శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము -


🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 59 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 2 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

  🌸. దమ్మిడి చక్కెర 🌸

ప్రభువు భక్తుల కోరికలు తీర్చి, భక్తులు మొక్కుకున్న మొక్కులు తీర్చడం కోసం ఎదురు చూస్తారని అందరికీ తెలిసింది. ఆ కాలంలో కొందరు ప్రభువు వద్దకు వెళ్లే భక్తులను అపహాస్యం చేసేవారు.

అలా హుమానాబాదులో ఒక గృహస్థు ఉండేవాడు. అతను స్వయంగా ఎప్పుడూ ప్రభువు వద్దకు రాలేదు. కానీ ఎవరైనా ఇతరులు ప్రభు వద్దకు వెళ్తుంటే అపహాస్యం చేసేవాడు.

   ఒకసారి ఆ గృహస్థు చెప్పులు పోయాయి. అవి క్రొత్తవి కావడం వలన అతనికి బాధ కలిగింది. అప్పుడు అతనికి, జనం ఆపద సమయంలో ప్రభువును స్మరిస్తూ మొక్కుకుంటారని గుర్తుకు వచ్చింది. 

చెప్పులు నాకు ఇప్పటికిప్పుడే దొరికితే నేను ఒక దమ్మిడీ చక్కెర సమర్పిస్తాను అని ప్రభువుకి మొక్కుకున్నాడు. అనుకోకుండా అదేరోజు చెప్పులు దొరికాయి.

తాను ప్రభువుకి ఒక దమ్మిడీ చక్కెర మొక్కుకున్నందుకు అతనికి సిగ్గుగా అనిపించి, నాలుగు అణాలకు చక్కెర తీసుకొని ప్రభువు దర్శనానికి బయలుదేరాడు.

  ఎప్పటిలాగే ప్రభు దర్బార్ లో రద్దీ ఉండెను. అంత రద్దీలోనుంచి దారి చేసుకొని ప్రభు ముందుకు వెళ్లి తన దగ్గర ఉన్న చక్కెర పొట్లం ప్రభు ముందు పెట్టి నమస్కారం చేయగానే, ప్రభు తన శిష్యులలో ఒకరిని తక్కెడ తీసుకురమ్మన్నారు.

వారు తక్కెడ తీసుకొని రాగానే ప్రభు గృహస్థునితో మీరు తెచ్చిన చక్కెరలో ఒక దమ్మిడి చక్కెర మాత్రమే నాది. అంత మాత్రమే తీసి నా పంచలో వేయండి. మిగతాది నాకెందుకు? అనగానే అతని శరీరం చల్లబడి, అవాక్కయ్యాడు. నమస్కారం చేసి ప్రభువుని క్షమించమని అడిగాడు.

 అప్పుడు ప్రభు ఇలా అన్నారు. అరే బాబా! దేవుడిని పరీక్షించవద్దు. దమ్మిడి చక్కెర కోసం ప్రభువుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆలోచించు.

గృహస్థునికి ప్రభువు ఆంతర్యం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా అతను ప్రభు ముందు సాష్టాంగ దండప్రమాణం చేసి ఇక ఎప్పుడూ ఇలాంటి అపరాధం చేయను, నన్ను క్షమించండి అని విన్నవించుకున్నాడు. ప్రభువుకి దయ కలిగి క్షమించారు. తరువాత ఆ గృహస్థు ప్రభువుకు ప్రియమైన భక్తుడు అయ్యాడు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం....
🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 58 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌸.  పడవను రక్షించడం  🌸

  ఒకసారి ప్రభువు దర్బారులో గాదిపై కూర్చున్నపుడు అకస్మాత్తుగా రెండు చేతులు పైకి ఎత్తి కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన శరీరంపై జుబ్బా మాత్రమే ఉంది. ఏదో అజ్ఞాత వస్తువును చేతితో ఆధారం ఇవ్వడానికి అన్నట్లుగా కనిపించింది. ప్రభు ఇలా ఎందుకు చేస్తున్నారో అడిగే ధైర్యం ఎవ్వరికీ కలుగలేదు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

కొంత సమయం తరువాత ప్రభువు తన చేతులను క్రిందికి దించారు. అప్పుడు ప్రభు చేతిలో నుండి నీళ్ళు ధారాపాతంగా రాసాగాయి. శరీరంపై ఉన్న జుబ్బా పూర్తిగా తడిసిపోయింది. జనులకు ఇలా ఎందుకు జరిగిందో, ప్రభు ఇంత చెమటతో ఎందుకు తడిసిపోయారో ఎవరికీ అర్ధం కాలేదు.

   ప్రభు శరీరంపై నుండి జుబ్బా తీసివేశారు. శిష్యులలో ఒకరు దానిని పిండగానే చాలా ఉప్పు నీరు వచ్చింది. కొద్దిమంది ఆ నీటిని రుచి చూసారు. వారు ప్రభువుతో, మహారాజా! నీరు సముద్రం నీటిలాగా ఉప్పగా ఉన్నాయన్నారు. కానీ ప్రభువు ఏమీ మాట్లాడలేదు.

   కొన్ని నెలలు తరువాత ముంబైకి చెందిన ఒక పెద్ద వ్యాపారి ప్రభు దర్బార్ కు వచ్చారు. పూర్వం మొక్కుకున్న మొక్కు తీర్చడానికి అతను తీసుకువచ్చిన డబ్బును ప్రభువు ముందు గుమ్మరించారు. అప్పుడు పైన జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు.

లక్షలలో వ్యాపారం చేసే ఒక వ్యాపారి తన పడవలో లక్షల రూపాయల సరుకు నింపుకొని పోరుబందరు నుండి ముంబై వస్తుండగా అకస్మాత్తుగా గాలివాన మొదలై, పడవ మునిగిపోయే స్థితికి వచ్చింది. ఆ సంకట స్థితిలో తనకు ప్రమాదంతో పాటు నష్టం జరుగుతుందని భయపడి ఏం చేయాలో వ్యాపారికి తోచలేదు. పడవ మునిగిపోతే ప్రాణం పోయినట్లే. అపుడు దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టారు.

