28*05


 






మద్యం తాగితే 80 కొరడా దెబ్బలు పడతాయి, సరేనా.

...................................

మొఘల్ సామ్రాజ్యంలో న్యాయపాలన నేరాలు మరియు శిక్షల విధానం ఇస్లామిక్ షరియత్ చట్టాలు టర్కో-మంగోల్ రాజసాంప్రదాయాలు భారతీయ స్థానిక ఆచారాలు మరియు చక్రవర్తుల వ్యక్తిగత ఆలోచనా ధోరణుల మిశ్రమంగా అభివృద్ధి చెందింది. బాబర్ నుండి ఔరంగజేబు వరకు మొఘల్ చక్రవర్తులే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారులుగా వ్యవహరించారు. చక్రవర్తి తీర్పే తుదితీర్పుగా పరిగణించబడేది. కేంద్రంలో చక్రవర్తి, రాష్ట్రాలలో సుబేదార్లు జిల్లాలలో ఫౌజ్దార్లు పట్టణాల్లో కోత్వాళ్లు న్యాయపాలనను పర్యవేక్షించేవారు. మతపరమైన మరియు పౌర న్యాయ వ్యవహారాలకు ఖాజీలు నియమించబడేవారు. ఖాజీకి చట్టపరమైన సలహాలు ఇవ్వడానికి ముఫ్తీలు సాక్ష్యాలను నమోదు చేయడానికి మున్షీలు తీర్పులను అమలు చేయడానికి దర్బార్ అధికారులు ఉండేవారు.

మొఘల్ న్యాయవ్యవస్థలో న్యాయస్థానాల సోపానక్రమం స్పష్టంగా ఉండేది. రాజదర్బారులో చక్రవర్తి స్వయంగా అప్పీలు విచారించేవాడు. ప్రావిన్షియల్ స్థాయిలో మీర్ అద్ల్ మరియు ఖాజీ-ఇ-సుబా వ్యవహారాలు చూసేవారు. జిల్లా స్థాయిలో ఖాజీ-ఇ-సర్కార్ గ్రామ స్థాయిలో పంచాయతీలు మరియు స్థానిక పెద్దలు వివాదాలను పరిష్కరించేవారు.

హిందువుల వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన వారసత్వం వివాహం ఆస్తి వంటి అంశాల్లో ధర్మశాస్త్ర పండితుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునేవారు.

వారానికి నిర్దిష్ట రోజుల్లో చక్రవర్తి స్వయంగా ప్రజల ఫిర్యాదులను ఆలకించేవాడు. జహంగీర్ మంగళవారాలను ప్రత్యేక న్యాయదినంగా పాటించేవాడు. ఔరంగజేబు కూడా బుధవారాల్లో ప్రత్యేక దర్బార్లు నిర్వహించి అప్పీలు స్వీకరించేవాడని పర్షియన్ వృత్తాంతాలు తెలియజేస్తాయి. జహంగీర్ తన న్యాయపాలనకు చిహ్నంగా ఆగ్రా కోటలోని షా బుర్జ్ నుండి యమునా నది ఒడ్డున ఉన్న రాతి స్తంభం వరకు బంగారు గొలుసును కట్టించాడు. దీనినే జంజీర్-ఇ-అద్ల్ లేదా న్యాయ గొలుసు అని పిలిచేవారు. బాధితుడు గొలుసును లాగితే గంటలు మోగి విషయం నేరుగా చక్రవర్తి దృష్టికి చేరేది. ఇది రాజు ప్రజలకు అందుబాటులో ఉన్నాడనే సంకేతంగా భావించబడింది.

మొఘల్ చట్టాల ప్రకారం నేరాలను ప్రధానంగా మూడు విభాగాలుగా పరిగణించేవారు. హద్ కిసాస్ తాజీర్ ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ఖచ్చితమైన శిక్షలు నిర్దేశించిన నేరాలను హద్ నేరాలు అనేవారు. వ్యభిచారం దొంగతనం మద్యం సేవించడం వంటి నేరాలు ఇందులోకి వచ్చేవి. కిసాస్ అంటే ప్రాణానికి ప్రాణమనే ప్రతీకార న్యాయం. హత్య జరిగినప్పుడు బాధిత కుటుంబానికి ప్రతీకార హక్కు ఉండేది. వారు కోరితే నేరస్థుడికి మరణశిక్ష విధించేవారు. లేకుంటే దియ్యత్ అనే రక్తపాత పరిహారం తీసుకొని క్షమించవచ్చు. తాజీర్ నేరాలకు ఖాజీ లేదా చక్రవర్తి విచక్షణ ప్రకారం శిక్షలు విధించబడేవి. కొరడా దెబ్బలు, జరిమానాలు జైలుశిక్షలు బహిరంగ అవమాన శిక్షలు వీటిలో భాగం.

