🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము













🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 83 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 26🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 ☘. మహా సమాధి - 3 ☘

🌸. తాత్యామహారాజ్ 🌸

మాణిక్ నగర్ లో ఐదు దేవతా మూర్తులలో ముగ్గురు మూర్తులు ఇహలోకం విడిచి వెళ్లిన తరువాత తాత్యామహారాజుల వారు తమ అవతారం ముగించే ఆలోచన చేయసాగారు. 

ఒకసారి వారి ఆరోగ్యం వికటించి అస్వస్థులై చాలా భయపడ్డారు. కొంతమంది శిష్యులు ప్రభువుకు విన్నవించుకున్నారు. కానీ, అప్పుడు ప్రభువు, భయపడే అవసరం లేదు తాత్యా ఇప్పుడే ఏమీ వెళ్ళరు, ఈ సటకా తీసుకొని వెళ్లి తాత్యా దిండు దగ్గర పెట్టండి. 

ఆయనకు బాగవుతుంది అన్నారు. శిష్యులు అలా చేసిన తరువాత తాత్యామహారాజ్ ఆరోగ్యవంతులయ్యారు.

          ప్రభువు తాత్యామహారాజ్ వారి పెద్ద కొడుకు ఉపనయనం చాలా వైభవంగా చేయించారు. ప్రభు వంశంలో, మాణిక్ నగర్ లో జరిగే మొదటి వేడుక అవడం వలన చాలా ఉత్సాహంతో జరుపబడింది. 

ఆ సమయంలో 5 నుండి 10 మంది బీద పిల్లల ఉపనయనం కూడా చేయబడింది. ఈ సమారంభము జరిగిన తరువాత కొంతకాలానికి తాత్యామహారాజ్ యొక్క అవతార సమాప్తి సమయం దగ్గరికి వచ్చింది.

            ఉపనయనం మహోత్సవం జరిగిన తరువాత ఒక నెల వరకు ప్రభువు మరియు తాత్యామహారాజ్ ఏకాంతంలో కూర్చుని ఆత్మవిచారణ చేశారు. ఒక నెల వరకు శౌచ్యం, మూత్రం, భోజనం లేకుండా ఉన్నారు. 

జనానికి ప్రభు దర్శనము ఒక నెల రోజులు కాలేదు. బయటకి వచ్చిన తరువాత నిత్యకర్మ మొదలయింది. ముందు తాత్యామహారాజ్ స్వయంగా శ్రీగురుచరిత్ర పారాయణం చేసి దానధర్మాలు, భజన, పూజ కార్యక్రమములు చేసి ఒకరోజు, అందరితో ఆనందంగా మాట్లాడుతూ, అందరి అనుమతి తీసుకొని ప్రభు చరణాలపై తల వంచి నమస్కరించి తరువాత యోగ సమాధి తీసుకున్నారు. 

అప్పుడు భక్త కార్య మహామంత్రం అన్నివైపులా వినిపిస్తుండగా తాళాలు, మృదంగ, శంఖనాదాలతో, భజనలతో వేలమంది జాతరలా నడుస్తుండగా పెద్ద ఉత్సవంలాగా తాత్యామహారాజ్ యొక్క సమాధి పూర్తయింది. 

స్వయంగా ప్రభువు తన కనిష్ఠ బంధువు చివరి విధికోసం సమాధివద్దకు వచ్చి చివరివరకు ఉన్నారు. తాత్యామహారాజ్ యొక్క జ్యేష్ఠ పుత్రులైన మనోహర ప్రభు గారితో విధి అంతా ధర్మశాస్త్రానుసారంగా చేయించి వేల రూపాయలు దానధర్మాలు చేసి తాత్యామహారాజ్ యొక్క పేరు ప్రభు తనతో పాటు అజరామం చేశారు.

        తాత్యామహారాజ్ కోసం రోదించని మనిషి అక్కడ లేడు. వీరి అస్థికల సమాధి సంగమములో మాతృశ్రీ సన్నిధిలో ఉన్నది. సమాధి అయ్యేసరికి తాత్యామహారాజ్ యుక్త వయస్సులో ఉండిరి. పత్ని, ముగ్గురు చిన్న పిల్లలను వదిలి నిర్భయంగా దేహయాత్రను ముగించారు. వీరి నిర్యాణ సంవత్సరము 1862.

         తాత్యమహరాజ్ దగ్గర రామ్ భావ్ లంగోటి అనే అతను సేవ చేస్తుండేవారు. ఈయన ఇలా చెప్పారు, సమాధికి ముందు ప్రభువు నన్ను పిలిచి, తాత్యా ఈరోజు వెళ్తానంటున్నాడు, చూద్దాం ఇప్పుడే ముక్తినిద్దాం అంటూ తాత్యా వద్దకు వెళ్లి కాలి బొటనవ్రేలు ఒత్తి పట్టుకొని పంచప్రాణాలు నాభి వద్దకు వచ్చేట్లు చేసి ముక్తినిచ్చారని రామ్ భావ్ లంగోటి చెప్పారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏 

సశేషం....

84.  ☘. మహా సమాధి - 4 ☘

🌸.  వెంకమ్మ  🌸

             మాణిక్ నగర్ లో వెంకమ్మ అందరికీ పూజ్యనీయురాలై ఉండేది, అందరికీ ఆమెపై గౌరవభావం, ప్రేమ ఉండేవి. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎప్పుడూ ప్రభు స్మరణలో నిమగ్నమై ఉండేవారు. ప్రభువు కంటే ముందు తను దేహత్యాగం చేయాలని ఆమె నిశ్చయించుకుంది. కాళ్లకు గజ్జెలు కట్టుకున్నట్లుగా అహోరాత్రులు ప్రభు భజనలో గడిపిన తరువాత ఒకరోజు వెంకమ్మ నిస్చేష్ఠురాలై పడిపోయింది. వెంకమ్మ దేహత్యాగం చేసింది అని అనుకొని దేహం ఎత్తడానికి ప్రయత్నించసాగారు. అప్పుడు ఆమె నోటి నుండి ఓంకార ధ్వని వెలువడింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ప్రభు వద్దకు వచ్చి విషయం చెప్పారు. ప్రభు సర్వజ్ఞులైనందువలన ఆమె అంతఃకరణను తెలుసుకొని ఇలా అన్నారు.

           ఆమె మనస్సులో బ్రాహ్మణులే సమాధి చేయాలని ఉంది. మరెవ్వరు ఆమె దేహాన్ని తాకకండి. ఆ విధంగా ప్రభు ఆజ్ఞానుసారం బ్రాహ్మణులు వెంకమ్మకు స్నానం చేయించి పసుపు-కుంకుమ నొసట వ్రాసి క్రొత్త చీర, జాకెట్టు వేసి వొడి నింపి మారుతి దేవాలయానికి దగ్గరలోని మైదానంలోనికి తీసుకెళ్లి పెద్ద ఉత్సవముగా ఆమె సమాధి విధిని నిర్వహించారు. బ్రాహ్మణుల చేతి స్పర్శ తగలగానే ఓంకార నాదం వినిపించడం ఆగిపోయింది. సమాధి కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ప్రభు అక్కడే ఉన్నారు.

        వెంకమ్మ సామాన్యురాలు కాదు. ఆమె సిద్ధయోగిని. కేవలం పార్వతిదేవి అవతారం అయి ఉండెను. వెంకమ్మ యొక్క దేహం ఏ ప్రదేశంలో అయితే ఉంచబడిందో ఆ ప్రదేశంలో దేవాలయం నిర్మించాలని భక్తులకు కోరికగా ఉండెను. కానీ ప్రభు ఆజ్ఞ లేకుండా అది సాధ్యం కాదని తెలుసు. కొందరు ఈ విషయాన్ని ప్రభువుకు చెపితే ఆమెకు సామర్ధ్యం ఉంటే తన దేవాలయం తానే నిర్మించుకుంటుంది, మనం ఆ విషయంలో ఆలోచించే అవసరం లేదు అన్నారు. ఇది విని అందరూ నిరాశ చెందారు. కానీ, కొన్ని రోజుల తరువాత వెంకమ్మ సమాధిపై దేవాలయం నిర్మించబడి ఉదయం, సాయంత్రం వెంకమ్మకు పూజ, అర్చన చేయడం మొదలయినాయి. దేవాలయంలో నందాదీపం అఖండంగా వెలుగుతూ దేవీ పూజ జరిగేది. మాణిక్ నగర్ లో ప్రభు మందిరానికి దిగువలో వెంకమ్మ యొక్క దేవాలయం ఉన్నది. ఆమె పరమ సాధ్వి. భక్తుల కోరికలు తీర్చడంలో సమర్ధురాలై ఉండెను.

    వెంకమ్మ శరీరంతో ఉన్నప్పుడు, ప్రభు దర్శనానికి వచ్చే స్త్రీలు నేరుగా ప్రభువుకి సమస్యలు చెప్పుకునేవారు కాదు, ముందుగా వెంకమ్మకు చెప్పుకునేవారు. వాళ్ళ తరపున వెంకమ్మ, ప్రభువుకి విన్నవించుకునేవారు. తద్వారా చాలామంది భక్తుల సమస్యలు తీర్చారు వెంకమ్మ.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 89  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 33 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

☘. ప్రభు యొక్క ఉత్తరాధికారులు ☘

🌸. శ్రీమనోహర్ మాణిక్ ప్రభు మహారాజ్ వారు సమాధి స్థితి పొందుట 🌸

 మనోహర మహారాజ్ గారి కార్యభారం కేవలం 12 సంవత్సరాలు నడిచింది. చిన్న వయస్సులోనే అత్యంత మహత్వపూర్ణమైన కార్యకుశలత చూపించారు. 

ఈయనకు సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. మాణిక్ నగర్ లో ప్రభువు యొక్క మందిరంలో సాంప్రదాయ పూజా పద్ధతి ఈయనే తయారుచేసి సంప్రదాయానికి ఒక స్వరూపం తీసుకువచ్చారు. 

ప్రభు సమాధిపై సుందర దేవాలయాన్ని ఈయన తన కార్యభారంలో నిర్మింపచేశారు. వీరి స్వరూపం వలె స్వభావం కూడా చాలా సుందరంగా ఉండేది. వేలమంది భక్తులు ఈయన దివ్య తేజస్సు కల ముఖం చూస్తూ విస్మితులయ్యేవారు. 

వీరికి యోగాభ్యాసంపై మక్కువ ఎక్కువ. అన్ని వ్యవహారాలు యథాప్రకారంగా నియమితవేళలలో జరగాలని అనేవారు. వీరి భాషణ మృదువై వినోదంతో కూడి ఉండేది. వీరు కోపగించుకోవడం ఎవరూ ఎప్పుడూ చూడలేదు. 

ఈయన ఆహారం సాత్వికంగా ఉండేది. వీరు చివరి వరకు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించారు. వీరికి తమ జ్యేష్ఠ సోదరిపై, కనిష్ఠ సోదరుడైన ఖండేరావుపై అమితమైన ప్రేమ కలిగి ఉండిరి.

         మనోహర మహారాజ్ కి ఒకసారి అస్వస్థత కలిగింది. ఆ సమయంలో హైదరాబాద్ కు చెందిన లోకాబాపు అనే వైద్యులు వీరి దర్శనానికి వచ్చారు. ఆయన చాలా శ్రమతో మహారాజుల వారికి ఔషధాలు ఇచ్చి నయం చేశారు. 

మహారాజుల వారు సంతుష్టులై లోకాబాపుకి నాణ్యమైన వస్త్రాలు, చాలా ద్రవ్యం ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి ప్రసాదం ఇచ్చారు. మహారాజుల వారి మెడలో ప్రభువు ఇచ్చిన ఏఖముఖి రుద్రాక్ష తనకు కావాలని లోకాబాపుకి అనిపించింది. కానీ, బిడియంతో అడగలేకపోయారు. 

ఏఖముఖి రుద్రాక్ష ప్రభువు యొక్క ప్రసాదం కనుక ఎవ్వరికీ ఇవ్వకూడదు అనే నియమం ఉంది. కానీ, లోకాబాపుకి ఆ రుద్రాక్షపై కోరిక ఉండడం గ్రహించి, ఏదైనా కారణంతో అతనికి అది అందించాలని, సంగము వరకు మహారాజు గారు స్వయంగా వెళ్లి లోకాబాపుగారిని ఒక ప్రక్కకు పిలిచి తన మెడలోని ఏఖముఖి రుద్రాక్ష తీసి అతనికి ఇచ్చారు. ఇతరుల అంతరంగాన్ని గ్రహించే ఈ సామర్ధ్యం చూసి లోకాబాపు ఆశ్చర్యపడి, మహారాజ్ కి సాష్టాంగనమస్కారం చేసారు.

 ప్రభువు ప్రారంభించిన ఉత్సవములను యథాప్రకారం నడిపిస్తూ, ప్రభు నామం ప్రజలు మరువకుండా చేశారు. 

మహారాజ్ తమ కనిష్ఠ సోదరునికి వివాహం చేశారు. తరువాత సంస్థానాన్ని నడిపించే శిక్షణ అంతా తమ సోదరుడైన ఖండేరావుకి (మార్తాండ మాణిక్ ప్రభు) ఇప్పించారు. 

ప్రభు యొక్క సమాధి వెనుక భాగంలోని స్థలంలో భూమి లోపల ఒక గుయ్యారం (క్రింది భాగంలో చిన్నగది) తయారుచేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆయన చెప్పినట్లుగానే అదే నమూనాలో క్రింద గది తయారయిన తరువాత చూడడానికి ఆ గది తయారుచేసిన వాళ్ళతో పాటు అక్కడకి వెళ్లారు. 

ఆ గదిలో మధ్య భాగంలో తాము స్వయంగా ఆసనం వేసి కూర్చున్నారు. ఆ సమయంలో వారి నోటినుండి సహజమైన సంతోషంతో 'ఆహా, ఈ స్థలం యోగ సమాధికి చాలా బావుంది' అనే మాటలు వెలువడ్డాయి.

పై సంఘఠన జరిగిన ఆరు నెలలు తరువాత మహారాజుల వారి ఆరోగ్యంలో తేడా కనిపించింది. ఒకరోజు ఆదివారం రోజున అకస్మాత్తుగా రెండుసార్లు వాంతి అయి, ఆరోగ్యం విషమించింది. 

జనమంతా భయపడిపోయారు. కానీ అందరికీ ధైర్యం చెప్పి శాంతపరిచారు. తరువాత విధిపూర్వకముగా చతుర్ధాశ్రమం తీసుకొని మాతృశ్రీ కి నమస్కరించారు. కనిష్ఠ సోదరుడు ఖండేరావుకి ఉపదేశం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు. 

భక్తమండలికి ప్రసాదం ఇచ్చిన తరువాత ఆసనము సిద్ధం చేసుకొని యోగసమాధి గతులయ్యారు. పూర్తి మాణిక్ నగర్ దుఃఖసాగరమైంది. చూస్తుండగానే అతి చిన్న వయస్సులో ఆ తేజోవంతమైన తార రాలిపోవడం చూసి అందరూ శోకతప్తులయ్యారు. 

ఆసనం వేసుకొని పీటమీద కూర్చున్న మహారాజుల యొక్క దేహాన్ని ఎలా ఉందో అలాగే ఎత్తి, ప్రభు సమాధి వెనుక క్రింది గదిలోకి తెచ్చి, గతంలో మహారాజుల వారు యోగసమాధికి అనువైనదని అన్నారో అదే ప్రదేశంలో ఉంచి యధోచితంగా పూజా ద్రవ్యాలతో, సుగంధ ద్రవ్యాలతో దేహాన్ని కనుమరుగుచేశారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 90  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 34 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

         🌸. ఫలశ్రుతి 🌸

    సాక్షాత్తు శ్రీదత్తాత్రేయ స్వరూపులైన శ్రీమాణిక్ ప్రభు మహారాజు గారి ఈ దివ్య చరిత్రను ఎవరైతే శ్రద్ధ - భక్తితో పఠిస్తారో వారి మనస్సులోని అన్ని కోరికలు తీరి వారికి ప్రభు కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తాయి.

