కఠోపనిషత్‌ వివరణ

 

. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 119 🌹

🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 49 🌻


తెలిసికొన వలసిన ఆత్మతత్వము అతి సూక్ష్మమగుట చేత సద్గురువుల నాశ్రయించి, వారి బోధల చేత అజ్ఞానమును పోగొట్టుకొని, నిరంతర ప్రయత్నము చేత, మనస్సును బాహ్యవిషయముల నుండి మరల్చి, పరిశుద్ధమైన సూక్ష్మబుద్ధితో, ఆత్మ సందర్శనమునకు ప్రయత్నించవలెను. 


బాహ్య విషయము లందు ప్రవర్తించు మనస్సును, ఆత్మాభిముఖము చేయుట ఎంత కష్టమో, అసిధారా వ్రతముతో పోల్చి చెప్పబడినది.


        ఇప్పటి వరకూ మనం మాట్లాడుకున్న ఆశాలనే మళ్ళా ఇక్కడ బోధిస్తూఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తప్పక బాహ్య విషయముల నుండి మనస్సును మరల్చాలి. అంతర్ముఖత్వము వైపు నడపాలి. 


అయితే ఆశ్రయించినటువంటి మహనీయులు ఆత్మజ్ఞానములో మునిగి ఉన్నారా? లేదా? ఆత్మనిష్ఠులై ఉన్నారా? లేదా? అనేటటువంటి పరిస్థితిని గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. తనకే స్వానుభవం అయినటువంటి, స్వానుభవ ప్రమాణ నిర్ణయమైనటువంటి ఆత్మానుభూతి కనుక లేకపోయినట్లయితే, కేవల శాస్త్రజ్ఞాన పరిధిలోనే నీకు బోధించ ప్రయత్నిస్తున్నట్లయితే, ఎవరూ కూడా దానిని అందుకోజాలరు.


        కాబట్టి, మహానుభావులను, సద్గురువులను ఆశ్రయించి, వారి బోధలచేత అజ్ఞానమును పోగొట్టుకోవాలి. నిరంతరాయముగా నువ్వు సద్గురు ఆశ్రయంలో ఉన్నంత సేపూ కూడా నీలోపల గల సందేహాలని పోగొట్టుకోవడం, నీ లోపల అజ్ఞానయుతమైన భావనల నుండీ విముక్తమవ్వడం, నిర్ణయం తీసుకోలేకుండా మిగిలిపోయినటువంటి, అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా తెలుసుకోవడం ఇలాంటి ప్రయత్నాన్ని చేయాలి. 


అంతేగాని, సద్గురుని వ్యావహారిక జీవితాన్ని కనుక మనము ఉపయోగించు కున్నట్లయితే, ఈ అంతర్ముఖ ప్రయాణము కుంటుపడుతూ ఉంటుంది. 


ఏవండీ! మా అబ్బాయిని విదేశాలకు పంపమంటారా? వద్దంటారా? నన్ను ఇల్లు కట్టమంటారా? కట్ట వద్దంటారా? ఏమండీ! నన్ను బండి కొనమంటారా? కొనొద్దంటారా? ఏమండీ! నన్ను భోజనం చేయమంటారా? చేయవద్దంటారా? ఇలాంటి విషయాలు అడిగారనుకోండి, ఏం చెబుతారు? కాబట్టి, ఈ బాహ్య విషయ పరిజ్ఞానానికి ఆత్మనిష్ఠులు అయినటువంటి వారు ఉపయోగపడరు. 


కానీ, వాళ్ళు అంతర్ముఖ ప్రయాణానికి, సాధన విశేషానికి సంబంధించి, మనస్సుని సంయమించేటటువంటి స్థితి గురించి, స్వభావాన్ని గెలిచేటటువంటి స్థితి గురించి, స్వాత్మనిష్ఠను పొందేటటువంటి స్థితిని గురించి, ప్రశ్నించినప్పడు వాళ్ళు మహదానంద పడిపోయి, ఆ రకమైన సాధనా మార్గములో పురోగతిలో ఉన్నటువంటి విషయాలను గురించి, పురోగతిలో ఉన్నటువంటి అంశాల గురించి నీకు చక్కగా వివరిస్తారు. 


