18*5
90 నిమిషాలు మాత్రమే జరిగన యుద్ధం - పూసపాటి గజపతి మరణం.
......................................
ఇక్కడున్న తెలుపునలుపు చిత్రం మైసూరు మహారాజులు నివసించిన పాత రాచభవనం. ఇది 1897లో జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా భస్మీపటలమైంది. ఇదో దారునిర్మాణం, అంటే పూర్తిగా కర్రలు,చెక్కలతో నిర్మిమించిన అపురూప రాచభవనమన్నమాట.దీనికే అంబా విలాస్ ప్యాలెస్ అని పేరు. అంబా అంటే మైసూరు మహారాజుల ఆరాధ్యదైవమైన చాముండి అమ్మవారు. అప్పట్లో మైసూరు ఒడయారు రాజుల రాజభవనం పూర్తిగా గందం మరియు టేకు కలపలతో నిర్మించబడింది.ఈ కారణంగానే ఆ భవనం అగ్నికి సులభంగా ఆహుతైంది. 1897లో దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక దుర్ఘటనలో ఈ పాత చెక్క భవనం పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో రాజకుమార్తె జయలక్ష్మమ్మాణ్ణి వివాహ వేడుకలు కూడా అదే ప్రాంగణంలో జరుగుతున్నాయి. వేడుకల కోసం భారీగా దీపాలు, అలంకరణలు, హోమాలు ఏర్పాటు చేయడంతో ఒక చోట మంటలు అంటుకున్నాయి. కలపనిర్మాణం కావడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి, కాసేపటిలోనే మొత్తం భవనాన్ని ఆవరించాయి. ఆ అగ్నిప్రమాదంలో పాత రాజభవనం పూర్తిగా నాశనమైంది.
తరువాత నాలుగవ కృష్ణరాజ వడయారు పాలనలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ రూపకల్పనలో ప్రస్తుత అద్భుతమైన మైసూరు ప్యాలెస్ నిర్మించారు. ఈ కొత్త భవనం 1912లో పూర్తైంది. ఆంగ్లోఇండియన్ శైలిలో ఈ భవననిర్మాణం జరిగింది.
కలపతో నిర్మించిన రాజభవనమెుకటి ఇప్పటికి సజీవంగా వుంది. తిరువనంతపురం నుండి కన్యాకుమారికి వెళ్ళెదారిలో పద్మనాభపురమనే పట్టణముంది. ఇది 1795 వరకు తిరువనంతపురం మార్తాండవంశపు రాజుల రాజధానిగా వుండేది. నేను ఈ భవనాన్ని 2024 లో చూశాను.భవననిర్మాణం పూర్తిగా కేరళ సాంప్రదాయక పద్ధతిలో అద్భుతమైన నగిషీలతో వుంది. భవనానికి 1700 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గోడ (గోపుర) గడియారం ఇప్పటికి పనిచేయడం విశేషం.తిరువనంతపురం రాజులంటే ఎవరో కాదు, తిరువనంతపురంలో వెలసిన శ్రీ పద్మనాభస్వామి వారి దాసులు. సామ్రాజ్యానికి అధిపతి పద్మనాభస్వామియేనని, ఆ స్వామి దాసులుగా రాజ్యాన్ని పాలిస్తున్నామని వినమ్రంగా ప్రకటించిన వారు. ఇప్పటికి మార్తాండవంశము వారే ధర్మకర్తలుగా ఉన్నవారు.
పద్మనాభ పురమంటే గుర్తుకొచ్చింది. 10 జూలై 1794 లో తీరాంధ్ర విజయనగరం జిల్లాలోని పద్మనాభపురమనే గ్రామం వద్ద విజయనగర స్వతంత్ర రాజు పూసపాటి చిన విజయరామరామ గజపతి వారికి, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి యుద్ధం జరిగింది.
ఎందుకంటే 1793 లో బ్రిటన్ వారు విజయనగరాన్ని వశపరచుకొని రాజైన
రెండో పూసపాటి చిన్న విజయరామ గజపతి రాజును విజయనగరం నుండి బహిష్కరించారు.అంతే కాకుండా పెద్ద మొత్తంలో పేష్కష్ విధించి చెల్లించాల్సిందిగా దౌర్జన్యం చేశారు. దాంతో కోపగించిన గజపతి బ్రిటన్ వారిపై యుద్ధం ప్రకటించాడు.కేవలం 90 నిమిషాల పాటే జరిగిన ఈ పద్మనాభయుద్ధంలో గజపతిరాజు బ్రిటన్ వారి అత్యాధునిక ఆయుధసంపత్తి తుపాకులు ఫిరంగుల యుద్ధతంత్రం ముందు తాళలేక యుద్ధంలోనే వీరమరణం పొందాడు. వేయిమంది వరకు సిపాయిలు నేలకొరిగారు. బ్రిటన్ సేనాని Colonel Pendargast ఆధ్వర్యంలోని సేనలో కేవలం 13 మంది హిందూస్థాన్ సిపాయిలు మాత్రమే మరణించారు.
గజపతి మరణించిన తరువాత విజయనగరం సింహాసనాన్ని ఆయన కుమారుడు పూసపాటి నారాయణ గజపతి రాజు అధిష్ఠించాడు.
ప్రముఖ పద్మనాభ యుద్ధం జరిగిన తర్వాత, బ్రిటిష్ పరపతి బాగా పెరిగి పోయింది. నారాయణ గజపతి రాజ్యాన్ని చేపట్టాడు, రాజుగా కాదు ఒక జమీందారుగా మాత్రమే.
॥సేకరణ॥
............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం
.12 సంవత్సరాలుగా అనుభవంలో వుంటే నీ భూమి నా భూమి అవుతుందా !
........................................
