శ్రీ గాయత్రీ విశిష్టిత
: ఓం నమః శివాయ:
శ్రీ గాయత్రీ విశిష్టిత
హృదంభోజ మధ్యే పరామ్నాయ మీడే
సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞాం
సదాహేమ భాసాం త్రయీ విద్యా మధ్యాం
భజేమస్తు వామో పదామ స్మరామః!!
యజ్ఞోపవీతం ధరించే అర్హత ఎవరికున్నది? అనే ప్రశ్న ఈ రోజుల్లో సర్వసామాన్యం అయింది. ఖచ్చితమైన జవాబు చెప్పాలంటే బ్రహ్మయజ్ఞం చేసే వారందరికీ యజ్ఞోపవీతాన్ని ధరించే అర్హత ఉంది. ఇది వేదకావ్యం.
వేదకాలంలో అందరూ యజ్ఞోపవీతం ధరించేవారుట. కాలక్రమేణా కొందరు, కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల, యజ్ఞోపవీతాన్ని విడిచేశారని చెబుతారు.
సత్కర్మాచరణులు పద్ధతి ప్రకారం యజ్ఞోపవీతం ధరించవచ్చు అనే నియమం వచ్చింది.
యజ్ఞోపవీతం ధరించేవారు ఋషి ఋణం, దేవఋణం, పితృఋణం తీర్చుకోటానికి యోగం, యజ్ఞం, తపస్సు చేయాలి. అంతేకాదు శుచిత్వం, ఇంద్రియ సంయమనం, సత్యవచనం, శాంతం పాటిస్తే చక్కని ఫలితాలు పొందుతారు.
యజ్ఞోపవీతానికి, గాయత్రీ మంత్రానికి సామ్యం ఏమిటంటే, యజ్ఞోపవీతానికి మూడు పోగులు ఉంటాయి. గాయత్రీ మంత్రంలో మూడు చరణాలు ఉంటాయి. యజ్ఞోపవీతంలో మూడు ముడులు, మూడు గ్రంధులు. గాయత్రీ మంత్రంలో ఓంకారం,త్రివ్యాహృతులు ఉంటాయి. అందుకే యజ్ఞోపవీతం, గాయత్రీమాత స్వరూపం అంటారు.
గృహస్థులు ధరించే యజ్ఞోపవీతంలోని 9 పోగులలో 9 మంది దేవతలు ఆవహించి ఉంటారని శ్రుతివాక్యం.
1వ పోగు-బ్రహ్మ-ఓంకారం
2వ పోగు-అగ్ని-తేజస్సు
3వ పోగు-అనంతుడు-ధైర్యం
4వ పోగు-చంద్రుడు-చల్లని కాంతి
5వ పోగు- పిత్రుదేవతలు-స్నేహం
6వ పోగు-ప్రజాపతి-రాజరికం
7వ పోగు-వాయువు-స్వచ్చత
8వ పోగు-సూర్యుడు-ప్రతాపం
9వ పోగు-సర్వదేవతలు-సమదృష్టి.
ప్రాతః సాయంకాలంలో విధిగా, నియమంతో గాయత్రీ మంత్రాన్ని జపించాలి. తూర్పు ముఖంగా కానీ, సూర్యునికి అభిముఖంగా కానీ కూర్చోవాలి. ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి, వ్యాహృతులతో కూడిన మంత్రాన్ని జపించాలి.
వానప్రస్థం వారు మంత్రం చివర కూడా ఓంకారం చేర్చి జపించాలి. గృహస్థులు, బ్రహ్మచారులు, మంత్రం చివర ఓంకారాన్ని చేర్చి జపించరాదు. ఆ విధంగా చేస్తే అనర్ధాలు కలుగుతాయని శాస్త్రం ప్రమాణం.
గాయత్రీ మంత్రం సంపుటము, ఒక్క ఓంకారం, నాలుగు ఓంకారములు కలిగి మూడు విధాలు. ఏక ప్రణవం కలిగిన మంత్రాన్ని గృహస్తులు, బ్రహ్మచారులు జపించాలి. మంత్రాన్ని విడదీసి జపించరాదు. అది నిష్ఫలం. మంత్ర జపానికి స్థలశుద్ది, దేహశుద్ది, మానసిక శుద్ది, చిత్తశుద్ది, ఏకాగ్రత చాలా ముఖ్యం.
శ్రీ గాయత్రీ మంత్రంలోని నాలుగు పాదాలను, భావనతో ఉపాసించటం వల్ల సత్ఫలితాన్ని తేలికగా పొందవచ్చు.