అంతేగాక, స్వానుభవ ప్రమాణం ఉన్నటు వంటి ఆత్మనిష్ఠులైతే, ఆ స్థితి నుంచీ నీకు ఉద్ధరణకు సహాయం కూడా చేస్తారు.

        కాబట్టి, సహాయం ఎవరికి చేస్తారు? అనేది చాలా ముఖ్యం. అందరికి సహాయం చేస్తారనుకోవడం భ్రాంతి. అందరికీ సహాయం చేయరు. ఎవరికి చేస్తారు? 


ప్రధానంగా ఎవరైతే మనః సంయమనం చేయడానికి సిద్ధపడ్డారో, ఈ జన్మలోనే సాధకులుగా వారు పురోగమనం చెంది, సచ్ఛిష్యులుగా మారి, అధికారులుగా మారి, జ్ఞానబలాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నదో, వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తారు. జ్ఞానపూర్వక సహాయం వాళ్ళకు మాత్రమే చేస్తారు. 


మిగిలిన వాళ్ళతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు కానీ, అది విషయ పూర్వకమైనటువంటి వ్యవహారం. ఎక్కడికక్కడ ఉత్తమమైనమార్గంలో నిన్ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్ను ఆ రకమైనటువంటి జ్ఞానమార్గంవైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 


కానీ సరియైనటువంటి సహాయం, సరియైనటువంటి నిర్ణయం, సరియైనటువంటి సమర్థత పొందగలిగేటటువంటి అధికారికి మాత్రం, సద్గురువు సాక్షాత్తు ఈశ్వరుడే! ఈశ్వరానుగ్రహమన్నా సద్గురుని కృపన్నా రెండింటికి అభేదం.


        అలాంటి ఆశ్రయాన్ని సాధిస్తే నీవు సుఖంగా జీవించవచ్చు. ఇక నిశ్చింతగా జీవించవచ్చు. ఎందుకని? ‘నీ భారమతడే మోశాడు రా ఓ మానవుడా హరి నామము మరువ వద్దురా’ - ఏ సాధన అయినా జీవితకాల సాధనలుగా స్వీకరించాలి. 


ఏ సాధనల్ని అయినా, ఏ నియమాల్ని అయినా ఏ రకమైనటువంటి ప్రయత్నాలనైనా కూడా నిత్యం చేయాలి. నిరంతరాయంగా చేయాలి. 24 గంటలు చేయాలి. అదే జీవితంగా జీవించాలి. 


తీవ్రమోక్షేచ్ఛ కలిగిన వాడవై ఉండాలి. తీవ్ర వైరాగ్యం కలిగిన వాడవై ఉండాలి. చతుర్విధ శుశ్రూషలను ఆంతరంగికంగా చేయగలగిన సమర్ధుడవై ఉండాలి. ఆ రకమైనటువంటి సచ్ఛిష్యుడు గురువుకి ప్రేమాస్పదుడైనటువంటి వాడు. 


గురువు యొక్క చైతన్యాన్ని అందిపుచ్చుకోగలిగేటటువంటి సమర్థుడైనటువంటి వాడు. కాబట్టి, అటువంటి సచ్ఛిష్యపదవికి సాధకులు అందరూ కూడా తప్పక ప్రయత్నించాలి. - విద్యా సాగర్ స్వామి 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 92 🌹

🌻.   ఆత్మను తెలుసుకొను విధము -22 🌻

దైవీహ్యేషా గుణమయాయి మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||

        బాబూ! నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను పరిగెత్తిస్తున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి, ప్రకృతి సంబంధమైన మాయ అతిక్రమింప రానిది. అని ఒక పక్క చెబుతూనే ఏమంటున్నాడు? నేను ప్రకృతికి అతీతుడను. పరమాత్మ ప్రకృతికి అతీతుడు. మాయకు అతీతుడు. మోహానికి అతీతడు. మోక్ష స్వరూపుడు. 

