04-05-2026

 




కలియుగ సూత్రాలు 

పూజ కోటి సమం స్తోత్రం;  స్తోత్ర కోటి సమో జపః !

జప కోటి సమం ధ్యానం;   ధ్యాన కోటి సమో లయః !!

( ఉత్తరగీత - బ్రహ్మ సందర్శన యోగం 52 వ శ్లోకం)


తాత్పర్యం :-

➡ కోటి పూజలతో సమానం ఒక స్తోత్రం.

➡ కోటి స్తోత్రాలతో సమానం ఒక జపం.

➡ కోటి జపాల తో సమానం ఒక ధ్యానం.

➡ కోటి ధ్యానాలతో సమానం ఒక లయం.

              " మనో లయమే మోక్షం".

అంతరార్థం:-

పూజ :- భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది.

స్తోత్రం:- భగవంతుని గుణగణాలు తెలుస్తాయి.

జపం:- భగవంతుణ్ణి పదే పదే తలుస్తాం.

లయం:- భగవత్ పదార్థమని తెలుసుకుంటాము.

*****

దేవుడిని పొందడానికి సాధనలు చేసే బదులు.,  దేవునికి విడిగా నాకు ఉనికి ఎక్కడిది? అని విచారణ చేస్తే వెంటనే ఫలానికి వస్తుంది.

_______________________________

బెలూన్ కు పుట్టుక ఉంది, మరణం ఉంది. కానీ గాలికి మరణం లేదు.

బెలూన్ = శరీరం;     గాలి = శక్తి.

****

✳ ఏకంగా ఉన్నప్పుడు "నేను" -- పరబ్రహ్మం.

✳ అనేకమవ్వాలనే సంకల్పం చేసినప్పుడు "నేను" --  మహాకారణ, కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు.

👉 అంతర్ముఖం అయితే ఆ చివరకు (పరబ్రహ్మం) వెళతావు.

👉 బహిర్ముఖం అయితే ఈ చివరన (శరీరాలలో) ఉంటావు.

******

04/05


నాన్న చెప్పిన పాఠం

............................ 

పోటీ పరీక్షల్లో ఓడిపోయి, డిప్రెషన్ లోకి వెళ్ళబోతున్న తన కుమారుడికి, ఓ తండ్రి చెప్పిన జీవిత సత్యం. 

"జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగ్ వంటిదే నాన్నా! ప్రతీ క్షణమూ, పరిస్థితులు అనే ప్రత్యర్థి పంచులు విసురుతూనే ఉంటాడు. ఒక్కోసారి మనం పడిపోవచ్చు. పడిపోయినంత మాత్రాన మనం ఓడినట్టు కాదు నాన్నా! ఇంకా మనకు అవకాశం ఉంటుంది. మనం పడిపోగానే ఓడిపోయినట్టుగా, రెఫరీ ప్రకటించడు. మనం కోలుకుని నిలబడడానికి సమయం ఇస్తాడు. పది వరకు అంకెలు లెక్కబెడతాడు. అప్పటికీ లేవలేకపోతే, అవతలి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు. 

జీవితంలో కూడా అంతే! మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము. సమస్య రాగానే, ఓడిపోయామని కృంగిపోకూడదు. భగవంతుడు సమయం ఇస్తాడు. పది వరకు లెక్కబెడతాడు. నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు. వాటిని మనం అందిపుచ్చుకోవాలి. సమర్థుడైన వాడు పది లెక్క పెట్టే లోగానే లేచి నిలబడి, గెలుస్తాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే పది లెక్కపెట్టే లోగా మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి. 

అది కూడా ఓకే. ఒక్కోసారి ఓడి పోతాం. ఫర్వాలేదు. ఇంకో పోటీ, ఇంకో మార్గం ఉండనే ఉంటుంది. 

చాలా మంది 'కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడి లేచినందుకు!' అని అంటుంటారు. కానీ, పడిన కెరటం, లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు. విరిగి పడిన కెరటం ఛిద్రమై, పతనమై మామూలు నీటిలో కలిసిపోతుంది, అస్థిత్వాన్ని కోల్పోతుంది. మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం. 

కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకుని, దిశను ఎన్నుకుని, మెల్లగా ప్రారంభించి రానూరానూ వేగాన్ని పుంజుకుని, తీరాన్ని మహోద్ధృతంగా చేరుకుంటుంది. అది కొత్త కెరటం. దాని శక్తి అనంతం. 

మనిషి కూడా అంతే నాన్నా! ప్రతీ పతనం నుండి తేరుకుని, కొత్త కెరటంలా, నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి. ఈ తరం యువతీయువకులకు ఆ సామర్థ్యం ఉంది."

కుమారుడు కన్నీళ్ళమయమయి, జెండా కర్రలా లేచి నిలబడి తండ్రిని కౌగలించుకుని, 

"ఔను నాన్నా! నేను మళ్ళీ ప్రయత్నిస్తాను" అని అన్నాడు.

*****

అసూయ తెచ్చిన తంటా

ఒక ఊర్లో రాజేష్, కామేశ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తన పొరుగింట్లో ఉంటోన్న రాజేష్‌ను ఎలాగైనా అధిగమించాలని అనుకుంటాడు కామేశ్. తెలివితేటల్లోనూ, ఆస్తిపాస్తుల్లోనూ, మంచి తనంలోనూ, పరోపకారం చేయడంలోనూ... తనకంటే ఇంకెవరూ ఎక్కువగా ఉండకూదని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.

