తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన









రోజుకొక అన్నమయ్య కీర్తన 

 శ్రీ వేంకటేశ అష్టకం -1 

వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః |
సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ || 1 ||

జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసినః |
సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః || 2 ||



 *ఓం నమో వేంకటేశాయ* 
*రోజుకో అన్నమయ్య సంకీర్తన*
*ఇది మీకోసం చేస్తున్న సాహితీ యజ్ఞం.*
*కుదిరితే నేర్చుకోండి.లేదా, ఒక్కసారి వినండి.*
*పల్లవి:*
వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
*చ1|| 
ఆమటి మ్రొక్కుల వాడే అది దేవుడే
వాడు తోమని పల్యలవాడే దురిత దూర్యుడే
*చ2| 
వడ్డీ కసులవాడే వనజనాభుడే
పుట్టు గోద్రల్లకు బిడ్డ లిచ్చే గోవిందుడే
*చ3| 
ఎలిమి కోరిరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగా శ్రీ వేంకటాద్రి నాధుడే.



!!బ్రహ్మ కడిగిన పాదము|
బ్రహ్మము తానెని పాదము||

చెలగి వసుధ కొలిచిన నీ పాదము|
బలి తల మోపిన పాదము|
తలకగ గగనము తన్నిన పాదము|
బలరిపు గాచిన పాదము||

కామిని పాపము కడిగిన పాదము |
పాము తలనిడిన పాదము|
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము |
పామిడి తురగపు పాదము||

పరమ యోగులకు పరి పరి విధముల|
పరమొసగెడి నీ పాదము|
తిరువేంకటగిరి తిరమని చూపిన|
పరమ పదము నీ పాదము||



విశేషము:-
మొదటి చరణము రెండవ భాగము.

 యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయసిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే = యోగమందున్న వాడవై ఫలసంగమును విడచి కర్మలను చేయుము।ఫలసిధ్ధికిని అసిధ్ధికిని సముడవై కర్మలను చేయుము। ఈ సముడగుటయే యోగము। ఆ యోగము కలవాడె యోగి।యోగికి పాపమేమున్నది,పుణ్యమేమున్నది?ఏదియు అంటదన్నమాట , ఇది గీతావాక్యము।
అన్నమయ్య ఈతత్వమును చెప్పిరి।

🕉🌞🌎🌙🌟🚩

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩      

గానం:శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు


అప్పని వరప్రసాది అన్నమయ్య 
అప్పసము మాకే కలడన్నమయ్య !!


అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య 
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య !!


బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు 
హరిమీద విన్నవించె అన్నమయ్య 
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల 
అరసి తెలిపినాడు అన్నమయ్య !!


అందమైన రామానుజ ఆచార్యమతమును 
అందుకొని నిలచినాడు అన్నమయ్య 
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య!! 


🕉🌞🌏🌙🌟🚩



అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

ll పల్లవి ll
కంటి శుక్రవారము గడియ లేడింట  
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని !!


ll1చరణం ll
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి 
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి 
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని!!


ll 2 చరణం ll
పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి 
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై 
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని!!


ll 3 చరణం ll
తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు 
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది 
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని!!

🕉🌞🌎🌙🌟🚩

ముఖ్య పదాల అర్ధం:
కంటి= చూచితిని (కనుట అంటే చూచుట) 
గడియ లేడింట= తెల్లవారు ఝామున రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి 7x24=168 నిముషాలు. అంటే, తెల్లవారు ఝామున 2:48 ని.లు.)
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని: అలమేల్మంగ తో కూడిన శ్రీవారిని చూశాను.  


సొమ్ములన్నీ కడబెట్టి: ఆభరణాలన్నీ తీసి ఓ మూలన
 పెట్టి
సొంపుతో గోణముగట్టి: అందముగా గోచీ కట్టి (A waist cloth or modesty piece) 
కదంబము: మిశ్రమము (A mixture) కదంబపొడి kadamba-poḍi. n. Pouncet. A fragrant powder compounded of various essence
చెమ్మతోన: తడితో, Damp, moist
వేష్టువలు: వేష్టనము: చుట్టుకొనడము (Surrounding, encompassing)


పసిడి గిన్నెల నించి: బంగారు గిన్నెలలో నింపి 
శిరసాదిగ: తల మొదలుగ 
దిగనలది: దిట్టముగా అలది
అచ్చెరపడి చూడ: ఆశ్చర్యపడి చూడగా
కన్నులకింపై: కన్నులకు చూడడానికి ఇంపుగా 


తట్టు పునుగే కూరిచి: పునుగుచట్టాన్ని కూర్చుకుని The perfume called Civet (పునుగు పిల్లి ఒక సమయంలో తన వంటిని దగ్గరలో ఉన్న చెక్కలకి గానీ, వస్తువులకి గానీ రుద్దుతుంది. ఆ సమయంలో ఆ పిల్లి నుంచి ఒక ద్రవం ఆ చట్రాలకి అంటుకుంటుంది.)   
చట్టలు చీరిచి: చంపు, చట్టలుపాపు, నాశనము చేయు  
నిప్పు పట్టి కరగించి: నిప్పులమీద పెట్టి కరిగించి 
వెండి పళ్యాల నించి: వెండి పళ్ళేలనిండా పునుగు తైలాన్ని నింపి
దట్టముగ మేనునిండ: శరీరం నిండా గట్టముగా పట్టించి, దిద్ది 
బిట్టు వేడుక: . హెచ్చు, అధికమైన సంతోషముతో Excess. A great action
మురియుచుండే: మురిసిపోతూన్న
బిత్తరి స్వామిని కంటి: ప్రకాశిస్తూ, సొగసుగా ఉండే స్వామిని చూశాను

భావం:-

శుక్రవారం శ్రీవారికి అభిషేకం గొప్ప కన్నులపండుగగా జరిగే విశేషమైన సేవ. అన్నమయ్య కాలంలో తప్పక జరిగేది.ఇప్పుడు కూడా జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత "నిజపాద దర్శనం" పేరుతో దర్శనానికి అనుమతిస్తారు. అన్నమయ్య శ్రీవారికి అభిషేకాలు జరుతున్నప్పుడు పక్కనే నిలబడి నలుగు పాటలు, అభిషేకం పాటలు, హారతి పాటలు పాడేవారు. అభిషేకం అయ్యాక చందన తాంబూలాది సత్కారాలు  అందుకునేవారు. అలాంటి ఓ శుక్రవారం శ్రీవారి అభిషేకం జరుగుతున్నప్పుడు రాసిన పాట ఇది. అభిషేకం జరిగే విధానాన్ని కళ్ళకు కట్టినట్టు రాశారు అన్నమయ్య. 


శుక్రవారం తెల్లవారు ఝామున ఏడు గడియలకి (అంటే, రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి (అర్ధరాత్రి పన్నెండు గంటలనుంచి) 7x24=168 నిముషాలు. అంటే, శుక్రవారం తెల్లవారు ఝామున 2:48 ని.లు.) అలమేల్మంగతో కూడిన శ్రీవేంకటేశ్వరునికి అభిషేకాన్ని కన్నులారా చూశాను. 


ముందుగా శ్రీవారి విగ్రహం పై ఉన్న ఆభరణాలన్నీ తీసేసి ఒక మూలగా పెట్టారు. ఒక పట్టు గోచీని చాలా అందంగా, నేర్పరితనం తో  చుట్టారు. అనేక రకాల సుగంధాలను (చందనము, కర్పూరము, కుంకుమపువ్వు) కలిపిన పొడిని (కదంబము) ఓ కప్పు, పన్నీటి నీటి లో కలిపి ఒంటిని అభిషేకించారు. బట్టలని పన్నిటి చెమ్మతో స్వామి వారి తలకి, హృదయము మీద, మొల చుట్టూ చుట్టారు. నల్లని తుమ్మెద రంగులో ప్రశాంతముగా ఉన్న స్వామిని చూశాను.


పచ్చకప్పురము బాగా మెత్తగా నూరి, బంగారు గిన్నెల నిండా నింపి భక్తిగా తెచ్చి, తల నుంచి పాదముల వరకూ బాగా అలదారు (పట్టించారు). నల్లని మేని పై మెరుస్తూన్న పచ్చకప్పురము తో - స్వామిని అందరూ ఆశ్చర్యపడి చూస్తుండగా, అందరి కన్నులకూ విందును కలిగిస్తూ తెల్లని మల్లెపూవు వలే ఉన్న స్వామిని నా కన్నులారా చూశాను.    


పునుగు పిల్లి రుద్ది వదలిన చట్రాలని తెచ్చి, వాటిని శుభ్రం చేసి, ఆ చట్రాలని నిప్పులమీద కరిగించగా వచ్చిన సుగంధపు తైలాన్ని వెండి పళ్ళేలనిండా నింపి పట్టుకొచ్చి శ్రీవారి శరీరానికి బాగా దట్టముగా పట్టించి, నుదుటను తిలకముగా దిద్దినప్పుడు జరిగే ఆ వేడుకలో మురిసి, మెరసిపోతున్న స్వామిని నా కన్నులారా చూశాను.


(ఇప్పటికీ తిరుమలలో పునుగు పిల్లుల్ని తి.తి.దేవస్థానం ప్రత్యేకంగా పెంచుతోంది. శ్రీవారి సేవలలో పునుగు పిల్లి తైలానికి ప్రత్యేకత ఉంది. ఈ పునుగు తైలం తో శ్రీవారి విగ్రహానికి మర్ధన చేయడం వల్లే ఇంతకాలం ఆ సాలగ్రామ విగ్రహం చెడిపోకుండా, పగుళ్ళులేకుండా ఉంది..సాక్షాత్తూ శ్రీవారి సేవకై పుట్టిన పునుగు పిల్లి జాతి ఎంత అదృష్టం చేసుకుందో కదా! ఆ తైలం తయారీ విధానం మనకి తెలియకపోయినా, క్రింది చరణంలో అన్నమయ్య కళ్ళకి కట్టినట్టు వివరించారు)


🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

సంఖ్య 61సంపుటం 2
రాగము :భాగేశ్వరి /గానము :-
శ్రీ పవన్ చరణ్ గారు 
స్వరకర్త :-
శ్రీ సాలూరి వాసూరావు గారు.


ఏ గతి నుద్ధరించేవో యింతటి మీదట మమ్ము
భోగపు గోరికలచే బొలిసెబో పనులు!!
        //పల్లవి //


పరఁగి నాలుక సొంపు పరసిపోయ 
పరులనే నుతియించి పలుమారును 
విరసపు బాపముల వినికిచే వీనులెల్లా 
గొరమాలె మాకు నేటి కులాచారములు!!
    //ఏగతి //


మొక్కలాన బర ధనమునకు జాచి చాచి 
యెక్కువ జేతుల మహి మెందో పోయ 
తక్కక పరస్త్రీల దలచి మనసు బుద్ధి 
ముక్కపోయ మాకు నేటి ముందరి పుణ్యములు!!
   //ఏగతి //


యెప్పుడు నీచుల ఇండ్ల కెడ తాకి పాదములు 
తప్పని తపములెల్లా దలఁగిపోయ 
యిప్పుడే శ్రీ వేంకటేశ యిటు నిన్ను గొలువఁగా 
నెప్పున నే జేసినట్టి నేరమెల్లా నడఁగె !!                
//ఏగతి //

🕉🌞🌎🌙🌟🚩

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-2
సంపుటము: 1-8.


ఇందిరానామ మిందరికి
కుందనపుముద్ద వో గోవింద !!


అచ్చుతనామము అనంతనామము
ఇచ్చినసంపద లిందరికి
నచ్చినసిరులు నాలుకతుదలు
కొచ్చికొచ్చీ నోగోవిందా !!

వైకుంఠనామము వరదనామము
ఈకడనాకడ నిందరికి
వాకుఁదెరపులు వన్నెలు లోకాలఁ
గూకులు వత్తులు నోగోవిందా !!


పండరినామము పరమనామము
ఎండలువాపెడి దిందరికి
నిండునిధానమై నిలచినపేరు
కొండలకోనేటివోగోవిందా!! 


🕉🌞🌏🌙🌟🚩

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩      

రాగము దేసాళం
గానం:- శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు


అతడే బ్రహ్మణ్య దైవము  వాడు 
ఆతని మానుటలెల్ల అవిథి పూర్వకము!!


ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల 
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు!!


అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
నెవ్వని నామములనే సంకల్పము!!


నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము!!


🕉🌞🌏🌙🌟🚩

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩      

గానం:శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు

॥పల్లవి॥       
కడవరాదు హరి ఘనమాయ  తెగి
విడువఁగ రాదు వేసరరాదు !!                       


చూపుల యెదిటికి సోద్యంబై నది
పాపపుణ్యములప్రపంచము
తీపులు పుట్టించు దినదినరుచులై
పూపలసంసారభోగములు !!                      


మనసులోపలికి మర్మంబైనది
జననమరణములశరీరము
వెనవెనకఁ దిరుగు వెడ లంపటమై
కనకపుటాసలకర్మములు !!
                      

తగుమోక్షమునకుఁ దాపయైన దిదె
నగి హరిఁ దలఁచిన నాలుకిది
వెగటు దీరె శ్రీవేంకటపతియై
యగపడె నిపుడు పురాకృతము !!


🕉🌞🌏🌙🌟🚩

:🌹.: 🕉🔯 ఓం   నమో వేంకటేశాయ 🕉🔯
*రోజుకో అన్నమయ్య  సంకీర్తన *
ఎదుట నున్నాఁడు వీఁడె యీ బాలుఁడు...
రేకు            : 370-1
సంపుటము: 11
సంకీర్తన      : 415
రాగము      : సాళంగం
తాళం         : ఆది
గానం : శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు

పల్లవి
ఎదుట నున్నాఁడు వీఁడె యీ బాలుఁడు
మదిఁ దెలియ మమ్మ యే మరులో కాని

చరణం 1
పరమపురుషుఁ డట పసులఁ గాచె నట
సరవు లెంచిన విన సంగతా యిది
హరియే తా నటముద్దు లందరికిఁ జేసె నట
యిర వాయ నమ్మ సుద్దు లేఁటివో కాని

చరణం 2
వేదాల కొడయఁ డట వెన్నలు దొంగిలె నట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూల మితఁ డటా ఆడికెల చాఁత లట
కా దమ్మ యీసుద్దు లెట్టికతలో కాని

చరణం 3
అల బ్రహ్మతండ్రియట యశోదకు బిడ్డఁడట
కొలఁ దొకరికిఁ జెప్ప గూడునా యిది
తెలిపి శ్రీవెంకటాద్రిదేవుఁడై నిలిచె నట
కల దమ్మ తన కెంత కరుణో కాని

🕉🔯 ఓం   నమో వేంకటేశాయ 🕉🔯


॥పల్లవి॥       
కడవరాదు హరి ఘనమాయ  తెగి
విడువఁగ రాదు వేసరరాదు !!                       