దొంగతనాల విషయంలో మొఘల్ చట్టాలు సిద్ధాంతపరంగా అత్యంత కఠినంగా ఉండేవి. మొదటిసారి దొంగతనానికి కుడిచేయి, రెండోసారి ఎడమకాలు నరికే శిక్షలను షరియత్ చట్టం ప్రస్తావించినప్పటికీ, ఆ శిక్షలు అమలు కావడానికి కఠినమైన సాక్ష్యాధారాలు అవసరం. దొంగిలించిన వస్తువు విలువ, సాక్షుల విశ్వసనీయత, నేరస్థుడి పరిస్థితి వంటి అంశాలను కూడా పరిశీలించేవారు. సమాజంలో భయాన్ని కలిగించడానికి కొన్నిసార్లు దోపిడీదారులను బహిరంగంగా ఉరితీయడం జరిగేది. అబుల్ ఫజల్ రచించిన అక్బర్‌నామాలో రహదారులపై దోపిడీ చేసే చోరులను ప్రజలకు హెచ్చరికగా చెట్లకు వేలాడదీసినట్లు ప్రస్తావన ఉంది.

రాజద్రోహం, తిరుగుబాటు, గూఢచర్యం వంటి నేరాలకు అత్యంత కఠిన శిక్షలు అమలయ్యేవి. ఏనుగుల కాళ్ల కింద నేరస్థులను తొక్కించి చంపడం మొఘల్ కాలంలో ప్రసిద్ధమైన శిక్షా విధానం. దీనిని విదేశీ యాత్రికులు భయానకంగా వర్ణించారు. కొన్నిసార్లు నేరస్థులను బహిరంగ ప్రదర్శనగా రాజదర్బార్ ముందు లేదా బజార్లలో శిక్షించేవారు. దేశద్రోహులకు శూలారోహణం, శిరశ్ఛేదం ఉరితీయడం వంటి శిక్షలు కూడా ఉండేవి. యుద్ధ సమయంలో తిరుగుబాటు చేసిన సామంతులకు ఆస్తుల స్వాధీనం, కుటుంబ నిర్బంధం వంటి శిక్షలు అమలయ్యేవి.

పట్టణ భద్రతను నిర్వహించడంలో కోత్వాల్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. కోత్వాల్ కేవలం పోలీసు అధికారి మాత్రమే కాదు మార్కెట్ ధరలు తూనికలు బరువులు రాత్రి గస్తీ, అగ్నిప్రమాద నియంత్రణ అనుమానితుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు కూడా అతనివే. ప్రధాన పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండేది. అనుమతి లేకుండా రాత్రివేళ సంచరించినవారిని అరెస్టు చేసి కొరడా దెబ్బలు లేదా జరిమానాలు విధించేవారు. కొత్తగా పట్టణంలోకి వచ్చినవారి వివరాలను నమోదు చేసేవారు. సరాయిలు బజార్లు వసతిగృహాలపై ప్రత్యేక నిఘా ఉండేది.

సాక్ష్యాలకు మొఘల్ న్యాయవ్యవస్థలో అత్యంత ప్రాధాన్యం ఉండేది. నేరాన్ని నిరూపించడానికి ఇఖ్రార్ అనే స్వచ్ఛంద నేరాంగీకారం లేదా ఇద్దరు విశ్వసనీయ ముస్లిం సాక్షులు అవసరమని ఇస్లామిక్ న్యాయవ్యవస్థ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో హిందువుల సాక్ష్యం ముస్లింలపై చెల్లదనే పక్షపాత ధోరణి కూడా అమలులో ఉండేది. 

