09-05-2026
శ్లోకం
జయ జయ శంకర ప్రణామమ్ ।
హర హర శంకర ప్రణామమ్ ॥
అపారకరుణాభవసింధుం
జ్ఞానదం శాంతరూపిణమ్ ।
పార్వతీపతిం జాహ్నవీపతిం
భక్తవత్సలం ఫాలలోచనమ్ ।
చంద్రశేఖరం దుఃఖమోచనం
పాదపంకజం నమః శివాయ ॥
శ్రీచంద్రశేఖరగురుం
ప్రణమామి విశ్వముదాన్వహమ్ ॥
సరళ భావం :జయజయధ్వనులతో శంకరునికి ప్రణామం చేస్తున్నాను.అపార కరుణాసముద్రమైన, జ్ఞానాన్ని ప్రసాదించే శాంతస్వరూపుడైన శివుడికి నమస్కారం.పార్వతీదేవి భర్త, గంగాధరుడు, భక్తులకు వత్సలుడు, ఫాలనేత్రధారి, చంద్రశేఖరుడు — దుఃఖాలను తొలగించేవాడు.ఆయన పాదపద్మాలకు “నమః శివాయ” అంటూ నమస్కరిస్తున్నాను. ప్రపంచానికి ఆనందాన్ని పంచే శ్రీ చంద్రశేఖర గురువును నేను భక్తితో ప్రణమిస్తున్నాను.
****
మదర్స్ డే గేయం — మే 9
అమ్మంటే ఆప్యాయత
అమ్మంటే ఆనందం
అమ్మలేని జీవితం
ఆగినట్లే లోకం ॥
నిత్యసుఖం కలిగించే
పొద్దులాంటి తల్లిని
మరవద్దు మరచిపోవద్దు
మనసున విడువవద్దు ॥
ఆకలి తీర్చే అన్నమై
ఆత్మ తృప్తి నిచ్చేది
అందరిని కాచుకుంటూ
అన్నీ తానే చూసేది ॥
జన్మ జన్మల రక్తధార
జీవరూపం పోసేది
కర్తగా క్రియగా నిత్యం
కర్మలను నెరవేర్చేది ॥
మరో జన్మ ఎత్తినట్లు
బిడ్డకు జన్మనిచ్చేది
మాతృత్వ మహిమానందం
మనకందించే దేవతే ॥
మరణాన్నీ లెక్కచేయక
మాతృత్వం కోరేది
బిడ్డ నవ్వు కోసమే
బాధలన్నీ భరించేది ॥
కోట్లు ఇచ్చినా రానిది
కొనలేనిది అమ్మ ప్రేమ
అమ్మతోనే అనురాగం
అమ్మతోనే జీవధనం ॥
ఏమిచ్చినా చాలదమ్మా
తీర్చలేము నీ రుణం
ఆయువు ఉన్నంతవరకు
ఆరాటమే బిడ్డలకై ॥
అమ్మలేని ఇంటిలోన
అయోమయమే మిగులున్
అమ్మ ఉంటే ఆ ఇంటికి
అందమంతా వెలుగున్ ॥
సేవకురాలై నిలిచేది
ఉపాధ్యాయురాలవుతుంది
స్నేహితురాలై తోడుంటూ
ఓర్పు ఒద్దిక నేర్పుతుంది ॥
అమ్మ సేవల ప్రేమలకు
అర్పిద్దాం మన సేవలు
మాతృదేవోభవ అంటూ
మన్నిద్దాం నమస్కారాలు ॥
*****
🎵 శృంగార కీర్తన
తాళ గతి :
తంద తాన తంద తాన తంద తాన తనతాన
పల్లవి
చందమామ నింగిలోన సందరాన వెలుగులేవే
జంకు లేని కొంకు లేని జాబిలమ్మ చెలి నీవే ॥
చరణం – 1
అందమంత కలలతోనే ఆశలన్నీ విరిసేనూ
పొందుకొన గ వచ్చితిని పోరు యేల ప్రియా నీవూ ॥
మందమారుతంబు వీచె మందహాసము విరియగా
మంతనాల మాధుర్యమున మనసు నిండె మరువగా ॥
చరణం – 2
శాంతమై నిలువ వేమో సద్దు జేయ గలవేమో
పంతమేల ప్రియసఖీ నీ పాదముల చేరవేమో ॥
అందు లేదె యిందు లేదె అంతు నీకు కనరాదే
అందరాని పండు వంటి అందమంత నీదే గాదే ॥
చరణం – 3
ఎందు నన్ను తలచినావో ఎంత సౌఖ్య మిచ్చినావో
అందుకున్న ప్రేమతోనే ఆశలన్నీ పూయినావో ॥
కుందమాల వాసనల్లే కొండపైన వెన్నెలల్లే
కొంచెమైన దయ చూపి కోరికంత తీర్చవల్లే ॥
ముగింపు
అందమైన ఆటబొమ్మ ఆయువంత నీకే నన్ను
బండవైన హృదయమును కరిగించావు చూపు చాలు ॥
****
గరుడునికి రెండు తలలా ? ఎందుకు ?
.........................................
విష్ణుభగవానుడు లక్ష్మీదేవితో సహ తన వాహనమైన గరుడునితో కలిసి దర్శనమిచ్చే ఈ అద్భుత శిల్పం భారతీయ శిల్పకళలో ఒక విశిష్టస్థానం పొందింది. ఇందులో గరుడుడు దేవతలిద్దరిని తన భుజాలపై మోస్తూ, స్వర్గలోకానికి ఎగురుతున్నట్లుగా శిల్పి అద్భుతంగా ఆవిష్కరించాడు.
