వీకరిస్తాయట! ధ్వజస్థంభ మండపపు ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్య దిశలో అదే ఆకారంలో మరోశిల ఉంది. ఒకటిన్నర అడుగుల ఎత్తున పీఠం మీద ఉండే ఈ శిలను 'క్షేత్రపాలక శిల' అంటారు. ఉదయం గుడితెరిచే ముందు, రాత్రి గుడి మూసే సమయంలో ఆలయద్వారాల తాళపు గుత్తిని ఈ శిలకు తాకించి తీసుకెళ్తారు.

విమాన ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి దక్షిణంగా పది అడుగుల దూరంలో శ్రీవరదరాజ స్వామి మందిరం ఉంది. స్వామివారి గర్భాలయం ఎదురుగా వున్న గడపను 'కుల శేఖరపడి' అంటారు. ఆయన ఒక వైష్ణవ భక్తుడు. స్వామి ఎదురుగా రాతి గడపగా ఉండాలని కోరుకోవడం వలన ఆ వరం పొందగలిగాడు. స్వామిని సర్వకాల, సర్వావస్థలలో ఎల్లకాలం దర్శించుకొనే వరం పొందిన ఆ భాగ్యశీలి జన్మ ధన్యమయింది.

మహాద్వారం లోనకి అడుగుపెట్టిన తరువాత 6 అడుగులు వేశాక కుడి ప్రక్క గోడమీద ఒక గునపం వేలాడతీయబడి వుంటుంది. అది ఆనాడు అనం తాళ్వారు అనే మహా భక్తుడు స్వామివారిని అవసరం లేని సహాయం చేశాడని కోపంతో విసిరిన గడ్డపార. ఒకవేళ వెళ్ళే సమయంలో చూడలేకపోయిన తీరా బయటకు వచ్చే సమయంలో గమనించవచ్చు.

విమాన వేంకటేశుని దర్శించాక 'రికార్డు సెల్' అనే గదిని దాటాక స్వామివారి ఏకాంతసేవకు ఉపయోగించే పట్టు పరుపు, బంగారు మంచం, పూజలో వాడే పవిత్ర సుగంధ ద్రవ్యాలు భద్ర పరిచే గది వస్తుంది. ఆ గది పక్కన సంకీర్తన భాండాగారపు ద్వారానికి రెండువైపులా రెండు విగ్రహాలుంటాయి. అవి స్వామి మీద అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, గానం చేసి అజరామరుడైన అన్నమాచార్యులు వారి కుమారుడు పెద్ద తిరుమలాచార్యులకు సంబంధించినవిగా పేర్కొంటారు. అన్నమయ్య రచించిన కీర్తనకు రాగిరేకుల రూపంలో ఇక్కడ భద్రపరచబడి వున్నాయి.

--((***))--

08. అలమేలు మంగ!
.
అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది.
.
లక్ష్మియే అలమేలు....
శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును.
శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు.
 
వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి") 

మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.
భూదేవియే గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కథనం గమనించాలి. 

కొండపై వెలసిన దేవుడు "బీబీ నాంచారి" అనే ముస్లిం కన్యను పెండ్లాడాడని ఒక కథనం. లక్ష్మీదేవియే ఈ అమ్మవారిగా జన్మించి ముస్లిముల ఇంట పెరిగిందట! తమ ఆడపడుచుపై గౌరవంతో కొండలరాయుని దర్శించుకొన్న ముస్లిం సోదరులను చూసి హైదర్ ఆలీ తిరుమల కొండపైని సంపద జోలికి పోలేదని అంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధుని ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాను తీసుకొని పోగా అతని కుమార్తె "తుళుక్కు నాచియార్" రంగనాధుని మనోహర రూపానికి మనసునిచ్చిందని ఒక కథనం. శ్రీరంగం నుండి వైష్ణవ సంప్రదాయంతో బాటు ఈ దేవత కూడా తిరుమలకు వేంచేసి ఉండవచ్చును. 


ఈ కథనాల సారంగానూ, స్థల పురాణాల వల్లనూ, సాహిత్యంలో ప్రస్తావనలను బట్టీ, అర్చనాది ఆచారాలనుబట్టీ లక్ష్మీదేవియే "పద్మావతి" లేదా "అలమేలు మంగ" అనీ, అమెయే తిరుమల కొండపై శ్రీవారి మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి అనీ, ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలసిన అలమేలు మంగ అనీ భావించవచ్చును. అన్నమయ్య సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీమహాలక్ష్మిగా పదే పదే వర్ణించాడు (క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం ... ... జగతి అలమేలు మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభల నీరాజనం) 

పద్మావతిని పద్మశాలీలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో బట్టల వ్యాపారం చేసే ధనికులైన పద్మశాలీలు పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం తాళ్ళపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20 వేల వరహాలు విరాళం సమర్పించినట్లుగా శాసనాధారాలున్నాయి. పంచ భూతములనెడు పలువన్నెల నూలుతో నేసి, నీడనుండి చీరలమ్మే నే బేహారి - అని అన్నమయ్య వేంకటేశ్వరునికొలిచెను 

==((***))--


09. ప్రాంజలి ప్రభ -గుడికి ఎందుకు వెళ్ళాలి ?

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
 

మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
 

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
 

దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. 

ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
 

ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
 

ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
 

మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
 

గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
 

తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
 

ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
 

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.
--((***))--


10. : 💐💐ముడుపు కట్టడం ఎలా..........!!💐💐

వెంకటేశ్వర స్వామి ముడుపు అంటె ఏమిటి?
అది ఎలా కడతారు.
పిలిస్తే పలికే కలియుగ దైవం.
కోట్లాది భక్తులకు ఇల వేలుపు,
ఆపద మొక్కులవాడు.
అనాథ రక్షకుడు,
కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు .
ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే... వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని,
పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు...

ముడుపు ఎలా కట్టాలి...
వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టి..
ఆబట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి
కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు..

మనఃస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని
ముందే మాటఇవ్వాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి. ఆముడుపు మీపని అయ్యేవరకు స్వామిముందే ఉండాలి.

కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి...

ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది.

--(())--




తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి
7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ ౭ కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు,
పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. 

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః 
శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి
ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి
స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని
వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ
పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు :
వ్రుశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4
కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత,భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం :
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు.నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను,
పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి -
ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.
పుట్టినది, ఉన్నది, పెరిగినది,మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.

భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికికాటుక.
ఈ కంటితో చూడవలసినవి మాత్రమేచూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందనితెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి
క్రోధం ఉండదు. వాడికిశత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా
స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)

తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలాఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి - వేం : పాపం, కట :తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి.
వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం ఏడు కొండలు ఎక్కడం.

అలరుచుందము రండి .. 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