శ్రీమన్నారాయణీయం
శ్రీమన్నారాయణీయం / తృతీయ స్కంధము/ 11వ దశకము - హిరణ్యాక్ష- హిరణ్యకశిపుల ఉత్పత్తి / 1-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩
క్రమేణ సర్గ పరివర్ధమానే కదాపి దివ్యాః సనకాదయస్తే।
భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ!
భావము:-
గురవాయూరు పురాధీశా! క్రమక్రమముగా లోకసృష్టి వృద్ధిచెందుచున్న కాలమున, ఒకానొక సమయమున దివ్యజ్ఞానులైన సనకాది మునీశ్వరులు నిన్ను దర్శించుటకు వైకుంఠమునకు వచ్చిరి.
వ్యాఖ్య:-
ఈరోజు శ్లోకం భాగవతంలో జయవిజయులకు సనక సనందనాదులు ఎందుకు శాపామిచ్చారో, వాళ్ళు దానిని యే విధంగా అనుభవించారో అన్న విషయాలను తెలుసుకుందుకు తెరతీస్తోంది.
సకల జీవకోటిరకి ఆరాధ్యమైన వైకుంఠంలో విజయదశమి వేడుకలు కనులపండువుగా జరుగుతున్నవి. పూజలు ప్రారంభమైనాయి. ఆ సమయంలో తేజస్సంపన్నులైన సనక సనందనాదులు విష్ణుదర్శనం కోరి వైకుంటానికి వచ్చారు. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వీరి పేర్లు.
కుమారుడు అంటే అవివాహితుడైన బ్రహ్మచారి. వీరు ఎంతో గొప్ప సాధువులుగా వర్ధిల్లారు. అఖండమైన తపస్సు చేశారు. వారి తండ్రి అయిన బ్రహ్మ , సృష్టికి తోడ్పడాలన్న కోరికకు భిన్నంగా వీరు జీవితమంతా బ్రహ్మచర్యం పాటించారు. వీరు 12 మంది మహాభక్తులలో ఒకరు. వీరు పుట్టుకనుండి బంధాలకు అతీతులు. విష్ణుభక్తులు. వీరు చిన్న బాలురరూపంలో ప్రపంచమంతటా పర్యటిస్తారు.
వైకుంఠ ద్వారపాలకులైన ' జయ విజయులు ' ఆ మునీశ్వరులను చూస్తూ, " కాలాతీతమైనది. పూజలు ప్రారంభమయ్యాయి. మీరు లోనికి వెళ్ళడానికి వీలులేదు. వెళ్ళిపొండి." అని సహజమైన దర్పంతో చెప్పారు.
సనకమహర్షి శాంతదృక్కులతో వారినిచూస్తూ," నాయనలారా! ఎంతో శ్రమపడి శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వచ్చాము. మాకు ఆభాగ్యం లేకుండా చేయడం మీకు ధర్మంకాదు. మమ్మల్ని లోపలకు వెళ్ళనివ్వండి " అన్నాడు. అందుకు జయుడు సనకమునీంద్రుని చూసి వెకిలిగా నవ్వుతూ, ' అయ్యా! వెర్రి మునీంద్రా! మీ సమయం మించిపోయింది. మీరు ఎన్ని మొరలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు వెళ్ళండి. వెళ్ళండి." అన్నాడు.
సనందన మునీంద్రుడు కోపంతో జయవిజయులను చూస్తూ , " ఓరీ ! త్రిలోక రక్షకుడైన శ్రీమహావిష్ణువు నివాసం భక్తకోటికి నిరాఘాటంగా ఉండాలి. మీరు ఇక్కడ కాపలావున్నది దుర్మార్గుల ప్రవేశానికి కాపలా ఉండటానికే గానీ, మా లాంటి విష్ణుభక్తులను అవమానించడానికి కాదు. అసదృశ తపో విరాజితుడైన మా సనక మునీంద్రుని అపహాస్యం చేశావు. మీ దురాగతాలని క్షమించడం ఇంక సాధ్యం కాదు. అయినా ఇప్పటికైనా మించి పోయింది లేదు. మీ అహంకారాన్ని విడిచిపెట్టి, మాకు ప్రవేశం కలిగిస్తారా లేక ఫలితం అనుభవిస్తారా! " అన్నాడు తీవ్రకంఠమ్ తో . సనందుని మాటలకు జయవిజయులు హేళనకూడిన స్వరం తో బిగ్గరగా నవ్వారు.
" ఓయీ అమాయకమునీ ! నీ శాపాలు పనిజెయ్యడానికి ఇది అన్నిలోకాల వంటిది కాదు. వైకుంఠవాసం. మీరు మర్యాదగా వెళ్ళిపోతారా ? లేక మెడబట్టి గెంటమంటారా? " అన్నాడు విజయుడు.
సనందుని కోపం అగ్నిలా జ్వలించింది. మిగిలిన మునులు వారిస్తున్నా మంత్రజలాన్ని జయవిజయులపై చల్లాడు. ఆ జలం మీదపడీ పడగానే, జయవిజయుల శరీరాలు మండసాగాయి, అపరిమితమైన వేడిమితో.
అప్పుడుగానీ, జయవిజయులకు ఆమునులు ఎంతటి తపస్సంపంన్నులో తెలియరాలేదు.
అప్పటికే మంత్రజలాన్ని వేరొకసారి అభిమంత్రించిన సనందుడు " ఓరీ గర్వాంధులారా! శ్రీమహావిష్ణువు ద్వారపాలకులైవుండి కూడా వినయ విధేయతలు మర్చిపోయి, అహంకారంతో విర్రవీగుతున్న మీకు ఇదే శాపం ఇస్తున్నాను. అనుభవించండి. ఇది మొదలు మీరు క్షుద్రకర్మలకు ఆలవాలమైన రాక్షసజన్మలలో జీవితాలను గడుపుతూ, విష్ణుపద ప్రాప్తిలేక వైకుంఠస్థానం విడిచి అధోలోకాలలో తిరగండి. " అని ఆ మంత్రజలాన్ని వారిపై జల్లాడు.
అప్పటికి జయవిజయుల గర్వం పూర్తిగా తొలగి పోయింది. ఆ ఇద్దరూ సనకసనందనాదుల ముందు మ్రోకరిల్లి " మహాత్ములారా ! మిమ్ములను సామాన్యులుగా భావించి అగౌరవపరిచాము. మా అపరాధాన్ని మన్నించండి. ఎంతటి పుణ్యాత్ములకుగానీ దొరకని విష్ణుపదాన్ని చేజేతులా పోగొట్టుకున్న మందభాగ్యులం . మమ్మల్ని దయచూడండి. నిగ్రహాను
గ్రహ సమర్ధులైన మీరు తప్ప మమ్మలిని ఎవరూ కాపాడలేరు. " అని ప్రార్ధించారు. కానీ కోపావేశంలో వున్న సనందుడు ఏమీ మాట్లాడలేదు.
🕉🌞🌎🌙🌟🚩
Comments
Post a Comment