శిల్పం శిఖర భాగంలో విష్ణువు గంభీరంగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన తలపై ఉన్న కీర్తిమకుటం ఆ దేవదేవుని మహిమను సూచిస్తుంది. చేతులలో చక్ర శంఖాలను ధరించి వున్నాడు. శంఖచక్రాలు ధర్మరక్షణకు నిదర్శనం. విష్ణుదేవుని వామాంకంపై లక్ష్మీదేవి ఆసీనురాలై వుంది.లక్ష్మీదేవి సంపదకు శుభప్రదానికి మూర్తీభవించిన రూపం.
వీరిని మోస్తున్న గరుడుడు పూర్తిగా మానవరూపంలో ఉండి శక్తికి వేగానికి ప్రతీకగా వున్నాడు. ఈ శిల్పంలో గరుడుడు రెండు శిరస్సులతో కనిపించడం ఒక ప్రత్యేక లక్షణం. ఇలా ద్విమస్తకత్వంతో కనిపించడం దక్షిణ భారత శిల్పకళలోని ఒక శైలి మాత్రమే. ఇది శిల్పుల ఊహాశక్తికి ఉదాహరణ మాత్రమే.ఇలా శిల్పులు గరుడుని ముఖలక్షణాలను అతిశయోక్తిగా చెక్కడం ద్వారా ఆయనకున్న బహుముఖ శక్తికి నిదర్శనం. ఇంకా విష్ణువుకు విశ్వసనీయ వాహనమనే భావాన్ని శిల్పులు వ్యక్తపరిచారు.
గరుడుడు వేదాల స్వరూపుడని, ఋగ్ యజుర్ సామవేదాలే అతని రెండు రెక్కలు అని పురాణాలు చెబుతాయి. కొన్ని శిల్పాల్లో ఈ వేదశక్తినే రెండు తలలుగా చూపించే సంప్రదాయం కూడా ఉంది.
శిల్పంలో అందమైన ఆకృతులు, సున్నితమైన అలంకార శైలులు అద్భుతశైలి కలవు.
ఇవన్నీ విజయనగర సామ్రాజ్యం లేదా విజయనగరానంతర కాలానికి చెందిన నాయకరాజుల కాలానికి చెందిన శిల్పాలని భావన. 16-17 శతాబ్దాల నాటి ఈ శిల్పాల్లో కర్ణకుండలాలు భుజకీర్తులు ఉదరబంధం వంటి ఆభరణాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల దేవాలయాల్లో ఇలాంటి శిల్పకళా సంప్రదాయం కనిపిస్తుంది. కంచిలోని వరదరాజ పెరుమాళ్లు గుడిలోని ఈ శిల్పం పవిత్రత, రాజసాన్ని కలిగి ఉంది. హంపిలోని విఠలాలయం, లేపాక్షి వీరభద్రాలయం గోడలపై కూడా ఇలాంటి ద్విముఖ గరుడ రూపాలు కనిపిస్తాయి.
ఈ గరుడుని రూపానికి విజయనగర సామ్రాజ్యపు ప్రసిద్ధ రాజలాంఛనం అయిన గండభేరుండ ప్రభావం ఉండవచ్చని భావించవచ్చు. రెండు తలల పక్షి చిహ్నం అజేయశక్తికి సామ్రాజ్య వైభవానికి ప్రతీక. ఈ చిహ్నం మతపరమైన శిల్పంలో ప్రతిబింబించడం ద్వారా ఆ కాలపు సంస్కృతిలో దైవత్వానికి అధికారానికి ఉన్న అనుసంధానమని స్పష్టమవుతుంది. మొత్తంగా ఈ శిల్పం విష్ణుభక్తి సంప్రదాయం దక్షిణ భారత శిల్పకళా నైపుణ్యం విజయనగర రాజవంశ వైభవం కలిసిన అపూర్వ సమ్మేళనంగా నిలుస్తున్నది.
కర్ణాటక రాష్ట్రప్రభుత్వ అధికార చిహ్నంలో రెండు తలల గండభేరుండం ఉంది. ఈ గండభేరుండం విష్ణువు నరసింహావతారంతోముడిపడి ఉంది. శరభుడిని అణచడానికి విష్ణువు గండభేరుండ రూపం దాల్చాడని పురాణ కథనం.
॥సేకరణ॥
........... జిబి.విశ్వనాథ 9441245857 అనంతపురం.
****
*పరుగో పరుగు -4*
📷🏃🏽
రచన : మల్లిక్
సరిగ్గా అదే సమయంలో స్టూడియోలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇద్దరూ తలలు తిప్పి అతని వంక చూశారు.
అతను అయిదడుగుల పదంగుళాల పొడవు న్నాడు. నల్లని శరీర ఛాయ, పొట్టిగా కత్తిరించిన జుట్టూ గుబురు కనుబొమ్మలు. కళ్ళలో ఎర్రని జీర. కళ్ళకింద పూరీ వొత్తడానికి ముందు పిండి ముద్దలా ముక్కు. దానికింద లావు పెదాలు. మనిషి పెద్దపొట్టతో లావుగా బలంగా ఉన్నాడు.
అతని ఆకారం చూడగానే రాంబాబుకి కంగారు పుట్టింది. అతను చొక్కా చేతులు పైకి మడుస్తూ రెండడుగులు ముందుకు వేశాడు.