మొదటి పాదాన్ని- భూలోక సమన్వయంతో, భౌతిక దృష్టితో ధ్యానం చేస్తే అష్టవసువుల అనుగ్రహం కలిగి ద్రవ్యం సిద్దిస్తుంది. భువర్లోక సమన్వయంతో శక్తిమయాత్మక రూపంలో ధ్యానిస్తే ఏకాదశ రుద్రులు అనుగ్రహం కలిగి శక్తి లభిస్తుంది.
సువర్లోక సమన్వయంతో ప్రజ్ఞామయాత్మక సృష్టి రూపంతో ధ్యానిస్తే ద్వాదశాదిత్యుల అనుగ్రహంతో ప్రజ్ఞ లభిస్తుంది.
రెండవ పాదాన్ని- మూడు వేదాల రూపమైన త్రయీ విద్యగా తెలుసుకుని ఉపాసిస్తే, త్రయీ విద్యపై స్వామిత్వం లభిస్తుంది.
మూడవ పాదాన్ని- ప్రాణాపాన వ్యాన రూపంగా తెలుసుకుని ఉపాసిస్తే, ప్రాణ ప్రవృత్తులపై స్వామిత్వం సిద్దించి, సర్వప్రాణులను జయింపవచ్చు.
నాల్గవ పాదాన్ని- అగ్ని, వాయువు, ఆదిత్య రూపంగా, సూర్య మండలాంతర్గత పురుషుడే అని తెలిసి ఉపాసిస్తే, ముగ్గురు అధిష్టాన దేవతలపై స్వామిత్వం సిద్దించి, కీర్తి లభిస్తుంది.
"గాయత్రీ మంత్ర సదృశ్యం నాన్యదస్తి హి కుత్ర చిత్"- గాయత్రీ మంత్రం వంటి మంత్రం వేరొకటి లేదు. ఈ విషయాన్ని ప్రమాణపూర్వకంగా ఎన్నో ఉపనిషత్ శాస్త్రాల్లో, శ్రుతులలో, మహర్షుల చేత నిరూపించబడింది.
తేజోరూపమైన ఆత్మ. పవిత్రమైన పరమాత్మలో లీనం అయే అనుభవం, అనుభవించాల్సిందేకానీ వివరణ కందదు. గాయత్రీ మంత్రాన్ని ఒకవైపు, వేదాలను మరోవైపు త్రాసులో ఉంచి తూస్తే,గాయత్రీ మంత్రంవైపే మొగ్గు చూపించిందని యాజ్ఞవల్కస్మృతిలో చెప్పబడింది.
జగత్తులోని సర్వ పదార్దాలలో అత్యంత వేగం కలది తేజస్సు. ఆ తేజస్సుకు మూలం సూర్యభగవానుడు. ఆ సూర్యుని తేజస్సే గాయత్రి, సావిత్రి, సరస్వతి అని పిలవబడుతోంది. గాయత్రి బాలాదిత్య మధ్యస్థ, అవుతే సావిత్రి యువాదిత్య మండల మధ్యస్థ, సరస్వతి వృద్ధాదిత్య మండల మధ్యస్థ.
ఆదిత్యుడు, దివాకరుడు, ద్వాదశాత్మ, భాస్కరుడు, ప్రభాకరుడు మొదలైన ఎన్నో నామాలు కల సూర్యనారాయణుడు ప్రత్యక్షదైవం. ఆ సూర్యతేజం మనలోకి ప్రవేశించినపుడే శరీరం పవిత్రమై, ఆత్మ నిర్మలమౌతుంది. మనిషి శరీరంలో సర్వాచరణకు మూలం బుద్ది. ఆ బుద్ది వికాసానికి తేజస్సు కావాలి. ఆ తేజోనిధి సూర్యభగవానుడు.
శరీరాన్ని నిలుపుకోటానికి ఏ విధంగా రెండు పూటలా ఆహారం తింటామో, అట్లాగే ఆత్మను పోషించుకోటానికి, బుద్దికి ఆధారమైన సూర్యతేజాన్ని, భావనారూపంగా, మన శరీరంలో ఉండే తేజస్థానంవైపు ఆకర్షించుకోవాలి. శరీరంలో తేజశ్శక్తి సంధ్యాకాలంలో సంకోచం చెంది, ప్రాతఃకాలంలో వికసిస్తుంది.