కాబట్టి నువ్వు పరమాత్మని గనుక పట్టుకున్నట్లయితే “మాం అను స్మరణ్‌” - నేనే కదా అనేక చోట్ల వస్తుంది. ‘మమ ఆశ్రయ’ - నన్నే పట్టుకో! ఆ పరమాత్మనే గనుక నీవు భక్తితో ఆశ్రయించినట్లయితే, విశ్వాసంతో ఆశ్రయించినట్లయితే, ఆత్మబలంతో గనుక నీవు ఆశ్రయించినట్లయితే, ధైర్యంతో ఆశ్రయించినట్లయితే, స్థైర్యంతో ఆశ్రయించినట్లయితే, వివేకంతో ఆశ్రయించినట్లయితే, విజ్ఞానంతో ఆశ్రయించినట్లయితే నీవు ఆ మాయ నుంచి ముక్తుడవు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. జనన మరణ రాహిత్యం లభించేటువంటి అవకాశం లభిస్తుంది ఈ జన్మలోనే!

బహునాం జన్మనామంతే జానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||

        ఉన్నదంతా వాసుదేవ వ్యూహమే! ఉన్నదంతా వాసుదేవ స్వరూపమే! అనేటటువంటి బుద్ధి ఎప్పటికో గానీ కలగడం లేదు. నిశ్చలమైనటువంటి బుద్ధిలో మాత్రమే అటువంటి లక్షణం కలుగుతుంది. నీవున్నావు, నేనున్నాను అందరూ ఉన్నారు. అనేకత్వంగా ఉంది. జగత్తు అంతా అనేకంగా ఉంది. ఈ అనేకత్వం అంతా నేను భోగ్యంగా అనుభవించవచ్చు. అనేటటువంటి భోగి, భోగ్య లక్షణం మనలో బలంగా ఉన్నంత సేపు ఆ జగత్‌ భావన, జీవభావన బలంగా ఉంటుంది. 

గుణధర్మం బలంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఏమీ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యమౌతాయండి. ఏమైనా చేస్తూ ఉంటే, ఇవేమీ సాధ్యం కావండీ! చేస్తూ ఇలా ఉండడం కుదరదు. విరమించేసి, ఏ పని చేయకుండా ఓ మూల ముక్కు మూసుకుని, జపం చేసుకుంటూ, తపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రమే సాధ్యం అనుకుంటారు అన్నమాట. అది ఎట్లా సాధ్యమో, అసాధ్యమో క్రింద వివరిస్తున్నారు.

        స్థూలములైన ఇంద్రియముల నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను తెలుసుకొను విధానము చెప్పబడుచున్నది. ఇంద్రియములు గోళకములకన్నా సూక్ష్మమైనవి. నేత్రము అనగానే మనకు కనిపించునది స్థూలమైన గోళకము. నేత్రేంద్రియము, నేత్ర గోళమునకు అంతరంగముగా, సూక్ష్మముగా ఉన్నది.

 అటులనే ఇంద్రియముల కన్న వానికి కారణమగు శబ్దాది తన్మాత్రలు సూక్ష్మం. శబ్దాది తన్మాత్రల కన్న మనస్సు సూక్ష్మం. మనసు కన్న బుద్ధి, బుద్ధి కన్న మహత్ తత్వం సూక్ష్మం. మహత్‌ తత్త్వం కన్న అవ్యక్తం సూక్ష్మం. అవ్యక్తం కన్న పురుషుడు [పరమాత్మ] సూక్ష్మం. పురుషుని కంటే సూక్ష్మమైనది మరియొకటి లేదు. అదియే అంతిమము. అదియే పరమావధి.

        ఈ రకంగా స్థూలపరిధి నుండి, బుద్ధిని సూక్ష్మం దిశగా నడపాలి. ఈ రకమైనటువంటి విచారణ చేయాలి. ఈ రకమైన గుర్తింపు రావాలి. ఈ రకమైనటువంటి భావనా బలం రావాలి. ఈ రకమైనటువంటి వివేకం రావాలి. ఈ రకమైనటువంటి విజ్ఞానం రావాలి. ఇది రోజువారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ విచారణ ద్వారా పొందవలసినటువంటి సత్యము. దీనికి వేరే మార్గం లేదు. ఏమిటట అది? అంటే,
“నవ రంధ్ర కాయమన్నా... నిన్ను నట్టేట ముంచునోరన్నా” - విద్యా సాగర్ స్వామి 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