16*5

 




నేనే ప్రేయసి మనసులో - నేస్తమై ప్రాణమైనాలే 
నేనే ప్రేమ పిలుపులలో - నేఁధర్మ దాహమైనాలే
నేనే ప్రేక్షక కళలలో  - నే సత్య మోహమైనాలే 
నేనే ప్రేమేము వయసులో - నేటి దేశ మైనాలే       
*
దేవీ ప్రేమము మనసులో - దీపమై ప్రజ్వలించెన్గా 
భావావేశము కవితగా - భాసురమ్మై వెలింగెన్గా 
జీవానందము నిజముగా+ - చేతనమ్మై చలించెన్గా 
నీవే నాకని తలువఁగా - నెమ్మి కన్నుల్ చెమర్చెన్గా 
*
దారిద్ర్యమ్మున ధనముకై - తాను వెళ్లెన్ విదేశమ్ముల్ 
దూరమ్మందున నుడుపమా - త్రోవలోఁ గాంచినావేమో 
దారిం జెప్పుము వలపుతో+ - చిక్కి ఖేదాత్మగా నుంటిన్ 
ఘోరమ్మీ విరహకథయున్ - గొంతులో వెల్గగా నయ్యెన్ 
*
కోపమ్మొందుచు వరుసముం - గొండపై నుండఁగాఁ జెప్పన్   
శాపగ్రస్తుఁడు విరహియై - శాలినిం బాసి యక్షుండే  
కూపమ్మందు జనకజ తా+ - కూర్మితోఁ జేసెనో స్నానం 
బా పేర్వుం గృహముగఁ గొనెన్ - యక్షుఁ డావేళ రామాద్రిన్ 
*
విరహి - మ/న/స/ర/ర/గగ  UUU IIIIIU - UIU UIU UU

*****





(01)ఊపితే ఊగితే నిద్రపోతాం కదా ! ఎందుకు ?

................................................


ఊయల ఊగినప్పుడు లేదా బస్సు, కారు, రైలు వంటి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మనకు తరచుగా నిద్ర రావడానికి వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణాలున్నాయి. ఇందులో మొదటిది రాకింగ్ ఎఫెక్ట్ అని పిలిచే లయబద్ధమైన కదలిక. మన మెదడు పునరావృతమయ్యే ఇటువంటి లయబద్ధమైన కదలికలకు సహజంగానే అలవాటుపడి ఉంటుంది. 

దీనికి ముఖ్య కారణం మనం పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలలూ ఆమె నడక వల్ల కలిగే ఊగుడనే కదలికలను అనుభవించడమే. ఊయలలోని ఊగుడు లేదా వాహనాల చిన్నచిన్న కుదుపులు సరిగ్గా ఆ గర్భస్థ అనుభూతిని గుర్తుకు తెస్తాయి. 


2011లో 'కరెంట్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఇటువంటి కదలికలు మెదడులోని థాలమస్ కార్టెక్స్ మధ్య సమన్వయాన్ని పెంచి, మనల్ని నేరుగా 'N2' అనబడే రెండో దశ నిద్రలోకి తీసుకెళ్తాయి. దీనివల్ల సాధారణంగా నిద్ర పట్టడానికి పట్టే సమయం దాదాపు యాభై శాతం వరకు తగ్గిపోతుంది.

రెండవ ముఖ్య కారణం మన చెవి లోపలి భాగంలో ఉండే వెస్టిబ్యులర్ వ్యవస్థకు, మెదడుకు మధ్య జరిగే సంకేతాల మార్పిడి. శరీర సమతుల్యతను కాపాడే ఈ వ్యవస్థకు వాహనం సాఫీగా కదులుతున్నప్పుడు నిరంతరం ఒకే రకమైన, ఊహించదగిన సంకేతాలు అందుతాయి. దాంతో చుట్టుపక్కల ఎలాంటి ప్రమాదం లేదు, మనం పూర్తిగా సురక్షితంగా ఉన్నామని మెదడు గ్రహిస్తుంది. ఫలితంగా శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయి, మనల్ని విశ్రాంతి స్థితిలోకి నెడుతుంది. దీనివల్ల గుండె వేగం, శ్వాస నెమ్మదించి కండరాలు పూర్తిగా సడలుతాయి.