           సకలమత సంప్రదాయంలో ప్రభువును మూడు పద్ధతులలో ఉపాసించవచ్చు. మొదటిదైన ఆధ్యాత్మిక ఉపాసనలో ప్రభువు పరబ్రహ్మ స్వరూపమై ఉందురు. నిష్కామ భావనతో ప్రభు చరితామృత పారాయణం చేయడం వలన ప్రభు యొక్క సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది.

             రెండవదైన ఆదిధిదైవిక ఉపాసన అనగా దత్తాత్రేయులే చతుర్థావతారంలో శ్రీసద్గురు మాణిక్యప్రభువు రూపంలో అవతరించారు. ఆదిదైవిక ఉపాసనా పద్ధతిలో మనం ఈ చరితామృత పారాయణం చేస్తే ప్రభు కృపతో ధర్మార్ధ కామ మోక్షములు ప్రాప్తిస్తాయి.

      *ఇక మూడవది ఆధిభౌతిక రూపంలో మాణిక్యప్రభువులు బయాదేవి మరియు మనోహరనాయక్ దంపతులకు రామతీర్థ క్షేత్ర సమీపంలోని లాడవంతి గ్రామంలో జన్మించి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము వలె సిద్ధగురువు రూపంలో అవతరించారు.

ఈ రూపంలో ప్రభువును ధ్యానించి ఈ చరిత్ర పారాయణం చేస్తే సంతానం కావాలనుకునే వారికి సంతాన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, వ్యాపార వృద్ధి, సౌభాగ్య ప్రాప్తియే కాకుండా సర్వాభీష్టాలు నెరవేరి ప్రభు కృపాశీర్వాదాలు లభిస్తాయి. ఈ చరిత్ర చదివేవారికి మరియు వినేవారికి ప్రభు అఖండ కృపాశీర్వాదం ఎల్లప్పుడూ లభించుగాక!.*

  శ్రీ దత్తాత్రేయార్పణమస్తు
శ్రీ గురు మాణికార్పణమస్తు

🌷. సమాప్తం 🌷

🙏జై గురుదత్త🙏
🌹🌹🌹🌹🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 35  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 35 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

    *నానాశాస్త్రి అనే పేరుగల బ్రాహ్మణ గృహస్థుడు ప్రభు భక్తులుగా ఉండేవారు. ఎవరినో నిందించిన కారణంగా ఇతని ఇంటికి జోళి వెళ్ళలేదు. ప్రభువు జోళి తిరిగి తమ ఇంటికి వచ్చేవరకు ఇంట్లో కాలుపెట్టను మరియు భోజనం చేయనని నిగ్రహంతో ఆరు రోజులు ఉపవాసం చేశారు.

అది తెలిసి ప్రభు మండలి తిరిగి అతని ఇంటికి జోళి పునః ప్రారంభించారు. అప్పుడు అతను అన్నం తిన్నాడు. పర నిందను ప్రభువు ఒప్పుకునేవారు కాదు. పరనిందలు చేసేవారిని ప్రభువు ఇష్టపడేవారు కాదు.*

   *ప్రభువు భాషణ ఇతర ధర్మాలపై కూడా అంతే సమానంగా ఉండేది. వారు ఎప్పుడూ వాహ్ వా! వాహ్ వా! అంటూ ఉండేవారు. ఆ కాలంలో హుమనాబాద్ లో గులామ్ ముస్తఫాఖాన్ అనే తాలుకుదారు ఉండేవారు.

ఆయన ఆజ్ఞలు అత్యంత కఠినంగా ఉండేవి. ఆయన ప్రభు కీర్తి విని దర్శనం కోసం వచ్చారు. చాలాసేపు ప్రభువుతో సంభాషించిన తరువాత సంతృప్తులయ్యారు. ఇలాంటి యోగి ప్రపంచంలో మరొకరు దొరకడం సాధ్యం కాదని అతనికి గట్టి నమ్మకం కలిగింది.

ముస్లిం ధర్మం యొక్క రహస్యం ప్రభువుకే తెలిసిందని ఆయనకు అనిపించింది. ప్రభువుపై అత్యంత అభిమానం ఏర్పడింది. కానీ, తను ముస్లిం, ప్రభువు హిందువు అని అతని మనసులో బేధ భావం ఉంది. ప్రభువు ముస్లిం అయితే బావుండేది అని అతనికి అనిపించింది.

అప్పుడు అతను ప్రభువుతో వినయంగా "మహారాజ్! మీరు ముస్లిం అయితే ఈ క్షణంలో నేను మీ శిష్యుణ్ణి అయ్యేవాణ్ణి" అన్నాడు. ఇది విని ప్రభువు నవ్వుతూ "నాకు ముస్లిం ఆవాలనిపిస్తుంది. కానీ ఏం చేయాలి 'రబ్-ఉల్-ఆల్ మీన్' ఇలా అల్లా ఖురాన్ లో అన్నారు. ఇది మాత్రం నాకు తెలుసు.

కానీ 'రబ్-ఉల్-ముసల్ మీన్' అన్నారని ఎక్కడా నాకు కనిపించలేదు. ఈ మాట అసత్యమైతే నాకు తెలపండి. ఇది వినగానే ఆ ముస్లిం ఏ జవాబు ఇవ్వలేక సిగ్గుతో తలవంచుకున్నాడు.

ఈ సమాధానం అత్యంత మర్మమయింది. 'రబ్-ఉల్-ఆల్ మీన్' అంటే విశ్వం యొక్క అధిపతి. 'రబ్-ఉల్-ముసల్ మీన్' అంటే కేవలం ముసల్మానులకే అధిపతి.*

తరువాయి భాగము రేపు చదువుకుందాము.....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹




🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 38 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 38 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

       ఏ గుంతలో అయితే దొంగలు పడ్డారో ఆ గుంతను ఎక్కువగా త్రవ్వించి దాదాసాహెబ్ మహారాజ్ గారు జనం కోసం మంచినీళ్లు త్రాగడానికి బావి కట్టించారు. దానికి "మాణిక్ బావి" అని పేరు పెట్టారు.

   *మాణిక్ నగర్ లో నివసించడానికి బ్రహ్మచర్యం పాటించాలి. ఇక్కడ సహాకుటుంబంతో ఉండడానికి అనుమతిలేదు.

ఈ ప్రదేశం అభివృద్ధి చెందడానికి ఇది ప్రతిబంధకంగా ఉండేది. ఎవరైనా స్త్రీ - పురుషుల సంసార ధర్మం ఈ ప్రదేశంలో జరుగరాదని, ఇలా కోరిక ఉన్నవారు మాణిక్ నగర్ యొక్క సీమ దాటి వెళ్లాలని నియమంగా ఉండేది*.

    ఈ విషయం కోసం ప్రభువు వద్ద ఎవరు అడగాలనే పెద్ద ప్రశ్న మొదలయింది. కానీ అందరికీ మంచి జరిగే సమయం రావడం వలన ఈ విషయం పై నిర్ణయం జరిగే సందర్భం అనుకోకుండా వచ్చింది.

   *తాత్యామహారాజు భార్య సౌ. విఠాబాయి ఆ సమయంలో ఋతుమతి కావడం జరిగింది. అపుడే తాత్యామహరాజు గారు కళ్యాణి గ్రామానికి వెళ్లి ఉండిరి.

ఆయనను పిలిపించాలని దాదామహారాజు గారు లేఖ పంపించారు. తాత్యామహారాజు ఇక్కడకి వచ్చే ఆలోచనలో లేరు. చివరికి లేఖ చేతికి అంది, విషయం తెలియగానే తాత్యామహారాజ్ వెంటనే మాణిక్ నగర్ కి చేరుకున్నారు.

గర్భదాన సంస్కారం ఎక్కడ జరగాలనే చర్చ వచ్చినప్పుడు కొందరు హుమనాబాద్ లో చేయాలని సలహా ఇచ్చారు. ఈ ముఖ్యమైన విషయంపై మాణిక్ నగర్ యొక్క భావితరాభివృద్ధి ఆధారపడి ఉండడం వలన అందరూ సమాధానం కోసం ఆతురతతో ఎదురుచూడసాగారు.

చివరికి ప్రభువు అందరికీ అనుకూలంగా "తాత్యా గురు దర్బార్ కు తన ఆదాయం నుండి ఐదువేల రూపాయలు ఇస్తే ఈ శుభకార్యానికి అనుమతి లభించి ఇకముందు ఎవరైనా పత్నితో ఇక్కడ ఉండడడానికి ఏ విధమైన అభ్యంతరము ఉండదు అన్నారు". ఇది విని అందరికీ సంతోషమైంది. ఈ విధంగా అందరికీ సహాకుటుంబంగా మాణిక్ నగర్ లో ఉండడానికి వీలు కలిగింది.*

    *హిందూధర్మ ప్రమాణంగా గ్రామంలో దేవాలయం తప్పకుండా ఉండాలి. మూర్తివంతమైన దేవునిగా ప్రభువు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నా కూడా నగర కళ్యాణం కోసం ఒక దేవాలయం ఆవశ్యకత కూడా ఉంది. మాణిక్ నగర్ లో పూర్వం ఉన్న సర్వేశ్వర దేవాలయం పునరుద్ధరింపబడింది. దాదామహారాజ్ దేవాలయం పని మొదలుపెట్టారు.



ఒక వడ్రంగి తన బండిపై ఒక పెద్ద నల్లరాయిని తీసుకొనివచ్చి ప్రభు ముందు పెట్టి, "ఇలాంటి శిల దొరకడం చాలా కష్టం. నాకు దొరికింది, అందుకని మీ వద్దకు తీసుకొని వచ్చాను. దీనిని దేవతా శిల్పం చేసి కుర్చోపెట్టండి, మీకు మంచి జరుగుతుంది" అని అన్నాడు. అపుడు ప్రభువు, అతని శుద్ధమైన అంతఃకరణకు మెచ్చి "తాతా నీవు చెప్పినట్టే చేస్తాను.

నీ ఆశీర్వాదంతో నాకు మంచి జరుగుతుంది. ఈ శిలతో శంకరుని లింగము తయారుచేసేవారు వెంటనే దొరికారు. కానీ, ఆయనకు కళ్ళు చాలా రోజులు నుండి కనిపించడం లేదు.

అది తెలిసి ప్రభువు తన అమృత హస్తం అతని కళ్లపై తిప్పగానే కళ్ళు కనిపించాయి. అతను ఉత్సాహంతో మంచి పనితనంతో శంకరుని లింగాన్ని తయారుచేశారు. మహాశివరాత్రి రోజు పెద్ద సమారంభంతో ఆ లింగ స్థాపన జరిగింది. మాణిక్ నగర్ లో పూర్తి రాళ్లతో కట్టబడిన మొదటి కట్టడము ఈ సర్వేశ్వరుని దేవాలయమే.*

   ఈ సర్వేశ్వరుని ఆలయాన్ని మాణిక్ నగర్ లో ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. మాణిక్ ప్రభు సమాధి ప్రక్కనే ఈ సర్వేశ్వరుని ఆలయం ఉంది.

తరువాయి భాగము రేపు చదువుకుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 39  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 39 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

    *ఒక సాధువు తలపై ఒక మారుతి మూర్తిని పెట్టుకొని పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్ర చేశారు. అలా యాత్ర చేస్తుండగా ప్రభువు యొక్క కీర్తి విని మాణిక్ నగర్ కు వచ్చారు. అహోరాత్రులు ఆ మూర్తిని తలపై పెట్టుకొని ఉండేవారు. ఇక్కడకి రాగానే ఆ మూర్తి ఆయనకు బరువుగా అనిపించి ప్రభు ముందుకు వచ్చి ఇలా అన్నారు.

"మహారాజ్ ఈ మారుతికి మీ సన్నిధిలో ఉండాలని కోరిక. రాత్రి నాకు స్వప్నంలో కనిపించి చెప్పిన తర్వాత ఇక్కడకి వచ్చాను. మీరు నా తలపై నుండి ఈ మూర్తిని దించి మీకు ఎక్కడ సరైన ప్రదేశం అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి."*

   *ఆయన వినతి ప్రకారం ప్రభు స్వహస్తాలతో ఆ మూర్తిని దించి ఆయనకు ముక్తి కలిగించారు. వాడాలో తులసీ బృందావనం ఉన్న కట్టపై మొదట మూర్తి పెట్టబడింది. తరువాత దాదామహారాజ్ వారు గ్రామానికి పశ్చిమ దిశలో ఉన్న చిన్న దేవాలయంలో మూర్తి స్థాపన చేయడం జరిగింది. ఈ మారుతికి మొదటి నుండి ఉగ్ర స్వభావం కలవారని ప్రసిద్ధి. ఈ అనుభవం ప్రజలకు కలుగసాగింది.

పూజారి తప్పు పనిచేస్తే అతనికి శిక్ష పడేది. అందువలన ఏ పూజారి ఉండలేకపోయారు. చివరికి ప్రభువు మారుతిని శాంతపరిచి అందరి భయాన్ని దూరం చేశారు. మెల్ల మెల్లగా మాణిక్ నగర్ గ్రామం విస్తరించసాగింది. కళ్యాణి గ్రామానికి చెందిన వారు కొందరు ఇక్కడే ఉండాలని వచ్చారు.*

   *హరినాథ్ ప్రసాద్ అనే కానోజి బ్రాహ్మణుడు ప్రభుసేవ చేయడానికి ఇక్కడకి వచ్చి ఉండిపోయారు.  చిన్నతనంలో ప్రభువుతో అనేక ఆటలు ఆడి వారిని చూసి ఉండడం వలన ప్రభు యొక్క అలౌకిక సామర్ధ్యం తెలియడం వలన ప్రభువు తప్ప ఇతర దైవం లేదని ఆయన భావించేవారు. ప్రభువుపై ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కుటుంబం కూడా మాణిక్ నగర్ లోనే ఉండేది.

భార్య గర్భవతి అవడం వలన ఇతర గ్రామంలో ఉంచాలనే ఆలోచనతో గడవంతి గ్రామంలో స్థలం చూడడానికి వెళ్ళగానే ఇక్కడ భార్య ప్రసవించింది. తిరిగి వచ్చి చూడగానే ప్రభు మహారాజ్ ఆజ్ఞతో అన్ని ఏర్పాట్లు సరైన రీతిలో జరిగాయి.

స్వయంగా ప్రభువే ఆయన ఇంటికి వెళ్లి దీవించారు. తమ ప్రియమైన భక్తుల కొరకు ఎల్లప్పుడూ అభయహస్తం చూపించే ప్రభువు తమను విస్మరించరని భక్తులకు నమ్మకం కలిగింది.*

   *విరజా మరియు గురుగంగా ఈ రెండు చిన్న నదులు మాణిక్ నగర్ కి పూర్వ దిశలో సంగమమయ్యాయి.  ఈ స్థలం చాలా రమ్యంగా ఉంటుంది. వాస్ గీ కల్లప్ప అనే వైశ్య శిష్యుడు సంగమములో శంకరుని మందిరము కట్టించారు. గోసాయి, బైరాగులకు, సాధువులకు ఇక్కడ ఉండడానికి స్థలం ఇవ్వబడింది.

ఈ విధంగా అన్ని రకాల భక్తులకు, జనులకు అనుకూలత ఉండడం వలన ఆకర్షణీయమైన స్థలంగా మాణిక్ నగర్ కనిపించసాగింది. ముసల్మాన్ భక్తుల కోసం నగరానికి ఉత్తర దిశలో కొండపై ఒక స్థలం చూపించి ప్రభు తన టోపీ (తలపాగా) ని ప్రసాదంగా ఇచ్చారు.