అదే విధంగా మనిషిలో ఆత్మశక్తి, ఆత్మశక్తి వికసించినపుడు ఇంద్రియ వ్యాపారాలు చురుకై, ముకుళించినపుడు స్తబ్దమౌతాయి. అందుకే ఆ సమయంలో, సూర్యతేజస్సును, మనిషిలోని ఆత్మశక్తిలోనికి ప్రవేశపెట్టాలి. అది త్రిసంధ్యలలో గాయత్రీ మంత్రోపాసన వల్ల సాధ్యమౌతుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. జపం అంటే కేవలం మాలత్రిప్పటం కాదు. అద్వైత భావనతో, ఆ దివ్యశక్తిని ప్రార్థించి, మంత్రోపాసన చేయాలి.
ॐॐॐॐॐॐॐॐॐॐ
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదా భయాంకుశ కశాశ్శుభ్రమ్కపాలం గదామ్
శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే
గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువులబారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమే.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయ గ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
గాయత్రీ మంత్రం - పరమేశ్వరుడు
గాయత్రీ మంత్రం సృష్టిస్థితి లయ కారకుడైన పరమేశ్వరునిది - శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన పరమాత్మది. నిజానికి సృష్టికి అతీతంగా చెప్పినప్పుడు ’పరమాత్మ’ అని వ్యవహారం. అతడే సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు ’పరమేశ్వరుడు’ అని వ్యవహరింపబడతాడు.
రెండూ ఒకటే తత్త్వం. అయితే ఆ పరమాత్మను శివునిగా భావించి ఆరాధించే వారికి గాయత్రి శివస్వరూపమే. దానికి ప్రమాణంగా కొన్ని వాక్యాలున్నాయి. అలాగే విష్ణువుగా భావించే వారికి గాయత్రీ మంత్రానికి విష్ణువే లక్ష్యం. దానికీ ప్రమాణ వాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా గణపతి పరంగా, సూర్య పరంగా, శక్తి పరంగా, స్కందుని పరంగా కూడా అన్వయించే శాస్త్ర వాక్యాలున్నాయి. వీటినిబట్టి ఎవరి ఉపాస్య దైవాన్ని వారు గాయత్రీ మంత్ర స్వరూపంగా ధ్యానించి ఆరాధించి తరించవచ్చు అని భావం.
"మాబుద్ధులను ప్రేరేపించే సృష్టికారకమైన శ్రేష్ఠమైన పరబ్రహ్మ తేజస్సును ధ్యానిస్తున్నాము" అని మంత్రభావం. సూర్య మండలంలోని పరంజ్యోతిని వారి వారి ఇష్ట దేవతారూపంగా భావించడం పరమార్థం. ఈ దేవతలు కూడా వేదం ప్రతిపాదించిన శివ విష్ణు శక్తి గణేశ సూర్య స్కంద రూపాలు కావాలి. ఎందుకంటే - మంత్రం కూడా వేద సంబంధి కనుక.
మరొక విశేషం - పై దేవతల మంత్రాలను సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది వారికి గాయత్రి అవుతుంది. అయితే - అందరూ పఠించదగిన గాయత్రీ మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాధానమైనవి మూడు. సంధ్యాకాలాలలో వీటిని జపిస్తే ’గాయత్రి’ అవుతాయి.
* సర్వ చైతన్య రూపాం తాం, ఆద్యాం విద్యాం చ ధీమహి, బుద్ధిం యా నః ప్రచోదయాత్!!
*పరమేశ్వర విద్మహే, పరతత్త్వాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్!!
*యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య తద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే!!
సద్బుద్ధి ప్రదాయిని.. గాయత్రి
ఏ పనిచేస్తున్నా- ‘ఇది నేను చేయటం లేదు, నాలోని జగన్మాత చేయిస్తున్నది’ అనే సంపూర్ణ శరణాగతి, నివేదన భావంతో మంచిపని చేస్తే అది జగజ్జనని ఆరాధన అవుతుంది. జీవితమంతా ఒక మహాసాధన. ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అద్భుతమైన ఈ శరీర యంత్రాన్ని మనకు ప్రసాదించిన శ్రీమాతను స్మరిస్తూ, ఈ శరీరం మనకూడా ఉండగానే, ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆనంద బిందువును ఆర్ద్రతతో, అప్రమత్తంగా, ఆప్యాయంగా అందుకోవాలి. అందుకు ఆధారం-త్రికాల సంధ్యా దేవత గాయత్రీమాత అనుగ్రహం.