రాంబాబు, కిష్టయ్య కంగారుగా కుర్చీల్లోంచి లేచి రెండడుగులు వెనక్కి వేసి ఇప్పుడెలా అన్నట్టు ఇద్దరూ ముఖముఖాలు చూస్కున్నారు.
కొంపతీసి ఇందాక గుంపుతో రావల్సిన మనిషి ఇప్పుడు ఆలశ్యంగా వచ్చాడా?.... వీడేమి పగలగొడ్తాడో...
“ఇక్కడ ఫోటోలు తీస్తారాండీ....” ఎవరిదో అమ్మాయిది, తీయని కంఠస్వరం వినిపించింది.
రాంబాబు, కిష్టయ్య ఆతృతిగా గుమ్మం వైపు చూశారు. అక్కడెవరూ అమ్మాయి కనిపించలేదు.
“కాస్త నువ్వు ముందుకి వెళ్ళి బయటికి తొంగిచూడు అన్నాడు రాంబాబు.
కిష్టయ్య గుమ్మం దగ్గరకు వెళ్ళి తల బయటికి పెట్టి అటూ ఇటూ చూసి “ఇక్కడెవరూ లేరండీ....” అన్నాడు.
“ఇక్కడ ఫోటోలు తీస్తారాండీ!...."
మళ్ళీ అదే గొంతు!!.... ఇందాకటి కన్నా తీయగా....
రాంబాబు అనుమానంగా తన ఎదురుగా ఉన్న అతని వంకచూశాడు.
“ఇప్పుడు మాట్లాడింది మీరా?....” అన్నాడు అనుమానంగా.
అతను ఫక్కున నవ్వాడు.
“అయితే మీరు కూడా పప్పులో కాలేశారన్నమాట!!....”
రాంబాబు కిందికి వంగి కాళ్ళు చూస్కున్నాడు.
"నా ఫ్రండ్సందరూ అంటుంటారు.... నీ పర్సనాల్టీకి తగ్గగొంతు కాదురా నీది అని..." అన్నాడతను తీయని గొంతుకో.
అతని నవ్వు ముఖం చూసిన రాంబాబుకి కిష్టయ్యకి కాస్త ధయిర్యం వచ్చింది.
“ఇంతకీ మీకేం కావాలి?" అన్నాడు రాంబాబు.
"ఇక్కడ ఫొటోలు తీసారా?" అన్నాడతను అమ్మాయి గొంతుకో.
"భలేవారే.... ఫోటో స్టూడియోకి వచ్చి ఫొటోలు తీస్తారా అని అడుగుతారేం సార్.... రండి సార్.... రండి....కూర్చోండి..." అంటూ మర్యాదలు చేశాడు కిష్టయ్య.
“రేట్లు చెప్పండి....” అన్నాడతను.
టేబులు మీది గ్లాస్ కింద ఉన్న రకరకాల సైజుల ఫొటోలని చూపిస్తూ పాస్ పోర్టు సైజు ఫొటో అయితే ఎంతో.... కార్డు సైజు ఫొటో అయితే ఎంతో..... కాబినేట్ సైజు ఫోటో అయితే ఎంతో.... ఎక్సట్రా కాపీలయితే ఎంతో రేట్లు వివరించాడు రాంబాబు.
అతను ముఖం చిట్లించి “ఈ చుట్టుపక్కల మంచి ఫోటో స్టూడియో ఉందా?" అన్నాడు.
రాంబాబు తెల్లబోయాడు.
"అదేంటండి అలా అంటారు?.... ఈ స్టూడియోకి ఏమైందని!”
"ఈ అద్దం కింద ఉన్న ఫొటోలన్ని మీరు తీసినవేనా చాలా ఛండాలంగా ఉన్నాయ్...."
రాంబాబు కిష్టయ్య ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్కున్నారు.
కిష్టయ్య రాంబాబు చెవిలో ఏదో చెప్పాడు. రాంబాబు చిరునవ్వు నవ్వాడు. కళ్ళు పైకిపెట్టి ఒక్క క్షణం ఆలోచించి తను వంగి కిష్టయ్య చెవిలో ఏదో చెప్పాడు.
కిష్టయ్య కిల కిల నవ్వాడు. ఇద్దరూ షేక్ హాండ్ ఇచ్చుకుని ఒకరినొకరు చూస్కుని కళ్ళు కొట్టుకున్నారు.
అతను ఈ తతంగం అంతా గమనించి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు.
"ఏమిటీ....ఏమిటిదంతా ?!!"
రాంబాబు కొంటెగా నవ్వుతూ అన్నాడు. "ఏమిటీ.... ఈ అద్ద కింద ఉన్న ఫోటోలు చాలా చండాలంగా ఉన్నాయా?”
"నేనే కాదు.... ఈ ఫోటొలు చూసిన ఎవరైనా అదేమాట అంటారు..."
రాంబాబు, కిష్టయ్య ఇద్దరూ మళ్ళీ ఒకరినొకరు చూసుకుని కళ్ళు కొట్టుకున్నారు. ఇద్దరూ ఒకేసారి అతని వంక చూసి మొల్లున నవ్వారు.
"ఫోటోలు చండాలంగా ఉండక మరెలా ఉంటాయ్.... అవి మేం తీసినవి అయితేగా.... వేరే ఫొటో స్టూడియో వాళ్ళు తీసినవి ఇక్కడ పెట్టాం....” అన్నాడు రాంబాబు.
“వేరే ఫొటో స్టూడియో వాళ్ళు తీసినవి ఇక్కడెందుకు పెట్టారు?” అతను ఆశ్చర్యంగా చూశాడు.