ఆ స్థలంలో ఛల్లా (పైకప్పు లేని కట్టడం) నిర్మించబడింది. తనను భక్తితో ఆరాధించే ముస్లిం భక్తుల కోసం ప్రభు ఈ స్థలం నిర్మించారు. ప్రభువుని మహబూబ్ సుభానిగా భావించే ముస్లిం భక్తులు ఇప్పటికి ఇక్కడకి వచ్చి ప్రభు ఉపాసన చేస్తారు.*

తరువాయి భాగము రేపు చదువుకుందాము.....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 40  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 40 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

     *ఒకసారి గుర్రపు బగ్గీలు నడిపేవాడు ప్రభు కీర్తి విని ద్రవ్యలోభంతో మాణిక్ నగర్ కి వచ్చి తన గుర్రము అకస్మాత్తుగా మరణించడం వలన తను, తన భార్యాబిడ్డలు ఉపవాసం ఉండాల్సివస్తోందని కొత్త గుర్రం కొనాలంటే తన దగ్గర డబ్బులు లేవని కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మీ కీర్తి విని వచ్చానని కొత్త గుర్రం కొనుక్కోవడానికి వెయ్యి రూపాయలు నాకు మీరు ఇవ్వాలని ప్రభువుని అడిగాడు. ఈ కపటి తన గుర్రాన్ని దాచిపెట్టి కేవలం ద్రవ్యలోభంతో అబద్దాలు చెపుతున్నాడని ప్రభువుకి ముందే తెలుసు. కానీ, ప్రభువు ఏమీ అనకుండా గుర్రం చనిపోయినందుకు కనికరం చూపించారు.

పరబ్రహ్మ సద్గురువు యొక్క నిత్యానందరూప జెండా మీ ముందు రెపరెపలాడుతుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేసావు? నా దత్త ప్రభువు ఈ గుర్రమే ఏమిటి, ఈ సంపూర్ణ పృథ్వి రాజ్యం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే అడిగేవాళ్ళు కావాలి.

ఇలాంటి ఉపదేశ వచనాలతో సంతోషపరచి రేపు ఉదయం నీకు ఎంత ద్రవ్యం (డబ్బులు) కావాలో అంత దొరుకుతుందని మాట ఇచ్చి రెండో రోజు అతనికి వెయ్యి రూపాయలు లెక్కపెట్టి ఇచ్చారు. అప్పుడు ఆ బగ్గీ వాడికి చాలా ఆనందమై తన బుద్ధి కుశలతకు సంతోషపడుతూ, ప్రభువును స్తుతిస్తూ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.

అంతలో గుర్రం దగ్గర ఉంచిన మనుష్యులు రాత్రి అనుకోకుండా గుర్రం చనిపోయిందని ఆయనకు చెప్పాలని వెతుక్కుంటూ వస్తున్నామని దర్బార్ లోనికి తమ యజమానిని వెతుక్కుంటూ వచ్చారు.*

    *ఆ బగ్గీ వాడి ముఖం నల్లబడింది. ఇప్పుడు ప్రభువు ఏం శిక్ష వేస్తారో అని భయపడుతూ నిలబడ్డాడు. ప్రభు కొంచెం కూడా కోపగించకుండా మంచి మాటలతో అతన్ని సమాధానపరిచారు.

వేయిరూపాయల కోసం గుర్రం చనిపోకపోయినా అబద్దం ఎందుకు చెప్పావు? డబ్బులు కావాలని అడిగితే దర్బార్ లో మీకు దొరికేది కదా! అయినా అయిందేదో అయింది. ఇకముందు ఇలా చేయవద్దు. మీ ఇష్ట ప్రకారంగా మీకు ఎలా కావాలంటే అలా మళ్ళీ గుర్రం కొనుక్కో అని చెప్పి తిరిగి పంపించారు.*

   *ప్రభు వద్ద నిజమైన విషయం చెప్పి ఏదైనా అడిగితే తమ కోరికలు పూర్తవుతాయి అని అందరికీ నిశ్చయంగా తెలిసేది. ఏ స్త్రీకి అయినా తన మర్యాద విషయంలో ఏ పురుషుని నుండైనా ఉపద్రవం కలగరాదని దాదామహారాజ్ వారు దక్షతతో వ్యవహరించేవారు.

ఎవరైనా స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేవారు కాదు. అలా జరిగితే వెంటనే శిక్షించేవారు. ప్రభువు ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు. స్త్రీలు ఏదైనా చెప్పాలనుకుంటే ముందు వెంకమ్మతో చెప్పేవారు.

స్త్రీ ఒక్కరే ప్రభు దర్శనానికి రావడం నిషిద్ధం. రావాలనుకుంటే తన భర్తతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి రావాలి. అలా రాలేకపోతే వెంకమ్మకు విషయం తెలిపేవారు. ప్రభువుకు వెంకమ్మ ఆ విషయం చెప్పి ప్రభు ఆజ్ఞ తిరిగి వాళ్లకు చెప్పేది.*

  ప్రభువు యొక్క భాష మృదువుగా ఉండేది. కోపం అనే తత్త్వం ప్రభు విషయంలో లేదనే చెప్పాలి. ప్రభు సన్నిధిలో రోజులో మూడుసార్లు దర్బార్ జరిగేది.

తరువాయి భాగము రేపు చదువుకుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 41  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 41 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

    జాముకు ఒకసారి వాయించే ఢంకా (నౌబత్) ధ్వని ఇప్పటికీ మాణిక్ నగర్ కు వచ్చే యాత్రికులకు వినిపిస్తుంది. ఇది ఎప్పటినుండి ప్రారంభించబడిందో తెలియదు.

ప్రభు మాణిక్ నగర్ లో నివసించడం మొదలై ప్రభు దర్బార్ శోభ సంతరించుకున్న తరువాత గణేష్ చతుర్థి రోజు ప్రొద్దున ప్రభు కాలకృత్యాలు తీర్చుకొని ఆరుబయట కూర్చున్నపుడు రాజేశ్వర్ గ్రామానికి చెందిన గృహస్థు ఒక చిన్న సుందరమైన గణపతి మూర్తిని తెచ్చి ప్రభు ముందు పెట్టి ఈరోజు గణేష్ చతుర్థి ఉన్నందువలన గురుదర్బార్ లో ఈ ప్రతిమను ప్రతిష్టించి ఉత్సవం చేయాలని కోరికగా ఉంది అని ప్రార్ధించారు. గణపతి చాలా సుందరంగా తయారుచేసినందున, అది చూసి ప్రభు చాలా సంతోషించి ఆయన కౌశల్యాన్ని మెచ్చుకొని గణపతి మా దగ్గరికి ఎలా వచ్చారో అలాగే ఢంకా కూడా తెచ్చుకుంటే పెద్ద ఉత్సవం చేయవచ్చు అన్నారు.

ఇలా అనగానే రెండు మూడు గంటల తర్వాత తూర్పు ద్వారం వద్ద ఢంకా వాయించబడింది. అది ఎవరు వాయించారంటే కళ్యాణి గ్రామానికి చెందిన ఢంకా వాయించే వాళ్ళు ప్రభు వద్ద కొన్నిరోజులు సేవ చేయాలని వచ్చి, తాము వచ్చిన విషయం ప్రభువుకి తెలియాలని వాయించారు.

అందరూ ఈ విషయాన్ని ప్రభువుకి తెలియచేసి గణపతి ఉత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లు చేసి గణపతిని ప్రతిష్టించారు. ఢంకా వాయించే వాళ్లకు భోజన వసతి కల్పించి ఢంకా వాయించే సమయాలు వారికి తెలియచెప్పారు. ఈ విధంగా జాముకు ఒకసారి ఢంకా వాయించడం మొదలయింది.

   నాలుగైదు నెలలు తర్వాత వారు తిరిగి వెళ్ళటానికి ప్రభు అనుమతి అడిగారు. *ఆ సమయంలో అక్కల్ కోట సంస్థానంలో కార్యనిర్వహణ చేసే దాజీసాహెబ్ భోస్లే ప్రభు దర్శనానికి వచ్చారు.

సంస్థానంలో మొదలైన ఢంకా వాయించడం ఆగిపోతుందన్న విషయం విని అది ఎప్పుడు వాయిస్తూనే ఉండాలన్న కోరికతో దాని ఖర్చుల కోసం అక్కల్ కోట సంస్థానం నుండి ప్రతీ నెల ముప్పై రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అది పునః ప్రారంభించడం వారి మూలంగా జరిగింది. అది చివరివరకు వారి వల్లనే నడుస్తుందనే నమ్మకం ప్రభువుకు కలగలేదు. అందుకని ప్రభువు ఇలా అన్నారు. "మాది ఫకీరుల దర్బార్" ఢంకా అవసరం లేదు.

గురుదర్బార్ యొక్క ఢంకా త్రిభువనాలలో ప్రతిధ్వనిస్తుంది. అందుకని దానితో ఈ దర్బార్ కి అవసరంలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఉండనివ్వండి. కానీ, ఈ బాధ్యత చివరివరకు నిలబెట్టుకోవాలి.*

   *దాజీసాహెబ్ భోస్లే గారి ద్వారా మొదలుపెట్టబడిన ఢంకా వాయింపు మూడు నాలుగు సంవత్సరాలు అక్కల్ కోట సంస్థానము ఖర్చుతోనే నడిచింది. కొంతకాలానికి ఆ ఖర్చు రావడం ఆగిపోయింది.

ఎందువల్లనంటే అక్కల్ కోట సంస్థానంలో ఏవో గొడవలు జరిగి దాజీసాహెబ్ అక్కల్ కోట సంస్థానం నుండి విడిపోయారు. కానీ ఒకసారి మొదలుపెట్టిన ఢంకా వాయింపు ఆగిపోకూడదని ప్రభు సంస్థానమే ఆ పద్ధతిని కొనసాగించింది. అది ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.*

   *అక్కల్ కోట రాజావారికి పుత్రుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. సంస్థానంలో కొన్ని గొడవలు కూడా జరుగుతుండేవి. వాటి నివారణ జరగాలని అక్కడి కార్యనిర్వహణ చేసేవారు తరచూ ప్రభు దర్బార్ కు వచ్చేవారు. అలా ఒకసారి ఒకరు ప్రభుపై విశ్వాసంతో ప్రభు వద్ద ప్రార్దుంచడానికి వచ్చారు.

"నేను పిలిచినప్పుడు వస్తే ప్రసాదం ఇస్తాను" అని ప్రభు తెలియచేసారు. తరువాత ప్రభువు నుండి ప్రసాదం తీసుకోవడానికి రావాల్సిందిగా పిలవడానికి వచ్చిన మనిషి తిరిగి ప్రభువద్దకు వెళ్లి ఆయన భోజనానికి కూర్చున్నారని చెప్పాడు.

అప్పుడు ప్రభు "అరే ప్రసాదం వేళ ఆయన పోగొట్టుకున్నారు" అని కూర్చుని ఉండిపోయారు. తరువాత ఆ గృహస్థు ప్రసాదం తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ ప్రసాదం దొరకలేదు. స్వయంగా ప్రభుచేతితో ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం, ఆ యోగం వాళ్లకు లేదు.*

తరువాయి భాగము రేపు చదువుకుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 42  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 42  🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

     ఇంతకుముందు "ఎనిమిది గవ్వలు" ఈ విషయానికి సంబంధించిన సంఘటన విషయంలో చరిత్రకారులందరూ ఒకే విధంగా చెపుతారు. సదాశివరావ్ మన్సబ్ అనే పేరుగల ఒక వృద్ధ గృహస్థు చిడుగుప్ప జిల్లాలో అకౌంటెంట్ గా ఉండేవారు. వారు చెప్పడం వలన ఈ విషయం తెలిసింది.

దాని ప్రకారం ఆ స్త్రీ కంది కిషన్ రావు అనే పేరుగల దేశ్ ముఖ్ గారి పత్ని. ఈ స్త్రీ పుట్టిల్లు హాళిఖేడ్. అందుకని తన వైభవాతిశయంతో పల్లకిలో కూర్చుని తల్లిగారింటికి వస్తుండేది. ఆమె యవ్వనవతియై ఉండెను.

కానీ, సంతతి లేకపోవడంతో పిల్లల కోసం ఆమె ఆశతో ఉండెను. ఆమె ప్రభు యొక్క కీర్తి విని తల్లిగారింట్లో కొన్నిరోజులు ఉండి తరువాత కళ్యాణి గ్రామానికి వెళ్లాలని వచ్చెను. కానీ ప్రభు హాళిఖేడ్ వచ్చారని ఆమెకు తెలియదు.

ఆమె అంతరంగం తెలుసుకొని ప్రభు త్రోవలో కూర్చుని ఉండెను. ఆమె రాగానే ఆమె నుండి ఎనిమిది గవ్వలు తీసుకొని ఆమెకు సంతానం కలుగుతుందని చెప్తారు. ఇది అంతా ముందు చదివిన విషయమే.

   *ప్రభు దర్శనం అనుకోని రీతిలో జరిగి తన కోరిక తీరడం వలన ఆనందంతో ఆమె తన అత్తగారింటికి వెళ్ళింది. అక్కడకి వెళ్లిన తర్వాత ప్రభువుకు గవ్వలు ఇవ్వడం వలన గర్భవతియై పుత్రుడు కలిగాడు.

పుత్రుడు జన్మించిన సంతోషంతో ఆ స్త్రీ తన పుత్రునితో సహా ప్రభు సన్నిధికి వచ్చి దానధర్మాలు చేసింది. తరువాత ఆమెకు ఐదు మంది పుత్రులు జన్మించారు. ప్రభువుపై పూర్తి శ్రద్ధ ఉండడం వలన ఆమె ప్రతీ పుత్రుణ్ణి ప్రభు కాళ్ళవద్ద ఉంచి దానధర్మాలు చేసేది.*

  *ఐదవ పుత్రుని సమయంలో ప్రభు మాణిక్ నగర్ లో ఉండిరి. ఆమె తన ఐదుగురు పుత్రులతో అక్కడకి వచ్చి అత్యంత శ్రద్ధతో ప్రభు పూజచేసి, అన్నదానం చేసి తిరిగి వెళ్లాలని అనుమతి అడుగుతూ నాకు ఇప్పుడు పుత్రులు అవసరంలేదు. ఇపుడు ఉన్న ఈ ఐదుగురు పుత్రులు సంతోషంగా ఉండాలి. నాకు శరీరంలో రోజురోజుకి శక్తిహీనత అనిపిస్తుంది. ప్రసవ వేదన భరించే శక్తి లేదు.

అందుకని దయచేసి పుత్రులు ఇక కలుగకుండా చేయమని అడిగింది. ఇలా చమత్కారంగా అడిగేసరికి ప్రభువుకి నచ్చలేదు. ప్రభువు ఆమెకు అనేకవిధాలుగా నచ్చచెప్పారు. "బాయి ఈ విధంగా నీవు కోరడం మంచిది కాదు.

దత్తుడు నీకు ప్రసాదంగా ఇచ్చే దానిని నీవు తీసుకోవాలి. ఈ విషయాన్ని దూరద్రుష్టితో ఆలోచించు. దొరికిన వరాన్ని కాదనకు. ఈ విధంగా నచ్చ చెప్పినా ఆమె తన పట్టు విడువలేదు. అప్పుడు ప్రభు సరే నీ ఇష్టం అని తిరిగి వెళ్ళడానికి అనుమతించారు.

ఇంటికి వెళ్లిన తర్వాత కొన్నిరోజులకు అకస్మాత్తుగా ఆమె భర్త జబ్బుపడి మరణించారు. అనుకోకుండా జరిగిన ఘటనతో ఆమెకు ప్రభువు మాటలు గుర్తుకు వచ్చి తన పట్టుదల వలన ఇలా జరిగిందని పశ్చాత్తాపపడింది. ఇక చేసేది ఏమి లేకపోవడం వలన ధైర్యంగా సహనం చూపించింది.

తరువాయి భాగము రేపు చదువుకుందాము.....
****



🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 43  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 43 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

    *జయప్ప అనే కంసాలి ఒకరోజు సాయంత్రం ప్రభు దర్శనం కోసం వచ్చినప్పుడు చాలా జన సమూహం ఉంది. కారణం ఆరోజు హుమనాబాద్ వీరభద్రేశ్వరుని జాతర. అందువలన ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల జనం అక్కడకు చేరారు. హుమనాబాద్ కి వచ్చిన వారంతా మాణిక్ నగర్ కి వచ్చారు. చీకటి పడినా జనం మాత్రం తగ్గలేదు. 