గాయత్త్రీ వ్యాహృతి సంధ్యా అని గాయత్రీ మాతను కీర్తించాడు హయగ్రీవ మహర్షి. దీనినిబట్టి మనకర్థమయ్యేదేమిటంటే- సంధ్య ఎవరో గాదు- గాయత్త్రే. ఆ గాయత్రి కూడా ఎవరో కాదు- శ్రీలలితా పరదేవతే, మహాశక్తే. ఆ శక్తి కాలస్వరూపిణి. కాలమంటే కదిలేది. అచలమైన తత్త్వం నుండి చలించి వస్తుంది ఆ శక్తి. చలించి, పరా పశ్యంతి, మధ్యమా, వైఖరీ అని నాలుగు దశలలో కిందికి చలించి దిగి వచ్చింది. వచ్చి, అదే మనకు చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చరాచర ప్రపంచమే- నిరంతర భ్రమణశీలమైన ఆ గాయత్రీ శక్తి.
మన నాత్త్రాయతే ఇతి మన్త్రః మననం చేసే కొద్దీ మనలను కాపాడేదేదో అదీ మంత్రమంటే. మంత్రాణా మర్థస్తిరోహితో భవతి అని పెద్దలు చెప్తారు. మంత్రం పైకి కనిపిస్తున్నా మంత్రార్థమలా కనిపించదు. అందులో రహస్యంగా ఉంటుంది. మననం వల్లనే అది ప్రకటితమవుతుంది. ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికమని మూడు భూమికలలో భావన చేయాలి. ఆది దైవికమైన స్థాయి నుంచే దిగి వచ్చిందది మనదాకా. దిగి వచ్చేటప్పుడది గాయత్త్రి.
గాయతి త్రాయతే ఇతి గాయత్త్రీ. ఎవరా మంత్రాన్ని గానం చేస్తుంటే వారిని కాపాడుతుంది కనుక గాయత్త్రి అయింది.
న గాయత్య్రాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్ గాయత్రికి మించిన మంత్రము లేదు. తల్లిని మించిన దేవత లేదని దివ్య సూక్తి. ఏ మంత్రానుష్ఠానం చేసినా, ముందు గాయత్త్రీ మంత్రం చేస్తేనేగాని దాని ఫలితం మనకు రాదు. అదీ గాయత్త్రీ మంత్ర జప విశిష్టత. గాయత్రీ ఛందసామహమ్ అని ఋక్కులలో గాయత్రి మంత్రమును తానేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించటం- గాయత్రీ మంత్ర మహోదాత్తత విశదమవుతుంది. సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి. దీర్ఘాయువు, సత్సంతానం, గోవులు, కీర్తి, ద్రవ్యము, బ్రహ్మ వర్చస్సులను ప్రసాదించి, అంత్యంలో బ్రహ్మమును అనుగ్రహించు కరుణామయి ‘గాయత్రి’ అని చెపుతోంది అధర్వణ వేదం.
గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి. వాటిని మూడు భాగాలుగా చేస్తే, ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయాలకు సూచితం. మొదటి ఖండం- ఋగ్వేదం; రెండవది-సామవేదం; మూడవది- యజుర్వేదం అవుతాయి. కనుక గాయత్రి వేదమాత.
గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలకు, వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలతో, వెరసి ఇరవది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని రచించారు. కనుకనే, గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణము సర్వశక్తి సమన్వితమయింది. కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి అతనికి కూడా సత్తా స్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.
ప్రాణశక్తి గాయత్రి..
సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరంపై, మనసుపై ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడు ఏ రాశిలో సూర్యుడున్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు- స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం లోంచి జన్మించాడు. గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణశక్తిని ఇచ్చేది. బయటకు వచ్చిన తర్వాత శిశువును వేరు చేస్తారు. అలా వేరవగానే సూర్యశక్తి- ప్రాణశక్తిగా పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీ మాత. పిల్లలు ఎదిగినకొద్దీ వారికి ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణామాయ కుండలినీ శక్తి గురించి నేర్పాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యలలో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది, పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రీమాత.