చూపుల యెదిటికి సోద్యంబై నది
పాపపుణ్యములప్రపంచము
తీపులు పుట్టించు దినదినరుచులై
పూపలసంసారభోగములు !!
                      

మనసులోపలికి మర్మంబైనది
జననమరణములశరీరము
వెనవెనకఁ దిరుగు వెడ లంపటమై
కనకపుటాసలకర్మములు !!
                      

తగుమోక్షమునకుఁ దాపయైన దిదె
నగి హరిఁ దలఁచిన నాలుకిది
వెగటు దీరె శ్రీవేంకటపతియై
యగపడె నిపుడు పురాకృతము!! 


🕉🌞🌏🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

గానం. ఎం. ఎస్. సుబ్బలక్ష్మి అమ్మ
రాగం. నాదరామక్రియ.


కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను నంటుచూపులను జూచే నగుమోదేవుని
కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను నంటుచూపులను జూచే నగుమోముదేవుని!!


కనకపుపాదములూ ..
కనకపుపాదములు గజ్జెలును అందెలునూ
కనకపుపాదములు గజ్జెలును అందెలునూ 
ఘన పీతాంబరముపై కట్టుకట్టారి
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు,
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు ఒనరనాభికమలం ఉదరబంధములూ!!


గరిమవరద హస్తా కటిహస్తములునూ సరసనెత్తిన శంఖచక్రహస్తములూ
ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములూ
ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములు తరుణీ అలమేలుమంగ ధరణిభామయునూ!!


కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులూ
కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులు కట్టాణి ముత్యాల సింగారనామము
నెట్టన శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు
నెట్టన శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు అట్టే శిరసుమీద అమరే కిరీటము!!

🕉🌞🌎🌙🌟🚩

భావము:--

     ఓ ప్రజలారా! నేను నిలువుగా ఉన్న చక్కని పుష్టిగల శరీరంతో శోభిల్లుచున్న స్వామిని చూచితిని. అంటు చూపులను ( స్నేహపూర్వకమైన దృష్టిని ) ప్రసరించుచున్న ప్రభువును చూచితిని. ఆ దేవుడు నవ్వుల మోము చూపి మనలను ధన్యులను చేయుచున్నాడు.


1. ఈ స్వామి కనకపు పాదములకు గజ్జెలు, అందియలు ధరించియున్నాడు. ఘనమైన పసుపు పచ్చని పట్టువస్త్రాలు ధరించి దానిపై నడుముకు కట్టుకొను కటారి ( ఖడ్గము ) ధరించియున్నాడు. ఈయనకు వడ్డాణము ఒనసినది ( బిగించబడియున్నది ). మొగపుల మొలనూలు ( పైకి కనిపించు మొలత్రాడు ) అదిగో. ఆయన నాభిలోనుండి పుట్టిన కమలము కూడా ఒనరియున్నది ( ఒప్పుచున్నది ). ఉదరబంధనము (పొట్టకు బిగించిన వస్త్రము ) అందముగా కనిపించుచున్నది. ఏమి ఈ దివ్య మంగళ విగ్రహము!! 


2. గరిమ మధ్యభాగంలో ఒకవైపు స్వామి వరద హస్తము,  ఒకవైపు నడుముపై అభయ హస్తము కనిపించుచున్నవి. సరసను ఎత్తిన శంఖ చక్రములున్న హస్తములు కనిపించుచున్నవి. ఉరముపై కౌస్తుభ మణి మొదలగు హారములు మెరయుచున్నవి. వాటికి ఇరువైపులా శ్రీదేవి మరియు భూదేవి అమఱియున్నారు.


3. ఈ శ్రీవేంకటేశ్వరునికి కంఠమున కంఠ సరులు కట్టి ఉన్నవి. భుజములకు గొప్ప భుజకీర్తులు బిగించియున్నవి. కట్టాణి ముత్యాలు ( ముత్యాల హారములు ) సింగారించబడిన చక్కటి నామం ఎంతో అందంగా మెరుస్తున్నాయి. ఓ ప్రభూ! నీకు కర్ణపత్రములు ( చెవి దుద్దులు ) నెట్టన ( తప్పకుండా ) ధరింపబడియున్నవి. అట్టే నీ శిరస్సు మీద కిరీటము అమఱియున్నది. నిన్నుజూచి నా జన్మ తరించింది తండ్రీ!


🕉🌞🌎🌙🌟🚩


❄ *ఓం నమో వేంకటేశాయ* ❄

*రోజుకో అన్నమయ్య సంకీర్తన*

*రోజూ మీకోసంచేస్తున్న సాహితీ యజ్ఞం* *కుదిరితే నేర్చుకోండి. లేదా, కనీసం ఒక్కసారి వినండి మరియు నలుగురితో పంచుకోండి.*

*-సూర్య ప్రకాష్ పోనుకుపాటి*

రాగం: రతిపతిప్రియ
స్వరకర్త &
పాడినవారు: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

*॥పల్లవి॥*
సకల లోకేశ్వరులు సరుస చేకొనువారు
అకలంకముగ పుష్పయాగంబు

*॥చ1॥*
వివిధ పుష్పములతో వేదఘోషములతో
అవల తిరువాముడియు అంగనల ఆటతో
కవి వందినులతో కమ్మపూజలతోడ
అవధరించీ పుష్పయాగంబు

*॥చ2॥*
కప్పుటపుటారతుల ఘనచందనముతోడ
తెప్పల ధూపముల తిరువందికాపుతో
ఒప్పు పణ్యారములు ఒగిపెక్కు వగలతో
అప్పడందు పుష్పయాగంబు

*॥చ3॥*
తగు ఛత్ర ఛామర తాంబూలముల తోడ
పగటుతో నీరీతి పదిపూజలందుకొని
జిగి మీరె చూడరే శ్రీవేంకటేశ్వరుని
అగణితంబగు పుష్పయాగంబు

❄ *ఓం నమో వేంకటేశాయ* ❄


అన్నమయ్యను నేను ఆదర౦బున పిలువ 
ఆరగించగ రార అరటి ఫలముల నీవు! 

పేద వాడిని గాన పాటలతొ మురిపింతు 
పవళించ రావేల పట్టె మంచము పైన! 

పాద సేవలు చేయ పద్మావతి యె రాగ 
పుణ్యమేమి చేసితినొ పురుషోత్తముని చూడ! 

ఏడుకొండ ల నెక్కి ఎలుగెత్తి పాడుతూ 
అలసి వుంటిని నేను అలిమేలు మంగపతి! 

నా పాట వినినంత నను బ్రోవ రావేల 
తిరుమల గిరి వాస శ్రీ..... శ్రీనివాస.....! 

శ్రీనివాసమూర్తి గంజాం 

శ్రీనివాసా గానామృతం
🕉🌞🌏🌙🌟🚩

(దైవానుగ్రహముతో:-- సాహిత్యం, సంగీతం& గానం:-కట్ల. శ్రీనివాసాచార్యులు)

ll పల్లవి ll
దాటగలర సంసార సాగరం
మహామహుల పడవేయు అగాధం
అనితర సాధ్యం అగమ్యగోచరం
ఆటుపోట్లనడుమా ఆదరికే చేరాం!!


llఅనుపల్లవిll
అందుకే హరినామ స్మరణయే ఓ చక్కని నావా
కైవల్యా తీరము నిను గోనిపోవు త్రోవా
కైవల్యా తీరము నిను గొనిపోవు జీవా!!


చిన్నపెద్ద ఆడమగ తేడాలు లేవండి
బీద సాద ధనికులనే దాయాగుణమే లేదండి
ఎంతటి వారినైనా ఇట్టే ముంచేయునండి
శ్రీహరి భక్తులు మాత్రమే క్షేమముగా చేరునండి!!


సునామీలు సుడిగుండా లుంటయీ సుమండీ
భార్యాపిల్లలు బంధుమిత్రులెవరురారండి
ఎపుడుముంచివేయునో ఎవరము తెలుసుకోమండి
అప్పడగు శ్రీహరినే నమ్ముకుంటే క్షేమమండి!!


ఎన్నాళ్ళు చూచినా ఏముందిర సారము
ఎంత మోసిన అంతము కానిది ఈ భారము
అందుకే మనందరికీ శ్రీహరే ఆధారము
మనమందరము వీడకూడదతని పాదము!!


సుడిగాలి మడుగులలో మనుగడ భారం
ఈ ధనము పదవులేవి రావు నీకు సహాయం
శ్రీనివాస దాసులౌటే తేలికుపాయం
శ్రీనివాస విభుని కొలిచిన వైకుంఠం ఖాయం!!

🕉🌞🌏🌙🌟🚩
అన్నమాచార్య సంకీర్తన
ప్రాంజలి ప్రభ 
తెలిసితేమోక్షము -
తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని!!

చ1: అనయము సుఖమేడది అవల దు:ఖమేడది
తనువుపై ఆశలేని తత్వమతికి పొనిగితే బాపమేది
పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమునొల్లన - యోగికిని!!

చ2: తగినయమృతమేది - తలపక విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికి పగవారనగ వేరే - 
బంధులనగ వేరే
వెగటు ప్రపంచమెల్ల -
విడిచే వివేకిని!!

చ3: వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములోనున్నవాడు
యీవలేది యావలేది - యితనిదాసునికి!!

--(())--


అన్నమయ్య సంకీర్తన
ప్రాంజలి ప్రభ 

రేకు: 70-5
సంపుటము: 1-368.

భోగీంద్రులును మీరుఁ బోయి రండు
వేగన మీఁదటి విభవాలకు !! 
॥పల్లవి॥

హరుఁడ పోయిరా అజుఁడ నీవును బోయి
తిరిగిరా మీఁదటి తిరుణాళ్ళకు
సురలు మునులును భూసురులుఁబోయి రండు
అరవిరి నిన్నాళ్ళు నలసితిరి  !!
॥భోగీం॥

జముఁడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుఁడవై రా సురలఁ గూడి
గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండు
ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి !!
॥భోగీం॥

నారద సనకసనందనాదులు
భూరి విభవములఁ బోయిరండు
దూరముగాఁ బోకిట్టే తొరలి వేంకటగిరిఁ
జేరి నన్నిట్లనే సేవించుఁడీ !!
॥భోగీం॥
--(())--

కీర్తనలో అర్ధాలు:
---------------------------

విభవాలకు = బ్రహ్మోత్సవాలు

అజుడ = బ్రహ్మ

అరవి(ము)రి = సగమువిరిసిన మొగ్గ

సుముఖుఁడవై = సంతోషకరమైన ముఖముగలవాడు

గుములై = పయనించువారై

ప్రమదాన = సంతోషముతో

తొరలి = మళ్ళీ

భావామృతం 
-----------------------
భోగములనుభవించుటకు అలవడిన ఓ మహామహులారా మీరంతా పోయి వచ్చే ఏడాది జరుగబోయే బ్రహ్మోత్సవాలకు మీకోసం ఎదురు చూస్తుంటాను.  ఓ శంకరా కైలాసం నుండి శ్రమ తీసికొని వచ్చావు. ఓ బ్రహ్మ నీవు బ్రహ్మోత్సవాలు జరిపి ఎంతో శ్రమపడ్డావు. మీరు వచ్చే తిరునాళ్ళకు తప్పక రావాలి. దేవతలారా మునులారా బ్రాహ్మణోత్మములారా ఇన్నాళ్ళూ అలసి సగమువిరిసిన మొగ్గ ఉన్నారు కనుక ఇప్పటికి పోయిరండి. ఓ యమధర్మరాజా తమది క్షణం తీరికలేని బాధ్యత ఓ చంద్రుడా నీవి అంతులేని బాధ్యత మళ్ళీ దేవతలతో కలిసి రండి. పయనించే దిక్పాలకులారా మీ మీ దిక్కులకు  మీరు పోయి రండి. ఇన్నాళ్ళు సంతోషముతో వున్నారు. అయినా ఎంతో అలసిపోయారు. మీరంతా పోయి మరలారండి. ఓ నారద సనక సనందనాది మునివరులారా గొప్ప ఉత్సవాలకు మళ్ళీ వచ్చే యేడాది తప్పక తిరిగిరండి. ఎంతో దూరం పోతే మీకు తిరిగి రావటానికి శ్రమ అవుతుంది. కనుక యెక్కువ దూరం పోకండి. మళ్ళీ వేంకటగిరి చేరి నన్ను ఇట్లాగే సేవించండి. జన్మసార్ధకం చేసికోండి అంటు అన్నమయ్య కీర్తించాడు.

--(())--
 శ్రీ రమణా శ్రీ రమణా వెంకటరమణా
🙏శ్రీనివాసా గానామృతం🙏
🕉🌞🌏🌙🌟🚩

సాహిత్యం, సంగీతం, గానం. ఆదేవదేవుడు శ్రీనివాసుని దయతో దాసుడు కట్ల. శీనివాసాచార్యులు


శ్రీ రమణా శ్రీ రమణా వెంకటరమణా
నీకై ఇంకెన్నాళ్లు ఈ వీక్షణా
నావల్లకాకుంది ఈ నిరీక్షణా!!
llశ్రీ రమణాll


మూన్నాళ్ల పయణమే ఈ నీటిబుడగ జీవితము 
చిలిపితనము చిఱుప్రాయం చిటికెలోన గడిచిపోయే
మదమాత్సర్యముల యవ్వనము ఎగిసి పడుతుంటే
నిలుకడేది మనుగడేది నిను కొలిచే తీరికేది!!
llశ్రీ రమణాll


ముప్పది వత్సరములన్ని మూన్నాళ్లలో గడిచిపోయే
ముంగిట మృత్యువు చేరీ మునుముందుకు సాగుచుండె
తుఛ్చపు కోరికలన్నీ త్రుంచుటకై చుట్టుముట్టి
ఆవురావురంటూ నను ఆవాహిస్తూ ఉంటే ఆగలేక తాళలేక తండ్రీ నిను శరణంటీ!!
llశ్రీ రమణాll


వృద్దాప్యము వచ్చువరకు ఈతనువుండునో లేదో 
ఉన్నా ఇంద్రియములు నిను కొలువ సహకరించేనా
అన్నీ ఉండగానే నన్ను తరియించి పోనీరా
శ్రీనివాసా దాసునీ శీఘ్రమేలగా రారా!!
llశ్రీ రమణాll




అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩
గానం. N. C. శ్రీదేవి గారు

రేకు: 312-2
సంపుటము: 4-68
రేకు రాగము: లలిత.