ఆ సమయంలో ఒక వృద్ధ కంసాలి తన కుటుంబంతో అక్కడకి వచ్చారు. వారి వయస్సు సుమారు 79 సంవత్సరాలు. అతను యాభై మంది కుటుంబ సభ్యులతో ప్రభు దర్శనానికి వచ్చారు. అందరూ ప్రభు దర్శనం చేసుకున్నా కానీ, ఆ వృద్ధునికి మాత్రం ప్రవేశం దొరకలేదు. వారు దూరం నుండే దర్శనం చేసుకోవాలని అనుకున్నారు.* 

   *చీకటి పడుతుండగా ప్రభు ద్రుష్టి ఆ వృద్ధ కంసాలిపై పడి, వారిని ప్రభువు తమ దగ్గరికి పిలిపించుకున్నారు. ఆయన వచ్చి ప్రభు కూర్చునే కట్టకు ప్రక్కగా నిల్చుని చేతులు జోడించి నమస్కారం చేస్తుండగా ప్రభు ఆయన కుడి చేతికి కట్టబడిన పట్టువస్త్రంలో ముడివేసిన చిన్న బంగారుపెట్టె తీసుకున్నారు. 

దాంట్లోంచి మడిచి పెట్టబడిన కాగితాన్ని తీసి దీపం ముందు చదువసాగారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ వృద్ధ కంసాలి ప్రభు ప్రేమకు ముగ్ధుడయ్యెను. ఆ వృద్ధ కంసాలి లాడవంతిలో ఉండగా మనోహర మహారాజుల వారు తనకు మోక్షప్రాప్తి కలిగించే ఈ వస్తువును ఇచ్చి దానిని తన పుత్రునికి చూపించమన్నారు. 

కానీ, ప్రభు ఏ విషయం అడగకుండా, పరిచయం లేకుండా, సంబంధం లేకుండా తన వద్ద నుండి ఆ వస్తువుని తీసుకున్నారని అతనికి ఆశ్చర్యం కలిగింది.*

    *మనోహర మహారాజుల వారు తన పుత్రునికి చూపించవలసిందిగా చెప్పారు. కానీ, ప్రభువే మనోహర మహారాజుల పుత్రులనే ఆలోచన కూడా కంసాలికి కలుగలేదు. 

ఎందుకంటే ప్రభు జన్మించగానే ఆ గృహస్థు తన కుటుంబంతో సోలాపూర్ కి వెళ్ళిపోయారు. ప్రభు పేరు మాణిక్ ప్రభు అని ఆయనకు తెలియదు. మాణిక్ ప్రభు కళ్యాణిలో ఉన్నారని తెలిసి కులదేవతను దర్శించుకొని వెళ్తూ వీరభద్రుని యాత్ర చేసి కళ్యాణికి వెళ్లి మనోహరమహారాజు గారి పుత్రుని కలవాలని అనుకొని ఉండెను.*

   *ప్రభు పూర్తి కాగితం చదివిన తరువాత ఆశ్చర్యంగా చూస్తూ దగ్గర ఉన్న వాళ్ళ ముఖాలను చూడసాగారు. అప్పుడు వాళ్లకు ఆ కాగితంలో ఏదైనా మహత్తరమైన విషయం ఉందేమో అనిపించింది. 

కానీ ప్రభువుకు విస్మయం కలిగించే విషయం ఆ కాగితంలో ఏముంది? అని అడగడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. తాత్యాసాహెబ్,  గోవిందశాస్త్రి అనే పేరుగల ఒక బ్రాహ్మణునితో యోగశాస్త్రానికి సంబంధించిన వాదవివాదం చేస్తూ కూర్చుని ఉండిరి. 

ఆయన అప్పటికి ప్రభు ఏముందో అని చూడగా అది మనోహరమహారాజుల వారు ప్రభు యొక్క జన్మ పత్రిక వ్రాసి ఉంచారని దానిలో ప్రభువు యొక్క పూర్తి భవిష్యత్తు వ్రాయబడిందని వాళ్లకు తెలిసింది.*

తరువాయి భాగము రేపు చదువుకుందాము...... 

ఓం సాయిరామ్ 

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 44  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 44 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

     *పూర్తి పత్రిక చదివిన తరువాత దాని విషయంపై చర్చ జరుగకూడదని ప్రభు ఆ కాగితాన్ని వారి చేతిలో నుండి తీసుకొని దీపానికి పైన పెట్టి బూడిద చేసి ఆ బూడిదను భస్మంగా నుదిటికి వ్రాసుకున్నారు. అది చూసి తాత్యాసాహెబ్ గారు ఏం చేస్తున్నావు? 

ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని కావాలని ఎందుకు లేకుండా చేస్తున్నావు? అంటూ తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు. కాని ప్రభు ఆ లేఖ ఉండకూడదని సమాధానపరిచారు.*

    *"మన తండ్రి మన జాతకం తయారుచేసి అందరికీ తెలియాలని వ్రాసిపెట్టారు. దాని ప్రకారం ఇప్పుడు జరిగితే ఆ లేఖ నిజమౌతుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఆ కారణంగా జనంలో అపవాదు వస్తుంది. మరి సద్గురువుకు మనం ఇంత ప్రతిబంధకం ఎందుకు కలిగించాలి? 

గుప్తంగానే ఉంటే మంచిది" అన్న ప్రభు మాటలు వినగానే ఆ కంసాలి యొక్క సంశయాలు పటాపంచలయిపోయాయి. మనోహర్ నాయక్ యొక్క పుత్రుడే ఈ మాణిక్ ప్రభు అని, వారిదే ఈ జన్మ పత్రిక అని కంసాలికి అప్పుడు తెలిసింది.*

    *తనకు మోక్ష మార్గం దొరుకుతుందో లేదో అనే శంక దూరం అవడం, ప్రభు యొక్క అంతర్ జ్ఞానం యొక్క ప్రత్యక్ష అనుభవం జరగడం మరియు మనోహర మహారాజుల వారు చెప్పిన దానికంటే ఎక్కువ సమర్ధత ప్రభువులో కనిపించడం వల్ల పరమార్ధ సాధనయే కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగించమని అడగాలని ఆయన ఆలోచించసాగారు. అక్కడ ఏది జరగాలో అదే జరుగుతుంది. 

తండ్రి మీ కోసం తయారుచేసిన లేఖను మీరు ఎందుకు లేకుండా చేశారు? భక్తుడు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే, సద్గురువుగా దానిని పూర్తి చేయాల్సిన మీరు అనవసరంగా ఎందుకు శంకిస్తున్నారు? ఇలా తాత్యాసాహెబ్ గారు ప్రభుతో అంటూ బాధపడసాగారు.*

    *తాత్యాసాహెబ్ వారి మాటలకు అక్కడే ప్రక్కన ఉన్న గోవిందశాస్త్రి అనే వ్యక్తి మద్ధతు ఇచ్చారు. ఆయన విద్వత్ బ్రాహ్మణుడై ఉండెను. వారు ఇలా అన్నారు. "కృష్ణ పరమాత్మ శస్త్రాలు ఉపయోగించనన్న శపథాన్ని భీష్మాచార్యుల కోసం విరమించవలసి వచ్చింది. 

రామావతార పూర్తి చరిత్ర కోయవాడైన వాల్మీకి కల్పనతో వ్రాయబడిన గ్రంథ ప్రమాణంగా పరమేశ్వరుడైన రామునికి మానవరూపం ధరించాల్సివచ్చింది. ఇలా యుగయుగాలుగా సంప్రదాయం నడుస్తూ వస్తుంది. 

మనోహర మహారాజ్ వ్రాసి పెట్టిన లేఖను కాల్చడానికి ఎవరు సమర్థులు? దానిని మీరు నిజం చేయాల్సింది. ఎందుకు కాల్చారు?" అనగానే ప్రభు ఇద్దరిని సమాధానపరిచారు. అప్పుడు ఆ కంసాలి మాట్లాడసాగాడు.*

    *"ప్రభు మహారాజ్ మీ తండ్రి వ్రాసిపెట్టిన విధంగా మీ చేతులతో ఏది కావాలో అది తనకు తానే అవుతుంది. కానీ, ఆయన ఇచ్చిన మాట మాత్రం మీరు ఇప్పుడే పూర్తి చేయాలి. వయస్సు 75 సంవత్సరాలు గడిచిపోవడం వలన జీవితం యొక్క భరోసా కనిపించడం లేదు. 

మనోహర్ మహారాజ్ వారితో నా ఋణానుబంధం ఎంతటిదో నా మనస్సుకు తెలుసు. మీ మాతృశ్రీ బయమ్మకు గుర్తు ఉండే ఉండవచ్చు. ఆ తండ్రి ధన్యులు. మీ వంటి పుత్రరత్నాన్ని లోకకళ్యాణం కోసం ఉత్పన్నం చేసి తాను మాత్రం ఎప్పుడో స్వర్గానికి వెళ్లారు." 

ఇలా కంసాలి అమాయకంగా మాట్లాడింది విని ప్రభువుకు ఆయనపై ప్రేమ కలిగింది. దానికి కారణం తండ్రి ఏం చెప్పారో ప్రభువుకు ముందే తెలుసు. అయినా కూడా తండ్రి ఏం మాట ఇచ్చారో చెప్పమని కంసాలిని అడిగారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పారు.*

తరువాయి భాగము రేపు చదువు కుందాము...

*****
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 45  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 45 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

      *అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పారు. మీ తండ్రి వలన మాకు ఉపకారం జరిగింది. ఆయన చెప్పడం వలన నేను లాడవంతి విడిచి సోలాపూర్ కి వెళ్ళి సుఖంగా సంసారం చేస్తూ ఉన్నాను.

పుత్రులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో సంతోషంగా కాలం గడిపాను. పరమార్ధం లభించడానికి ఏదైనా దారి చూపించండని అడిగితే ఆ రోజులు ముందు ఉన్నాయని ఎప్పుడూ అనేవారు.

మీరు జన్మించిన రోజు మధ్యాహ్నము రెండు గంటల సమయంలో ఈ జన్మ పత్రిక తయారుచేసి నాకు ఇచ్చి, జాగ్రత్తగా ఉంచి ఉపనయనము అయిన తరువాత నీకు వీలయినపుడు వెళ్లి కలిసి ఇది చూపించు, అప్పుడు నీ కోరిక పూర్తవుతుందని నాతో అన్నారు.

నేను సోలాపూర్ కి వెళ్లిన తరువాత ఆయన కూడా లాడవంతిని విడిచి వెళ్ళిపోయి కళ్యాణిలో నివసించారని అక్కడే దేహత్యాగం చేశారని విన్నాను. అప్పుడు మీ దర్శనానికి రావాలని అనుకున్నాను, కానీ, ఇంట్లో కొన్ని కారణాల వలన రాలేకపోయాను.

తరువాత వీలు చేసుకొని రావాలనుకున్న వేళలో మీరు ఎవరినో వెంట తీసుకొని పండరిపురం వెళ్ళారని తెలిసింది. అందుకని రాలేకపోయాను. అందరూ అంటే మీ తాత గారింట్లో కూడా దేశాంతరం వెళ్ళారని తెలిసి నిరాశ చెందాను.*

   *వీరభద్రుడు (హుమనాబాద్) మా కులదేవత అవడం వలన చాలా రోజులుగా రావడం కుదరక కుటుంబసభ్యులందరితో దర్శించుకుందామని ఇలా వచ్చాము.

మనోహర్ నాయక్ యొక్క చిరంజీవులు మీరే అని నాకు తెలియదు. కళ్యాణ్ లో మాణిక్ ప్రభు అనే పేరుగల సాధు మహనీయులు ఉత్పన్నం అయ్యారని, వారే ఈ గ్రామాన్ని తయారుచేశారని నిన్ననే నాకు తెలిసింది.

నేనే తిరిగి వెళ్లేముందు కళ్యాణికి వెళ్లి మిమ్మల్ని వెతకాలని మరియు వెళ్తూ వెళ్తూ ఈ కొత్త సాధు యొక్క దర్శనం చేసుకోవాలని ఈరోజు ఉదయం ఇక్కడకి వచ్చాను, మీ నాన్నగారి ఆశీర్వాద ప్రభావంతో ఆయాచితంగా మీ దర్శనం దొరికింది. ఇదంతా చెప్పేసరికి ఆ వృద్ధుడు అలసిపోయాడు.

మరియు తన తండ్రిపై ఆ వృద్ధునికి ఉన్న భక్తికి ప్రభు సంతృప్తులై ముందుగా అతనిని క్రింద కూర్చోపెట్టి వారితో మృదు మధురమైన స్వరంతో, తండ్రి మిత్రుడు తండ్రితో సమానులు. మీ వంటి వారికి మా వంటి పిల్లలు ఏమి ఉపదేశం ఇవ్వాలి.

వృద్ధులు జగత్తులోని మంచి, చెడు రెండు విషయాలను వేల సంఖ్యలో అనుభవించి ఉండడం వలన ముందు దారి దానికదే కనిపిస్తుంది. ఇప్పటి కాలంలోని మాకు జగత్తంటే ఏమిటో తెలియదు. మేమెలా ఇతరులకు పరమార్ధానికి దారి చూపించాలి?*

     *ప్రభు మాటలు విని మధ్యలో ఆ వృద్ధుడు "మహారాజ్! ఈ సమయంలో మీరు ఏదో సత్పురుషుడని లేదా మనోహరబాపు పుత్రులని మీపై భారం వేయట్లేదు.

నాకు తప్ప ఇతరులకు తెలియని ఎన్నో జరిగిన విషయాలను మీరు సరిగ్గా గుర్తు పట్టడం వలన మీరు సర్వ వ్యాపకమైన పరమేశ్వరులని నాకు నిశ్చయంగా తెలిసింది.

మీ వాస్తవిక స్వరూపం తెలిసింది. నాకు ఒక విన్నపం చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఈ వయస్సులో జపతపాలు, నియమనిష్ఠలు, అనుష్టానాలు సాధ్యం కావు. అలాంటి మార్గంలో కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగే మార్గం చెప్పండి. మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను.

నేను తిరిగి వెళ్లి మాత్రం ఏం చేస్తాను? ఎప్పటివరకు మీ ఈ అసామాన్య సామర్ధ్యయుక్తమైన సగుణమూర్తి నా ద్రుష్టి ముందు ఉంటుందో అప్పటివరకు మీ పాదాల వద్ద ఉండి నా దేహాన్ని అర్పిస్తాను.

ఈ విధంగా ఆ వృద్ధుని పట్టుదల, అమాయకత్వం అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం కలిగించింది.*

   *ప్రభువు మాత్రం నవ్వుతూ ఇలా అన్నారు. ఈ విధంగా తమకు కావాలని పంతంతో మోక్షప్రాప్తి కోసం పట్టుబట్టే వారికి ముక్తిని ఇవ్వడం కష్టమైన పని కాదని, వారు మనస్సులో అనుకోగానే ముక్తి లభించినట్లే అంటూ ఆ తరువాత గౌరవంతో వినయపూర్వకంగా ఆ అమాయక కంసాలితో మళ్ళీ ప్రభు ఇలా అన్నారు.

"మా యొక్క తీర్థ రూపంపై మీకు ఇంతటి నిష్ఠ ఉంటే ఇలా చేయండి. అయినంత తొందరలో సోలాపూర్ కి వెళ్లి ఇప్పటివరకు సంపాదించిన సంపదను ఆప్తులకు మీ ఇష్టానుసారంగా యోగ్యత తెలుసుకొని పంచండి.

