13-05-2026
మధ్యాహ్నం నిద్ర మంచిదేనా ? ఎంతసేపు ?
........................................
మనిషికి నిద్ర అంటే శరీరం స్విచ్ ఆఫ్ చేసుకోవడం కాదు, అది శరీరాన్ని మెదడును రిపేర్ చేసుకునే సమయం ఇంకా చెప్పాలంటే ఛార్జింగ్ పెట్టినట్టు. నిద్రపోకపోతే మనిషి బతకలేడు. మెలకువగా ఉన్నప్పుడు మెదడులో వ్యర్థ పదార్థాలు టాక్సిన్స్ పేరుకుపోతాయి, ముఖ్యంగా బీటా-అమిలాయిడ్ అనే ప్రోటీన్, ఇది ఎక్కువైతే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి వ్యాధులు వస్తాయి. నిద్రపోయినప్పుడు మెదడులోని గ్లింపాటిక్ వ్యవస్థ యాక్టివ్ అయ్యి ఈ చెత్తనంతా బయటకు పంపేస్తుంది, అందుకే మంచి నిద్ర తర్వాత తల తేలికగా ఉంటుంది.
పగలంతా నేర్చుకున్న విషయాలు, అనుభవాలు నిద్రలోనే దీర్ఘకాల జ్ఞాపకాలుగా మారతాయి, పరీక్ష ముందు రాత్రి సరిగా నిద్రపోతే చదివింది గుర్తుంటుంది, నిద్రలేకపోతే ఏకాగ్రత పోతుంది, కొత్తగా ఏమీ నేర్చుకోలేం. నిద్రలో గ్రోత్ హార్మోన్ విడుదల అవుతుంది, అది కండరాలు, కణజాలాలు, ఎముకలు రిపేర్ చేయడానికి, కొత్త కణాలు తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు ఎక్కువ నిద్రపోతారు, ఎదుగుతారు. గాయాలు త్వరగా మానాలన్నా నిద్ర అవసరం. నిద్రపోతున్నప్పుడు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సైటోకైన్స్ అనే ప్రోటీన్లను తయారు చేస్తుంది. రోజూ 7-8 గంటలు నిద్రపోయే వాళ్లకు జలుబు, ఫ్లూ త్వరగా రావు.నిద్ర తక్కువైతే చిన్న జబ్బులు కూడా త్వరగా తగ్గవు. వ్యాక్సిన్లు కూడా సరిగా పనిచేయవు. ఆకలిని కంట్రోల్ చేసే లెప్టిన్ గ్రెలిన్ హార్మోన్లు నిద్రపైనే ఆధారపడతాయి. నిద్ర తక్కువైతే గ్రెలిన్ పెరిగి ఆకలి ఎక్కువవుతుంది. లెప్టిన్ తగ్గి కడుపు నిండిన ఫీలింగ్ రాదు.అందుకే నిద్రలేమి ఉన్నవాళ్లు లావు అవుతారు. అలాగే ఇన్సులిన్ పనితీరు దెబ్బతిని షుగర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
సరిగా నిద్రపోకపోతే చిన్న విషయానికే చిరాకు కోపం ఏడుపు వస్తాయి. మెదడులో భావోద్వేగాలను కంట్రోల్ చేసే అమిగ్డాలా భాగం నిద్రలేమితో ఎక్కువ రియాక్ట్ అవుతుంది. డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్నవాళ్లకు నిద్ర సమస్యలు సాధారణం. నిద్రలో బీపీ గుండె కొట్టుకునే వేగం తగ్గి గుండెకు విశ్రాంతి దొరుకుతుంది. రోజూ 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే హైబీపీ గుండెపోటు స్ట్రోక్ రిస్క్ 45% పెరుగుతుంది. పెద్దవాళ్లకు రోజుకు 7-9 గంటలు పిల్లలకు 9-14 గంటలు వృద్ధులకు 7-8 గంటలు నిద్ర అవసరం.
తిండి, నీళ్లు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ఫోన్ ఛార్జింగ్ లేకుండా పనిచేయనట్టు నిద్ర లేకుండా మెదడు, శరీరం పనిచేయవు. ఒక్క రాత్రి నిద్ర చెడితే మర్నాడు పని సరిగా చేయలేం రోజుల తరబడి నిద్రలేకపోతే ప్రాణానికే ప్రమాదం.