మూడవ కారణం మనం చూసే దృశ్యాలలో మార్పు లేకపోవడం మరియు వైట్ నాయిస్ ప్రభావం. ప్రయాణంలో ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చున్నవారికి కిటికీ బయటి దృశ్యాలు ఒకేలా పునరావృతమవుతాయి, అలాగే ఊయలలో ఊగేటప్పుడు కూడా కొత్తదనం ఏమీ ఉండదు. ఇలా చూసిన దృశ్యాలనే మరల మరల చూడటం వల్ల మెదడుకు కొత్తగా ప్రాసెస్ చేయడానికి సమాచారం అందదు. దీనిని సెన్సరీ ఇన్పుట్ తగ్గుదల అంటారు. దీనికి తోడు ఇంజిన్ హమ్, టైర్ల రాపిడి శబ్దం, గాలి ధ్వని అన్నీ కలిసి 'వైట్ నాయిస్'గా మారి చుట్టుపక్కల శబ్దాలను కప్పేస్తాయి. దీనివల్ల మనల్ని మెలకువగా ఉంచే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (RAS) పనిలేక నిష్క్రియం అయిపోయి నిద్రకు దారితీస్తుంది.


దీనికి తోడుగా చిన్నప్పటి నుండి ప్రయాణాలలో నిద్రపోవడం అలవాటు కావడంవల్ల, మెదడు ప్రయాణాన్ని విశ్రాంతితో ముడిపెడుతుంది. అలాగే వాహనం కదులుతున్నప్పుడు మనశరీరం చాలా చిన్న చిన్న కండరాలను ఉపయోగించి బ్యాలెన్స్‌ను కాపాడుకోవడం వల్ల మనకు తెలియకుండానే ఒక రకమైన అలసట వస్తుంది, దీనినే సోపైట్ సిండ్రోమ్ అంటారు. అయితే ఈ ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. వాహనాన్ని నడిపే డ్రైవర్ మెదడు నిరంతరం నిర్ణయాలు తీసుకుంటూ చురుగ్గా ఉంటుంది కాబట్టి అతనికి నిద్ర రాదు, కేవలం నిష్క్రియంగా ఉండే ప్రయాణీకులకే నిద్ర వస్తుంది. అలాగే మోషన్ సిక్నెస్ అంటే ప్రయాణాలలో వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఊగుడు నిద్రను కాకుండా వికారాన్ని కలిగిస్తుంది. మొత్తానికి, ఊయల ఊగుడు లేదా వాహనాల కదలికలు మెదడుకు తల్లి గర్భంలోని భద్రతా భావాన్ని గుర్తుచేసి, 'ఇప్పుడు నిద్రించవచ్చు' అనే సూచనను ఇవ్వడం వల్లే మనకు నిద్ర వస్తుంది.

IIసేకరణయి

****

02) హళేబీడులో నాట్య సరస్వతి, శిలలో పలికిన అద్భుత విన్యాసం.

....................................

హొయసల శిల్పకళా వైభవానికి తలమానికంగా నిలిచే హళేబీడు హొయసలేశ్వర దేవాలయంలో కొలువైన నాట్య సరస్వతి శిల్పం భారతీయ శిల్ప చరిత్రలోనే అపూర్వమైన కళాఖండం. సాధారణంగా వీణాపాణిగా శాంతమూర్తిగా పద్మాసనంలో కనిపించే సరస్వతీ దేవిని ఇక్కడ నాట్య భంగిమలో చిత్రించడం హొయసల శిల్పుల అసాధారణ సృజనకు ఊహాశక్తికి నిదర్శనం.

హొయసల రాజధాని ద్వారసముద్రం మరోపేరు హళేబీడు. హళేబీడులోని ఈ దేవాలయం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. దేవాలయం బయటి గోడలపై చెక్కిన వేలాది శిల్పాల్లో నాట్య సరస్వతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణంగా సరస్వతిని విద్యకు, జ్ఞానానికి ప్రతీకగా చూస్తాం. కానీ హళేబీడులో ఆమె నాట్యం చేస్తూ కనిపిస్తుంది. ఆమె శరీరంలోని త్రిభంగ వంపు, అంటే మెడ నడుము మోకాలు వద్ద మూడు చోట్ల వంగిన తీరు కాలి మడమల లయబద్ధమైన కదలిక చూస్తే శిల ఈ క్షణంలోనే నాట్యం చేస్తుందేమో అనిపిస్తుంది. ఇది కేవలం శరీర సౌందర్యం కాదు. సంగీతం నృత్యం విజ్ఞానం విడదీయలేనివని చెప్పే తాత్విక సంకేతం. జ్ఞానం నిశ్చలంగా ఉండేది కాదు. అది నాట్యంలా చైతన్యంతో ప్రవహించేది అని హొయసల శిల్పులు కఠిన శిల .లో నిరూపించారు.

