గీతా మకరందము.

07-19-గీతా మకరందము.
         విజ్ఞానయోగము 
🕉🌞🌎🌙🌟🚩

అ||  అట్టి జ్ఞానులు లోకములో చాల అరుదని చెప్పుచున్నారు-

బహూనాం జన్మనామన్తే 
జ్ఞానవాన్మాం  ప్రపద్యతే | 
వాసుదేవస్సర్వమితి 
స మహాత్మా సుదుర్లభః || 

తా:- అనేకజన్మలయొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే (భగవంతుడే) యను సద్బుద్ధిగల్గి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు లోకములో చాల అరుదు. 


వ్యాఖ్య:- జీవుడు అనాదికాలమునుండి ఈ సంసారచక్రమున పరిభ్రమించుచున్నాడు. కృమికీటకాద్యనేకజన్మలెత్తి యెత్తి సుకృతవశమున మానవుడై జన్మించుచున్నాడు. అట్లు జన్మించిన ప్రతిమానవుడును  ముక్తి కొఱకై ప్రయతించుటలేదు. ఏ కొలదిమంది పుణ్యాత్ములో ప్రయతించుచున్నారు. అట్లు ప్రయత్నించువారిలోను ఏ ఒకానొకధీరుడో ఆత్మజ్ఞానమొంది తరించిపోవుచున్నాడు*. ఒక్కొక్క జన్మయందు జీవుడు కొంతకొంత అధికపుణ్యమును సంపాదించుకొనుచురాగా ఎట్టకేలకు ఏ ఒకానొక జన్మయందో తీవ్రతర ఆధ్యాత్మిక సాధనలచేతను, పరమేశ్వరుని అనుగ్రహముచేతను ఆతనికి జ్ఞానముదయించును. అపుడు సమస్తమును భగవన్మయముగ, ఆత్మమయముగ, ‘వాసుదేవమయముగ’ గాంచును. అట్లు సర్వాత్మదృష్టిగలవాడై జ్ఞాని భగవత్సాక్షాత్కారము నొందుచున్నాడు. ఎన్నియోజన్మల పుణ్యాధిక్యతచేతను, పురుషప్రయత్నబలముచేతను, సాధనాతిశయము చేతను జీవునకట్టి మహత్తరపదవి చేకూరును. జ్ఞానవంతుడగుభాగ్యము చేకూరును. కనుకనే జ్ఞానవంతులగు మహాత్ములు లోకములో చాల అరుదు (సుదుర్లభులు) అని భగవానుడు పేర్కొనిరి. ‘దుర్లభః’ అని చెప్పక ‘సుదుర్లభః’ అని  చెప్పుటవలన అట్టివారు నూటికి కోటికి ఏ ఒకానొకడో ఉండునని భావము. 

     
   అయితే, ఇంకను అనేక జన్మలైనపిదపనే జ్ఞానవంతుడనగుదునని తలంచి సోమరితనము వహింపరాదు. ఇంతవరకు గడచిన జన్మలన్నియు ఆ అనంతకోటిజన్మలని భావించి ఈ జన్మయందే కడతేరుటకై, జ్ఞానమును బొందుటకై తీవ్ర యత్న మాచరింపవలెను. అట్టి జ్ఞానమును బొందినది లేనిది తెలిసికొనుటకై భగవాను డీశ్లోకమున చక్కని పరీక్ష (Test) నొకదానిని ఏర్పఱచియున్నారు. ‘అంతయు వాసుదేవమయమగ (భగవన్మయముగ- ఆత్మమయముగ) తనకు కానవచ్చుచున్నదా? అని సాధకుడు తనలో పరీక్షించుకొనుచుండవలెను. ఆ విధముగ కానుపించనిచో నామరూపములే కానుపించుచుండినచో సాధన ఇంకను పరిపక్వము కాలేదని తలంచి ధ్యానవిచారణాద్యభ్యాసములను తీవ్రతరము గావించవలెను. జ్ఞానప్రాప్తికి గుఱుతు ఈ ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ (అంతయు బ్రహ్మమే) అను సిద్ధాంతముయొక్క అనుభూతిని బడయుటయే యగును. ప్రారంభస్థితిలో మనుజుడు దేవుని ఏ గుడియందో,ఏ విగ్రహములోనో, ఏ తీర్థమందో చూచును. ఆరూఢస్థితియందు ఆ దేవునే సర్వత్ర వీక్షింపగల్గును. ‘జగమంతా రామమయమ్’ అనుస్థితి చేకూరును. 


        ఈ శ్లోకమున ‘బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్’ అని చెప్పినచోట జ్ఞాని అనేక జన్మలైనపిదప మోక్షమునొందునని అర్థముకాదు. అనేక జన్మలకు మనుజుడు జ్ఞానవంతుడై మోక్షమునొందుననియే అర్థము. ఏ క్షణమున జ్ఞానమును పొందునో ఆ క్షణముననే మోక్షము లభించగలదు. 


         అంతయు భగవన్మయముగ గాంచు జ్ఞానవంతునకు గీతాచార్యుడు ‘మహాత్మా’ అను బిరుదు నొసంగెను. అట్టి బిరుదును సంపాదించుటకై సర్వులును యత్నించవలెను. పరిచ్ఛిన్నదృష్టిగలిగి ‘సామాన్యాత్ముడు’గ నుండరాదు. విశాలదృష్టి నవలంబించి ‘మహాత్ముడు’గ మారిపోవలెను. అపుడే జన్మము సార్థకముకాగలదు.


   ప్ర:-  జీవుడు మోక్షము నెపుడు పొందగలడు?
   ఉ:-  జ్ఞానవంతుడైనపుడు. 

   ప్ర:-  జ్ఞానమెపుడు పొందును?
   ఉ:-  అనేక జన్మ లందలి శుభప్రయత్నముచే కట్టకడకు ఒకానొక జన్మయందు పొందును. 

   ప్ర:-  జ్ఞాని యెట్టిభావము గల్గియుండును?
   ఉ:-  అంతయు వాసుదేవమయము (భగవన్మయము, ఆత్మమయము) అను భావము గల్గియుండును.

   ప్ర:-  లోకములో ‘మహాత్ము’ డనదగినవాడెవడు?
   ఉ:-  జ్ఞానియే. 

   ప్ర:-  అట్టి జ్ఞానులు లోకములో విరివిగా నుందురా?
   ఉ:-  ఉండరు. ఏ ఒకానొకడో అట్లుండును. వారు మహాదుర్లభులు. 

   ప్ర:-  ఒకడు జ్ఞాని అగునా కాదా యని పరీక్షించుటకు ఉపాయమేమి?
   ఉ:-  అతని దృష్టిలో అంతయు వాసుదేవమయముగ నున్నదా లేదా యని తెలిసికొనిన చాలును. 
-------------------------------

* (1) యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః      (7-3)
   (2) అనేకజన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిమ్        (6-45)

🕉🌞🌎🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