ఇకపోతే మధ్యాహ్నం నిద్ర మంచిదే కానీ ఎంతసేపు అనేది ముఖ్యం. చిన్న కునుకు వేయడం చాలామందికి మంచిది. దీన్నే పవర్ న్యాప్ అంటారు. 10-20 నిమిషాల కునుకు మెదడును రీఫ్రెష్ చేస్తుంది. దృష్టి జ్ఞాపకశక్తి పనితీరు మెరుగుపడతాయి. NASA పైలట్లపై చేసిన పరిశోధనలో 26 నిమిషాల నిద్ర పనితీరును 34% పెంచిందని తేలింది. నిద్రలేమి వల్ల వచ్చే చిరాకు ఒత్తిడి తగ్గుతాయి, మూడ్ బాగుంటుంది. వారానికి 1-2 సార్లు మధ్యాహ్నం నిద్రపోయే వారిలో గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
షిఫ్ట్ పని చేసేవాళ్లు రాత్రి సరిగా నిద్రపోని వాళ్లకు మధ్యాహ్నం కునుకు అవసరం. 30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోతే గాఢనిద్రలోకి వెళ్లిపోతారు, లేచాక మత్తుగా తల బరువుగా అనిపిస్తుంది.దీన్ని స్లీప్ ఇనర్షియా అంటారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిద్రపోతే రాత్రి నిద్ర పాడవుతుంది. నిద్రలేమి ఉన్నవాళ్లు అస్సలు పడుకోకూడదు. ప్రతిరోజూ గంటకు పైగా నిద్రపోవడం డయాబెటిస్ గుండె జబ్బులు డిప్రెషన్‌కు సంకేతం కావచ్చు. అది అలవాటుగా మారితే డాక్టర్‌ను కలవడం మంచిది.
ఆయుర్వేదం ప్రకారం కఫము ఉన్నవాళ్లు స్థూలకాయులు జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పగలు నిద్రపోకూడదు. వేసవి కాలంలో చిన్న పిల్లలు వృద్ధులు బాగా అలసిపోయినవాళ్లురోగులు మాత్రం పడుకోవచ్చు. సరైన పద్ధతి ఏమిటంటే మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య 10-20 నిమిషాలు మాత్రమే పడుకోవాలి. చీకటిగా వున్న నిశ్శబ్ద ప్రదేశం చాలా ముఖ్యం. కుర్చీలో కూర్చుని తల వాల్చినా చాలు. 25 నిమిషాలకు అలారం పెట్టుకోండి. లేచిన వెంటనే ముఖం కడుక్కుని కాస్త నడవండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజూ 15-20 నిమిషాలు మధ్యాహ్నం కునుకు తీస్తే మెదడుకు శరీరానికి మంచిదే. గంటలకొద్దీ పడుకుంటే మాత్రం అనారోగ్య సమస్య. మీకు రాత్రి 7-8 గంటలు హాయిగా నిద్రపడుతుంటే, పగలు నిద్ర అవసరం లేదు.
II సేకరణII
............... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం
*భైరవవాక - 8*
🔱
రచన: ఇందూ రమణ
సింహాల దేఁవిడీలో కఛేరీ గంటలు వరుసగా 'మూడు' గంటలు మ్రోగాయి. కఛేరి గంటలు వింటూ నిద్రలోకి జారుకున్నాడు పాండే.
కంటిమీద కునుకు పట్టీపట్టగానే ఎవరో తట్టిలేపినట్టూ తటాలున లేచికుర్చున్నాడు పాండే.
అప్పుడు! అప్పుడు గుర్తొచ్చింది పిచ్చిది.
కళ్లల్లో కల్లోలం సృష్టించి... కడుపులో ఆకలి మండించి ... వండుకున్న నిక్షేపంలాంటి వంటని కుక్కలపాలు చేసిన 'పిచ్చిది' మదిలో మెదిలేసరికి ఛటుక్కున లేచి కూర్చున్నాడు పాండే.
మోనిషా !!!
మోనిషా ఎందుకొచ్చింది!?
తను వీళ్ళకు అండగా ఉన్నాడని తెలిసి కూడా ఇక్కడ ... ఇంత భీభత్సం ఎందుకు సృష్టించింది ?
ఏఁవైంది?!
ఎవరైనా తమ నాటకాన్ని పసిగట్టేసారా?
ఆలోచిస్తూ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు.
అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు.
పాత్రో పక్కనే ఉన్న తువ్వాలు తీసుకొని తలకు తలపాగా లాగా చుట్టుకున్నాడు. ఎవరైనా చూసిన అంతగా పోల్చలేరు.