అయితే... ప్రతిసారీ ఇతడికి రాజేష్ చేతిలో భంగపాటే ఎదురవుతూ ఉండేది. రాజేష్ ఇంకెప్పటికీ వసూలు కాదని వదిలేసిన రెండు వేల రూపాయల బాకీ వసూలయింది. ఈ విషయం తెలిసిన కామేశ్ అసూయతో రగిలిపోతున్న సమయంలోనే దూరపు బంధువు ఒకడు వచ్చి అప్పు అడిగాడు. పట్టరాని కోపం వచ్చినా ఆపుకుని ఎలాగైనా సరే దీన్ని అవకాశంగా తీసుకుని రాజేష్‌ను దెబ్బతీయాలనుకుంటాడు కామేశ్.

"సమయానికి నా దగ్గరా డబ్బులేదు. పరోపకారానికి మారుపేరైన మా పక్కింటి రాజేష్ నీకు సాయపడవచ్చు. వెళ్దాం రా...'' అంటూ అతడిని రాజేష్ ఇంటికి తీసుకువెళ్ళాడు కామేశ్. ఊరిపెద్దలతో మాట్లాడుతున్న రాజేష్‌కు తన బంధువును పరిచయం చేసి... డబ్బు అవసరమట, మీరే ఇవ్వగలనని చెప్పాడు.

ఇంతలో కామేశ్ బంధువు రాజేష్‌తో మాట్లాడుతూ... మీరు నాకు అప్పు ఇవ్వలేకపోతే నా ఇంకా కోతకు రాని వరిపంటను తనఖాగా పెట్టుకుని ఇవ్వండి చాలా అవసరం అన్నాడు. ఇంతలో అక్కడ ఉన్న పెద్దమనుషులు ఇప్పుడు వరిపంటకు అంత డిమాండ్ ఏమీ లేదు కదా... అలాంటప్పుడు ఆ పంటను ఎలా తనాఖాగా పెట్టుకుంటారని రాజేష్‌కు సూచించారు.

ఇంతలో రాజేష్‌ను ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనుకున్న కామేశ్.. మన రాజేష్‌కేంటండీ... అతను ఎందులో చేయిపెట్టినా లాభమే సాధిస్తాడంటూ మాట్లాడాడు. పైన తథాస్తు దేవతలుంటారని, కామేశ్ మంచి ఉద్దేశ్యంతో చెప్పాడు కాబట్టి అప్పు ఇవ్వమని చెప్పేసారు ఆ పెద్దమనుషులు. సరేనన్న రాజేష్ అప్పుగా కొంత డబ్బును ఇచ్చి పంపేస్తాడు.

తథాస్తు దేవతల దీవెనల చలువో, లేదా తాను చేస్తున్న మంచి పనుల చలువో, మెచ్చుకుంటోన్న ప్రజల ఆశీర్వాదాల చలువోగానీ రాజేష్ తనఖాగా పెట్టుకున్న వరిపంట బాగా పండింది. ఊహించని రీతిలో వరిపంట డిమాండ్ పెరిగి, అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి.

తాను అప్పుగా ఇచ్చిన డబ్బుకంటే పదింతల డబ్బును వరిపంట ద్వారా సంపాదించాడు రాజేష్. విషయమంతా తెలిసిన కామేశ్ ఇంకా అసూయతో రగిలిపోతూ... అరే ఎంతపని చేశాను. ఆ పంటను నేనే పెట్టుకుని ఉంటే... మంచిపేరుకు మంచిపేరు, డబ్బుకు డబ్బు వచ్చి ఉండేవి. అన్నింటినీ పోగొట్టుకున్నాను కదా అనుకున్న కామేశ్... ప్రతిక్షణం కుమిలిపోతూ కాలం వెళ్లదీయసాగాడు.

కాబట్టి పిల్లలూ...! పక్క వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే... రోజు రోజుకూ ఎదిగిపోతుంటే అందుకు కుమిలి పోవడం, అసూయతో రగిలిపోవడం కాకుండా... మనం కూడా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...!

ప్రాంజలి ప్రభ ఛానల్ కధ

*****

పలకరిస్తేనే చాలు పులకరిస్తారు

 రచన :

డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

9897959425

ఈ మధ్య ఒకావిడ నాకు వాళ్ళ ఇంట్లో ఉంటున్న  కుటుంబసభ్యుల వివరాలు చెబుతూ మా ఇంట్లో నేను , మా ఆయన,  ఇద్దరు  పిల్లలు, కాకుండా రెండు డస్ట్ బిన్స్ కూడ ఉన్నాయండి అంది. అది నాకు అర్థంకాక డస్టుబిన్సు అంటే ఏమిటి తల్లీ!   అన్నాను . మీకు తెలియదా ఇద్దరు ముసలోళ్ళు, ఒకరు అత్త, మరొకరు మామ అంది. అదీ నేడు సమాజంలో పెద్దవారికి కొందరు ఇచ్చే  గౌరవం. తమ జీవితమంతా తమ సంతానం యొక్క సుఖం కోసం త్యాగం చేసిన వారు, నేడు నిరాదరణకు గురౌతున్నారు. ఇది అమానుషం . చాల మంది ఇంట్లో పెద్దవారిని ఉంచుకోవడం లేదు . ఒకవేళ కొంతమంది ఇష్టం లేకపోయినా సమాజానికి భయపడి  పెద్ద వాళ్ళను తమ వద్ద ఇంట్లో ఉంచు కున్నా తమ పిల్లల్ని వాళ్ళ దగ్గరకు చేరనివ్వడం లేదు. వీళ్ళ మాటలు విన్నా, వీళ్ళతో కాలం గడిపినా పిల్లల చదువు పాడై పోతుందనే భ్రమలో ఉన్నారు . తమ పిల్లల్ని వారికి దూరంగా ఉంచుతున్నారు. దానివల్ల పిల్లలకు పెద్దలకు మధ్య దూరం రాను రాను పెరిగిపోతోంది. ఇక పెద్ద వారైన అమ్మమ్మ, తాతయ్యలు పిల్లలకు చెప్పే మాటలు, కథలు ఎంతో విజ్ఞానాన్ని , లోకజ్ఞానాన్ని కలిగిస్తాయి. పిల్లల్ని వారినుండి దూరం చేస్తే వారికి కలిగే నష్టాన్ని ఎవరు పూరించ లేరు. పెద్దవారి వలన పిల్లలు పొందే  లాభాన్ని వివరించే   మహాభారతంలోని ఒక చిన్న అంశం పరిశీలిద్దాం . భీమమహారాజు కూతురైన దమయంతి నిషధ దేశరాజైన నలుణ్ణి ప్రేమించింది. నలుడు కూడ ఆమెను ప్రేమించాడు. తండ్రి తన కుమార్తె దమయంతికి స్వయంవరం     ప్రకటించాడు. నలుడు మిగిలిన రాజకుమారులతో  పాటుగా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు , యముడు మొదలైన దేవతలు కూడ ఆమెను పెళ్లి చేసుకోవడానికి స్వయంవరానికి వచ్చారు. ఆ దేవతలు,  తమలో ఒకరిని దమయంతి వరించే లాగ దమయంతికి నచ్చచెప్ప మని  సాక్షాత్తు నలుణ్ణే  దమయంతి వద్దకు రాయబారిగా  పంపించారు. నలుడు, దేవతల కోరికను కాదనలేక ఆమెను  చేరుకొని ఆ  నలుగురిలో ఒకర్ని వరించ మని వారి మాటగా  ఆమెను కోరాడు . ఆమె తాను నలుణ్ణి తప్ప వేరొకరిని వరించనని అతని ముందే ఖచ్చితంగా చెప్పేసింది . నలుడు తానేమీ చెయ్యలేక ఆ విషయం దేవతలకు చెప్పేశాడు. కాని దేవతలు తమ ప్రయత్నం విరమించు కోలేదు. అంతలో  స్వయంవర సమయం రానే వచ్చిది . నలునితో బాటుగా ఆ నలుగురు దేవతలు వచ్చి  కూర్చున్నారు. అతని ప్రక్కనే కూర్చున్నారు. అతని వేషంలోనే కూర్చున్నారు. దమయంతికి ఏమీ తోచలేదు . ఐదుగురిలో అసలైన నలుడు  ఎవరో తెలియ లేదు. మనసులోనే పరిపరివిధాల విలపించింది. ఆమెకొక ఉపాయం తట్టింది. అసలైన నలుణ్ణి గుర్తించి మెడలో దండ వేసి వరించింది. ఆ తరువాత ఆమె చెలులు అమ్మా! దమయంతీ ! నువ్వు నలమహారాజును ఎలా 

గుర్తించగలిగావమ్మా? అని ప్రశ్నించారు . ఆమె సమాధానం చెపుతూ  నా చిన్నతనంలో నా  మామ్మ, తాత  నాకు కథలు చెపుతూ దేవతలకు చెమటపట్టదని, రెప్పపాటు ఉండదని చెప్పారు. వారు చెప్పిన కథలు నాకు గుర్తుకొచ్చాయి. ఆ ఐదుగురిలో చెమట పట్టిన శరీరం, రెప్పపాటు  కలిగిన ఒక వ్యక్తిని గమనిoచాను. అతని మెడలో స్వయంవర మాల వేశాను అంది . చూశారా! ఆమె ఎప్పుడో చిన్నప్పుడు విన్న అమ్మమ్మ కథ ఆమెను పెను ఆపద నుంచి ఎలా రక్షించిందో!

పెద్ద వాళ్ళు మన నుంచి  ఏమీ ఆశించరు, ఒక్క పలకరింపు తప్ప. మనం ప్రేమతో పలకరిస్తే చాలు వారు ఆనందంతో పులకరిస్తారు. ఆ మాత్రం కూడా మనం చెయ్యలేక పోవడం సిగ్గు చేటు. మనం పెద్దవారిని చేరదీసి ఆదరించకపోతే మనం పెద్దయ్యాక మనకు అదే గతి పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.  

