24*05

 





టిప్పు  తన కుమారులిద్దరిని బ్రిటిష్ వారికి బందీలుగా అప్పగించాడు.

.........................................

టిప్పు తన కుమారులిద్దరిని బ్రిటీష్ సామ్రాజ్యానికి బందీలుగా అప్పగించిన సంఘటన భారతదేశ చరిత్రలో అత్యంత  రాజకీయంగా ప్రాధాన్యతగల అంశంగా నిలిచిపోయింది. ఈ ఘటన మూడో ఆంగ్ల మైసూరు యుద్ధానంతరం చోటుచేసుకుని,  నాటి పరిస్థితులలో బ్రిటిష్ ఈస్టిండియా వారి శక్తిసామర్థ్యాలు  వారి మిత్రపక్షాల దౌత్య విధానాలు మరియు బ్రిటిషు వలసపాలన లక్ష్యాలను స్పష్టంగా ప్రతిబింబింప చేసింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాలు హైదరాబాద్ నిజాం సంయుక్త సేనల చేతిలో పరాజయం పొందిన టిప్పు  1792 లో శ్రీరంగపట్టణం సంధి షరుతులపై సంతకం చేయవలసి వచ్చింది. 

ఈ ఒప్పందం ప్రకారం అతను తన రాజ్యంలోని  సగభాగాన్ని మిత్రపక్షాలకు కోల్పోవడంతోపాటు సుమారు 33 కోట్లరూపాయల పరిహారం వారికి చెల్లించాల్సి వచ్చింది. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తానడానికి భరోసాగా టిప్పు తన ఇద్దరు చిన్న కుమారులను బ్రిటిష్  వారికి బందీలుగా అప్పగించాల్సి రావడమనేది ఒప్పందంలోని అత్యంత కఠినమైన నిబంధనగా నిలిచింది.

అబ్దుల్ ఖలీఖ్ సుమారు 10 ఏళ్లు, ముయిజ్-ఉద్-దీన్ సుమారు 8 ఏళ్లు ఈ వయసుగల  ఇద్దరు పిల్లలను 1792 ఫిబ్రవరి 26న శ్రీరంగపట్టణంలో అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో  బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన Charles Cornwallis కు అప్పగించారు. ఈ కార్యక్రమం కేవలం రాజకీయచర్య మాత్రమే కాకుండా, బ్రిటిష్ వారి సైనికశక్తి ప్రదర్శనగా కూడా నిలిచింది.పిల్లలిద్దరు అట్టహాసంగా అలంకరించబడినారు, పెద్ద బృందంతో కానుకలతో మేళతాళాలతో అంత:పురం దాటి వచ్చారు. మరోవైపు కారన్ వాలిస్ వారిని గౌరవంగా స్వీకరించాడు. తద్వారా బ్రిటిష్ వారు తమను తాము రాజకీయంగా ఉన్నతమైనవారిగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనను ఆ కాలంలో వారు విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ పిల్లలను చెన్నైలోని Fort St. George లో ఉంచారు. అక్కడ వారు సుమారు రెండేళ్ల పాటు ఉన్నారు. బ్రిటిష్ వారు పిల్లలిద్దరిని కఠినవాతావరణంలో నిర్బంధించక స్వేచ్ఛగా వదలి  తగిన గౌరవాన్నిచ్చి సకల సౌకర్యాలు కల్పించారు. ఇద్దరి కోసం అనేకమంది సేవకులను ఉపాధ్యాయులను నియమించారు. యూరోపియన్ సంస్కృతిని ఇద్దరికి పరిచయం చేస్తూ, వారిని నృత్యవినోద విందుసంగీత కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు.

కెప్టెన్ జాన్ డోవెటన్ పర్యవేక్షణలో వారు చక్కగా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని బ్రిటిష్ వారు ఒక రాజకీయ వ్యూహంగా మార్చారు.తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ అదే సమయంలో తమను అత్యంత ఉదారతగల పాలకులుగా చూపించుకొన్నారు.

టిప్పు ఒప్పందంలోని ధనాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత 1794 మార్చి 29న ఈ పిల్లలు తిరిగి తమ తల్లితండ్రులను కలుసుకున్నారు. ఈ సంఘటనతో మైసూరు సామ్రాజ్యం బలహీనపడింది. బ్రిటిష్ వారి ప్రభావం దక్షిణ భారతదేశంలో బాగా పెరిగిపోయింది. జరిగిన అవమానం టిప్పులో మరింత ప్రతిఘటన ప్రతీకారేచ్ఛ పెరిగి చివరికి నాలుగో ఆంగ్లో మైసూరు యుద్ధానికి దారితీసింది. 4 వ మైసూరు యుద్ధంలో టిప్పు ఘోరంగా పరాజయం పాలై మరణించాడు.

జరిగిన ఈ సంఘటనలన్నీ బ్రిటిష్ వారి రంగురంగుల  చిత్రకళలో కూడా ప్రముఖస్థానం పొందాయి. Robert Home, Mather Brown, Henry Singleton వంటి చిత్రకారులు ఈ దృశ్యాలను రంగుల కాన్వాసుపై బహు సుందరంగా చిత్రించారు. వారి చిత్రాలలో బ్రిటిష్ వారి విజయం దయ శక్తి అన్నీ కలగలిపి చూపించబడినాయి.

మూడో మైసూరు యుద్ధానికి ప్రధాన కారణాలు చెప్పాలంటే, Tipu  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య పెరుగుతున్న విభేదాలే ప్రధాన కారణం.మంగళూరు సంధి షరతులు మరచి టిప్పు తన రాజ్యాన్ని బలపరచడానికిగాను విదేశీశక్తులతో ముఖ్యంగా ఫ్రాన్స్‌తో స్నేహ సంబంధాలు పెంచుకోవడం బ్రిటిష్ వారికి అనుమానం కలిగించింది. అంతేకాకుండా, దక్షిణ భారతదేశంలో అధికారం కోసం టీప్పు బ్రిటన్ ల మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఈ పరిస్థితుల్లో 1789లో టిప్పు సుల్తాన్ తిరువనంతపురం రాజ్యంపై దాడి చేయడం  ముఖ్యమైన కారణమైంది. ఎందుకంటే తిరువనంతపురం  బ్రిటిష్ వారి మిత్రరాజ్యం. ఈ దాడిని బ్రిటిష్ తమపై దాడిగా భావించి యుద్ధానికి సిద్ధమయ్యారు. మరోవైపు హైదరాబాద్ నిజాం మరాఠాలు కూడా టిప్పు చర్యలపై అసహనంతో బ్రిటిష్ పక్షాన చేరారు. ఈ విధంగా మిత్రరాజ్యాల రాజకీయాలు కలిసి చివరకు ఈ యుద్ధానికి దారితీశాయి.

చిత్రంలో టిప్పు కొడుకులను బంధీలుగా స్వీకరిస్తున్న బ్రిటిష్ కమాండర్లు.

॥సేకరణ॥

............... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026