గాయత్రీ జప సుప్రీతాయై నమః- సూర్య సహస్ర నామావళి
మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అందరికీ ఆరోగ్యాన్ని, జీవించటానికి ఆహారాన్ని ఇచ్చేవాడు. కనుకనే ఆదిత్యుణ్ణి- అన్నదాత, ఆరోగ్య ప్రదాత అన్నారు. తల్లి తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. సూర్యభగవాడు సమస్త జీవరాశులకు, వృక్ష లతాదులకు, ప్రకృతిలోని అన్నింటికీ పోషకుడు. పంచభూతములకు (భూమి, నీరు, అగ్ని, వాయువు,ఆకాశము) సూర్యుడు స్ఫూర్తిదాయకుడు, శక్తినిచ్చేవాడు. అందుకే సూర్యుణ్ణి ‘పూషణ్’ అన్నారు.
కాలభేదములు ఏర్పడటానికి సూర్యుడే కారకుడు. ఒక్క సెకన్ కూడా తేడా లేకుండా ఆయా ప్రదేశాలలో, ఆయా ఋతువులను అనుసరించి ఆయా తేదీలలో సూర్యోదయ, సూర్యాస్తమానాలు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకైనా అదే సమయంలో జరుగుతుంది. కనుక కాల నియమం, సమయ పాలన, కాలప్రాముఖ్యతకు, సూర్యుడే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది లేకపోతే జ్యోతిశ్శాస్తమ్రే లేదు. నిత్యానుష్ఠాన కర్మలే లేవు. సూర్యుడు రాకపోతే రోజు గడవదు. అతడు త్యాగమూర్తి, నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు ‘‘మీరు కూడా సూర్యుని వలె ఉండండని, ఆత్మ తేజస్సుని వికసింపచేసుకోండి’’ అని చెప్పారు.
సూర్యుణ్ణి మనం దైవంగా భావించి, పరబ్రహ్మ స్వరూపంగా ఉఫాసిస్తాం, ఆరాధిస్తాం. సూర్యునిలోని సద్గుణ శక్తియే- గాయత్రి. సూర్యునికి, గాయత్రికి భేదం లేదు. మంత్రం సూర్య తేజస్సు పరంగా ఉంటుంది. సాకార రూపం- గాయత్రీమాత.
గాయత్రీ మంత్రం.. ఆధ్యాత్మికత
శ్రీ దేవీ నవరాత్రులలో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరమణమైన ఓం *భూర్భవో స్వాహాః తత్స వితుర్వరేణ్యం దుర్గా సప్తశతిలోని ప్రథమ భాగం. దానికి అధిష్ఠాన దేవత మహాకాళి.
కాళి-కాల స్వరూపం. సమస్తమూ కాలం లోంచి ప్రభవించి ప్రళయకాలంలో లయమవుతాయి. కనుక, ప్రథమ పాదాన్ని సంపూర్ణంగా తెలిసికొంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి, ప్రతి ప్రభాతం ఒక సుప్రభాతం అవుతుంది.
గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం-
‘భర్గోదేవస్య ధీమహి’
అన్నదానికి శ్రీ దుర్గా సప్తశతిలో రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి- స్థితికర్తయైన విష్ణుపత్ని. సాధకుడికి పోషణ సామర్థ్యం కలిగి, విజ్ఞానం, ఐశ్వర్యం, సత్వగుణం ప్రాప్తిస్తాయి. అనుదినం సుదినం అవుతుంది.
]
గాయత్రీ మంత్ర మూడవ చరణం-
ధియోయోనః ప్రచోదయాత్-
దీని వివరణ శ్రీదేవీ సప్తశతిలో మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠానదేవత. ‘నేనెవరు?’ అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక సూర్యోదయం ఉండదు. ఎందుకంటే హృదయంలో సూర్యాస్తమయం ఉండదు గనుక. ఇది గాయత్రీ మంత్ర విశేషం.
నాభి హృత్కంఠ రసన నాసాదులయందు, ధర ఋక్యామాదులలో వర గాయత్రీ హృదయమున- అన్న త్యాగరాజ కీర్తనను మననం చేసుకొంటూ, సప్తస్వర సుందరులను భజించి, సంగీత సాధనలో గాయత్రీ మాతను ఆరాధిస్తారు నాదయోగి శిష్యపరంపర. సంధ్యాదేవీం, సావిత్రీం, వర గాయత్రీం, సరస్వతీ భజేహం అన్న దేవక్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన గాయత్రీ తత్త్వానికి దర్పణం. దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని లోక కల్యాణానికి ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది- సద్బుద్ధి ప్రదాయిని, సంధ్యాదేవత వేదమాత గాయత్రి.
🕉🌞🌏🌙🌟🚩
(sekarana 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 అద్వైత చైతన్య జాగృతి)
Comments
Post a Comment