వాళ్లలో మీ తరువాత మనస్పర్థలు, కొట్లాటలు రాకుండా పంచండి. ఆ తరువాత మీ మనస్సు సంతృప్తి చెందితే మీ కోరిక పూర్తి అవుతుంది. ప్రభు ఆజ్ఞను కంసాలి ఆనందంగా ఒప్పుకున్నారు.*

   *రెండు రోజులు ఆ వృద్ధుడు మరియు అతని కుటుంబము సంతోషంగా గడిపే ప్రభు వద్ద ప్రసాదం తీసుకొని తిరిగి వెళ్లారు. తరువాత ప్రభు ఆజ్ఞానుసారం తన సంపదను పంచి, 'ఇప్పుడు నేను నిజంగా మనోహరమహారాజ్, మాణిక్ ప్రభు వచనానుసారం ముక్తుడనయ్యాను'.

ఈ మాటలు ఆయన నోటి నుండి వెలువడగానే బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఆయన సంపదను పంచిన రోజే జరిగింది. ఇతని వంశం వారు ఇప్పటికి ధనకనక సంపన్నులై ప్రభు సంస్థానానికి వస్తూ వారి శక్త్యానుసారంగా సేవ చేస్తూనే ఉన్నారు.*

తరువాయి భాగము రేపు చదువు కుందాము....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹

🙏🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 46  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 46 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

     *ప్రభువు ఒకరోజు స్నానం చేస్తుండగా ఒక వృద్ధురాలు తనతో పాటు తన ఏడుగురు పుత్రులను తీసుకొని దర్శనానికి వచ్చింది. అందరికంటే పెద్దవాడికి సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి.

ఒక పుత్రునికి ఇంకొక పుత్రునికి మధ్య సుమారు రెండు సంవత్సరాల తేడా ఉంటుంది. ఆమె బలంగా పుష్టిగా ఉండేది. ప్రతీ ఒక్కరి తలపై గాజర్ లను మూటగా పెట్టి తనతో తీసుకొని వచ్చారు.

ఆ వృద్ధురాలికి సుమారు అరవై సంవత్సరాల వయస్సు ఉండెను. ఆమె ప్రభువును ఎప్పుడు చూస్తానా అన్న ఆత్రుతతో ప్రభు వద్దకు వెళ్ళింది.*

    *ప్రభువు ముఖాన్ని చేతితో స్పృశిస్తూ ప్రేమాశ్రువులతో ప్రభువుకు స్నానం చేయించింది. దగ్గర ఉన్నవాళ్ళు వద్దన్నా ఆమె వారి మాట వినకపోయేసరికి ప్రభు వాళ్లందరితో ఆమెను ఏమి అనవద్దని చెప్పారు.

ప్రేమాతిశయంతో నిండిన ఆమె మనసును ప్రభు తెలుసుకొని ఆనంద పరవశులయ్యారు. ఈ సన్నివేశం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. ఆమె మనస్సు శాంతించిన తర్వాత దగ్గర ఉన్నవాళ్లు అడిగితే ఇలా చెప్పసాగింది.*

   *"నేను ఎన్ని సంవత్సరాలనుండో వీరిని వెతుకుతున్నాను. కానీ వీరెక్కడ ఉన్నారో తెలియలేదు. వీరు మా లాడవంతి బచ్చమ్మ యొక్క మనుమడు రత్నాభావు అని తెలుసు.

లాడవంతిలో ఉండగా చాలా చిన్నవాడు అంటే ఐదు సంవత్సరాలు ఉండేవి. అప్పుడు నా తలపై ఉన్న బుట్టలోనుండి ఏడు గాజర్ లను తీసుకొని నాతో, "నీకు ఏడుగురు పుత్రులు కలుగుతారు" అని చెప్పారు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి ఇంకా తీసుకోమని బుట్ట చూపించాను.*

   *కానీ, తను "తీసుకున్నది చాలు" అన్నారు. తరువాత నాకు ఏడుగురు పుత్రులు జన్మించారు. ఇప్పుడు వాళ్ళని దర్శనానికి తీసుకొని వచ్చాను. రత్నాభావు లాడవంతి నుండి కళ్యాణికి వెళ్లారు. నేను వారిని కలువలేకపోయాను. తరువాత ఇక్కడకి వచ్చారని తెలిసి నా పుత్రులను తీసుకొని వచ్చాను. నా కోరిక తీరింది. ఎప్పుడు వారిని కళ్ళనిండా చూస్తానో అనిపించింది.

బాబా నీవు నిజంగా దేవుడవే! ఆ వృద్ధురాలి అంతఃకరణలో నిండిన ప్రేమామృతంపై ప్రభువుకి తృప్తి కలిగింది. భక్తుల నిష్కపట ఉజ్వల ప్రేమ ప్రభు యొక్క ఆనందసాగరంలో భర్తీ కావడానికి కారణభూతం అవుతుంది.

ఇది ఈ సమయంలో అనుభవపూర్వకమయింది. ప్రభు ఆనందంతో ఆ పుత్రులను చూస్తూ వినోదంతో అందరూ పుత్రులు గాజర్ లాగే కనిపిస్తున్నారు కదూ! అన్నారు.*

   *ప్రభు వారు తలపై పెట్టుకొని తెచ్చిన గాజర్ లను భండారుఖానాలో ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించి, వండుకోవడానికి సామాగ్రి ఇచ్చి ఆ వృద్ధురాలిని భోజనం తయారుచేసుకోమని చెప్పారు.

భోజనం అయిన తరువాత చీర, జాకెట్ బట్ట ప్రసాదం ఇచ్చి సంతుష్టమైన మనస్సుతో ఆమెను సాగనంపారు. ఈ విధంగా ప్రభు బాల్యంలో జరిగిన లీలలు సహజసిద్ధంగా ప్రకటితం అవసాగాయి.*

 గాజర్ లు అంటే carrots.

తరువాయి భాగము రేపు చదువు కుందాము....


🙏🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 47 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 47 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

      హుమనాబాద్ లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు సతీ సమేతంగా నివసించేవారు. ఆయన మంచి మాటకారి అయి ఉండెను. అందుకని ప్రభు ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవారు. రాత్రి రెండు గంటల వరకు వేదాంత విషయాలు మాట్లాడుతుండేవారు. 

ఆయన మాటలు ప్రభువుకి మనః పూర్వకంగా ఇష్టం అవడం వలన అదే రీతిగా ఆ బ్రాహ్మణుడు నడుచుకొనేవారు.*

   *ఆ బ్రాహ్మణుడి భార్య పతివ్రతయై, సుశీలయై ప్రభువుపై పుత్రప్రేమను చూపించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవడం వలన దిగులుతో ఉండేది. 

ఒకరోజు ఈ వృద్ధ దంపతులు ప్రభు ముందు కూర్చున్నపుడు మహాసాధ్వి వెంకమ్మ ప్రభు దర్శనానికి వచ్చింది. ప్రభు చరణాలపై తలవంచి నమస్కరించి చేతులు కట్టుకొని ముందు నిలబడింది. 

అప్పుడు ప్రభు "వెంకే! నాలుగు రోజులు కనిపించలేదు ఎందుకని?" అని అడిగారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది. మహారాజ్! పూర్వ పాపం వలన నెలలోని నాలుగు రోజులు మీ యొక్క ప్రత్యక్ష పాదుక దర్శనం కలగదు. దీనికి ఏదైనా ఉపాయం చూపిస్తే నాకు ఆనందం కలుగుతుంది. 

వెంకమ్మ యొక్క మాటలు విని ప్రభువు ఇలా అన్నారు. "వెంకే! నీకు విసుగు అనిపిస్తే మనస్సులో ఎవరికైతే కోరికగా ఉందో వాళ్లకు ఇచ్చివేయి. అప్పుడు ప్రభువు, వెంకమ్మకు వృద్ధ బ్రాహ్మణ స్త్రీని చూపిస్తూ ఆమె చేతిపై నీటిధారను విడువు అనగానే వెంటనే వెంకమ్మ చేతిలో నీరు తీసుకొని ఆ స్త్రీ చేతిపై విడిచింది. 

తరువాత నెల తిరగగానే ఋతుమతి అయ్యే బాధ నుండి వెంకమ్మకు ముక్తి లభించింది. తిరిగి ఋతుమతి కావడం జరగలేదు. ఆ వృద్ధ సాధ్వి నెల తిరగగానే  ఋతుమతి అయింది.*

    *ఈ చర్య చూసి అందరికీ ముఖ్యంగా ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. కానీ ఇంకా విశేషమైన విషయం తరువాత జరిగింది. ఆ స్త్రీ మూడు నెలలు ఋతుమతి అయిన తర్వాత నాలుగవ సారికి గర్భవతి అయి పది నెలలు అయిన తర్వాత సుందరమైన పుత్రునికి జన్మనిచ్చింది. 

అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులు సంతోషం పట్టలేకపోయారు. ఆ స్త్రీకి సుమారు 60 సంవత్సరాలు. ఆ వృద్ధుడు 75 సంవత్సరాల వయస్సు కలవారై ఉండెను. అయినా ప్రభు కృపతో పుత్రుడు జన్మించాడు. 

వారి సంతోషం చెప్పనలవి కాలేదు. అందరికి ఆశ్చర్యం కలిగి ప్రభు సామర్ధ్యం, కీర్తిని వర్ణన చేయసాగారు. ఆ స్త్రీ ఆ పుత్రునికి 'మాణిక్' అని పేరు పెట్టింది.

    హుమనాబాద్ లో మాణిక్ భట్ అనే పేరుగల వృద్ధ బ్రాహ్మణుడు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉండేవారు. వీరి వద్ద ప్రభు గాది ఉంది. 

వీరు ప్రభు నవరాత్రులు చేసేవారు. వీరిని అనేకమంది పూజ్యనీయులుగా చూసేవారు. ఈయనకు శిష్యులు కూడా ఉండేవారు. ఆ వృద్ధ దంపతుల పుత్రుడే ఈ మాణిక్ భట్.*

తరువాయి భాగము రేపు చదువు కుందాము......

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹🌹🌹🌹🌹


🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 48  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 48  🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

      భాల్కి గ్రామం గురించి ఇంతకుముందు మనం చదువుకున్నాము. భాల్కి గ్రామ నాయబ్ తహసీల్దార్ ఆబారావ్, ప్రభువుకు పరమభక్తులు ఎలా అయ్యారో వివరిస్తున్నాం.

   ఆబారావ్ తరచూ ప్రభు దర్శనానికి వస్తూ విశేషమైన రోజులలో మాణిక్ నగర్ లో నివసించేవారు. ఒకసారి భాల్కి తాలూకాలో వసూలు నిమిత్తం జమ అయిన పదివేల రూపాయలు హైదరాబాద్ లోని నవాబ్ కి ముట్టచెప్పడానికి తానే ఒంటెపై తీసుకెళ్లవలసి వచ్చింది.

   హైదరాబాద్ వెళ్ళడానికి ముందు ప్రభు దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్లాలనే ఉద్దేశ్యంతో మాణిక్ నగర్ కి వచ్చారు. 

ఆ రోజు ముస్లింల 'గ్యారవి' పండగ ఉండెను. అందుకని దానం చేయడానికి ప్రభు దర్బార్ లో కూర్చుని ఉండిరి. ప్రభు వద్ద అడిగేవారు ఫకీరులు చాలామంది పోగయి ఉండిరి. ప్రభు ఎప్పటిలాగే దర్బార్ లో దర్పంతో గాదిపై కూర్చుని దానం చేస్తూ ఉన్నారు. 

అతి కష్టంతో ప్రభు వద్దకు దారి చేసుకొని ఆబారావ్ నాయబ్ గాది దగ్గరకి వెళ్లి ప్రభువుకి నమస్కరించారు. అప్పుడు రావడానికి గల కారణం ఖజానాను హైదరాబాద్ కి తీసుకువెళ్తున్నానని చెప్పారు.

    అప్పుడు ప్రభువు, ఒంటెపై ఉన్న పూర్తి నగదును తనవద్దకు తీసుకొని రావాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారం పూర్తి నగదును ప్రభు ముందు గుమ్మరించారు. సంతుష్ట మనస్సుతో ప్రభు నవ్వుతూ ఆ పూర్తి నగదును దానం చేసి ఖర్చు చేశారు. 

ఇది ఆబారావ్ నాయబ్ కు పరీక్ష అయ్యెను. ఖజానాకు సంబంధించిన నగదును ఇతర ఉపయోగాలకు తీసుకుంటే దాని పరిణామం అతనికి తెలుసు. కానీ అతను జంకలేదు. 

తన భక్తులను ప్రభు ఉరికంబం ఎక్కిస్తారని ఆ నిర్మలమైన మనస్సుకి అనిపించలేదు. సర్వ సంకట పరిస్థితుల నుండి రక్షించడానికి సమర్ధుడు ప్రభువే అని దృఢ నమ్మకం ఉండడం వలన మాట్లాడకుండా నిశ్చింతగా కూర్చున్నారు.

   కరుణామయుడైన ప్రభువు అతని నిష్ఠను చూసి సంతుష్టులయ్యారు. కానీ నిజమైన పరీక్షా సమయం తరువాత ఉండడం వలన ప్రభు ఏమీ మాట్లాడలేదు. 

మరుసటిరోజు ప్రభు వద్ద ప్రసాదం తీసుకొని తిరిగి భాల్కి వెళ్లారు. ఆ సమయంలో ఇప్పటిలాగా కాగితాలలో వ్రాసేవారు కాదు అయినా ఇలా సర్కార్ నగదును ఖర్చు చేయడం చాలా తప్పు. ఈ విషయం అతనికి తెలుసు. పూర్వం ప్రతి ఒక సర్కార్ కచేరిలో 'అఖబార్ నవీస్' అనే వారిని నియమించే వారు. ఆ విధంగా భాల్కిలోను ఉండిరి. 

ప్రతిరోజు జరిగిన విషయాలను నవాబ్ సాహెబ్ కు తపాలలో తెలియచేయడం వారి పనిగా ఉండేది. ఆ విధంగా పై పూర్తి విషయాన్ని వ్రాసి పంపించారు. నవాబు కోపంతో ఇప్పటికిప్పుడే నాయబ్ ను బంధించి తన ముందుకు తీసుకురావాల్సిందని, అందుకోసం గుర్రమును పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు. 

ఇతర జనం ఆబారావ్ ను దూషించసాగారు. ఇలాంటి విషమ పరిస్థితిలో ఆయన ఎలా జీవిస్తారో అని మాట్లాడుకోసాగారు. ఇంతలో మరొక తపాలా వస్తే దానిని తీసిచూస్తే తెలిసిందేమిటంటే, భాల్కి యొక్క నాయబ్ పదివేల రూపాయలు పంపిస్తున్నట్టుగా వ్రాసి ఉంది.

   ఇది విని నవాబుసాహెబ్ చల్లబడ్డారు. అదే సమయంలో ప్రభువు దగ్గర ఉన్న ఆబారావ్ ని ప్రభువు 'సర్కార్ వారి నవాబ్ సాహెబ్' దగ్గరకి వెళ్ళు, భయపడకు', అని చెప్పి పంపించారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం నిర్భయంగా వెళ్ళాడు. 

అక్కడకి వెళ్ళిన తరువాత అతనికి తెలిసింది, నవాబ్ సాహెబ్ తనకు ప్రమోషన్ ఇచ్చారని, శాలువా మరియు ఉత్తమ ప్రశంశాపత్రము కూడ ఇచ్చారని తెలిసి అతను ఎంతో సంతోషించారు. ప్రభువు లీలని మనస్సులో కొనియాడారు.

తరువాయి భాగము రేపు చదువు కుందాం..... 

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 49  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 49 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

        తుకారాం అనే పేరుగల ఒక గొల్లవాడు ప్రభు భక్తుడై ఉండెను. ఇతనికి వ్రాయడం, చదవడం కొద్దిగా వచ్చును. ఇదే విషయం ప్రభు వద్ద విన్నవించుకున్నాడు. 

వాడి అమాయకత్వానికి ప్రభువుకు సంతోషమై అతనికి 'ఆత్మరూప ప్రతీతి' అనే పుస్తకాన్ని ఇచ్చి దానిని అనేకసార్లు పారాయణం చేయవలసిందిగా చెప్పారు.