ప్రపంచానికి పిచ్చిదిగా తోచే మోనీషా తన దగ్గర కూడా ఎందుకు ఇలా పిచ్చిదిలాగా ప్రవర్తించింది? తను వీళ్లకి తోడుగా ... నీడగా ఉన్నాడని తెలిసి కూడా ఎందుకు వీళ్లని ఇలా ఇక్కట్లు పాలు చేయాలని పూనుకుంది? ఎందుకు? ఒక వేళ తమ వాళ్లు ఎవరైనా వచ్చారా?!
ఆ ఆలోచన కలగడంతోనే పాండే నడకలో జోరు పెరిగింది.
సాధారణంగా తను మోనిషాని రోజూ కలవడు. ఏదైనా కబురు పంపాలన్నా ….. కబురు అందుకోవాలన్నా తనని కలవడానికి ఇలా వస్తుంది మోనిషా.
తానెక్కడున్నా వచ్చి రాయి విసిరి కొట్టడమో... లేదా ఏదో చెత్త తీసుకువచ్చి చేతిలో పెట్టడమో చేస్తుంది. చూసే వాళ్ళందరికీ పిచ్చి చేష్టల్లా ఉన్నా అది తమ రహస్య సంకేతం. ఆ రాత్రే మోనిషా తను కలుస్తారు.
పిచ్చిగా తిరిగే మోనిషా చూడ్డానికి అందగత్తె అయినా ఎవరూ ఆమె జోలికి పోరు. తనే ఏ రోజన్నా యాత్ర పెద్దగా లేనప్పుడు ఆమె ఎక్కడున్నా... ఏమూల పడుకున్నా వెళ్ళి కలుసుకుంటాడు.
మోనిషా గర్భవతి కూడా. ప్రజల దృష్టిలో ఆమెని ఎవరో కామాంధుడు చెరిచాడనే అపవాదు ఉంది. జాలి కలిగినవారు ఆమెకి పాలు... పండ్లు ఇస్తుంటారు.
పగలంతా వూరు-వాడా .... కొండా ... పైనా అంతా తిరిగి... తిరిగి చీకటిపడ్డాక ఏ సత్రం నీడలోనో పడుకుంటుంది మోనిషా.
ఎవరైనా తమ వాళ్లు వస్తే కలవడానికి వాళ్లు తల దాచుకోవడానికి ఓ సంకేత స్థలం ఉంది. అదే ఆ వూరి స్మశానం.
పాండే కూడా అక్కడికే బయల్దేరాడు.
రాజవీధిలోకి వచ్చాడు. వూర కుక్కలు ఆకాశంకేసి చూస్తూ అరుస్తున్నాయి.
పాండే మరింత జోరుగా నడుస్తూ చెరువు గట్టు చేరుకున్నాడు. చెరువుకు ఇవతల యాత్రీకుల స్నానాల రేవు. అవతలగట్టు పక్కనే ఉంది స్మశానం.
ఆ చెరువునే దేఁవుడి కోనేరని ... వరాహ పుష్కరిణీ అని పిలుస్తుంటారు.
పుష్కరిణికి మధ్యలో మదగజంలా పెద్ద మంటపం! ఆ మంటపంలోనే ఏడాదికి ఒకసారి చందన స్వామి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తుంటారు.
చెరువు గట్టున నడుస్తూ టక్కున ఆగాడు పాండే..
దూరంగా...స్మశానం !
📖
కార్తీక మాసంలో చివరి రోజున తెల్లవారు ఝామున ఈ వరాహ పుష్కరిణి ఎంతో సందడిగా, దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. పుణ్యక్షేత్రానికి చుట్టు పక్కల ఉన్న ఊరి మహిళలంతా కార్తీక దీపాలు ఇక్కడే విడిచిపెడతారు.
అలాంటి వరాహ పుష్కరిణి పక్కనే ఉంది స్మశానం.
శవం కాలుతున్నట్టుంది. ఓ మూల పెద్ద మంట. జ్వాలలు రేగుతున్నాయి. సాయంత్రమే చితిరగిల్చినట్టున్నారు. ఏ మహానుబావుడి శవమో! దేదీప్యమానంగా కాలుతోంది.
స్మశానంలో దెయ్యంలా తల విరబోసుకుని ఉన్నట్టు ఎన్నో ఏళ్ళనాటి రావిచెట్టు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల శవాల్ని చూసానన్న దీమాతో ధైర్యంగా ఉన్నట్టుందా చెట్టు.
చెట్టు కీ నీడలో - రెండు మానవాకృతులు!
పాండే శరీరం కొంచెం జలదరించింది.
అది మామూలే!
ఆర్నెల్లుగా స్మశానంలో తాము కలవడం పరిపాటయింది. అలవాటయిన ప్రదేశమైన ఒకోసారి ఏదో భయం. ఒకోసారి తనకి తెలియకుండానే శరీరం ఈ విధంగా జలదరిస్తుంటుంది.