కుటుంబంలో గృహస్థుడు మంచి కొడుకుగానే కాదు, మంచి అల్లుడుగా  కూడ  పేరు తెచ్చుకోవాలి. అలాగే గృహిణి మంచి కూతురుగానే కాదు మంచి కోడలిగా కూడ పేరు తెచ్చుకోవాలి. నేను ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధమైన మతగ్రంథాలు ఇంచు మించుగా చదివేను. అన్ని మతాలూ దేవుణ్ణి నమ్మవు.

కాని పాపపుణ్యాలను , వాటి ఫలితాలను చాల వరకు నమ్ముతాయి. అందువల్ల భగవంతుడున్నాడో లేడో నేను ఖచ్చితంగా చెప్పలేను గాని పాపం , పుణ్యం అనేవి మాత్రం ఉన్నాయి. అవి మనల్ని కట్టి కుడుపుతాయి. మంచైనా, చెడైనా చేసినవాడు  అనుభవించక తప్పదు. నేను Flug లో వేలు పెడిత నాకే shock కొడుతుంది , మరొకడికి కాదు. పెద్దవాళ్లను ఆదరిద్దాం , ఆదర్శ జీవితానికి బంగారు బాటలు వేద్దాం.    ఈ సందర్భంగా ఒక గొప్పకవి రచించిన, గుండెల్ని పిండేసే, అద్భుతమైన మినీకవిత మీకు అందిస్తాను.  కవి పేరు చెప్పలేకపొతున్నందుకు నన్ను మన్నించాలి.

ఆనాడు ఏడిపించాడు

అన్నం తినడానికి   

ఈనాడూ... ఏడిపిస్తున్నాడు

అన్నం పెట్టడానికి  

తల్లిడంద్ర్లను , పెద్దలను యథాశక్తి ఆదరిద్దాం. కుటుంబాన్ని స్వర్గతుల్యం చేద్దాం . 

                                            <><><><>

ఇది నాకు చాలా నచ్చింది…

ఒక రోజు భార్య సాదాసీదాగా చెప్పింది,

“వింటారా . . , నా స్నేహితురాలితో కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను.”

ఫోన్ చూస్తున్న భర్త తలెత్తి ఒకసారి చూసి,

“సరే. ఎంజాయ్ చేయి,” అన్నాడు.

ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. సాధారణంగా అయితే, “అవసరమా? తప్పనిసరిగా వెళ్లాలా? ఆలస్యంగా రావద్దు” లాంటివి అడిగేవాడు. కానీ ఆ రోజు—ఏమీ లేదు. ఊపిరి తీసుకోవడం లేదు, ప్రశ్నలు లేవు—శాంతంగా “సరే” అన్నాడు.

కొన్ని గంటల తర్వాత, వారి టీనేజ్ కొడుకు వంటగదిలోకి వచ్చాడు. చేతిలో ఒక పేపర్, ముఖం తెల్లబడిపోయింది.

“నాన్న,” మెల్లిగా అన్నాడు, “నా మాక్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చాయి… చాలా చెడ్డగా వచ్చాయి.”

అతను అక్కడే నిలబడి పోయాడు. ఎప్పటిలాగే మందలిస్తాడని భావించాడు. చదువుపై ఎప్పుడూ ఆందోళనపడే తన తండ్రి ఉపన్యాసం మొదలుపెడతాడని సిద్ధమయ్యాడు.

కానీ ఆయన ప్రశాంతంగా,

“సరే,” అన్నాడు.

కొడుకు ఆశ్చర్యంతో,

“అంతేనా… సరే?” అని అడిగాడు.

“అవును,” ఆయన మృదువుగా అన్నాడు.

“ఇంకాస్త చదివితే తర్వాత సారి బాగా రాస్తావు. చదవకపోతే సెమిస్టర్ మళ్లీ చేయాల్సి రావచ్చు. అది నీ ఎంపిక. ఏ పరిస్థితిలోనైనా నేను నీకు మద్దతుగా ఉంటాను.”

కొడుకు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి ఎప్పటి నుండి ఇంత ప్రశాంతంగా మారిపోయాడు?

తర్వాత రోజు మధ్యాహ్నం, కూతురు భయంతో లోపలికి వచ్చింది.

“నాన్న… నేను… కారు ఢీకొట్టేశాను. పెద్ద ప్రమాదం కాదు, కానీ ఒక డెంట్ వచ్చింది.”

ఆయన అరవలేదు, కోపం చూపలేదు.

“సరే. రేపు కారు వర్క్‌షాప్‌కి తీసుకెళ్లి సరిచేయించు,” అన్నాడు.

కూతురు ఆశ్చర్యపోయింది.

“మీకు… కోపం రాలేదా?”

ఆయన స్వల్పంగా నవ్వుతూ,

“కోపం వస్తే కారు బాగుపడదు. తర్వాత జాగ్రత్తగా ఉండు,” అన్నాడు.

ఇప్పుడు ఇంట్లో అందరూ ఆలోచనలో పడ్డారు. ఇదే మనిషి—ఇదే భర్త, ఇదే తండ్రి—ఇప్పుడెలా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? ముందెప్పుడూ చిరాకు, టెన్షన్, త్వరగా స్పందించేవాడు. ఇప్పుడు మాత్రం స్థిరంగా, ప్రశాంతంగా ఉన్నాడు.

చివరికి ఆ సాయంత్రం అందరూ వంటగది టేబుల్ దగ్గర సమావేశమయ్యారు.