"మరి మా ఫొటో స్టూడియో కొత్తగా పెట్టాం కదండీ.... మా దగ్గర రకరకాల సైజుల ఫోటోలు లేవు కదండీ.... మరి మా దగ్గరకొచ్చే మీలాంటి కస్టమర్లకి ఫొటోలు చూపించాలి కదండీ.... అందుకే వేరే స్టూడియోల నుండి కొన్ని ఫొటోలు తెచ్చి ఇక్కడ పెట్టాం.... కదండీ గురూ గారూ....” అన్నాడు కిష్టయ్య రాంబాబు వంక చూసి కన్నుకొడుతూ.
“అంతేకదా మరి....” అన్నాడు రాంబాబు తిరిగి కిష్టయ్యకి కన్నుకొడుతూ.
“మీరు నిజంగానే చెపుతున్నారు కదా!!....” అన్నాడతను సందేహంగా.
“నిజంగానే సార్....” అన్నాడు కిష్టయ్య.
"మీరు కొత్తగా స్టూడియో పెట్టాంమటున్నారు.... బాగానే తీస్తారు కదూ....అసలే నేను ఈ ఫోటోలు ఒక ప్రొడ్యూసర్గారికి మరో డైరెక్టర్ గారికి పంపించాలని అనుకుంటున్నాను....”
"ఏమిటీ....సినిమా హీరో అయిపోదామనే.... అయితే.... ఇంకేం.... మా స్టూడియోలో ఫొటోలు తీయించుకుని వాటిని ఏ డైరెక్టరుకి చూపించినా మీకు హీరో ఛాన్సు ఖాయం.... చూశారుగా వేరే స్టూడియోల్లో తీయించుకున్న ఫొటోలు ఎలా ఉన్నాయో" అన్నాడు అద్దంకింద వున్న ఫొటోలు చూపిస్తూ కిష్టయ్య.
“రండి సార్.... ఇంకా ఏం ఆలోచిస్తారు!!" అంటూ అతని జబ్బు పట్టుకుని లోపలికి లాక్కెళ్ళి పోయాడు రాంబాబు.
“నేను ఈ ఫొటోలు సినిమా చాన్సు కోసం తీయించుకుంటున్నానండీ.... బాగా తియ్యాలి
...." అన్నాడతను.
"మీరే చూస్తారుగా...." అన్నాతు రాంబాబు.
"మరి మీరు సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా.... మీ గొంతు అలా ఉంటే ఎవరయినా తీసుకుంటారాండీ...." అని అమాయకంగా అడి గాడు కిష్టయ్య.
"గొంతుదేం ఉంది.... నాకు డబ్బింగ్ వాయిన్ పెడతారుగా...." అన్నాడతను ఆ మాత్రం తెలీదా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ.
“మరి పొట్ట ఎలాగండి.... చాలా పెద్దగా వుందికదా?"
"లోపల్నిండి ఓ వెడల్పాటి బెల్టుతో పొట్టమీంచి గట్టిగా బిగించి పైన చొక్కా వేసుకుంటారు... అంతేకదండి...." అన్నాడు రాంబాబు అతనితో.
అతను బిక్కమొహం వేస్కుని ఆవునన్నట్టు తలఊపాడు.
"క్రాపు చూడు ఎలా ఉందో...."
"దాందేముందీ....మాంచి విగ్గు పెట్టేస్తారు.... అంతే కాద్సార్....."
అతను ఇంకా బిక్కచచ్చిపోయి తల ఊపాడు.
“మరి ముక్కేమో పిండిముద్దలాగా ఉంది.... దాన్నేం చేస్తారు గురూగారూ..."
“ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది
....నేను కరెక్ట్ గా చెప్పాను కదండీ...." అన్నాడు రాంబాబు ఆతనితో.
అతను ఉక్రోషంగా లేచి నిలబడ్డాడు.
“ఇలాగయితే నేను మీ ఫొటో స్టూడియోలో ఫొటో తీయించుకోను"
రాంబాబు కస్సుబుస్సు మన్నాడు.
“ఒరేయ్ కిష్టిగా.... నువ్వు నీ సందేహాలన్నీ ఓ పక్కన పెట్టి లైటింగ్ ఎరేంజిమెంట్సు చెయ్యి.... మీరు వాడిమాటల్నేమీ పట్టించుకోకండి సార్.... చెప్పండి ఏ ఏ యాంగిల్స్ తియ్యమంటారు....”
“ఒకటేమో సైడు పోజండి. ఇంకోటేమో ఎదురుగా నండీ బస్ట్ సైజు ఒకటి.. ఇంకోటేమో పుల్ అండీ....నిలబడి.”
"సరే....అలా కూర్చోండి....లైట్స్ వెయ్యరా కిష్టగా ఏదీ.... కాస్త అటుపక్కకి చూడండి .... ఆ.... అలా.... అలాగే....ఊ.... ఇప్పుడు నవ్వండి...."
"హహ్హహా..."
"అబ్బే.... అలా శబ్దం వచ్చేలా అక్కర్లేదు .... కాస్త చిరునవ్వు నవ్వితే చాలు.... అబ్బే.... నవ్వడం లేదు మీరు... రెడీ... స్మైల్....”
కిష్టయ్య చిరాగ్గా చూశాడు....
"మీరు బిగుసుకుపోతున్నారు సార్.... అలా అయితే మేం చచ్చి నోడికి ఫొటో తీశాం అనుకుంటారు.... కాస్త ఫ్రీగా ఉండండి....”