ఏ తపములు నేల యేదానములు నేల
శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము !!


దేహపుటింద్రియముల దేహమందే యణఁచుట
దేహముతోనే తాను దేవుఁడౌట
సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే
ఆహా దేవతలఁ తనందే తాఁ గనుట !!


వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే
కులికి తపోధనము గూడపెట్టుట
తలఁపు తనయందే తగ లయము సేయుటే
లలిఁ పాపబంధముల లయము సేయుట !!


వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే
మునుపనే తా జీవన్ముక్తుఁడౌట
పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే
అనువైన దివ్యపదము అప్పుడే తా నందుట !!

🕉🌞🌏🌙🌟🚩

భావము:--


జన్మసాఫల్యం చెందాలంటే ఏతపమో ఏ దానమో చేయవలెనా? అవసరం లేదంటున్నారు అన్నమయ్య. శ్రీసతీవల్లభుని నిత్యసేవగా ఆరాధించువారికి జన్మ సఫలమవుతుందని వేరే చెప్పవలెనా? ఒక మానవమాత్రుడు దేవుడవ్వాలంటే బ్రహ్మవిద్యేమీ కాదు. దేహములో అలజడి కలిగించు ఇంద్రియాలను అణచుటే సశరీరంగా మనిషి దేవత్వం పొందటానికి అర్హత నిస్తుంది. సోహలను (సోహం భావనతో) బయటకానబడేదిగాక లోనగానబడే ఆత్మను దర్శించుటే దేవతలను తనలోనే దర్శించుటవంటిది. ఒకసారి శ్రీవేంకటేశుని శరణంటే దివ్యపదమును తాను అప్పుడే అందుకొనుట వంటిది.


     ఏవిధమైన తపములు యెందులకు? ఏవిధములైన దానములు కూడా యెందులకు? శ్రీతరుణీపతి (రమాకాంతుని) నిత్యసేవే (అనుదినము సేవించుటే) జన్మఫలము (జన్మ సాఫల్యత కలిగించును).


1. దేహమునకు సంబంధించిన ఇంద్రియములను దేహమునందు అణచుటయే సశరీరముగా తానే దేవుడౌట (దైవత్వమును పొందుట) వంటిది. సోహం (ఆత్మయే నేను) అనే భావముతో వెలిజూచే చూపు (బాహ్యముగా చూచే చూపు) లోను జూచుటే (అంతర్ముఖునిగా చూచుటయే). దీనినే దేవతలను తనలోనే దర్శించుట అని భావించ వచ్చును.


2. ఆలోచించి చూస్తే తపోధనము కూడబెట్టుట అంటే యేమిటి? వెలుపలికి రావలసిన 'నిట్టూర్పు' గాలిని వెళ్ళకుండ (బయటకు పోకుండా) ఆపుటయే. ఈ విధమైన ప్రాణవాయువు నిరోధమున గొప్ప తపోదీక్ష కొనసాగించవచ్చు. ఆలోచనలను తనలోనే నిరోధించుచు, తనలోనే లయము సేయుటే తన పాపబంధనములను లయము చేయుటతో సమానము.


3. వెనుక (ఆపైన) సంసారమున విషయసుఖాసక్తుడుగాక విషయ విముక్తుడై యుండుటే మేలు. ఈ విధముగా వుంటే అందరికంటే ముందే జీవన్ముక్తుడవుతాడు. పనివి (పూనుకొని) శ్రీవేంకటేశ్వరా! నీ పదములను శరణంటే, అప్పుడే తనంతటతానే అనువైన దివ్యపదము లభ్యమవుతుంది.


🕉🌞🌏🌙🌟🚩

అన్నమయ్య సంకీ ర్తన
      
రేకు: 27-3
సంపుటము: 1-164
సంస్కృతకీర్తన.


ll పల్లవి ll
బ్రువంతి బౌద్ధా బుద్ధ ఇతి
స్తువంతి భక్తా సులభ ఇతి !!


గదంతికిల సాంఖ్యాస్త్వాం పురుషం
పదవాక్య జాః పదమితిచ
విదంతి త్వా వేదాంతిన-
స్సదా బ్రహ్మ లసత్పదమితిచ  !!


జపంతి మీమాంసకా స్త్వాం చ
విపులకర్మణో విభవ ఇతి
లపంతి నయసకలా స్సతతం
కృపాళుకుర్తా కేవలమితిచ !!


భణంతి వేంకటపతే మునయో-
హ్యణిమాదిప్రద మతులమితి
గుణవంతం నిర్గుణం పునరితి
గృణంతి సర్వే కేవలమితిచ !!

🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తనలు
రేకు: 9-6
సంపుటము: 1-6
రాగము: కళ్యాణి. .... 1


ll పల్లవి ll

ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే
వేదవిరహితులకు వెఱతు మటుగాన !!

ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁ
బరికించవలెఁగాని భజియింపరాదు
గరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ_
స్మరణ విజ్ఞానవాసన గాదుగాన !!

యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకు
సహజమనవలెఁగాని సరిఁ గొలువరాదు
అహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగు
గ్రహియింపరా దవగ్రాహములు గాన !!

యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁ
జింతింపవలెఁగాని సేవింపరాదు
అంతయు ననరుహమును నరుహంబనఁగరాదు
అంతవానికిఁ బరుల కలవడదుగాన!!

__(())--

ఈ కీర్తనలోని అర్ధాలు
----------------------------------
వేదవిరహితులకు = వేదములను నమ్మనివారు
గరిమచెడి = భ్రష్టుడైన
దవగ్రాహములు = భక్తి జ్ఞానములకు అడ్డంకులు

భావామృతం :--
-------------------------
ఓ దేవదేవా నాకు ఏది చూచినా నీ రూపమే కనుపిస్తుంది. మరి ఇన్నింటిలోనూ నీవే వున్నట్లు తోచుచున్నది. కానీ వేదములను నమ్మనివారు కొందరుంటారు. వారంటే మాత్రం నేను భయపడతాను. ఆ నాస్తికులకు పెరధర్మముల వారికి నావిదే విన్నపములు. రకరకములైన ఈ దేవతారూపంబులలో నున్న నిన్ను గమనించి దర్శించవలెను అంతేకాని వారి భజన చేయరాదు.

ఎందుకంటే ఎవడైన హరిభక్తుడు భ్రష్టుడై సత్సంగమును విడిచిపెడితే నీయొక్క స్మరణ వాడికి విజ్ఞాన వాసన కలిగించదు. అందుకని సత్సంగము ద్వారా సదా నీ స్మరణలో వుండాలి కాని కుతర్కములు పనికిరావు. ఇహలోకంలో ప్రాపంచిక కోరికలు కోరినట్లే తీర్చే దేవతలు అనేక వైభవాలతో దీప్తించుచుందురు. వారికాశక్తి అనుగ్రహించినది నీవే. ఆ వైభవం అందువలన వారికి సహజమే అనుకొనవలెను. అంతేగాని వారిని గొలువరాదు.

ఆ హిమాంశుడైన చంద్రుని కిరణములు పడని చోటు బయట వుంటుందా. ఆ కిరణాలలో దారి చూసుకోవాలి గాని శృంగారభావాలను పొందరాదు. ఎందుకని అవి భక్తి జ్ఞానములకు అడ్డంకులు. అందుచేత ఓ శ్రీవేంకటేశ్వరా ఇదంతా నీ అస్ధిత్వము తగినట్లు ఇట్లు భావించుట దోషముకాదు.

కానీ యెవరిన పడితే వారిని సేవించరాదు. నీ సృష్టిలో అన్నీ అర్హమే అయినప్పటికీ విష్ణు విరహితములు సేవించుటకు అనర్హంబులు.వాటిని అనర్హములననేకూడదు. ఎందుకంటే అంత హరియే అనే భావన ఆ వేదవిరహితులైన ఇతరులకు ఆ భావన అలవడదు కదా అందుకని అంటు అన్నమయ్య కీర్తించాడు.

ఓం శ్రీ రామ్ .... ఓం శ్రీ మాత్రేనమ: .... శ్రీవేంకటేశ్వరాయణమ:....
***

అన్నమయ్య సంకీర్తన

రేకు: 227-2
సంపుటము: 3-151
రేకు రాగము: ధన్నాసి.


వీఁడె వీఁడె కూచున్నాఁడు వేడుకతో గద్దెమీఁద
వాఁడిప్రతాపముతోడి వరదానసింహము!!
            

అరయఁ ప్రహ్లాదుని ఆపదోద్ధారసింహము
గిరిపై యిందిరకును క్రీడాసింహము
నిరతి సురలభయ నివారణ సింహము
సరి హిరణ్యకసిపు సంహార సింహము!
                

ఇట్టె విశ్వమునకునేలికైన సింహము
గట్టిగ శరణాగతులఁ గాచే సింహము
దిట్టయై వేదాలలోని తెరవేఁట సింహము
నెట్టుకొని దురిత నివారణ సింహము!!
             

అంచల మూఁడుమూర్తులకాధారమైన సింహము
పంచల మునుల భాగ్య ఫలసింహము
పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము
చెంచుల అహోబలపు శ్రీనారసింహము!!

🕉🌞🌎🌙🌟🚩

భావము:-

     ఓ ప్రజలారా! సంతోషంతో సింహాసనముపై కూర్చునియున్న సింహము వీడే.  వీడే వాడి ప్రతాపము ( తీక్షణమైన పరాక్రమము )తో పెక్కు వరములను దానము చేయు సింగము.


1. చూడగా ప్రహ్లాదునికి ఈయన ఆపదోద్ధారక సింహము ( తండ్రి పెట్టు ఆపదల నుంచి రక్షించిన నరసింహుడు ). ఈ కొండమీద లక్ష్మీ దేవికి ఇతడు క్రీడా సింహము ( వలపు సయ్యాటలు ప్రదర్శించు సింహము ). దేవతలకు భయమును ప్రీతితో నివారించిన సింహము. హిరణ్యకశిపుని సరి సంహారక సింహము ( వాడి వరములన్నింటికీ సరిపోలు విధముగా సంహరించిన సింహము ). ఈ స్వామిని కీర్తించండి.


2. ఈ నరసింహుడు ఇట్టే ( తేలికగా ) విశ్వపాలకుడైనాడు. తనను శరణన్న వారిని గట్టిగ ( సమర్థవంతంగా ) రక్షించు సింహమితడే. దిట్టయైనవాడని వేదములు కీర్తించిన ఈ దేవదేవుడు 'తెరవేట' సింహము. ( తెరవేట లేదా ఏదువేట అనునది వేటలోని ఒక విధానము. ఈయన అటువంటి వేటలో దిట్ట. ) ఈ స్వామి నెట్టుకొని ( పూనుకొని ) పాపములను నివారించిన సింహము.


3. ఈ మహానుభావుడు అంచెల మూడుమూర్తులకు ఆధారమైన సింహము. ( సృష్టియందు బ్రహ్మకు, స్థితియందు విష్ణువునకు, లయమున ఈశ్వరునకు ఆధారభూతుడైన నరసింహుడు ). మునులకు వారి భాగ్యములను పంచి ఇచ్చు సింహము. ఈ స్వామియే పొంచి వెంకటాద్రికి అలంకారమైన సింహము. ఇచ్చట చెంచుల ( అడవిలో ) ఈయన అహోబల నారసింహుడై శరణాగత రక్షకుడై ఉన్నాడు.


🕉🌞🌎🌙🌟🚩

రోజుకొక అన్నమయ్య కీర్తన 

రేకు: 962-1
సంపుటము: 19-355
రేకు రాగము: సాళంగం.

మెఱుఁగువంటిది అలమేలుమంగ
అఱిముఱి నవ్వీని అలమేలుమంగ  !!

పలచనియెలుఁగునఁ పాడీ నీమీఁదిపాట
మెలుపుఁగూరిమి నలమేలుమంగ
చెలులతో నీసుద్ది చెప్పిచెప్పి కరఁగీని
అలయుచు సొలయుచు అలమేలుమంగ !!

యీడుగా నీరాకకు నెదురెదురు చూచీ
మేడమీఁద నుండి యలమేలుమంగ
వాడుమోముతో నీపై వలపు చల్లిచల్లి
ఆడీ నాట్యము సారె అలమేలుమంగ !!

పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి
మేరమీర నిన్ను అలమేలుమంగ
యీరీతి శ్రీ వేంకటేశ నిన్నుఁ కూడెఁనేఁడు
ఆరితేరె అన్నిటాను అలమేలుమంగ!!

--(())--

భావము :-

     (ఓ శ్రీనివాసా! ఈ మా అలమేలుమంగమ్మ ఎటువంటిదంటావేమో? వినుము ప్రభూ!) మా అలమేలుమంగ మెరుగు (ఆకాశంలోని మెఱపు) వంటిది. ఆమె నిన్ను చూడగానే... అరిమురి (సంభ్రమముతో) నవ్వుతుంది.

1. పలుచని యెలుగున (సన్నని గొంతుతో) మా అలమేలుమంగమ్మ నీ మీద పాటలు అల్లి పాడుతూనేవున్నది. ఆమెకు నీపై అంత మెలుపు కూరిమి (గాఢమైన ప్రేమ)వున్నది. తన చెలికత్తెలకు నీ కబుర్లు చెప్పి చెప్పి ఆ పరవశంలో కరిగిపోయి అలసిపోయింది, సొలసి పోయింది. (అట్టి మా అలమేలుమంగమ్మను అనుగ్రహించవయ్యా!)

2. మా అలమేలుమంగమ్మ, ఈడుగా (ఆలస్యమైన)నీరాక కోసం యెదురెదరు (ఎదురతెన్నులు) మేడ మీదనుంచి యెలా చూస్తున్నదో చూడవయ్యా! ఆమె సారెకు (మాటిమాటికీ), నీపై వలపు కురిపించీ నాట్యమాడీ ఆడీ, వాడుమోముతో (వాడిపోయిన మొగముతో) ఎలావున్నదో చూశావా? (నీకింకా దయరాదేమయ్యా? 

3. మా అలమేలుమంగమ్మ నీ ప్రియురాలవటంచేత నీ పేరును యెన్నిసార్లు పిలిచిందో లెక్కలేదు. మేరమీద ( అమితముగా ) నీ నామస్మరణ చేస్తూనే వున్నది. ఓ శ్రీవేంకటేశ్వరా! ఆమె ఈ విధంగా నేడు నిన్ను గూడినది. నీ సాంగత్యంలో మా అలమేలు మంగ అన్నిటిలోనూ ఆరితేరింది ప్రభూ!