“వినండి,” భార్య చెప్పింది,

“మీరు ఇటీవలి కాలంలో చాలా మారిపోయారు. ఏం జరిగినా కోపం రావడం లేదు. అన్నీ బాగానే ఉన్నాయా?”

ఆయన చిరునవ్వుతో,

“ఏమీ తప్పు లేదు. అన్నీ సరిగానే ఉన్నాయి. నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను,” అన్నాడు.

అందరూ నిశ్శబ్దంగా విన్నారు.

“చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది—ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యుడు,” అన్నాడు.

భార్య అడిగింది,

“అంటే?”

ఆయన చెప్పాడు,

“ముందు నేను ప్రతిదానిపై ఆందోళనపడేవాడిని—నువ్వు ఆలస్యమైతే చింతించేవాడిని; పిల్లలు తక్కువ మార్కులు తెచ్చినా నన్నే నిందించేవాడిని; ఏదైనా పాడైతే కోపపడేవాడిని; ఎవరైనా బాధలో ఉంటే దాన్ని సరిచేయడానికి ప్రయత్నించేవాడిని. అందరి సమస్యలను నా సమస్యలుగా తీసుకున్నాను. కానీ ఒక రోజు తెలిసింది—నా ఆందోళన వాళ్ల సమస్యలను పరిష్కరించదు. అది నా శాంతినే నాశనం చేస్తుంది.”

ఆయన కొనసాగించాడు,

“నా ఒత్తిడి మీకు సహాయం చేయదు. నేను సలహా ఇవ్వగలను, ప్రేమించగలను, మద్దతివ్వగలను. కానీ మీ బదులు మీ జీవితం నేను జీవించలేను. మీ నిర్ణయాల ఫలితాలు—మంచివైనా, చెడ్డవైనా—మీరు ఎదుర్కోవాల్సిందే.”

కొద్దిసేపు ఆగి మళ్లీ నవ్వాడు.

“అందుకే నా నియంత్రణలో లేని విషయాలను నియంత్రించడానికి ప్రయత్నించడం ఆపేశాను.”

కొడుకు అడిగాడు,

“అంటే… ఇకమీదట మాకు పట్టించుకోరా?”

ఆయన జవాబు ఇచ్చాడు,

“పట్టించుకోకపోవడం కాదు. పట్టించుకోవడం మరియు నియంత్రించడం వేరు. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, సహాయం చేస్తాను. కానీ నా శాంతిని కోల్పోయేంత వరకు కాదు.”

గదిలో నిశ్శబ్దం నెలకొంది.

“నా పాత్ర మీకు ప్రేమ ఇవ్వడం, మార్గనిర్దేశం చేయడం, అవసరమైనప్పుడు తోడుగా ఉండటం. కానీ మీ జీవితాన్ని మీరు నిర్వహించుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. వాటి ఫలితాలను మీరు స్వీకరించాలి. అలా నేర్చుకుంటారు,” అన్నాడు.

“ఇప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను నాకు చెప్పుకుంటాను—ఇది నేను సరిచేయాల్సిన విషయం కాదు. ప్రశాంతంగా ఉంటాను. మీరు నేర్చుకుంటారని నమ్ముతాను. జీవితం పాఠాలు నేర్పుతుంది.”

ఆ రాత్రి అందరూ ఆయన మాటలను ఆలోచించారు.

కొడుకు మళ్లీ చదవడానికి కూర్చున్నాడు—నాన్న మందలించినందుకు కాదు, బాధ్యత తనదే అని గ్రహించి.

కూతురు కారు మరమ్మత్తుల బాధ్యత తీసుకుని, ఇన్సూరెన్స్ ప్రక్రియను తెలుసుకుంది.

భార్య కూడా ఇంటి పనులను మరింత జాగ్రత్తగా చూసుకుంది—బలవంతం వల్ల కాదు, తన బాధ్యతగా భావించి.

మెల్లగా ఆ ఇంటి వాతావరణం తేలికగా మారింది.

ఎవరూ భయంతో ప్రవర్తించలేదు—అర్థంతో ప్రవర్తించారు.

ఎందుకంటే ఒక ఇంట్లో ఒక్క వ్యక్తి శాంతిని ఎంచుకుంటే, అది అందరికీ వ్యాపిస్తుంది.

ఒకరు నియంత్రణ వదిలేస్తే, మిగతావారు స్వయంగా తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు.

అలా శాంతి వ్యాపిస్తుంది—ప్రేమలా.

కోపం, ఒత్తిడి, అధికారం ద్వారా ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.

మీరు బాధ్యతగా ప్రవర్తించండి, ఇతరులు తమ బాధ్యతను గుర్తించేందుకు సహాయం చేయండి.

ఇది మీ హృదయాన్ని తాకుతుందేమో చూడండి. 🙏

శాంతిమయమైన రిటైర్డ్ జీవితాన్ని గడపాలనుకునే ప్రతి రిటైరీ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇది. 😊

****

(03) నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…

ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. ‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో’ అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు.

అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు.

ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు”

”ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్‌ నడుస్తుంటే, మీ యాక్సిస్‌ కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్‌ చేస్తుంటాడు.

మరొకడు మీ అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్‌ అప్పటికే మీ డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు.

అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్‌ అయిపోగానే ఓ పెగ్‌ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే”

”ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌- జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరుగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా?