ఔరంగజేబు కాలానికి వచ్చేసరికి ఇస్లామిక్ షరియత్ అమలు మరింత కఠినతరమైంది. అతడు ఫతావా-ఇ-ఆలంగిరీ అనే విస్తృత న్యాయసంకలనాన్ని రూపొందించాడు. ఇందులో షరియత్ చట్టాల ప్రకారం వివిధ నేరాలకు శిక్షలను సవివరంగా పేర్కొన్నారు. మద్యం సేవనానికి 80 కొరడా దెబ్బలు, వ్యభిచారానికి కఠిన శిక్షలు దొంగతనాలకు అంగచ్ఛేద శిక్షలు ప్రస్తావించబడ్డాయి. పెళ్లైన వ్యక్తులు వ్యభిచారం చేస్తే రజ్మ్ అనే రాళ్లతో కొట్టి చంపే శిక్ష సిద్ధాంతపరంగా ఉన్నప్పటికీ నలుగురు ప్రత్యక్ష సాక్షులు అవసరమనే కఠిన నిబంధన వల్ల అది అరుదుగా అమలయ్యేది. కొన్నిసార్లు ముస్లింలకు హిందువులకు వేర్వేరు శిక్షా ప్రమాణాలు ఉండేవని పర్షియన్ ఆధారాలు సూచిస్తున్నాయి.

విదేశీ యాత్రికులు మొఘల్ న్యాయవ్యవస్థ గురించి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రాన్సువా బెర్నియర్, ఇటాలియన్ యాత్రికుడు నికోలో మనూచి ఇంగ్లీష్ వ్యాపారి పీటర్ మండీ తదితరులు ఢిల్లీ ఆగ్రా నగరాల్లో బహిరంగ శిక్షలను చూసినట్లు రాశారు. నేరస్తులను ప్రజల ముందు కొరడాలతో కొట్టడం ఉరితీయడం, మార్కెట్ ప్రాంతాల్లో శవాలను వేలాడదీయడం ద్వారా ప్రజల్లో భయాన్ని కలిగించేవారని వారు పేర్కొన్నారు. అయితే ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ శిక్షలు ప్రతిరోజూ సామాన్యంగా అమలయ్యేవి కావు. తీవ్రమైన నేరాలకు మాత్రమే కఠిన శిక్షలు అమలు అయ్యేవి.ఎక్కువ సందర్భాల్లో జరిమానాలు రాజీ పరిహారాలు ఖైదు వంటి శిక్షలతోనే వ్యవహారాలు ముగిసేవి.

మొఘల్ చక్రవర్తులకు క్షమాభిక్ష అధికారమూ ఉండేది. దీనిని తఫ్వీజ్ లేదా అఫ్వ్ అని పిలిచేవారు. రంజాన్, ఈద్ వంటి పండుగల సందర్భాల్లో ఖైదీలకు క్షమాభిక్షలు ప్రకటించేవారు. కొన్నిసార్లు మరణశిక్షలను జీవితఖైదుగా మార్చేవారు. రాజకీయ కారణాలతో శత్రువులను క్షమించి తిరిగి పదవుల్లోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్బర్, జహంగీర్ వంటి చక్రవర్తులు వ్యక్తిగతంగా ఉదార ధోరణి చూపగా, ఔరంగజేబు కాలంలో మతపరమైన కట్టుదిట్టత పెరిగింది.

మొత్తానికి మొఘల్ న్యాయవ్యవస్థ ఒకే విధమైన కఠిన వ్యవస్థ కాదు; అది కాలానుగుణంగా, చక్రవర్తుల వ్యక్తిత్వానుసారం మారుతూ వచ్చింది. సిద్ధాంతపరంగా షరియత్ చట్టాలు ప్రధాన ఆధారమైనప్పటికీ, వాస్తవ పాలనలో రాజకీయ అవసరాలు, స్థానిక సంప్రదాయాలు, సామాజిక వాస్తవాలు కూడా ప్రభావం చూపించాయి. అందువల్ల మొఘల్ న్యాయపాలనలో ఒకవైపు కఠిన శిక్షలు కనిపిస్తే, మరోవైపు రాజక్షమాభిక్ష, రాజీ, పరస్పర ఒప్పందాలకు కూడా స్థానం కనిపిస్తుంది.

//సేకరణ//

రెండు చాలు కదా ! చేతులు పదెందుకు ?

..............................................


