శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 141 

అధ్యాయము 18
🌴. రావిదాసును గురించిన వర్ణనము - 4 🌴

🌻. భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు - 1 🌻

కురుంగడ్డ వైపునకు రావిదాసు పడవ నడపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను.

తాను బ్రహ్మజాతికి చెందినవాడయిన కారణమున యితరులు తనపడవలో ఎక్కిన యెడల స్పృశ్యతాదోషము కలుగుననియూ, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలయుననియూ ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసియుండునని రావిదాసు పలికెను. నేను మహాపండితుడను. శ్రీపాదులవారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన యెడల నా విద్వత్తును గమనించి భూరిసంభావన నిచ్చును.

అద్దాని నుండి నీకు మూల్యమును చెల్లించెదనని ఆ పండితుడు పలికెను. రావిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రావిదాసుకు పురాణేతిహాసముల గూర్చి కూడ ఏమియునూ తెలియదని పండితుడు గమనించి, ఓయీ! నా జన్మ చరితార్ధము.

పురాణేతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ నాలుగింట మూడు వంతులు వ్యర్ధమనెను. రావిదాసు మిన్నకుండెను. నదీప్రవాహము మిక్కుటముగానుండెను. దానికి తోడు పడవలో రంధ్రముపడి నీళ్ళు పడవలోనికి రాసాగెను.

అయ్యా! మీకు ఈతవచ్చునా? అని రావిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రావిదాసు, నాకు ఈతవచ్చును, మీకు ఈతరాదు అందువలన మీ జీవితము నూటికి నూరుపాళ్ళు వ్యర్ధమే అనెను.

రావిదాసు శ్రీపాదవల్లభుల నామమునుచ్ఛరించుచూ నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీమధ్యమున గోచరించెను. అది అంతయునూ శ్రీపాదులవారి మహిమయని రావిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్యహస్తమేదో ఆ నీటినంతనూ బయటకు పారబోయుచుండెను. ఇద్దరునూ శ్రీపాదులవారి దర్శనమునకు వచ్చిరి.

రావిదాసు యింతకు పూర్వము శ్రీపాదులవారికి ఎప్పుడు నమస్కరించిననూ వారు నిర్లక్ష్యధోరణితో తిరస్కరించుచుండిరి. కాని యీనాడు మాత్రము రావిదాసు నమస్కరించినపుడు ప్రసన్నవదనముతో మందహాసము చేసిరి. రావిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్రచర్చను కోరిన పండితుడు నోటిమాటరాక నిలుచుండెను.

శ్రీపాదుల వారు, "ఓరీ! పాండిత్యగర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవై యుండి, సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టు కొనుచుంటివి. కట్టుకున్న మహాయిల్లాలును క్షోభపెట్టితివి.

సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్తనుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించిననూ మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునే యున్నది.

నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండ లయినందులకు మానసికముగా చెప్పరాని క్షోభనొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను యీ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడియున్నది. నీకు ప్రస్తుతము మరొక మూడు వర్షములు ఆయుష్షును ప్రసాదించుచున్నాను.

నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయినయెడల నీ కర్మకు నిన్ను వదిలివేసెదను. నీవు పండితుడవే! సందేహము లేదు, నీ విద్వత్తునకు సంభావన నీయమందువా? లేక మరో మూడు వర్షములు ఆయుష్షును యీయమందువా? తక్షణమే సమాధానమీయ వలసినది." అని అడిగిరి.

సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదులవారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాటరాక మూగవాని వలె నుండెను. వాని హృదయములో తన ఆయుష్షును పెరుగవలెననెడి కోరిక యుండెను. కాని నోటమాట రాలేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 


🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 140 / Sripada Srivallabha Charithamrutham - 140 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 18
🌴. రావిదాసును గురించిన వర్ణనము - 3 🌴

🌻. మ్లేచ్ఛులకు శ్రీవారి దర్శనం  - 2 🌻

ఓయీ! నామమాత్ర బ్రాహ్మణులారా! మీకు గోమాంసభక్షణచేయుట ఎంతమాత్రము సమర్ధనీయము కాదు.

అయితే పూర్వ పుణ్యవశమున, మీ పితృదేవతల ప్రార్ధనాబలమున  విశేషించి నా అవ్యాజ కారుణ్యము వలన మీరు మా దర్శనభాగ్యమును పొందగలిగితిరి. ఇదియే మహాభాగ్యముగా, అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను.

నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్రజలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే యిచ్చటనుండి బయలుదేరి మీ యిచ్చవచ్చిన చోట్లకు పొండు. మీకు అన్నవస్త్రములకు లోటులేకుండా చూచెదను. మీరు మ్లేచ్ఛవనితలను వివాహమాడి మ్లేచ్ఛధర్మము ననుసరింపుడు.

మీ చేత చంపబడిన గోవులు మీకు యీ జన్మములోనూ, జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచూ, అత్యంత శ్రమతో మీరు సంపాదించెడి కష్టార్జితమును యధేచ్ఛగా అనుభవించుచూ సుఖించును గాక!

అయితే నా దర్శనభాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడేబాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్దులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు గలిగిన, విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడెదరు గాక! మరాఠ దేశమందు శిధిలాగ్రామము గలదు. అది కాలాంతరమున సిద్ధ క్షేత్రమగును.

అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నాయొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరమువలె మార్చుటకు వీలులేనిది. తక్షణము యీ ప్రదేశమును వీడిపోవలసినది. అని వారిరువురిని ఆజ్ఞాపించిరి.

నేనునూ, శ్రీపాదులవారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రావిదాసు అను నామాంతరము గలిగిన రజకుడొకడు వచ్చెను. రావిదాసు శ్రీపాదులవారికి పదేపదే నమస్కరించు చుండెను.

కొంతసేపటి వరకు శ్రీపాదుల వాని యందు నిర్లక్ష్యముగా నుండిరి. తదుపరి శ్రీపాదులవారు వానివైపుచూచి మందహాసము చేసిరి. దీనికి కారణమేమయి ఉండునాయని నేను ఆలోచించ సాగితిని.

వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచూ నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 139 / Sripada Srivallabha Charithamrutham - 139 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 18
🌴. రావిదాసును గురించిన వర్ణనము - 2 🌴
🌻. మ్లేచ్ఛులకు శ్రీవారి దర్శనం  - 1 🌻

నాతో వచ్చిన బ్రాహ్మణద్వయమునకు శ్రీపాదులవారితో మాట్లాడుటకుగాని, వారి దివ్య శ్రీచరణములను స్పృశించుటకుగాని ధైర్యము చాలకుండెను.

శ్రీపాదులవారు నావైపుచూచి నీతోవచ్చిన యీ యిద్దరు ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి.

"ప్రభూ! దివ్య శ్రీచరణుల దర్శనముకోరి వచ్చిన యీ యిద్దరునూ కూడా బ్రాహ్మణులే!" అని నేనంటిని. దానికి ఆ ప్రశాంతసుందరుడు "నాయనా! వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే! గోమాంస భక్షణచేయు మ్లేచ్ఛులవలె తోచుచున్నారు. యదార్ధమును వీరినడిగియే తెలుసుకొనవచ్చును." అనెను.

అంతట ఆ బ్రాహ్మణులిద్దరునూ "అయ్యా! మేము బ్రాహ్మణులము కాము. మ్లేచ్ఛులమే! సందేహము లేదు." అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభులు క్షణక్షణ లీలావిహారి. నేను నిర్ఘాంతపోయితిని.

అంతట ఆ మహాగురువులు "శ్రీపాదశ్రీవల్లభుడనెడి పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయులవారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారియందు భక్తిభావము సంపూర్ణముగా కలిగియుండుట మహాభాగ్యము.

గోవునందు సకల దేవతలునూ ఉందురు. అట్టి గోవు లేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము, తుష్టిప్రదము. బ్రాహ్మణజన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు.

యజ్ఞయాగాదులందు మేకను బలియిచ్చుట కలదు. యజ్ఞపశువయిన ఆ మేకయేకాక, దానితో రక్తసంబంధముగల అనేక మేకలు తమ నీచజన్మము నుండి విముక్తమై ఉత్తమజన్మల నొందును.

శీఘ్రముగనే బ్రాహ్మణజన్మ నొందును. యజ్ఞపశువయిన ఆ మేకను ఆ విధముగా ఉత్తమజన్మల నొందింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞమును నిర్వహించువారికి ఉండవలెను.

ఆ విధమయిన యోగి, తపోబలము లేక, నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలియిచ్చిన, మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ, కాలములనుబట్టి ధర్మకర్మములు మారుచుండును.