ఈ నాట్య సరస్వతి చతుర్భుజి. నాలుగు చేతుల్లో నాలుగు పవిత్ర చిహ్నాలు ఉన్నాయి. ఒక చేతిలో తాళపత్ర గ్రంథం ఉంది. తాళపత్రం వేదాలకు సకల శాస్త్రాలకు మూలం. రెండో చేతిలో అక్షమాల అంటే జపమాల ఉంది. జపమాల నిరంతర సాధనకు, ధ్యానానికి మనో ఏకాగ్రతకు గుర్తు. మూడో చేతిలో కలశం ఉంది. కలశంలోని పవిత్ర జలం సృజనాత్మకతకు నిత్య నూతనత్వానికి పవిత్రతకు గుర్తు. నాలుగో చేతిలో వీణ ఉంది. వీణ నాదబ్రహ్మలకు లలితకళలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలా జ్ఞానం ధ్యానం సృజన కళ అనే నాలుగు అంశాల సమతుల్య రూపమే ఈ నాట్య సరస్వతి.

హొయసల శిల్పులు ఈ అద్భుతాన్ని సృష్టించడానికి క్లోరిటిక్ షిస్ట్ అనే బలపపు రాయిని ఎంచుకున్నారు. తవ్వినప్పుడు మెత్తగా ఉండే ఈ శిల శిల్పికి కావలసినంత సూక్ష్మతను అందచేస్తుంది. అందుకే సరస్వతిదేవి ధరించిన కిరీటంలోని నగిషీలు, మెడలో మూడు వరుసల హారాలు, చెవులకు కర్ణ కుండలాలు, చేతులకు కంకణాలు, నడుముకు వడ్డాణం, కాళ్లకు గజ్జెల అందెలు అన్నీ ఒక్కొక్కటి విడిగా, కదిలేలా చెక్కారు. ఆమె కట్టుకున్న చీర మడతలు, పైట కొంగు గాలికి రెపరెపలాడుతున్నట్లు, వేళ్ల గోళ్లు, అరికాలి గీతలు కూడా సూది మొనతో చెక్కినంత సహజంగా ఉన్నాయి. ఇది శిల్పకళా పరాకాష్ట అనడంలో సందేహం లేదు.

ఈ శిల్పానికి గొప్ప సాంస్కృతిక నేపథ్యం కూడా ఉంది. హొయసల రాజు విష్ణువర్ధనుని రాణి శాంతలాదేవి తన కాలంలో గొప్ప నర్తకి, సంగీత విద్వాంసురాలు, మేధావి. రాజాస్థానంలో ఆమె నృత్య ప్రదర్శనలు చేసేదని శాసనాలు చెబుతున్నాయి. అలాంటి విద్యావంతురాలైన మహారాణి ప్రోత్సాహం, స్ఫూర్తితోనే శిల్పులు సరస్వతిని నాట్య రూపంలో మలిచి ఉంటారని చరిత్రకారులు భావిస్తారు. అంటే ఈ శిల్పం కేవలం దేవతా మూర్తి కాదు, ఆనాటి స్త్రీ శక్తికి, విద్యకు, కళకు సమాజం ఇచ్చిన గౌరవానికి ప్రతిరూపం.

క్రీ.శ. 1121లో నిర్మాణమైన ఈ దేవాలయం 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలకు గురై పాక్షికంగా ధ్వంసమైంది. అయినా నాట్య సరస్వతి శిల్పం  చెక్కుచెదరకుండా నేటికీ తన కళా సౌరభాన్ని వెదజల్లుతూనే ఉంది. వానకు, ఎండకు, కాలానికి తట్టుకుని 900 ఏళ్లుగా నాట్యం చేస్తోంది. బేలూరు, హళేబీడు వెళ్లే ప్రతి కళాభిమానికి, చరిత్ర ప్రేమికుడికి ఈ నాట్య సరస్వతి ఒక దృశ్య కావ్యం. రాయిని కవిత్వంగా మలచడం అంటే ఏమిటో ఈ శిల్పం చూస్తే అర్థమవుతుంది.

॥సేకరణ॥

.............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026