స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండుసార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. ‘నేనే లేకపోతే’ అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది”

”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి.

ఇంకా ఆఫీస్‌ను నెత్తి మీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి.

‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది… ఏదీ ఆగదు… పాత నీరు పోతూనే ఉంటుంది… కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది… జస్ట్, ఎ లైఫ్, ఇట్ హేపెన్స్..!!

******

అగ్నులు ఎన్ని రకములు ? అవి ఏవి ?

....................................

హిందూశాస్త్రాలు వేదాలు పురాణాల ప్రకారం సందర్భాన్ని బట్టి అగ్నిని ప్రధానంగా మూడు ఐదు ఏడు నలభై తొమ్మిది రకాలుగా విభజించారు.

త్రేతాగ్నులు మూడు రకములు.యజ్ఞాలలో వెలిగిస్తారు.

(1)గార్హపత్యం - గృహస్థుడు నిత్యం రక్షించే గృహాగ్ని. పడమటి వైపు ఉంటుంది. ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి.

(2) ఆహవనీయం - దేవతలకు హవిస్సు అర్పించే యజ్ఞాగ్ని. తూర్పు వైపు ఉంటుంది.  

(3)దక్షిణాగ్న దీనికే అన్వాహార్య పచనమని పేరు. పితృకర్మలు, శ్రాద్ధాలకు వాడే అగ్ని. దక్షిణం వైపు ఉంటుంది.  

 సప్తజిహ్వలు అంటే ఏడు రకాలుగా మండే అగ్నులు. ముండకోపనిషత్తులో చెప్పిన ఏడు అగ్నులన్నమాట.అగ్ని మండే విధానాన్ని రంగు వేగం తీవ్రతను బట్టి విభజన చేశారు.

(1) కాళీ – నలుపు రంగులో వుండి మెల్లగా లోపల మండుతుంది. 

(2) కరాళీ – మండే సమయంలో భయంకరంగా వుండి ఉగ్రంగా ఎగసిపడుతుంది. 

(3)మనోజవం  – మనస్సు వేగంతో చలించేది.అంటే చిటపటలాడుతూ తీవ్రంగా మండుతూ వేగంగా విస్తరించేది. 

(4) సులోహితా – ఎర్రటి కాంతితో మండుతూ, అధిక ఉష్ణాన్ని ఇస్తూ మండేది.

(5)సుధూమ్రవర్ణా  – మండేసమయంలో పొగతో కూడివుండి జ్వాల తక్కువగా వుంటుంది.

(6) స్ఫులింగిని – మండేసమయంలో నిప్పురవ్వలు చిమ్మేది .

(7) విశ్వరూపి – పైన పెర్కొన్న అన్ని రకాల మంటలు రంగులు రూపాలు  కలగలసిన సంపూర్ణ జ్వాలరూపం.

భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాల్లో అగ్ని ఒకటి. పంచభూతాలలోని అగ్ని వేడి + కాంతి + శక్తి రూపంగా వుంటుంది.

 తైత్తిరీయ సంహిత ప్రకారం 49 అగ్నులు ఇలా వుంటాయి.

త్రేతాగ్నులు = 3  సామిధేని అగ్నులు = 7

తనూనప్త్ అగ్నులు = 7 

ఇధ్మ  అగ్నులు = 7

స్విష్టకృత్తులు = 7 వ్యాహృతాగ్నులు =5 

వైశ్వానరులు = 6 ఇతర భేదాలు కలవి = 7

మొత్తం 49.

సాధారణంగా యజ్ఞ కర్మలకు మూడు అగ్నులు చాలని  చెబుతారు.ఆధ్యాత్మిక తాత్త్విక దృష్టిలో ఏడు అగ్నులు చాలా ప్రసిద్ధమైనవి. వైదిక కర్మకాండలో 49  అగ్నులు గురించి పేర్కొనబడినది. 


॥సేకరణ॥

............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

****

*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -14* 

*గుంటూరు జిల్లా* 

*అమరావతి -2*

ఈ ఆలయం కృష్ణ ఒడ్డున కుడివైపు ఉంది. నాలుగువైపులా మహోన్నతమైన గోపురాలు. ద్రవిడ శిల్ప సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నాయి. విమానం మీది శిల్పం కూడా యీ సంప్రదాయాన్నే సూచిస్తుంది. ఇది మొదట బౌద్ధాలయం అని తరువాత మార్చబడిందనీ ఒక వదంతి ఉంది. ఈ వాదంలో కొంత బలం ఉన్నట్లే అనిపిస్తుంది. ఆలయం పునాది రాళ్ళన్నీ బౌద్ధ లక్షణం కల శిలాఫలకాలే. గర్భ గృహంలో సరిగా మూల విరాట్టు మీదుగా పాలరాతి మీద చెక్కిన పద్మం కానవస్తుంది. పరమ సుకుమారమైన ఆ శిల్పశైలి ప్రాచీన బౌద్ధానికి సంబంధించినదే. లింగం ఎత్తు సుమారు 15 అడుగులు, పూర్వం ఇది ఆయన స్తంభమని, తరువాత శివలింగంగా ప్రతిష్టితమై పూజింపబడుతోందనీ ఒక వదంతి వుంది. ఈ ఆలయం ప్రస్తుత స్వరూపం ద్రవిడ దేవాలయ శిల్పానికి "నమూనా" గా ఉంది. గోపురాలు ప్రాధాన్యంలోకి వచ్చింది మధ్య యుగం లోనే. క్రీ. శ 11వ శతాబ్దానికి పూర్వము శాసనం ఇచ్చట ఏదీలేనందున యీ ఆలయం తరువాతి కాలంలో నిర్మింపబడిందనే భావింపబడుతోంది.