మ్లేచ్ఛుడైననూ, మహాతపశ్శాలి అయినయెడల గోమాంస భక్షణ చేసిననూ, అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదియై గోవునకు, దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని యెడల మహాపాపము చుట్టుకొనును.

అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది, కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ , పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రమెక్కడ లభించునాయని కృష్ణుడు వెదకెను. కృష్ణునకు, అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను.

ఆ రైతు నీటి ప్రవాహమునాపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండకోసము వెదకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొనితెచ్చెను.

ఆహారమును భుజించిన రైతు తనవద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వైచెను. నరకుచున్న తండ్రిగాని, నరకబడెడి కుమారుడుగాని నరకుట అను క్రియ జరుగునపుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా నుండిరి.

సమాజ క్షేమమునకు ఆహారము కావలెను. పంటపండించుట అనునది ఒక్కటే రైతు యొక్క దృష్టి.

ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్షరహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ, పాండవులకు రాబోవు కాలములో యుద్ధక్షేత్రాముగా నుండదగిన ధర్మక్షేత్రాముగా నిర్ణయించెను.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹
 


శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 138  / Sripada Srivallabha Charithamrutham - 138 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 18
🌴. రావిదాసును గురించిన వర్ణనము - భాగము 1 🌴

🌻. శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము 🌻

నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ (కురువపురము) చేరితిని.

అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆదిమధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపమునుండి దివ్యకాంతులు వెదజల్ల బడుచుండెను.

వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాదనమస్కారము చేసికొనమనిరి. నేను శ్రీపాదములను స్పర్శచేయునపుడు తమ కమండలమునుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి.

నేను ఏమియునూ మాట్లాడకుండగనే అతితియ్యని కంఠస్వరముతో దివ్యశ్రీచరణులవారు "నాయనా! శంకరభట్టూ! నీ యందలి ప్రేమాతిశయమున నిన్ను యిచ్చటకు ఆకర్షించితిని." అని పలికిరి.

ఆ పలుకుల తియ్యదనమును, అపారమైన వారి కారుణ్యామృతదృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకునూ అభయప్రదానమొనరింప సశక్తమగు, అనంతశక్తిసంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకముపై నుంచిరి.

నాలోని కుండలినీశక్తి ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను వివశునిచేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమునూ అంతర్ధానమగునట్లు తోచినది.

వెయ్యి సముద్రములు ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించి వేయుచూ మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి. హృదయ స్పందనము, నాడీస్పందనము నిలిచిపోయినవి.

నా మనస్సు నిర్వికారమై, నిశ్చలత నొంది మహాశూన్యములో నిలిచినది. నా హృదయము నందలి చైతన్యము విశ్వమునందున్న అనంతచైతన్యములో కలిసిపోయినది.

ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మస్వరూపమైన ఆనందమాయస్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరియొక పర్యాయము ఆ 'నేను' అనునది కూడా శాంతించి అవ్యక్తమయిన దివ్యానందస్థితిలో నుంటిని.

ఆ స్థితిలో నాలోనుండి కోటానుకోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయముల నొందుచున్నవను జ్ఞానము కలుగునపుడు 'నేను' ఈ సర్వచైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది.

ఈ 'నేను' అనునది శమించినపుడు అవ్యక్తమైన దివ్యానందములో నుంటిని. ఇది అంతయునూ నాకు చిత్రవిచిత్రముగా నుండెను.

అంతట శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చితిని.

జగత్తునకు ఆదిగురువులైన శ్రీ వల్లభస్వామి వేయితల్లుల ప్రేమను మరిపించెడి కారుణ్యామృతదృష్టితో నా వైపు చూచుచూ మందహాసమును చేసిరి.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
.


🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 137 / Sripada Srivallabha Charithamrutham - 137 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 17
🌴. శ్రీనామానందుల వారి దర్శనము - 9  🌴

🌻. శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట 🌻

శ్రీనామానందుల వారి నోటివెంట యీ అమృతవాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చినది. అంతట నేనిట్లంటిని. 

"మహాపురుషా! ఈ దివ్యస్తోత్ర పారాయణముతో, శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసముల కధాప్రసంగాములతో యీ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున యీ రాత్రి గడుపవలెననెడి కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులయిన మహామహులు అనుమతినీయవలెనని విన్నవించు కొనుచున్నవాడను." 