"అలాగంటే నేను ఫోటో తీయించుకోనంతే" అన్నాడతను కోపంగా చూస్తూ.
“ప్లీజ్....మీరు మంచోరు కదండీ.... అలా అనకూడదు. ఒరేయ్ కిష్టిగా....నువ్వు కాస్సేపు నోరు మూసుకో...." అన్నాడు రాంబాబు.
కిష్టయ్య చెంపలు వేసుకున్నాడు. “సర్లేండి గురూగారూ.... నాకేం పట్టింది.... నోరు మూసుకుంటా....”
అతను శాంతించాడు. రాంబాబు అతను కోరిన విధంగా ఫొటోలు తీశాడు.
ఎడ్వాన్సు ఇస్తూ అతను స్టూడియో పరికిస్తూ “అద్దాలవీ ఇలా విరిగిపోయాయేంటండీ....” అని అడిగాడు.
“మా స్టూడియో పెట్టాక ఈ చుట్టుపక్కల ఉన్న వేరే స్టూడియోల డిమాండ్ పడిపోయిందండీ.... అందుకే ఓర్వలేక వాళ్ళు గూండాలని పెట్టించి ఇలా పగలగొట్టించారు” అని అతనికి చెప్తూ కిష్టయ్యని చూసి కన్ను కొట్టాడు రాంబాబు. కిష్టయ్య కూడా రాంబాబుకి కన్ను కొట్టాడు.
అతను ఇద్దరి వంకా అయోమయంగా చూసి బయటికి అడుగుపెట్టాడు. కిష్టయ్య పక్కుమని నవ్వాడు.
"ఎలాగయినా ఈ ఫోటోలు తీయించుకోడానికి వచ్చేవాళ్ళతో గొప్ప కాలక్షేపం అయిపోతుంది గురూగారూ.... అతను బిగుసుకుపోయి బిక్క మొహంవేస్కుని ఫోటోలు తీయించుకుంటుంటే భలే నవ్వొచ్చిందండీ...."
"నిజమే అనుకో....కానీ మన ఫీలింగ్స్ వాళ్ళకి కనిపిస్తే బిజినెస్ దెబ్బతింటుంది. మనకి నవ్వొచ్చినా ఆపుకోవాలి" అన్నాడు రాంబాబు.
అప్పుడు రాత్రి ఎనిమిదయింది.
🏃🏼
*సశేషం*
꧁☆•┉
*భైరవవాక - 4*
🔱
రచన: ఇందూ రమణ
బహుశా అదే ఆ సూట్ కేస్ వాళ్ళ ప్రాణం అని అనుకున్నాడు గైడ్.
పాత్రో తండ్రికి మాత్రం గైడ్ తమతో అనుసరించడం సుతరామూ ఇష్టంలేదు.
ముక్కు, మొహం తెలియని వ్యక్తి తమకి సహాయకారిగా తమతోనే రోజంతా ఉంటాడా? ప్రతి పూటా తామేం తింటే అది తిని తమకి చూపించాల్సిన ప్రదేశాలు చూపించి ఆఖరున రైలు ఎక్కించినంత వరకూ తమతోనే గడిపి 'కూలీ'గా మీకు తోచినంత ఇమ్మంటాడేఁవిటీ?!
ఇంత కావాలని ఖచ్చితంగా చెప్తే బావుంటుంది కదా? ఆ తర్వాత ఎక్కువ వసూలు చేస్తాడేమో! అతను అడిగినంత ఇవ్వకపోతే అల్లరి చేస్తాడేమో!?!
పాత్రో తండ్రి ఆలోచనలు పరిపరి విధాలా సాగుతున్నాయి.
మనిషి చూస్తే కుర్రాడిలా ఉన్నాడు. వూరు కాని వూరు దేశం కాని దేశం, భాష రాని క్షేత్రం. వయస్సులో ఉన్న అమ్మాయిలు ఇద్దరున్నారు. ఈ కుర్ర వెధవ ఏ అర్ధరాత్రో ఆపరాత్రో వీళ్లను అల్లరిపెడితే?! వాళ్లతోనే వచ్చాడు వాళ్లవాడేకదా, వాళ్లేదో గొడవ పడుతున్నారులే, అని ఎవరూ తమని పట్టించుకోరు. పోనీ కేకలేసి ఎవరికన్నా తమ గొడవ... గోడు వినిపించుకుందా మనుకున్నా తమ భాష ఇక్కడ ఎవరికి అర్ధమవుతుంది?.
అయినా, ఎందుకొచ్చిన తంటా. ఏరి... కోరి కొరివితో తల గోక్కుంటామా?
పాత్రో తల్లి భయంతో గుండె చేత పట్టుకుంది. 'వద్దని వారిస్తే వింటాడా కొడుకు' మనుసులోనే అనుకుంది.
పాత్రో మాత్రం గైడ్ పాండేతో మాట్లాడుతూ ముందుకి నడుచుకుంటూ వెళుతున్నాడు. చేసేదిలేక వాళ్ళిద్దర్నీ అనుసరిస్తున్నారు మిగిలినవాళ్లు.
పాత్రో భార్యకు మాత్రం గైడ్ పాండే వాలకం చూస్తుంటే ఎందుకో కీడు శంకిస్తోంది మనసు. అతను... అతని వాలకం, అతని మాటల గారడీ నడక జోరు ... అతని కళ్ళ ఎర్రదనం అతను చూసే వెకిలి చూపులు
ఆమెకి ముచ్చెమటలు పోస్తున్నాయి.