--(())--

శ్రీ రామదాసు కీర్తన

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

ప: ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా

నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ ||

చ 1: శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా

కారుణ్యాలయ భక్తవరద నిను - కన్నది కానుపు రామా || ఏతీరుగ ||

చ 2: మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా

మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా || ఏతీరుగ ||

చ 3: క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా

దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా || ఏతీరుగ ||

చ 4: గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా

గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడ నైతిని రామా || ఏతీరుగ ||

చ 5: నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా

నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా ||ఏతీరుగ ||

చ 6: వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా

భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా || ఏతీరుగ ||

చ 7: వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా

దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా || ఏతీరుగ ||

--(())--


 2-శ్రీ రామదాసు కీర్తన

వరాళి రాగం ఆది తాళం.

ప: అంతా రామమయం ఈ జగమంతా రామమయం || అంతా ||


చ1: అంతరంగమున ఆత్మారాము డ

నంత రూపమున వింతలు సలుపగ || అంతా ||


చ2: సోమ సూర్యులును సురలు తారలును

ఆ మహాంబుధులు నఖిల జగంబులు || అంతా ||


చ3: అండాండంబులు పిండాండంబులు

బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ || అంతా ||


చ4: నదులు వనంబులు నానా మృగములు

విదిత కర్మములు వేదశాస్త్రములు || అంతా ||


చ5: అష్ట దిక్కులును ఆదిశేషుడును

అష్ట వసువులును అరిషడ్వర్గము || అంతా ||


చ6: ధీరుడు భద్రాచల రామదాసుని

కోరిక లొసగెడి తారక నామము || అంతా ||

****


 -శ్రీ రామదాసు కీర్తన

రామ జోగిమందు కొనరే ఓ జనులారా || రామ ||


అ ప: రామజోగి మందుకొని - ప్రేమతో భుజియించుడన్న
కామక్రోధ లోభమోహ - ఘనమైన రోగాలకు మందు || రామ ||


చ1: కాటుక కొండలవంటి - కర్మములెడబాపే మందు
సాటిలేని జగమునందు - స్వామిరామ జోగిమందు || రామ ||


చ2: వాదుకు చెప్పినగాని - వారి పాపములు గొట్టి
ముదముతోనే మోక్షమిచ్చే - ముద్దు రామజోగిమందు || రామ ||


చ3: ముదముతో భద్రాద్రియందు - ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు - ముదముతో సేవించే మందు || రామ ||

🕉🌞🌏🌙🌟🚩


82. కంటి నఖిలాండకర్త

కంటి అఖిలాండ కీర్తనధికుని గంటి/ కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తిఁ గంటి ॥
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
మహనీయ ఘనఫణామణుల శైలము గంటి/ బహు విభవముల మంటపములు గంటి/ సహజ నవరత్న కాంచనవేదికలు గంటి/ ర హివహించిన 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🔴🌟గోపురంబులవె కంటి |

పావనంబైన పాపవినాశనము గంటి/ కైవశంబగు గగనగంగ గంటి/ దైవికపు పుణ్య తీర్ధములెల్ల పొడగంటి /కోవిదులు కొనియాడు కోనేరుఁగంటి ॥
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🔴🌟🔴🌟🌟🌟🌟
పరమయోగీంద్రులకు భావగోచరమైన /సరిలేని పాదాంబుజములు గంటి /తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి/ తిరువేంకటాచలధిపు చూడఁగంటి ॥
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🔴🔴🌟🌟🌟🌟🌟
(సంపుటి 4, సంకీర్తన, 58

🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 65-2
సంపుటము: 1-335

అందరి బ్రదుకులు నాతనివే
కందువెల్ల శ్రీకాంతునిదే 
॥పల్లవి॥

వేమరుఁ జదివెడి విప్రుల వేదము
సోముకవైరి యశోవిభవం
శ్రీమించున మరల జీవనమెల్ల సు-
ధామథనునిసంతత కరుణే 
॥అంద॥

హితవగు నిలలో నీసుఖమెల్లను
దితి సుతదమనుఁడు దెచ్చినదే
తతి తల్లి దండ్రి తానై కాచిన
రతి ప్రహ్లదవరదుని కృపే 
॥అంద॥

ఆలరినయమరేంద్రాదుల బ్రదుకులు
బలిబంధనుకృపఁ బరగినవే
బలసి మునుల యాపదలు వాపుటకు
బలునృపభంజను పరిణతలే 
॥అంద॥

పూని యనాథుల పొందుగఁ గాచిన-
జానకీవిభుని సరసతలే
నానాభూభరణంబులు నందుని-
సూనుఁడు చేసినసుకృతములే 
॥అంద॥

తలకొని ధర్మము తానై నిలుపుట
కలుషవిదూరునిగర్వములే
నిలిచి లోకములు నిలిపినఘనుఁడగు.-
కలియుగమున వేంకటపతివే 
॥అంద!!

🕉🌞🌎🌙🌟🚩

కీర్తనలో అర్ధాలు:
------------------------

కందువెల్ల = చమత్కారమంతా

సుధామథనుని = అమృతమథనుడైన

సంతతకరుణే = నిరఃతర కృపాప్రసాదమే

దితిసుతదమనుఁడు = దానవ భంజనుడైన

పరిణతలే = ఒసగబడిన ఆనందములే

పూని = పూనికతో

నానాభూభరణంబులు = అనేకరకములైన భూభారములను

భావామృతం 
-----------------------
ఈ జీవులందరి బ్రతుకులునూ అతనివే. ఆయన కృప వలన ఆ జీవికి ఆ బ్రతుకు దక్కింది. ఆ చమత్కారం అంతా ఆ శ్రీకాంతునిదే. బ్రహ్మణులు అనేక పర్యాయములు వల్లించు వేదములన్నియు ఆనాడు మత్స్యావతారంలో శ్రీహరి వేదములను దొంగిలించిన సోమకాసురుని వధించి తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చి కాపాడావు. సంపదలను మించిన అమృతమథనుడైన శ్రీహరి నిరంత కృపాప్రసాదమే. ఈ ఆనందమే అన్నివేళలా క్షేమము నొసగునది. ఎందుకంటే ఆది వరాహమై దానవభంజనుడైన శ్రీహరి ప్రసాదమే. అమిత నిశ్చయంతో యెల్లరకు తల్లియును తండ్రియునూ తానే అయి సంరక్షించిన వాడు. దేవేంద్రాది దేవతల బ్రతుకులన్నీ ఆనాడు బలిచక్రవర్తి నాశనం చేయగా అతనిని పాతాళమునకు తొక్కిన వాడు. మునులను పీడిస్తున్న వానిని చంపి వారికి ఆనందం కలిగించిన వాడు అతడు. పూనికతో కోదండదీక్షాదక్షుడై గొప్పగా అనాథలను కాపాడి అనుగ్రహించిన సర్వమూ అతడే.  అనేకరకములైన భూభారములను తొలగించేందుకు రేపల్లెలో నందగోపుని బిడ్డడై యాదవుడై శ్రీకృష్ణుడై ఉన్నాడు. తాను చెప్పినదే ధర్మమం చేసినదే న్యాయము అని తెలుపుటకే శ్రీవేంకటేశ్వరుడై నిలిచి లోకములన్నీ నిలిపిన ఘనుడై కలియుగనారాయణుడై మనవంటి వారికి రక్షకుడైనాడు అంటు అన్నమయ్య కీర్తించాడు.


🕉🌞🌎🌙🌟🚩


అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

రేకు: 351-2
సంపుటము: 4-298
రేకు రాగము: పళవంజరం.


ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు

పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము
సిరులొసగే యీ శ్రీ వేంకటేశుడు!!


కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు!!


తగిలిన మునులకు తపముల సత్ఫలము
ముగురు వేల్పులకు మూలము
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీ వేంకటేశుడు!!

🕉🌞🌎🌙🌟🚩

భావము:-

ఓ భక్తులారా! వినండి …
ఇతడొక్కడే సర్వేశ్వరుడని కీర్తించదగినవాడు. ఈయన సిత కమలాక్షుడు (తెల్లని పద్మనయనుడు). ఈయనే శ్రీవేంకటేశ్వరుడు. అందరికీ ఈయనే ఆధారము, గతి, దిక్కు అయ్యాడు.


1. ఇతడు పరమయోగులకు భావనలలోని నిధానము (నెలకొని యున్న రూపమ). ఇంద్రుడు మొదలైన దేవతలకు ఐశ్వర్యముల నొసగే దేవదేవుడు. రేపల్లెలో గొల్ల భామలకు గొప్ప కౌగిటి సౌఖ్యప్రదాత. ఇన్ని చేసిన ఈయన వేరెవరో కాదు. మనందరికి సిరిసంపదల నొసగే శ్రీవేంకటేశ్వరుడు.


2. అతడు యశోదాదేవి బిడ్డయైన మాణిక్యము. తననే తలచి 'రావే ఈశ్వర! కావవే... వరదా! సంరక్షించు... నీవే తప్ప ఇతః పరంబెరుగను...' అని గజేంద్రుడు మొరబెట్టుకున్న తగుదిక్కు. అక్కడ ద్రౌపదీదేవికి మానసంరక్షణ చేసి ఆపదల నివారించిన బంధువు. ఇన్ని విధముల విజృంభించిన ఈ మహానుభావుడే శ్రీవేంకటేశ్వరుడు.


3. ఈయన తననే అంటి పెట్టుకొనిన మునులకు వారి తపములిచ్చిన సత్ఫలితము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని కీర్తించబడుతున్న ముగ్గురు వేల్పులకు, మూలకారణమైన పరబ్రహ్మము ఈయనే. క్రమముగా జగజ్జనని అలమేల్మంగమ్మకు కలిగిన మగడు ఈయన. ఈ సర్వేశ్వరుడే అసదృశమైన కాంతులతో విరాజిల్లే మన శ్రీవేంకటేశ్వరుడు.

🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

గానం::శ్రీ మల్లాది. కృష్ణమూర్తి గారు
రేకు: 16-1
సంపుటము: 1-95.


ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె
వేదు విడిచిన కూడు వెదకినను లేదు!!


ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు
పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక
యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి
కైకొన్నదురితములు కలపాటిగాక !!


హితవైనమమకార మెందుఁగల దిందరికి
ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక
మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు
జితమైన దైవమిచ్చిన పాటిగాక !!


యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకు
పరిమైనకర్మంబు పరిపాటిగాక
యెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁ
దిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక  !!


🕉🌞🌎🌙🌟🚩

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 2-4
సంపుటము: 1-10.


సహజ వైష్ణవాచార వర్తనుల-
సహవాసమె మా సంధ్య !! 
॥పల్లవి॥


అతిశయమగు శ్రీహరిసంకీర్తన
సతతంబును మాసంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురతమెఱసిన సంధ్య !!
॥సహజ॥


పరమభాగవతపదసేవనమే
సరవి నెన్న మాసంధ్య
సిరివరుమహిమలు చెలువొందఁగ వే-
సరక వినుటె మాసంధ్య !!
॥సహజ॥


మంతుకెక్క తిరుమంత్రపఠనమే
సంతతమును మాసంధ్య
కంతుగురుఁడు వేంకటగిరిరాయని-
సంతర్పణమే మాసంధ్య  !!
॥సహజ॥

🕉🌞🌎🌙🌟🚩

కీర్తనలో అర్ధాలు:
------------------------

వర్తనుల=నడిచే వారు

సహవాసమె=సహజీవనం

సంధ్య=సంధ్యావందనం

రామానుజమతమే=శ్రీరామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతమతము

చతురతమెఱసిన=నేర్పరితనం చాటునట్లు

సరివి=క్రమము

సిరివరు=శ్రీహరి

వేసరక=విసుగు లేకుండా

మంతుకెక్కె=ప్రసిద్ధి చెందిన

సతతము=ఎల్లప్పుడూ

కంతుగురుడు=మన్మధుని గురువు

సంతర్పణమే=తృప్తి గా సేవించడం


భావామృతం:-
____
  
వైష్ణవ ఆచారములను నమ్మి నడిచేవారు సహజీవనం చేస్తు జీవించుటయే సంధ్యావందనం. మా వైష్ణవులకు నిరంతరం శ్రీహరి నామ సంకీర్తనమే విశిష్ఠమైన సంధ్యావందనం. త్రికరణశుద్ధి గా విశిష్టాద్వైతము అవలంభించుటమే మా మొక్క నేర్పరితనం చాటునటు వంటి సంధ్యావందనం. శ్రీమన్నారాయణుడే సర్వస్వం అని సద్భుద్ధితో సన్మార్గంలో జీవించే పరమ భాగవతోత్తములను గురువులుగా గౌరవించుచు వారి పాదసేవనము చేస్తూ ఒక పద్ధతి గా జీవించుటయే నిజమైన సంధ్య. శ్రీపతియైన శ్రీహరి యొక్క దివ్య మహిమల గురించి విసుగు లేకుండా శ్రద్ధగా వినుటయే సంధ్యావందనం. నారాయణ మంత్రమే త్రికరణశుద్ధిగా ఎప్పుడు జపించుటయే మాకు సంధ్యావందనం అన్నమయ్య కీర్తించాడు.

🕉🌞🌎🌙🌟🚩

 అన్నమయ్య సంకీర్తన
ప్రాంజలి ప్రభ 
రేకు: 132-3
సంపుటము: 2-129
రేకు రాగము: శంకరాభరణం.


నీవు సర్వసముడఁవు నీవు దేవదేవుఁడవు
ఈవల నా గుణదోషాలెంచ ఇంకనేలా!!

పూవులపైఁ గాసీఁ పొరి ముండ్లపైఁ గాసీని
ఆవల వెన్నెలకేమి హానివచ్చీనా
పావనుల నటు గాచి పాపపుంజమైన నన్నుఁ
కావఁగా నీకృపకునుఁ కడమయ్యీనా!!

గోవు మీఁద విసరీఁ కుక్క మీఁద విసరీని
పావనపు గాలికిని పాపమంటీనా
దేవతల రక్షించి దీనుఁడనైన నాకుఁ
దోవచూపి రక్షించితే దోసమయ్యీనా!!

కులజుని యింటనుండీ కులహీనుని యింటనుండీ
యిలలోన ఎండకు ఏమి హీనమయ్యీనా
వలసి శ్రీవేంకటాద్రి వరములు యిచ్చి నాలో
నిలిచి వరములిచ్చి నేఁడు గావవే!!

--(())--

భావము:-

     మానవమాత్రులకు స్వపర బేధముంటుంది కానీ నీవు దేవదేవుడవు. సర్వులూ నీకు సమానులే. నేను మానవాధముడనని ఒప్పుకొన్నాక ఇంక నా గుణదోషములనెంచినందువలన ప్రయోజనమేమిటి స్వామీ! అంటున్నారు అన్నమయ్య. సుకుమారమైన పూవులపై కాసేది వెన్నెలయే. గుచ్చిబాధించు ముండ్లపై కాసేది వెన్నెలే. వెన్నెలకేమన్నా హానికలుగుతుందా? పావనులైన వారిని కాచేది నీకృపే. నాబోటి పాపరాశులను కాచేది నీదయయే. నాబోటి ఒక్కడిని ఉద్దరించినందువల్ల, నీకేమన్నా లోటు కలుగుతుందా ప్రభూ! అంటున్నారు.