నాతోబాటు ఉన్న సుశీలయును, బ్రాహ్మణ సోదరులును, నా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులయిన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. 

రాత్రి అంతయునూ, శ్రీపాదులవారి నామస్మరణముతోను, వారి లీలాకథా ప్రసంగములతోను, సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ గడచినది. ఉషఃకాలమున శ్రీపాదులవారికి దివ్య శ్రీమహామంగళహారతి యీయబడెను.

మహామంగళ హారతి అయిన తరువాత మా ఆశ్రమమునకు ఒక రెండెడ్లబండిపై భోజనసామాగ్రిని వేసికొని బండివాడు ఒకడు వచ్చెను. 

ఆ బండివాడు సుశీలతో, కొలదిసేపటిలో నీ అత్తమామలును, నీ భర్తయు వేరొక బండిలో యీ ఆశ్రమమునకు చేరుకొనగలరని చెప్పెను. భోజనసామగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయెను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయము లోపల శ్రీ నామనందుల వారు ధ్యానావస్థలో నుండిరి.

శ్రీనామానందుల వారు ధ్యానావస్థ వదలి ప్రకృతిస్థులయినపుడు బండివాడెక్కడ? అని ఆందోళనతో ప్రశ్నించిరి. బండివాడు వెళ్ళిపోయెనని చెప్పగా, ఆహా! మీరెంత అదృష్టవంతులు! 

నేనే దురదృష్టవంతుడినని వాపోయిరి. మేమందరమునూ విస్తుపోతిమి. శ్రీ నామానందులు "శ్రీపాదులవారు పరమ కారుణ్యమూర్తి! వారే బండివాని రూపములోవచ్చి మీకు దర్శనమిచ్చిరి. 

అమ్మా! సుశీలా! నీ అదృష్టము పండినది. నీ భార్తకున్న నపుంసకత్వము పోవుటయేగాక నీ భర్తయునూ, అత్తమామలునూ కొలదిసేపటిలో ఎడ్లబండిలో యిచ్చటకు చేరుకొనుచున్నారు." అని పలికిరి.

త్రికాలవేదులయిన నామానందులవారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో, అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. 

నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవగలందులకు నామానందుల వారిని అనుజ్ఞనడిగితిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
🌹 🌹 🌹 🌹 🌹


 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 135  / Sripada Srivallabha Charithamrutham - 135 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 17
🌴. శ్రీనామానందుల వారి దర్శనము - 7 🌴

🌻. దత్తారాధనము యొక్క విశిష్టత  - 2 🌻

ఒక పర్యాయము పీఠికాపురములోని శ్రీపాదులవారి అశ్రితుడొకడు  గుఱ్ఱమునెక్కగా అది అతనిని పడదోసి త్రొక్కివేసి గాయపరచినది.

రక్తసిక్తుడైన ఆ భక్తునివైపు శ్రీపాదులవారు తమ అభాయహస్తమును చూపగా గాయములన్నియునూ క్షణములో మాయమయినవి.

శ్రీపాదులవారి యందు నమ్మకము యిసుమంతయు లేని మరొకనికి అదేరోజున నూరువరహాలతో నిండిన పాత్రయొకటి లభించును.

శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదులవారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతట శ్రీపాదుల వారిట్లనిరి. "నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు.

కాని వీని ఆయుర్దాయమును మరొక 20  సంవత్సరములు పొడిగించితిని. ఇది వీని అనన్యభక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. నూరు వరహాలు దొరికినవానికి యీ రోజు మహాదైశ్వర్యము కలుగవలసిన రోజు.

కాని వాడికి భక్తీభావము యిసుమంతయు కూడా లేక భక్తులను అవహేళనము చేయుచుండుటవలన వాని మహాదైశ్వర్యయోగమును కేవలము నూరువరహాలకు మాత్రమే కుదించి వేసితిని. నాయందు కేవల భక్తిగలవానికి నేను దాసానుదాసుడను. నన్ను తన హృదయములో బంధించుకొన గలిగిన వాడే నిజమైన ప్రభువు.

త్రిలోకాధిపతియయిన పరమేశ్వరుడు కూడా అటువంటివానికి దాసుడయి సంచరించును." అను సద్విషయములను, సందేశములను తెలియపరచిరి.

శ్రీ నామానందుల వారు యీ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతయో ఆనంద భరితులమయితిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరిరి.