అసలే భర్త అమాయకుడు. ఎవరు ఏదడిగినా లేదనకుండా దానం చేసే అపర దాన కర్ణుడు. ఏవి పాలో ...? ఏవి నీళ్ళో? అర్ధం చేసుకోలేడు.
చూసి... చూసి ఈ ఆగంతకుడి వల్లో పడ్డారీయన.
వాడి కోర మీసాలు... వాడి వోర చూపులు
... వాడి వడి వడి నడక ... నడత ఎంత భయంకరంగా ఉన్నాయి? ఎంత చురుగ్గా చూస్తున్నాడు? ఎంత చిరాగ్గా చూస్తున్నాడు?
వచ్చీ రావడంతోనే దర్జాగా సూట్ కేస్ అందుకున్నాడు. అయినా, ఎలా గ్రహించాడు? అందులోనే తాము తెచ్చుకున్న డబ్బంతా ఉంది. ఆ డబ్బుతో ఉడాయించాలనుకున్నాడేమో!? ఇంకా నయం. ఆయన ఏ కళనున్నారో? కొంచెం తెలివిగానే ప్రవర్తించారు. ఆమె పిల్లలిద్దర్నీ నడిపిస్తూ పరిపరివిధాలా ఆలోచిస్తోంది.
పనిపిల్ల కళ్లు మాత్రం సంతోషంతో మెరుస్తున్నాయి. మెరుస్తున్న కళ్లల్లో కుర్ర గైడ్ వెలుగుతున్నాడు. ఎర్రగా, బుర్రగా బొద్దు మీసాలతో ముద్దోస్తున్నాడనుకుంది.
ఎంత బావున్నాడు? ఎలా నవ్వుతున్నాడో! ఎంతచక్కగా మాట్లాడుతున్నాడు.
పనిపిల్ల నడుస్తూనే పాత్రోతో పాటే నడుస్తున్న పాండేనే పరిశీలిస్తోంది.
ఆ పనిపిల్ల పసిడి మనసులో తొలివలపు మొలకలెత్తుతోంది.
గైడ్ పాండే ఆలోచనలు మాత్రం వీళ్ళందరికీ అతీతంగా సాగుతున్నాయి
📖
పేరుకు కుగ్రామమైనా వచ్చేపోయే వాహనాలతో రద్దీగా ఉంది గోపాలపురం
రోడ్డు. అస్తవ్యస్తంగా... ఎవరికీ ఎవరూ తెలియని... గమ్యం లేని మర బొమ్మల్లా జనాలు పరుగులెడుతున్నారు.
కార్లూ... స్కూటర్లూ... బస్సులు... ఒకటేమిటి? వాహనాలన్నీ అటూ-ఇటూ క్రిందా మీదా కానకుండా రేసు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.
సమయం రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది.
బీట్ కానిస్టేబుల్ జనాల్ని కంట్రోల్ చేయలేక పోతున్నాడు. చిన్న కాలిబాట లాంటి ఆ తార్రోడ్డు మీద బళ్ళు రాకెట్లలా కళ్ళకు కనిపించనంత వేగంగా దూసుకు పోతున్నాయి.
ఆ రోజు శుక్రవారం.
ఆ వూరు యాత్రాస్థలానికి పక్కనే ఉన్న రైల్వేస్టేషన్ కావటం మూలాన ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అదే యాత్రల సీజన్ అయితే చెప్పనక్కరలేదు.
చందనస్వామి కళ్యాణం, చందన స్వామి నిజరూప దర్శనం, డోలా యాత్ర, గిరి ప్రదక్షిణ దగ్గర పడడంతో భక్తుల రద్దీ మిక్కుటమౌతోంది రోజు రోజుకి.
శనివారం స్వామి వారికి మేలిమి రోజు.
ఆ రోజు మిగతా ఆర్రోజుల కంటే రెట్టింపు భక్తుల రద్దీ ఉంటుంది. ఒరిస్సా, శ్రీకాకుళం ప్రాంతాల భక్తులేకాక దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రీకులు శుక్రవారం రాత్రే చందన పురికి వచ్చి చేరుకుంటారు.
అలా చేరిన వారే పాత్రో కుటుంబం.
బస్సుస్టాండులో నిలుచున్నారంతా. పని పిల్లని ఒరుసుకుంటూ నిలబడ్డాడు పాండే.
ఒరియా భాష తొణక్కుండా తోట్రు పడకుండా అనర్గళంగా మాట్లాడుతున్నా డు పాండే.
"ఈ ఊరి పేరు గోపాలపురం. ఇక్కడి నుంచి చందన పురి చేరుకోవటానికి చాలా బస్సులున్నాయి. బస్సుకి మనిషికి రెండు రూపాయలు పుచ్చుకుంటారు. నడిచి వెళ్తే అర్ధగంట పడుతుంది. శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నడిచే వెళ్ళి పోతారు.“ గైడ్ పాండే ఇంకా ఏదో చెప్పబోతున్న సమయంలో సిటీ బస్సు దూసుకు వచ్చి వారిముందు ఆగింది.
అంత వరకూ బస్సు కోసం మనిషో దగ్గర పడిగాపులు కాసిన జనం ఒక్కసారి చైతన్యం వచ్చిన వరదలా బస్సు మీద విరుచుకుపడ్డారు. పులివిస్తళ్ళ కోసం పోట్లాటకు దిగే బక్క చిక్కిన బీద జీవాల్లా బస్సు మీదకు ఎగబ్రాకారు.