     ఓ దేవదేవా! నీవు సర్వ సముడవు (అందరూ సమానులే అని భావించు లోక పితవు). కానీ నేను మానవమాత్రుడను. ఈవల (ఇటుపైన) నా గుణదోషాలెంచి ప్రయోజనమేమిటి ప్రభూ!

1. దేవా! నీవు వెన్నెల వంటివాడవు. పూవులపై కాచేదీ పండువెన్నెలే, బాధించే ముండ్లపై కాచేదీ పండువెన్నెలే. ముండ్ల మీద కాసినంతమాత్రాన వెన్నెలకేమన్నా హాని కలుగుతుందా? పావనులైనవారిని కాచేది నీ కృపయే. నాబోటి పాపపుంజమైన వారిని కాచేదీ నీ కరుణయే. నన్నొక్కడిని కాచినంతమాత్రాన నీకు కడమయ్యీనా! (లోటేమన్నా కలుగుతుందా ప్రభూ!)

2. చక్కటి గాలికి, అటు పవిత్రమైన గోవు మీద విసరినా, లేక ఇటు కుక్క వంటి అల్ప జంతువు మీద విసరినా భేదమేముంటుంది? కుక్క మీద వీచినంతమాత్రాన గాలి అపవిత్రమైపోతుందా? నీవు నిత్యమూ నీ ఆశ్రితులైన దేవతల్ని రక్షించుతూనే వుంటావు కదా! దీనుడనైన నాబోటి వానినొక్కని రక్షించినంత మాత్రాన, దోవ జూపి కాపాడినంతమాత్రాన నీకేమన్నా దోషం అంటుకొంటుందా? ప్రభూ!


3. వెలుగులు వెదజల్లే మార్తాండునికి అగ్రకులజుడి ఇంటిమీది యెండ పడేట్లు చేసినా లేక కులహీనుడి ఇంటిమీద యెండపడేలా చేసినా, ప్రపంచంలో ఎండకు కలిగే హాని యేమన్నా వున్నదా? వలసి (కావలెనని యోచిస్తే) పవిత్రమైన శ్రీవేంకటాద్రిపై నీవిచ్చే వరములకు నాలో అంతర్యామివై నిలిచి నీవిచ్చే వరములకు తేడా యేమీ లేదు. అందుకని నేడే నన్ను కావుమయ్యా!

--(())--

అన్నమయ్య సంకీర్తన
ప్రాంజలి ప్రభ 

రేకు: 100-2
సంపుటము: 1-502
రేకు రాగము: పాడి.

ఎదుట ఎవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైన వారికి !!

ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల
అంచిత నామములే యీ అక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాదమే రుచులెల్లా
తెంచివేసి మేలు దాఁ తెలిసేటివారికి !!

చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే
భారపుయీ భూమెత నీపాదరేణువే
సారపుఁకర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి !!

చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
హత్తిన ప్రకృతి యెల్లా ఆతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లేవు ఇతరములు
తిత్తిదేహపుబ్రతుకు తెలిసేటివారికి !!

--(())--

భావము:-

     హరిదాసునికి యెదుట ఎవ్వరు లేరు (కనిపించరు). ఇంతా విష్ణుమయమే (అంతా విష్ణుమయమే). హరిదాసుల వర్గములో చేరిన వారందరి పరిస్థితి ఇదే సుమండీ!

1. వారికి ఈ జగమంతా అతిశయించిన నారాయణ మూర్తులే, ఏ అక్షరం చూచినా నారాయణ నామమే, ఏ పదార్థం రుచి చూచినా అది శ్రీహరి నివేదించిన ప్రసాదమే. తనకి మేలు, కీడు వొక్కటేయని గ్రహించిన వారికి అంతా శ్రీహరియే అనే తలంపు వస్తుంది.

2. అట్టివారికి భూమిపై పారే నదులన్నీ శ్రీపాద తీర్థమే (ఆకాశగంగయే).  ఘనమైన భూమండలమంతా శ్రీహరి పాదరేణువే. అతను కర్మచేసినా  శ్రీపతికి కైంకర్యం చేస్తాడు. ధీరులై వివేకముతో సర్వమూ తెలిసిన వారికి ప్రతిదీ హరి నైవేద్యమే.

3. వారి చిత్తములో యే భావము కలిగినా అందులో శ్రీవేంకటేశ్వరుడుంటాడు. ఈ ప్రకృతి అంతా హరి మాయ వలన సృజించబడినదే. అసలు జీవనగమ్యం తెలిసిన వారికి ఈ దేహము తొమ్మిది రంధ్రములున్న తోలుతిత్తి. హరివుంటేనే ఇది "ప్రాణి", అతను లేక మరెవ్వరూ లేరు.

--(())--

అన్నమయ్య సంకీర్తన
రేకు: 29-5
సంపుటము: 1-180.


మనసున నెప్పుడు మానదిది
దినబాధెటువలె దీఱీనో  !!
॥పల్లవి॥


చిత్త వికారము జీవుల పాపము
తత్తరపరచక తడయ దిది
కత్తులభొనీ కాయపు వయసున-
నెత్తినమదమున కేదిగతో !!
॥మనసు॥


అసలుఁగంబ మీయాశాదోషము
విసిగిన నూరక విడువ దిది
వసులమూఁట మోవఁగఁ బడవేయఁగ
వసము గాని దెటువలెనౌనో !!
॥మనసు॥


పాము చెలిమి రంపపుసంసారము
గాములమోఁచిన గంప యిది
కామించుచు వేంకటపతిఁ దలఁపక
యేమరివుండిన నేమౌనో !!
॥మనసు॥

🕉🌞🌏🌙🌟🚩

భావామృతం:- 
------------------------

మనసు ఎప్పుడూ మారదు. దీని బాధ ఎలా తీరుతుందో. మనసు వికారము జీవుల పాపము. తత్తరపడిన ఆలస్యము చేయును ఇది. కత్తులతో పొడిచిన శరీరము వయసున నెత్తికెక్కిన మదము ఏది దిగదు. ఆశల గంప ఈ ఆశాదోషము విసిగిన ఊరకే విడువదు ఇది. వసులమూట మోయక పడవేయగా స్వాధీనము కాని ఎట్ల సాధ్యమౌనో. పాముతో స్నేహము వంటిది ఈ రంపము వంటి సంసారము. పాములు మోసే గంప ఇది. వేంకటపతి నిన్ను వదలకుండా తలచుకుంటు ఎవరు ఉండగలరో ఏమో అర్ధం కావడం లేదు స్వామి అంటు అన్నమయ్య కీర్తించాడు. 

***
అన్నమయ్య సంకీర్తన

రేకు: 227-2
సంపుటము: 3-151
రేకు రాగము: ధన్నాసి.


వీఁడె వీఁడె కూచున్నాఁడు వేడుకతో గద్దెమీఁద
వాఁడిప్రతాపముతోడి వరదానసింహము!!
            

అరయఁ ప్రహ్లాదుని ఆపదోద్ధారసింహము
గిరిపై యిందిరకును క్రీడాసింహము
నిరతి సురలభయ నివారణ సింహము
సరి హిరణ్యకసిపు సంహార సింహము!
                

ఇట్టె విశ్వమునకునేలికైన సింహము
గట్టిగ శరణాగతులఁ గాచే సింహము
దిట్టయై వేదాలలోని తెరవేఁట సింహము
నెట్టుకొని దురిత నివారణ సింహము!!
             

అంచల మూఁడుమూర్తులకాధారమైన సింహము
పంచల మునుల భాగ్య ఫలసింహము
పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము
చెంచుల అహోబలపు శ్రీనారసింహము!!

🕉🌞🌎🌙🌟🚩

భావము:-

     ఓ ప్రజలారా! సంతోషంతో సింహాసనముపై కూర్చునియున్న సింహము వీడే.  వీడే వాడి ప్రతాపము ( తీక్షణమైన పరాక్రమము )తో పెక్కు వరములను దానము చేయు సింగము.


1. చూడగా ప్రహ్లాదునికి ఈయన ఆపదోద్ధారక సింహము ( తండ్రి పెట్టు ఆపదల నుంచి రక్షించిన నరసింహుడు ). ఈ కొండమీద లక్ష్మీ దేవికి ఇతడు క్రీడా సింహము ( వలపు సయ్యాటలు ప్రదర్శించు సింహము ). దేవతలకు భయమును ప్రీతితో నివారించిన సింహము. హిరణ్యకశిపుని సరి సంహారక సింహము ( వాడి వరములన్నింటికీ సరిపోలు విధముగా సంహరించిన సింహము ). ఈ స్వామిని కీర్తించండి.


2. ఈ నరసింహుడు ఇట్టే ( తేలికగా ) విశ్వపాలకుడైనాడు. తనను శరణన్న వారిని గట్టిగ ( సమర్థవంతంగా ) రక్షించు సింహమితడే. దిట్టయైనవాడని వేదములు కీర్తించిన ఈ దేవదేవుడు 'తెరవేట' సింహము. ( తెరవేట లేదా ఏదువేట అనునది వేటలోని ఒక విధానము. ఈయన అటువంటి వేటలో దిట్ట. ) ఈ స్వామి నెట్టుకొని ( పూనుకొని ) పాపములను నివారించిన సింహము.


3. ఈ మహానుభావుడు అంచెల మూడుమూర్తులకు ఆధారమైన సింహము. ( సృష్టియందు బ్రహ్మకు, స్థితియందు విష్ణువునకు, లయమున ఈశ్వరునకు ఆధారభూతుడైన నరసింహుడు ). మునులకు వారి భాగ్యములను పంచి ఇచ్చు సింహము. ఈ స్వామియే పొంచి వెంకటాద్రికి అలంకారమైన సింహము. ఇచ్చట చెంచుల ( అడవిలో ) ఈయన అహోబల నారసింహుడై శరణాగత రక్షకుడై ఉన్నాడు.

***
అన్నమయ్య సంకీర్తన


నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే !!


నిత్యాయ విబుధ సంస్తుత్యాయ
నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం
గత్యాయ జగదవన కృత్యాయతే నమో !!


కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ
మురవైరినే జగన్మోహనాయ
తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర
పరితోష చిత్తాయ పరమాయతే నమో!!


పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ
ధాత్రీశ కామితార్థప్రదాయ
స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర
నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో!!

🕉🌞🌎🌙🌟🚩

భావము :-

నారాయణునికి నమస్కారం. గుణములు కలిగిన బ్రహ్మమునకు ,సర్వ సృష్టియందు శ్రద్ధ కలవానికి, అందమైన రూపము కలవానికి నమస్కారము.


1.  ఎప్పుడునూ  ఉండువాడా! పండితుల పొగడ్తలందుకొనేవాడా! ఎప్పుడూ అధికారము కలవాడా!  ముని జనములందు ఖ్యాతి కలవాడా! సత్యవంతుడా!, కనులు మొదలైన ఇంద్రియములకు కనపడువాడా! మంచి మనస్సులతో స్నేహము కలవాడా!, ప్రపంచాన్ని రక్షించే  క్రియ కలవాడా! ఓ నారాయణా! నీకు నమస్కారము.
 

2.  గజేంద్రునికి వరమునిచ్చిన వాడా! కౌస్తుభమను మణిని ( కుస్తుభ=సముద్రమందు బుట్టినది) రొమ్ములోఆభరణముగా కలిగినవాడా! మురుడను రాక్షసుడు శత్రువుగా కలవాడా! ప్రపంచమును మోహింపచేసే ఆకారము కలిగిన వాడా! నెలవంకని కిరీటముగా ధరించిన శివుని భార్యయైన పార్వతీదేవి యొక్క మనస్సుతో కూడిన స్తోత్రముతో సంతోషించిన మనస్సు కలవాడా! పరమాత్ముడా! నీకు నమస్కారము.


3.  యోగ్య దాన
 ఉత్సవాలతో ప్రసిద్ధమైన వేంకటేశుడా! నారాయణుడా! నీకు నమస్కారము. మహారాజులకు(గొప్ప అధికారులకు) కోరిన కోర్కెలు అనుగ్రహించేవాడా! ఇంద్రనీల మణి కాంతితో మనోహరమైన శరీరము కలవాడా! సూర్య చంద్రులు నేత్రములుగా కలవాడా! శేషాచలము నివాసముగా కలవాడా! యోగ్య దాన ఉత్సవాలతో ప్రసిద్ధమైన వేంకటేశుడా! నారాయణుడా! నీకు నమస్కారము.
****
రేకు: 13-5
సంపుటము: 1-81


అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ!!   


ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక!!


యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలడొకఁడే!!


యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు    !!
***
గానం: శ్రీ వేదవ్యాస
          ఆనంద భట్టార్ గారు
రాగం: అభేరి.


ఇదియే సులభము
ఇందరికి
కదియగ వశమా
కరుణనే కాక!!


నగధరుండు
పన్నగశయనుడు
భూగగనాంతరిక్ష
గాత్రుడు
అగణితుడితని
అరసి తెలియగా
తగునా కనెడిది
దాస్యమె కాక!!


కమలజ జనకుడు
కాముని జనకుడు
కమలాసతిపతి
ఘనగుణుడు
విమలుడీ హరి
వెదకి కానగను
అమరునా
శరణాగతిగాక!!


దేవుడు త్రిగుణాతీతు
డనంతుడు
కైవల్యమొసగు
ఘనుడు

శ్రీ వేంకటపతి
జీవాంతరాత్ముడు
భావింపవశమా
భక్తిన కాక!!
   ***

రేకు: 1130-4
సంపుటము: 21-173
రాగము: కాంబోది.

పల్లవి
కానీవయ్య అందుకేమి కనుకొనే మన్నియును
తేనెల మా మోవితీపు దిమ్ము రేఁచును!!