అంతట నామానందుల వారు "మీరు ఏకభుక్తము చేయుచూ మండల దీక్షను పాటించుడు. మిక్కుటమయిన కాయకష్టము చేసి ధనమును సంపాదించుడు.

ఆ ధనమును వ్యయపరచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు. అంతట పాపము శమించును. పాపశమనమయినట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని, స్వప్నములో గాని పొందగలరు.

మండలదీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున  పూర్వపు అలవాట్లకు బానిసలయిన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము." అని తెలిపిరి.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹


 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 134 / Sripada Srivallabha Charithamrutham - 134 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 17
🌴. శ్రీనామానందుల వారి దర్శనము - 6  🌴

🌻. దత్తారాధనము యొక్క విశిష్టత  - 1 🌻

అంతట నేను, "అయ్యా! అటులయినయెడల మనము వివిధ రూపములలో నున్న దేవతల నారాధింపవలెనా? లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలెనా? దేవతలందరునూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు యీ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది." అని వారిని కోరితిని.

అందులకు శ్రీ నామానందులు ప్రసన్నులై "ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో యిట్లనిరి.

అయ్యా! మీ చెల్లెలు మా యింట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీపరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకొందును. ఇన్ని రకముల దొంగతనములా? అని వాపోయునది.

అంతట ఆ అన్నగారు చెల్లెలును పిలిచి యిట్లనెను. ఇన్ని పదార్ధములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియునూ చిక్కటిపాలలో నిబిడీకృతమై యున్నవి.

పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్నిరకముల పదార్ధములలోని సత్తువలు ఒక్క చిక్కటిపాలలో నున్నవి. అందువలన నీవు నీకు కావలసినంత   పరిణామములో చిక్కటిపాలను మాత్రమే సేవించుము.

ఆ ఒక్కవస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాటపడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్నరుచులు గలవారు గనుక భిన్నభిన్న దేవతారాధనలు చేయుచుందురు.

శివారాధానము చేసిన యెడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణు ఆరాధనము చేసినయెడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్తరక్షణ కూడా ఒకే విధముగా నుండును.

సగుణ, సాకార భక్తితో చేసేది కర్మలకు ఫలితము, ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా! అనేక జన్మలలో చేసేది పాపపురాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవుచున్నపుడు శ్రీదత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనునది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినీ శక్తిలేదు.

అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తులవారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక ఆధ్యాత్మిక స్థితులన్నియునూ, ఆయాస్థితులలో నుండుటకునూ స్థితికర్తయైన విష్ణువు కారకుడు.

తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమయిన యెడల శరీరముగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవముగా దహనమునొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి  వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును.

శ్రీకృష్ణులవారు శ్రీదత్తప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధనగిరి నుద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోప, గోపికలందరునూ పూర్వజన్మములలో గొప్పఋషులు. యోగగ్రంధులే గిరులు.

ఆ గ్రంధులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునపుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి యుండును.

శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతనూ తాను వహించి, వారి గ్రంథి విభేదనమొనరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతికదృష్టితో చూచువారికి గోవర్ధనగిరినెత్తి తనవారిని రక్షించుట మాత్రమే అవగతమగును.

అందువలన తన భక్తుల వివిధస్థితులను మార్చవలెనని శ్రీదత్తులవారు సంకల్పించిన సామాన్యముగా నడువవలసిన పరిణామక్రమమును శీఘ్రతరము చేయవలసినదని  విష్ణువును ఆదేశింప వచ్చును.

ఈ ప్రక్రియలో  తన భక్తునకు అనుభవములోనికి రావలసిన బాధలను అన్నింటిని భక్తునిచేత అజ్ఞాతస్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తులవారు తమ భుజస్కంధములపై వేసుకొనెదరు.

వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్యస్థితి ననుభవించి యోగులను లక్షాపాతికవేల మందిని తయారుచేయుట, కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయముచేయు సంకల్పము కలిగిన యెడల శ్రీదత్తులవారిలోని రుద్రాంశ విజ్రుంభించి కోటానుకోట్ల జన్మములు అవి గతించినవయిననూ, రాబోవునవి అయిననూ వాటినన్నింటినీ ధ్వంసముచేసి, ఆ జీవికి మోక్షమును అనుగ్రహింప వచ్చును.

వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణ్వంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయునూ వారి సంకల్పమును బట్టి యుండును.

వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తిమార్గము నవలంబించ వలెను.

సశేషం......

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