వాళ్ళు - ఎవరో కాదు. తమవాళ్ళే. ఒకరు మోనిషా ... మరొకరు .... ? ఎవరై ఉంటారు. బాస్ కాదు కదా! మనసులోనే తర్జనభర్జనపడుతూ వారిని సమీపించాడు పాండే.
పాండేని చూస్తూనే ఆ రెండు ఆకారాలు అతనికి అభిముఖంగా రాసాగాయి.
పాండే దగ్గరకు రాగానే పిచ్చిదానిలా నటిస్తున్న మోనిషా ఇంతెత్తున లేస్తూ అరిచింది.
"ఇప్పటికా నీకు తీరిక దొరికింది ? ఏం ఆ ఆడాళ్ళని ఒదిలి రాలేకపోయావా?!" కోపంగా అంది మోనిషా.
"మోనీషా?! నీకేం! నువ్వెలాగైనా మాట్లాడుతావ్!? వాళ్ళ కళ్ళుగప్పి రావడానికి నేనెన్ని ఇబ్బందులు పడ్డానో నీకర్థం కాదు?" నిష్ఠూరంగా అన్నాడు పాండే.
"నీ ఇబ్బందులు అలా ఉంచు. ఈ రోజు తారీఖు ఎంతో గుర్తుందా?!" మోనిషా అంది.
మోనిషా ప్రశ్నతో అలర్ట్ అయ్యాడు పాండే.
అవును! సరిగ్గా ఈ రోజుకి ఆర్నెళ్ళవుతోంది.
'తామిద్దరూ ఈ ఊరిలో అజ్ఞాతవాసం ప్రారంభించి ఈ రోజుతో ఆర్నెల్లు పూర్తవుతోంది. తామీ ఊరు ఎందుకొచ్చిందీ
... ఇన్నాళ్ళూ ఈ ఊరిలో ఇంత ప్రయాస కోర్చిందీ ఈ రోజు కోసమే. తమ శ్రమకి ఫలితం దక్కబోతోంది. తమ వాంఛ నెరవేరబోతోంది' పాండేకి ఆ ఆలోచన కలగడంతో ... మనసు పులకరించింది.
ఈ రోజు శనివారం!
ఈ రోజు రాత్రికే పని పూర్తికావాలి. అందరూ అలసటతో ఆదమరచి నిద్ర పోయేవేళ తమ పని మొదలుకావాలి.
"గుర్తుంది! మోనిషా ! గుర్తుంది. ఈరోజు కోసం మనం ఆర్నెల్లుగా ఎన్ని ఇక్కట్లు పడ్డామో.... పడుతున్నామో నీకు తెలుసు కదా ! అలాంటి ఈ రోజు మర్చిపోతానా?!" స్థిరంగా అన్నాడు పాండే.
"జాకబ్! నీకు తెలుసుకదా! బాస్ ముందుగా నీతో మాట్లాడమని ఎక్కడ ఎలా కలవాలో కనుక్కొని రమ్మన్నారట." మోనిషా అంది.
"మన వాళ్ళంతా వచ్చేసారు. అంతా విశాఖలో ఓ మారు మూల లాడ్జీలో దిగారు. మీరిచ్చిన పథకం ప్రకారం ఈ మధ్యాహ్ననికే ఇక్కడకు చేరుకుంటామని అన్నారు. ఇంకేమైనా, మార్పులు చేర్పులు ఉంటే కనుక్కోమన్నారు." చెప్పాడు జాకబ్.
"పదండి! ఆ చెట్టు క్రిందకు వెళ్ళి కూర్చుందాం!" అన్నాడు పాండే. ముగ్గురూ స్మశానంలో ఉన్న రావిచెట్టు క్రింద కూర్చున్నారు.
"వైజాగ్ లో మెటాడోర్ వ్యాన్ మాట్లాడుకు ని రండి. విశాఖ నుంచి ప్రధాన రహదారి గుండా వస్తే నాలుగు పోలీస్ స్టేషన్లు తగుల్తాయ్. అలా కాకుండా వేరే ఇంకో మార్గం ఉంది. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని అట్నుంచి శొంఠ్యం, సత్తరవు మీదుగా అడవి మార్గంలో వచ్చి 'బైరవవాక' దగ్గర ఆగండి. ఆ సమయానికి నేను అక్కడే ఉంటాను. మీరు వచ్చినట్టూ నాకు సంకేతం అందాలంటే వ్యాన్ హారన్ మూడుసార్లు కొట్టండి." చెప్పాడు గైడ్ పాండే.