చరణం 1
నగినట్లనె వుండు నాతోడి పొందులు
చిగురించఁ జిగురించ చేఁగలెక్కును
యెగసక్యాలై యుండు ఇప్పుడు నేనన్నమాట
తెగరాని ఆసలతో తీగెసాగును!!
॥కానీ॥


చరణం 2
దక్కినట్లనే వుండు తతి నాతో చేఁతలెల్ల
చిక్కినప్పుడు చేతికి జిడ్డుదేరును
లెక్కసేయనట్లుండ్లు లేఁతమాసరసాలు
వక్కణతో వలపు పూవక పూచును!!
॥కానీ॥


చరణం 3
పట్టినట్లనే వుండు పై పై మాతో పంతములు
మట్టుపెట్టి ముయికి ముయి మళ్లించును
ఇట్టె శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
పట్టినచలములెల్లా పంటవండును!!
॥కానీ॥   

****

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 261-2
సంపుటము: 3-350.


ll పల్లవి ll
పాపము పాపము ప్రజలాలా
పైపై నిటువలెఁ బలుకకురో !!


ll చరణం ll
హరియందుఁ బుట్టినజుఁడును శివుఁడును
హరితో సరి వీరనుటెట్లూ
పొరిఁ గొండలందుఁ బుట్టిన శిలలివి
వరుసఁ బెట్టితే సరియౌనా  !!


ll చరణం ll
యిందిరాధిపుని విలఁగల సిరులివి
అంది మరొకరివి అనుటెట్లు
కొందరము యేరుగుడిచి కాలువలఁ
బొంది పొగడితేఁ బొసఁగీనా  !!


llచరణం ll
శ్రీవేంకటపతి సేవకులకు సరి
ఆవల మరి కలరనుటెట్లు
కావించిన యల కామధేనువుల-
కేవి యూరఁబ
సు లీడవునా !!
***
అన్నమయ్య సంకీర్తన                                                                                                                                                                                        
***                                                                                                                                                                  రాగము: మోహన స్వర కర్త: వాసు రావు                   
రేకు: 0096-01
సంపుటము: 1-477.


॥పల్లవి॥       
ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని
విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని!!


॥చరణం1॥       
యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు
కందువ రాఘవుఁడు ఖండించునాఁడు
ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే
గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు!!


॥చరణం2॥       
యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి
వేడుకతో హరివిల్లు విఱిచేనాఁడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు
కూడ బట్టి సంజీవికొండ దెచ్చేనాఁడు!!



॥చరణం3॥       
జముఁ డెక్కడికిఁ బోయ సరయువులో మోక్ష-
మమర జీవుల కిచ్చె నల్లనాఁడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి
తిమిరి శ్రీవేంకటపతికి నేఁడు నాఁడు!!

***
 
అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నరులార నేఁడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభములొసఁగెను!!


॥చ1॥సందించి వైశాఖ శుద్ద చతుర్దశి శనివార -
మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు
పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద
కందువ గోళ్ళఁ జించెఁ గనక కశిపుని!!



॥చ2॥నరమృగరూపము నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచిరక్షించి నిలిచె
గురుతర బ్రహ్మాండ గుహలోనను!!


॥చ3॥కాంచనపు గద్దె మీఁద గక్కనఁ గొలువై యుండి
మించుగ నిందిరఁ దొడమీఁద బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచనసేయక మంచివరాలిచ్చీనదివో!!
***
అన్నమయ్య సంకీర్తన                ... 1
                                                       
పాడిన వారు: శ్రీ గరిమెళ్ళబాల కృష్ణ ప్రసాద్ గారు.                                 
రాగము: ఆనంద భైరవి
రేకు: 0026-5
సంపుటము: 5-148.

॥పల్లవి॥
ఇట్టిముద్దులాఁడిబాలుఁ డేడవాఁడు వానిఁ
బట్టితెచ్చి పొట్ట నిండఁ బాలు పోయరే!!


॥చరణం1॥ 
గామిడై పారితెంచి కాఁగేటివెన్నలలోన
చేమపూవుకడియాలచేయి వెట్టి
చీమ గుట్టెనని తనచెక్కిటఁ గన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే!!


॥చరణం2॥ 
ముచ్చువలె వచ్చి తనముంగై మురువులచేయి
తచ్చేటిపరుగులోనఁ దగఁ బెట్టి
నొచ్చెనని చేయి దీసి నోరనెల్లఁ జొల్లుగార
వొచ్చెలి వాపోవునాని సూరడించరే!!


॥చరణం3॥ 
యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి పెట్టెలోన
చెప్పరానివుంగరాల చేయి వెట్టీ
అప్పడైనవేంకటేశుఁడాపాలకుఁడు గాన
తప్పకుండ పెట్టె వానితల కెత్తరే!!
***

1. కమలాంబికే ఆశ్రితకల్పలతికే చండికే
రాగం: తోడి, తాళం: రూపకం
ముత్తుస్వామి దీక్షితార్ కమలాంబ నవావరణ కృతి (ధ్యాన కృతి)

పల్లవి

కమలాంబికే ఆశ్రితకల్పలతికే చండికే
కమనీయారుణాంశుకే కరవిధృత శుకే మామవ

అనుపల్లవి

కమలాసనాది పూజిత కమలపతే బహువరదే
కమలాలయ తీర్థవైభవే శివే కరుణార్ణవే

చరణం

సకల లోకనాయికే సంగీతరసికే
సుకవిత్వ ప్రదాయికే సుందరి గతమాయికే
వికళేబరముక్తిదాననిపుణే అఘహరణే
వియదాది భూతకిరణే వినోదచరణే అరుణే
సకళేగురుగుహకరణే సదాశివాంతఃకరణే
అకచటతపాదివర్ణే అఖండైకరస పూర్ణే



తుమ్మెద పదము
శ్రీరాగం - ఏకతాళం

పల్లవి
తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక నొల్లవుగా మమ్మునో తుమ్మెదా

చరణములు
1. తోరంపు రచనల తుమ్మెదా కడుఁ దూరేవు గొందులే తుమ్మెదా

2. దూరిన నెఱుఁగవు తుమ్మెదా మమ్ము నోరగఁ జూడకువోతుమ్మెదా

3. తొలుప్రాయపు మిండ తుమ్మెదా కడుఁ దొలిచేవు చేఁగలే తుమ్మెదా

4. తొలుకరి మెఱుఁగవే తుమ్మెదా యింక నులికేవు మముఁగని తుమ్మెదా

5. దొరవు వేంకటగిరి తుమ్మెదా మా తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకె నీ చనవులు తుమ్మెదా యింక నొరు లెఱింగిరి గదవో వోతుమ్మెదా

తాళ్ళపాక అన్నమాచార్య శృంగారసంకీర్తన
అన్నమయ్య సంకీర్తన
ప్రాంజలి ప్రభ 
రేకు: 356-1
సంపుటము: 4-327
రేకు రాగము: శ్రీరాగం.

ఓ పవనాత్మజ ఓ ఘనుఁడ
బాపు బాపనఁగఁ పరగితిగా !!

ఓ హనుమంతుడ వుదయాచలని -
ర్వాహక నిజ సర్వ ప్రబల -
దేహము మోఁచిన తెగువకు నిటువలె
సాహసమిటువలెఁ చాటితిగా !!

ఓ రవిగ్రహణ ఓ దనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపువినతాతనయాదులు
గారవింప నిటు గలిగితిగా !!

ఓ దశముఖహర ఓ వేంకటపతి -
పాదసరోరుహపాలకుఁడా
యీ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా !!

భావము:-

    పవనపుత్రుడైన కలశాపురం హనుమంతుని కీర్తిస్తూ అన్నమాచార్యులవారు చెప్పిన కీర్తన ఇది. నేటికాలంలో మనం 'బాబోయ్! అని ఆశ్చర్యపోతుంటే అన్నమయ్యకాలం నాటి తెలుగు వారు 'బాపురే!' అని ఆశ్చర్యపోయేవారు. విశేషమేమంటే 'సాహసమిటువలె చాటితిగా' అనే మాట నేటి కాలంలో 'సాహసమిట్లు చాటితివిగా', అని ప్రయోగిస్తున్నాం. 'రవిగ్రహణ', 'దశముఖ హర' అనే మాటలు అన్నమాచార్యులవారి 'ముద్ర' వున్న అసాధారణ సంబోధనలు.

     వాయునందనుడవైన ఓ ఆంజనేయా! ఓ ఉద్దండుడా! నీ భక్తులందరు 'బాపురే!' అని ఆశ్చర్య పోవునట్లు వర్ధిల్లితివి కదా!

1. తూర్పునవున్న 'ఉదయాచలము'ను నిర్వహించిన ఓ హనుమంతా! అన్ని విధములా వ్యాపించిన మహానుభావా! సూర్య గమనమునకు అనుగుణంగా మహాకాయమును దాల్చి ఇటువంటి సాహసము చూపించితివి (సూర్యని ద్వారా వేదములను నేర్చుటకు స్వామి గొప్ప ఆకారముతో సూర్యుని అనుసరిస్తూ, వింటూ ఏకసంతాగ్రాహిగా వేద విద్య నేర్చాడు.) ఇటువంటి ధైర్యము (సూర్యుని దగ్గరకు ముఖం పెడితే కాలి బూడిదైపోతాం కదా!) ఇంకొకరికి వుంటుందా?

2  ( చిన్న పాపాయిగా వున్నప్పుడే సూర్యుని తినే పండు అనుకొని ఆ సూర్యుని 'గ్రహించుటకు' ఎగిరి పట్టుకోబోయాడు.) అంత అల్లరి పిల్లవాడా! ఓ రాక్షసాంతకా! లంకలో ఎదురులేక చిత్తమొచ్చిన రీతి వ్యవహంరించితివి కదా!వినతాసుతుడైన గరుత్మంతుడు తను స్వయంగా గొప్ప శక్తిమంతుడై కూడ నిన్ను తన సాటివానిగా గుర్తించి ఆదరించగా ఈ విధముగా ప్రబలినాడవు కదా!

3. పదితలల రావణాసురుని గర్వభంగము జేసిన ఓ మారుతీ! శ్రీ వేంకటేశ్వరుని పాదపద్మములను తలదాల్చు మహానుభావా!ఇటువంటి అసదృశమైన దేహముతో ఇన్నిలోకములను నీ దేహము అధిగమించునట్లు నిలిచితివి కదా! నీ పరాక్రమము సాటిలేనిది.

--(())--

యూరప్ వాసుల యొక్క నిస్సహాయత -
మన భారతీయుల అజ్ఞానం.

 1. ఎనిమిది నెలల చలి కారణంగా, కోట్స్ ప్యాంటు ధరించడం వారి నిస్సహాయత.  *పెళ్లి రోజున వేసవి వేడిలో కోట్లు మరియు ప్యాంటు ధరించడం, మన అజ్ఞానం.

 2. తాజా ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల, పిజ్జా, బర్గర్లు, కుళ్ళిన పిండితో నూడుల్స్ తినడం యూరప్ యొక్క నిస్సహాయత. * మరియు 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ₹400 /- యొక్క రోటీ (పిజ్జా) తినడం మన అజ్ఞానం. 

3.తాజా భోజనం యొక్క లోటు వల్ల ఫ్రీజ్ వాడడం, యూరోప్ యొక్క నిస్సహాయత.
*రోజూ తాజా కూరగాయలు దొరికినప్పటికి, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి మురిగేటట్టు చేసి తినడం,మన అజ్ఞానం.

4.ఔషధ మొక్కల,మూలికల పరిచయం లేక , వారు జీవ జంతువుల మాంసంతో మందులు తయారు చేయడం, వారి నిస్సహాయత.  *ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, జంతువుల మాంసం ద్వార సేకరించినటువంటి మందులు
ఉపయోగించడం మన అజ్ఞానం.

5. సరిపడ ధాన్యం లేకపోవడంతో జంతువులను భుజించడం, వారి నిస్సహాయత.
*160 రకాల ఆహార ధాన్యాలు లభించినప్పటికి, నాలుక రుచి కోసం మూగజీవాలను చంపి తినడం మన అజ్ఞానం.

6. శీతల పానీయాలు తాగడానికి వివశులు కావడం వారికి లస్సీ, సల్ల, మజ్జిగ, పాలు, రసం, షికాంజీ మొదలైనవి లేకపోవడం  నిస్సహాయత.
*36 రకాల పానీయాలు అందుబాటులో ఉన్నా, శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ద్వారా తమను తాము ఆధునికంగా భావించండం మన  అజ్ఞానం.

అభ్యర్థన: భారతీయ సంస్కృతి ప్రత్యేకమైనది, పురాతనమైనది మరియు గొప్పది. దీనిని పరిగణించాలి.


శ్రీ అన్నమయ్య సంకీర్తన


పాడిన వారు: SP బాలసుబ్రహ్మణ్యం 
రాగము: మలహరి
రేకు: 0037-01
సంపుటము: 1-227.


॥పల్లవి॥
అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
లందు వెలుగొందీ ప్రభ మీరఁగాను!!


॥చరణం1॥
తగ నూటయిరువై యెనిమిది తిరుపతుల గల
స్థానికులును చక్రవర్తి పీఠకములును
అగణితంబైన దేశాంత్రుల మఠంబులును
నధికమై చెలువొందఁగాను!!


॥చరణం2॥
మిగుల నున్నతములగు మేడలును మాడుగులు
మితిలేని దివ్య తపసులున్న గృహములును
వొగి నొరగుఁ బెరుమాళ్ళ వునికి పట్టయివెలయు
దిగువ తిరుపతి గడవఁగాను!!


॥చరణం3॥
పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొంది
పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి
చెదరకే వంక చూచిన మహాభూజములు
సింహశార్దూలములును!!


॥చరణం4॥
కదిసి సురవరలు కిన్నరులు కింపురుషులును
గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు
విదితమై విహరించు విశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను!!


॥చరణం5॥
యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద-
యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద
అక్కజంబైన పల్లవరాయని మటము
అలయేట్లపేడ గడవ
చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద-
నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు
అంతంతఁ గానరాఁగాను!!


॥చరణం6॥
బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల-
నీడలను నిలిచి నిలిచి
గగనంబు దాఁకి శృంగార రసభరితమై -
కనకమయమైన గోపురములనుఁ జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గల నగరు
సరుగననుఁ గానరాఁగాను!!


॥చరణం7॥
ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
లంతంత వీఁడి పారఁగను
యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశుఁడాదరిని
యేప్రొద్దు విహరించఁగాను!!