ఇంతలో ఒక గృహస్థు, "హుమానాబాద్ మాణిక్ ప్రభువుకు మొక్కుకోండి. ప్రస్తుతం నడుస్తూ మాట్లాడే ప్రత్యక్షదైవం, భక్తకార్య కల్పద్రుమ బిరుదును కలిగిన వారు. వారు మాత్రమే ఈ సంకట స్థితి నుండి కాపాడగలరన్నారు."

అది విని విశ్వాసంతో ప్రభువును తలుచుకొని మొక్కుకున్నారు. అలా తలుచుకోగానే ఇక్కడ ప్రభువుకు ఎవరో అర్ధిస్తున్నట్లుగా అనిపించింది. "అంతఃకరణ నుండి వచ్చిన తన భక్తుని పిలుపుకు ప్రభువు మనసు ద్రవించి కూర్చున్న దగ్గరే చేతులు పైకెత్తి పడవను మునగకుండా కాపాడారు."

    ప్రభువు ముందు రూపాయలు కట్టలుగా వేసి పూజ చేయడానికి ముందు, జరిగింది వివరించి, ప్రేమతో పూజ, ఆరతి చేశారు. మీరు మొక్కుకున్న పూర్తి ధనం ఉందా? అని ప్రభువు అడిగారు. వ్యాపారి గాబరా పడిపోయాడు. తక్కువ ఉన్నట్లు తెలుసుకొని ధనాన్ని భర్తీ చేసి సంతృప్తిగా ప్రభు పూజ చేశారు. లెక్క విషయంలో ప్రభువుకు ఎలా తెలిసిందో అని అందరికీ ఆశ్చర్యం కలిగింది.

   ☘️. గమనిక ☘️

పడవ మునిగిపోతుంటే, ఆ సమయంలో ప్రభువు పేరు చెప్పిన గృహస్థు ఒక ముసల్మాన్.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ ఆర్యా ద్విశతి  - 5 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక  (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. II ఆర్యా ద్విశతి - 9వ శ్లోకము II 🌻

ఆలింగ్య భద్రకాళీమాసీనతత్ర హరిశిలాశ్యామామ్ I
మనసి మాహాకాళో మే విహరతు మధుపానవిభ్రమన్నేత్రః II ౯

🌻. తాత్పర్యము :
తత్ర - ఆ ఆరామమునందు ఉండు, హరిశిలాశ్యామాం - ఇంద్రనీలమణివలె నీలమైన దేహకాంతి గల, భద్రకాళి అను దేవతను, కౌగలించుకుని కూర్చున్నవాడును, మధుపానవిభ్రమన్నేత్రః అనగా మధుపానము చేత తిరుగుచున్న కనులు కలవాడును అయిన, మహాకాళుడను (శివభటుడను దేవత), నా మనసునందు సంచరించుగాక !! (భద్రకాళీ సమేతుడైన మహాకాళుడిని ధ్యానించుచున్నాను.

🌻. II ఆర్యా ద్విశతి - 10వ శ్లోకము II 🌻

తార్తీయికో వరణస్తస్యోత్తరసీమ్ని వాతయోజనతః I
తామ్రేణ రచితమూర్తి స్తనుతాదాచంద్రతారకం భద్రమ్ II ౧౦

🌻. తాత్పర్యము :
ఆ కంచు ప్రాకారమునకు పై భాగమునందు, వాతయోజనతః - ఏడు యోజనముల దూరమునందు ఉండు, తామ్రేణ - రాగి చేత చేయబడిన రూపము కల, తార్తీయికః - మూడవదియగు, వరణ - ప్రాకారము, ఆచంద్రతారకం - చంద్రుడు నక్షత్రములుండువరకు శాశ్వతముగా, భద్రం - శ్రేయస్సును, తనుతాత్ - చేయుగాక !!

సశేషం.....



 

శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 55 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌴. మాణిక్ నగర్ లో శృంగేరి జగద్గురువులు 🌴

మాణిక్ నగర్ లో ప్రభు సంస్థానమునకు ఒక రూపము వచ్చిన తరువాత ప్రభు ఔదార్యము, అనేక లోకోత్తర గుణాల కీర్తి పరిమళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటివరకు తెలుపబడింది.

ఒకసారి శృంగేరి మరియు హంపి ఆచార్య పీఠాల మధ్య సంచార క్షేత్ర విషయంలో వాదన మొదలయింది. ఈ వాదన లేకుండా చేసే సామర్ధ్యం ఎవరికి ఉందో అని రెండు పీఠాల వారికి దిగులు మొదలయింది.

శృంగేరి మరియు హంపి ఈ రెండు పీఠాల అధికారులు లేదా పండితులు మాణిక్ నగర్ వస్తూ ఉండేవారు. సమస్యని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని వారికి ఉండేది. హంపి పీఠం జగద్గురువులు ప్రభు వద్దకు వచ్చారు.

ప్రభువు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణ పూర్వకముగా ఎదురు వెళ్లి మాణిక్ నగర్ కు తీసుకొని వచ్చారు. మరియు యథాయోగ్యంగా తాత్యా మహారాజు గారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించు కున్నారు.

అంతకు ముందు నాలుగు నెలలు ముందు శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజ్ వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది.

మాఘమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా మిమ్ములను కలవడానికి వస్తున్నారు అని ఆ లేఖ సారాంశం. ఈ విషయం చదివి చాలా ఆనందించి రెండు నెలల ముందు నుండి స్వాగత సమారంభము ప్రారంభించారు.

అరవై వేల రూపాయల రత్నఖచిత హారాన్ని స్వర్ణకారులతో చేయించి, ఒక లక్ష రూపాయల విలువగల రత్నఖచిత మకుటం మరియు అమూల్యమైన వస్త్రాలను, వారి మండలిలోని ప్రతీ ఒక్కరికి యోగ్యవస్త్రాలను తయారు చేయించారు.