    ఈ 'ఆత్మరూప ప్రతీతి' పుస్తకం అతి చిన్నగా ఉండెను. అది తుకారాం కోసమే ప్రభు వ్రాసారని కొందరు అంటారు. అతను ఆ గ్రంథాన్ని ఇష్టంగా తీసుకొని చదవడానికి ప్రారంభించాడు. కానీ ఎన్ని రోజులు పారాయణం చేసినా ఆత్మరూప సాక్షాత్కారం జరగడం లేదని ఒకరోజు ప్రభు సన్నిధికి ఆ గ్రంథాన్ని తిరిగి తీసుకొని వచ్చి మహారాజ్! ఈ గ్రంథం యొక్క అర్ధం నాకు తెలియడం లేదు. మీరు చెప్పినట్లుగా పారాయణం చేసి నాకు కంఠస్థం అయింది. కానీ, ఆత్మరూప సాక్షాత్కారం జరుగలేదు. 

ఇలా నన్ను ఎందుకు పారాయణం చేయమని విసిగిస్తున్నారు. దీనితో నాకు పనిలేదు, మీరు సాక్షాత్ దేవుడు. నేను ఈ గ్రంథం వెంట పడను. మీరే ఈ గ్రంథాన్ని జాగ్రత్త చేయండి.

    అతని అమాయకత్వానికి ప్రభువుకి నవ్వు వచ్చింది. అప్పుడు తీయని మాటలతో సముదాయించి భండారుఖానాకు వెళ్లి జోళి ప్రసాదం తీసుకొని రావాల్సిందిగా చెప్పారు. ఆ విధంగా ప్రసాదం తీసుకోవడానికి భండారుఖానాకు వెళ్తూ తన కంబళిని ప్రభు వద్ద ఉంచి వెళ్ళాడు. 

అతను వెళ్లిన తరువాత ప్రభు ఆ కంబళిని తమ శరీరంపై కొద్దిసేపు వేసుకున్నారు. ఆయన ప్రసాదం తీసుకొని వచ్చిన తరువాత తిరిగి కంబళిని అతనికి ఇచ్చి వేశారు.

    తుకారాం కంబళిని తన శరీరంపై వేసుకొని కూర్చోగానే అతని చిత్తవృత్తి లయమై సమాధి స్థితికి చేరుకున్నాడు. ఆత్మరూప సాక్షాత్కారం అంటే ఏమిటో దాని ప్రత్యక్ష అనుభవం ఒక క్షణంలో తుకారాంకి కలిగింది. 

కంబళి కప్పుకొని ఆనందానుభూతిలో లీనమై తన్మయత్వ స్థితిలో ఉండిపోయాడు. ప్రభు ఇలా అడిగారు, 'తుకారాం నీకు ఏమయింది?', "మహారాజ్! నాకు ఏం కావలసి ఉండెనో, అది దొరికింది అన్నాడు. నేను ధన్యుడనయ్యాను".

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏 

సశేషం.. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 50  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 50 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

       ప్రభు మాణిక్ నగర్ లో నివసిస్తున్నారనే విషయం అన్ని దిక్కులకు వ్యాపించింది. తమ రాజ్యానికి భూషణంగా ఉన్న ప్రభు యొక్క కీర్తి అప్పటి శహన్ షా ఆలహజరత్ అఫ్జల్ చెవినపడెను. కానీ ఆయనకు ప్రభువును దర్శించుకోవాలన్న కోరిక ఎలా తీరుతుంది? 

ప్రభు అయినా హైదరాబాద్ కి వెళ్ళాలి లేదా అఫ్జల్ అయినా ప్రభు వద్దకు రావాలి. ఈ రెండింటిలో ప్రభువునే హైదరాబాద్ కి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నిజాం ప్రధానియైన సర్ సాలార్ జంగ్ బహదూర్ గారు, నిజాం సైన్యంలో అరబ్బుల కంపెనీలో నమ్మకస్తుడైన యశ్వంత్ రావు అనే బ్రాహ్మణ గృహస్థును ప్రభు వద్దకు పంపించారు. 

ప్రభువుకు విన్నవించుకొని హైదరాబాద్ కి తీసుకురావాలని వారితో పాటు గుర్రాల స్వారీ, మేనాలు, పల్లకీలు మొదలైన సరంజామా అంతటిని ఇచ్చి, ప్రభువు హైదరాబాద్ వస్తే అరవై వేల విలువైన జాగీరు ఇస్తామని చెప్పి పంపారు.

     యశ్వంత్ రావు సరంజామా తీసుకొని ప్రభు దర్బార్ లో హాజరు అయ్యారు. ఆయన సన్మానపూర్వకముగా ప్రభు ముందు దండప్రమాణాలు చేసి తాను వచ్చిన కారణాన్ని చెప్పి, పంపించిన కానుకలను ప్రభు చరణాల వద్ద ఉంచాడు. మరియు జాగీరు ఇస్తానన్న విషయాన్ని కూడా తెలియచేసాడు. 

"మేము ఫకీరులము, జాగీరు తీసుకొని ఏం చేస్తాము? మేము ఏ వైపుకు చూస్తే అదే మా జాగీరు. విశ్వమంతా ప్రభువుకు రాజ్యం. మీ యజమాని ఇచ్చిన దానికంటే పదిరెట్లు కావాలనుకుంటే ఆయనను ఇక్కడికే రమ్మని చెప్పండి. ఏది అడిగితే అది దొరుకుతుంది, నేను ఇక్కడ ఉండడం తన రాజ్యమునకు రక్ష అని నిజాంతో చెప్పండి అని ప్రభువు అన్నారు.

     ప్రభు యొక్క ఈ స్పష్టమైన జవాబు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఆ జవాబులో ప్రభు యొక్క దైవత్వం ఉంది. ప్రభు యొక్క సర్వతంత్ర, స్వతంత్ర ప్రవృత్తి జనులందరికి తెలిసింది. బంగారు సంకెళ్లతో ప్రభువుని కట్టి వేయడం సాధ్యమవుతుందా?. 

ఆ తరువాత కాలంలో ప్రభు ప్రసాదంతో అఫ్జల్ కి పుత్రప్రాప్తి కలిగి ప్రభు యొక్క ఆజ్ఞతో ఆ పుత్రునికి 'మహబూబ్' అని నామకరణం చేశారు. తరువాత ఇతను 'మహబూబ్ ఆలీ పాషా' పేరుతో హైదరాబాద్ నిజాం అయ్యారు.

తరువాయి భాగము రేపు చదువు కుందాము.... 

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 51  /  SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 51 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

      ప్రభు దర్బార్ లో హిందుస్థాన్ లోని చాలావరకు ప్రసిద్ధులైన కళాకారులు వచ్చేవారు. ప్రభు గానప్రియులై శాస్త్ర మర్మం తెలిసిన వారని అన్ని వైపులా ఖ్యాతి గడించి ఉండిరి.

   ఒకసారి ప్రఖ్యాత గాయకులలో ఒకరైన హుస్సేన్ ఖాన్ అనే పేరుగల గాయకుడు ప్రభు కీర్తి విని రావడం జరిగింది. ఆయన ఇంతకుముందు సంస్థానాలలో ఆదరణ పొంది ఉండిరి. 

వీరికి తన విద్యపై, గాత్రంపై చాలా గర్వముగా ఉండేది. రాజ దర్బార్ లో బహుమానం ఎంత దొరికినా సమాధానం కలుగలేదు. తన పాండిత్యం తెలుసుకునేవారు ఎవరూ దొరకడం లేదని ఆయనకు అనిపించేది.

   ఒకరోజు దర్బార్ లో ఆయన పాట పాడుతుండగా రాజా వారు ఆయనను మెచ్చుకున్నారు. కానీ ఆయనకు దానికి కోపం వచ్చింది. "మహారాజా! మీరు ఏం తెలుసుకొని నన్ను పొగిడారు? ఇలా పిచ్చి ప్రశ్నలతో తన పాటను త్వరగా ముగించాడు. 

రాజుకు సంగీత జ్ఞానం లేదని అలాంటి గాడిదల ముందు సంగీతం పాడకూడదని నిశ్చయించుకున్నాడు. మంచి గాయకుడు కానీ, ఇలాంటి బుద్ధితో అధిక ఉన్మత్తుడై విద్యను గుర్తించేవారు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా ప్రభువు కీర్తి విని మాణిక్ నగర్ కు వచ్చి ఉండిపోయారు.

      అక్కడ దర్బార్ లో ఎందరో విద్వత్తుల గాయకులను కలుసుకున్నారు. ఇతరుల సంగీత కార్యక్రమము ప్రభు ముందు జరిగి భరణం కూడా దొరికింది. నాలుగు రోజులైనా కూడా ఈయనకు ప్రభువు ముందు గానం చేసే అవకాశం రాలేదు. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు  ప్రభువు నుండి అనుమతి లభించింది. అప్పుడు ఆయన పాడడం ప్రారంభించాడు. ఆయన పాడుతుండగా ప్రభువు అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 

ప్రభు తన పాట వినడం లేదని ప్రభు శ్రద్ధగా వినాలని తన పాటను ఆరోజు తన విద్వత్తునంతా ఉపయోగించి పాడాడు. నాలుగు వైపులా కళాకారులు నిండి ఉన్నారు. అందరూ 'వహ్ వా' అనసాగారు. ప్రభు మాత్రం ఆయన వైపు చూడకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండిరి. తన ప్రతిభ చూపించి ప్రభువును ఆకర్షించాలని అతనికి ఉత్కంఠత కలగసాగింది. 

ఇలాంటి మానసిక సంఘర్షణలో ఒక దగ్గర పాట లయ-శృతి తప్పింది. అతని మనస్సుకి తెలుసు తాను తప్పు చేసానని, సరిగ్గా అదే సమయంలో ప్రభు 'వాహ్ వా' ఖాన్ సాహెబ్ అన్నారు.

     అప్పుడు అతనికి సిగ్గనిపించింది. ఇతరులకు దాని మర్మం తెలియలేదు. కానీ ప్రభువుకి  పాటలోని రహస్యమంతా తెలిసిందని అతనికి గర్వభంగం అయ్యింది. దాంతో ప్రభువుకి సంతోషమయింది. హుస్సేన్ ఖాన్ కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. పాటను ముగించి ప్రభు ముందు దండప్రమాణాలు చేసి మహారాజ్! నా విద్య మరియు జన్మ సార్ధకం అయింది. 

నేను విద్యపై అహంకారంతో గర్వితుడను (టర్ర) అయ్యాను. అందువలన నన్ను టర్రాహుసేన్ ఖాన్ అంటారు. ఇపుడు నాకు గర్వభంగం అయింది. ఇప్పటినుండి మీ కాళ్ళ దగ్గరే ఉండి పాడతాను, ఎక్కడకి వెళ్ళనని దృఢనిశ్చయం చేసుకున్నాను అన్నాడు.

     ప్రభు అతనిని గౌరవించి తన దర్బార్ లో ఉండడానికి అనుమతి ఇచ్చారు. అతనికి ప్రభు పాడితే వినాలని చాలా కోరికగా ఉండేది. 

ఒకరోజు ప్రభు నివసించే గుడారం వద్ద తిరుగుతుండగా ఒక మధురమైన స్వరం వినిపించసాగింది. దగ్గరికి వెళ్లి వింటే ప్రభు ఏవో పదాలు అంటూ పాడుతున్నారని అనిపించింది. ఎక్కడినుండి ధ్వని వినిపిస్తుందో అక్కడ ప్రభు శౌచాలయం ఉండేది. గోడ ఆ వైపు నుండి ప్రభు పాడే పాట విని అతను అవాక్కయిపోయాడు. 

అతని కళ్ళ నుండి ఆనందాశ్రువులు కారుతున్నాయి. ఆయన తన దేహాన్ని మరిచి తన్మయత్వంతో ఉండిపోయాడు. చాలాసేపు పాట నడిచింది. పాట అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం ఆయనకు అప్పుడు కలిగింది. 

దాని ముందు తన పాట విలువ ఏ పాటిదో తనకు అప్పుడు తెలిసి వచ్చింది. తరువాత ప్రభువుకి సన్నిహితుడై, ఎక్కడికీ వెళ్లక ఇక్కడే దేహం చాలించాడు.*


దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 52  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 52  🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

      ఖందార్ కర్ దేశ్ పాండే యొక్క కొడుకు పేరు నానా. ఇతను జమీందారు ఇంటికి చెందిన యువకుడు. సౌందర్యవంతుడై గాత్రం చాలా మధురంగా ఉండేది. శ్రీమంతుల ఇంట్లో జన్మించడం వలన జనం ఇతనిని నానాసాహెబ్ అని పిలిచేవారు. 

ఇతనికి చిన్నప్పటినుండి నృత్యగీతముల వలన ధనమార్జించు మేళగాండ్లను పరిచయం చేసుకొని వారి నృత్య గానాల యందు ఆసక్తి కలవాడై మేళగాండ్రతో స్త్రీ వేషము వేసుకొని నాట్యము చేయుటకు ఇష్టపడేవారు. 

ఆ రోజులలో దేశ్ పాండే అంటే గ్రామానికి పెద్ద వారు. వయస్సులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రతో తిరుగుతూ నృత్యము చేయడం మానలేదు. గ్రామస్థులందరూ కలిసి ఇతనిని బ్రాహ్మణ జాతి నుండి వెలివేశారు. వెలివేశినా కూడా నాట్యంపై అభిలాషతోనే ఉండటం చూసి జనం తప్పు పడుతుంటే చివరికి మాణిక్ నగర్ కి చేరుకున్నాడు. 

    ప్రభు దర్బార్ లో నిత్యము గాన, నాట్య కార్యక్రమములు జరిగేవి. నానాకు స్వభావసిద్ధంగా ఇష్టమైన నృత్యం చేసే కోరిక తీరక, ప్రభు దర్బార్ లో ఉండి ప్రభు దర్శనం చేసుకొని తన పూర్తి కథను తెలియచేసి, ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనము చేయండి అని వేడుకున్నాడు. 

మహారాజా! నేను అనాచారిని. నా ప్రవృత్తి మారడం లేదు, నాకు నర్తించాలనే అనిపిస్తుంది. తన పాపకర్మలను చెపుతూ ఎంత ప్రయత్నించినా కూడా నర్తించాలనే కోరిక పోవడం లేదు. దీనికి నేను ఏం చేయాలి? అని అడిగాడు.

    *అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది. అతని అంతఃకరణ ప్రభువుకి తెలుసు కనుక అతనికి ఇష్టమైన నాట్యాన్ని సరైన మార్గంలో చూపిస్తే అతను ఉద్ధరింపబడుతారని, ఆయనకు జన్మత ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపచేశారు. 

నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు, తరువాత ఏం చేయాలో నేను చెపుతాను. అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది. అన్ని సిద్ధం చేసుకొని ప్రభు ముందు స్త్రీ వేషధారణలో నాట్యం చేసాడు. అతని ప్రతిభ అద్భుతమైనది. 

అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు. ఆరోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు. అతని కళను గౌరవించి ప్రభువు అతనికి స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు.*

     నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకొని నానాను కులమునుండి పూర్తిగా బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకొని జగద్గురువులు నానాకు, సంజాయిషీ ఇవ్వవలసిందిగా లేఖ వ్రాశారు. నానా ఆ లేఖను ప్రభువుకి చూపించగా, ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు.

    *తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్యగీతములను ఒకసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించిరి. నృత్యమును చూసి జగద్గురువులు ఆనందించి ప్రభువు ఇతనిని ఇప్పటికే పరిశుద్ధుని చేశారు, ఇంక తాను చేసేది ఏమీ లేదని చెప్పి నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపారు. 

ప్రసాదం తీసుకొని తిరిగి మాణిక్ నగర్ చేరిన నానా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు.

    *ఈ విధంగా తన భక్తులకు వాళ్లకు ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించడం ప్రభువు యొక్క సమర్ధత. ప్రభువుది సకలమత సంప్రదాయము. ఇదే ప్రభు యొక్క విశేషము. 

ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి. వీరికి తప్పించి ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ప్రభు చేతిలో ఉన్న వారికి అథోగతి కల్గించే శక్తి ఎవరికీ ఉండదు. ఇలా ప్రభు వద్దకు వెళ్లిన భక్తులను ఎప్పుడు ఉపేక్ష చేయలేదు.*

'మాకు పట్టుకోవడం వస్తుంది కాని విడిచిపెట్టడం రాదు' ఇది ప్రభు వాక్యం.

తరువాయి భాగము రేపు చదువు కుందాము......

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 53  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 53 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

🌴. అక్కల్కోట స్వామి 🌴

          అక్కల్ కోట స్వామి సచ్ఛరిత్రలో ప్రభువు గురించి పద్యరూపంలో ఇచ్చిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

     "మొగలాయిల కాలంలో హుమనాబాద్ కి దగ్గరలో మాణిక్ నగర్ అనే సుందరమైన ప్రదేశం ఉంది. అక్కడ మాణిక్ ప్రభు అనే సిద్ధపురుషుడు నివాసము ఉండేవరు. దయ, క్షమ, శాంతి, భక్తి, జ్ఞానసహిత విరాగియై రాగద్వేషాలను పరిత్యజించి, బాల్యావస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి, బ్రహ్మానందంలో మునిగి కళ్యాణి నగరాన్ని ఉద్ధరించి, మాణిక్ నగరాన్ని నిర్మించి, దానిని తప స్థానంగా చేసుకొని శుద్ధ భావనతో వేలమందికి దర్శనం ఇచ్చేవారు. 

వారి వద్దకు వైదికులు, పండితులు, హరిదాసులు, గాయకులు, జ్యోతిష్యులు, శ్రీమంతులు, గృహస్థులు మొదలైన వారు వచ్చేవారు."

      మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషులలో అక్కల్కోట స్వామి, మీరజ్ గ్రామానికి చెందిన అన్నాబువా మహారాజ్, కొల్హాపూర్ కి చెందిన కృష్ణస్వామి (కుంభార్ స్వామి) మరియు యశ్వంత్ రావు దేవ్ మామల్దార్ ఈ నలుగురు ప్రభు యొక్క సమకాలీనులు.

     అక్కల్ కోట గ్రామ ప్రజలకు, అక్కడి రాజదర్బార్ కు చెందిన అధికారులకు మాణిక్ నగర్ తో విశేషమైన సంబంధం ఉండేది. ఆ దర్బార్ లోని, గ్రామంలోని చాలా మంది ప్రభు దర్బార్ కు వస్తూపోతూ ఉండేవారు. 

అక్కడి రాజా వారు ప్రభు వద్దకు ఛత్రం, పల్లకి పంపారు. ప్రభు అక్కల్కోటకి రావాలని వారికి కోరికగా ఉండేది. తరువాత ఎపుడైనా వస్తాను అని ప్రభు వాళ్ళకి మాట ఇచ్చారు. ఇలా మాట ఇవ్వడం వలన ప్రభు రాక కోసం నిరీక్షిస్తూ ఆ ఊరి వారందరూ  ఉండిపోయారు.

    అక్కల్ కోట సంస్థాన ప్రతినిథి అయిన బాబా సబ్ నిస్ ప్రభువును తమ గురువుగా అక్కల్ కోట తీసుకువెళ్లేందుకు వచ్చిరి. అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు ప్రభు దర్శనానికి మాణిక్ నగర్ వచ్చి ఉండిరి. 

వీరు దిగంబరులై, దృఢకాయులై ఉండిరి. వారు ఇక్కడకి వచ్చినపుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. ప్రభువు ఆ సత్పురుషునితో మూడు రోజులు ఏకాంత చర్చ జరిపారు. ప్రభు వారిని తమ సోదరులుగా భావించేవారు. ప్రభు ప్రేమకు ఆ స్వామి ముగ్ధులై తను కూడా మాణిక్ నగర్ లో ఉంటామని చెప్పారు. 

అప్పుడు ప్రభువు "ఒక వృక్షము క్రింద మరో వృక్షము పెరగదని" చెపుతూ బాబా సబ్ నీస్ గారితో, వీరే మీ సద్గురువులు, మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కల్కోకి తీసుకువెళ్ళమని చెప్పి పంపించారు. ఈ సత్పురుషులే అక్కల్ కోట స్వామి.

తరువాయి భాగము రేపు చదువు కుందాము.... 

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹

ఓం నమః శివాయ:
||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము
16వ దశకము - నరనారాయణుల అవతారము వర్ణనము/16-8-శ్లోకం.
🕉🌞🌎🌙🌟🚩

(16-8 శ్రీమన్నారాయణీయం నర నారాయణుల కలయికయే ఒక అద్భుత సృష్టి)

దృష్ట్వోర్వశీం తవ కథాం చ నిశమ్య శక్రః
పర్యాకులో౾జని భవన్మహిమావమర్శాత్।
ఏవం ప్రశాంతరమణీయతరా౾వతారాత్
త్వత్తో౾ధికో వరద! కృష్ణతనుస్త్వమేవ।।

భావము:-

దేవేంద్రుడు నీకు తపోభంగము కలిగించుటకు ప్రయత్వించియు, విఫలుడై తానే గర్వభంగము పొందెను. నీ వృత్తాంతమును విని, నీచే సృష్టించబడిన ఊర్వశిని చూచి, గర్వమణిగిన వాడయ్యెను. వరదా! ప్రశాంతమైనది, రమణీయమైనది మరియు మిక్కిలి మనోహరమైనది అయిన నారాయణావతారమునకు మించినది – నీ శ్రీకృష్ణ రూపమొక్కటే!

వ్యాఖ్య:-

ఈదశకంలో భట్టతిరివారు శ్లాఘిస్తున్న నరనారాయణులు జీవ బ్రహ్మైక్యతకు నిదర్శనం. అదెలాగో భగవద్గీతలో శ్లోకంతో అనుసంధానించి చూద్దాం.


ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేఘాపజాయతే | సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే || క్రోధాద్బవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః | స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ||

విషయ చింతన అనగా ఇంద్రియ లోలత వలన మానవులలో ఆసక్తి కలుగటం. ఆసక్తి కోరికలకు దారి తీస్తుంది. కోరికలు తీరనప్పుడు క్రోధం పుడుతుంది. కోపం వ్యామోహానికి బాటలు వేస్తుంది. దానివలన స్మృతి విభ్రమం కలుగుతుంది. స్మృతి నశిస్తే బుద్ధినాశం కల్గుతుంది. బుద్ధినాశం వలన మానవమనుగడ పతనమవుతుంది. అందుకే అహంకారం ధర్మనాశనానికి మూలమని గుర్తించాలి. అహం నశిస్తేనే ఇహం బోధపడుతుంది. 


ఇహమే దృశ్య ప్రపంచం. ఇది కలగన్న భాగ్యం. ఇదొక వైష్ణవమాయ. మాయను వదిలితే సత్యం బోధ పడుతుంది. కనుక, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అహం నుండి పుట్టినాయని తెలిసి అహాన్ని అంతం చేసుకోవాలి. మనో నైర్మల్యం ఆచార శుద్ధికి దారి తీస్తుంది. ఆచారశుద్ది ఆధ్యాత్మికబుద్ధికి, ఆనందస్థితికి మూలం. ఇందుకు ఎన్నో నిదర్శనాలు. 


నరనారాయణులు సనాతన మహరులు. తపోనిధులు. శాంత సంయమనాలకు నెలవులు. నిజమైన, నిర్మలమైన ఆచారశీలతకు, ఆధ్యాత్మికనీతికి, ధార్మికరీతికి, తపోనియతికి, మంత్రానుష్టాన అనుభూతికిని నిలువెత్తు సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం నర నారాయణులు. ఒకప్పుడు వీరు సోదరులు. ఇంకొకప్పుడు మిత్రులు. మరొకప్పుడు గురుశిష్యులు.


"పరమాత్మ ఇందుగలడందు లేడను సందేహము వలదుశ్రీ హరి సర్వోపగతుడు. ఎందెందు వెదకూ చిన అందందే గలడు" అంటూ తండ్రికి చెప్పి, స్తంభం నుండి నరసింహావతారమూర్తి ఆవిర్భావానికి ప్రహ్లాదుడు తెరదీశాడు.మొత్తానికి అహంకారంతో, తనను ఎదిరిని ఆలోచింపక, క్రోధంతో విర్రవీగుతూ తన భక్తుని సదా హింసిస్తున్న హిరణ్యకశిపుని సంహరించడానికి, ఆ ఆదిదేవుడైన విష్ణువు నృసింహమూర్తిగ ఒక స్తంభం నుండి పుట్టి, దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని సంహరించాడు. 


అవతార లక్ష్యం నెరవేరింది. కాని స్వామి భయంకరాకృతి లోకాలకు భయానకమై ఉంది. అప్పుడు సదాశివుడు శరభరూపంలో నరుడు - సింహము రెండుగ నరసింహ రూపాన్ని చేశాడు. ఈ నరసింహములనే రెండు రూపాలే అనంతర జన్మలో ధర్మునకు నర నారాయణులుగ జన్మించారు.


నరనారాయణులు సరస్వతీ నదీతీరంలో బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు. వారి మనస్సులు నిర్మలములు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నారు. సదాచార ప్రతులై తమ ఆయుధాలను సమీపంలోనే ఉంచుకొని తపస్సులో మునిగిపోయారు. ఇది తెల్సిన ఇంద్రుడు నరనారాయణుల తపోభంగానికి మన్మథుణ్ణి, అప్సరసలను పంపాడు. కాని మన్మథ బాణాలు ఆ మునుల యెడల నిర్వీర్యమైనాయి. అప్సరసల శృంగార చేష్టలు చెల్లని నాణాలైనాయి. నరనారాయణులకు ఇంద్రుని కుతంత్రం తెలిసింది. నారాయణుడు తన ఊరువును లీలగా గీరాడు. అచట మరొక సుందరాంగి ప్రత్యక్షమైంది. అప్సరసల మోములు చిన్నబోయినాయి. 


నరనారాయణులు మందస్మితంగా కన్పించారు. ధైర్యం, ఆత్మౌన్నత్యం, తపోనిష్ఠ, శమదమాదుల నిగ్రహం గమనించిన అప్సరసలకు బుద్ది వికసించింది. "స్వామీ! మీరు సామాన్యులు కాదు. సమ్మాన్యులు. సాక్షాత్తు వైష్ణవ తేజోవిరాజితులు. ఆ నరసింహదేవుని ఆకృతియే ఇలా మీ ఇద్దరి రూపంలో కన్పిస్తున్నారు. దివ్యమూర్తులైన మీ దర్శనభాగ్యం కల్గడం మా పురాతన సుకృతం. దేవేంద్రుని స్వార్థ బుద్ధికి ఇలా దిగబడ్డాము. అయినా ఆగ్రహించక, నిగ్రహంతో మా అపరాధాన్ని మన్నించి అనుగ్రహించారు" అంటూ అంజలి ఘటించారు. 


నరనారాయణులు కూడా దివ్యకాంతల వినయ విధేయతలకు, బుద్ధి కుశలతకు ముచ్చటపడ్డారు. "కాంతలారా! మీరేమైనా వరం కోరుకోండి. నా ఊరువుల నుండి పుట్టిన ఈ దివ్యకాంత ఊర్వశిగా పిలువబడుతుంది. ఈమెను మీతో స్వర్గానికి కొనిపోండి. ఇది స్వర్గానికి మా కానుక. దేవేంద్రునకు ఉపహారం. దివ్యులకు మేలు కలుగుగాక. ఎన్నడూ తపోధనుల యెడల అనుచితంగ ప్రవర్తించకండి" అని చెప్పారు. దివిజకాంతలు నర నారాయణుల పాదపద్మాలకు నమస్కరించి దివిజలోకం చేరుకొన్నారు.


తపోధనులకు శాంతం, సహనం, నిగ్రహం, అనుగ్రహం, ఇంద్రియాలను జయించి విషయభోగాలను తిరస్కరించడం కావాలి. స్థితప్రజ్ఞత అవసరం. పొంగిపోవడం, క్రుంగిపోవడం ఉండరాదు. జీవుడు దేవుడు ఒక్కడే. ఆత్మజ్ఞానంతోనే జీవుడు దేవుడవుతాడు. జీవబ్రహ్మైక్యత సనాతనం. అయినా ఆ దివ్య తత్త్వానుభూతి నిత్యనూతనమే. నరనారాయణుల తత్త్వం అలాంటిదే. 


నర నారాయణ జన్యం స్పూర్తిదాయకం, సత్య సందేశాత్మకం, విశ్చ యోదాయకం. అంతేనా మరేమైనా పెద్ద ప్రయోజనముందా? 
అంటే తప్పక ఉంది. కర్మబంధాలు జన్మ గంధాలకు దారి తీస్తాయి. ఫలితంగా అవతారాల ఆవిర్భావానికి లక్ష్యాలు నిర్దేశించబడతాయి. లక్ష్య సాధనకు ఆత్మబలం, ఆధ్యాత్మిక శక్తి సమన్వయపడాలి. అందుకే దివ్యులు తపజపాలను, మంత్రానుష్ఠాలను మహిమోన్నతంగా పాటించారు. అలాగే నరనారాయణులు వేల సంవత్సరాల తపస్సునకును ఒక లక్ష్యం ఉంది. అదే సహస్ర కవచుని సంహారం.


సహస్ర కవచుడు ఒక రాక్షసుడు. పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కల్గియున్నాడు. వానితో పోరు సలపాలంటే వేయి సంవత్సరాల తపోబలం కావాలి. వాడి సంహారం కానట్లయితే దివిజులకు, మానవులకు, మహర్షులకు కంటకమవుతుంది. ధర్మం నశిస్తుంది. జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది. అందుకే నర నారాయణులుగా వైష్ణవతేజం ఆవిర్భవించింది. 


నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు, నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు. ఒక్కొక్కమారు ఒక్కో కవచం చొప్పున నర నారాయణులు ఆ రాక్షసుని 999 కవచాలు ఛేదించారు. ఇంక ఒక్క కవచం మాత్రమే ఉంది. కాని వాడు ఆ కవచంతోనే తన జన్మను చాలించాడు. వాని ఆత్మ మాత్రం రాక్షస భావంతో రగిలిపోతూ మరలా జన్మించాడు. వాడే కర్ణుడు. పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు. 


అలాగే నర నారాయణులు మరలా వాని సంహారం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం మహాయుద్ధంలో ఒకరు రథి (వీరుడు) మరొకరు సారథిగానై ధర్మయుద్ధం నిర్వహించారు. కృష్ణుడు మాయోపాయం పన్ని ఇంద్రుని బ్రాహ్మణరూపంలో పంపి, దానకర్ణుడైన ఆ సహస్రకవచుని కవచకుండలాలను స్వీకరించడంతో కర్ణుని ఓటమి, కర్ణుని శక్తి సామర్థ్యాలు నిర్దేశించబడ్డాయి. నరుడైన అర్జునుని చేతిలో కర్ణుడు వీరమరణాన్ని పొందడం జరిగింది. 


రాక్షస బలం అసామాన్యమైంది. రాక్షస ప్రవృత్తి కూడా చాలా తీవ్రమైంది. ఒక సహస్రకవచుని సంహరించడానికి భగవానునికే రెండు జన్మలు అవసరమైనాయి. మానవునిగా భువికి వచ్చినవారు దివ్యులైననూ మానవాతీతమైన శక్తి సామర్థ్యాల సాధనకు ప్రయత్నం చేయాల్సిందే. అందుకే వేల సంవత్సరాల తపోబలం సాధించడం. అలాగే కర్ణుని కవచ కుండలాలను అపహరించడానికి ఇంద్రుణ్ణి మాయా బ్రాహ్మణునిగా పంపడం ఇదంతా విధిలీల. 