🕉️🌞🌏🌙🌟🚩

7. రచన: అన్నమాచార్య

కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు
రాగం: యమునా కళ్యాణి
తాళం: ఆది

భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేహం సదా ||

కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానమ్ |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ ||

నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదమ్ |
తిరువేంకటాచల స్థితమ్ అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలమ్ ||

--((*))--
9 *ఓం నమో వేంకటేశాయ* 
*రోజుకో అన్నమయ్య సంకీర్తన*
*రోజూ మీకోసంచేస్తున్న సాహితీ యజ్ఞం*
*రాగము: లలిత*
రేకు: 1108-4
సంపుటము: 21-40
॥పల్లవి॥ సోబాన బాడేము మేము సుదతులము
యీబుద్దులు మీకుఁ జెల్లు నిద్దరికి నయ్యా
॥చ1॥ చూపులనే వుంకువలు సుదతికిఁ బెట్టితివి
పూపనవ్వులు మించేకప్పువిడేలు
యేపుమీరి నవ్వులనే యెదురుతెర వేసితి-
వీపొద్దే పెండ్లాయను మీకిద్దరికినయ్యా
॥చ2॥ తరితీపుమాటనే తలఁబాలు వోసితి
గరిమ సరసములే కంకణాలు
గొరబైనవలపుల కొంగులు ముళ్లువేసితి-
విరవాయ వేడుకలు ఇద్దరికినయ్యా
॥చ3॥ పొంచినకెమ్మోవినే బువ్వపువిందు వెట్టితి
మంచముపై కాఁగిలే మంచిచవికె
అంచలశ్రీవేంకటేశ అలమేలుమంగ నీవు
యెంచి కూడితిరి తగు నిద్దరికినయ్యా.
--((*))--

8. రచన: అన్నమాచార్య

రాగం: మధ్యమావతి

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ||

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ||

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ||

--((*))-

 

అన్నమయ్య సంకీర్తన

సంగీతం:గానం.శ్రీ మంగళం పల్లి బాలమురళికృష్ణ గారు
రేకు: 3-7
సంపుటము: 1-20.

ll పల్లవి ll
అన్నియును నతని కృత్యములే
యెన్నియైనా నవు నతఁడేమి సేసినను!!

ll చరణం ll
అణురేణు పరిపూర్ణుఁడవలి మోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే!!

ll చరణం ll
పురుషోత్తముని భక్తి పొరపొచ్చ మైతే
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీఁది చింత పాయక నిజం బైతే
నిరతిఁ బట్టినవెల్లా నిధానములే !!

ll చరణం ll
మదనగురుని సేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యములు పాపంబులే
పదిలమై వేంకటపతి భక్తి గలిగితేను
తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే!!
...
అన్నమాచార్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు గానం.

నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే ||

నిత్యాయ విబుధ సంస్తుత్యాయ |
నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ |
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం |
గత్యాయ జగదవన కృత్యాయతే నమో ||

కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ |
మురవైరినే జగన్మోహనాయ ||
తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర |
పరితోష చిత్తాయ పరమాయతే నమో ||

పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ |
ధాత్రీశ కామితార్థప్రదాయ |
స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర |
నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో ||
....
భావము :-

నారాయణునికి నమస్కారం. గుణములు కలిగిన బ్రహ్మమునకు ,సర్వ సృష్టియందు శ్రద్ధ కలవానికి, అందమైన రూపము కలవానికి నమస్కారము.

1.  ఎప్పుడునూ  ఉండువాడా! పండితుల పొగడ్తలందుకొనేవాడా! ఎప్పుడూ అధికారము కలవాడా!  ముని జనములందు ఖ్యాతి కలవాడా! సత్యవంతుడా!, కనులు మొదలైన ఇంద్రియములకు కనపడువాడా! మంచి మనస్సులతో స్నేహము కలవాడా!, ప్రపంచాన్ని రక్షించే  క్రియ కలవాడా! ఓ నారాయణా! నీకు నమస్కారము.
 
2.  గజేంద్రునికి వరమునిచ్చిన వాడా! కౌస్తుభమను మణిని ( కుస్తుభ=సముద్రమందు బుట్టినది) రొమ్ములోఆభరణముగా కలిగినవాడా! మురుడను రాక్షసుడు శత్రువుగా కలవాడా! ప్రపంచమును మోహింపచేసే ఆకారము కలిగిన వాడా! నెలవంకని కిరీటముగా ధరించిన శివుని భార్యయైన పార్వతీదేవి యొక్క మనస్సుతో కూడిన స్తోత్రముతో సంతోషించిన మనస్సు కలవాడా! పరమాత్ముడా! నీకు నమస్కారము.

3.  యోగ్య దాన ఉత్సవాలతో ప్రసిద్ధమైన వేంకటేశుడా! నారాయణుడా! నీకు నమస్కారము. మహారాజులకు(గొప్ప అధికారులకు) కోరిన కోర్కెలు అనుగ్రహించేవాడా! ఇంద్రనీల మణి కాంతితో మనోహరమైన శరీరము కలవాడా! సూర్య చంద్రులు నేత్రములుగా కలవాడా! శేషాచలము నివాసముగా కలవాడా! యోగ్య దాన ఉత్సవాలతో ప్రసిద్ధమైన వేంకటేశుడా! నారాయణుడా! నీకు నమస్కారము.
......
02-05-201=20
అన్నమయ్య సంకీర్తన

నిడు రేకు: 54-1
సంపుటము: 4-567.

బొడ్డు తామెరలోన గడ్డివయసు పెద్ద-
బిడ్డఁ గన్నట్టివాడుఁ పిన్నవాడు ॥

బిరుసైన దొకకొండ పెనుబాముతోఁ జుట్టి
బిరబిరనె త్రిప్పే పిన్నవాఁడు
గురుతైనదొకకొండ గొడగుగా నొకచేత
పెరికి పట్టేవాఁడు పిన్నవాఁడు॥

బెడిదంపు శిశుపాలు పెనుమోఁతతోగూడ
పెడచేతనే వేసెఁ బిన్నవాఁడు
పడవేసి చాణూరుఁ బట్టి యురము దొక్కి
పిడికిటనే చంపే పిన్నవాఁడు    ॥

ఎక్కడఁ జూచినఁ నింతటఁ దానై
పెక్కురూపములైన పిన్నవాఁడు
ఇక్కడఁ దిరువేంకటేశుఁడై జగమెల్ల
పిక్కిటిల్లినవాడు పిన్నవాఁడు॥
      
..
01-05-2018
అన్నమయ్య సంకీర్తన

గానం. శ్రీ పి. బి. శ్రీనివాస్ గారు
రేకు: 16-3
సంపుటము: 1-97
రేకు రాగము: నాట
ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు
నెవ్వరికి నేమౌనొ యీ జీవుఁడు !!

ఎందరికిఁ కొడుకుగాఁడీజీవుఁడు వెనక
కెందరికిఁ తోబుట్టఁ డీజీవుఁడు
యెందరిని భ్రమయించఁడీజీవుఁడు దుఃఖ-
మెందరికిఁ గావింపఁడీజీవుఁడు !!

యెక్కడెక్కడఁ తిరుగఁడీజీవుఁడు వెనక-
ఎక్కడో తనజన్మ మీ జీవుఁడు
యెక్కడి చుట్టము యీ జీవుఁడు యొప్పు-
డెక్కడికి ఏగునో యీ జీవుఁడు !!

ఎన్నఁడును చేటులేనీజీవుఁడు వెనక-
ఎన్ని తనువులు మోవఁడీ జీవుఁడు
యెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ తగిలి
యెన్నిపదవులఁ పొందఁడీజీవుడు!!

భావము:-
     ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో జన్మించుచున్నాడు. జనన మరణాత్మకమైన సంసారచక్రములో పరిభ్రమించుచున్నాడు. ఇట్టి జీవుడు ఏ యే జన్మలలో ఎవరెవరికి ఏయే వావివరుసలలో సంబంధపడియున్నాడో నిర్ణయించుట కెవరి తరము ?
విచారించగా జీవులలో ఒకరితో నొకరికెట్టి సంబంధమును లేదు.

1. ఈ జీవుడెన్నో జన్మములలో ఎందరికో కొడుకై జన్మించినాడు. పూర్వము తానెందరికో తోబుట్టువుగా పుట్టినాడు. ఎందరినో ఎన్నో విధముల పుత్రమిత్ర కళత్రాది సంబంధములతో భ్రమింపజేసినాడు. ఎందరినో ఎన్నో రీతుల దుఃఖముల పాలు చేశారు.

2. ఈ జీవుడు తిరుగని చోటే లేదు. ముందటి జన్మల ఎన్నో చోట్ల
పలు రూపులతో జన్మించి తిరిగియున్నాడు. తానున్న జన్మములో ఇతడెక్కడ పుట్టనున్నాడో? ఈ జన్మములో మాత్రము తనకీజీవుడేవిధముగా అనుగు చుట్టము కాగలడు ? ఇతడెప్పుడెక్కడికి పోవునో తెలియదుగదా !

3. ఇన్ని జన్మలు దాల్చుచున్నను, ఇన్నిసార్లు మరణించుచున్నను నిజముగా ఈ జీవునకు మాత్రము ఎట్టి చేటును లేదు. పూర్వమితడెన్నో తనువులు దాల్చినాడు. తాను దాల్చిన శరీరములే చేటందుచున్నవి గాని సనాతనుడైన జీవాత్మునకేమాత్రము చేటు లేదు. శ్రీవేంకటేశ్వరుని మహా మాయా ప్రభావమునకు లోబడి ఈ జీవుడెన్నో పదవులు పొందుచున్నాడు.
....
అన్నమయ్య సం
కీర్తన
గానంll శ్రీసత్తిరాజు. వేణుమాధవ్ గారు

కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక
కలడన్న వారిపాల కలిగిన దైవము!!   

ఇచ్చెను సంపదలితడు ఇంద్రాదులకు నెల్ల
ఇచ్చెను శుకాదులకు ఇహపరాలు
ఇచ్చెను వాయుజునికి ఇటమీది బ్రహ్మపట్ట
మిచ్చల ఘంటాకర్ణుని కిచ్చె కుబేరత్వము!!   

కట్టెను ధ్రువపట్టము కమలజుకంటే మీద
కట్టె విభీషణుకు లంకా రాజ్యము
కట్టియిచ్చె నజునికి గతచన్న వేదాలు
కట్టెను శ్రీసతి చేత కంకణ సూత్రములు!!   

పెట్టెను దేవతలకు పేరి నమృతపు విందు
వెట్టెను భక్తవత్సల బిరు దితడు
ఇట్టె శ్రీవేంకటాద్రి నిందరికి పొడచూపి
పెట్టె తనపస్రాదము పృథివి జీవులకు!!

అన్నమయ్య సంకీర్తన

గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయజయపరమానంద!!

జగదభిరామ సహస్రనామ
సుగుణధామ సంస్తుతనామ
గగనశ్యామ ఘనరిపు భీమ
అగణిత రఘువంశాంబుధి సోమ!!

జననుత చరణా శరణ్యు శరణా
దనుజ హరణ లలిత స్వరణా
అనఘ చరణాయతభూభరణా
దినకర సన్నిభ దివ్యాభరణా!!

గరుడ తురంగా కారోత్తుంగా
శరధి భంగా ఫణి శయనాంగా
కరుణాపాంగా కమల సంగా
వర శ్రీ వేంకట గిరిపతి రంగా!!

 అన్నమాచార్య సంకీర్తన

తెలిసితేమోక్షము -
తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని!!

చ1: అనయము సుఖమేడది అవల దు:ఖమేడది
తనువుపై ఆశలేని 
తత్వమతికి
పొనిగితే బాపమేది
పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమునొల్లన - యోగికిని!!

చ2: తగినయమృతమేది - తలపక విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికి పగవారనగ వేరే -
బంధులనగ వేరే
వెగటు ప్రపంచమెల్ల -
విడిచే వివేకిని!!

చ3: వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములోనున్నవాడు
యీవలేది యావలేది - యితనిదాసునికి!!
.....
తెలిస్తే మోక్షము తెలియక పొతే సంసార బంధము।

బ్రతుకంతా ఒక కలేకాని నిజము కాదు।
శరీరము నశించును।

 ఇట్టి శరీరముపై ఆశ ఎందుకు ?అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు ,దుఃఖము లేదు। కర్మ మాత్రమే చేయదగినది।కాని దాని ఫలమక్కరలేదు అని ఫలత్యాగము చేసే యోగికి పాపము లేదు,పుణ్యము లేదు
నిరాహారదీక్ష గలవానికి అమృతము లేదు,విశము లేదు ।

ప్రపంచమంతయు మిధ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ప్రపంచమును వదిలిన వానికి పగవాడు లేదు , బంధువు లేడు।
వేల వేల విధులున్నయి। ఈ విధులు చేసి ఏవేవో పొందుదామని తలంప సాధారణముగా ఉంటుంది।రానిది రాకమానదు।పోనిది పోక మానదు అని దైవమునే నమ్మిన వానికి వెరపు లేదు మరపు లేదు।

శ్రీ వేంకటేశ్వరుని చిత్తమున నిలిపి ఆయన దాసుడయిన వానికి ఈవల లేదు,ఆవల లేదు।

తెలిసితేమోక్షము-తెలియకున్న బంధము
కలవంటిది బంధం-ఘనునికిని
ఎవడు ఘనుడు.....?
 ఏది తెలిస్తే మోక్షం ``ఏది తెలియకుంటే బంధం
 నేనుఆత్మస్వరూపున్ని" భగవంతుణ్ణి అని తెలిసిన వాడు ఘనుడు.అతను మోక్షము పొందుతాడు...

నేను శరీరమే అనుకునే వాడికి అంతా బంధమే..... బంధమే.... బంధమే..
 అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది తనువుపై నాసలేని - తత్వమతికి.
  తత్వమతి అంటే ఎవరు....?
   "" తత్ ""అంటే ""అది
   ""మతి """బుద్ది
    నేను ఏదైతే అయి ఉన్నానో బయటిది
   కూడా అదే అని తెలిసినప్పుడు వానికి
    ఓ అంతా వెలగబెట్టి పోవాలన్న బతుకు ఆశ
    ఉండదు.....అటువంటి వానికి ప్రత్యేకంగా   
    సుఖమంటూ గానీ ,,,,దుఃఖమంటూ గానీ
    ఎక్కడుంది....వానికి అంతా ఒక్కటే...

పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లవి - యోగికిని

 యోగి అంటే ఎవరు.... ''సమత్వం యోగ ఉచ్యతే"
 అన్ని కర్మల యందు "సర్వకాల సర్వావస్థల"
 యందు అన్నింటి పట్ల సమస్తితిలో వున్నవాడు
  యోగి అనబడతాడు అని గీత అంటోంది...
   ఏ కర్మ చేసినా ఫలమాశించని  వాడు... యోగి
   అటు వంటి వానికి అంటుకునే పాపమేది పుణ్యమేది.....

తగినయమృతమేది-తలవగవిషమేది
తెగినిరాహారియైన-ధీరునికిని

 ఎవరు ధీరుడు....? ధ్యాన ముద్రలోశ్వాస
 నిశ్వాసలు శూన్యం చేసి
 మనస్సు ను శూన్యం చేసి, అన్ననాలుకను,
 చిరునాలుకను రెండింటినీ ఏకం చేయగా ఏర్పడే
ఐ   ఖేచరీ ముద్రలో ఆత్మామృతం చిరునాలుక
   నుండి జీర్ణాశయంలోకి కారుతుంది....ఇది 
   తాగుతున్న  వాడికి విషమేముంది.....ప్రత్యేకమైన అమృతమేముంది....