స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి నాలుగు నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన, నివాస సదుపాయాలు చేయించి ఒక ఏనుగు, పది మంచి గుర్రాలు, ఒక పల్లకి, మేనా, ఇరవై ఐదు స్వచ్ఛమైన ఆవులను సిద్ధం చేయించారు.

జగద్గురువుతో పాటు సుమారు ఐదువందల మంది జనం, ఐదు ఏనుగులు, ఇరవై ఐదు గుర్రాలు, రెండు పల్లకిలు, నాలుగు మేనాలు, పదిమంది పాదచారులు, శాస్త్రపండితులు, ఆవులు, ఒంటె
ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సవంగా వస్తున్నారని తెలిసి ఆరోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. గ్రామములో ప్రతీ వీధిలో పూర్తిగా కళాపి చల్లి రంగవల్లులు వేయబడ్డాయి.

 తరువాయి భాగము రేపు చదువు కుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 54 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌴. యజ్ఞం 🌴

      శ్రీ ప్రభువు హాళిఖేడ్ కు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో మాణిక్ నగర్ లో 'సర్వతోముఖ' అనే పేరుగల యజ్ఞం చేయించారు. ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వేలమంది నివాస, భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది.

    యజ్ఞేశ్వర్ దీక్షితుల ఇంటి వారిపై ప్రభువు అత్యంత అభిమానం చూపేవారు. యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభువు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు. ప్రభువు ఆశ్రయం దొరికిన తరువాత సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

    ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభు ఎక్కడనుండి తెచ్చారు అనే విషయం ప్రభు చరిత్రలో ఎక్కడా కనిపించదు. సోలాపూర్ కి చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయంలో ఇలా వ్రాశారు.

     యజ్ఞం నిర్విఘ్నముగా జరుగుతుండడంతో ప్రభు కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. యజ్ఞం నడుస్తుండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్ధ్యంతో అది దూరమై యజ్ఞం ఎలా నిర్విఘ్నముగా జరిగిందో క్రింద వ్రాయడం జరిగింది.

 ఒక బ్రాహ్మణుని 13-14 సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణం కలిగి ఎక్కిళ్ళతో మరణించాడు. ఆ శరీరాన్ని యజ్ఞ మండపంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు.

ప్రభువు ఎన్నో రకాలుగా సముదాయించారు. ఇకముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరు ఇక్కడే ఉండండి. మిమ్మల్ని చివరివరకు చూసుకుంటాను. మీకు కావలసిన ద్రవ్యం ఇస్తాను అని ఎన్ని రకాలుగా సముదాయించినా ఆ బ్రాహ్మణుడు వినలేదు. 

చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ యజ్ఞ మండపంలో శవం ఉండడం వలన యజ్ఞ కార్యానికి విఘ్నం కలగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది.

చివరికి ప్రభు తాత్యాసాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే తాత్యాసాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని ఆ బాలుడి  నోట్లో పోయగానే, ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆనందభరితులై యజ్ఞం  పూర్ణాహుతి గావించారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹🌹🌹🌹🌹
--(())--

శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 51 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

      ప్రభు దర్బార్ లో హిందుస్థాన్ లోని చాలావరకు ప్రసిద్ధులైన కళాకారులు వచ్చేవారు. ప్రభు గానప్రియులై శాస్త్ర మర్మం తెలిసిన వారని అన్ని వైపులా ఖ్యాతి గడించి ఉండిరి.

   ఒకసారి ప్రఖ్యాత గాయకులలో ఒకరైన హుస్సేన్ ఖాన్ అనే పేరుగల గాయకుడు ప్రభు కీర్తి విని రావడం జరిగింది. ఆయన ఇంతకుముందు సంస్థానాలలో ఆదరణ పొంది ఉండిరి.

వీరికి తన విద్యపై, గాత్రంపై చాలా గర్వముగా ఉండేది. రాజ దర్బార్ లో బహుమానం ఎంత దొరికినా సమాధానం కలుగలేదు. తన పాండిత్యం తెలుసుకునేవారు ఎవరూ దొరకడం లేదని ఆయనకు అనిపించేది.

   ఒకరోజు దర్బార్ లో ఆయన పాట పాడుతుండగా రాజా వారు ఆయనను మెచ్చుకున్నారు. కానీ ఆయనకు దానికి కోపం వచ్చింది. "మహారాజా! మీరు ఏం తెలుసుకొని నన్ను పొగిడారు? ఇలా పిచ్చి ప్రశ్నలతో తన పాటను త్వరగా ముగించాడు.

రాజుకు సంగీత జ్ఞానం లేదని అలాంటి గాడిదల ముందు సంగీతం పాడకూడదని నిశ్చయించుకున్నాడు. మంచి గాయకుడు కానీ, ఇలాంటి బుద్ధితో అధిక ఉన్మత్తుడై విద్యను గుర్తించేవారు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా ప్రభువు కీర్తి విని మాణిక్ నగర్ కు వచ్చి ఉండిపోయారు.

అక్కడ దర్బార్ లో ఎందరో విద్వత్తుల గాయకులను కలుసుకున్నారు. ఇతరుల సంగీత కార్యక్రమము ప్రభు ముందు జరిగి భరణం కూడా దొరికింది. నాలుగు రోజులైనా కూడా ఈయనకు ప్రభువు ముందు గానం చేసే అవకాశం రాలేదు. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు  ప్రభువు నుండి అనుమతి లభించింది. అప్పుడు ఆయన పాడడం ప్రారంభించాడు. ఆయన పాడుతుండగా ప్రభువు అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ప్రభు తన పాట వినడం లేదని ప్రభు శ్రద్ధగా వినాలని తన పాటను ఆరోజు తన విద్వత్తునంతా ఉపయోగించి పాడాడు. నాలుగు వైపులా కళాకారులు నిండి ఉన్నారు. అందరూ 'వహ్ వా' అనసాగారు. ప్రభు మాత్రం ఆయన వైపు చూడకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండిరి. తన ప్రతిభ చూపించి ప్రభువును ఆకర్షించాలని అతనికి ఉత్కంఠత కలగసాగింది.