గైడ్ ముందుగా జనాల్ని తోసుకుంటూ బస్సెక్కి పాత్రో వాళ్ల కోసం సీట్లుంచాడు.
బస్సు అర నిమిషంలో నిండిపోయింది. జనాలతో కిక్కిరిసిపోయింది. పాత్రో ముసలి తల్లిదండ్రులకు సీటు ఇచ్చి తను మర్యాదగా నిలబడ్డాడు పాండే.
అడుగు తీసి అడుగు వెయ్యడానికి కూడా ఖాళీ లేదు. ఒకరి మీద ఒకరు ఒరిగిపోతూ నిలబడ్డారు. పాత్రో భార్య ముందు నిలబడ్డ పనిపిల్ల నానా అవస్థలూ పడుతూ ఒంటికాలి మీద నాట్యం చేస్తున్నట్టు నిలబడింది.
పాత్రో భార్య వెనుకే పాండే నిలబడ్డాడు. అతను ఎంత జాగ్రత్తగా... నిఠారుగా నిలబడదామనుకున్నా నిలబడలేక ఆమె మీద ఒరిగిపోతున్నాడు.
అందరూ ఆడా మగా తేడా లేకుండా ఇంకా మీద మీదకు వచ్చేస్తున్నారు. అందరూ ఒరుసుకుంటూ, రాసుకుంటూ నిలబడుతున్నారు.
'వెధవ బస్సు ఇలా ఉంది! ఏం చేయడం?' మనసులోనే సణుక్కుంది. అష్టకష్టాలు పడి బస్సెక్కి నరకం లాంటి ఆ కూపంలో కూరుకుపోయి ఒంటి కాలిమీదే నిలదొక్కుకు నిలబడింది.
పాత్రో కోసం బస్సంతా పరికించి చూసాడు పాండే. అతని చూపుల్ని బట్టి భర్త బస్సు ఎక్కలేదని గ్రహించింది పాత్రో భార్య. ముసలి వాళ్ళు మాత్రం తమ మానాన తాము మాట్లాడుకుంటున్నారు.
భర్త బస్సులో ఎక్కడా కనిపించకపోయే సరికి ఆమెకి ముచ్చెమటలు పోసాయి. ఆమె గుండెల్లో ఏదో భయం... దిగులు తారట్లాడుతున్నాయి.
ఈ దుర్మార్గుడు చూస్తే ఇలా ఉన్నాడు? ఇదే అదునని మరీ మీద ... మీద కొస్తున్నాడీ వెధవ. ఏం చెయ్యడం?!
'సామాన్లేవీ!?" నెమ్మదిగా గొంతు పెగుల్చుకొని గైడ్ ని అడిగింది.
'నా దగ్గర ఈ బ్యాగ్ ... ఈ సూట్ కేస్ తప్పా వేరే ఏవీలేవు." అని తన చేతిలో సూట్ కేస్ చూపించాడు పాండే.
సూట్ కేస్ గైడ్ చేతిలో చూసేసరికి ఆమెకి నోటమాట రాలేదు. 'వీడి చేతికి ఇదెలా వచ్చింది. ఆయన కదా పట్టుకున్నారు?
"ఆయనేరి?!" తడబడుతూ అంది.
"ఉంటార్లెండి!" నిర్లక్ష్యంగా అన్నాడు పాండే.
గైడ్ నిర్లక్ష్యమైన సమాధానం గొంతులో కరకుదనం వినేసరికి ఆమెకి మరింత భయం పట్టుకుంది.
ఆమె భర్త కోసం పడుతున్న ఆందోళన చూసి పాండేకి నవ్వు పుట్టింది.
"శోశీ!"
ఉన్నట్టుండి ఎవరిదో పెద్ద గావుకేక. ఆ పిలుపు బస్సు ... బస్సంతా ప్రతి ధ్వనించింది. ఆ కేకకి బస్సులోని జనమంతా ఒక్కసారి షాకయ్యారు.
ముందుకు నెమ్మది... నెమ్మదిగా వేగం పుంజుకుంటున్న బస్సు కూడా ఆ కేకకి ఉలిక్కిపడ్డట్టూ ఒక్క జర్క్ తో టక్కున ఆగిపోయింది.
'ఎవరో పడిపోయారు!... ఎవరో బస్సులో నుండి పడిపోయారు....! ఎవరో?! ఎవరో పాపం బస్సు ఎక్కలేక... ఫుట్ బోర్డు మీద నిలబడలేక ... నిలబడ్డం అలవాటు లేక... చెయ్యి పట్టు తప్పి క్రింద పడిపోయారు.!'
బస్సులో ఉన్న జనమంతా ఒకటే గుసుగుసలు. బస్సంతా ఆ సమాచారం 'గుసగుసల' రూపంలో పొగలా ప్రాకిపోయింది.
'శోశీ' అన్న గావుకేక వినడంతోనే పాత్రో భార్య అదిరిపడింది. అది తన భర్త గొంతు. ఎప్పుడైతే తన భర్త 'శోశీ' అని గావుకేక వేసాడో ... అప్పుడే ఏదో జరగరాని ఘోరం జరిగిపోయిందనుకుంది పాత్రో భార్య.
ఆమెని భయం దెయ్యంలా పట్టి పీకుతోంది.
“ఆయనకి... ఆయనకి ఏఁవైంది?" ఆతృతగా ఆయోమయంగా... ఆవేదనగా పాండేతో అంది పాత్రో భార్య.
