శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
781వ నామ మంత్రము 11.01.2021
ఓం ప్రత్యగ్రూపాయై నమః
బహిర్ముఖములగు ఇంద్రియములకు ప్రతికూలముగా నడచునట్టి స్వరూపముగలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రత్యగ్రూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రత్యగ్రూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి సుఖసంతోషములు, ఇష్టకామ్యసిద్ధియు లభించును.
జ్ఞానేంద్రియములు (చెవి, 2. చర్మము, 3. కన్ను, 4. నాలుక, 5. ముక్కు), కర్మేంద్రియములు (1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ) ఇవి అన్నియు దేహమునకు సంబంధించినవి. బహిర్ముఖములు. బాహ్యజగత్తును మాత్రమే చూస్తాయి. బాహ్యజగత్తులోని అంశములనే పరిగణనలోనికి తీసుకుని తత్సంబంధమైన కార్యనిర్వహణనే చేస్తాయి. ఐహిక సుఖవ్యామోహములవైపు మాత్రమే మనసు లగ్నమై ఉంటుంది. వీటికి ఆత్మను దర్శించే శక్తి ఉండదు. దీనినే విషయోన్ముఖము అంటారు. దీనినే బహిర్ముఖత్వము, పరాఙ్ముకత్వము అనికూడా అంటారు. ఇంద్రియములు విషయములను విడిచిపెట్టి అంతరాత్మవైపు త్రిప్పినట్లైతే, అది అంతర్ముఖత్వము, ప్రత్యఙ్ముఖత్వము అంటారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఇంద్రియములను బాహ్యజగత్తును చూస్తున్నప్పటికిని ఆత్మను కూడా దర్శించగలవు. అందుకు ఇంద్రియస్వాధీనము అవసరము. కోతికొమ్మచ్చులాడే మనసును అదుపులో ఉంచితే ఆత్మసాక్షాత్కారమవుతుంది. దీనినే ప్రత్యఙ్ముఖము అంటారు. జీవుడు బహిర్ముఖమనుకుంటే ఆత్మ ప్రత్యఙ్ముఖము అవుతుంది. ఆత్మస్వరూపిణియైన జగన్మాత రూపము ప్రత్యక్ గా అంతరాత్మయందు చూస్తాము గనుక జగన్మాత ప్రత్యగాత్మ, ఆ స్వరూపంలో ఉన్న జగన్మాత ప్రత్యగ్రూపా యని అనబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రత్యగ్రూపాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comments
Post a Comment