ఇలాంటి మానసిక సంఘర్షణలో ఒక దగ్గర పాట లయ-శృతి తప్పింది. అతని మనస్సుకి తెలుసు తాను తప్పు చేసానని, సరిగ్గా అదే సమయంలో ప్రభు 'వాహ్ వా' ఖాన్ సాహెబ్ అన్నారు.

అప్పుడు అతనికి సిగ్గనిపించింది. ఇతరులకు దాని మర్మం తెలియలేదు. కానీ ప్రభువుకి  పాటలోని రహస్యమంతా తెలిసిందని అతనికి గర్వభంగం అయ్యింది. దాంతో ప్రభువుకి సంతోషమయింది. హుస్సేన్ ఖాన్ కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. పాటను ముగించి ప్రభు ముందు దండప్రమాణాలు చేసి మహారాజ్! నా విద్య మరియు జన్మ సార్ధకం అయింది.

నేను విద్యపై అహంకారంతో గర్వితుడను (టర్ర) అయ్యాను. అందువలన నన్ను టర్రాహుసేన్ ఖాన్ అంటారు. ఇపుడు నాకు గర్వభంగం అయింది. ఇప్పటినుండి మీ కాళ్ళ దగ్గరే ఉండి పాడతాను, ఎక్కడకి వెళ్ళనని దృఢనిశ్చయం చేసుకున్నాను అన్నాడు.

ప్రభు అతనిని గౌరవించి తన దర్బార్ లో ఉండడానికి అనుమతి ఇచ్చారు. అతనికి ప్రభు పాడితే వినాలని చాలా కోరికగా ఉండేది.

ఒకరోజు ప్రభు నివసించే గుడారం వద్ద తిరుగుతుండగా ఒక మధురమైన స్వరం వినిపించసాగింది. దగ్గరికి వెళ్లి వింటే ప్రభు ఏవో పదాలు అంటూ పాడుతున్నారని అనిపించింది. ఎక్కడినుండి ధ్వని వినిపిస్తుందో అక్కడ ప్రభు శౌచాలయం ఉండేది. గోడ ఆ వైపు నుండి ప్రభు పాడే పాట విని అతను అవాక్కయిపోయాడు.

అతని కళ్ళ నుండి ఆనందాశ్రువులు కారుతున్నాయి. ఆయన తన దేహాన్ని మరిచి తన్మయత్వంతో ఉండిపోయాడు. చాలాసేపు పాట నడిచింది. పాట అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం ఆయనకు అప్పుడు కలిగింది.

దాని
ముందు తన పాట విలువ ఏ పాటిదో తనకు అప్పుడు తెలిసి వచ్చింది. తరువాత ప్రభువుకి సన్నిహితుడై, ఎక్కడికీ వెళ్లక ఇక్కడే దేహం చాలించాడు.

 తరువాయి భాగము రేపు చదువు కుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 50 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రభు మాణిక్ నగర్ లో నివసిస్తున్నారనే విషయం అన్ని దిక్కులకు వ్యాపించింది. తమ రాజ్యానికి భూషణంగా ఉన్న ప్రభు యొక్క కీర్తి అప్పటి శహన్ షా ఆలహజరత్ అఫ్జల్ చెవినపడెను. కానీ ఆయనకు ప్రభువును దర్శించుకోవాలన్న కోరిక ఎలా తీరుతుంది?

ప్రభు అయినా హైదరాబాద్ కి వెళ్ళాలి లేదా అఫ్జల్ అయినా ప్రభు వద్దకు రావాలి. ఈ రెండింటిలో ప్రభువునే హైదరాబాద్ కి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నిజాం ప్రధానియైన సర్ సాలార్ జంగ్ బహదూర్ గారు, నిజాం సైన్యంలో అరబ్బుల కంపెనీలో నమ్మకస్తుడైన యశ్వంత్ రావు అనే బ్రాహ్మణ గృహస్థును ప్రభు వద్దకు పంపించారు.

ప్రభువుకు విన్నవించుకొని హైదరాబాద్ కి తీసుకురావాలని వారితో పాటు గుర్రాల స్వారీ, మేనాలు, పల్లకీలు మొదలైన సరంజామా అంతటిని ఇచ్చి, ప్రభువు హైదరాబాద్ వస్తే అరవై వేల విలువైన జాగీరు ఇస్తామని చెప్పి పంపారు.

యశ్వంత్ రావు సరంజామా తీసుకొని ప్రభు దర్బార్ లో హాజరు అయ్యారు. ఆయన సన్మానపూర్వకముగా ప్రభు ముందు దండప్రమాణాలు చేసి తాను వచ్చిన కారణాన్ని చెప్పి, పంపించిన కానుకలను ప్రభు చరణాల వద్ద ఉంచాడు. మరియు జాగీరు ఇస్తానన్న విషయాన్ని కూడా తెలియచేసాడు.

"మేము ఫకీరులము, జాగీరు తీసుకొని ఏం చేస్తాము? మేము ఏ వైపుకు చూస్తే అదే మా జాగీరు. విశ్వమంతా ప్రభువుకు రాజ్యం. మీ యజమాని ఇచ్చిన దానికంటే పదిరెట్లు కావాలనుకుంటే ఆయనను ఇక్కడికే రమ్మని చెప్పండి. ఏది అడిగితే అది దొరుకుతుంది, నేను ఇక్కడ ఉండడం తన రాజ్యమునకు రక్ష అని నిజాంతో చెప్పండి అని ప్రభువు అన్నారు.