జగత్తునకు, జగత్తులో జీవించే ప్రాణులకు హితంకల్లాలి.సనాతన వైదిక ధర్మం నిరాటంకంగా కొనసాగాలి. అందుకు పరమాత్మ ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఎన్ని ఎత్తులకైనా తెరదీస్తాడు. అందుకు నిదర్శనమే నర నారాయణ జననం. నిజానికి కర్ణుడు దానశీలుడు, శౌర్యవంతుడే కాని అతడనుసరించిన సేవాధర్మం రాక్షస ప్రవృత్తికి, అధర్మవర్తనకు బలాన్ని సమకూర్చుతోంది. అందునా సహజంగా అతనిలో ఉన్న రాక్షసావేశం అందుకు ప్రోత్సహించింది. చివరి క్షణాలలో కర్ణుడు అర్జునునితో ఇలా అంటాడు.


"అర్జునా! ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుందంటారు. మేము కూడా నిరంతరం యథాశక్తి, యథాశ్రుతం ధర్మాన్నే అనుసరించాం. కాని ఆ ధర్మం తన భక్తులమైన మమ్ము రక్షింపజాలకున్నది" అంటూ ఎదురైన శాపాలకు తాపం చెందుతూ కొద్దిసేపు యుద్ధం ఆపుమని కోరుతూ చెప్తాడు. అప్పుడు పరమాత్మ "కర్ణా! ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా? లాక్షా గృహదహనం, ద్రౌపదీ వస్త్రాపహరణం, బాలుడైన అభిమన్యుని వధ మొదలైన సన్నివేశాలలో ధర్మాధర్మ విచక్షణ లేదే" అంటూ "నీచులు కష్టాలలో దైవ నింద చేస్తారు కాని, తాము గతంలో చేసిన దుష్కృతాల వలననే దుష్పలితాలను పొందుతున్నామని భావించరు" అని తెలియజెప్పి, నరుని ప్రోత్సహించగా, అర్జునుని అస్తాలకు కర్ణుడు వీర మరణం పొందడం జరిగింది. 


ఆవేశం, ఆలోచనా రాహిత్యం , అహంకారం, కామ క్రోధాదులు రాక్షస ప్రవృత్తికి సంకేతం. మనం చేసే లోభం, పాపం శాపాలై మానుష ప్రయత్నాన్ని పతనం చేస్తాయి. శేషకవచంతో కర్ణునిగా జన్మించిన సహస్ర కవచుడు అలాంటి శాపాల తాపాలకు గురియైనాడు. అతడి పౌరుష ప్రతాపాలు అవసరమైనప్పుడు అక్కరకు రాలేదు. నర నారాయణుల లక్ష్యానికి సాధ్యం కానిదేముంటుంది?


నరనారాయణులు,వరంతీసుకొన్న కుంతి, కవచ కుండలాలు గ్రహించిన ఇంద్రుడు అనుచితాలతో నిరుత్సాహ పరచిన శల్యుడు, భూమాత శాపం మొదలగు ఆరుగురి వలన కర్ణుడు మరణించాడని చెప్తారు.


నరనారాయణ జననం జగతికి మోదం. ప్రమోదం. ఆమోదం. ప్రబోధం. సత్యసందేశాత్మకం. నిత్య జ్ఞానానందమయమే కాదు జగద్దితం. అనగా లోక కళ్యాణ కారకం. జీవననాదం. మానవబ్రతుకు వేదమయిన భగవద్గీతకు మూలం కూడా వారే. వారి అవతార లక్ష్యాలు అసంఖ్యాకం. ఆలోచించిన కొద్దీ ఆత్మానందానుభూతి, జీవ బ్రహ్మైక్యతలకు నిలువెత్తు సాక్ష్యం. విశ్వగురుడు పరమాత్మ. విశ్వ విద్యార్థి పరమాత్మే. వారే జీవాత్మలు కూడా. నర నారాయణుల కలయికయే ఒక అద్భుత సృష్టి. మాధవునితోనే మానవుడు. మానవునిలోనే మాధవుడు. నిజం తెలిస్తే సర్వం బ్రహ్మార్పణం.

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 56  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 56 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

     అష్టమి రోజు ఉదయం జగద్గురువు, వారి పరివారం హుమానాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్ళడానికి ప్రభు పరివారం బయలుదేరింది. ముందుగా ఏనుగు, గుర్రాలను తీసుకొని తాత్యాసాహెబ్ తన ఇద్దరు పుత్రులతో ఎదురువెళ్లి పాదాభివందనం చేసి రెండువేల రూపాయలను కానుకగా సమర్పించుకొని స్వాగతించారు. 

రామశాస్త్రి వారి ఇద్దరు పుత్రులను జగద్గురువుల పాదాల వద్ద ఉంచి తాత్యావారిని వీరు ప్రభువు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశారు. తరువాత వారు తాత్యాసాహెబ్ ని ఆలింగనం చేసుకొని తన మెడలో ఉన్న అమూల్యమైన హారాలను తాత్యావారికి వేసి ఇద్దరు పుత్రులకు పుష్ప హారం, కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్ళడానికి పల్లకిలో కూర్చున్నారు.

   హుమానాబాద్ నుండి స్వామి బయలు దేరగానే ఇక్కడ ప్రభు పాదయాత్రగా తనతో రెండు వేల మంది బ్రాహ్మణులను, రెండు ఏనుగులను, రెండువేల మంది జనం వెనుక ముందు నడుస్తుండగా, తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి, సంతులు, సాధువులు, బైరాగుల భజనతో నడుస్తూ పదివేల మందితో ప్రభువు రుమాలు కట్టుకొని పీఠాధిపతులను స్వాగతించడానికి పల్లకి బయలుదేరింది. ఇక్కడినుండి ప్రభు పల్లకి అటువైపు నుండి జగద్గురువుల పల్లకి మధ్య దారిలో కలిశాయి. ఆ సమయంలో ఒకే స్వరంతో అందరూ  జయజయధ్వానాలు చేశారు.

    ముందుగానే ప్రభువు జగద్గురువుల ఎదుట 'భక్తకార్య కల్పద్రుమ' అని ఎవరు అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు. కారణం ఆయన మన గురువు. ఆయనకు ఈవిధంగా మనం జయకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది. ఇద్దరి పల్లకీలు దగ్గరికి రాగానే ముందుగా స్వామి వారి గర్జన వినిపించింది. 

ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరిచి వెంట ఉన్న రెండువేల మంది ఒకేసారిగా "భక్తకార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమత్ రాజాధిరాజా యోగి మహారాజ్ త్రిభువన ఆనంద అద్వైత, అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై" అని గద్గద స్వరంతో అనగానే అన్ని దిక్కులా ఆనంద పారవశ్యమైంది.

   ప్రభు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో, రుమాలు కట్టుకొని సాదా టోపీ వేసుకొని శరీరంపై కేవలం జుబ్బాతో, చేతులు కట్టుకొని ఉన్న ప్రభు స్వరూపాన్ని చూసి పల్లకి నుండి దిగి ప్రభు వద్దకు వచ్చారు. 

ప్రభు నమస్కారం చేయగానే, స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామి వారి నేత్రాలనుండి ఆనంద అశ్రువులు రాసాగాయి. ఈ విధంగా ఇద్దరు మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది. ఈ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవరి తరము కాదు.

   ఆ క్షణంలో మరొకసారి ప్రభు బృందం 'భక్తకార్య' ఉచ్ఛరించగానే ఆ ఆనంద క్షణంలో అందరూ మైమరిచిపోయారు. కాని స్వామి మహారాజ్ యొక్క పూర్వాశ్రమ సోదరుడు అహోబిల శాస్త్రి పెద్ద విద్వాంసులు, స్వాభిమానియై ఉండిరి. 

ఆయనకు ఈ "భక్తకార్య" వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది. కాని తమాయించుకున్నారు. తరువాత ఇద్దరూ పల్లకిలో కూర్చుందామని స్వామి, ప్రభువుని అడిగారు. కాని, ప్రభువు తిరస్కరించి స్వామి యొక్క పల్లకి మోయడానికి తమ భుజాన్ని అందించారు. కానీ, ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభు మేనాలో కూర్చున్నారు. ఆ విధంగా మాణిక్ నగర్ లోని దత్త గాది వద్దకు వచ్చారు. 

ప్రభు స్వయంగా స్వామిని తీసుకొని వచ్చి వారికి ఏర్పాటు చేసిన రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టారు. స్వామి యొక్క పూజ, పాదపూజ తాత్యామహారాజ్ చేసిన తరువాత, వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు. ప్రభు చేసిన ఆదర సత్కారాలను చూసి జగద్గురువులు సంతోషించారు.

   తరువాత ప్రభు వద్ద నుండి వెళ్ళడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాలహారం, ఒక ఏనుగు, నాలుగు ఉత్తమజాతి గుర్రాలను, ఒక పల్లకి, శాలువ ఇలా అనేకవస్తువులు ప్రసాదంగా ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు. చివరికి బయలుదేరే సమయంలో మీరు 'సకలమత స్థాపిత భక్తకార్య' అనడం మానకండి అని ప్రభు బృందంతో చెప్పారు. 

నాతో వచ్చిన మా సోదరుడు, ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు. దీనికి సమాధానం నేను మా వాళ్ళకి ఇస్తాను. కానీ, మీకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. 'భక్తకార్య' యోగ్యమైనది. సకలమత కళ్యాణం చేయండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు వెళ్ళిపోయారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 59  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 59 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

  🌸. దమ్మిడి చక్కెర 🌸

      ప్రభువు భక్తుల కోరికలు తీర్చి, భక్తులు మొక్కుకున్న మొక్కులు తీర్చడం కోసం ఎదురు చూస్తారని అందరికీ తెలిసింది. ఆ కాలంలో కొందరు ప్రభువు వద్దకు వెళ్లే భక్తులను అపహాస్యం చేసేవారు.

అలా హుమానాబాదులో ఒక గృహస్థు ఉండేవాడు. అతను స్వయంగా ఎప్పుడూ ప్రభువు వద్దకు రాలేదు. కానీ ఎవరైనా ఇతరులు ప్రభు వద్దకు వెళ్తుంటే అపహాస్యం చేసేవాడు.

    ఒకసారి ఆ గృహస్థు చెప్పులు పోయాయి. అవి క్రొత్తవి కావడం వలన అతనికి బాధ కలిగింది. అప్పుడు అతనికి, జనం ఆపద సమయంలో ప్రభువును స్మరిస్తూ మొక్కుకుంటారని గుర్తుకు వచ్చింది.

చెప్పులు నాకు ఇప్పటికిప్పుడే దొరికితే నేను ఒక దమ్మిడీ చక్కెర సమర్పిస్తాను అని ప్రభువుకి మొక్కుకున్నాడు. అనుకోకుండా అదేరోజు చెప్పులు దొరికాయి.

తాను ప్రభువుకి ఒక దమ్మిడీ చక్కెర మొక్కుకున్నందుకు అతనికి సిగ్గుగా అనిపించి, నాలుగు అణాలకు చక్కెర తీసుకొని ప్రభువు దర్శనానికి బయలుదేరాడు.

    ఎప్పటిలాగే ప్రభు దర్బార్ లో రద్దీ ఉండెను. అంత రద్దీలోనుంచి దారి చేసుకొని ప్రభు ముందుకు వెళ్లి తన దగ్గర ఉన్న చక్కెర పొట్లం ప్రభు ముందు పెట్టి నమస్కారం చేయగానే, ప్రభు తన శిష్యులలో ఒకరిని తక్కెడ తీసుకురమ్మన్నారు.

వారు తక్కెడ తీసుకొని రాగానే ప్రభు గృహస్థునితో మీరు తెచ్చిన చక్కెరలో ఒక దమ్మిడి చక్కెర మాత్రమే నాది. అంత మాత్రమే తీసి నా పంచలో వేయండి. మిగతాది నాకెందుకు? అనగానే అతని శరీరం చల్లబడి, అవాక్కయ్యాడు. నమస్కారం చేసి ప్రభువుని క్షమించమని అడిగాడు.

   అప్పుడు ప్రభు ఇలా అన్నారు. అరే బాబా! దేవుడిని పరీక్షించవద్దు. దమ్మిడి చక్కెర కోసం ప్రభువుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆలోచించు.

గృహస్థునికి ప్రభువు ఆంతర్యం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా అతను ప్రభు ముందు సాష్టాంగ దండప్రమాణం చేసి ఇక ఎప్పుడూ ఇలాంటి అపరాధం చేయను, నన్ను క్షమించండి అని విన్నవించుకున్నాడు. ప్రభువుకి దయ కలిగి క్షమించారు. తరువాత ఆ గృహస్థు ప్రభువుకు ప్రియమైన భక్తుడు అయ్యాడు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

ధ్రువునికి సంతోషముతో నారాయణుని స్తుతించ వలెను అని మనసులో ఉన్న కోరికను శ్రీమన్నారాయణుడు తెలుసుకున్నాడు తెలుసుకుని ఏం చేశాడు?

||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము / 17వ దశకము - ధ్రువచరితము వర్ణనము 7-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

త్వద్దర్శనప్రమదభారతరంగితం తం
దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే।
తుష్టూషమాణమవగమ్య కపోలదేశే
సంస్పృష్టవానసి దరేణ తథా౾౾దరేణ।।

భావము:-

ప్రభూ! నిన్ను దర్శించినంతనే ధ్రువుని హృదయము ఆనంద తరంగ భరితమయ్యెను. నీ రూపమునే తదేకధ్యానముతో చూచుటవలన కన్నులు ఆర్ధ్రమయ్యెను. సంతోషముతో నిన్ను స్తుతింప వలయునని కోరుచున్న ధ్రువుని మనసెరిగిన నీవు, ఆదరముతో అతని కపోలమును నీవేదమయ శంఖముతో స్పృశించితివి.

వ్యాఖ్య:-

పరమాత్మ చేత భయము తొలగించబడిన దేవతలు పరమాత్మకు నమస్కరించి స్వర్గానికి వారు వెళ్ళిపోయారు. భగవానుడు కూడా గరుడున్ని అధిరోహించి మధువనానికి వెళ్ళాడు భక్తున్ని చూడాలన్న కోరికతో.


ధృవుడు తదేక ధ్యానములో ఉన్నాడు. మనసులో ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నడో అక్కడ అంతర్థానం అయ్యాడు. తన హృదయములో ఉన్న స్వామిని ఎదురుగానే చూసాడు


చూడగానే తొట్రుపడి ఒక కర్ర పడినట్లు ఆయన ముందు పడి నమస్కరించాడు. కళ్ళుబాగా తెరిచి స్వామిని తాగేస్తున్నట్లు చూచాడు.
నోటితో ముద్దుపెట్టుకున్నట్లుగా భుజములతో కౌగిలించుకున్నట్లుగా స్వామి ఎదురుగా ఉన్నాడు. ఎదో చెప్పాలి. స్తోత్రం చేయాలి. కానీ ఏమి తెలియని వాడు. అందరి హృదయాలలో ఉండే స్వామికి ఆ విషయం అర్థమైంది. వేద స్వరూపమైన శంఖముతో స్పృశింపచేసాడు దక్షిణ కపోల భాగములో.


దానితో సకల వేద పరిజ్ఞ్యానం వచ్చింది. తవాన్ని పూర్తిగా తెలుసుకుని భక్తి భావముతో స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ధౄవమైన స్థానం కలవాడు గొప కీర్తి కలిగిన పరమాత్మను స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు


దాంతో నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి శ్కతీ నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం అంటూ స్తోత్రం చేశాడు.


అందరిలాగా ధృవుడికి పరమాత్మ ప్రత్యక్షం మాత్రమే కాలేదు. పరమాత్మ తత్వం కూడా ప్రత్యక్షమయ్యింది. పరమాత్మ దీనికోసమె తన స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసి కూడా పాంచజన్యం స్పృశింపచేసి తన తత్వాన్ని సాక్షాత్కరింప చేశాడు. 


🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