అయితే పురాణ గాథలను బట్టి అమరావతీ, అమరేశ్వరాలయం బహు ప్రాచీనకాలం నాటివని తెలుస్తుంది. స్కాంద పురాణంలో ఈ ప్రదేశం ఆలయమూ సమగ్రంగా చిత్రీకరించబడ్డాయి. జన ప్రచారంలో ఉన్న గాథలూ స్థలపురాణమూ యిలా చెబుతున్నాయి.

ద్వావరం చివర కలియుగం ఆరంభంలో అంటే 5053 సంవత్సరాలకు పూర్వం శౌనకాది మునులు నారదమహర్షిని విముక్తి సాధన మార్గాన్ని అడిగారు. నారదమహర్షి వారికి ఇలా చెప్పాడు. పరమేశ్వరుడు అయిన కృష్ణుని జలమయ స్వరూపం కృష్ణ కాబట్టి కృష్ణా తీర నివాసము కృష్ణా స్నానమూ, ముక్తి సాధనాలు అంటూ వారికి అమరేశ్వర పురాణాన్ని యీ విధంగా వివరించాడు. 

కృష్ణ దక్షిణ తీరాన శ్రీశైలానికి ఆగ్నేయాన అమరేశ్వరుడున్నాడు. ఆస్వామి నెలకొని ఉన్న ప్రదేశం పరమోత్తమం. ఇచ్చట మూడు మహా విషయాల సన్నివేశం ఉంది. తీర్ధమూ, క్షేత్రమూ, దైవత్వము, కలసినచోట కృష్ణాతీరంలో అమరేశ్వరస్వామిని సేవిస్తే కోరికలు ఫలిస్తాయి. దేవతల ప్రార్ధన యిందుకోసమే. శివుడు అమరేశ్వర రూపంలో అక్కడ వేంచేసియున్నాడు. ఇంద్రుడూ, కపిలమహర్షి ఆ స్వామిని సేవించారు. అటువంటిది కాబట్టి క్షేత్రాలలో కెల్లా అది పావనమైనది. అచ్చటి స్వామిని సేవించిన వారికి పునర్జన్మలేదు. కృష్ణలో ఎన్నో పుణ్యతీర్థాలు కలుస్తాయి. అందులో స్నానంచేసి అమరేశ్వర స్వామిని సేవించిన వారి పాపాలన్నీ నిశ్శేషంగా క్షాళితమైపోతాయి. 

ఈ పుణ్యక్షేత్రంలో శివుడు. పంచలింగాకారము లతో ఉన్నాడు. ప్రణవేశ్వరుడనీ, అగస్త్యేశ్వరు డనీ, కోసలేశ్వరుడని, సౌమేశ్వరుడనీ, పార్థివేశ్వరుడనీ, ఏ భక్తుడైనా యీ పుణ్యక్షేత్రంలో మూడురోజులకు పైగా నివసించి పుణ్యనదియైన కృష్ణలో స్నానంచేసి భక్తి, విశ్వాసములతో స్వామి ని సేవించినట్లయితే వాడు సరాసరి శివలోకానికి వెళ్తాడు. ఇక్కడ ఏ భక్తుడైనా మరణించినట్లయితే శివునిలో లీనమైపోతాడు.

ఈ క్షేత్రమహత్యాన్ని గూర్చి క్షేత్రమూర్తి మహత్తుని గూర్చి స్థల పురాణ గాథలిలా ఉన్నాయి.

పూర్వం ధాన్యకటకం అనే పట్నం ఉండేది. ధాన్యకటకమంటే కాశీనగరమే. అమరేశ్వరుడే, విశ్వేశ్వరుడు, ఇచ్చట కృష్ణానది గంగానదికంటే వేఱుకాదు. ఈ స్థలమహత్యాన్ని బట్టి ఇచ్చటికి వచ్చి కృష్ణా స్నానంచేసి అమరేశ్వరస్వామిని 

సేవిస్తే కాశీ వెళ్ళి గంగాస్నానంచేసి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తే ఏ ఫలం కలుగుతుందో అదే ఫలం కలుగుతుంది. ధాన్యకటకంలో శివుడు తన ప్రమధగణములతో సహా నివసిస్తున్నాడు. ఆయనకు కాంచనాధుడని కూడా పేరు. కాంచపురియే అమరావతి! పురాణ గాధ యిలా ఉన్నది. 