"సెల్ ఉందిగా. దానికి రింగ్ ఇస్తాం" చెప్పాడు జాకబ్.
“వద్దు! సెల్ ఫోన్ మోగిస్తే ఏదైనా ప్రమాదం జరగొచ్చు. మన ఆచూకి పక్కవాళ్లు పసిగట్టే అవకాశం ఉంది.” చెప్పాడు పాండే.
"వ్యాన్ డ్రైవర్ మన ప్లాన్ పసిగడితే... ?" జాకబ్ సంశయంగా అన్నాడు.
"మీరు చందన పురికి దరిదాపుల్లోనే ఉన్న భైరవవాక చేరేవరకూ యాత్రీకుల్లాగే డ్రైవర్ ని నమ్మించండి. ఈ అడ్డదార్లో ఎందుకంటే 'భైరవవాక’ మొక్కుందని చెప్పి నమ్మించండి. తర్వాత అక్కడకు చేరాక మిగతా ప్లాన్ చెప్తాను.” అని చెప్పి తాను తయారు చేసిన రూట్ మేప్, టెంపుల్ మేప్, భాండాగారం వద్ద సెక్యూరిటీ తదితర విషయాలన్నీ కూలంకషంగా రాసిన కాగితాలు జాకబ్ చేతికిచ్చాడు పాండే.
"బాస్ కి ఇంకా ఏఁవైనా సమాచారం చెప్పమంటారా?” అన్నాడు జాకబ్.
ఈ ప్లాన్ ఇవ్వు. మిగతా విషయాలు సమక్షంలో మాట్లాడతానని చెప్పు." చెప్పాడు పాండే.
"ఓకే !" తలవూపాడు జాకబ్.
"మీరు ఇప్పుడే వెళ్ళి బస్సు స్టాండ్ చేరుకోండి. ఫస్ట్ బస్సు నాలుగ్గంటలకే బయల్దేరుతుంది." చెప్పింది మోనిషా.
"అలాగే ! వస్తాను” అంటూనే వడి వడిగా అత్యంత వేగంగా నడుస్తూ వచ్చిన దారినే వెళ్ళిపోయాడు జాకబ్.
జాకబ్ కనుచూపు దూరం వెళ్ళాక ఇద్దరూ నడుస్తూ చెరువు గట్టుమీదకు చేరుకున్నారు.
📖
ఎప్పుడూ నలగని మోడరన్ డ్రస్సుల్లో విందు వినోదాలతో విలాసాల్లో మునిగి తేలిన మోనిషా ఈ ఆర్నెళ్ళు ఇలా పిచ్చి దానిలా ఎలా గడపగలిగింది?!
బ్యాంక్ దోపిడీల్లోను, పెద్ద పెద్ద లూటీల్లోను చురుగ్గా పాల్గొనే మోనిషా ఎవర్నీ లెక్క చేయదు. ముఠా కట్టుబాట్లుకు తలొగ్గి బాస్ చెప్పినట్టు ఇక్కడ ఇలా నటించడా నికి అంగీకరించింది. అప్పటికే తను గర్భవతి నన్న విషయం దాచిపెట్టి ఇక్కడ ఇలా అజ్ఞాతవాసం చెయ్యడానికి అంగీకరించిందంటే ఆమె అంకితభావం పట్ల తనకి ఆశ్చర్యం కలిగింది.
ఇదీ ఒకందుకు తన అదృష్టమనే చెప్పాలి.
బాస్ చేతుల్లో ఇన్నాళ్ళు కాలం గడిపిన మోనిషా ఈ అజ్ఞాతవాసం పుణ్యమా అని ఆమె అవసరానికి తానే ఆమెకి మగదిక్కు అయ్యాడు. రాత్రిళ్ళు వ్యాపారమంతనాలు పగలు ఒకరికొకరు పరిచయం లేని వాళ్ల లాగే ఉండేవారు. ఆర్నెళ్ళల్లో మోనీషా తనకి బాగా దగ్గరయింది. తనూ ఆమె ఏ సంకోచం లేకుండా కలసి మెలసి మెలుగుతున్నారు.
📖
అప్పటికి సరిగ్గా అర్థరాత్రి రెండు గంటలు కావస్తోంది. దానికి సూచనగా కచేరిలో గంటలు కూడా ఠంగు ఠంగున ... వరుసగా రెండు గంటలు విన్పించాయి.
జనాల అలికిడి ప్రారంభమయింది...
🔱
*సశేషం*
꧁

Comments
Post a Comment