     ప్రభు యొక్క ఈ స్పష్టమైన జవాబు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఆ జవాబులో ప్రభు యొక్క దైవత్వం ఉంది. ప్రభు యొక్క సర్వతంత్ర, స్వతంత్ర ప్రవృత్తి జనులందరికి తెలిసింది. బంగారు సంకెళ్లతో ప్రభువుని కట్టి వేయడం సాధ్యమవుతుందా?.

ఆ తరువాత కాలంలో ప్రభు ప్రసాదంతో అఫ్జల్ కి పుత్రప్రాప్తి కలిగి ప్రభు యొక్క ఆజ్ఞతో ఆ పుత్రునికి 'మహబూబ్' అని నామకరణం చేశారు. తరువాత ఇతను 'మహబూబ్ ఆలీ పాషా' పేరుతో హైదరాబాద్ నిజాం అయ్యారు.

తరువాయి భాగము రేపు చదువు కుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 41 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

    జాముకు ఒకసారి వాయించే ఢంకా (నౌబత్) ధ్వని ఇప్పటికీ మాణిక్ నగర్ కు వచ్చే యాత్రికులకు వినిపిస్తుంది. ఇది ఎప్పటినుండి ప్రారంభించబడిందో తెలియదు.

ప్రభు మాణిక్ నగర్ లో నివసించడం మొదలై ప్రభు దర్బార్ శోభ సంతరించుకున్న తరువాత గణేష్ చతుర్థి రోజు ప్రొద్దున ప్రభు కాలకృత్యాలు తీర్చుకొని ఆరుబయట కూర్చున్నపుడు రాజేశ్వర్ గ్రామానికి చెందిన గృహస్థు ఒక చిన్న సుందరమైన గణపతి మూర్తిని తెచ్చి ప్రభు ముందు పెట్టి ఈరోజు గణేష్ చతుర్థి ఉన్నందువలన గురుదర్బార్ లో ఈ ప్రతిమను ప్రతిష్టించి ఉత్సవం చేయాలని కోరికగా ఉంది అని ప్రార్ధించారు. గణపతి చాలా సుందరంగా తయారుచేసినందున, అది చూసి ప్రభు చాలా సంతోషించి ఆయన కౌశల్యాన్ని మెచ్చుకొని గణపతి మా దగ్గరికి ఎలా వచ్చారో అలాగే ఢంకా కూడా తెచ్చుకుంటే పెద్ద ఉత్సవం చేయవచ్చు అన్నారు.

ఇలా అనగానే రెండు మూడు గంటల తర్వాత తూర్పు ద్వారం వద్ద ఢంకా వాయించబడింది. అది ఎవరు వాయించారంటే కళ్యాణి గ్రామానికి చెందిన ఢంకా వాయించే వాళ్ళు ప్రభు వద్ద కొన్నిరోజులు సేవ చేయాలని వచ్చి, తాము వచ్చిన విషయం ప్రభువుకి తెలియాలని వాయించారు.

అందరూ ఈ విషయాన్ని ప్రభువుకి తెలియచేసి గణపతి ఉత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లు చేసి గణపతిని ప్రతిష్టించారు. ఢంకా వాయించే వాళ్లకు భోజన వసతి కల్పించి ఢంకా వాయించే సమయాలు వారికి తెలియచెప్పారు. ఈ విధంగా జాముకు ఒకసారి ఢంకా వాయించడం మొదలయింది.

   నాలుగైదు నెలలు తర్వాత వారు తిరిగి వెళ్ళటానికి ప్రభు అనుమతి అడిగారు. ఆ సమయంలో అక్కల్ కోట సంస్థానంలో కార్యనిర్వహణ చేసే దాజీసాహెబ్ భోస్లే ప్రభు దర్శనానికి వచ్చారు.

సంస్థానంలో మొదలైన ఢంకా వాయించడం ఆగిపోతుందన్న విషయం విని అది ఎప్పుడు వాయిస్తూనే ఉండాలన్న కోరికతో దాని ఖర్చుల కోసం అక్కల్ కోట సంస్థానం నుండి ప్రతీ నెల ముప్పై రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అది పునః ప్రారంభించడం వారి మూలంగా జరిగింది. అది చివరివరకు వారి వల్లనే నడుస్తుందనే నమ్మకం ప్రభువుకు కలగలేదు. అందుకని ప్రభువు ఇలా అన్నారు. "మాది ఫకీరుల దర్బార్" ఢంకా అవసరం లేదు.

గురుదర్బార్ యొక్క ఢంకా త్రిభువనాలలో ప్రతిధ్వనిస్తుంది. అందుకని దానితో ఈ దర్బార్ కి అవసరంలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఉండనివ్వండి. కానీ, ఈ బాధ్యత చివరివరకు నిలబెట్టుకోవాలి.

   దాజీసాహెబ్ భోస్లే గారి ద్వారా మొదలుపెట్టబడిన ఢంకా వాయింపు మూడు నాలుగు సంవత్సరాలు అక్కల్ కోట సంస్థానము ఖర్చుతోనే నడిచింది. కొంతకాలానికి ఆ ఖర్చు రావడం ఆగిపోయింది.

ఎందువల్లనంటే అక్కల్ కోట సంస్థానంలో ఏవో గొడవలు జరిగి దాజీసాహెబ్ అక్కల్ కోట సంస్థానం నుండి విడిపోయారు. కానీ ఒకసారి మొదలుపెట్టిన ఢంకా వాయింపు ఆగిపోకూడదని ప్రభు సంస్థానమే ఆ పద్ధతిని కొనసాగించింది. అది ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

   అక్కల్ కోట రాజావారికి పుత్రుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. సంస్థానంలో కొన్ని గొడవలు కూడా జరుగుతుండేవి. వాటి నివారణ జరగాలని అక్కడి కార్యనిర్వహణ చేసేవారు తరచూ ప్రభు దర్బార్ కు వచ్చేవారు. అలా ఒకసారి ఒకరు ప్రభుపై విశ్వాసంతో ప్రభు వద్ద ప్రార్దుంచడానికి వచ్చారు.