ప్రతికూల స్వాధీనం (Adverse Possession) అంటే ఏమిటి?
ఒక వ్యక్తి తనకు చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు లేకపోయినా, మరొకరి భూమిని లేదా ఆస్తిని యజమాని అనుమతి లేకుండా చాలా కాలం పాటు నిరంతరంగా, బహిరంగంగా, శాంతియుతంగా తనదైనట్లు ఉపయోగిస్తుంటే, కొన్ని పరిస్థితుల్లో ఆ ఆస్తిపై అతనికి చట్టపరమైన హక్కు ఏర్పడే అవకాశాన్ని “ప్రతికూల స్వాధీనం” (Adverse Possession) అంటారు.
ఈ సూత్రం భారతదేశంలో ప్రధానంగా లిమిటేషన్ యాక్ట్, 1963 (Limitation Act, 1963) ఆధారంగా అమలులో ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం, అసలు యజమాని తన ఆస్తిని రక్షించుకోవడానికి చట్టపరమైన చర్యలు నిర్ణీత కాలంలో తీసుకోకపోతే, అతని హక్కు కోల్పోయే అవకాశం ఉంటుంది.
ప్రైవేటు ఆస్తుల విషయంలో సాధారణంగా 12 సంవత్సరాలు నిరంతర స్వాధీనం ఉండాలి. ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఈ గడువు 30 సంవత్సరాలు. అయితే యజమాని మైనర్‌గా ఉండటం, మానసిక అస్వస్థత, లేదా ఇతర చట్టపరమైన అడ్డంకులు ఉంటే గడువు పొడిగించే అవకాశం ఉంటుంది.
కేవలం భూమిలో ఎక్కువకాలం ఉండటం వల్ల మాత్రమే హక్కు రాదు. ప్రతికూల స్వాధీనాన్ని నిరూపించడానికి కొన్ని కఠినమైన ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
ఆ స్వాధీనం నిరంతరంగా ఉండాలి. మధ్యలో విరామం ఉండకూడదు.
ఆ స్వాధీనం బహిరంగంగా ఉండాలి. అంటే గ్రామస్తులు, పొరుగువారు, స్థానిక అధికారులకు తెలిసే విధంగా ఉండాలి.
రహస్యంగా ఆక్రమించి ఉపయోగిస్తే అది చెల్లదు.
ఆస్తి యజమాని అనుమతి లేకుండా ఉపయోగించాలి. యజమాని ఇచ్చిన లీజ్, అద్దె, అనుమతి లేదా ఒప్పందం ఆధారంగా ఉంటే ప్రతికూల స్వాధీనం వర్తించదు.
ఆస్తిని తనదైనట్లు ఉపయోగించాలి. పన్నులు చెల్లించడం, సాగు చేయడం, ఇల్లు కట్టడం, కంచె వేయడం వంటి చర్యలు ఆధారాలుగా పరిగణించబడవచ్చు.
స్వాధీనం శాంతియుతంగా ఉండాలి. బలవంతం, హింస, బెదిరింపులు ఉండకూడదు.
అసలు యజమానికి విషయం తెలిసి కూడా, అతను కోర్టును ఆశ్రయించకుండా నిర్లక్ష్యంగా ఉండాలి.
ఈ అంశాల్లో ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోతే ప్రతికూల స్వాధీనం క్లెయిమ్ కోర్టులో తిరస్కరించబడే అవకాశం ఉంటుంది.
భారత కోర్టులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు, ఈ సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని పలుమార్లు పేర్కొంది. ఎందుకంటే ఇది అసలు యజమాని హక్కును కోల్పోయే పరిస్థితిని కలిగిస్తుంది.
హెమాజీ Vs బీకాబాయ్ కేసులో సుప్రీంకోర్టు, “ప్రతికూల స్వాధీనం” సిద్ధాంతం అనేది అపవాదుగా మాత్రమే ఉపయోగించాలి అని వ్యాఖ్యానించింది.
అలాగే హర్యాణప్రభుత్వానికి Vs ముఖేష్ కుమార్ కేసులో ప్రభుత్వ భూములపై ప్రతికూల స్వాధీనం క్లెయిమ్‌లను సులభంగా అంగీకరించకూడదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేవలం “మేము చాలాకాలంగా ఈ భూమిలో ఉన్నాం” అని చెప్పడం సరిపోదు. పటిష్టమైన ఆధారాలు, పన్ను రసీదులు, సాగు రికార్డులు, విద్యుత్ కనెక్షన్లు, స్థానిక సాక్ష్యాలు వంటి ఆధారాలు అవసరం అవుతాయి.
ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ప్రతికూల స్వాధీనం అనేది అక్రమ ఆక్రమణకు చట్టం ఇచ్చిన ప్రోత్సాహం కాదు. నిజమైన యజమాని చాలా కాలం తన హక్కును వినియోగించకపోవడం వల్ల ఏర్పడే ఒక ప్రత్యేక చట్టపరమైన పరిస్థితి మాత్రమే.
ఆస్తి వివాదాలు చాలా క్లిష్టమైనవి. ప్రతి కేసు పరిస్థితులు, పత్రాలు, ఆధారాలు, సాక్ష్యాలపై ఆధారపడి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాల్లో అనుభవజ్ఞులైన న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం అత్యంత అవసరం.
కొందరు మిత్రులు నా సేకరణలలో నా పేరు తొలగించి వారే స్వంతంగా వ్రాసినట్లుగా మార్పులు చేసి వారి పేరుతోనే ప్రచారం చేసుకొంటున్నారు. అటువంటి వాహిని వారి పెద్దమనుష్యులకు ఈ వ్యాసం అంకితం.
॥సేకరణ॥
.....................
జి.బి. విశ్వనాథ MA
అనంతపురం. 9441245857

Comments
Post a Comment