ఒకప్పుడు దేవతలు రాక్షసులచేతిలో ఓడిపోయినారు. ఆ రాక్షసులను సంహరిస్తానని శివునిచేత వరం పొంది కాందిశీకులైన దేవతలు అందరూ వచ్చి ధాన్యకటకంలో ఉన్నారు. అప్పటినుండి దానికి అమరావతి అనే వాడుక వచ్చింది. గాథ యిలా చెబుతోంది. పూర్వం ఇంద్రునికి తారకుడనే రాక్షసునికి పదివేల సంవత్సరాలు యుద్ధం జరిగింది. చివరకు తారకుడు గెలిచెను. దేవతలు, భయపడి మహా విష్ణువుని శరణుజొచ్చెను. విష్ణువు వారితో ఇలా అన్నాడు. వాడు మహా శివభక్తుడు. వాని శక్తంతా శివుడిచ్చింది. అటువంటి శివభక్తుణ్ణి చంపటం తనకు సముచితంకాదని వెళ్ళి శివునికే మొర పెట్టుకోమని సలహా ఇచ్చాడు. శివుడు దేవతల మొరవిని తారకాసురుణ్ణి చంపటం తనకూ సాధ్యం కాదన్నాడు. దీనిని బట్టి ఏ దోషాలు ఎలా ఉన్నా నమ్మిన భక్తునికి హాని చెయ్యటం, పరమేశ్వరునికైనా సాధ్యం కాదని తెలుస్తోంది. తారకాసురుడంత మహాభక్తుడు.

చివరకు శివుడు తారకునితో యుద్ధానికి దేవసేనలను నడిపించడానికి కుమారస్వామిని నియోగించాడు. సేనలముందు నిలిచి కుమార స్వామి తారకునితో తలపడ్డాడు. యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. ఆయనకూ తారకుణ్ణి గెలవలేను అనిపించింది. అందరూ మళ్ళీ శివుని దగ్గరకు వెళ్ళారు. ఆయన ఇలా చెప్పారు. వాడెంత భక్తుడంటే శివునితో తాదాత్మ్యం పొందాడు. వాని కంఠదేశంలో శివలింగం ఉంది. ఆ లింగంలో వాని ప్రాణాలు ఉన్నాయి. మీరు ఆ లింగాన్ని భేదించగలిగితే వాడు మరణిస్తాడు. వానికి శివుడులేని బ్రతుకు నిరర్ధకం. శివుడింకా యిలా చెప్పాడు. ఆ లింగ శకలాలు ఏయే క్షేత్రాలలో పడతాయో అక్కడ పెరుగుతాయి. ఆ పడ్డచోట్లకు పోయి అక్కడ ప్రతిష్టిస్తే అవి యింక పెరగవు. వెళ్ళమన్నాడు.

ఆ ప్రకారం కుమారస్వామి తారకుడి కంఠదేశంలో ఉన్న శివలింగాన్ని ఐదు శకలాలుగా ఖండించాడు ఐదూ ఐదు చోట్ల పడ్డాయి. అందులో పెద్దది మొదటి శకలం! అది పడిన చోటికి శివుడు చెప్పినట్లు ప్రతిష్ఠించడానికి ఇంద్రుడు బృహస్పతి తో సహావెళ్ళాడు. నేలనుండి ఆకాశాన్నంటుతున్న ఆ లింగాన్ని ప్రతిష్ఠించటం గూర్చి బృహస్పతిని అడిగాడు. ఆయన ఆశ్వయుజ శుద్ధ దశమినాడు ప్రతిష్ఠించమన్నాడు. ఇంద్రుడారీతిగా ప్రతిష్ఠించి అమరేశ్వరుడని పేరుపెట్టి ఆ లింగాన్ని ఆరాధించాడు.

రాక్షసగురువు శుక్రుడు వచ్చి బృహస్పతిని ప్రశ్నించాడు. కృష్ణ కి వరదలు వచ్చి మునిగి పోవడానికి వీలైన చోట లింగాన్ని ఎలా ప్రతిష్ఠింప జేశావని. బృహస్పతి ఇలా చెప్పాడు. ఈ శకలం పడిన చోట భూమిలో పాతాళం వరకూ క్రౌంచమనే పర్వతం ఉంది. ఈ శకలం ఆ కొండ మీద పడి పెరగడం మొదలుపెట్టింది. అందువల్ల కృష్ణ వరదల్లో పొంగినా ఏమీ సంభవించదనీ కృష్ణయే ప్రవహించడానికి యింకొక త్రోవ పట్టుతుందనీ. ఇందువల్లనే ఇచ్చట కృష్ణ ఉత్తర, దక్షిణాలుగా ప్రవహిస్తోంది.

బృహస్పతి ఆదేశానుసారం అమరేశ్వరుని చుట్టూ దేవతలు అంబిక మొదలైన పరివార దేవతలను ప్రతిష్ఠించారు. అమరావతిలో యక్షులు, కిన్నరులూ కూడా ఉన్నా దేవతలు చిరకాలం ఉన్నందువల్ల అమరావతి అనే పేరు వచ్చింది. మిగిలిన శకలాలు నాలుగూ పడిన చోట్లు -భీమారామము (గుణుపూడి భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), ద్రాక్షారామం, కుమారా రామము (సామర్లకోట).

అమరేశ్వరస్వామి తన భార్య బాలా చాముండి కాంబతో సహా యిచ్చట సేవలందుకొంటున్నాడు. ఈమె శక్తి పీఠాల్లో నాలుగవ పిఠంగా భావింప బడుతోంది. ఆలయంలో యింకా ముఖ్యమైన యితర దేవతలు చాలామంది ఉన్నారు.

🛕

*సశేషం* 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026