"నేను పిలిచినప్పుడు వస్తే ప్రసాదం ఇస్తాను" అని ప్రభు తెలియచేసారు. తరువాత ప్రభువు నుండి ప్రసాదం తీసుకోవడానికి రావాల్సిందిగా పిలవడానికి వచ్చిన మనిషి తిరిగి ప్రభువద్దకు వెళ్లి ఆయన భోజనానికి కూర్చున్నారని చెప్పాడు.

అప్పుడు ప్రభు "అరే ప్రసాదం వేళ ఆయన పోగొట్టుకున్నారు" అని కూర్చుని ఉండిపోయారు. తరువాత ఆ గృహస్థు ప్రసాదం తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ ప్రసాదం దొరకలేదు. స్వయంగా ప్రభుచేతితో ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం, ఆ యోగం వాళ్లకు లేదు.

తరువాయి భాగము రేపు చదువు కుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 

శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 42 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

     ఇంతకుముందు "ఎనిమిది గవ్వలు" ఈ విషయానికి సంబంధించిన సంఘటన విషయంలో చరిత్రకారులందరూ ఒకే విధంగా చెపుతారు. సదాశివరావ్ మన్సబ్ అనే పేరుగల ఒక వృద్ధ గృహస్థు చిడుగుప్ప జిల్లాలో అకౌంటెంట్ గా ఉండేవారు. వారు చెప్పడం వలన ఈ విషయం తెలిసింది.

దాని ప్రకారం ఆ స్త్రీ కంది కిషన్ రావు అనే పేరుగల దేశ్ ముఖ్ గారి పత్ని. ఈ స్త్రీ పుట్టిల్లు హాళిఖేడ్. అందుకని తన వైభవాతిశయంతో పల్లకిలో కూర్చుని తల్లిగారింటికి వస్తుండేది. ఆమె యవ్వనవతియై ఉండెను.

కానీ, సంతతి లేకపోవడంతో పిల్లల కోసం ఆమె ఆశతో ఉండెను. ఆమె ప్రభు యొక్క కీర్తి విని తల్లిగారింట్లో కొన్నిరోజులు ఉండి తరువాత కళ్యాణి గ్రామానికి వెళ్లాలని వచ్చెను. కానీ ప్రభు హాళిఖేడ్ వచ్చారని ఆమెకు తెలియదు.

ఆమె అంతరంగం తెలుసుకొని ప్రభు త్రోవలో కూర్చుని ఉండెను. ఆమె రాగానే ఆమె నుండి ఎనిమిది గవ్వలు తీసుకొని ఆమెకు సంతానం కలుగుతుందని చెప్తారు. ఇది అంతా ముందు చదివిన విషయమే.

   ప్రభు దర్శనం అనుకోని రీతిలో జరిగి తన కోరిక తీరడం వలన ఆనందంతో ఆమె తన అత్తగారింటికి వెళ్ళింది. అక్కడకి వెళ్లిన తర్వాత ప్రభువుకు గవ్వలు ఇవ్వడం వలన గర్భవతియై పుత్రుడు కలిగాడు.

పుత్రుడు జన్మించిన సంతోషంతో ఆ స్త్రీ తన పుత్రునితో సహా ప్రభు సన్నిధికి వచ్చి దానధర్మాలు చేసింది. తరువాత ఆమెకు ఐదు మంది పుత్రులు జన్మించారు. ప్రభువుపై పూర్తి శ్రద్ధ ఉండడం వలన ఆమె ప్రతీ పుత్రుణ్ణి ప్రభు కాళ్ళవద్ద ఉంచి దానధర్మాలు చేసేది.

  ఐదవ పుత్రుని సమయంలో ప్రభు మాణిక్ నగర్ లో ఉండిరి. ఆమె తన ఐదుగురు పుత్రులతో అక్కడకి వచ్చి అత్యంత శ్రద్ధతో ప్రభు పూజచేసి, అన్నదానం చేసి తిరిగి వెళ్లాలని అనుమతి అడుగుతూ నాకు ఇప్పుడు పుత్రులు అవసరంలేదు. ఇపుడు ఉన్న ఈ ఐదుగురు పుత్రులు సంతోషంగా ఉండాలి. నాకు శరీరంలో రోజురోజుకి శక్తిహీనత అనిపిస్తుంది. ప్రసవ వేదన భరించే శక్తి లేదు.

అందుకని దయచేసి పుత్రులు ఇక కలుగకుండా చేయమని అడిగింది. ఇలా చమత్కారంగా అడిగేసరికి ప్రభువుకి నచ్చలేదు. ప్రభువు ఆమెకు అనేకవిధాలుగా నచ్చచెప్పారు. "బాయి ఈ విధంగా నీవు కోరడం మంచిది కాదు.

దత్తుడు నీకు ప్రసాదంగా ఇచ్చే దానిని నీవు తీసుకోవాలి. ఈ విషయాన్ని దూరద్రుష్టితో ఆలోచించు. దొరికిన వరాన్ని కాదనకు. ఈ విధంగా నచ్చ చెప్పినా ఆమె తన పట్టు విడువలేదు. అప్పుడు ప్రభు సరే నీ ఇష్టం అని తిరిగి వెళ్ళడానికి అనుమతించారు.

ఇంటికి వెళ్లిన తర్వాత కొన్నిరోజులకు అకస్మాత్తుగా ఆమె భర్త జబ్బుపడి మరణించారు. అనుకోకుండా జరిగిన ఘటనతో ఆమెకు
 ప్రభువు మాటలు గుర్తుకు వచ్చి తన పట్టుదల వలన ఇలా జరిగిందని పశ్చాత్తాపపడింది. ఇక చేసేది ఏమి లేకపోవడం వలన ధైర్యంగా సహనం చూపించింది.