సదాశివ అనే పేరుకు ఎల్లప్పుడూ మంగళకరమైనవాడు లేదా శాశ్వతమైన శుభాన్ని ఇచ్చేవాడని అర్థం. ఈ పేరు సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే శుభము.ఈ రెండు సంస్కృత పదాల కలయికతోనే సదాశివ రూపం ఏర్పడింది.


లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలోని కళ్యాణ మంటప స్తంభంపై చెక్కబడిన సదాశివుడి శిల్పం పరమశివుని అత్యున్నత విశ్వరూపమైన శివ మూర్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది. శైవాగమాలలో పురాణాలలో వర్ణించిన విధంగా ఈ సదాశివ రూపం ఐదు ముఖాలు మరియు పది చేతులతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా సదాశివ రూపాలు ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నట్లు కనిపిస్తాయి.కానీ ఇక్కడ స్వామివారు రాజసంతో నిటారుగా స్థానక (నిలబడిన) భంగిమలో దర్శనమివ్వడం ఈ శిల్పంయొక్క ప్రత్యేకత. విజయనగర శిల్పకళావైభవానికి నిదర్శనమైన ఈ శిల్పంలో ఐదు తలలు ఒక దాని ప్రక్కన  మరొకటి క్రమపద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. ప్రతి తలపైనా ముత్యాలు రత్నాలతో అలంకరించబడిన కిరీటముకుటాలు ఉన్నాయి. ఈ మొత్తం శిల్పాన్ని చుట్టూ మకర తోరణంతో కూడిన ఒక అందమైన తోరణంలా చెక్కారు.దాని పైభాగంలో కీర్తిముఖం రక్షణ చిహ్నంగా కనిపిస్తుంది.


ఈ శిల్పంలోని ఐదు ముఖాలు (1) సద్యోజాత (2) వామదేవ (3) అఘోర (4) తత్పురుష (5) ఈశాన అనే ఐదు బ్రహ్మ తత్వాలను సూచిస్తాయి.ఇవి పశ్చిమ ఉత్తర దక్షిణ తూర్పు మరియు ఊర్ధ్వ దిక్కులను శాసిస్తాయి.అలాగే వరుసగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలకు ఈ శిరస్సులు నిలయం. ఈ రూపం (1) సృష్టి  (2) స్థితి (3) లయ (4) తిరోభావ (5)  అనుగ్రహ అనే ఐదు పరమ పవిత్రమైన విశ్వకార్యాలను అదుపులో వుంచుతుంది. స్వామివారి పది చేతులు పది దిక్కులకు వ్యాపించి శివుడి విశ్వవ్యాప్త శక్తిని చాటిచెబుతాయి. కాలక్రమేణా కొంత భాగం అరిగిపోయినప్పటికీశాస్త్రాల ప్రకారం కుడి చేతులలో త్రిశూలం పరశువు వజ్రాయుధం వంటి రక్షణ మరియు సంహార ఆయుధాలతో పాటు అభయముద్ర ఉంటాయి.ఎడమ చేతులలో నాగపాశం డమరుకం నీలోత్పల పుష్పంతో పాటు వరాలను ఇచ్చే వరద ముద్ర ఉంటాయి.


శివపురాణాల ప్రకారం సదాశివ రూపం అంటే కేవలం త్రిమూర్తులలో ఒకరైన లయకారుడు మాత్రమే కాదు. ఆయన సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ స్వరూపం. ఆయన నుండే బ్రహ్మ విష్ణు రుద్రులు ఉద్భవించి తమ తమ విధులను నిర్వహిస్తారని శైవసిద్ధాంతం చెబుతుంది.ఈ శిల్పం ఉన్న కళ్యాణ మంటపం శివపార్వతుల వివాహ వేడుక కోసం నిర్మించ తలపెట్టిన ప్రాంతం కావడంతో ఇక్కడి సదాశివుడు తన అత్యంత సౌమ్యమైన మంగళకరమైన రూపంతో ఆ దివ్య వివాహాన్ని వీక్షించడానికి వచ్చే మునులు దేవతలు మరియు భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు ఈ పురాణ నేపథ్యం మనకు స్ఫురిస్తుంది.


IIసేకరణII

..................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

గుడిలో పూజారి ఎలా వుండాలి !

.....................................