"ఏం పర్లేదు.” అని పక్కవాళ్ళ ద్వారా అసలు విషయం గ్రహించి ఒరియాలో ఆమెకి విపులంగా వివరించాడు.
"సరిగ్గా ఫుట్ బోర్డు మీద నిలబడలేక బస్సు కదిలేసరికి క్రిందపడిపోయాడట. ఏం దెబ్బలు తగల్లేదట. అదిగో! డ్రైవర్ గారి వైపు నుంచి ఎక్కిస్తున్నారు చూడండి" చెప్తూ చూపించాడు గైడ్.
ఎదరున్న లేడీస్ గేటులో నుంచి కండక్టరే దగ్గరుండి పాత్రోని బస్సు ఎక్కించాడు.
భార్యని చూసి ఆనందంగా చెయ్యూపాడు పాత్రో. ఆమె కూడా నవ్వుతూ చూసింది.
ఆమె మనసుని దొలుస్తున్న అనుమానం ఆపుకోలేక పెద్దగా అరుస్తూ భర్తని అడిగింది.
"ఏఁవైనా గాయాలయ్యాయా?!'' అని
"లేదు” ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు పాత్రో.
భార్య భర్తల ఒరియా అరుపుల సంభాషణ విన్న జనం వింతగా నవ్వుకున్నారు.
గైడ్ పాండే మీద పాత్రో భార్యకు ఇప్పుడు సదభిప్రాయం కుదిరింది. ఈయన లాంటి వ్యక్తి తమకు తోడుగా ఉండటం మంచిదే అనుకుంది మనసులోనే.
"మీకు పెళ్ళయిందా?!" పెదవులపై నవ్వు ప్రదర్శిస్తూ ఇంకా ఆయన్ని 'దొంగ' లా అనుమానించి దూరంగా ఉంచితే బాఁవుండదని అడిగింది పాత్రో భార్య శౌశి అనబడే శశికళ.
"లేదు" అన్నాడు పాండే.
📖
బస్సు నెమ్మదిగా నిండు చూలాల్లా వూగుతూ జోగుతూ ముందుకు సాగుతోంది.
ఒక చేత్తో పై కమ్మి పట్టుకొని... మరో చేత్తో క్రింద కూర్చునే సీటు కమ్మీ పట్టుకొని నిలబడింది శశికళ.
బస్సు కుదుపుకి తమ మాటల మైకంలో తేలుతున్న ముసలి దంపతులు ఇహానికొచ్చారు.
కోడలు నిలబడలేక పడుతున్న అవస్థలు చూసి లేచి నిలబడ్డాడు ముసలి మాఁవగారు. తను కూర్చున్న సీట్లో కోడల్ని కూర్చోమని చెప్పారు. అత్తగారు కూడా బలవంతం చేసేసరికి మాఁవగార్ని కష్టబెట్టటం ఇష్టం లేకపోయినా వారి మాట కాదనలేకపోయిందామె.
శశికళ అత్తగారి ప్రక్కనే కూర్చుంది. ఆమెనే మ్రింగేసాలా ఓరకంట చూస్తూ నిలబడ్డాడు పాండే.
ఏదో ఆలోచిస్తూ కూర్చున్న శశికళ ఉలిక్కిపడింది.
"పిల్లలు.. మా పిల్లలు ఏరి?" గాబరాగా పాండే మోహంలోకి చూస్తూ అంది శశికళ.
“లేరా?" నిర్లిప్తంగా అడిగాడు పాండే.
"లేరు?!" భయంగా అంది. దాదాపు ఏడుస్తున్నట్టే అంది ఆమె.
పిల్లలు కనిపించలేదన్న ఆందోళన భరించలేక ప్రక్కనున్న అత్తమామలకు చెప్పింది శశికళ.
"అదేఁవిటి? నువ్వేకదా! ముందు మీరెక్కండి. నేను పిల్లల్ని ఎలాగోలా ఎక్కిస్తానన్నావ్?!'' పాత్రో తండ్రి గైడ్ మీద కళ్ళెర్రజేసాడు.
శశికళ మాత్రం దుఖం ఆపుకోలేకపోతోంది.
“వాళ్ల నాన్నగారు ఎక్కిస్తారని నేను ముందుగా బస్సెక్కి మీకు సీట్లుంచాను కదా! నాకేం తెలుసు?" గైడ్ అన్నాడు.
"సామాన్లో?!" పాత్రో తల్లి అంది, కళ్ళు పెద్దవి చేసి.
"ఇవిగో! ఇవి మాత్రం మీ అబ్బాయి నాకిచ్చాడు. మిగతావి అక్కడే... ఆ బస్సు స్టాండ్ లోనే వదలి నేను బస్సెక్కాను. అప్పుడు ఆ సామాన్ల దగ్గర మీ అబ్బాయి... మీ మనుమలు ఉన్నారు." చెప్పాడు పాండే.
"అయితే - మా వాడి దగ్గర సామాన్లు, పిల్లలూ ఉన్నారంటావ్!” ధీర్ఘంగా అన్నాడు పాత్రో తండ్రి.
"బస్టాప్ లో నిలబడ్డప్పుడు చూసాను. బస్సు 'చందనపురి' చేరనివ్వండి. మీ అబ్బాయి గారిని కనుక్కుందాం?!" పాండే ధైర్యం చెప్తూ అన్నాడు.
అయిదు నిమిషాల్లోనే బస్సు చందనపురి చేరుకుంది.
🔱
*సశేషం*
꧁

Comments
Post a Comment