తరువాయి భాగము రేపు చదువు కుందాము.....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 45 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

      అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పారు. మీ తండ్రి వలన మాకు ఉపకారం జరిగింది. ఆయన చెప్పడం వలన నేను లాడవంతి విడిచి సోలాపూర్ కి వెళ్ళి సుఖంగా సంసారం చేస్తూ ఉన్నాను.

పుత్రులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో సంతోషంగా కాలం గడిపాను. పరమార్ధం లభించడానికి ఏదైనా దారి చూపించండని అడిగితే ఆ రోజులు ముందు ఉన్నాయని ఎప్పుడూ అనేవారు.

మీరు జన్మించిన రోజు మధ్యాహ్నము రెండు గంటల సమయంలో ఈ జన్మ పత్రిక తయారుచేసి నాకు ఇచ్చి, జాగ్రత్తగా ఉంచి ఉపనయనము అయిన తరువాత నీకు వీలయినపుడు వెళ్లి కలిసి ఇది చూపించు, అప్పుడు నీ కోరిక పూర్తవుతుందని నాతో అన్నారు.

నేను సోలాపూర్ కి వెళ్లిన తరువాత ఆయన కూడా లాడవంతిని విడిచి వెళ్ళిపోయి కళ్యాణిలో నివసించారని అక్కడే దేహత్యాగం చేశారని విన్నాను. అప్పుడు మీ దర్శనానికి రావాలని అనుకున్నాను, కానీ, ఇంట్లో కొన్ని కారణాల వలన రాలేకపోయాను.

తరువాత వీలు చేసుకొని రావాలనుకున్న వేళలో మీరు ఎవరినో వెంట తీసుకొని పండరిపురం వెళ్ళారని తెలిసింది. అందుకని రాలేకపోయాను. అందరూ అంటే మీ తాత గారింట్లో కూడా దేశాంతరం వెళ్ళారని తెలిసి నిరాశ చెందాను.

   వీరభద్రుడు (హుమనాబాద్) మా కులదేవత అవడం వలన చాలా రోజులుగా రావడం కుదరక కుటుంబ సభ్యులందరితో దర్శించుకుందామని ఇలా వచ్చాము.

మనోహర్ నాయక్ యొక్క చిరంజీవులు మీరే అని నాకు తెలియదు. కళ్యాణ్ లో మాణిక్ ప్రభు అనే పేరుగల సాధు మహనీయులు ఉత్పన్నం అయ్యారని, వారే ఈ గ్రామాన్ని తయారుచేశారని నిన్ననే నాకు తెలిసింది.

నేనే తిరిగి వెళ్లేముందు కళ్యాణికి వెళ్లి మిమ్మల్ని వెతకాలని మరియు వెళ్తూ వెళ్తూ ఈ కొత్త సాధు యొక్క దర్శనం చేసుకోవాలని ఈరోజు ఉదయం ఇక్కడకి వచ్చాను, మీ నాన్నగారి ఆశీర్వాద ప్రభావంతో ఆయాచితంగా మీ దర్శనం దొరికింది. ఇదంతా చెప్పేసరికి ఆ వృద్ధుడు అలసిపోయాడు.

మరియు తన తండ్రిపై ఆ వృద్ధునికి ఉన్న భక్తికి ప్రభు సంతృప్తులై ముందుగా అతనిని క్రింద కూర్చోపెట్టి వారితో మృదు మధురమైన స్వరంతో, తండ్రి మిత్రుడు తండ్రితో సమానులు. మీ వంటి వారికి మా వంటి పిల్లలు ఏమి ఉపదేశం ఇవ్వాలి.

వృద్ధులు జగత్తులోని మంచి, చెడు రెండు విషయాలను వేల సంఖ్యలో అనుభవించి ఉండడం వలన ముందు దారి దానికదే కనిపిస్తుంది. ఇప్పటి కాలంలోని మాకు జగత్తంటే ఏమిటో తెలియదు. మేమెలా ఇతరులకు పరమార్ధానికి దారి చూపించాలి?

     ప్రభు మాటలు విని మధ్యలో ఆ వృద్ధుడు "మహారాజ్! ఈ సమయంలో మీరు ఏదో సత్పురుషుడని లేదా మనోహరబాపు పుత్రులని మీపై భారం వేయట్లేదు.

నాకు తప్ప ఇతరులకు తెలియని ఎన్నో జరిగిన విషయాలను మీరు సరిగ్గా గుర్తు పట్టడం వలన మీరు సర్వ వ్యాపకమైన పరమేశ్వరులని నాకు నిశ్చయంగా తెలిసింది.

మీ వాస్తవిక స్వరూపం తెలిసింది. నాకు ఒక విన్నపం చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఈ వయస్సులో జపతపాలు, నియమనిష్ఠలు, అనుష్టానాలు సాధ్యం కావు. అలాంటి మార్గంలో కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగే మార్గం చెప్పండి. మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను.

నేను తిరిగి వెళ్లి మాత్రం ఏం చేస్తాను? ఎప్పటివరకు మీ ఈ అసామాన్య సామర్ధ్యయుక్తమైన సగుణమూర్తి నా ద్రుష్టి ముందు ఉంటుందో అప్పటివరకు మీ పాదాల వద్ద ఉండి నా దేహాన్ని అర్పిస్తాను.

ఈ విధంగా ఆ వృద్ధుని పట్టుదల, అమాయకత్వం అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

   ప్రభువు మాత్రం నవ్వుతూ ఇలా అన్నారు. ఈ విధంగా తమకు కావాలని పంతంతో మోక్షప్రాప్తి కోసం పట్టుబట్టే వారికి ముక్తిని ఇవ్వడం కష్టమైన పని కాదని, వారు మనస్సులో అనుకోగానే ముక్తి లభించినట్లే అంటూ ఆ తరువాత గౌరవంతో వినయపూర్వకంగా ఆ అమాయక కంసాలితో మళ్ళీ ప్రభు ఇలా అన్నారు.