వైఖానస ఆగమం అనేది  వైష్ణవాలయాలకు సంబంధించిన ప్రధాన ఆగమాల్లో ఒకటి. వైఖానస ఋషి ప్రోక్తమైన ఈ శాస్త్రం విష్ణుఆరాధనకు దేవాలయ నిర్వహణకు సవివరంగా నియమాలు చెబుతుంది. 

ఇది భక్తి శుద్ధి  కర్మల సమన్వయంతో నడిచే మార్గం. 

దేవాలయంలో నిత్యం జరిగే పూజాక్రమాలను

వైఖానసాగమం ఐదు రకాలుగా విభజించబడతాయి. వీటిని పంచకాలాలు అంటారు. అవి అభిగమనం, ఉపాదానం, యోగం, స్వాధ్యాయం, ఈజ్య. 

(1) అభిగమనం అంటే ఉదయం సూర్యోదయానికి ముందే ఆలయ ద్వారాలు తెరవడం, స్వామికి మేలుకొలుపు పాడటం గర్భాలయాన్ని శుభ్రం చేయడం స్వామికి స్నానాధికాలు నిర్వహించడం వస్త్రాభరణాలు సమర్పించడం. 

(2) ఉపాదానం అంటే నివేదనకు కావాల్సిన వస్తువులు పుష్పాలు తీర్థం అన్నం మొదలైనవి సేకరించడం. 

(3) యోగం అంటే పూజారి ధ్యానంలో కూర్చుని స్వామిని తన హృదయంలో ఆవాహన చేసి ఆ తర్వాత విగ్రహంలో ఆవాహన చేయడం. (4) స్వాధ్యాయం అంటే వేద మంత్రాలు దివ్య ప్రబంధ పాశురాలు పఠించడం. 

(5) ఈజ్య అంటే నిజమైన అర్చన చేయడం నైవేద్యం నివేదించడం  హారతి ఇవ్వడం మంగళాశాసనం పలకడం.

వైఖానసంలో అర్చనను (1) అంగారాధన (2) అంగభూషణం (3) నివేదన (4) నీరాజనం అనే నాలుగు భాగాలుగా చేస్తారు. ముందుగా పూజారి సంకల్పం చెప్పి పుణ్యాహవాచనం కలశార్చన చేస్తాడు. తర్వాత మూలమంత్రాలైన గాయత్రీమంత్రం విష్ణు సహస్రనామం పురుషసూక్తం మొదలైన వేద మంత్రాలతో స్వామిని స్నానపానాలు  వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తాడు. 

ప్రతి ఉపచారానికి ప్రత్యేక మంత్రం ఉంటుంది. అర్చన సమయంలో తులసీదళం తప్పనిసరి. ఎందుకంటే విష్ణువుకు తులసి అత్యంత ప్రీతి. నైవేద్యం వడ్డించిన తర్వాత హారతి ఇస్తారు. భక్తులకు తీర్థం శఠారి (శఠగోపం)  ప్రసాదం ఇస్తారు.

వైఖానసంలో అర్చన విగ్రహాన్ని స్పృశించకుండా దూరం నుంచే మంత్రపూర్వకంగా క్రతువు  జరుగుతుంది. అర్చకుడు స్వయంగా పవిత్రంగా ఉండాలి కౌపీనం ఉత్తరీయం శిఖ  యజ్ఞోపవీతాలు ధరించి వైఖానస సూత్రాన్ని పాటించాలి.

ఆలయంలోని ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా స్నపనం తిరుమంజనం వాహనసేవలు జరుగుతాయి. పూజలు సాత్వికంగా అలంకార ప్రియంగా వేదఘోషతో జరుగుతాయి.

వైఖానస ఆగమం ప్రకారం పూజ కేవలం కర్మకాండ కాదు అది స్వామితో జీవుడి సంబంధాన్ని నిలిపే యోగం. ప్రతి మంత్రం ప్రతి ఉపచారం ప్రతి నైవేద్యం భక్తుడి మనసును శుద్ధి చేసి స్వామి సన్నిధిలో లయం చేయడానికే. అందుకే ఈ ఆగమంలో ఆలయాన్ని భూలోక వైకుంఠంగా భావించి అర్చనను నిత్య యజ్ఞంగా నిర్వహిస్తారు.


॥సేకరణ॥

..............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026