పగవారనగ వేరే - బంధులనగ వేరే వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి
       ఎవరు వివేకి.....?"నిత్యానిత్య విచార వివేకి"
       అన్నారు ఆదిశంకరులు..... ఏది శాశ్వతంగా
       ఉండేది.....ఏది శాశ్వతంగా లేనిది.....ఆత్మే
        శాశ్వతంగా ఉండేది....మిగతాదంతా మార్పు
       చెందేదే.... అన్ని తెలిసినవాడు వివేకి....ప్రపంచం
       లో వానికి బందువులూ లేరు....అలాగే  
        శత్రువులూ లేరు.....

వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని

   ఎవడు ధన్యుడు....?
    ఎవడు నిత్యం ధ్యాన స్థితిలో ఉంటాడో
     వాడు ధన్యుడు....నిత్యం నేను "ఆత్మను"
     అందరూ, సర్వమూ ఆత్మ స్వరూపమే
     అని తెలియడమే ధన్యత...వాడే ధన్యుడు.
     వానికి ఎన్ని పనులున్నా.... మరుపు గానీ
      వెఱపు గానీ లేదు గాక, లేదు....

శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది - యితనిదాసునికి

     వేంకటము అంటే రెండింటిని ఏకం చేసినవాడు
      వేంకటేశ్వరుడు అంటే ద్వంద్వాతీతుడు...
      అలాంటి స్థితిని నిరంతరం చిత్తంలో కొలువై
      ఉంటే , అలాంటి వానికి ఇవతల ఆనేదీ లేదు
       అవతల ఆనేదీ లేదు....ఇవతల అంటే జననం
       అవతల అంటే మరణం...రెండూ లేవు అని అర్థం...

అన్నమయ్య సంకీర్తన

రేకు: 212-5
సంపుటము: 3-71

Il పల్లవి ll
ఎన్నఁడు మంచివాఁడ నయ్యేను నేను
నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా!!   

వేఁపమానికిని చేఁదు విడువక వుండేది
యే పొద్దు సహజమే యెంతైనాను
పాపపుణ్యలంపటానఁ బరగి వుండేటి నేను
చాపలదుర్గుణినౌట సహజమే!!   

పాముకు విషమెప్పుడు పండ్లఁ బెట్టుకుండేది
భూమిలో సహజమే పొరి నెంతైనా
కామక్రోధుఁడ నాకుఁ గరుణ యించుక లేక
సామజపు దుర్మదము సహజమే!!   

అటుగాన శ్రీవేంకటాధిప నాకిఁక వేరే
తటుకన నేఁడు శాంతము వచ్చీనా
ఘటన నీ కృపయందు గలిగిన మేలు నాపై
తటుకన ముంచి నన్ను దరి చేర్పవే!!   

 అన్నమయ్య సంకీర్తన
గానం: sp శైలజ గారరు

ఒకపరి కొకపరి కొయ్యారమై |
మొకమున కళలెల్ల
మొలచినట్లుండె!!
||ఒకపరి||

జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి |
జిగికొని నలువంక చిందగాను |
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన |
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె!!
 ||ఒకపరి||

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజసిరి తొలికినట్లుండె!!
||ఒకపరి||

మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె!!  
 ||ఒకపరి||

అన్నమయ్య సంకీర్తన

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు!!

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు!!

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు!!

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు!!

అన్నమయ్య సంకీర్తన
గానం: శ్రీ గరిమెళ్ళ
          బాలకృష్ణ
          ప్రసాద్ గారు.

ఇతరులకు నిను
నెఱుగ తరమా
యిందిరారమణా
సతత సత్యవ్రతులు
సంపూర్ణ మోహవిరహితు
లెఱుంగుదురు నిను
ఇందిరారమణా!!

నారీకటాక్ష పటు
నారాచభయరహిత
శూరులెఱుగుదురు నిను
చూచేటిచూపు
ఘోరసంసార
సంకులపరిచ్ఛేదులగు
ధీరులెఱుగుదురు
నీ దివ్యవిగ్రహము!!

రాగభోగవిదూర
రంజితాత్ములు మహా
భాగులెరుగుదురు నిను
ప్రణుతించు విధము
ఆగమోక్తప్రకారాభి
గమ్యులుమహాయోగు
లెఱుగుదురు
నీవుండేటి ఉనికి!!

పరమ భాగవత
పదపద్మ సేవానిజా
భరణు లెఱుగుదురు
నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద
పరిపూర్ణ మానస
స్థిరులెఱుంగుదురు నిను
తిరువేంకటేశ!!
.....
అన్నమాచార్య సంకీర్తన                                      
      వారు: సత్తిరాజు వేణుమాధవ్      
రాగము: వసంత
రేకు: 0166-05
సంపుటము: 2-321.


॥పల్లవి॥        అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
శరణంటిఁ గావు మిదియ విన్నపము సరిలేరు నీకు!!

॥చ1॥        పరగ నీయకారణబంధుత్వ మహల్యయందుఁ గంటిమి
కరియందు నార్తరక్షకత్వము మెరయఁగఁ గంటిమి
అరసి ద్రౌపదియందు నాపదుద్ధారకత్వము గంటిమి
శరణంటెఁ గాచుట ధర విభీషుణునందుఁ గంటిమి!!

॥చ2॥        మును భక్తవత్సలత్వము నీకు శబరియందుఁ గంటిమి
అనాథనాథుడవు నీ వగుట గ్రీవునందుఁ గంటిమి
పెనఁగి నిరుహేతుకప్రేమ పరీక్షితునందుఁ గంటిమి
నినుఁ గింకరాధీనుఁడని ప్రహ్లాదునియందేఁ గంటిమి!!

॥చ3॥        గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి
భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి
దేవ శ్రీవేంకటేశ్వర నీవు ద్రిష్టవరదుఁడవగుట
తావైన నీకొనేటిదండ నొసఁగేయందే కంటిమి!!
అన్నమయ్య సంకీర్తన
గానం::శ్రీ మల్లాది. కృష్ణమూర్తి గారు

రేకు: 16-1
సంపుటము: 1-95.

ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె
వేదు విడిచిన కూడు వెదకినను లేదు!!

ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు
పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక
యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి
కైకొన్నదురితములు కలపాటిగాక !!

హితవైనమమకార మెందుఁగల దిందరికి
ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక
మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు
జితమైన దైవమిచ్చిన పాటిగాక !!

యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకు
పరిమైనకర్మంబు పరిపాటిగాక
యెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁ
దిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక !!
...
అన్నమయ్య సంకీర్తన

రేకు: 5-3
సంపుటము: 1-32

ll పల్లవి ll
ఎంతటివారలు నెవ్వరును హరిఁ
జింతించక నిశ్చింతులు గారు !!

అతిజితేంద్రియులు ననశనవ్రతులు-
నతుల తపోధనులగువారు
చతురానన గురుస్మరణము దొరకక
తతి నూరక పుణ్యతములుగారు!!

అనఘులు శాంతులు నధ్యాత్మతతులు-
ననుపమ పుణ్యులు యాజకులు
వనజోదరు ననవరతముఁ దలఁచక
వినుతి స్మృతికిని విభుదులుగారు !!

దురిత విదూరులు దుర్మతిహీనులు
నిరతానందులు నిత్యులును
తిరువేంకటగిరిదేవుని గొలువక
పరమార్గమునకు బ్రహ్మలు గారు!!
***
అన్నమయ్య సంకీర్తన
 
గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం. మధ్యమావతి

రేకు : 23 - 3
సంపుటము : 15 - 131
రేకు రాగము : దేశాక్షి.

వేదములే నీ నివాసమట విమలనారసింహా
నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహా!!

ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన  నారాయణరమాథినాయక నగధరనరసింహ
నీరూపమ్ము ఇంతఅంతయని నిజము తెలియరాదు
ఈరీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహా!!

గోవింద గుణగుణరహిత కోటిసూర్యతేజ
శ్రీవల్లభ పురాణపురుష శిఖనఖ నరసింహ
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు
భావింపగ ప్రహ్లాదునెదుట పరగితి నరసింహా!!

దాసపరికర సులభ తపన చంద్రనేత్ర
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన
ఓసరకిపుడు ఏగితి విట్లా అహోబిల నరసింహా!!

భావము:-
     అహోబల నరసింహ స్వామి సేవలో అన్నమయ్య కుమారుడు పెద్ద తిరుమలాచార్యుడు చెప్పిన మధురాతి మధురమైన కీర్తన ఇది. తన తండ్రి అన్నమయ్య వలెనే, వేంకటగిరి వాసుడే అహోబల అర్చావతారం అని నమ్మినవాడీ పెద్దతిరుమలయ్య. సర్వమూ నీవే... అంటున్నారు.

     నిర్మలుడవైన ఓ అహోబల నరసింహా! నీ నివాస స్థానములు వేదములే. నీవు సంగీత నాదమున ఎక్కువ ప్రీతి కలిగినవాడవు. సకల లోకాలకు భర్తవు. అట్టి నీకు నా నమోవాకములు.

1. ఓ ప్రభూ! నీవు ఘోరమైన పాపములను రూపుమాపెదవు. నీవు దుర్బుద్ధినున్న రాక్షసాంతకుడవు, నారాయణుడవు, లక్ష్మీపతివి, గోవర్ధన ధరుడవు. ఆనాటి నీ త్రివిక్రమ రూపానికి ఆద్యంతములు లేవు. అట్లు విజృంభించితివి ( ఏచితివి ) కనుక నీ నిజమైన రూపము తెలియనసాధ్యముగా ఉన్నది.

2. ఓ దేవా! నీవే గోవిందుడవు. నీవు  గుణాగుణరహితుడవు. ( గుణము, అగుణము రెండూ నీకు లేవు ). నీ తేజస్సు కోటి సూర్యులకు మించినది. నీవు శ్రీదేవికి వల్లభుడవు. నీవు పురాణపురుషుడవు. శిరస్సున కేశపాశము, వేళ్ళకు వాడి గోళ్లు ఉన్నవాడవు. స్వామీ! మీరేమిటో బ్రహ్మాది దేవతలకే అంతు పట్టదు. నీ భక్తుడైన ప్రహ్లాదుడొక్కడే నిన్ను భావించగలిగాడు. ఎందుకంటే నీవు వానికి ప్రసన్నుడవై వాని ఎదుట నిలిచితివి కదా! అట్టి నరసింహా! నీకు వందనములు.

3. ఓ దాసపరికర సులభ! ( దాసుల సమూహములకు సులభంగా లభించువాడవు అయిన దేవా! ) నీవు తపన చంద్ర నేత్రుడవు ( సూర్య చంద్రులు నేత్రములుగా కలవాడవు ). ఇంద్రాది సురప్రముఖులు, మునీశ్వరులు అర్చించి సేవించెడివాడవు. వెలుగొందుతూ ఎన్నడూ శ్రీవేంకటాద్రిని వదలని దైవానివి. అందుచేత నీవే ఓసరక ( తొలగిపోకుండా ), ఇప్పుడు ఏగితివిట్ల ( ఇట్లు ఊరేగుచున్నావు ).
***

తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన

రేకు: 292-1
సంపుటము: 3-530
రేకు రాగము: మలహరి.


విశ్వరూపుడైన విరాట్పురుషుని కీర్తిస్తున్నారు అన్నమయ్య. దీనిని ఆస్వాదించి ఆ పరమ పురుషుని దర్శించండి.


విశ్వమెల్ల నీ విరాడ్రూపము
శాశ్వతహరి నీ శరణులము!!


కన్నులఁ సూర్యుఁడు కమలాప్తుఁడు నీ-
పన్నిన మోమున బ్రాహ్మణులు
ఉన్నతి వైశ్యులు ఊరువు లందును
యెన్నఁగ శూద్రులు యిదె పాదముల!!


యింద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ ము-
నీంద్రులంగముల నెసఁగినదే
సాంద్ర లోకములు జఠరంబున నవె
రుద్ర తేజ మదె రోమముల !!


కాలముఁ కర్మముఁ కైవల్యంబును
ఆలోను వెలియును అదినీవు
శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర
కోలుముందు నినుఁ కొలిచితిమయ్య?

...
భావము:-

     ఓ దేవదేవా! ఈ విశ్వమంతా నీ విరాడ్రూపము. ( ఆదినారాయణుడివైన నీ విశ్వరూపమే ). శాశ్వతుడవైన ఓ శ్రీహరీ! జీవులమైన మేమందరమూ నీ శరణులము ( శరణాగతులము ) ప్రభూ!


1. తండ్రీ! నీ రెండు కన్నులు పద్మముల మిత్రుడైన సూర్యుడు మరియు రజనీకాంతుడైన చంద్రుడు. నీ విశ్వరూపమున పన్నిన మోమున ( విరచితమైన నీ వదనమున ) బ్రాహ్మణులు ఆవరించి ఉన్నారు. అట్లే వైశ్యులు ఊరువులు ( తొడలయందును ), శూద్రులు చరణముల వద్దను ఉన్నతముగా స్థితులై ఉన్నారు.


2. ఓ పురాణపురుషా! నీ అంగముల ( వివిధ అవయవములలో ) ఈశాన ( శంకరుడు ), బ్రహ్మ దేవుడు, మునీంద్రులు ( సప్త ఋషులు ), ఇంద్రాది దేవతలు, అదే యెసగిరి ( అతిశయించి ఉన్నారు ). సాంద్ర లోకములు ( దట్టముగా వ్యాపించిన లోకములన్నియు ) నీ జఠరమున ( నీ కడుపులోనే ) కనుపించుచున్నవి. నీ రోమములు ( శరీరముననున్న వెంట్రుకలలో ) అదే రుద్ర తేజము ( విరివియైన తేజస్సుతో ) సమస్త జీవకోటి ద్యోతకమగుచున్నది.


3. ఓ సర్వేశ్వరా!  " కాలము, కర్మము, కైవల్యము " ఆలోను  ( అనబడు వాటియందు ) వెలయునది  ( విలసిల్లునది ) నీవే. కాలము ఇంత నియమబద్ధంగా ఉండటానికి, కర్మము తప్పింపనశక్యమై ఉండుటకు
[19:23, 05/05/2020] +91 92915 82862: , కైవల్యము కేవలము ముక్తులకు ( సర్వసంగ పరిత్యాగలకు ) మాత్రమే లభించుటకు నీవే కారణము. ఓ శ్రీకాంతా! శ్రీవేంకటేశ్వరా! కోలుముందు ( మున్ముందే ) నిన్ను కొలిచితిమయ్యా! మమ్ము రక్షింపుము.
***

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