"మా యొక్క తీర్థ రూపంపై మీకు ఇంతటి నిష్ఠ ఉంటే ఇలా చేయండి. అయినంత తొందరలో సోలాపూర్ కి వెళ్లి ఇప్పటివరకు సంపాదించిన సంపదను ఆప్తులకు మీ ఇష్టానుసారంగా యోగ్యత తెలుసుకొని పంచండి.

వాళ్లలో మీ తరువాత మనస్పర్థలు, కొట్లాటలు రాకుండా పంచండి. ఆ తరువాత మీ మనస్సు సంతృప్తి చెందితే మీ కోరిక పూర్తి అవుతుంది. ప్రభు ఆజ్ఞను కంసాలి ఆనందంగా ఒప్పుకున్నారు.

   రెండు రోజులు ఆ వృద్ధుడు మరియు అతని కుటుంబము సంతోషంగా గడిపే ప్రభు వద్ద ప్రసాదం తీసుకొని తిరిగి వెళ్లారు. తరువాత ప్రభు ఆజ్ఞానుసారం తన సంపదను పంచి, 'ఇప్పుడు నేను నిజంగా మనోహరమహారాజ్, మాణిక్ ప్రభు వచనానుసారం ముక్తుడనయ్యాను'.

ఈ మాటలు ఆయన నోటి నుండి వెలువడగానే బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఆయన సంపదను పంచిన రోజే జరిగింది. ఇతని వంశం వారు ఇప్పటికి ధనకనక సంపన్నులై ప్రభు సంస్థానానికి వస్తూ వారి శక్త్యానుసారంగా సేవ చేస్తూనే ఉన్నారు.

తరువాయి భాగము రేపు చదువు కుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 47 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

      హుమనాబాద్ లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు సతీ సమేతంగా నివసించేవారు. ఆయన మంచి మాటకారి అయి ఉండెను. అందుకని ప్రభు ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవారు. రాత్రి రెండు గంటల వరకు వేదాంత విషయాలు మాట్లాడుతుండేవారు.

ఆయన మాటలు ప్రభువుకి మనః పూర్వకంగా ఇష్టం అవడం వలన అదే రీతిగా ఆ బ్రాహ్మణుడు నడుచుకొనేవారు.

   ఆ బ్రాహ్మణుడి భార్య పతివ్రతయై, సుశీలయై ప్రభువుపై పుత్రప్రేమను చూపించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవడం వలన దిగులుతో ఉండేది.

ఒకరోజు ఈ వృద్ధ దంపతులు ప్రభు ముందు కూర్చున్నపుడు మహాసాధ్వి వెంకమ్మ ప్రభు దర్శనానికి వచ్చింది. ప్రభు చరణాలపై తలవంచి నమస్కరించి చేతులు కట్టుకొని ముందు నిలబడింది.

అప్పుడు ప్రభు "వెంకే! నాలుగు రోజులు కనిపించలేదు ఎందుకని?" అని అడిగారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది. మహారాజ్! పూర్వ పాపం వలన నెలలోని నాలుగు రోజులు మీ యొక్క ప్రత్యక్ష పాదుక దర్శనం కలగదు. దీనికి ఏదైనా ఉపాయం చూపిస్తే నాకు ఆనందం కలుగుతుంది.

వెంకమ్మ యొక్క మాటలు విని ప్రభువు ఇలా అన్నారు. "వెంకే! నీకు విసుగు అనిపిస్తే మనస్సులో ఎవరికైతే కోరికగా ఉందో వాళ్లకు ఇచ్చివేయి. అప్పుడు ప్రభువు, వెంకమ్మకు వృద్ధ బ్రాహ్మణ స్త్రీని చూపిస్తూ ఆమె చేతిపై నీటిధారను విడువు అనగానే వెంటనే వెంకమ్మ చేతిలో నీరు తీసుకొని ఆ స్త్రీ చేతిపై విడిచింది.

తరువాత నెల తిరగగానే ఋతుమతి అయ్యే బాధ నుండి వెంకమ్మకు ముక్తి లభించింది. తిరిగి ఋతుమతి కావడం జరగలేదు. ఆ వృద్ధ సాధ్వి నెల తిరగగానే  ఋతుమతి అయింది.

    ఈ చర్య చూసి అందరికీ ముఖ్యంగా ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. కానీ ఇంకా విశేషమైన విషయం తరువాత జరిగింది. ఆ స్త్రీ మూడు నెలలు ఋతుమతి అయిన తర్వాత నాలుగవ సారికి గర్భవతి అయి పది నెలలు అయిన తర్వాత సుందరమైన పుత్రునికి జన్మనిచ్చింది.

అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులు సంతోషం పట్టలేకపోయారు. ఆ స్త్రీకి సుమారు 60 సంవత్సరాలు. ఆ వృద్ధుడు 75 సంవత్సరాల వయస్సు కలవారై ఉండెను. అయినా ప్రభు కృపతో పుత్రుడు జన్మించాడు.

వారి సంతోషం చెప్పనలవి కాలేదు. అందరికి ఆశ్చర్యం కలిగి ప్రభు సామర్ధ్యం, కీర్తిని వర్ణన చేయసాగారు. ఆ స్త్రీ ఆ పుత్రునికి 'మాణిక్' అని పేరు పెట్టింది.

    హుమనాబాద్ లో మాణిక్ భట్ అనే పేరుగల వృద్ధ బ్రాహ్మణుడు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉండేవారు. వీరి వద్ద ప్రభు గాది ఉంది.

వీరు ప్రభు నవరాత్రులు చేసేవారు. వీరిని అనేకమంది పూజ్యనీయులుగా చూసేవారు. ఈయనకు శిష్యులు కూడా ఉండేవారు. ఆ వృద్ధ దంపతుల పుత్రుడే ఈ మాణిక్ భట్.

తరువాయి భాగము రేపు చదువు కుందాము......

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