*భారతీయ విజ్ఞాన పరిశోధన గాధలు*(
గజతమే అంటే ఏమిటి ?
.....................................
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా కాల్సి గ్రామంలో మౌర్య చక్రవర్తి అశోకుడి శాసనాలున్నాయి.ఇవి 250 BCE కాలంనాటివి.ఉత్తర భారతదేశంలో అశోకుని శాసనాలున్న ఏకైక ప్రదేశం కాల్సి మాత్రమే.సుమారు 10 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవున్న ఒకపండు ఆకారంలోని క్వార్ట్జ్ రాతిపై మొత్తం 14 రాతిశాసనాలు చెక్కబడివున్నాయి. శాసనాల ఉత్తరభాగంలో ఏనుగుచిత్రం దాని కింద బ్రాహ్మీలిపిలో గజతమే అని వ్రాసిఉంది. గజతమే అంటే ఉత్తమమైన ఏనుగని అర్థం.అశోకుడి కాలంనాటికి ఈ ఉత్తమమైన ఏనుగు బౌద్ధమతంలో దివ్యమైనదిగా భావించవచ్చును.ఈ శాసనాలు పాలిభాషలో బ్రాహ్మీలిపిలో వున్నాయి.
వీటిని ఆలెగ్జాండర్ కనింగ్హామ్ 1850 ప్రాంతంలో కనుగొన్నాడు.
వీటిలో 13వ ఎడిక్ట్ (13వ శాసనం) అత్యంత ముఖ్యమైనది. అశోకుడు కలింగయుద్ధం వలన జరిగిన విధ్వంసానికి మారణకాండకు పశ్చాత్తాపాన్ని ఈ శాసనంలో వ్యక్తం చేశాడు.ఆ యుద్ధానంతరమే ధర్మం అహింస నైతికత వైపు తాను పయనించిన విషయాన్ని ఇందులో చెప్పాడు.
అలాగే అశోక చక్రవర్తి శాసనాల ప్రకారం ఆయనకు సమకాలికులుగా ఉన్న ఐదుగురు గ్రీకురాజుల పేర్లను ఈ రాతిశాసనంలో పెర్కొనాడు.వారు
(1) అంటియోకస్ II థియోస్ (Antiochus II Theos) నేటి సిరియా ప్రాంతంలోని సెలేయుసిడ్ సామ్రాజ్యం.
(2) టాలెమీ II ఫిలడెల్ఫస్ (Ptolemy II Philadelphus) ఈజిప్టు.
(3) అంటిగోనస్ II గోనాటస్ (Antigonus II Gonatas) మాసిడోనియా.
(4)మాగస్ (Magas): సైరీన్ (ప్రస్తుత లిబియా ప్రాంతం).
(5)అలెగ్జాండర్ (Alexander): ఎపిరస్ (Epirus)
ఇది ప్రస్తుతం వాయువ్య గ్రీస్ మరియు దక్షిణ అల్బేనియా దేశాల మధ్య విస్తరించి ఉంది.
కనుక ఈ శాసనాల ఆధారంగా అశోకుని కాలాన్ని BCE 260 నుంచి 230 మధ్యగా నిర్ణయించారు.
ఈ శాసనాలు అశోకుడు తన ధర్మసందేశాన్ని మధ్యధరా ప్రాంతం (గ్రీకు) వరకు పంపాడని పంపిన దూతలతో పాటు వైద్యసహాయం ఔషధమొక్కలు పంపినట్లు ఈ శాసనం తెలియచేస్తోంది.
గజతమే ఏనుగును బౌద్ధ చిహ్నంగా భావిస్తారు.
కొందరు పండితులు ఈ శాసనాల్లోని నైతిక నియమాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ లోని ఐ ఖానూమ్ నగరంలో వున్న గ్రీకు రాజు డెల్ఫిక్ మాక్సిమ్ వేయించిన శాసనంతో పోలికలు ఉన్నాయని అంటే అశోకుడిపై గ్రీకు శాసనాల ప్రభావం ఉండవచ్చని అంటారు.
యమునా టాన్స్ నదుల సంగమం వద్ద ఉన్న ఈ ప్రదేశం ప్రస్తుతం Archaeological Survey of India వారి ఆధీనంలో ఉంది. ఈ శాసనాలు అశోకుడు యుద్ధంనుండి ధర్మం అహింస మానవతావాదం వైపు మారినందుకు చరిత్రలో ఒక గుర్తుగా మిగిలిపోయాయి.
అశోకుని 13వ ప్రధాన శిలాశాసనం ద్వారా దౌత్య మతప్రచార ప్రయత్నాలను అంతర్జాతీయంగా తీసుకువెళ్ళాడని తెలుస్తోంది.
పైన పేర్కొన్న నాటి సమకాలీన గ్రీకు పాలకులను గురించి చెప్పడం వలన హెలెనిస్టిక్ (గ్రీకు ) ప్రపంచం గురించి అశోకుడికి ప్రత్యక్ష దౌత్యపరమైన సంబంధముందని తెలుస్తుంది.ఈ శాసనం ప్రకారం అశోకుడు తన ధమ్మతత్వాన్ని ప్రచారం చేయడానికి ఈ రాజ్యాలకు దూతలను పంపాడు.ఆ ధమ్మకార్యంలో మనుషులకు జంతువులకు వైద్య సహాయం వంటి చర్యలు కూడా ఉన్నాయి. ఈ రాజుల పాలనలో వున్న 600 యోజనాల దూరం వరకు ఈ విధానాలు అమలు చేయబడ్డాయని అతడు ఈ శాసనాలలో పేర్కొన్నాడు.ఎంతో శక్తివంతమైన ఈ పాలకులను ప్రస్తావించడం ద్వారా అశోకుడు సైనికవిజయం కంటే ధమ్మవిజయం నైతికత ద్వారా సాధించే విజయం గొప్పదని చూపించాడు.తన నైతికపాలన దృష్టికి అంతర్జాతీయ విశ్వసనీయతను కల్పించాలని అశోకుడు భావించాడు.
॥సేకరణ॥
.............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments
Post a Comment